Saturday, May 30, 2015


మంచి కథలకు కరువా?
కూటికోసం కూలికోసం పట్టణంలో బతుకుదామని వలస వచ్చే కుటుంబాల వెనక తరచి చూస్తే ఓ సినిమాకి సరిపడే సరంజామా దొరుకుతుంది. ఐనా మన సినిమాలకు కథల కరువు?!
తరతరాలుగా పేదలమీద, బాలలమీద మగువలమీద, మతాలమీద దోపిడీలు, పీడనలు, దౌర్జన్యాలు, దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి కొత్త కొత్త రూపాల్లో. నగరం మరుగులో ప్రాణాలు, మానాలు అరచేత పట్టుకుని విరాటపర్వంలో పాండవుల మాదిరి అజ్ఞాతంగా జీవనం సాగించే  అభాగ్యులను గమనిస్తే ఓ భారీచిత్రానికి సరిపడినంత నాటకీయత దొరుకుతుంది.
నయంకాని రోగంతో అనుక్షణం మృత్యువుతో భీకరపోరాటం చేసే బిడ్డ- బతికుండి అనుక్షణం పడే నరకయాతన చూడలేక చావుని వరంగా ప్రసాదించమని న్యాయస్థానాలను వేడుకునే తల్లి కడుపుకోతలో.. సినిమా మెలోడ్రామాకు సరిపడినంత కథ కనిపించడం లేదా?
మారుమూల పల్లెలో ఓ పేరులేని కానిస్టేబులుకి ఆడబిడ్డగా జన్మించినా.. కాలానికి, సంఘానికి ఎదురొడ్డి మరీ అంతర్జాతీయ వేదికపై ‘నెంబరు ఒన్’ వెయిట్ లిఫ్టరై  నిలిచిన ఆ బాలిక ఎదురీతను చిత్రంగా తీస్తే ఎంత స్ఫూర్తిదాయకం! కొత్తరకంగా చూపిస్తే ఎంత ఆదాయం? ఎన్ని సార్లు దెబ్బపడ్డా ఎప్పుడూ ఆ తుప్పుపట్టిన కక్షలు, కార్పణ్యాల ఫాక్షన్ భీభత్సాలేనా చిత్రనిర్మాతలకు?ఓ ప్రేమ ట్రాకును పారలల్ గా నడిపించడం తాజా విధానం!
నగరం నడిబొడ్డున పట్టపగలు పట్టకారుతో షట్టరెత్తి ఏటీయమ్ లూటీచేశాడో  విద్యావంతుడైన నిరుద్యోగి. దారి తప్పిన ఆ యువకుడి ప్రతిభ వెనక దాగిన చీకటి కోణాలేమిటో పరిశీలించాలేగానీ.. హాలీవుడ్ అమ్మమొగుడులాంటి షాకింగ్ స్టోరీ బైటపడవచ్చు.   యువతమీద సానుభూతితో మంచి కథ రాసుకుంటే సమాజానికి పనికొచ్చే  సందేశమిచ్చినట్లే  కాదు.. సరికొత్త అంశంతో నాలుగు కాసులు  రాబట్టుకొనే అవకాశాలూ ఎక్కువే.. సరిగ్గా హ్యాండిల్ చేయాలంతే! ఆ గుండె ధైర్యాలేవీ ఇవాళ్టి సినీజీవులకి?
అయిదొందలేళ్ళ కిందట కనుమరుగయిందనుకున్న కవిలపిట్ట హఠాతుగా వైయస్సార్ జిల్లా  అభయారణ్యాల్లో కనువిందు చేసి ఎంతోమంది జీవితాల్లొ సంచలనం సృష్టించింది. విని ఆశ్చర్యపోవడం వరకే మన సినీకవుల పని. అదే ఏ హాలివుడ్ రచయితయితేనో!  హాశ్చర్యపోయే ఫక్కీలోమన బాక్సాఫీసులూ బద్దలయ్యే కథ వండుతాడు..
టీనేజీ దాటని ఇద్దరు పిల్లలు సమాజానికి భయపడి చీకటి ఇంట్లో తల్లిశవం పక్కన బజ్జీలు తింటూ నాలుగు నెలలు కాలక్షేపం చేసిన ఘోరం హాలివుడ్ ‘సైకో’ థ్రిల్లర్ని మించి భయపెడుతుంది. ఈ మధ్యనే మన మధ్య జరిగిన ఈ విచిత్రం మన తెలుగు చిత్రాలనేమీ ప్రభావితం చేయలేదు! విచిత్రం! పొరుగునున్న ఏ మళయాళీనో సినిమాగా తీస్తే హిట్ కొడితే మాత్రం ఆ హక్కులు కొనుక్కుని నాలుగు కాసులు రాల్చుకునే ఆరాటం తెగ చూపిస్తాం!
పల్లెటూరంటే పోరంబోకులుగా పిల్లకాయలు తిరిగే ఊళ్లని మాత్రమే మన సినిమావాళ్ల రొటీన్ అభిప్రాయం. అలగాగా చూపిస్తేనే జనం ఎగబడి చూస్తారని ఓ దురభిప్రాయం. కరెంటేలేని ఓ పల్లెలో గ్యాస్ బండసాయంతో మోటారు ఆడించి ఇరవైనాలుగ్గంటలకో ఎనిమిది ఎకరాలకు నీరందింఛాడా యువకుడు! పుట్లకు పుట్లు ధాన్యం పండించిన ఆ అబ్బాయి బడుద్దాయా? ఏటికి ఎదురీదే ఆ రైతుజీవితం సినిమాగా వస్తే ఎంత ఉత్తేజితంగా ఉంటుంది!  ఉత్తమ చిత్రంగా పురస్కారాలందుకుంటుంది! లొల్లాయికథలు అల్లుకోవడమే తప్ప మంచి కథలుమీదకు  మనవాళ్ల మనసు ఎప్పుటికి మళ్ళుతుందో?!
