Monday, April 2, 2018

అమ్మపాలు అమృతం- మనం - మకుటం కవర్ స్టోరీ




కొంగు చాటునే చనుబాలివ్వడం తప్పని సరా?
 ఏ శిశువును గురించైనా కచ్చితమైన సమాచారం  తెలిసి ఉండే మొదటి సాధికారిక వ్యక్తి ఆ బిడ్డను కన్న తల్లి. కనక తల్లుల ద్వారానే శిశువుల సంక్షేమం సులభ సాధ్యమవుతుందన్న మాట నూరు శాతం నిజం. ప్రస్తుతం పేరెంటింగ్, పిల్లల పెంపకం అనే రెండు ప్రధాన  అంశాల మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు తెర లేచింది. అందులో భాగంగానే  కేరళకు చెందిన 'గృహలక్ష్మి' అనే మాసపత్రిక ముఖచిత్రంగా ప్రచురించిన చాయాచిత్రం ప్రస్తుతం పెద్ద దుమారానికి  దారి తీసింది. కొంగుచాటు నుంచి తల్లి తన బిడ్డకు చనుబాలు అందించే ప్రక్రియ ఏనాటి నుంచో ప్రపంచవ్యాప్తంగా అనూచానంగా వివిధ విధి విధానాలలో  కొనసాగుతోన్న సాంఘిక సదాచారం!   కానీ  ఓ బిడ్డకు పాలిచ్చే  తల్లి  చిత్రం కింద 'అలా చూడకండి! మా పిల్లలకు మేం పాలు పడుతున్నాం!' అనే నినాదం ప్రచురించింది ఆ  పత్రిక.  అదే పెను వివాదం రగలేందుకు ప్రధాన కారణమైంది ప్రస్తుతం. చాటు లేకుండా ఓ బిడ్డకు చనుబాలిస్తున్న మ్యాగ్జిన్  ఫ్యాషన్ రంగంలో రాణించే ఒకానొక పెద్ద మోడల్. అవివాహిత. 'కాబట్టే ఇబ్బందికరం' అనేది సామాజిక మాధ్యమాల్లో ఒక వర్గం చేస్తున్న అభ్యంతరం. ఎలాగూ మాతాశిశువుల చనుబాల బంధం బహిరంగ చర్చకు దారి తీసింది.  అతి ముఖ్యమైన ఒక  ఆరోగ్య సంబంధమైన అంశం తెర ముందుకు తిరిగి  వచ్చింది. 'తల్లి పాలు' చూట్టూ అల్లుకుంటున్న అనేకానేక సామాజిక అంశాలను గురించి స్థూలంగా చర్చించాలన్న చిరు ప్రయత్నమే ఈ చిన్న వ్యాసం రాసేందుకు ప్రేరణ.
-శ్రీమతి గుడ్లదొన సరోజినీ దేవి.
***

