Tuesday, January 7, 2020

వివాహమే మహాభాగ్యం-ఈనాడు సంపాదకీయఁ



జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది ఉపనిషత్‌ వాక్యం.
ఋషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో,
దేవతల రుణాన్ని యజ్ఞాలతో,
పితృరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని పెద్దల ఉవాచ.
తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడానికి వివాహాన్ని ధార్మిక సంస్కారంగా ఆచరించే సంప్రదాయం మనది.
'పెళ్లి అనేది ఓ విచిత్ర వలయంలాంటిది. అందులో ఉన్నవారు బయటపడాలని తహతహలాడుతుంటారు. వెలుపల ఉన్నవారు లోనికి వెళ్లాలని ఉబలాటపడుతుంటారు' అని ఓ మేధావి చమత్కరించాడు కానీ, భారతీయ సంస్కృతిలో పాటించాల్సిన నాలుగు ధర్మాల్లో గృహస్థాశ్రమమూ ఒకటి. ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగిడే పొదరిల్లు అది! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు పడగనేల వెర్రితనము...' అన్న వేమన కూడా కామి కానివాడు మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పాడు. ఆ పురుషార్థాన్ని ప్రసాదించేది గృహస్థాశ్రమమే. సుఖదుఃఖాల్లో, కలిమిలేముల్లో సహభాగస్వాములై భార్యాభర్తలు సాగించే సంసారయాత్రకు స్నేహదీపమే దిక్సూచి కావాలి. 'మాయ, మర్మములేని నేస్తము/మగువలకు, మగవారికొక్కటె/' అంటూ 'బ్రతుకు సుకముకు రాజమార్గము'ను నిర్దేశించాడు వైతాళికుడు గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...' అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయతాహస్తాన్ని అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యానికి పట్టం కట్టాల్సింది పురుషుడే.

'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల,్‌ భార్య ఎర్తు' అంటూ కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే సెట్టు పలకడం సున్నా అన్నాడు.
భార్యాభర్తల సాహచర్యం-
సమశ్రుతి చేసిన ఆ పేటికలో బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా తరంగితం కావాలి.
దాంపత్యమంటే-
మూడు ముడులతో పెనవడిన రెండు ఆత్మలు ఒక్కటై వాగర్థాలవలె కలిసి ఉండటం! మనుగడకు మూలమంత్రమైన మమతను గుండె నిండుగా నింపుకొని జీవన మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం! అలకలు-అనునయాలు; విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్‌ కోపాలు-కిలకిల నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు... ఆ వీణ మెట్లపై పల్లవించే గానానికి సప్తస్వరాలై ఊపిరులూదడం!
దాంపత్యమంటే-
ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులే, సప్తాశ్వాలుగా వారి జీవనరథం మలిసంధ్యలోనూ సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే ఆకాంక్షలూరే రెండు గుండెలు- కోరికలు తీరి, ఆఖరి మజిలీకి చేరుకున్నాక 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి వెళ్లాలని...' నిరీక్షిస్తూ ఆర్ద్రమవుతుంటాయి. శృంగార అవసరాల్లేని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే అనురాగమనే రాగలత శోభాయమైనది. లోకోత్తర సౌరభాలతో వెల్లివిరిసేది. పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళిక' అన్నది ముళ్లపూడి రమణీయ భాష్యం.

ఇతర దేశాల్లో మాదిరి కాకుండా మన సమాజంలో కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది వివాహబంధమే. స్త్రీ, పురుషుల మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ-పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు వంటివాటివల్ల వివాహబంధాలు తెగిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిన రోజులివి. కాలానుగుణంగా విలువలూ మారుతుండటంతో- వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేనివారినీ తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది వివాహబంధమేనని తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి పట్టం కట్టేదే. పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని ఇంతకుముందరి అధ్యయనాలు పేర్కొనగా- స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసిక స్వాస్థ్యం చేకూరుస్తుందని తాజాగా వెల్లడయింది. విడాకులు, లేదా జీవిత భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళలకన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగిపోతారని చెబుతున్న పరిశోధకులు- పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్నవారికన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటున్నారు. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ పరస్పర నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ, పురుషులు వివాహబంధంతో ఒక్కటై బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండదు. ఏ తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం రసవంతమే!
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 03 -05 -2010)