నాసా యువశాస్త్రవేత్త తన ఆయా ఉండే  పల్లెలో బిజిలీ పుట్టించేందుకు పడ్డ తపన హిందీ చిత్రంగా వస్తే దేశమంతా భాషతో నిమిత్తం లేకుండా ఆ 'స్వదేశీ'ని ఆకాశానికి ఎత్తేసింది. ఐనా మన తెలుగు సినిమాలవాళ్ళకు అందులో రవ్వంత వెలుగు కనిపించలేదు?!
చెయ్యిపోతే కాలితో చేతిపని చేసేవారున్నారు. కళ్లు లేకపోయినా భగవద్గీతను బ్రెయిలీ భాషలో తిరగరాసి అంధులకు అందించిందో అమ్మాయి. చక్రాల కుర్చీల్లోనే ఉండనీయండి.. పరుగుపందెమన్నాక అందరికన్నా ముందే ఉండాలన్న పట్టుదలతో ఓపికనుమించి సాధన చేసే పోలియోబాదితబాలలు బోలెడంతమందున్నారు ప్రపంచంలో.’ఫిజికల్లీ ఛాలెంజ్ డ్’ అభాగ్యుల కథలు మాకొద్దని ఎవరన్నా మన తెలుగు సినిమాలవాళ్ళ చెవిలో వూదిపోయారా? కళాతపస్వి విశ్వనాద్ తీసిన మూగ, గుడ్డి జంట ప్రేమకథ తెలుగు సినీనందనవనంలో సిరివెన్నెలలు పూయించలేదా? వార్తాపత్రికలో వచ్చిన ఓ మారుమూల కథనంతో స్ఫూర్తిపొంది కృత్తిమపాదంతో నర్తించే సుధాచంద్రన్ కథను 'మయూరి' చిత్రంగా మలిచి కాసుల పంట పండించారు ఉషాకిరణ్ మూవీస్ రామోజీరావుగారు.
ఏమయిందీ ఆ నాటి నిర్మాతల  కళాభిరుచి? తేలిగ్గా రీళ్ళు చుట్టేసి వారంలోపలే ఐనకాడికి దండుకోవాలన్న వ్యాపారయావేనా టాలీవుడ్డుది? చక్రపాణిగారు చెప్పిన కళాత్మక వ్యాపారానికి ఇహ తెలుగునేలమీద నూకలు చెల్లినట్లేనా?
అడవి బాపిరాజుగారి గోన గన్నారెడ్డి తెలుగులో లేకుంటే ఈ పాటికే ఓ సెల్యులాయిడ్ వండర్ అయివుండేదేమో? కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ఆ నవలనిండా దట్టించి ఉందని తెలియడానికి ముందది చదివుండాలిగా? తీరికున్నవారికి  ఓపిక లేదు.  ఓపికున్నసినీపెద్దల ఓపెనింగ్శు దృష్తి వేరు. దేశభక్తుల పేర్లకు సేలబిలటీ ఎక్కువ కాబట్టి టైటిలు వరకు ఆ పేర్లు పెట్టి రొటీన్ కథలను  వండి వార్చే  కుకవులు ఎక్కువవుతున్నారు. అదే విచారకరం. హాలివుడ్ లో సగం చిత్రాలు నవలల ఆధారంగానే వస్తుంటాయి. వాటినే మక్కీకి మక్కీగా కాపీ కొట్టి కోట్లు కాల్చుకునే బదులు.. లక్షణంగా మన తెలుగు కథలనే సినిమాలుగా తీస్తే నేటివిటీ సమస్య రాదు. క్రియేటివిటీ ఉంటే కాసులే కాసులు. ప్రేమనగర్, మీనా, ఏప్రియల్ ఒకటి విడుదల, బలిపీఠం,  గోరింటాకుల్లాగా.
సామాన్యుల మధ్య నిత్యం నలిగే సాధారణ రచయితలను కదిలించి చూడండి! సాహిత్యంతో నిత్యసంపర్కంగల మేధావుల రచనలను పరిశీలించండి! అసాధారణమైన కథలు బైటపడతాయి. వారం వారం పత్రికలు ప్రచురించే కథనాలు కాస్త ఓపిక చేసుకుని పరిశీలనా దృష్తితో చూడండి! తాజాతాజాకథలకు బీజాలు పడతాయి. టీవీ చానెల్సులో జర్నలిస్టులు  అత్యంత వ్యయప్రయాసలకోర్చి సమర్పించే కొన్ని కథనాలలో ఊహించడానికైనా వీలులేని కొత్త అంశాలు కొన్నిసార్లు తళుక్కుమంటుంటాయి. దండకారణ్యంలో తండాల జీవితాలను పరిశీలించడానికని వెళ్ళిన ఓ మహిళా జర్నలిస్టు అక్కడి మహిళలు వంటిమీద జాకెట్లు వేసుకునే హక్కులకోసం మగవారితో ఎన్నో ఏళ్ళబట్టి సంఘటితంగా పోరాడుతున్నారన్న ఘోరం విని అవాక్కయారు.
ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రేమే జీవితం కాకపోయినా తెలుగు చిత్రాలకు మాత్రం అంతా ప్రేమమయంగానే కనిపిస్తోంది మరీ ఈ మధ్య ఆ ప్రేమ ఎలిమెంటరీ స్థాయికీ దిగింది! ముంబయి భామలచేత చిందులు తొక్కించే చౌకబారు కిటుకులతోనే ఇక్కట్లన్నీ వచ్చి పడుతున్నాయి. ఏ చిత్ర విజయానికైనా కథ, కథనాలే ప్రాణమని తెలిసీ.. సరిగ్గా ఆ ఆయువుపటుమీదే సినిమాజీవులు  చావుదెబ్బ కొట్టుకంటున్నారంటే అంతకుమించిన ఆత్మహత్యాసదృసం ఇంకేముంటుంది?!
