Thursday, July 9, 2015

మన తెలుగు గొప్పదనం:- సాహిత్య గల్పిక

టీవీల్లో.. సినిమాల్లో ఇవాళ వస్తున్నది అసలు తెలుగు భాషే కాదు అంటే.. ఎంత మంది ఒప్పుకుంటారో తెలీదు. ఇంగ్లీషు భాష గొప్పతనం ఇంగ్లీషు భాషది. దాన్ని అవసరానికి మించి గొప్పగా చూపించడానికి మన తల్లిభాషను తక్కువ చేయడం మర్యాదా?
'అబ్బా.. సోదితెలుగులో ఏముంది బాబూ!' అని బహిరంగంగానే తల్లిభాషను హేళనచేసే వాళ్ళకి..పోనీ  ఆంగ్లభాషలోనైనా అసలు ఏముందో తెలుసా? చిన్నతనంనుంచి అమ్మదగ్గర నేర్చుకున్న పలుకులోనే ఎంత మాధుర్యముందో గ్రహించలేని బుద్ధిమంతులకి ఆ పరాయిభాష సొగసులుమాత్రం ఏమంత అర్థవవుతాయిని? .
ఇంగ్లీషు ఇంకా గడ్డమీదకు రానికాలంలో మన తెలుగుకవులు (కొంత సంస్కృతభాష ప్రభావంతోనే అయినా) ఎంత చక్కని సాహిత్యాన్ని సృష్టించారో! 
చదివితేనే కదా అనుభవంలో కొచ్చేది?!
ఉదాహరణకి ఈ  పద్యం చూడండి.
శైలము లెక్కి, యష్ట మదసామజ మౌళుల మీదుగా మహా
కోల కులేంద్ర వాడి కొమ్ము మొనంబడి, సర్వదా విష
జ్వాలలు గ్రమ్ము శేషు తల చాయనె యోడకవచ్చి కూడె, నౌ!
భూ లలితాంగి కెంతవలపో రఘునాథ నృపాలమౌళి పైన్!

 పద్యం చూసి బెదిరి పక్కకు పోకండి. ఎంత హృద్యంగా ఉందో ఒక్కసారి ఆలకించండి. మన తెలుగు ఎంత మధురమైనదో.. మంచి పనివాడి చేతబడితే ఎంతటి హొయలుపోతుందో గమనించండి!
 ఈ పద్యం చేమకూర వెంకటకవిగారి  'విజయవిలాసం' కావ్యంలోనిది. 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?' అనే సంచలన వ్యాసం రాసారే.. తాపీ ధర్మారావు గారు.. ఆయన ఎంతో శ్రమకోర్చి విజయవిలాసంలోని ప్రతీ పద్యానికి హృదయోల్లాసమైన వ్యాఖ్యానంచేసి మనబోటివారి తెలుగు భాషాభిమానాన్ని పెంచే నిస్వార్థ సాహిత్య సేవ చేసారు(విజయ విలాసం చాలా సరదా కావ్యం. పెద్దగా తెలుగులో ప్రావీణ్యం అవసరం లేదుకూడా అర్థం చేసుకోవడానికి. తాపీవారి వ్యాఖ్యానం దగ్గర ఉంచుకొని చదివితే ఈ కావ్యం సాహిత్య ప్రియులకు ఒక రసవత్తరమైన విందు భోజనం. చమత్కారం లేని ఒక్క పద్యంకూడా విజయవిలాసంలో కనిపించదు.
సరే.. ఇంతకీ పద్యంలోని విశేషమేమిటయ్యా అంటే.. మరి చిత్తగించండి!
కొండలెక్కిదిగీ, మదగజాల మీదనుంచి నడుచుకుంటూ, మహాకోలకులేంద్రుడి(వరాహావాతారం తాలూకు) వాడి కోరలు చీలుస్తున్నా లెక్కచేయకుండావిషపుజ్వాలలు విడిచే ఆదిశేషుడి  వేయిపడగల నీడల్లోనే ఒదుక్కుంటూ.. పరమకోమలమైన భూదేవి రఘునాథ మహారాజు చెంతకు చేరడానికని వచ్చిందట!
ఇష్టమైన ప్రియుడిని కలవడానికి కోమలులైనా సరే ఎన్ని  కష్టాలైనా ఇష్టపూర్వకంగా సహిస్తారు కదా ఆడువారు! స్త్రీవలపు అంత బలమైనది మరి! రఘునాథ
మహారాజుమీద ఉన్న వలపువల్ల.. కొండలెక్కిదిగే శ్రమను, మదగజాలమీదనుంచి నడిచే ప్రమాదాన్ని, మహా రౌద్రాకారంలో ఉన్న వరాహావతారం వాడిముట్టె పొడుచుకుంటుందన్న భయాన్ని, ఆదిసర్పం పడగల జ్వాలల వేడిసెగలను.. వేటినీ భూదేవి లెక్కచేయలేదు.
మామూలు మనుషులకే మహాప్రమాదకరమనిపించే   సాహస కృత్యాలు మరి భూదేవి వంటి కోమలులని ఎంతగా భయపెట్టాలి?
మనసుకు నచ్చినవాడిని ఇలా ఎన్ని కష్టనష్టాలకైనా సహించి కలుసుకొనే స్త్రీని ఆలంకారికులు 'అభిసారిక' అంటారు. ఎంత మంది అభిసారికలు ఉంటే అంత గొప్పమగతనం పురుషపుంగవులకు..  విజయవిలాసకావ్యం  వెలసే రోజుల్లో.
ఆశ్రయమిచ్చిన రాజుగారి అహాన్ని ఏదో విధంగా ఉత్ప్రేక్షించి పబ్బం గడుపుకోవడమే రాజుల్లో చాలామంది   కవుల గడుసుతనం. వాటి తప్పొప్పులనుగూర్చి అలా ఉంచండి! అందరూ పాటించే ఆ ఉత్ప్రేక్ష ప్రశంసల్లోసైతం ఉత్తమం ప్రదర్శించి తెలుగుసాహిత్య కళామతల్లికి నిత్యాలంకారాలుగా శోభిల్లే సొమ్ములు చేయించి పెట్టిన  చేమకూర వెంకటకవిని అభినందించకుండా ఎలా ఉండగలం?  కవిలో ఎంత నగిషీలుచెక్కే పనితనమున్నా .. సొమ్ము చేకూరాలంటే ముడిసరుకులో తగిన మన్నిక ఉండాలిగదా! మనతెలుగు అటువంటి మేలిమిబంగారమని చెప్పటమే ఈ చిన్నవ్యాసం పరమార్థం!