ఇట్టి ముద్దులాడి బాలుడేడ వాడు వాని/ పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు వోయరే' అంటూ అన్నమయ్య  ముద్దుగా పాటలల్లిన కాలంలో తెలుగు తల్లులందరికీ తెలిసిన శిశువు సంపూర్ణాహారం తమ గోరువెచ్చని గుండెల నుంచి వెల్లువెత్తే కమ్మని చనుబాలే!  పుట్టీ పుట్టకముందే తనువు చాలిస్తున్న జీవులకు  చాలినంత అమృతం అంధించలేక అమ్మను సృష్టించి తనకు మారుగా భూమ్మీదకు పంపించాడని ఓ ప్రాచీన కవి చమత్కరించాడు.
బీజ దశనుంచి బిడ్డను భూమి మీదకు తెచ్చే వరకు తల్లి పొందే ఆ 'దేవకీ పరమానందానుభవా'లను పోతన భాగవతం కళ్లకు కట్టినట్లు వర్ణించింది. ఆదికవి నన్నయ నుంచి నేటి కవి ఆచార్య గోపి వరకు అమ్మతనం కమ్మదనాన్ని గురించి కలవరించని కవి లేడు.
భోజరాజీయంలోని గోమాత వ్యాఘ్రరాజానికి ఆహారంగా మారే ముందు ముందుగా ఆందోళన చెందింది 'జఠరాగ్ని బొక్కి పడుచు/ బొరుగిండులకు నొంటిబోవ గుక్కలు దోల/ కరచునో' అనుకొంటూ తన లేగదూడను గురించే! వేటగాడొకడు వలవేసి పట్టుకున్నప్పుడు ఆ వలలో చిక్కిన తల్లిపక్షి విలపించింది చావు గురించి కాదు... రెక్కలింకా రాని పిల్లల తిండి తిప్పలను గురించే! అమ్మలపొదిలో అమ్మ పాలు  చాలా పదునైన ఆయుధం.
అమ్మపాలంటే అమృతం. సాదం అంటే అనుగ్రహం. తల్లిపాలు  ప్రకృతి ‘ఫార్ములా’ ప్రసాదం. తాగితే బిడ్డకు.. తాగిస్తే జననికి  రక్ష. తల్లి చనుబాలు సేవనం ఒక్క చిన్ని కూనలకే కాదు.. కన్నతల్లుల దైహిక, మానసిక వికాసాలకీ ఎంతో మేలు చేస్తోంది- అంటోంది అష్టాంగ హృదయ సంహిత. నివారణ అయే ఎన్నో స్త్రీ సంబంధమైన ఒంటిరుగ్మతలకు  సంజీవని వంటి దివ్యౌషధం చంటి బిడ్డలకు చెంగుచాటు చేసి కుడిపించే చనుబాలు. ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలివ్వడంవల్ల అధిక రక్తస్రావం అరికడుతుంది. రొమ్ము.. అండాశయ సంబంధమైన  క్యాన్సర్ల వంటి వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది. ప్రసూతి సమయంలో బిగువు తగ్గిన గర్భసంచి పూర్వ స్థితికి వచ్చి అధిక రక్తస్రావం ఆగిపోవడం తల్లికి చేకూరే ఆయాచిత వరం. ఆరు నెలల వరకు అండం విడుదలలో ఆలస్యం జరుగుతుంది. వెంట వెంటనే గర్భం ధరించే భారం దూరమవటం తల్లికి తాత్కాలికంగా ప్రకృతి కల్పించిన కుటుంబ నియంత్రణ(లాక్టేషనల్‌ ఎమోనోరియా లేదా లామ్‌) సౌకర్యం. బరువు తగ్గేటందుకు జిమ్ముల బాట పట్టనక్కర్లేదు. పూర్వపు రూపం కోసం మళ్లీ  వేలు ఖర్చు పెట్టనక్కర్లేదు. ముందు ముందు కీళ్లవాతం, మధుమేహం వంటి సైలెంట్ కిల్లర్స్ కు పెట్టే మందుల గోలా కొంత తప్పుతుంది.
మాతృక్షీరం పుష్టికరం. సమస్త పోషకాల సమాహారం. సర్వ రోగాలకు ఏకైక  నివారణం. అమ్మపాలు  బలిమికి, బుద్ధికి ఆలవాలం. కాబట్టే వాటికి సంపూర్ణ పౌష్టికాహారం అనే పేరు సార్థకమయింది. జగద్గురువు శంకర భగవత్పాదులు ప్రస్తుతించారో సందర్భంలో.. ‘మాత- ఒక్క మానుష  జాతికే కాదు... సురాసుర దేవ మునీశ్వర మానస మందిరాలన్నింటా  కొలువై ఉన్న మమకార దేవత’ అంటూ! జగన్మాత అయితేనేమి అంబికమ్మ  బాలషణ్ముఖి తన ఒడి చేరగానే స్తన్యమందించి ఓ మామూలు తల్లిలా ఎలా పరవశించిందో 'కుమార సంభవం'లో కాళిదాసు మహాద్భుతంగా వర్ణించాడు. ఉయ్యాలలో కక్కటిల్లే బిడ్డ 'పుట్టు బిందెలు బూని పులిగోళ్లు బూని జనకుడూ మీ తాత వచ్చె ఏడవకూ!' అని మరిపించబోయినా ఏడుపు ఆపింది లేదు. 'ఉగ్గు బంగరు గిన్నె ఉయ్యాల కొనుచూ ఊర్మిళ పినతల్లి వచ్చె నేడవకూ!' అని మురిపించబోయినా మారాము మానింది కాదు. 'అయోధ్య కెళ్లి వద్దాము.. అయ్యరో నువ్వు ఏడవకు నా బాబు!' అంటూ  బులిపించబోయినా అల్లరి ఆపని ఆ బుల్లి పిడుగు సీతమ్మ తల్లొచ్చి చెంగు చాటుగా స్తన్యమందించగానే నోరింత చేసుకొని కేరింతలు కొట్టినట్లు’  జానపదుల  ముచ్చటగా తమ పాటల్లో చెప్పుకొంటారు. కొన్ని శతాబ్దాల కిందటి వరకు తమ చనుపాలకు  ప్రత్యామ్నాయం అన్న ఊహకే తావుండేదే కాదు కన్నతల్లుల మనసుల్లో.  రక్తం రంగు మార్చి రొమ్ముధారగా పాలు పేగుబంధువు నోటికి అందించేటందుకు ఇప్పుడు కొత్త తరం తల్లులు ఎందుకో పలు సందేహాలు పెంచుకొంటున్నారు? తల్లి లేని కైలాసవాసుడికి తనను తానే తల్లిగా భావించుకుని చన్నిచ్చి సాకే ప్రయత్నం చేసింది బసవపురాణంలోని బెజ్జమహాదేవి అనే ఓ  మహాతల్లి. హాలాహలం మినహా ఏ అమృతం రుచి ఎరుగని ఆ ఫాలాక్షుడికీ బహుశా తల్లి చనుబాల చవి అంతలా నచ్చినందువల్లనేనేమో ఆ అమ్మకు నిత్యత్వం ప్రసాదించాడు చివరకు. ఆ ‘అమ్మ’లు ఇప్పుడు తమ తాత్కాలికమైన  సుందరాకారాల కోసమని  కడుపున పుట్టిన బిడ్దలను పోతపాలు పాల్చేస్తున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు!  బిడ్డకు తల్లి తన పాలు పట్టించడం ఓ సామాజిక బాధ్యతగా ప్రచారం  చేయవలసిన దుర్గతి ఇప్పుడు ఎందుకు పట్టినట్లు? అమ్మపాలు పట్టించడం పైన ఎందుకు ఇన్ని అపనమ్మకాలు? ఆ అపార్థాలను పోగొట్టేటందుకు తల్లిపాల వారోత్సవాలు’ పేరిట విశ్వవ్యాప్తంగా ఏటేటా కార్యక్రమాలు   చేపట్టబూనడమే అధునాతన నాగరికత సాధించిన ఓ  విపరిణామం.
స్తన్యబంధం:
స్తన్యబంధం ప్రాకృతిక ధర్మం. మాతాశిశువుల పేగుబంధం మరింత బలమైన అనుబంధంగా మలపగల మర్మం స్తన్యబంధంలోనే ప్రకృతి దాచి ఉంచిందని వైజ్ఞానిక శాస్త్రవేత్తలూ ఒప్పుకుంటున్నారిప్పుడు. ఆయుర్వేదం ప్రకారం పసివగ్గు తొలి ఆరు నెలలూ పూర్తిగా తల్లిపాల మీద మాత్రమే ఆధారపడే 'క్షీరద'. జాషువా భావించినట్లు 'అక్షయంబైన మాతృక్షీర మధురధార/ లన్నంబుగా తెచ్చుకున్న అతిథి' గదా బుజ్జి పాపాయి! తల్లి చనుబాలు పసిబాల జన్మహక్కు.   కన్నబిడ్డకు తనివి తీరా తల్లి చన్నివ్వలేని గడ్డు పరిస్థితుల్లో సైతం పాలివ్వదగిన, పాలివ్వగలిగిన , ‘ఉపమాత’ లను పెంచి పోషించి గౌరవించుకున్న గొప్ప కుటుంబ వ్యవస్థ భారతీయులది.
తల్లి దృష్టంతా ఎప్పుడూ బిడ్డ కడుపు నింపడం మీదనే ఉండటం ప్రాకృతిక ధర్మం. ‘భోజరాజీయం’  కావ్యంలో తనను చంపి భోంచేస్తానని హుంకరించిన బెబ్బులికి బెదరలేదు గంగిగోవు. ఆ తల్లి బెంగంతా 'మునుమును పుట్టి.. ఏడెనిమిదినాళ్ల పాటి గలిగి ఇంత పూరియు మేయనేరని ముద్దుల పట్టి' గురించే! రొమ్ము గుద్దినా సరే... కమ్మని పాలు కడుపారా కన్నబిడ్డకు అందించడంలోనే జన్మ సార్థకమవుతుందని తల్లులు తలచే ధర్మకాలం  మనో వేగాన్ని మించి మారుతుండడమే విచారకరం!
శిశువుకు చన్నివ్వడం శరీరాకృతిని వికృతంగా మార్చే హీనచర్యగా మాతలు అపోహ పడటం ముందు మానెయ్యాలి. ఎద బరువులను దిగదింపుకొనే ఆ ఆనందకర స్తన్యయోగం అతివల  అందాలను ద్విగుణీకృతం చేసే సౌందర్య సాధనమని వైద్యనిపుణులు ఎప్పటినుంచే మొరపెడుతున్నారు. అయినా  తల్లుల ఎందుకో పెడచెవిన పెడుతున్నారు! బతుకు పోరులో పెరుగుతున్న ఒత్తిళ్లు పొత్తిళ్ల పాపాయిలను తల్లుల ఒడుల నుంచి ఎడమ చేయడం అధునాతన నాగరికత తెచ్చిపెట్టిన దుష్పరిణామంగా వాపోక తప్పని పరిస్థితులనుంచి ముందు సమాజాన్ని బైటపడవేయక తప్పదు.
ప్రసవానంతరం మూడు రోజులపాటు స్రవించే ముర్రుపాల మీద ఎవరు ఎందుకు అపోహలు ప్రచారంలోకి తెచ్చినట్లో శిశు ఆహార సంస్థల సంచాలకులకే తెలియాలి మరి!  శైశవ దశలోనే రోగనిరోధక శక్తి సామర్థ్యాన్ని అపరిమితంగా అభివృధ్ధి చేసే దివ్యౌషధం ముర్రుపాలు. ఎదిగే దశలో బిడ్డ ఎదుర్కొనే వివిధ వ్యాధులకు నివారణ మంత్రం,  నిదాన మంత్రం  తల్లి ద్వారా అందే ఆ తొలినాళ్ల  క్షీరామృతం.
తాగినంత కాలమే కాదు తల్లిపాలతో మేలు. పాలు తాగించడమనే చిన్న కిస్తీ క్రమం తప్పకుండా చెల్లిస్తే చాలు- శిశువు ముందటి బతుకుకంతా అందుతుందిట ఆరోగ్య బీమా.. మాతాశిశువుల ఆరోగ్య సంరక్షణ బాధ్యుల మాట అది.
తల్లిపాల విశిష్టత:
ఆయుర్వేదంలో నస్యకర్మ విధి కోసమూ, కంటివ్యాధులకంటూ చేసే 'తర్పణ' చికిత్సల కోసమూ ఓ మందుగా వాడడమే చనుబాలకుగల విశేష ఔషధ గుణాలకు తిరుగులేని తార్కాణం. నాలుగు వందల రకాల సహజ పోషక పదార్థాలు రంగరింపు తల్లి రొమ్ముపాల సొంపు.  ఆవు, మేక, ఒంటె వంటి క్షీరదాల పాలు మానవ మాతృమూర్తి స్రవించే క్షీరధారలకు ఎన్నడూ ప్రత్యామ్నాయం కాలేవు. ఇహ డబ్బు సంపాదన నుంచి అసలు దృష్టి మళ్ళించలేని వ్యాపారులు సృష్టించే  డబ్బాపాల గురించి చర్చించడమే వృథా! చతుస్సహస్ర క్షీరదాలలో మానవ జన్మే మహోన్నతమైనదని కదా మహామహుల ప్రభోధ! మరి మనిషికొక్కడికే ఎందుకు ఈ మాతృక్షీరం మీద శషభిష? 'అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కా/ స్వాదించ చను వెఱ్ఱిబాగులాడు' అన్నారు జాషువా చిన్ని పాపాయిని గూర్చి. ఆర్నెల్ల వరకు కేవలం తల్లిపాల మీదే ఆధారపడాల్సి ఉండగా   పుట్టిన ఉత్తర క్షణానే  నోటికి పాలసీసా తగిలించడం శిశువు తల్లిపాల జన్మహక్కును నిర్దాక్షిణ్యంగా అణచడమే!   స్తన్య స్పర్శ హర్షానుభూతి తల్లికీ, క్షీరామృత వర్షానుభూతి శిశువుకీ ఎన్ని జన్మలెత్తితే మళ్ళీ అనుభవానికి అందేను! వృథా భ్రమలతో అమ్మలు అపుర్వానుభవాలకు దూరమవుతున్నారు. దురదృష్టం కాదూ? తల్లిపాలు గ్రోలి ఎదిగే కన్నయ్యలకే లోకమంతా వ్రేపల్లెలా.. లోలాక్షులంతా యశోదమ్మలుగా తోచి.. ఎదిగి వచ్చాక ఎదురు వచ్చే స్త్రీలందరినీ మాతృంఊర్తులుగా మన్నించే సంస్కారం  అబ్బే అవకాశం పోతపాల బిడ్డలకన్నా అధికంగా  ఉంటుదని 'ది జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్' తాలూకు ఓ తాజా వ్యాసం సైతం వెల్లడిస్తోంది మరి!
తల్లిపాలతో శిశువుకు ఎన్నో లాభాలుః
బిడ్డ పేగుల నుంచి విసర్జకాలు తొలుగుతాయి. అలర్జీలు రాకుండా అడ్డుకునే ముర్రుపాలు బిడ్డకు తల్లి ద్వారా దక్కిన  ప్రకృతి ప్రసాదం. శస్త్రచికిత్స ద్వారా పుట్టిన పసికూనలకు కూడా తల్లిపాలు ఉగ్గుతో  తప్పక పట్టించాలని శిశువైద్యం ఉద్బోధిస్తున్నది. తల్లిపాలు బిడ్డ శరీరానికి సమయానిక్ తగ్గట్లు తగినంత నీరు అందిస్తుంది. విటమిన్‌ పాళ్లు ఎక్కువగా ఉన్నందువల్ల తల్లిపాలు తాగే పిల్లలు ఆకస్మిక మరణాల(సడన్‌ ఇన్‌ ఫాంట్‌ డెత్‌ సిండ్రోం)కు గురయ్యే అవకాశం తక్కువ. పేరుకే ఆరు నెలలు. ఆ పైనా ఘన ఆహార పదార్థాలకు పెడుతున్నా.. తోడుగా  రెండేళ్ల ఈడు వరకు తల్లిపాలనుంచి  తప్పించక పోవడం బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరం. తల్లి ఇచ్చే పాలు  సులువుగా జీర్ణమవడం వల్ల జీర్ణకోశ సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం తక్కువ. అంటువ్యాధులు అంత తొందరగా అంటవు. ముక్కు, గొంతు లోపల ఒక రక్షించే పొర ఏర్పడ్డం వల్ల ఆస్త్మా, చెవి సంబంధమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. స్థూలకాయం బెడదుండదు. మానవ సత్సంబంధాలు, మెరుగైన మేధోశక్తి, దృఢమైన జ్ఞాపక శక్తి అదనపు లాభాలు. చనుబాలకు చురుకుపాలుకు మెలికున్నదన్నది శిశుశాస్గ్త్రవేత్తల అభిప్రాయం. తల్లిపాల వాడకం పెరిగిన కారణంగా పోషకాహార లోపాలు తగ్గి 13 శాతం  శిశుమరణాలు పడిపోయినట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ  తాజా గణాంకాలు తెలియ చేస్తున్నాయ్.