పొరుగు చిత్రాల పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉందా? మంచికథలతో అప్ప్డప్పుడైనా కొన్ని విజయాలు సాధించుకుంటున్నారు అక్కడివారు. అక్కడ విజయవంతమైన చిత్రాలను కొని  అతకని కథనాలతో చేతులు కాల్చుకునేకన్నా నేరుగా తెలుగు కథలనే నమ్ముకుంటే ఇన్ని అపజయాలు తరుముకొస్తాయా?
ఇవాళ ఇంటికొకడు అమెరికాలాంటి దేశాలకు వెళుతున్నాడు. కనీసం పోవాలని కలలు కంటున్నాడు. పల్లెటూరి ఇల్లాళ్ళు సైతం సంసారాలు భర్తలమీద వదిలేసి  అరబ్బుదేశాల విమానాలు ఎక్కుతున్నారు. బతుకు తెరువుకోసం దిగువ మధ్యతరగతి చేసే జీవనపోరాటం వెనక ఎంత కుటుంబహింస ఉందో గమనిస్తే గుండె తరుక్కుపోయే కథలు బైటకొస్తాయి.  అమ్మాయిల్ని ప్రేమలో పడెయ్యటమే అబ్బాయిల అంతిమ జీవనసాఫల్యం అన్నట్లు.. ఆ లక్ష్యసాధనలో ఎంత హింస జరిగినా పుణ్యకార్యం చేసినట్లేనని సమాజం భావిస్తున్నట్లు.. అదే పాయింటు చుట్టూ.. ఎన్ని బొప్పిలు కట్టినా.. కథలు అల్లుకుని బొక్కబొర్లాపడే తెలుగు సినిమా జీవులను చూసి నవ్వాలా..ఏడవాలా?
చిత్రం అంటే వినోదమన్న మాట నిజమే కానీ.. ఆ వినోదం వంకతో వంకర వ్యాఖ్యానాలు చేసే చిత్రాలు సమాజానికి నిజానికి  చేసే చెరుపు అంతా ఇంతా కాదు. గతంలోనూ మాయాబజారు, మిస్సమ్మ, జగదేకవీరుడు, గుండమ్మ కథ లాంటి వినోద చిత్రాలు రాలేదా? వాటి విజయానికి కేవలం హాస్యమొక్కటే కారణం కాదు.  కథ నేల విడిచి సాము చేయకపోతే.. సగటు ప్రేక్షకుడి లోకంలోనే నమ్మదగిన రీతిలో సంచారం చేస్తే  సంచలన విజయాలు నమోదు చేసుకోవడం కష్టసాధ్యం కానే కాదు.
తాజాదనమంటే అతకని పాశ్చాత్య జీవన విశృంఖలత కాదు. యాక్షన్ చిత్రమంటే ఫ్యాక్షన్ ఫిక్షను అసలే కాదు. సెంటిమెంటు పండించడమంటే తల్లుల్ని పొగిడి తండ్రులతో వెకిలిగా ప్రవర్తించడం అసలే కాదు. ఇవాళ్టి తెలుగు చిత్రాలలోని లోపాలను ఎత్తి చూపడం కంటే జల్లెడలోని చిల్లుల్ని లెక్కపెట్టడం తేలిక.
కథలకు కరువు ఎప్పుడూ ఉండదు. అంతర్జాలంలోకి ఓ సారి తొంగి చూడండి. అంతర్జాతీయంగా తెలుగువాడు ఎలా వెలిగిపోతున్నాడో  అర్థమవుతుంది. ప్రపంచస్థాయి నెంబర్ వన్ సాఫ్టువేరు మైక్రో సాఫ్టుకి మన తెలుగు వాడు సత్య నాదెండ్లే సారథి. అనంతపురం బండమీదిపల్లె బుల్లోడు ఒకప్పుడు బుష్ ఆంతరంగిక సలహాదారుల్లో ఒకడు. బిల్ క్లింటన్ కి డ్వాక్రా మహిళతో కలిసి స్టెప్పులేయడం ఇష్టం. బిల్ గేట్ స్ కలకత్తాదాకా అని వచ్చి భాగ్యనగరం సౌందర్యంమీద మనసు పారేసుకుని పోయాడు! తెలుగు మహిళ కట్టు, బొట్టు ఖండాతరాల్లో సింగార పతాకం ఎగరేసింది ఎప్పుడో! మన యోగామీద ప్రపంచం చైనా కుంగ్ఫూ కన్నా ఎక్కువ మోజు పడుతున్నది కనకనే ఐక్యరాజ్యసమితి దానికో రోజు ప్రత్యేకంగా కేటాయించిందీ మధ్య. భగవద్గీతను రష్యన్లు ఉగ్రవాద సాహిత్యంగా పొరబడి నిషేధించడానికి పూనుకుంటే ప్రపంచమంతా ఉత్తుత్తినిరసనలు మారుమోగాయా? మన  మంగళంపల్లి బాలమురళికి ఫ్రెంచి ప్రభుత్వం సంగీత సంబధమైన సర్వోత్తమ పురస్కారం అందించిందా మధ్య. మన తెలుగు పిల్లల సాఫ్టువేరు విజయగాథలు ఎన్ని గంటలు చెప్పుకున్నా తరిగి పోనివి.