Monday, January 6, 2020

రాజధాని ఎట్లా ఉండాలి?- కర్లపాలెం హనుమంతరావు




"ధన్వదుర్గం మహీదుర్గ మబ్దుర్గం వార్క్షమేవ వా।
నృదుర్గం గిరిదుర్గం వా సమాశ్రిత్య వసేత్సురమ్॥"
ఐదు యోజనాల వరకు నీరు లేని మరుదుర్గం, రాళ్లతోగాని ఇటుకలతో గాని పన్నెండు బారల ఎత్తుండి యుద్ధం తటస్తిస్తే కూడా పైన తిరగేందుకు వీలైనంత వైశాల్యంతో ప్ర్రాకారం కట్టుకోడానికి పనికొచ్చే భూదుర్గం, చుట్టూతా లోతైన నీరున్న జలదుర్గంచుట్టూతా మరో యోజన దూరం దట్టమైన చెట్టూ చేమా ఉన్న వృక్షదుర్గం, చతురంగ బలాలతో పరిరక్షితమైన మనుష్యదుర్గం, నాలుగు దిక్కులా కొండలతో చుట్టి ఉండి, లోతైన నదులు, సన్నటి ఇరుకైన మార్గం ఉండే గిరిదుర్గం.. ఇవన్నీ రాజధానికి ఉండే అర్హతలేట. అన్నీ కాకపోయినా వీటిలో కనీసం ఏ కొన్నైనా ఉండే ప్రాంతంలో ముఖ్యపట్టణం కట్టుకోవడం రాజుకు క్షేమం అని మనుస్మృతిలో మనువు నిర్దేశించిన రాజధాని ప్రధానలక్ష్యణాలు. అన్నింటిలోకి గిరిదుర్గం అత్యుత్తమైనది అని కూడా ఆయన అదనపు సలహా!
మరుదుర్గాన్ని మృగాలు, మహీ దుర్గాన్ని ఎలుకలు సంతతి జీవులు, జలదుర్గాన్ని మొసళ్ళు, వృక్షదుర్గాన్ని కోతులు, నృదుర్గాన్ని మనుష్యులు, గిరిదుర్గాన్ని దేవతలు.. ఆశ్రయించి ఉంటారు. కాబట్టి రాజు జోలికి రావాలంటే ముందు ఈ జాతులు అన్నింటితో పెట్టుకోవాలి శత్రువులు అని మనువు ఆలోచన.
గిరిదుర్గాన్ని ఆశ్రయించిన రాజును శత్రువులు హింసించడం చాలా కష్టం. అక్కడ ఒక నేర్పుగల విలుకాడిని నిలబెడితే కింద ఉన్న వందమంది శత్రువులకు సమాధానం ఇచ్చేపాటి శక్తి అమరుతుంది. ఆ లెక్కన వందమంది విలుకాళ్లను పెడితే పదివేల మంది శత్రు యోధులకు పెడసరి కొయ్యలుగా మారే అవకాశం కద్దు.
ఏదేమైనా దుర్గం  రాజులకు అత్యవసరం. ఆ దుర్గం కూడా వట్టి యుద్ధ సాధనాలతో నింపి కూర్చుంటే ప్రయోజనం సున్నా. ధనం, ధాన్యం, వాహనాలు, బ్రాహ్మణులు(ముహూర్తాలు గట్రా పెట్టడానికి కాబోలు), నిర్మాణ శిల్పులు, యంత్రాలు, నీళ్లు,.. ముఖ్యంగా మట్టి (కసవు అన్నాడు  మనువు)నిండి ఉండకపోతే పేరుకే అది రాజధాని.  మనుధర్మశాస్త్రం -పుట  116).
రాజులూ యుద్ధాలూ .. నాటి కాలం కాదు కదా ఇది! ప్రజాస్వామ్యం! ప్రజలు ముచ్చటపడి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఆలోచించినా చాలు.. రాజుకు మించిన అధికారం చేతికి అందివచ్చే కాలం. 21వ శతాబ్ది మార్క్ రాజులకు మనువు చెప్పిన కోటలు గట్రాలతో రాజధానులు కట్టకపోయినా మునిగిపోయేదేమీ లేదు కానీ.. ఎన్నికల్లో ఎడపెడా పోసిన లక్షల కోట్లు రాబట్టుకోవాలంటే ఆర్థికదుర్గాలు   వంటివి మాత్రం తప్పనిసరి. సందర్భం వచ్చింది కాబట్టి మనువు తన స్మృతిలో ఈ రాజధానుల పితలాటకాన్ని గూర్చి ఏమన్నాడో .. జస్ట్.. ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుసుకుంటారనే ఈ రాత!
-కర్లపాలెం హనుమంతరావు
06 -01 -2020

                                                

Saturday, January 4, 2020

ఉల్లికి కన్నీళ్ళు -కర్లపాలెం హనుమంతరావు - సరదాకే



కోస్తే కన్నీళ్ళు తెప్పిస్తుంది. సరే కొయ్యక ముందే కన్నీళ్ళు తెప్పించే గడుసుదనం కూడా కూటి కూరగాయలన్నింటిలో ఒక్క ఉల్లిపాయకే ఉంది. క్రీస్తు కన్నా ఐదువేల ఏళ్ల ముందు పుట్టింది. మనిషి మా బాగా రుచి మరిగిన ఆహార దినుసులలొ ఉల్లిది  అత్యంత ‘ప్రియ’మైన స్థానం! ఆ ప్రియమైన ఉల్లి ‘ప్రియం’
అయినందుకే లొల్లి.