-కర్లపాలెం హనుమంతరావు 

Wednesday, July 8, 2015

డ్యూ- కథానిక




కాళిదాసు కృపా అపార్టుమెంట్ సు దగ్గరికొచ్చేసరికి మధ్యాహ్నం రెండుగంటలయింది.  మే మాసం ఎండ నిప్పులు చెరుగుతోంది. 'వెధవుద్యోగం.. వెధవుద్యోగం' అని కనీసం పదిసార్లయినా తిట్టుకొని ఉంటాడు ఈ ఐదు నిమిషాల్లో.
కాళిదాసు పోస్టుమేన్ ఉద్యోగంలో కొత్తగా ఏం చేరలేదు. ఇంకో ఏడాదిలో రిటైరవ్వబోతున్నాడు.
పంచాల్సిన టపా ఇంకో అరకిలో ఉంది. 'ఈ ఉత్తరంతోనే వచ్చింది చచ్చే చావంతా!' అనుకొంటూ ఐదో అంతస్తులో ఉన్న పెంట్ హౌస్ దాకా పోయి డోర్ బెల్ నొక్కాడు.
ఎదురుగా చిన్నపాప. ఐదేళ్ళుకూడా లేవు. 'ఇంట్లో ఎవరూ లేరు' అంటూ తలుపులు ధడాల్మని వేసేసుకొంది. ఉసూరుమంటూ కిందికి దిగి వచ్చాడు కాళిదాసు.
రూల్ ప్రకారం అపార్టుమెంట్ సులో అన్ని మెట్లెక్కి టపా డెలివరీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఉత్తరానికి 'డ్యూ' ఉంది. ఐదురూపాయల స్టాంపుకు బదులు నాలుగురూపాయలే అంటించారు. రెండు రూపాయలు డ్యూ. అడ్రసీ రిజెక్టు చేసాడు. కనుక సెండర్ నుంచే అపరాధరుసుం వసూలు చేయాల్సుంటుంది. ఈ వారంలో ఇదే అడ్రసుకు ఇది వరసగా మూడో సారి ఇలా డ్యూ పడిన కవర్లు రావడం! రెవిస్యూ విషయంలో పోస్టుమాస్టరుగారు చాలా నిక్కచ్చి. డ్యూ కచ్చితంగా రికవర్ చెయ్యాల్సిందే! తిరుపతి కొండలాంటి ఆ మెట్లు ఎక్కలేక కాళిదాసు తనే కట్టేసుకున్నాడు ఆ అపరాథరుసుం.
పండగలకీ, పబ్బాలకీ, ఎంవోలకీ, ఇంపార్టెంటు కవర్లకీ మామూళ్ళు దండుకోవడమేగానీ, ఇలా స్వంత డబ్బులు అచ్చుకోవడం ఈ మధ్యనే మొదలయింది. మామూళ్ళు ఇవ్వలేదని టపా డెలివరీ చెయ్యని రోజులు కాళిదాసు సర్వీసులో బోలెడన్ని. ఇది యాంటీ క్లైమాక్సు. ఇంతటితో ఐపోతే ఇది కథే ఐవుండేది కాదు.
మర్నాడు అదే అడ్రసుకు మరో కవరు అలాంటిదే  డ్యూతో వచ్చింది! కాళిదాసు బి.పి పెరిగిపోయింది. ఎన్నిసార్లని కడతాడు ఎదురు డబ్బులు! వేళ తప్పించి పోదామంటే ఆ కొంపలో పెద్దవాళ్ళు ఎప్పుడుంటారో ఆ దేవుడికే ఎరుక. ఇంటికి ఫోన్ లేదు. ఇంట్లో ఎవరూ దొరకరు. ఇదంతా ఏదో మిస్టరీలాగా ఉంది. ఎదురుపడి తేల్చుకొందామనుకొంటే శాల్తీ ఎవరో తేల్తే కదా!
బీటు మార్చమని బతిమాలాడు కాళిదాసు. అదే రూట్లో తన ఇల్లుందని కావాలని దెబ్బలాడి మరీ డ్యూటీ వేయించుకొన్నాడు అప్పట్లో. ఇప్పుడున్న పరిస్థితులకి బదిలీ కెవరూ ఒప్పుకోవడం లేదు. రోజూ ఆ ఆడ్రసుకో డ్యూ కవరొస్తున్నదాయ!
ఒక్క ఆదివారం వదిలేసి  రోజూ వచ్చే ఆ ఉత్తరాల డెలివరీకోసం మెట్లెక్కి దిగలేక కాళిదాసు కుదేలయిపోయాడు ఈ నెల రోజులబట్టి.
బెల్లుకొట్టగానే ఠక్కున తలుపుతీసి రడీగా పెట్టుకొన్న రెండురూపాయలు చేతిలో పెడుతోందీ మధ్య ఆ పాప! వేరే వాళ్లను పంపితే అదీ లేదు. ఇదేదో తనమీదే కావాలని జరుగుతున్న కుట్ర కాదుగదా?
సెలవు పెడదామనుకొన్నాడుగానీ.. రిటైర్మెంటు చివరి రోజులు. డ్యూకి భయపడి డ్యూటీకి డుమ్మాకొట్టారంటారని పౌరుషం! లీవ్ ఎన్ కాష్ మెంటుకూడా తగ్గుతుంది.
తెల్లారుతోందంటేనే భయం. కల్లోకూడా కట్టలు కట్టలుగా 'డ్యూ' ఉత్తరాలు!.. తిరుపతి కొండల్లాంటి మెట్లు! .. ఆయాసం.. రొప్పు! నెలరోజుల్లో కాళిదాసు సగమైపోయాడు.. పాపం!
ఒకరోజు మెట్లు దిగేసమయంలో కళ్ళు తిరిగి పడిపోయాడుకూడా! కాళ్ళు మడతపడ్డాయి! నెలరోజులు విశ్రాంతి కావాలన్నారు డాక్టర్లు. 'పీడాపోయింది' అనుకొన్నాడు కాళిదాసు కసిగా!
మధ్యలో ఒకసారి పరామర్శకొచ్చిన పోస్టుమాస్టరుగారు ' ఇప్పుడా డ్యూ ఉత్తరాలు రావడం లేదులేవయ్యా! నిశ్చింతగా వచ్చి డ్యూటీలో చేరు!' అని చెప్పిపోయారు. చెవిలో అమృతం పోసినంత సంతోషం వేసింది కాళిదాసుకి.
మళ్లీ డ్యూటీలో  చేరినా కాళిదాసులో మునుపటి ఉత్సాహం లేదు. చివరి రోజుల్లో ఇలాగయిందేమిటా అని దిగులు పడిపోయాడు.