ఇవన్నీ నాణేనికి ఒక వైపు. మరో వైపు బక్కెటు నీళ్లకోసం మైళ్ళు మైళ్ళు నడిచి వెళ్ళి పాతాళంనుంచి రెక్కలు విరుచుకుని చేదుకునే చేదు అనుభవాలు.  ‘ఫ్రీ- సెక్సు’ మన సంస్కృతి కాకపోయినా  అడుగడునా  పంజాలు విసిరే పులిరాజాల జోరు రోజురోజుకు ఎక్కువవుతున్న తీరు. విదేశీ మహిళనైనా అత్యంత పధాన శక్తిగా నెత్తిన పెట్టుకున్న జాతిలోనే ముక్కు పచ్చలారని బాలికలకు పరువు హత్యల బెదురు. ప్రపంచ సుందరులూ ఇక్కడినుంచే. తెల్లతోలు కనకే అధికారం అప్పగింతలన్న అవాకులు చెవాకులూ ఇక్కడనుంచే!. చీడను చంపలేని పురుగుమందు అన్నదాత ఆత్మాహుతి క్రతువులో మాత్రం ఎన్నడూ విఫలమవడం లేదు! అవినీతిలో మన దేశం ఎప్పుడూ అగ్రస్థానంనుంచి దిగింది లేదు. సాగునీటి పథకాల ఉచ్చులో చిక్కుకున్న సామాన్యుడు  వరద ముంచుకొస్తే మాత్రం ఇంటి కప్పునుంచి దిగడం లేదు. అన్నం పెట్టని సర్కారు పథకాలు.. గన్నులు పట్టిన రక్షకభట వర్గాలు.. అన్నింటి గురి సామాన్యుడి ఊపిరిమీదే! వత్తిళ్ళు, అనారోగ్యం, నిరుద్యోగం, పరాయీకరణ, పాశ్చాత్యీకరణ, విచ్చిన్నమవుతున్న మానవ సంబంధాలు, నిలకడ మరిచిన రూపాయి నడక,    కూలిపోయే కుటుంబ విలువలు, మతాంతరీకరణలు.. అన్నింటికీ మించి  నొప్పి తెలియకుండా చీపులిక్కరు గొంతులో  వంపే తీరులో ఇప్పుడీ నీతి మాలిన  కథలతో తెలుగు చిత్రాలు! 
కథలు పుట్టాల్సింది మనిషిని చైతన్యపరిచే సమస్యలోనుంచా? కడప తరహా బాంబుల,భీభత్స ప్రయోగాల  నుంచా? కరువు కాటకాలు వర్ధిల్లుతున్నంత కాలం కథలకు కరువుండ కూడదు న్యాయంగా.  కానీ తెలుగు సినిమాలకు కథల కరువు?!  మంచి చిత్రాలు మనం చూడలేకపోవడానికి  కారణం మంచి కథలు  కరువై కాదు. మంచి కథలతో చిత్రాలు చేద్దామన్న సంకల్పం సినీజీవులకు కరువవడం వల్ల!
***




జాబిల్లి- అంతర్జాతీయ పత్రిక పరిచయం


చిన్నపిల్లల్లో మన జీవనవిధానం , మన మూలాలు , తెలుగు, మన సంసృతి , సాహిత్యాలపై ఆసక్తి పెంచటానికి బాల సాహిత్యం వారికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మనదే. అందుకు మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి ఒక వేదికను తయారు చేసారు. అదే జాబిల్లి.
జాబిల్లి నిర్వహణలో చిన్నలు , పెద్దలు , రచయుతలు అందరూ పాల్గొనాలని నిర్వాహకుల ఆశ. తలో ఒక రచన చేసినా మంచి సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చు.
జాబిల్లిని ప్రోత్సహించండి. జాబిల్లికి రచనలు పంపండి
http://jabilli.in/

Wednesday, May 27, 2015


శ్రుతిమించుతున్న రాగం
మోదీజీ ఏడాదిపాలన ప్రచార ప్రహసనం
మోదీజీ పాలనకు ఏడాది  గడిచిన సందర్భంలో గత కొన్నిరోజులుగా మీడియాలో మరీ ‘మోత’ ఎక్కువైపోయింది. సినిమా విజయోత్సవాలను తలపిస్తున్నదీ  హడావుడి. అవినీతి అంతరించిపోయిందని, విదేశాల్లో భారతీయుల ప్రతిష్ఠ అమాంతం ఆకాశాన్నంటుకుందని, విదేశీపెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతున్నాయని, ధరలు పెరగడం ఆగిపోయిందని, సాధారణ పౌరుడికి జీవితంమీద కొత్త భరోసా ఏర్పడిందని, స్వచ్చతా ఉద్యమం అట్టడుగుస్థాయికి చేరిందని.. ఇలాగా ఎవరి ఊహలకు తోచినట్లు వాళ్ళు చిలవలు పలవలుచేసి మోదీజీ గొప్పతనాన్ని పోటీ;ఉ పడి మరీ చాటుతున్నారు.  ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న కారణాన వారి నిరసన స్వరం ఈ సంతగోలలో సామాన్యుడి చెవిదాకా చేరే అవకాశం తక్కువ. అదలా పోనీయండి! ఏ రాజకీయపక్షంమీద ప్రత్యేకంగా ఆపేక్షలేని ఓ ఆలోచనాపరుడైన సామాన్యుడు మోదీజీ పాలనగురించి ఏమనుకుంటున్నాడో.. ఎవరైనా ఆలోచించారా?!