***
అమ్మపాలూ విషతుల్యమయిపోతున్నాయి!:
'అను' అంటే ఎడతెగనిది అని అర్థం. బిడ్డకు తల్లికి మధ్య బలపడే అనుబంధానికి తల్లిపాలే జీవాధారం. పూర్వం పాలడబ్బాల పైనా 'అమ్మపాలను మించినవి కావు' అనే ప్రకటన ఒకటి కనిపించేది. అయినా  అపూర్వమైన తల్లిపాల విశేషాలకు ఒకరి యోగ్యతాపత్రాలు, హామీలు, సంతకాలు అంతవసరమా? బిడ్డ పుట్టిన కొద్ది గంటలకు బాలింత గుండెల నుండి పచ్చని చిక్కని ద్రవాలు స్రవిస్తాయి. వైద్య పరిభాషలో వాటిని 'కొలొస్ట్రమ్‌' అంటున్నా 'ముర్రుపాలు' అంటేనే మామూలు తల్లులకు బోధపడేది. పౌష్టిక విలువల దృష్ట్యా ఆ పాలు   సర్వశ్రేష్ఠమైనవి. యవ్వనదశ వచ్చే వరకూ వాటి ప్రభావం మనిషి మీద అపరిమితం. ఆ అమ్మపాలూ ఇప్పుడు విషతుల్యమయిపోతున్నాయి! దిగ్భ్రాంతికరం! అగ్నిని అంటు తాకదు, దర్భకు మైల సోకదు. రుచికే కాదు అమ్మపాలు ఆ రెండింటి శుచికీ ప్రత్యామ్నాయం. కానీ రాజస్థాన్ గంగానగర్‌ జిల్లా అనూప్ గడ్ గ్రామంలో వెలుగు చూసిన నిజాలకు నివ్వెర పోవాలి. పురుగు మందుల వాడకం విపరీతంగా పెరిగడం వల్ల..  శ్వాసించే గాలి, తీసుకొనే నీరు, ఆహారం సమస్తం విషతుల్యంగా మారుతున్నప్పుడు తల్లిపాలు సైతం గరళంగా మారడంలో అబ్నురమేముంది? కంసుడి ఆన మేరకు దాది రూపంలో వచ్చిన పూతన బాలకృష్ణుడిపైన విషప్రయోగానికి పూనుకున్నది. గరళం పులుముకొన్న తన చనుమొనలను చిన్నికన్నయ్య నోటికి అందించి 'నా చనుబాలొక గ్రుక్కెడు ఓ చిన్నికుమార! త్రావుము' అంటూ తామస వాత్సల్యం ప్రదర్శించింది. అమ్మదనానికి, అమ్మపాలు అనే అమృతానికి కళంకం తెచ్చి పెట్టే ప్రయోగాలు పూతనను మించి చేస్తున్న పోతపాల కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండకుంటే పరిస్థితి మొత్తం మళ్లీ చెయిదాటిపోవడం ఖాయం. ఆ కాలకూటం సేవిస్తూ  పెరిగే పిల్లలు అంతు పట్టని వింత రోగాల పాలవుతున్నారని రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర పరిశోధకులు డాక్టర్ ఇంద్రపాల్‌ సోనీ హెచ్చరిస్తున్నారు. విషతుల్యమైన క్షీరం వల్ల  బాలల్లో రోగనిరోధక శక్తి మెల్లగా క్షీణించి వారి మేథోశక్తులు సైతం క్రమంగా హరించుకుపోవచ్చు. పంట పొలాలలో పనీ పాటా చేసుకు బతికే పాటక మహిళల రక్తం, స్తన్యం పురుగు మందుల అవశేషాలకు ఆలవాలమవడం ఆందోళన కలిగించే విషయం!  తల్లి స్తన్యంలో చేరి ముందు తరాలను సైతం కాటేయ చూస్తున్న అవశేష విషశేషువుల సంహారానికి జనమేజయుణ్ణి మించిన మహాసర్పయాగ దీక్షకు సంకల్పం చెప్పుకొనే తరుణం ఆసన్నమయినట్లే! చేతులు కాలక ముందే ఆకులకు వెదకడం బాధ్యులందరి ముందున్న తక్షణ కర్తవ్యం ప్రస్తుతం!
***
కొత్త తరహా పాల వ్యాపారం!:
అమ్మ పాలు ప్రకృతి ప్రసాదించిన తెల్ల బంగారం. తల్లులు కొందరికీ బంగారం మీదే తగని మోజు. పెరుగుతోందట ఇప్పుడు. డిమాండ్ ను బట్టే కమాండ్! అందుకే తన అందచందాలు, ఆరోగ్య విశేషాలు, సాధించిన విజయ గాథలు, విశిష్టమైన ఐక్యూ వివరాలు సర్వం ఏకరువు పెట్టేస్తూ ఓ మహాతల్లి తన స్తన్యంపాలు కావాలనుకున్నవారు వాట్సప్ లో సంప్రదించవచ్చని.. నెలకు ఇంతని బేరమాడుకుంటే  ఆన్ లైన్ ద్వారా సరుకు సరఫరా చేస్తానంటూ కొత్త తరహా పాలవ్యాపారానికి శ్రీకారం చుట్టేసిందీ మధ్య ఆస్ట్రేలియాలో! తల్లిపాల విశిష్టతను తెలియచేసే  భలే పిట్ట కబురు కదూ ఇది!
***
గుళ్లోని దేవుణ్ని అడిగాడుట ఓ సత్యాన్వేషి 'అమ్మ' అంటే ఏమిటని. '   మర్మం తెలిస్తే అమ్మ కడుపునే బిడ్డగా పుట్టనా!' అని దేవుడి సమాధానం. ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారానికి ఒక్క రోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం కురిపించినా సంతృప్తి చెందని విచిత్ర జీవి సృష్టిలో అమ్మ ఒక్కతే. దుర్గ, ఫాతిమా, మేరీ, బుద్ధుడి మేనత్త గౌతమి, బహాయీల తాయి తాహిరి, మహావీరుడి తల్లి త్రిషాల.. మాతృ ప్రేమకు కులమతాలని, దేశ కాలాలని ఎల్లలుంటాయా?  కాలం సనాతనమైనా, అధునాతనమైనా అమ్మ పాత్రలోని సౌజన్యంలో మాత్రం మార్పు ఉండదు. ఆది మధ్యాంత రహితుణ్ని తన అడ్డాల బిడ్డగా మార్చి చన్నిచ్చిన పిచ్చి మహాతల్లి బెజ్జమహాదేవిని చూసైనా నేటి తల్లుల మనసుల్లో చిన్ని మార్పు వస్తే అదే బిడ్దలకు జీవితాంతం శ్రీరామ రక్ష.
***
బహిరంగంగా బిడ్దకు స్తన్యమిచ్చేందుకు ఇప్పుడు కొత్త జంకులు మొదలయ్యాయి స్త్రీలోకం నిండా!
'కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో' అంటూ కైటభదైత్యమర్దనుని గాదిలి కోడలుని సంబోధిస్తున్నా..  పోతన ఆమెను 'ఓ.. మదంబ!' అంటూ తల్లి భావనలో సంభావించాడు . తల్లి ముందు ఓ బిడ్డ, దైవం ముందు ఓ భక్తుడు  'చనుకట్టు' ప్రస్తావన తెచ్చినప్పటికీ మనకు చటుక్కున ఎబ్బెట్టు అర్థం తోచదు. భారతీయుల ప్రాచీన సంస్కృతి మాహాత్మ్యం అదంతా! స్త్రీల వర్ణన వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఈ 'పాలిండ్ల' ఊసు రాకుండా లేకపోవడం గమనీయం. అన్యాపదేశంగా అయినా  అశ్లీషార్థంలో ప్రయోగించి ఉంటే ఆ పదాలకు ఇంత కాలం ప్రాణమే నిలిచుండేది కాదు. భిక్షాటనకని బైలుదేరిన ఓ కఠోర బ్రహ్మచారి పుట్టి బుద్ధెరిగింది మొదలు స్త్రీ ఆకారాన్ని తదేకంగా చూడనెరగని అమాయకత్వం వల్ల  కబళం అందించేందుకని గుమ్మం ముందు కొచ్చిన ఓ తల్లి ఎద పొంగులను చూసి 'అవేమిట'ని ప్రశ్నించాడు. ప్రశ్నలోని నిష్కల్మషతను పసిగట్టిన ఆ అమ్మ  'నాయనా! ఇవి  పుట్టబోయే నా బొట్టి పాపాయికి దైవం సిద్ధం చేసి ఉంచిన రెండు పాల గిన్నెలు' అంటూ సముచితంగా సమాధాన పరిచింది. నారు పోసే వాడు నీరు సిద్ధం చేసి ఉంచుతాడని భారతీయుల నమ్మకం. ఆ ఏర్పట్లలో భాగంగానే ప్రకృతి సిద్ధం చేసి ఉంచిన 'పాల గిన్నెల'ను అధునాతన నాగరీక సమాజం  విపరీత ధోరణుల పాల్పడి  కలుషిత దృష్టితో చూస్తున్నదన్నది  ఆధునిక స్త్రీ లోకంలోని అదికశాతం మహిళల ఫిర్యాదు. తల్లులు బహిరంగ ప్రదేశాలలో బిడ్డలు ఆకలితో కక్కటిల్లిపోతున్నా చనుబాలిచ్చేందుకు జంకుతున్నారు. స్త్రీలలోని ఈ కించబాటును తగ్గించే లక్ష్యంతో  ఉద్యమ స్ఫూర్తితో పని చేయవలసిన అగత్యం  ప్రపంచ వ్యాప్తంగా పలు స్వఛ్చంద సేవా సంస్థలకు ఏర్పడిందీ ఈ కారణంగానే!
***
అప్పుడే పుట్టిన పసికందుకు పుట్టిన మొదటి రోజు నుంచే మాతృక్షీర సేవనం ఉత్తమం.. అత్యవసరం. పెరిగిపోతున్న తల్లుల ‘నవ నాగరీకం వన్నె చిన్నెల ముందు  చిన్నారుల అవసరాలు  చిన్నబోతున్నాయిప్పుడు. తళుకు బెళుకులు తరుగుతాయన్న తల్లుల దుగ్ధలో శిశువులు జన్మహక్కయిన అమ్మపాలకు దూరమవుతున్నారు.
నిన్న, మొన్నటి వరకు బిడ్డ పుట్టిన మూడు రోజుల వరకు తల్లిదగ్గర పాలుండవు. ఉన్న పాలు మంచివి కావు. ఉన్నా సరిపోవు అని వంకలు. అమ్మఒడి నుంచి  దుకాణాలలో అమ్మబడే పాలడబ్బాలకు బిడ్డ బదిలీ అవుతున్నాడు. పోతపాలు పూతన పాలంత ప్రమాదకరం కాకపోయినా యశోదమ్మ తల్లి ఎదబాలకు ఎన్నటికీ సరితూగవు. వ్యాధి నిరోధక శక్తి, ఎదిగే బిడ్డ ఎప్పటికప్పటి అవసరాలు తల్లిపాలలా తీర్చే సత్తా ఎప్పటికి పోతపాలకు సమకూరవన్న సత్యం తల్లులు తెలుసుకోవాలి. పోతపాల పాలపడ్డ పసిబిడ్డలు అడ్డమైన రకాల రోగాల బారిన పడుతూ రోజుకు నాలుగు వేల మంది పైగా మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చూపిస్తోంది. అభం శుభం తెలియని శిశువుల అర్థాంతర  మరణాలకు కారణం  కేవలం  తల్లులకు తమపాలకున్న ప్రాధాన్యత తెలియకపోవడం! తెలిసినా వారికి తగినంత ప్రోత్సాహం, సహకారం కుటుంబం, సమాజం నుండి లభించక పోవడం! పాలపొడి పరిశ్రమల అసత్య ప్రచారాలు, అర్థసత్య ప్రకటనలు తల్లిపాల విశిష్టతను  తక్కువ చేసి చూపడమే మాతాశిశువుల అనుబంధ కావ్యంలోని  అసలు సిసలు విషాద ఘట్టం.
చనుబాలిచ్చే చల్లని తల్లికీ ఎన్నో అవరోధాలుః
నెస్లే కంపెనీ తన ఏడు వేల మంది మహిళా ఉద్యోగులకు జీతభత్యాలతో కూడిన 26 వారాల ప్రసూతి సెలవు దినాల సౌకర్యం ప్రస్తుతం అందిస్తున్నది.  ఎన్ని ప్రయివేట్ కంపెనీలు ఈ తరహా ఔదార్యం తల్లులపట్ల ప్రదర్శిస్తున్నాయో.. వాస్తవమైన లెక్కల్లోకి వెళ్లినప్పుడే డొల్లతనం బైటపడేది. ప్రస్తుతం సమాజంలో బిడ్డకు పాలిచ్చే తల్లికి పాపం ఎన్నో అవరోధాలు.  సమాజం తీరు, అనారోగ్యాలు, పని వత్తిళ్ళు,  సమయ లేమి, కుటుంబ సభ్యుల సహాయ నిరాకరణ, సరయిన వైద్యుల మార్గదర్శనం కరువు, పాలపొడి పరిశ్రమల పటాటోప ప్రకటనలు.. మూలిగే నక్క మీద పడే తాటికాయల మాదిరి మూల మూలలా  ఉండే  మూఢవిశ్వాసాలు.. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు!
సమావేశాలు, సంభాషణలు, సమాచార మార్పిడి ఫోరమ్స్, సహాయక కేంద్రాలు,  సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర ప్రోత్సాహాలు, సహానుభూతితో అందించే ప్రోద్బలాలు  వంటి ప్రక్రియల  ద్వారా ఇంటా బైటా, ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాలలో, ఆడవాళ్లు  నలుగురూ ఒక చోట చేరి సందడి చేసుకొనే శుభసందర్భాలల్లో  తల్లిపాల ప్రాముఖ్యత పైన  సదవగాహన కలగిస్తే చాలు..  తల్లుల మనసుల్లో, కాబోయే అమ్మల గుండెల్లో తారాడే  సందేహాలకు తప్పకుండా సశాస్త్రీయమైన నిర్దిష్ట సమాచారం సమాధానంగా  అందుతుంది. కొత్తగా మాతృత్వ పీఠం మీద అధిరోహించబోయే అమ్మళ్ల మదుల్లో మెదిలే సంకోచాలు, సంశయాలు వంటివి ఇంకేమైనా మిగిలుంటే  సంపూర్ణంగా తొలగిపోతాయి. సందిగ్ధాలన్నీ చల్లగా పక్కకు  సర్దుకుంటాయి.  తాము కన్న   బిడ్డలకు తమ రొమ్ముపాలను మాత్రమే అందించేందుకు అమ్మలకున్న అన్నిరకాల అవరోధాలు తొలగిపోతే మంచి ఫలితాలు మరింత వేగం పుంజుకుని మెరుగైన ఆరోగ్యవంతమైన ముందు తరాల నిర్మాణానికి  దారి మరింత సుగమమవుతుంది. 
తల్లిపాల ప్రాముఖ్యతని ప్రచారం చేయడం ఒక సామాజిక బాధ్యతగా భావించే స్వఛ్చంద సేవా సంస్థలు ఎప్పటికప్పుడు వైజ్ఞానిక ప్రయోగాల్లో నిర్ధారణయే  తాజా సమాచారంతో శిక్షణ పొందడం  నిరంతరాయంగా కొనసాగవల్సిన ఓ ప్రధానమైన కార్యదీక్ష.
బిడ్డ కడుపారా పాలు తాపడం సృష్టిలో తల్లులకు మాత్రమే దక్కే ఓ గొప్ప వరం. పాలిచ్చే వేళ అమ్మ పొందే ఆనందానుభూతి మాతృత్వానికి  మాత్రమే సొంతమైన అనుభవం. రకరకాల కారణాలు చూపించి, కల్పించి  బిడ్డని తల్లిపాలకు దూరం చెయ్యడం  అమానుషం. చనుబాలివ్వడం తల్లికీ బిడ్డకు ఆరోగ్యమే కాదు అది అనాదిగా ప్రకృతి జీవికి ప్రదర్శించి చూపుతున్న ఓ సంస్కారం. అందుకే పాలిచ్చే తల్లికి సమస్త జీవజాతి తరుఫున తలవంచి  నమస్కారం!
(వ్యాసం అయిపోయింది)