ఆ రోజు వచ్చిన టపాని ఠపఠప సార్ట్ చేస్తున్నారు సిబ్బంది. 'మళ్లీ వచ్చిందిరో ఉత్తరం!' అని అరిచారెవరో ఉద్వేగం పట్టలేక.
'సేమ్ లెటర్.. విత్ డ్యూ!' అని పెదవి విరిచారు పోస్టుమాస్టరుగారు ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పుతూ. కాళిదాసు ముఖంలో నెత్తుటిచుక్క లేదు. నిస్సత్తువుగా కూలిపోయాడు. కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
పోస్టుమాస్టరుగారు ఒక నిశ్చయానికి వచ్చినవాడిలాగా 'పద! దీని సంగతేంటో తేలుద్దాం!' అంటూ లేచారు.
ఉత్తరంతో సహా అపార్టుమెంట్ సు మెట్లు ఎక్కుతుంటే నిజంగానే ఆయాసం వచ్చింది పోస్టుమాస్టరుగారిక్కూడా. లిఫ్టు లేదు. 'పాపం! కాళిదాసు ఇందుకే అంత డల్ అయిపోయాడు.' అనుకున్నారాయన.
కాలింగ్ బెల్ కొడితే ఒక పెద్దాయన తలుపు తీసాడు.
'మీరు?'
'సూర్యప్రకాష్' చెప్పాడు పెద్దాయన.
'మీతో చిన్న పనుండి వచ్చాం సార్! ఐ యామ్ పోస్టుమాస్టర్…'
'యస్! ప్లేజ్.. కమిన్' అంటూ పెద్దాయన మర్యాదపూర్వకంగా లోపలికి పిలిచాడు.
'మీ ఉత్తరం రిటనొచ్చింది. రెండు రూపాయలు డ్యూ!' అన్నారు పోస్టుమాస్టరుగారు.
'ఇస్తాను. ముందు కాఫీ తాగండి!' అన్నాడు ముసలాయన.
ఎప్పుడూ రెండు రూపాయలిచ్చే పాప కాఫీకప్పులతో వచ్చిందీ సారి. కాళిదాసుని చూసి పలకరింపుగా నవ్వింది.
'ఈ పాప నా మనమరాలు' అన్నాడు ముసలాయన రెండు రూపాయలిస్తూ.
'మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను సార్!'  అన్నాడు పోస్టుమాస్టరుగారు.
'తెలుసు. రెండు రూపాయలకోసమే అయితే కాళిదాసే వచ్చేవాడుగా!' అన్నాడాయన చిన్నగా నవ్వుతూ.
'కాళిదాసు మీకు ముందే తెలుసా?!'
'తెలుసు. రెండేళ్లకిందట నేను పమిడిపాడులో  హెడ్ మాస్టరుగా పనిచేస్తున్నప్పుడు ఇతనక్కడ పోస్టుమేనుగా ఉండేవాడు'
కాళిదాసు ఆశ్చర్యంగా ఆయనవంక చూసాడు. అతని మనసులో లీలగా ఏదో మెదలడం మొదలుపెట్టింది. 'అవును. అప్పుడు ఈ పెద్దాయనతో దసరా మామూళ్లవిషయంలో పెద్ద గొడవయింది. మామూలు అడిగితే నీతులు చెప్పాడు' గుర్తు చేసుకొన్నాడు కాళిదాసు.
సూర్యప్రకాష్ అదే విషయాన్ని పోస్టుమాస్టరుగారికి చెబుతున్నాడు. 'నేనక్కడ రిటైరై ఇక్కడికొచ్చాను. ఇక్కడ మా పెద్దబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఒకసారి పనిపడి పోస్టాఫీసు కెళితే ఇతను కనిపించాడు. ఎవరితోనో గొడవపడుతున్నాడు. అదే దురుసుతనం. వాళ్లతో చెడి టపా ఇవ్వడం మానేసాడని చెప్పారు వాళ్ళు. బేసిగ్గా ఉపాధ్యాయుణ్ణి కదా! ఇతనికో పాఠం చెబుదామనుకొన్నా. తీరిగ్గా ఉన్నాను. కనకనే రోజుకో  అండర్ స్టాంప్డ్ కవర్ పంపిస్తున్నా. అలాంటి కవర్లను తీసుకోవడానికి ఇష్టపడని కంపెనీనే సెలక్టు చేసుకొని కావాలనే పంపిస్తున్నా. ఇతగాడు ఈ మెట్లన్నీ ఎక్కి ఎక్కి .. ఇక ఎక్కలేని ఓ రోజు నా దగ్గరికొస్తాడని తెలుసు.  అలా రావాలనే కొంత ఖర్చైనా ఇదంతా చేసింది!'
'మీ అపార్టుమెంటు మెట్లు ఎక్కలేక ఒకరోజు పడిపోయాడు ఇతగాడు. నెలరోజులకు పైనే ఆసుపత్రిలో పడి ఉన్నాడు. మీరు అనుకొన్నదానికన్నా పెద్ద శిక్షే పడింది సార్ ఈ కాళిదాసుకు' అన్నారు పోస్టుమాస్టరుగారు నిష్ఠూరంగా.
'ఇతగాడు మాకు విధించిన శిక్షకన్నానా!' అంటూ నిరసనగా కాళిదాసువంక చూసింది అప్పుడే బైటికివచ్చిన ఒక ముసలామె. ఆమె సూర్యప్రకాష్ భార్యలాగుంది.
'బక్క ఉద్యోగి. అతను మీకు శిక్ష వేయడమేమిటమ్మా?!' అని విస్మయంగా ఆదిగారు పోస్టుమాస్టరుగారు.
పెద్దాయన కలగజేసుకొని అన్నాడు' పోస్టల్ యంత్రాంగంలో పోస్టుమ్యాన్ ఒక మహత్తరమైన శక్తి మాస్టారూ! బైటి ప్రపంచానికి, మాకు ఈ ఉద్యోగే ప్రధానమైన లింకు. ఎక్కడెక్కణ్ణుంచో అయినవాళ్లూ, అవసరమున్నవాళ్లూ చెప్పుకొనే సంగతులన్నింటినీ మోసుకొచ్చే దూతకదా పోస్టుబంట్రోతంటే! ఇది ఒక పవిత్రమైన బాధ్యత అని నా ఉద్దేశం. మామూళ్ళు ముట్టచెప్పలేదనే కసితో దాన్ని దుర్వినియోగం చెయ్యడం సాధారణమైన నేరం కాదు. ఆ నేరం చేసినందుకే తగిన శిక్ష అనుభవించాడు మీ కాళిదాసు' అన్నాడు సూర్యప్రకాష్ దృఢంగా!
'కాళిదాసు అంత చెయ్యరాని నేరం ఏం చేశాడండీ?'
'పమిడిపాడులో ఉన్నప్పుడు మామూళ్ళు ఇవ్వలేదని ఈ అయ్యగారి టపా ఇవ్వకుండా దాచేసాను సార్ చాలారోజులు' అన్నాడు కాళిదాసు పశ్చాత్తాపంగా.
'అలా దాచేసిన ఉత్తరాల్లో ఏముందో తెలుసా.. కాళిదాసూ? అత్తగారింట్లో అగచాట్లు పడుతూ రక్షించమని రోజూ రోజుకొక ఉత్తరం రాసిన ఓ ఆడకూతురి ఆవేదన. అన్ని డజన్ల ఉత్తరాల్లో ఒక్కటైనా మాకు అందివుంటే మా కన్నకూతురు మాకు దక్కి ఉండేది. ఈ వయస్సులో ఈ కడుపుకోత తప్పి ఉండేది. మేంకూడా పట్టించుకోలేదన్న అవమానంతో మా చిట్టితల్లి వంటిమీద కిరోసిన్ పోసుకొని అంటించుకుంది. ఇదిగో ఈ పసిపాపే మా పాప కన్నకూతురు. ఎన్ని సార్లైనా నేను రెండు రూపాయలు కట్టి ఈ డ్యూ ఉత్తరాలు విడిపించుకోగలను. నువ్వేం చెల్లించి 
 ఈ పసిపాప 'డ్యూ' విడిపించగలవో చెప్పు కాళిదాసూ!' అంటూ పాపను దగ్గరకు తీసుకొని భోరుమన్నాడు అప్పటివరకు గాంభీర్యం నటించిన ముసలాయన.
కాళిదాసు కొయ్యబారిపోయాడు!
***
-కర్లపాలెం హనుమంతరావు
(గమనికః కథాకాలం 2005 సంవత్సరం)
(విపుల మాసపత్రిక డిసెంబరు 2007 సంచికలో ప్రచురితం)