పదవీ ప్రమాణ స్వీకారోత్సవసందర్భంలో మోదీజీ ఆహ్వానంమీద ఇక్కడికి చాలామంది  దేశాధినేతలే తరలివచ్చారు. అంతమాత్రం చేత వాళ్ళకు ఆయా దేశాల్లో ప్రతిష్ఠ పెరిగిందని అనుకోలేం. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజ సక్సే ఇక్కడి కొచ్చిపోయిన ఏడాదిలో జరిగిన  ఎన్నికల్లోనే ఘోరంగా ఓడిపోయారు. ఆయన మన తిరుపతిదాకా వచ్చి  ఏడుకొండలవాడిని దర్శించుకొన్నా ఫలితం దక్కనేలేదు. అమెరికా అధ్యక్షుడు, ఆయన మంత్రివర్గ సహచరులు ఏటికేడాదీ ప్రపంచదేశాల్లో చక్కర్లు కొడుతుంటారు. అంతమాత్రం చేత అమెరికాలో వాళ్ల ప్రతిష్ఠ ఇనుమడించినట్లా? ప్రధానిపదవి అలంకరించిన వెంటనే మన మోదీజీ  విదేశాలవెంటబడి అదేపనిగా తిరగడం మనకి ఏ విధంగా గౌరవప్రదం?! ఏ దేశప్రతిష్ఠ అయినా విదేశాల్లో పెరగాలంటే ప్రధానంగా కావాల్సింది ఆర్థికపరిపుష్టి. రూపాయివిలువకు స్థిరత్వం కల్పించకుండా విదేశాల్లో ప్ర్రతిష్ఠ పెరిగిందని ప్రచారం చేసుకోవడం తమాషాగా ఉంది.
విదేశీపెట్టుబడులు ధారాళంగా రావడమనేది .. అంకెల రూపంలో నివేదికలు వస్తేగాని  నిగ్గుతేలే విషయం కాదు. అప్పటివరకు ఏం మాట్లాడినా అమాయకులను ఆకటుకునే కోటలుకిందకే వస్తాయి న్యాయంగా.
అవినీతి ఆగిపోయిందని మోదీజీ భక్తులు మహాజోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒక రేషను కార్డుకోసం సర్కారు దఫ్తరుకి వెళ్ళివచ్చిన పౌరుడు చెప్పాలి ఆ మాట. బడ్జెటు సంవత్సరాంతంలో  నానా తిప్పలు పడి తెప్పించుకున్న  పాత బకాయిలు  బ్యాంకు కాతాలో పడాలంటే  తత్సంబంధిత అధికారిగారి పచ్చసంతకం తప్పనిసరి. మునుపటి యూపియే హయాంలో మాదిరిగానే 10% వాటాగా అచ్చుకుంది నాకు తెలిసిన విశ్రాంత ఉద్యోగిని!  అవినీతి ఆగిపోయిందెక్కడ? ఎందుకు ఆగిపోతుంది? ఎన్డియే సర్కారేమన్నా ప్రత్యేకంగా  చట్టాలు తెచ్చి  చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టిందనా? పైపెచ్చు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటక హైకోర్టు విముక్తి చేసీ చేయంగానే జయలలితమ్మను బహిరంగంగా అభినందించారు మోదీజీ! అవినీతికి వ్యతిరేకంగా సర్కారు గట్టిపట్టుదలతో పనిచేస్తుందనడానికి ఇలాంటి సంకేతాలేనా జనాల్లోకి మోదీజీ పంపించాల్సింది?! అధికారంలోకొచ్చిన మొదటి ఏడాదిలోనే అవినీతి భాగోతాలు వెలుగు చూడవు. కాగ్ నివేదికలు వచ్చిందాకా టూజీ స్కాంలు బైటపడలేదు! వినోద్ రాయ్ వంటి మొండి అధికారి  నిజాయితీగా నిగ్గు తేల్చిన తరువాతే బొగ్గు కుంభకోణం చర్చనీయాంశమైంది. మీడియా  వాసనపట్టి బొఫోర్సు అక్రమం పట్టుదలగా బైటికి తీసిందాకా రాజీవ్ గాంధీ ‘మిస్టర్ క్లీనే’!   మోదీజీమీద నేరుగా ఏ ఆరోపణలు లేకపోవచ్చు. కానీ ఆయన మంత్రివర్గ సహచరుల నిర్వాకాలమీద రోజుకో ఆరోపణ వెల్లువెత్తుతున్నది. వేటిమీదా నోరైనా మెదపకుండా అవినీతి రహిత పాలనంటూ జనాలనలా ఊదరగొట్టడం పాత పాలకుల పాత రాజకీయమే!
నల్లధనంమీద ఎన్నికలముందు మోదీజీ చేసిన యాగీ?! ప్రధానిపీఠంమీదకు ఎక్కిన తరువాత ఎందుకయినట్లు మూగి?!
పేరు పేరునా  బ్యాంకు కాతాలు తెరిపించి జీవితభీమా ప్రీమియాలు కట్టించినంత మాత్రానే సామాన్యుడికి జీవితంమీదున్న భయాలన్నీ తొలగిపోతాయన్న అంచనాకు రాలేం. బీమా కంపెనీలతో సామాన్యులకి గతంలోగల అనుభవాలు అంత మధుర స్మృతులేమీ కావు. క్లెయిము చల్లింపుల సమయంలో కూడా మోదీజీ సర్కారు ఇంతటి ఉద్యమస్ఫూర్తినే ఆర్థికసంస్థల్లో నిలిపుంచగలిగితేనే ఈ పథకాలు విజయవంతమైనట్లు లెక్క. దానికి ఇంకా వ్యవధానముంది.
ధరల పెరుగుదల ఆగిపోయిందని సర్కారు లెక్కలు కాదు నిగ్గు తేల్చాల్సింది.  మాజీ ప్రధాని మన్మోహన్ జీ ప్రభుత్వం పదమూడు రూపాయల చిల్లర రోజువారీ ఆదాయంగా వచ్చినవారినల్లా  కుబేరుల జాబితాలో వేసి దేశార్థికస్థితి అద్భుతంగా ఉందని జోకులేసింది!  ధరల స్థిరీకరణకు సర్కార్ల స్థాయిలో కొత్తగా  వచ్చిన గొప్ప చట్టాలు ఏమిటో? వాటిని ఉల్లంఘిస్తున్న వారిమీద తీసుకుంటున్న గట్టి  చర్యలేమిటో? ఏవీ చెప్పకండా చందమామ కథలు  వల్లిస్తే జీవనవ్యయభారాన్ని ప్రత్యక్షంగా అనుభవించే సామాన్య పౌరుడు విశ్వసిస్తాడనేనా?!
మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అందులోనూ మోదీజీవంటి మాటకారి సంగతి వేరే చెప్పనవసరమే లేదు. ఏ ప్రభుత్వ వాస్తవ స్వరూప, స్వభావాలైనా అవి తెచ్చే బిల్లులు, వాటిని చట్టబద్ధం చేసే తీరునుంచి మరుగు పడలేవు. బీమా, బొగ్గు,  విదేశీ పెట్టుబడులు, గనులు, ఖనిజవనరులు, కంపెనీ చట్టాలు వంటి రంగాల్లో అత్యవసరాదేశాల ద్వారానైనా సరే పాలన సాగించడానికి చూపించే పట్టుదలలో పదోవంతు లోకాయుక్త, లోక్ పాల్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధం వంటి ప్రజాస్వామ్యస్ఫూర్తిని పెంచే అంశాలమీదా చూపిస్తేనే కదా మోదీజీ సర్కారు ప్రజల పక్షాన, అవినీతి రహిత సుపరిపాలన తెచ్చేప్రయత్నం నిబద్ధతతో  చేస్తున్నదని సామాన్యుడు  నిస్సంకోచంగా నమ్మడానికి!
స్వచ్చ భారత్, భేటీ బచావ్, పఢావ్, నీతి ఆయోగ్ వంటి నూత్న పథకాలా? కొత్తగా వచ్చిన ఏ ప్రభుత్వమైనా తన సొంతముద్రకోసం ఏవో కొన్ని  కొత్తపథకాలని ఆర్భాటంగా మొదలెట్టడం  సర్వసాధారణంగా జరిగే వ్యవహారమే. మోదీజీ వచ్చిఏడాదిమాత్రమే అయింది. ఈ అతితక్కువ సమయంలో ఆయన పాలనాసామర్థ్యాన్ని తక్కువ చేసి చూపడం మంచిపద్దతి కాదని తెలుసు. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిజంగానే సామాన్యుడి జీవనప్రమాణాల్లో  సగుణాత్మకమైన మార్పులు తెచ్చే పదకాలు చిత్తశుద్ధితో ముందుకు తెస్తామంటే ఆనందించని ప్రజాస్వామ్యవాది ఎవరు? అభ్యంతరమల్లా ఒక్క పన్నెండు నెలల పాలనాభాగ్యానికే  భూమి బద్ధలైపోయేటంత సంస్కరణలు తెచ్చేసినట్లు మోదీజీ, ఆయన తైనాతీలు తతిమ్మా పాలనా వ్యవహారాలన్నీ అటకెక్కించేసి బూరాలు వాయిస్తూ ఊరూరా  తిరగడమే సిల్లీగా ఉంది!
స్మార్ట్ సిటీలు, గంగా ప్రక్షాళనలు, నదుల అనుసంధానాలు వంటి భాజపా ప్రతిష్ఠాత్మకమైన ప్రణాళికలు కేబినెట్ గడప దాటి బైటపడడానికే ఏడాది కాలం సరిపోవడం లేదు! అయోధ్య ఆలయ నిర్మాణం, భగవద్గీతను అధికార గ్రంధంగా చెయ్యడం, మతాలమీద పరోక్ష దాడులు, ప్రజాస్వామ్య సూత్రాలకు ఏమాత్రం అతకని అంశాలు. ప్రజాపాలనలో ఏ మాత్రం జోక్యం కూడని  అధ్యాత్మిక వర్గాలు అడపా దడపా దడుపు పుట్టించే విధంగా హెచ్చరికలు జారీచేస్తున్నా  ప్రధానిస్థాయిలో మోదీజీ 'మౌనమే నా భాష మనసా!' అనే రీతిలో ప్రతిస్పందన లేకుండా ఉండడం ఏ విధంగా అర్థంచేసుకోవాలి?
దిల్లీ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వానికి మధ్య నడుస్తున్న యుద్దంలో మోదీజీ సారథ్య ప్రభుత్వం సంపూర్ణ ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ప్రవర్తిస్తున్నదా? భూసేకరణ ఆర్డినెన్సుని ఎలాగైనా చట్టంగా మార్చితీరాలన్న మోదీజీ పంతంవెనక సామాన్య అన్నదాతకు వెళుతున్న సంకేతాలు ఏమిటి? మోదీజీ విదేశీపర్యటనల్లో అస్తమానం నీడలాగా అనుసరిస్తూ వస్తున్నవారంతా  కొద్దిమంది పారిశ్రామిక పెద్దలే కావడం కాకతాళీయమా?  కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో   తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ధనిక, పారిశ్రామిక వర్గాలకు పనిగట్టుకొని ప్రతికూలంగా ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు కానీ..  మెజార్టీ నిర్ణయాలు  వారికి మాత్రమే అనుకూలంగా ఉండటంలో ఆంతర్యమేమిటి?
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తుంటాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి. నూతన  ప్రభుత్వం ఏర్పడ్డప్పుడల్లా ఒక ఏడాది పూర్తి అవగానే వారాల తరబడి సంబరాలు చేసుకొనే ధోరణి మాత్రం కొత్తగా ఇప్పుడే మొదలయింది! గత ప్రభుత్వాల దారిలో మోదీజీ కూడా నడవాలని లేదు. కానీ.. కేవలం 365 రోజుల్లోనే రావణసంహరణం సంపూర్ణమై రామరాజ్యం వచ్చేసినట్లు జరుగుతున్న   భారీ ప్రచారమే   వింతగా ఉంది!