అనుబంధాలుః
(అవసరమైన చోట పేర్కొనేందుకై అందిస్తున్న అదనపు సమాచారం)
లా లెచె లీగ్ ఆఫ్ ఇన్ టర్నేషనల్ (LLLI):
లా లెచె లీగ్ ఇన్ టర్నేషనల్ .. సంక్షిప్తంగా LLLI- ఇల్లినాయిస్ లో 1956 లో స్థాపించబడిన స్వఛ్చంద సంస్థ ఇది. ప్రారంభంలో లా లెచ్ లీగ్ అన్న పేరు మాత్రమే ఉండేది. 1964లో కెనడా, మెక్సికో, న్యూజిలాండ్ వంటి బయటి దేశాలూ వచ్చి చేరడంతో లా లెచ్ లీగ్ ఇన్ టర్నేషనల్ (LLLI) గా పేరు మారింది.   ‘లా లిచె’ స్పానిష్ పదం. 'తల్లి పాలు' అని  ఆ పదానికి అర్థం. చనుబాలు పట్టే తల్లుల నుంచి తమ పాలే  పట్టాలనుకునే తల్లుల వరకు అందరికీ వెన్నుదన్నుగా నిలపడటం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ప్రోత్సాహం, సమాచారం, విజ్ఞానం వంటి ప్రక్రియల ద్వారా తల్లి తన పిల్లలకు పాలు పట్టడమనే అంశం మీద విశదమైన సదవగాహన కలిగించే దిశగా దశాబ్దాల బట్టి ఈ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది.
మాతా శిశువుల మంచి ఆరోగ్యం కోసం తల్లిపాలను అనుసంధానం చేసేందుకు ఈ స్వఛ్చంద సంస్థ దాదాపు 89  దేశాలలో ఏళ్ల తరబడి కృషి కొనసాగిస్తోంది. ఈ సంస్థ  వెబ్ సైట్ చిరునామా www.llli.org
తల్లులు రాను రాను సీసాపాల మీద ఆధార పడటం ఆందోళన కలిగించింది కొంతమంది సమాజ సేవా తత్పరులకు. వారంతా ఒక కూటమిగా ఏర్పడి పొంచి ఉన్న ప్రమాదాలను గురించి ప్రపంచాన్ని హెచ్చరించే లక్ష్యంతో ఏ ప్రభుత్వాల ప్రాబల్యంతో నిమిత్తం లేని.. లాభాపేక్ష కోరని సేవకు నడుం కట్టారు. హెర్బెర్ట్ రాట్నెర్ అనే సామాజిక సేవిక ఈ సంస్థ వెనక ఓం ప్రథమంలో గల ప్రేరక శక్తి. సప్త మహిళా శక్తుల సమాహారంగా ఈ లా లెచ్ లీగ్ ఇన్ టర్నేషనల్   స్థాపించే నాటికి అమెరికాలో తల్లిపాల మీద ఆధార పడిన శిశువుల సంఖ్య కేవలం వందకు ఇరవై మంది. కేవలం 425 మంది తల్లులు, వందమంది శిశువులు మాత్రమే హాజరయిన  1964 నాటి చికాగో మొదటి సమావేశం నుంచి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మారు మూల దేశాల పల్లెపటుల్లో సైతం తటస్థించిన ప్రతీ సందర్భంలోనూ లక్షలాది మందికి అడిగిందే తడవుగా సహాయ సహకారాలు అందించ గలిగే  స్థితికి చేరగలిగింది  ఎల్ ఎల్ ఎల్ ఐ! 1981లో అంతర్జాతీయంగా అధికారిక హోదా, 1985లో  యునెస్కో ఇన్ టర్నేషనల్ బోర్డ్ ఆఫ్ లాక్టేషన్ లో కన్సల్టెంట్ కోర్సు పరీక్ష పర్యవేక్షణ బాధ్యతా సంప్రాప్తించాయి ఈ ఎల్లెల్లెల్లెఐ సంస్థకు. 
***
సమృద్ధిగా స్తన్యామృతం వృద్ధి అయేందుకు..
శిశువు మానసికావసరాల సంతృప్తికి తల్లిపాలను మించిన ప్రత్యామ్నాయం లేదు. బిడ్డ ప్రాథమిక ఎదుగుదల దశలో తల్లితో సామీప్యం సైతం ఆరోగ్యకరమైన ఆహారంతో సమానం.    పసికందు ఎదుగుదలలో ఎప్పటికప్పుడు జరిగే మార్పులకు అనుగుణంగా పోషకాలను అందించ గలిగేది ఒక్క తల్లిపాలు మాత్రమే. బిడ్డకు మొహం మొత్తే వరకు తల్లిపాలు అందించడమే సమగ్ర శిశు ఆహార విధానం. ప్రసవానికి ముందు నుంచే  తల్లి  ఉత్సాహవంతమైన జీవితం గడిపితే తల్లిపాలు సమృద్ధిగా  పడేందుకు అవకాశం అధికం. బిడ్డ తండ్రి కాబోయే తల్లితో ప్రేమాస్పదమైన అనుబంధం కొనసాగిస్తే ఆ ప్రోత్సాహం, సామీప్యతల వల్ల  తల్లిపాలలో నాణ్యత సమృద్ధిగా పెరుగుతుంది మనోవైజ్ఞానిక శాస్త్రం నొక్కిచెబుతోంది. తండ్రితోని బంధం బిడ్డ మానసిక ఎదుగుదల దశలో చాలా అవసరం- అని శిశువైద్యనిపుణులు పలు పరిశోధనల అనంతరం నిర్ధారించి చెబుతున్న నిజం.
***
శిశువు సమగ్రాహారం అంటే?
శిశువుకు సమగ్రమైన ఆహారం అందటం అంటే..  సాధ్యమైనంత సమతౌల్యమైన పోషకాలతో కూడిన  విభిన్న ప్రాకృతిక  పదార్థాల సమాహారం అందించడం. బిడ్డలకు తమ శక్తియుక్తుల పట్ల ఆత్మవిశ్వాసం పెంపొందే ప్రశంసలు, పసివారి  అతి సున్నితమైన భావోద్వేగాలను అంగీకరించే  పెద్దల ప్రేమాస్పద స్పందనలు శైశవదశ నుంచే బిడ్డల సక్రమమైన ఎదుగుదలకు దోహదపదతాయన్నది మానసిక శాస్త్రనిపుణుల అభిప్రాయం.
***
బ్రెస్ట్‌ ఫీడింగ్ ఇన్ పబ్లిక్'(BFIP):
బహిరంగంగా తమ బిడ్డలకు చనుబాలు అందించడం ఓ దోష చర్యగా భావించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది మెల్లమెల్లగా. మహిళల హక్కులను కాలరాయడంగానే   ఈ చర్యను నిరసిస్తున్నారు స్త్రీ స్వేఛ్చావాదులందరూ.  శిశువు తల్లిపాలు బహిరంగా సేవించడం మీద పెరుగుతున్న అపోహలను తొలగించడం, సదవగాహన పెంచడమే లక్ష్యంగా పదుగురి దృష్టిని ఆకర్షించేందుకు మాత్రమే ‘బహిరంగ  చనుబాల సేవన’ ఛాయాచిత్రాన్ని ప్రచురించినట్లూ గృహలక్ష్మి పత్రికా  సంజాయిషీ ఇస్తున్నది.
తల్లిపాలను గురించిన అసలు నిజానిజాలు ఏమిటి? పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు తల్లులు కచ్చితంగా తమ పిల్లలకు చనుబాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు పేర్కొంటోంది? యునెస్కో స్థాయిలో జోక్యం చేసుకోదగ్గంతగా  తల్లిపాల అంశం ఎందుకు రచ్చకెక్కింది? ప్రపంచదేశాల్లో ప్రస్తుతం ' బ్రెస్ట్‌ ఫీడింగ్ ఇన్ పబ్లిక్'(BFIP) ఒక ఉద్యమ రూపంలో ఉధృతంగా ఎందుకు సాగుతున్నది?
అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో, విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిరంతరాయంగా కొనసాగించే పలు సర్వేలల్లో పిల్లలకు  చనుబాలు అందించేందుకు  నూటికి ఎనభైమందికి పైగా తల్లులు విముఖత  ప్రదర్సిస్తున్నారు. మిగిలిన ఆ 20 మందిలోనూ బిడ్డలకు బహిరంగంగా చనుబాలు అందించేందుకు జంకుతున్నారు. ఎల్. ఎల్. ఎల్. ఐ సంస్థ ఆధ్వర్యంలో రెండు నెలలకో సారి 'పేరెంటింగ్' పత్రిక ప్రచురిస్తోంది. 'బ్రెస్త్ ఫీడింగ్ టు-డే' అనే ఆన్లైన్ పత్రిక సభ్యులందరికీ అందుబాటులో ఉంచుతున్నది. 'వుమన్లీ ఆర్ట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్(ప్రస్తుతం నడిచేది 8వ సంకలనం), ఫీడ్ యువర్సెల్ఫ్.. ఫీడ్ యువర్ ఫ్యామిలీ, స్వీట్ స్లీప్ వంటి ప్రచురణలు కొనసాగిస్తున్నది. విశ్వవ్యాప్తంగా ఏటా ఆగస్టు మొదటి వారంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ యునెస్కో ఆరోగ్య సంస్థ నిర్వహిస్తునే ఉంది. కేవలం అమ్మపాల వారోత్సవాలతోనే సరిపెట్టకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించి తల్లుల్లో పెరుగుతున్న అపోహలను తొలిదశలోనే తుంచవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకు ఇండియాలో ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖలు, వైద్య ఆరోగ్యశాఖలు సమష్టిగా బాలింతల్లో చైతన్యం కల్పించడం ఎంతో అవసరం. ఆ బాధ్యత నిర్వర్తించడంలో లోపాలు ఏర్పడడం వల్లనే స్వఛ్చంద  సేవా సంస్థల పాత్రకు క్రమంగా ప్రాధాన్యత పెరుగుతు వస్తున్నది.
***
అమ్మపాల కోసం ఉద్యమం:
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, అంతరించిపోతున్న తల్లి పాల సంస్కృతి వల్ల ఏటా వివిధ రోగాలతో దాదాపు 10 లక్షల మంది చిన్నా రులు చనిపోతున్నారు. అంతుబట్టని రోగాల బారిన పడుతున్నారు. పారిశ్రామికీకరణ ఆరంభమైన ప్రాధమిక దశలో పాలపొడులు, డబ్బాపాల ఉత్పత్తి ఎక్కువగా పెరగడంవల్ల చాలామంది తల్లులు పోతపాలపై ఆధారపడి తల్లిపాలు ఇవ్వడం తగ్గించేశారు. శిశుమరణాలు, ప్రాణాంతక దీర్ఘవ్యాధులు దీనివల్ల సాధారణమయి పోయాయి. ఈ సమస్యలను గుర్తించిన కొన్ని శిశుసేవా స్వఛ్చంద సంస్థలు చిన్నపిల్లల రక్షణ కోసం అనేక ఉద్యమాలు ఆరంభించాయి. అలా మొదలైన  ఉద్యమాల ప్రభావం వల్లనే 1990 నాటికి అంతర్జాతీయ పాలపొడుల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆసుపత్రులకు ఉచితంగా పాలపొడులను అందించడం, సబ్సిడీ ధరల మోజు చూపించి పాల పొడులు అమ్ముకోవడం స్వచ్ఛందంగా తగ్గించుకొనేందుకు అంగీకరించింది.
***
తల్లిపాల వారోత్సవాలుః
ఇటలీ దేశం ఫ్లారెన్స్‌ నగరంలో ఇన్నోసెంటి సెంటర్‌. వేదికగా జూలై 30,1990 నుండి ఆగస్టు 1, 1990 వరకు తల్లిపాలపై ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఆ సమావేశంలో  విడుదలయిన ఇన్నోసెంటి ప్రకటన ప్రకారమే ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్‌ అలైన్స్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఏక్షన్‌ ) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు.హెచ్‌.ఓ, యునిసెఫ్‌, బి.పి.ఎన్‌.ఐ.. వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపుతున్నారు.
***
తల్లిపాలు పెరగాలంటే!
 చాలామంది తల్లులు తమ పిల్లలకు సరిపోయేటన్ని పాలు ఇవ్వలేక పోతున్నట్లు మధన పడుతుంటారు. పోతపాలు పిల్లలకు అలవాటు చేస్తుంటారు. తల్లిపాలు ఎక్కువగా స్రవించడానికి ఎన్ని ఎక్కువ సార్లు పాలు చేపితే అంత ఎక్కువ మోతాదులో పాలు చేపుతాయి. బాలింతలు వాము, కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు తప్పక పడతాయి. దోర బొప్పాయి కొబ్బరి కోరులా తురుమి కూర వండుకుని తింటే స్తన్యవృద్ధి సమృద్ధిగా జరుతుతుంది. తన పాలు వికటించి బిడ్డకు వికారం, విరేచనాలు వంటి అనారోగ్యాలు కలుగుతుంటే బొప్పాయిని కాయగానో పండుగానో తీసుకొంటే గుణం కనిపిస్తుంది. బాలింతలకు మెంతుల కషాయం, మెంతికూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వేడి చేసి రొమ్ములకు కడితే పాలచేపు ఉధృతమవుతుంది. ఆవుపాలు, కర్బూజా పండు, పాలకూర, జీలకర్ర, బార్లీ జావ, బొబ్బర్లు, తెలక పిండి ములగాకు కూరలు తల్లిపాల ఉత్పత్తి వృద్ధికి  దోహద పడతాయి,
***
తల్లిపాల బ్యాంకులు
నెలలు నిండకుండానే తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు తల్లిపాలు అందించడం, వ్యాధుల నుండి సంరక్షించడం పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ పీజీ వైద్యవిద్యా, పరిశోధన కేంద్రం (జిప్మర్‌) బాద్యతగా బావించింది. తల్లిపాలు శిశువులకు అందేందుకు  అముధం థైప్పాల్‌ మయాం (ఏటీఎం) పేరిట కొత్త కేంద్రాలను పుదుచ్చేరిలో ప్రారంభించింది. ప్రయాణాలలో  పిల్లలకు పాలివ్వడం కోసం బస్‌ టెర్మినల్స్‌లో ప్రత్యేక గదుల్ని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
-గుడ్లదొన సరోజినీదేవి
***
(ఈ వ్యాసంలోని కొంత భాగం 'మనం' ఆదివారం అనుబంధం - మకుటం -01, ఏప్రియల్, 2018 సంచికలో కవర్ స్టోరీగా ప్రచురితం)