Tuesday, July 7, 2015

దోమాయణం- ఓ సరదా గల్పిక



‘స్వచ్చ భారత్ వంకతో మోదీజీ దేశవాసులదరిచేతా తెగ చీపుళ్ళు పట్టిస్తున్నారు. బాగుంది.  దక్షిణ తైవాన్లో  శుభ్రతకోసం ఇంతకన్నా దివ్యమైన  పథకం  మరోటి ప్రచారంలోకొచ్చిందీ మధ్య. ఎవరెక్కువ దోమల్ని  చంపి తెచ్చి చూపిస్తే  వాళ్ళకి వంద అమెరికన్ డాలర్లు మొదటి బహుమానం. మిగతా ఔత్సాహికులకేమో దోమతెరలు.. ఓడోమస్ గొట్టాలు! బహుమానాలనగానే యమగ్లామరుగదా!  ఇప్పుడు అక్కడ  ఎక్కడ చూసినా మశకమహాశయులకోసమే పరుగు పందేలు!  ఒక్కోదోమవెంట పదిమంది ఉరుకులు పరుగులు.. చప్పట్లు కొట్టుకుంటూ! మన త్యాగరాజయ్యరువారి వర్ధంతి  జయంతుల నాటి   నగరసంకీర్తన దృశ్యాలే ప్రతిక్షణం ప్రస్తుతం మనకు అక్కడ కనిపించేవి!
దోమల్ది మనుషుల్ది రక్తసంబధం .  మనం  మనస్ఫూర్తిగా ఎవరికీ చప్పట్లు కొట్టం ఒక్క దోమలకు మినహా.  దేవుడే కంటి ఎదురుకొచ్చి నిలబడ్డాసరే  రెండు చేతులూ ఎత్తి నమస్కరించని శుద్ధనాస్తికుడైనా.. పడక ఎక్కిన తరువాత దోమ కంటపడితే రెండుచేతులకూ పని చెప్పక తప్పదు.
మనిషిని సృష్టించిన దేవుడే దోమనూ సృష్టించాడని  మర్చిపోరాదు. ఒక్క మానవుణ్ణే సృష్టించి వదిలేస్తే.. వాడు పెట్టే 'గీ..బే' లకి తన నిద్ర భంగమవుతుందని తెలుసు. కాబట్టే ఆ నసగాడికీ నిద్రరాకుండా దోమను సృష్టించి వదిలిపెట్టాడు గడుసుగా.
నారుపోసే 'వాడు' అన్నిజీవులకు నీరు పోస్తూ.. ఒక్క దోమలకు మాత్రమే  ప్రత్యేకంగా రక్తం  ధారపోసాడు. అదీ మన మానవరక్తం! దోమల్ని తిట్టడం అన్యాయం.  ఫలితం శూన్యం. రెండుచెవులున్న మనుషులే తిట్లను పెద్దగా పట్టించుకోనప్పుడు.. చెవులే లేని దోమలు మన మొర ఆలకిస్తాయనుకోవడం దురాశ. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపగలవేమోగానీ.. దోమల ఆగడాన్ని ఆపడం కుదరదుగాక కుదరదు.
దేవుడు మనకు చేసిన మహోపకారమల్లా  దోమల్ని  సూక్ష్మరూపంలో సృష్టించడమే!  ఏనుగులకుమాదిరి భారీకాయాలతోగానీ  దోమలు ఎగరడం మొదలుబెడితే చెవుల చుట్టూనే  నిత్యం షంషాబాద్ విమానాశ్రయం సందడి వినబడుతుండేదిగదా! నలుసంత  ఉండబట్టి చప్పట్లుకొట్టి దోమని మట్టు బెడుతున్నాం. భారీశరీరాలతోగాని దోమలు దాడిచేయడం మొదలుపెడితే ఎదురుదాడికి  మన రెండుచేతులేం మూలకు? ఈటెలూ.. బరిసెలూ..బాంబులూ పట్టుకుని  అడవి మనుషులు.. ఉగ్రవాదులకు పోటీగా రంగంలోకి దిగాల్సొచ్చేది . కార్తవీర్యునికిమల్లే సహస్ర బాహువులతో జన్మించే అదృష్టం అందరికీ  ఉండద్దూ!