దేశవాళీ ఉప్పుతో స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆత్మాభిమానం మనది! స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఉల్లిగడ్డ విదేశీ
గడ్డ నుంచి దించుకుంటే తప్ప  వంటింటి పొయ్యిలోని పిల్లి లేవనంటోంది! ఉల్లికే కన్నీళ్ళు తెప్పించే ఈ లొల్లి ఇంకెన్నాళ్లో కదా మరి?

ఉప్పు లేని కూర చప్పగా ఉన్నా అదో పెట్టు. ఏ రక్తపోటు జబ్బు దాపురించిందనో సర్దుకోడం కద్దు! ఈ ఉల్లి సిగ దరిగిరి! ఒక్కసారి గాని దీని రుచి
మరిగితిరా! ఎన్నిమాయదారి రొప్పులు వచ్చిపడ్డా.. కోసే వేళ కన్నీళ్లుకోసుకొనే అవకాశం లేని వేళా కన్నీళ్లే!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని వినికిడి. ఆ నానుడి తెలుగువాడి నాలుక మీద పడి యుగాల బట్టి  నానుతూనే ఉంది. 'వాహ్వా.. ఎంత రుచి!' అంటూ సన్నాసుల జిహ్వ సైతం  చాటుగా  పాడుకొనే ఉల్లి సంసారుల అహారానికే కాదు.. అల్పాహారానికీ తప్పనిసరి దినుసు అవడమేట.. ఇప్పటి ఇబ్బందులన్నింటికి ముఖ్య కారణం! పాలకుల పరిహాసాలకి.. జనం సంగతి  సరే.. ఉల్లికే ముందు కన్నీళ్లు  వరదలై  పారే పరిస్థితి!

రాతి యుగం నాటి మనిషికి రోటీలో ఉల్లిపాయ రోటిపచ్చడి కలిపి తినే యోగం ఎటూలేకపోయింది! రాగియుగం నాటి శాల్తీలకు మల్లే  రోజూ రాగి సంకటిలో ఇంత ఉల్లి తొక్కు  నంజుకు తినే లక్కు నేటి మనిషికి కరువుతోంది. మనిషి నాలిక రుచి చూసి ఎన్నాళ్లయిందోనని ఉల్లికే కన్నీళ్ళు కాలువలయ్యే దుస్థితి. 

గుండ్రంగా చెక్కులు తీసి మరీ పింగాణీ పేట్లలో  వడ్డిస్తుంటారు కదా  ఉల్లి ముక్కలు  స్టార్ హోటళ్లలో!   సరదా కోసమైనా సరే సుమా!  ఆ తరహా  ముక్కలు తెల్లారి  రెండు  పంటి కింద వేసుకుంటే.. తెల్లారే సరికల్లా బతుకు తెల్లారిపోయినట్లేనంట!.  రాత్రి నిలవుంచిన ఉల్లి ముక్కలంటే  కొరివిదయ్యాలకు పరమాన్నంతో సమానమని రెడ్ ఇండియన్లకదో నమ్మకం. ఉల్లికే నవ్వాపుకోలేక కన్నీళ్ళు ధార కట్టే వెర్రి విశ్వాసమనా పరిహాసం? ఉల్లి వాసన
చూసినా చాలు.. మాంసాహారం ముట్టినంత  దోషం అంటూ మొన్న మొన్నటి దాకా రేగినఆహార అంటు’ ఉద్యమమో?! ఆహార సామ్రాజ్యంలో ఉల్లి నియంత! ఎవరి అదుపాజ్ఞలకూ అది కట్టుబడి ఉండదు సుమా! మధ్య ప్రాచ్యపు ఈజిప్షియన్ల ఆచారమే అందుకు
ఉదాహరణ.

చెక్కు తీసిన ఉల్లిపాయ చక్రాలు ఈజిప్షియన్లకు  రక్షరేకుల కింద లెక్క. మనిషి తపించే  పరలోక సుఖాలన్నింటికీ గుండ్రటి ఉల్లిపాయ చక్రాలే ఈ లోకంలో సంకేతాలు. ఈజిప్టు  రాజుల సమాధుల గోపురాలు ఉల్లి ఆకారంలో కనువిందు చేయడానికి కారణం కద్దు!  చచ్చి పైకి పోయినా  చక్రవర్తుల బతుకు రాజాలా సాగాలన్న  ప్రజల హైరానాకు ఆ ఉల్లి చక్ర గోపురాలు ప్రతిరూపాలు. పొరపాటున
ఎన్నుకున్న సైతాను నేతల పీడ ఎప్పుడు విరగడవుతుందా  అంటూ కళ్లలో వత్తులేసుకు  ఎదురుచూసే మన తరాలకు నిజంగానే ఇదో వింత విశేషమే కదా!