Sunday, February 18, 2018

మాతృభాష.. తెలుగు భాష విశిష్టతలు- మాతృభాషాదినోత్సవ సందర్భంగా మనం ఆదివారం 'మకుటం'లో వ్యాసం



'మనం'  దినపత్రిక ఆదివారం అనుబంధం 'మకుటం'. 21 ఫిబ్రవరి ప్రపంచ మాతృభాషాదినోత్సవం. 
ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నేను రాసి చిరంజీవ!'  ముఖపత్ర ప్రధాన వ్యాసం ప్రచురితమయింది. 
మనం సంపాదకులకు, మకుటం నిర్వాహకులకు మనసారా కృతజ్ఞతలు!

-కర్లపాలెం హనుమంతరావు










-మనం సంపాదకులు, మకుటం సంపాదకులకు 
మనసారా కృతజ్ఞతలు!

Friday, February 16, 2018

'కత'లరాయళ్ళు!- ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం






 ‘ 'స్టోరీ టెల్లింగు' స్టోనేజీనుంచి వికసిస్తూ వస్తున్న కళ. మనిషికీ మిగతా జంతుజాతికీ మధ్యగల పెద్ద వ్యత్యాసం ఈ కథలల్లడంలోనే ఉంది. గొడ్డూగోదాకి అడ్డమైన గడ్డీ మేయాలన్న యావ ఉండదు. అడ్డదారిలో వెళ్లైనా గద్దెలెక్కాలన్న కసి ఉండదు. కనక  కతలు చెప్పుకు తిరగాల్సిన ఖర్మలేదు. పురుగూ పుట్రకి నాలుగ్గింజలు నోటికందితే రోజు గడిచిపోతుంది. కాబట్టి పిట్టకథలు చెప్పుకొనే దుర్గతి పట్టదు.'
మనిషి జన్మకలా కుదరదురా అబ్బీ! చేతకన్నా ముందు కతల్చెప్పడం వచ్చుండాలి.  కష్టం తరుముకొచ్చినా.. దుఃఖం తన్నుకొచ్చినా.. ఉద్వేగం ముంచుకొచ్చినా.. ఉత్సాహం ఉరకలెత్తినా.. కోతులైతే గంతులేస్తాయి. పాములైతే కోరలు చాస్తాయి. పిట్టలైతే పిచ్చిపిచ్చిగా కూస్తాయి. పులులుకా గాండ్రింపులు, ఏనుగులుకీ ఘంకరింపులు కథలు చెప్పే కౌశలం పట్టుపడకే! మనిషొక్కడే తనక్కావాల్సినంత  విషయాన్నికావాల్సినంత మోతాదులో కథావిశేషంగా మలిచి మరీ  బురిడి కొట్టించ గలిగేది.  అలా కొట్టించే విద్యలో ఆరితేరితేనే వాళ్లే రాజకీయాల్లో రాణించేది. దాన్నీ నువ్వు ఈసడిస్తే ఎట్లారా?
బాగుంది బాబాయ్! రాజకీయాల్లో కథనకౌశలం కరువైతే కరుణవాదం ఫలించదనా! కహానీలు  కుదరకుంటే సహోదరత్వం రాణించదనా! కథలు వండే కళ ఎంతలా  వంటపడ్డకపోతే    ఎన్నికల జాతర్లప్పుడు  నేతలు పోతురాజులకు మించి హారతలు పట్టించుకోగలరు?! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదని మహాఘనంగా కతలు చెప్పుకొంటున్నాం గదా! అంటే మనమెన్నుకుంటున్న నేతాశ్రీల బుర్రల్లో అంతలా సృజనాత్మకత సుళ్లుతిరుగుతుందనా అర్థం?’
 ఆ ఎద్దేవానేరా వద్దనేది! రాజకీయాల మీదేనా రాళ్లేసేదీ?'
మరేం మనమంటావ్ చెప్పు బాబాయ్! మంట పుడుతుంటేను ఇక్కడా! ఇవాళా రేపూ కథలు 'రాయని భాస్కరుల'ని కనిపెట్టడమే మా కష్టంగా ఉంటేనూ! అంతరించిపోయే జాతుల్లో కాకి.. పిచ్చుకల్లాంటివి ఏవేవో ఉంటున్నాయని ఊరికే ఆందోళన చెందుతున్నాంగానీ..  కట్టుకతలు చెప్పి నెట్టుకొచ్చే సజ్జు  మాత్రం అంతకంతకూ పెరిగిపోతోందని కంగారు మాత్రం ఎవరం పడ్డం లేదు! రకరకాల కాలుష్యాలు పెచ్చుమీరుతున్నయని  ఆ మధ్య వందలొందల  దేశాలా పేరిస్ లోనో ఎక్కడో  అంతలా బుర్రలు బద్దలు కొట్టేసుకున్నాయి కదా! వాటి వేటికీ ఈ కతల బాపతు హానికరజీవులపైన కన్ను పడలేదు.. ఖర్మ!
మన గురుజాడగారి గిరీశం వారసులెవరన్నా అక్కడా చేరి అసలు విషయాన్నేమైనా పక్కదారి పట్టించారంటావా?!
డౌటా! ఈ కతలరాయళ్లతో వచ్చే చిక్కేఅది.  మనకు తెలీకుండానే వాళ్ల  వ్యూహాల్లో చిక్కడిపోతుంటాం!  తనను  సృష్టించిన  గురుజాడనే పెడదారి పట్టించిన ఘనుడు గిరీశం. ఆ గిరీశానిక్కూడా గాడ్ ఫాదర్లాంటి ఘనులు  తయారవుతున్నారు కదా  రాజకీయాల్లో ఘనపుటడుక్కి ఓ పదైదుగురు లెక్కన? కుంటికథలు చెప్పుకుంటూ ఊరేగే వాళ్లకు అస్సలు గుడ్డిగవ్వంతైనా  విలువ ఇవ్వకూడదు బాబాయ్ నన్నడిగితే !
'ఇప్పుడిస్తున్నారనేనా? ఎందుకురా నీకా ఏడుపు?    
ఏడవక ఇంకేం చెయ్యగలం బాబాయ్ మా బోటి బక్కోళ్లం!  టూ మినిట్స్ లో తయారయ్యే నూడీల్లో నిజంగా అన్నేసి హానికారక  పదార్థాలున్నాయా' అనడిగమా ఆ మద్యన!  రెండు రీములకు సరిపడా నవల  వినిపించిందో తయారుచేసే కంపెనీ! 'కట్టుకున్న దౌర్భాగ్యుడు  కదా! అంత కర్కశంగా పొట్టనెట్లా  పెట్టుకొన్నావమ్మా!  అని ఓ మహాతల్లిని  విచారించిందీ మధ్య మీడియా! అలవాటైన అంతర్జాతీయస్థాయి  అత్యాచారం కథ వినిపించేసింది! లక్షలు కోట్లు గడించిన బడాబాబుల బ్యాంకప్పులకు మాఫీ లవసరమా? అనడిగి చూడు!  ఊకదంపుడు కతలు  ఆపకుండా ఊరుతాయి చట్టసభల బావుల్లో! ఐపిఎల్ వంకతో విచిత్రమైన ఆటొకటి కనిపెట్టి  పిల్లకాయల జేబులు కొల్లగొట్టిన లలిత్ మోదీ గుర్తున్నాడా బాబాయ్?  అప్పనంగా బొక్కేసిన  సొమ్ముకు లెక్కలడిగితే ఎక్కడెక్కడికో పోయి దాక్కున్నాడా?'
'దాక్కునుంటే కథేముందిరా బాబీ! ట్విట్టరు ఖాతా సాక్షిగా రోజుకో ట్విస్టిచ్చే కథ ప్రచారంలో పెట్టి మరీ  పార్లమెంటు మొత్తంతో పేకాటాడేసుకొన్నాడు! దటీజ్ రియల్లీ గ్రేట్!'
' అది గ్రేటా?! జనం మర్చి పోయిన నేతాజీలను గూర్చి  తాజాగా తయారయే కతల మాటో మరి?’ 
'కథలు చెప్పడం కవుల పనేరా! ఒప్పుకుంటాను.. నిజమే!  కానీ ఆ కర్తవ్యం ఏ కవులూ సాకారం చేయడం లేదే! నాయకులే పూనుకొని కథాసాహిత్యానికి న్యాయం చేస్తున్నర్రా బాబూ? మెచ్చుకోకపోతే మానె.. ఈ నొచ్చుకోడాలేంటంట.. విచిత్రంగా!'