శేషశయనుడికే ఈ దోమల బెడద తప్పిందికాదు.  ఆదిశేషుడి పడగల కింద ఆ ముక్తిప్రదాత తలదాచుకుంది బహుశా ఈ దోమల దాడినుంచి విముక్తికే అయివుండచ్చు. కైలాసనాథుడి కష్టాలైతే మరీ కడుపు తరుక్కుపోయేవి. వంటిమీద నూలుపోగైనా లేకుండా మంచుకొండలమీద కాపురం ఉంటున్నా..  దోమాసురుల తాకిడికి తాండవాలు తప్పడంలేదు. ముక్కోటి గణాలు ఉండీ ఏం లాభం? ఏ ఒక్కశ్రేణీ సర్వరక్షకుణ్ణి దోమాధముల బారినుంచి కాపాడలేక పోతున్నప్పుడు?! ఏ గణాల అండాలేని సామాన్యులం మనం..  దోమలగండం లేకుండా ఉండాలంటే తీరే ఆశేనా? బ్రహ్మదేవుడికి మల్లే పుట్టుచెవుడున్నా కొంత  బాగుండేది. దోమకాటు నుంచి కాకపోయినా కనీసం వాటి సంగీతాన్నుంచైనా   ఉపశమనం దక్కుండేది.
దేవుడు రెండు చేతులు ప్రసాదించింది అరచేతులతో చప్పట్లు కొట్టి  దోమల్ని  తరిమి కొట్టేందుకే. చీమలకుమల్లే దోమ ఏ శివుడాజ్ఞ కోసమూ ఎదురు చూసే జీవి కాకపోవడంకూడా  దురదృష్టమే. నిద్రపోతునిచూస్తే  దోమలకు మహా అసూయ. 'నరులనుకుట్టే దోమలు ఆడజాతికి చెందినవి మాత్రమే' అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మాత్రం భాగ్యానికి అంత చేటు పరిశోధనలు అవసరమా? వాటి సంగీతంబట్టే ఇట్టే పసిగట్టేయచ్చు.
మనిషి ఇంజెక్షను కనిపెట్టిందికూడా దోమకాటును గమనించే అయిఉండాలి. కుట్టే సమయంలో బాధ తెలియకుండా  బెజ్జందగ్గర ఓ రకమైన ద్రవాన్ని దోమ విడుదల చేస్తుంది. మనం వైద్యంలో వాడే అనస్తీషియాకు బహుశా ఈ ప్రక్రియే  ప్రేరణ అయిఉండాలి. ప్రతీ
గొప్ప ఆవిష్కరణని  తనకే ఆపాదించుకునే దుర్గుణం మనిషిది. దోమకు రావాల్సిన క్రెడిట్ మనిషి కొట్టేసినట్లుంది. దోమకాటులోని తీవ్రతకు బహుశా   ఈ కచ్చకూడా ఓ కారణమైవుండచ్చు.
మనిషిరక్తం పీల్చే జాతుల్లో దోమది ప్రథమస్థానం. 'దాహార్తికి కారణం దాని జీవన్మరణ సమస్య' అంటున్నారు క్రిమికీటక శాస్త్రవేత్తలు. ప్రాణాలను ఫణంగాపెట్టి   కాటుకి సిద్దపడే దోమ దుస్సాహసం వెనక ఎంత దయనీయమైన కారణాలు ఉన్నాయో మానవీయకోణంలో  తర్కించాలి. దోమకు బుర్ర తక్కువని మనకు మహా చులకన.  మన రక్తంలో
మేలిమిరకం విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని ముందుగా కనిపెట్టిన బుద్ధిజీవి దోమే. పాతికతరాలకు ఒక్క పర్యాయమైనా  మానవరక్తం పథ్యంగా పుచ్చుకోక పోతే దోమ మనుగడే ప్రశ్నార్థకంలో పడిపోతుంది తీసుకోవడమే తప్ప ఇచ్చే అలవాటులేని మనిషి  స్వచ్చందంగా దోమలకోసం రక్తదాన శిబిరాలు నిర్వహించడు గదా! దోమలకు మనిషి నైజం మహబాగా తెలుసు. అందుకే  ఈ బలవంతపు రక్త సేకరణలుఎంతో అప్రమత్తంగా ఉండి..కుట్టిన వెంటనే వడుపుగా   పట్ట బోయినా దోమచేతికి అందివచ్చే    కీటకం  కాదు. కసి, క్రోధం మానవశరీరాల్లో సృష్టించే ప్రకంపనలను నరాల  కదలికలద్వారా ముందే పసిగట్టి  చటుక్కున తప్పుకునే వడుపు భగవంతుడు     దోమకు ప్రసాదించాడు. దేవుడే దోమ పక్షపాతిగా మారిన నేపథ్యంలో ఇహ మనిషి మొరాలకించే నాథుడెక్కడ దొరుకుతాడూ?