అంత కన్నా వింత.. సంస్కృతీ సాంప్రదాయాలలో  ఉల్లికి ఇంతటి ప్రాధాన్యమున్నా మధ్య ఆసియా- దాని సాగు విషయంలో మాత్రం ఇంకా చాలా  వెనకంజలో ఉండటం! ఈజిప్టు వంటకాలకు శ్రేష్టమైన రుచినిచ్చే నాణ్యమైన ఉల్లి ఈనాటికీ
పాకిస్తాన్, ఇరాన్ వంటి  తూర్పు ఆసియా ప్రాంతాలలో సాగవడం ఒక విచిత్రం!

కరెన్సీది సాధారణంగా కాగితాల రూపం ఏ  దేశంలో అయినా! కాబట్టే ఏ కలర్ప్రింటింగ్ బట్టీలల్లో అచ్చొత్తించినా అచ్చమైన నోట్లలా దర్జాగా చలామణీ చేయించొచ్చని ధీమా. ఆర్థిక మాంద్యం తిప్పలు తప్పుతాయనే మధ్యయుగాల నాటి కొన్ని ముదురు దేశాలు  ఉల్లిపాయనే నేరుగా కరెన్సీ కింద వాడేసేవి. ఇంటి
అద్దె వంటివి అంటే కొంత వరకు ఓకేనే గానీ..   ఉల్లి గడ్డలు ఓ రెండు కొనాలన్నా ఉల్లి చిల్లరే  ఓ వీశెడు పోసెయ్యడమా?!   కన్నీళ్ళే కాదు సుమా..
ఉల్లిపాయ  నవ్వులూ ఇలా పువ్వుల్లా  వెదజల్లేస్తుంటుంది.   కన్నీళ్లు కార్పించే ఉల్లి ధరలను నేలకు  దింపించేస్తే జనాలు మాత్రం నవ్వుతూ తుళ్లుతూ  పాలకులకు ఉల్లాసంగా ఉల్లిదండలేసి మరీ నీరాజనాలు పట్టేయరా?

ఉల్లికి ఉక్రోషం జాస్తి. గాలిలోని తేమతో  కలసి  పమాదకర ఆమ్లంగా  కోసినోడి కంటి  మీద దాడి చెయ్యాలని అది గంథకం వెదజల్లేది. కానీ మనిషి మెదడు అంతకన్నా చురుకే. మొద్దు నిద్రకు పడే  మన ప్రభుత్వ యంత్రాంగం బాపతు కాదు!
ప్రమాదం ఏ మూల నుంచైనా రానీ.. తక్షణమే నివారణ  చర్యలు చేపట్టే రక్షణ వ్యవస్థ సర్వదా మెదడు అధీనంలో ఉంటుంది.  ఉల్లి బుద్ధి దానికి ముందే తెలుసు.  కాబట్టే వెంటనే కంటి వెంట నీళ్లు కార్పించేసి  రక్షణ కల్పించడం. ఉల్లి కన్నీళ్ల గురించి మన కతలు, కల్పనలకేం గానీ..  ఏ  కోతలు , గీతలు లేకుండానే మరి కోతుల్లాంటి నేతలు తెప్పిస్తున్న కన్నీళ్ల మాటేమిటో?

ఉగాండాలో కూడా ఉల్లికి మా గొప్ప  ఉగ్గండంగా ఉందనే ఊకదంపుళ్ళు  మన నేతాశ్రీలవి. ఉల్లి బెంగ ఆనక.  ముందు ఈ  నేతల వెనకాతల నడిచే దొంగ కతలను గురించి కదా జనం దిగాలుపడాల్సింది?   నీళ్లలో తడిపినప్పుడోకత్తి
పీకకు ఇంత బొట్టు  వెనిగర్ పూసినప్పుడో ఎంత లావు ఉల్లిపాయ నుంచైనా  ఏ గండం ఉండదు.  ఏ ఉపాయాలు పన్ని మరి మనమీ  కోతి జాతి నేతల ఉపద్రవాల నుంచి
బైటపడేదీ?

ఇంకా నయం! ఇక్కడ ఇండియాలో పుట్టబట్టి ఉల్లి కన్నీళ్ల కహానీలు నవ్వుతూ చెప్పుకుంటున్నాం.   అదే లిబియానాలో పుట్టుంటేనా? ఏకంగా తిండి తిప్పలు మొత్తానికే ముప్పతిప్పలు వచ్చి పడేవి ఉల్లి మూలకంగా! లిబియన్లకు వంటా-వార్పంటే  ముందుగా గుర్తుకొచ్చేది  ఉల్లిపాయల తట్ట! ఆ దేశంలో  తలసరి ఉల్లిపాయల   వినియోగం సాలీనా  సుమారు మన  ఇరవై రెండు యూరియా బస్తాల సరుకు! అదీ తంటా!