'చిత్రంగా ఉన్నాయ్ బాబాయ్  నీ మాటలు! అడ్దదారిలో గద్దెలెక్కిన కుర్ర కుంకలు వాళ్ల వాళ్ల వంశ చరిత్రలను గూర్చి  చెప్పుకొంటున్న పురాణాలు వింటూనే..'
' కన్నవారిక్కాక పక్క పార్టీ కాకాకు వన్నె తెచ్చేందుకా  బిడ్డలు  కతలు చెప్పేది? కాక ఎక్కువైనప్పుడు ఏవో రెండు మూడు కబుర్లు  శృతి మించే వీక్ నెస్ శ్రీనాథుడంతటి కవిసార్వభౌముడికే  తప్పింది కాదురా! అంత మాత్రానికే పాపం కాకమ్మ కథలు చెప్పేవాళ్లని  కేకిరించడమేంటంట? 'కదిలేదీ.. కదిలించేదీ.. కావాలోయ్ నవకవనానికి' అని  మీ  మహాకవి కదా కవిత్వాన్ని గురించి   కలవరించిందీ!’
అహాఁ! అందుకేనా.. సమాజాన్ని ఊరికే కదిలిస్తే ఉపయోగమేంటని ఏకంగా కుదుళ్లతో సహా  కుదిపేస్తున్నదో మన రాజకీయ కతలరాయళ్ళు!'
ఆపరా ఆ దెప్పుళ్ళు! కథాప్రక్రియని మరీ అంతలా కించపరచొద్దు! రిమ్మ తెగులు బ్రహ్మయ్య  ఎప్పుడో భార్యామణికి తప్పు చేస్తూ దొరికిపోయుంటాడు.  నారులకు వట్టి 'సారీ'లు సరిపోతాయా!   స్టోరీలేవో అల్లి మరీ ఆ గండం గట్టెక్కి ఉంటాడా తెల్లగడ్డం బ్రహ్మయ్య. దేవతా ముఖంగా పుట్టుకొచ్చిన కథాప్రక్రియను వృథా చెయ్యడం మాత్రం ఏమంత సబబు? అందుకే కృష్ణావతారంలో  వెన్నదొంగ ఆ కథాప్రక్రియను కంటిన్యూ చేసుంటాడు.  కాళయ్యనూ ఏదో బోళా శంకరుడని బోలెడంత  జాలిపడి పోతాం గానీ.. ఒక ఆలిని పక్కనుంచికొని.. మరో ఆలిని నెత్తినుంచుకొన్న మహానుభావుడు! అయినా   ఆదిభిక్షువనంటూ ఎన్ని  కథలల్లి భక్తగణం చేత ప్రచారం చేయించాడు!  దేవుళ్ల కథలే ఇంత లచ్చనంగా ఉంటే  వాళ్ల కనుసన్నల్లో కదిలే మామూలు   మనుషులం మనం. ముఖ్యంగా ఏదో ఓ  దేవుడి పేరు చెప్పుకుంటే తప్ప పబ్బం గడవని రాజకీయజీవుల్ని మూగమొద్దుల్లా    మూల చేరి మూలగమంటావా? అదేం భావ్యంరా! పాలిటిక్సులో పొర్లే సరుకు కథలు అల్లలేకపోతే సంసారాలే కాదు.. సర్కార్లూ  నిలబడవు. అనుభవం తక్కువ సన్నాసివి నీకేం తెలుస్తాయీ మల్లగుల్లాలు? కతలు కతలంటో ఆ ఎగతాళులే వద్దు.  అమెరికా భారత్ స్నేహ సంబంధాలు ఈ మాత్రమైనా పండుతున్నాయంటే ఇరు పక్షాలు ఒకరి కొకరు వినిపించుకొనే కథావిశేషాలే కారణం. ప్రధాని.. ప్రతిపక్ష నేతలు పది మాటలు అటూ ఇటూ విసురుకుంటున్నా.. అవీ జనం వినోదం కోసం చెప్పుకునే కతలేరా.. నీకు బోధ పడ్డంలేదు  కానీ ఈ మతలబులన్నీ! కహానీలే వద్దంటే ఇహ వెంకయ్యగారి మార్కు  పన్లు వినబడే ఛాన్సుండదు. యువనేతలు వివిధ  జనయాత్రల మధ్య వినిపించేందుకు  'థీమ్'లుండవు. ప్రసార మాధ్యమాల జోరుకిహ    జోషెక్కడేడుస్తుంది?  ఒక్క తెలుగు మూవీలు మినహా  ప్రపంచంమొత్తం ఈ కథాప్రక్రియ చుట్టూతానే కదరా గింగిరాలు కొడుతుండేదీ! స్టోరీలు వద్దంటే ఇహ మళ్లీ స్టోనేజీ యుగంలోకి వెళ్లిపోవడమే!'
మరే! కథలనేవే లేకపోతే ఆదికవి వాల్మీకీ సోదిలో కొచ్చేవాడు కాదు కదా?'
ఆ సోది సంగతేమో కానీ.. ఒక్క సూక్ష్మం  మాత్రం నువ్వు సూటిగా అర్థం చేసుకోవాలిరా అబ్బిగా! తన మానానికి తానేవేవో యుద్దాలు.. తీర్థయాత్రలు చేసుకుంటూ తిరిగే  శ్రీకృష్ణదేవరాయలుకే  కల్లోకొచ్చి మరీ తన పెళ్ళిని గూర్చి  కమ్మని కథలు చెప్పమని  శ్రీకాకుళాంధ్ర దేవుడు ఎందుకు పోరు పెట్టాడంటావ్?! కత్తి తిప్పడంలోనే కాదబ్బాయ్.. కథలు చెప్పడంలోనూ గొప్ప మెళుకువలు పట్టుపడ్డప్పుడే రాజ్యాధికారం రాయలువారి పాలనలాగా   పదికాలాలపాటు పకడ్బందీగా సాగిపోయేది ! హిస్టరీ తెలీని పిల్లతనం నీది! స్తోరీలతో నెట్టుకొచ్చే వాళ్లని గద్దె మీద నుంచి నెట్టి పడేయడం ఎన్ని లక్షల నెటిజన్లను కూడగట్టి అల్లరి పెట్టించినా వల్లయ్యే  పని కాదు! ముందది తెలుసుకోరా! అసహనం నటించబాకరా పిల్ల సన్నాసీ?'   
'ఆహాఁ!  హేమాహేమీలు అలవోకగా ఇచ్చేసే హామీలు,  వాటి మీద అస్మదీలుగా ఉన్నప్పుడు  చేసే 'హైఁ.. హైఁ'లు.. తస్మదీయులుగా మారినప్పుడు కూసే  'హ్హీఁ..హ్హీఁ'లు..   అన్నీ ఈ కథాప్రకియ చుట్టూతానే గింగిరాలు కొట్టే ప్రహసనాలు కదా బాబాయ్! ఈ కుర్చీకతల కిక్కుని గూర్చి  ఓట్లేసే జనమైనా అప్రమత్తం కాకపోతే ప్రజాస్వామ్యానికిహ పర్మినెంటుగా  'జనగనమనే..'! జనం మనిషిగా అదే నా దిగులు'
మరే! బాగుందిరా అబ్బాయ్ నీ  దిగులు కత కూడా! హ్హీఁ.. హ్హీఁ..హ్హీఁ!''కత'లరాయళ్ళు!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రప్రభ దినపత్రిక 17-02-2018 సుత్తి.. మెత్తంగా కాలమ్)


Tuesday, February 6, 2018

ఔరంగ జేబు ఉత్తరం


                                         



తల్లిభాషలో విద్యాబోధన చేయనందుకు తనకు కలిగిన నష్టాలను గురించి ఏకరువు పెడుతూ జౌరంగజేబు తన గురువు ముల్లా సాలేకు రాసిన సుదీర్ఘమైన ఉత్తరం. ఔరంగజేబు ఆ లేఖలో పేర్కొన్న 16 కారణాలలో ఏ ఒక్కటీ ఈ ఇరవయ్యొకటో శతాబ్దపు మన తెలుగువారికి  చెందనివి కాకపోవడం విచారం కలిగించే విషయం.
మహారాహ రాజశ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక కోసం రాసిన వ్యాసంలోని భాగం ఇదిః




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...