దోమల అసాధారణ  గ్రహణ శక్తినుంచే మానవనేతలు  పలాయన నైపుణ్యం సాధించినట్లుంది.  సర్కారునిధులు  పీల్చినంత పీల్చి.. ప్రమాదం పసిగట్టగానే చటుక్కున పక్క పార్టీలోకి దూకి నక్కేవడుపు
మనప్రజానేతలు కచ్చితంగా మశకగురువుల   శిష్యరికంలో సాధించిన పలాయనవిద్యే.
దోమలు అన్నిప్రాణులను ఒకేలా ప్రేమించవు. నిద్రకుపడ్డ సమయంలో ముక్కు రంధ్రాలగుండా విడుదలయ్యే బొగ్గుపులుసు వాయువు మోతాదు మీద దోమల ఆకర్ష వికర్ష పథకాలు  ఆధారపడి ఉంటాయంటున్నారు శాస్త్ర వేత్తలు. మన ఉఛ్చ్వాశ నిశ్వాసాలు మన అదుపులో ఉండవు కనక  దోమలవేటా మన అధీనంలో లేనట్లే లెక్క.  అధీనంలో లేనివాటిని గూర్చింత రాద్దత మవసరమా?  అని సందేహం.
సుపరిపాలన  ప్రజల అధీనంలో ఉంది కనకనా? అయినా దాన్నిగూర్చి చర్చించడం మానుకుంటున్నామా? ఇదీ అంతే! అని సమాధానం.
'ప్రతీజీవికీ ఓ ప్రయోజనం ఉండి తీరుతుంద'ని కదా గురజాడవారి గిరీశంగారి థియరీ! దోమలతోనూ కతిపయ లాభాలు లేకపోలేదు. అనుక్షణం కళ్ళల్లో వత్తులేసుకుని దోమలకోసం దేవులాట్టంవల్ల   అప్రమత్తత శాతం బాగా పెరిగే అవకాశం ఎక్కువ.  తెల్లార్లూ దోమలు
చెవిదగ్గర 'గీ' మంటూ నిద్దర్లు పాడుచేస్తుండబట్టేగదా ఈ మాత్రమన్నా శాంతిభద్రతలు అదుపులో ఉంటున్నవి! రక్షకభటులమీదే పూర్తిగా భరోసా ఉంచి ఆదమరచి నిద్రకుబడితే తెల్లారేలోపు కొంప అయ్యవారి నట్టిల్లయ్యే ప్రమాదమూ పొంచి ఉంది.
వాస్తవానికి దోమలవల్ల దొంగలకే ఎక్కువ చేటు. దొంగచాటు వ్యవహారాలు, చాటుమాటు సరసాలు సాగించే కంత్రిగాళ్ళకు అవి ఎక్కువ శత్రువుల. అయినా వాళ్ళు ఒక్కముక్క దోమలకు వ్యతిరేకంగా  బైటికి అనరు. చేసే  మేళ్ళన్నీ మరిచి  మనమే వాటిని అస్తమానం అవసరానికన్నా ఎక్కువగా ఆడిపోసుకుంటున్నది!
దోమలమీద మరీ అంతగా  పగ పెంచుకోవడం తగదంటున్నారు
శాస్త్రవేత్తలు కూడా. దోమలే ఆహారంగా బతుకు వెళ్లదీసే ఎన్నోరకాల జీవులకు స్థానంలేకుండాచేస్తే  సంభవించే ఉపద్రవం దోమకాటు నష్టానికన్నా  పదింతలు.  దోమల్ని భరించి, జీవవైవిధ్యానికి తనవంతు పాత్ర పోషించడం మినహా మనిషికి మరో దారిలేదు.
మరి మోదీజీ 'స్వచ్చ భారత్' అంటారా?!
దేని దారి దానిదే! మధ్య నిషేధం అసాధ్యమని తెలిసీ..  మనం నినదించడంలా!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- సంపాదకీయ పుట- 13-11-2014 లో ప్రచురితం)
                        