ఉల్లి తొక్క మందంగా ఉంటే రాబోయే చలికాలంలో ఇబ్బందులు తప్పవనితేలికపాటిగా ఉల్లి పొరుంటే తేలికలో గండం గడిచిపోతుందని ఇంగ్లీషువాళ్ల జనపదాలలో ఆదో పిచ్చి నమ్మకం. తరచూ అంచనాలలో గురి తప్పడం  వాతావరణశాఖవారి నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం కదా మన దేశంలో! ఆ ఉల్లిపొట్టు శాస్త్ర
విజ్ఞానమేంటో  కూస్తింత దిగుమతి గాని చేసుకుంటే  మన పనికిమాలిన  తుఫాను రాజకీయాలకు రవ్వంత తెరపి దొరుకును కదా!

వింటానికైనా చెవులకు  ఇంపుగా ఉంటానికట వందేళ్ల కిందట  న్యూయార్క్ నగరానికి  'బిగ్ ఏపిల్అనే ట్యాగ్ తగిలించడం! అంతకు వందేళ్లకు ముందు నుంచే ఆ  నగరం అసలు వ్యాపార నామధేయం ‘బిగ్ ఆనియన్’ !  'ఆపిల్ చెట్టు కాయలం' అంటూ మా గొప్పలు చెప్పుకునే  మన  నేతల మూలాలదీ అదే తంతు కదా!
తీరిగ్గా తడిమే ఓపికలుండాలే గాని  తల్లివేర్లతో సహా ఆ పిదప నేతల వివరాలన్నీ చివరికి తగిలేది   ఏ ఉల్లి జాతి పిలకల్లోనే.. గ్యారంటీ!
ఆపిల్ కాయ అప్పికట్ల కొట్లలో కూడా అరువుకు దొరుకుతున్నదిప్పుచు! కానీ.. ఉత్తరాన కశ్మీరం నుంచి దక్షిణాన కన్యాకుమారి దాకా ఉల్లి తల్లికే వచ్చి పడింది ఎక్కడలేని   ముప్పందం!

ఉల్లిసాగులో మన దేశానికన్నా ముందున్నది ఒక్క చైనా (సాలీనా 20,507,759 మెట్రిక్ టన్నులు) మాత్రమే సుమా! అగ్రరాజ్యం అమెరికాదీ ( 3,320,870 మె.ట)  మన (13,372,100) కన్నా దిగువ స్థానమే మామా!’ అంటూ మన  సర్కారు మార్కు పెద్దమనుషులు ఎప్పుడూ  ఏకరువు పెట్టే  లెక్కలూ  రెండేళ్ల కిందటి పట్టీ నుండి బట్టీపట్టినవండీ! అయినా ఏ మండీ  లెక్కలు  బీదా బిక్కీ మండే
డొక్కలని చల్లారుస్తున్నాయనీ!

అమెరికన్ సివిల్ వార్ సమయంలో 'ఉల్లిపాయలు ఇవ్వకుంటే  ఉన్న చోటు నుంచి ఒక్కరంగుళమైనా ముందుకు కదిలేదిలేదు.. పొమ్మం' టూ జనరల్ గ్రాంట్ అంతటి మహాశయుడు నేరుగా ప్రభుత్వానికి టెలిగ్రాం కొట్టించాడు! వట్టిగా తినడానికేఅయితే  బుట్టల కొద్దీ ఉల్లిపాయలెందుకు? యుద్ధంలో అయే కోతిపుండ్లు బ్రహ్మరాక్షసులవకుండా  ఉల్లిపాయే ఒక్కటే అప్పట్లో చవకలో దొరికే  యాంటీ సెప్టిక్ మందు.  ఉన్నపళంగా వార్ డిపార్ట్ మెంటువారూ ఉల్లి తట్టలు మూడు రైలు పెట్టెలకు నింపి పంపించిందీ  ఉత్తిగా పెసరట్టులో ఉల్లి కలుపుకు తిని ట్రెంచుల్లో బబ్బోమని కాదు!

ఉల్లి తడాఖా ముందు ఉగ్రవాదులే తలొంచుకోక తప్పని కాలం ఇది! బుల్లి బుల్లి ఊళ్లల్లో బీదా బిక్కీకీ ముఖ్యమైన ఆహారాలన్నీ ఉల్లితో కలిపి తినేవే! ముక్కుతో వాసన చూద్దామన్నా ముక్క సరుకైనా దొరక్కపోవడమే మా ఇరకాటంగా
ఉంది.. చానాళ్లబట్టి!

నెబ్రస్కా బ్లూ హిల్స్ అనే ఓ బుల్లి దేశం ఉంది. అక్కడి నేరస్తుల శిక్షా స్మృతిలో  నేటికీ ఉల్లికి అమిత గౌరవ స్థానముంది! పిరికి మగాళ్లని
గేలిచేస్తున్నట్లుగా పెద్ద టోపీ తలకు తగిలించి తిరిగే మగనాళ్లకు పడే
శిక్ష.. జీవితాంతం  ఉల్లి  ముట్టకుండా భోంచెయ్యడం! ఊతప్పం తినలేని ఉత్తుత్తి బతుక్కన్నా ఉరి కంబమెక్కి మెడకో తాడు తగిలించుకోడం మేలనిఘొల్లుమంటున్నారంట అక్కడి ఫిమేల్సంతా!