వాజపేయిజీ పాలన కాలంలో సైతం ఇలాగే 'దేశం వెలిగిపోతోందని' ఊదరగొట్టడం ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఒక అనుచరుడైతే మరికాస్త ముందుకుపోయి జనతా చీరల పందేరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో ఎంతోమంది పేదమహిళలు దుర్మరణం పాలవడం  మోదీజీవర్గం స్మరించుకోవడం మంచిది.  ముష్టి యాభై రూపాయలుకూడా చేయని పైబట్టకోసం విలువైన ప్రాణాలుకూడా లెక్కచేయని మహిళలు లక్షల్లో ఉన్న దేశంలో  ఏమి వెలుగులు విరజిమ్మినట్లు?! ఆ సారి ఎన్నికల్లో భాజపాతోసహా దాని సారథ్యంలో పనిచేసిన పార్టీలన్నింటికీ ఎన్నికల్లో జనం చుక్కలు చూపించడం మోదీజీకూడా మరోసారి గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. ఆర్భాటాలమీదకన్నా వాస్తవ ఫలితాలమీద  దృష్టి నిలిపేందుకు బుద్ధిని ప్రేరేపిస్తుంది.

*** 

Sunday, May 24, 2015

కథ - పరీక్ష - ఆంధ్రభూమి - వార- 04 - 06-2015 - సంచికలో ప్రచురితం )


ఆంధ్రభూమి- వారపత్రిక- 4 జూన్ 2015 సంచికలో ప్రచురితమైన నా కథ
కథానిక
పరీక్ష
రచనః కర్లపాలెం హనుమంతరావు

మొదటి రాత్రి. శశి గదిలోకి వచ్చింది పాలగ్లాసుతో. రామారావా గ్లాసందుకొని టేబుల్ మీదుంచి తలుపులు లోపలికి గడియవేసి బిడియంగా నిలబడున్న అర్థాంగిని మృదువుగా పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. తలొంచుకొని కూర్చోనున ఆమె మొహాన్ని అరచేత్తో కొద్దిగా పైకెత్తి చిర్నవ్వులు చిందిస్తూ అన్నాడు రామారావు 'మనిద్దరికీ ఇది మొదటి పరిచయం కాదుగా!ఎందుకంత సిగ్గు?'
శశి కళ్ళల్లో నీరుచూసి కంగారుగా అన్నాడు' సారీ! నేనేమన్నా అనరాని మాట అన్నానా?'
శశి గభాలున బెడ్ దిగి రామారావుపాదాలు కళ్ళకద్దుకుంది. రామారావు షాక్!
;ఇదేంటి శశీ కొత్తగా! ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? అంటూ ఆమెను పైకి లేపి మళ్లీ బెడ్ మీద పక్కన కూర్చోపెట్టుకున్నాడు. 'ఏదైనా సరదాగా కబుర్లు చెప్పచ్చుగా! ఈ పాదాభివందనాలు.. ఇవీ ఏంటీ.. మరీ పాతకాలంనాటి సినిమాల్లోలాగా!' అనంటుంటే సశి నోరు తెరిచి నిదానంగా అన్నది ఒక్కొక్క మాటే వత్తి పలుకుతూ 'మీకు తెలీదు మీరు నాకెంత ఉపకారం చేసారో! నా జన్మంతా ఊడిగం చేసుకున్నా మీ రుణం తీరేదికాదు'
'ఇది మరీ బాగుంది. డైలాగులుకూడా సినిమాల్లోవే! ఏమైంది శశీ.. మరీ అంత సెంటిమెంటల్ గా ఫీలవుతున్నావు? ఇందులో నేను చేసిన ఘనకార్యంమాత్రం ఏముంది? నువ్వు నాకు నచ్చావు. నా అదృష్టం బాగుండి నేనూ నీకు నచ్చాను. మనిద్దరి అదృష్టం బాగుండి మీవాళ్లకి, మా వాళ్ళకికూడా మనమిలా ఒకటవడానికి అభ్యంతరం లేకుండా పోయింది. కథ క్లైమాక్సు సీన్లుకూడా అయిపోయాయి మ్యాడం! 'శుభమ్' కార్డు వేసేయాలి తమరింక'.
వాతావరణాన్ని తేలికపరఛడానికి రామారావు   అలవాటు లేని సరదాతనాన్ని ప్రదర్శిస్తుంటే .. శశి అంది చివరికి 'పెళ్ళి మగవాడికి ఒక అవసరం మాత్రమే అంటారు. ఆడదానికి అదే జీవితమండీ! ఆ అదృష్టానికి ఆడది నోచుకొనేది జీవితంలో ఒకే ఒకసారి ఈ దేశంలో. ఖర్మకాలి ఆ పెళ్ళిగాని వికటిస్తే జీవితాంతం మోడులాగా మాత్రమే బతకాలని శాస్తిస్తుందీ సమాజం. కాలం ఎంత మారినా.. అభిరుచులు ఎంత మారినా ఆడదాని విషయంలో మాత్రం ఏ తేడా లేదు.. ఈ అధునాతన యుగంలో కూడా! అట్లాంటిది ఒకసారి పెళ్ళిపీటలమీద కూర్చుని భర్తను పోగొట్టుకున్న నష్టజాతకురాలిని .. నాకు మరోసారి ఈ మాంగల్యజీవితం లభించిందంటే ఏదో కలలోలాగా ఉందంతా! మనమంటే వయసులో చిన్నవాళ్ళం. పెద్దవాళ్ళైన మీ అమ్మానాన్నలుకూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారంటే నాకిప్పటికీ నమ్మబుద్ధికావడం లేదండీ!
'ఆఁ..! వూరికే ఒప్పుకొనుంటే అది గొప్పతనమయుండేది. పరీక్షలు పెట్టారుగా..!' అన్నాడు రామారావు నిష్ఠురంగా.