                                        ***

రసమయ తపస్సు- సాహిత్య వ్యాసం

వ్యాపారపత్రికలలో కవిత్వానికి దక్కుతున్న చోటు.. ఆ చోటులో కనిపిస్తున్న కవిత్వం గమనిస్తే.. నిజానికి ఎవరికీ కవిత్వం మీద అంత సదభిప్రాయం పెరిగే అవకాశం లేదు. కవిత్వానికే మీదుకట్టిన కొన్ని సాహిత్యపత్రికల్లో సైతం లబ్దప్రతిష్టులకు మాత్రమే అవకాశం దక్కే పరిస్థితి. ఇన్ని ప్రతికూల నేపథ్యంలో సైతం కవిత్వం కుండపోతగా వర్షిస్తూనే ఉండటం హర్షించదగ్గ పరిణామమే.

కవిత్వం మీద మోజు చూపిస్తున్న వర్గాల్లో ముఖ్యంగా యువతదే ప్రధాన

భూమిక. ఇది మరీ సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు వస్తున్న కవితాసంపుటాలే ఇందుకు ఉదాహరణ.

కవిత్వం అంటే ఒకప్పుడు ఛందోబంధంగా ఉండితీరాల్సిన   పరిస్థితి.
భాషమీద కొంత పట్టు, వ్యాకరణంమీద కనీస అవగాహన అవసరం. పూర్వ సాహిత్యంతో స్వల్పంగానైనా పరిచయం లేకుండా కవిత్వం రాయడానికి అవకాశం ఉండేది కాదు. గిడుగు వారి వ్యావహారికోద్యమ ఫలితంగానో, గురజాడ వంటి  అభ్యుదయవాదుల కృషి మూలకంగానో.. శ్రీశ్రీ వంటి అతివాదుల పుణ్యమా అనో ఛందోబంధనాలన్నీ ఫటాఫట్ తెగిపోయి తెలుగు కవితామతల్లికి సంపూర్ణ స్వేచ్చాస్వాతంత్ర్యాలు సిద్ధించాయి. కాలానుగుణమైన మార్పులు ఎన్నో చోటు చేసుకోవడం వల్ల.. కవిత్వం స్వరూప స్వభావాలే సంపూర్ణంగా మార్పు చెందాయి. ఇవాళ మనసుకి ఎలా అనిపిస్తే అలా రాయడమే అసలైన కవిత్వం’ అనే భావన   స్థిరపడిపోయింది. అదీ ఆనందించదగ్గ పరిణామమే. కాకపోతే ఈ స్వేచ్చను నేటి యువత నిజంగా ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నది?

భాషాపాటవం, సంవిధాన చాతుర్యం, శిల్ప విణ్ణానం పుష్టికరమైన కవిత్వానికి ముఖ్యావసరాలు. అవి స్వాధీనమవాలంటే ఒక రసమయమైన తపస్సు అవసరం. గతకాలపు కవితా ప్రక్రియలను  (ఇప్పుడు మనం వాటిని  ఉపయోగించకపోయినా సరే) ఒక పరిశీలనా దృష్టితో.. సావధాన చిత్తంతో.. అధ్యయనం చేయకుండా రాయబూనుకుంటే ఆ కవిత్వం తేలిపోతుంది. నన్నయ భారతం ఎందుకు రాయాల్సి వచ్చింది? పాల్కురికి సోమనాథుడు తమ కాలం నాటి ఇతర కవుల మాదిరిగా కాకుండా దేశికవితల్లోనే రచనలు ఎందుకు చేయాల్సి వచ్చింది? తిక్కన గారు భారతాన్ని ఎంత నాటకీయత దట్టించి రాసారు? శ్రీనాథుడుకి, పోతనకు.. వ్యక్త్తిత్వాల మధ్య వైరుధ్యం కన్నా.. వ్యక్తీకరణల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? రాయలు వారి భువనవిజయంలోని అష్టదిగ్గజాల మధ్య గల రాజకీయాలకన్నా వారి వారి రచనల మధ్యగల సామ్యాలు.. తారతమ్యాలు ఎలాంటివి? ప్రబంధసాహిత్యం ఎందుకు చివరి దశలో  తిరస్కరణకు గురయింది? పద్యధోరణుల మీద భావకవిత్వం చేసిన తిరుగుబాటు ఎటువంటిది? నవ్యకవిత్వం వచ్చి భావవిత్వాన్ని ఎలా వెనక్కు నెట్టింది? ఆధునిక కవిత్వం మొత్తం అభ్యుదయ కవిత్వమే అనుకోవడానికి ఎంతవరకు వీలుంది? అభ్యుదయ కవిత్వం మీదా దిగంబరకవులు ఎలా.. ఎందుకు తిరగబడినట్లు? ఆ వేడి ఇట్టే చప్పున చల్లారిపోవడానికి వెనకున్న తాత్విక కారణాలేమిటి? విప్లవ కవిత్వం ఎప్పుడు.. ఏసందర్భంలో.. ఎవరి ఏ అవసరాలకు అనుగుణంగా చొచ్చుకొని వచ్చింది? తరువాతి కాలంలో దాన్లోనూ చీలికలు ఏర్పడటానికి కారణాలేమిటి? ప్రపంచీకరణ పెచ్చుమీరుతున్నతరుణంలో కవిత్వంలో జరిగిన పరిణామాలు ఎటువంటివి? ఆధునికాంతరవాదంగా ముందుకు వచ్చిన.. వస్తున్న ఈనాటి అస్తిత్వపోరాటాల కథా కమామిషు లేమిటి? కుల మత వర్గ వర్ణ లింగ వ్య్తత్యాసాల ఆధారంగా కవిత్వంలో కొత్తగా ఏర్పడుతున్న తాత్విక ధోరణులు ఎలాంటివి? విశ్వసాహిత్యంతో మన సాహిత్యం ముందు నుంచీ ఎలా ప్రభావితమవుతూ వస్తోంది? ప్రస్తుతం యువత  రాస్తున్న కవిత్వం ప్రపంచ సాహిత్యంతో ఏ మేరకు తులనాత్మకంగా తూగగలుగుతోంది? కవిత్వచరిత్రను మొత్తంగా  ఒక స్థూలదృష్టితో   అర్థం చేసుకునే ప్రయత్నం ఏదీ చేయకుండా.. నిజానికి అర్థవంతమైన కవిత్వం రాయడం కుదరదు. ఆ పని చేస్తున్న యువకవులు ఎంతమంది అంటే.. వచ్చే సమాధానం అంత సంతృప్తికరంగా లేదు.