ఒలపింక్స్  జరిగిన మొదటి శతాబ్దం బట్టి ఆనియనే  నేటి దాకా ది  బెస్ట్ఛాంపియన్!  ఆ తరహా ఆటల్లో ఎప్పుడూ అఖండ విజేతలుగా నిలిచే గ్రీకులు పుచ్చుకునే  బలవర్థక ఆహారంలో  ఉల్లిపాయే ప్రధానమైన దినుసు. ఇక్కడాఇండియాలో ఇప్పటికీ ఉల్లి కంటికి, కీళ్లకు, గుండెకు మేలు చేసే గట్టి మందే! కానీ ఉల్లి మందుకైనా దొరకడంలేదే! రోగుల మూలుగుల్లో ఉల్లి పాత్రా గణనీయంగా ఉంది!

నవజాత శిశువు మాదిరి ఎనిమిది కిలోలకు అటూ ఇటూగా తూగే ఉల్లిపాయను సాకి మరీ గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కేసాడో ఇంగ్లీషు రైతు సోదరుడు. ఆ మాదిరిగా రికార్డులకు ఎక్కి దిగడాలు వింటానికి హుషారుగా ఉంటాయ్! నిజమే కానీ ఆర్నెల్లుగా ఆకాశానికట్లా ఎగబాకి ఎగబాకి  ఇక దిగొచ్చేది లేదంటూ తెగ జగమొండితనం ప్రదర్శిస్తున్నదే  ఉల్లిపాయ? ప్రపంచ మార్కెట్ గణాంకాల రీత్యా శాఖాహార పంటలలో  ఇప్పటికీ ఉల్లిదే  ఆరో స్థానమేనంట! అయితే ఏంటంట? వంటింట వాసనకైనా ఉల్లి కంటబడ్డంలేదే!  ఏ మహాతల్లి మాత్రం ఎంత కాలమిలా కన్నీళ్ళతో సహిస్తో పొయ్యి ముందు కూలబడుండేది? ముక్కోటి దేవతలూ జస్ట్
కౌంటింగాఫ్ నెంబర్లకేనా? ఏ మూలవిరాట్టుకూ  మనిషి ఉల్లి పాట్లు పట్టనే పట్టవా? చంద్రయాన్ - మూడు  వెళ్ళి వెదికే దాకా వేచిచూసే ఓపిక పెనం ముందు అట్టేసే వంటమనిషికి ఉంటుందా!

సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని వారసులు జనం. టెంకాయకు బదులుగా వంకాయ సృష్టించుకున్నట్లే   ఉల్లికి బదులుగా ఎక్కడో ఏ వెల్లి సృష్టో జరిగిపోతేనో! రచ్చ  రాజకీయాల కోసమైతే ఎట్లాగూ ఏ రాజధానోపౌరసత్వం మాదిరి చిచ్చులో బొచ్చెడు కొత్తవి  ఎప్పటికప్పుడు హాయిగా రగిలించుకోవచ్చు గానీ ముందీ పేదోడి కడుపు రగిలి  నిప్పురవ్వ కార్చిచ్చవక ముందే ఏడిపించే ఉల్లిపాయనా పాడు ధర చెర నుంచి విడిపించమని కన్నీళ్లతో
మొత్తుకుంటున్నాం మహాప్రభో !

కన్నీళ్లు పెట్టించే ఉల్లి తల్లి కంటనే కన్నీళ్లు వరదలై పారుతున్నా నవ్వు తెప్పించే పిచ్చి చేష్టలిట్లా ఇంకా కొనసాగితేనా..  చివర్న కన్నీళ్లు
పెట్టుకునేది ఎవరో తమరికి మాత్రం తెలియదనా స్వాములూ.. నా పిచ్చితనం కానీ!

-కర్లపాలెం హనుమంతరావు
వాట్సప్ +918142283676
***

 (సూర్య దినపత్రిక, 05, జనవరి, 2020 నాటి ఆదివారం సంపాదకీయ పుట ప్రచురితం)

Tuesday, December 24, 2019

కవి కాని వాడు లేనేలేడు! (సరదాకే సుమా1) కర్లపాలెం హనుమంతరావు




బ్రహ్మపురాణం చెప్పనే చెప్పింది ' యుగాంతం సమీపించే కొద్దీ కవి కాని వాడు ఎవడూ ఉండడని! 'న కశ్చిదకవిర్నామ యుగాంతా సముపస్థితా!' అన్న ప్రవచనానికి అదే అర్థం. పురాణాలూ ఇంతలా భరవాసా ఇచ్చినా ఉబలాటానికి తగ్గట్లు తమ దగ్గర వ్యుత్పత్తి సామాగ్రి  లేదని వాపోయే జడపదార్థాలు ఇంకా కొన్ని  కవితామ తల్లిపై కత్తి కట్టడానికి సంకోచిస్తున్నాయ్! తెలుగు సాహిత్యం ఈ ద్రోహం పసిగట్టి ఏదో ఓ ప్రతిచర్యకు పూనుకొనే లోగానే మనిషి పుటక ఎత్తిన ప్రతి జీవీ కనీసం రోజుకో పది పుటల మీద అయినా తోచిన అక్షరాలు గిలక్క తప్పదు! 
తినగా తినగా వేము తీపి అయినప్పుడు  రాయగా రాయగా అక్షరం మాత్రం కవిత్వం కాక ఛస్తుందా? కవులు కావాలన్న జ్వరం ఎంత వేగిరం నిరక్షరాస్యుల వరకూ పాకితే  తెలుగు కవితామ తల్లికి అంత తొందరగా చెర విముక్తి!
మొద్దు నిద్రపోయే బుద్ధిమంతులకు ధీమా కలిగించే   ముఖ్యమైన ఓ  ముక్క బైటకు ఊదాల్నా?  శ్రీగిరి మల్లికార్జున స్వామి అనీ.. ప్రసిద్ధ కవిసత్తములుగా  ప్రఖ్యాతి కలిగించుకొన్న పెద్దలు ఒకరు సాంప్రదాయ సాహిత్యం చండశాసనం చేసే రోజుల్లోనే 'మహాముని(దుష్ట సమాసం), సోంవారం(భ్రష్ట ప్రయోగం) వంటి ఆనాటి వ్యాకరణ సూత్రాలు ఏ మాత్రం సమ్మతించని  పదాల ప్రయోగాలలో తొడగొట్టి మరీ దూకుడు ప్రదర్శించారు.  వారు విరచించిన సోంవార వ్రత మహాత్మ్యం’ లాంటి ఏదో గమ్మత్తైన ఓ  కావ్యం బౌండు బుక్కులో 'అని సూత మహాముని యాద్యుల కెల్ల వినిపించె పసోంవార  విత చరిత్ర! (డి.1019)- ఆంటూ ఎంతో సాహసపూరితమైన (అప్పటి రోజుల బట్టి) ముళ్ల డొంకన దూరి మరీ చూపించారు భావి ఔత్సాహిక కవి సమూహాలకు దారి. అయినా కవిత్వం  ఆధునికోత్తర గోడ కూడా దాటేసి దిక్కు తెలియని ఇంకేదో  దిశగా దూసుకుపోతున్నట్లు చెప్పుకునే  ఈ దశలో కూడా ఇంకా 'ఆ పదం పొసగలేదు! ఈ పదం ఇమడలేదు.. అబ్బే! ఈ మాదిరి డొంకల్లో పడి ఈడ్చుకుపోడం వల్ల కవిత్వానికి వరగబడే వరహాలు, వజ్రాలేం లేవు'  అంటో  వినిపించే నసుగుళ్ళ వల్ల  కవ్విత్వానికి పెద్ద వరిగేదేంలేదం'టూ పెదాలు విరిచే పదారణాల సమీక్షకులకు బెదురుతూ మునుక్కుని  కూర్చోవద్దు!  'పేరు పరుగు పందేలల్లో ' పతకాలే ముఖ్య మనుకునే కాలంలో వెనకెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కద్దు !
ఇంత చెప్పినా నిఖార్సైన ఆగ్ మార్క్ కవిత్వం కోసమే మా కసంతా అంటూ భీష్మించుక్కూర్చుంటానంటారా! మీ ఖర్మం.. ఆ గుంటుపల్లి జగన్నాథకవిగారిలా 
 'శ్రీరంగ చరిత్రము వి/ 
స్తారంబుగ నాంధ్ర కావ్య సరణిని జెప్పే /
 నేరుపు చాలక చింతిల/ 
నాతాతరి స్వప్నమున మహాద్భుతలీలన్ (ఆర్.247) అని కుందుకుంటూ రాయదలుచుకున్న ఆ శ్రీ రంగనాథుని చరిత్రమేదో రాయకుండా  రోజూ నిద్రకు ముందు కుమిలి కుంగిపోవడమొక్కటే మిలిగిపోయేది  సుమా! మీరు నకలు తీయదలుచుకున్న ఆ కవిల కట్ట మరే అకవి చేతిలో గాని పడిందా..  ఆనక మీ ఇష్టం.. అతగాడే రేప్పొద్దున ఏ సాహిత్య అకాడమీకో, తెలుగు విశ్వవిద్యాలయానికో సంచాలకుడైపోయి మీరు బతికి వుండగా
'మహాకవి'  కాదు కదా.. అసలు ‘కవి’ అనే బిరుదు ఛాయలక్కూడా ఛస్తే మిమ్ములను రానివ్వడు గాక  రానివ్వడు! బ్రహ్మాండ పురాణం ఘోషించిన ‘సర్వం కవితామయం’ థియరీ కి మీరొక్కళ్ళు మాత్రమే  బైట ఉండిపోయేది సుమా!
***
కర్లపాలెం హనుమంతరావు,
25 -12 -2019, బోథెల్
వాషింగ్టన్ రాష్ట్రం, అ.సం.రా