అధ్యయనం  ఒక వంకనుంచీ జరగాల్సిన ప్రయత్నమైతే.. మరో వంకనుంచీ  ఆచరణాత్మకమైన కృషీ సమాంతరంగా జరగాల్సి ఉంది. ఒక కవిత రాసిన తరువాత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామా?  "కవి తన ప్రతీ అభివ్యక్తినీ నిశితంగా తీర్చి దిద్దుకున్నప్పుడే.. ఆ భావశకలాలు చదువరి హృదయక్షేత్రంలో బలంగా నాటుకునే అవకాశం ఉంటుంది" అంటారు  సీనియర్ కవి ఆవంత్స సోమసుందర్ ఒక పరిశీలనా వ్యాసంలో. కవితకు ఈ నిశితత్వం ఎలా వస్తుంది? ఆవంత్సవారి మాటల్లోనే చెప్పాలంటే.. "రచన  పూర్తయిన తరువాత చప్పున తృప్తి పడకుండా.. చెప్పిన రీతికంటే మరింత రమణీయంగా తీర్చిదిద్దటానికి ఇంకేమన్నా అవకాశాలున్నాయా? అన్న అంశాన్ని   అధ్యయనబుద్ధితో సమీక్షించుకోవాలి. సంవిధానంలో, భావాల  అభివ్యక్తీకరణలో మరిన్ని మెరుగులు సంతరించుకోగల పరాత్మక పరీక్షకు కవి పూనుకున్నప్పుడే ఉత్తమత్వం కవిత్వంలోనుంచి ‘అగ్నిసరస్సునుంచి ప్రభవించిన వజ్రం’లా మెరుపులీనేది". ఈ ధ్యాన నిమగ్నతను ఆరంభంనుంచే అలవర్చుకున్నవాడే మంచికవిగా రూపు దిద్దుకునే అవకాశం పెరిగేది. ఓర్పులేని కవి ఎంత కవిత్వం రాసినా నేర్పులేమి కారణంగా  తేలిపోతుంది.

ప్రతిభను నిత్యహరితంగా రక్షించేది వ్యుత్పన్నతే.  లోకవృత్త పరిశీలన, విస్తృతమైన గ్రంధాద్యయనం, అనుభవ పరిపాకంతోచేసే మేధోమథనం-  కవిత్వకన్య చెక్కిలికి కమ్మని, చిక్కని చక్కదనం చేకూర్చే చెక్కుడు  సరంజామా. భావుకత్వం ఒక్కటే కవిని  మంచి కవిగా తీర్చిదిద్దలేదు. రచన పూర్తయిన వెంటనే నిద్దపుస్వరూపం సిద్దించినట్లు తృప్తిపడే కవి తనకు తానే కాదు..  కవిత్వానికీ హాని చేస్తున్నట్లే లెక్క.

ఇవాళ  అంతర్జాలంలో ఎవరికైనా ఎంతటి uncut and unsesored వెర్షన్నైన అత్యంత సులభంగా ప్రచురించుకునే సౌలభ్యం ఉంది. రాసీ రాయని మరుక్షణంలోనే వాసి సంగతి సమీక్షించుకోకుండా ఏదైనా  పత్రిక్కి  పంపించాలనో, అంతర్జాలంలో ప్రచురించేసుకోవాలనో గత్తర పడితే.. దక్కేది ఒక వ్యతిరేక ఫలితం. తుడుపు

కోవడానికి చాలా కష్టపడ వలసిన  'చెడ్డముద్ర"!


రచన పూర్తవగానే విమర్శకుడి అవతారం ఎత్తడం మంచి పద్ధతి. కవిత్వం అంటే ఒక రసమయ తపస్సు. దీక్షకొద్దీ దాని  ఫలితం.
***
కర్లపాలెం హనుమంతరావు
(మాలిక- అంతర్జాల మాసపత్రిక- జనవరి 2015లో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...