(సూచనః కవిత్వానికి నింబంధనలు ఉండే విధానానికి నేనూ నూటికి నూరు పాళ్లు వ్యతిరేకమే! కానీ పేలవమైన వాక్యాలను తునకలు తునకలు గా తుంచి దాన్నే కవిత్వం అనుకోమని ఇబ్బంది పెట్టే  తమ్ముళ్ల, చెల్లెళ్ళ  వత్తిళ్లకూ శుద్ధ వ్యతిరేకం. ఆ దృష్టితోనే పై రైట్-అప్ ను చూస్తే వర్తమాన కవితాలోకం పట్ల నా దృక్పథం కొంత అర్థమవుతుందని వినతి!)
-కర్లపాలెం హనుమంతరావు
24 -12 -2019

Monday, December 23, 2019

ఎలుకలు. ఎలుకలు. ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు!


                                                                     నెవిల్ మాస్కెలిన్

1903
లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లెక్చర్ హాల్
భౌతిక శాస్త్రవేత్త జాన్ అంబ్రోస్ ఫ్లెమింగ్ 20వ శతాబ్దపు ఒకానొక వింతను ప్రజానీకం ముందు ప్రదర్శించేందుకు అన్నీ సిద్ధం చేసుకుని ప్రకటించిన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ వేరెవరో కాదు సుమండీ! వైర్ లెస్ టెలిగ్రాఫ్ ప్రసార సృష్టికర్త మార్కొనిగారి శిష్య పరమాణవు.
గురువుగారి తరుఫున ప్రదర్శనకు పూనుకొని వూరుకుంటే సమస్యే  ఉండేది  కాదు.ఏదో పూనకం వచ్చిన గణాచారికి మల్లే తీగల సాయం లేకుండా సాగే ఆ సమాచార ప్రవాహ వ్యవస్థ  రెండు అనుమతించిన మాధ్యమ యంత్రాల మధ్య ఎవరూ తస్కరించలేనంత పకడ్బందీగా రూపొందించింది అంటూ రెచ్చిపోయి మరీ ప్రకటనలకు తెగబడ్డాడు.

జనంలో అసక్తి కలిగించేoదక ఈ  తరహా కిటుకులు  బాగానే పనిచేస్తాయిగా! వింతను చూసేందుకు జనమూ  తండోప తండాలుగా  పొగయ్యారు! సరిగ్గా అప్పుడే మార్కొనీ నిస్తంత్రీ సమాచార ప్రసార వ్యవస్థ చరిత్ర సృష్టించడానికి ముందే చరిత్రలో మరో వింత నమోదు అయింది.  ఆ వింత పేరే 'హ్యాకింగ్ ' !

ఆంబ్రోస్ ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందే, టెలిగ్రాఫ్ యంత్రం దానంతట అదే  ప్రాణం పోసేసు కుంది. తనకు తానే బోలెడంత సేపు టక్ టక్‌ మంటూ  ' రాట్స్ .. రాట్స్  .. రాట్స్ .. రాట్స్  ... రాట్స్  ( ఎలుకలు.  ఎలుకలు.  ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు) అంటూ కొట్టిందే కొట్టుకుంటూ  షేక్స్పియర్ సాహిత్యం నుంచి కూడా మంచి మంచి పదాలను ఎంచుకుని మరీ  మార్కొనీమహాశయుడు  ప్రభుత్వానికీ, ప్రజానీకానికి చెప్పే మాటల్లోని నిజాన్ని సందేహాస్పదం కింద మార్చేసింది !

ఆ బూటకాలను ఎండగట్టిన మొదటి హ్యాకర్‌   నెవిల్ మాస్కెలిన్! అతగాడు వేసిన బాటలోనే తదనంతరం హ్యాకింగ్ చరిత్రలో చాలా పెద్ద ఘటనలు జరగడం ప్రపంచ చరిత్ర పరిశీలించే ఆసక్తిపరులందరికీ తెలిసిన విషయమే ! అసాంజే మార్క్ స్విస్ బ్యాంకుల ఖాతాల నుంచి పనామా  పత్రాల లీకేజీ  దాకా హ్యాకింగ్ మూలకంగా జరిగిన పరిణామాలలో  మంచివీ ఉన్నాయి .. పాకిస్తాన్ మాజీ ప్రధాని  వంటి వారి  కొంపలు  మంచినవీ ఉన్నాయి! అది వేరే కథ!
ఎలుకల వల్ల ఎల్లప్పుడూ చెడే కాదు సుమండీ . మంచీ జరగుతుందని తెలుసుకోవడమే ఈ మొదటి హ్యాకర్    నెవిల్ మాస్కెలిన్ గారి  కథ సారాంశం! .. కదా !

వైజ్ఞానిక వింతలు : 1 ఎలుకలు.  ఎలుకలు.  ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు!  - కర్లపాలెం హనుమంతరావు

😾😹

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...