'అయినా సరే! పరీక్షలో తప్పిన విద్యార్థికి గ్రేసుమార్కులిచ్చి పాసుచేయడంకూడా గొప్పేనండీ!' అంది శశి.
రామారావుకు ఏమనాలో అర్థంకాక శశివంక అలా చూస్తూ ఉండిపోయాడు. 'పరీక్ష' ఏంటో తెలియాలంటే  మనమూ కాస్త వెనక్కి వెళ్ళాల్సుంటుంది.
***
శశి తండ్రి పాపారావుగారు ప్రభుత్వోపాధ్యాయుడు. శశి ఆయనికి మొదటి సంతానం. తరువాత ఇద్దరు ఆడపిల్లలు. శశి డిగ్రీలో ఉండగా సుబ్బరాజు సంబంధం వచ్చింది. పిల్లాడు ఆర్టీసీలో డ్రైవరు. అన్నిరకాలుగా విచారించుకున్న తరువాతే పాపారావుగారీ సంబంధం ఖాయం చేసుకున్నారు.
ప్రధానం అయిపోయినా  పెళ్ళిమూహూర్తాలు శశి పరీక్షలయిపోయిన తరువాత పెట్టుకున్నారు. శశి రోజూ సుబ్బరాజు ద్యూటీలో ఉన్న బస్సులోనే కాలేజీకి వెళ్ళిరావడం అలవాటు చేసుకుంది. 'కాబోయే దంపతులే కదా.. ఇందులో పెద్దగా అభ్యంతర పెట్టాల్సిందేముంది?' అనుకున్నారు ఇరుపక్షాల పెద్దలు.
శశి పరీక్షలు అయిపోయిన  నెలలోనే ఏ ఆటంకం లేకుండా పెళ్ళి జరిగిపోవడంతో పాపారావుగారు ఊపిరి పీల్చుకున్నారు. ఆయనకు కాస్త జాతకాలమీద నమ్మకం జాస్తి. మంచి ముహూర్తం చూసుకుని మూడు రోజుల తరువాత
శోభనం పెట్టుకొన్నారు.
మొదటి రాత్రి అయిపోయిన మర్నాడు సుబ్బరాజు డ్యూటీకి బయలుదేరుతుంటే 'ఈ రెండు రోజులుకూడా సెలవు పెట్టాల్సింది బాబూ!' అని బాధపడ్డారు పాపారావుగారు. 'సెలవులాట్టే లేవు మామగారూ! రేపు శశిని కాపురానికి తీసుకు వెళ్లాల్సివచ్చినప్పుడు మళ్ళా పెట్టాలిగదా! మా అమ్మకుకూడా వంట్లో బాగుండటం లేదు. ఎప్పుడే అవసరమొస్తుందో తెలీదు. ఇప్పుడు మాత్రం ఏమైంది? సాయంత్రం డ్యూటీ దిగంగానే ఇటే వచ్చేస్తానుగా!' అంటూ వెళ్ళిపోయాడు సుబ్బరాజు. చిక్కడపల్లి క్రాసురోడ్డులో ఎదురుగా వస్తున్న మిలటరీ ట్రక్కు గుద్దుకొని సుబ్బరాజు డ్యూటీ చేస్తున్న బస్సు తుక్కు తుక్కయిపోయింది. ఆ ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులకు గాయాలయినా ప్రాణాలు పోయిందిమాత్రం ఒక్క సుబ్బరాజువే!
శశి దురదృష్టజాతకురాలన్నారు. ఆర్టీసీలో శశికి ఉద్యోగం వచ్చిందికానీ.. సుబ్బరాజు తనవెంట తీసుకుపోయిన మాంగల్య సౌభాగ్యమో?!
శశి తన జీవితాన్ని గురించి ఆలోచించడం మానేసి చెల్లెళ్ళిద్దరి బతుకుల్ని తీర్చిదిద్దడంలో తండ్రికి సాయపడ్డంలో మునిగిపోయింది. రెండోకూతురు పెళ్ళికూడా అయిందనిపించి పాపారావుగారు టపా కట్టేసారు. ఇంటిపెద్ద హోదాలో చివరిచెల్లెలికి పెళ్ళిసంబంధాలు చూసే పని శశిమీదే పడింది. ఆ సందర్భంలో కలిసాడు రామారావు.
శశి మ్యారేజి బ్యూరోలో ఇచ్చిన ప్రకటనకు స్పందించి శశిచెలెలు సుభద్రను చూడటానికని వచ్చాడు రామారావు. రామారావు ఏజీ ఆఫీసులో యూడీసీ. కట్నం మీదాట్టే ఆశలేదు. చూడ చక్కంగా ఉండి ఇంటి పనులు చక్కపెట్టుకునేపాటి తెలివితేటలుంటే చాలనుకునే పెద్దలు రామారావు తల్లిదండ్రులు. సుభద్ర వాళ్లకన్ని విదాలా నచ్చింది. సుభద్రకూ ఓకేనేగానీ.. రామారావే అడ్డం తిరిగాడు. 'పిల్ల మరీ చిన్నపిల్ల' అని అతగాడి పేచీ. సర్ది చెప్పడానికని వెళ్ళిన శశిని ప్రత్యేకంగా పక్కకు తీసుకు వెళ్ళి నిజం చెప్పేశాడు రామారావు' నాకిది మొదటి పెళ్ళి కాదు. కాన్పు ఇబ్బందై ఆవిడ పోయింది. బిడ్డా పోయింది. ఈ విషయాలన్నీ పెళ్ళైన తరువాత నెమ్మదిగా చెబుదామనుకుంటున్నారు మా వాళ్ళు, మీరూ అనుభవంలేక తొందరపడుతున్నారు. సారీ! ఇలా అన్నానని మరో విధంగా భావించకండి! మీ చెల్లెలైతే నా కంటికి నా చెల్లెల్లాగానే ఉంది'
విషయం తెలిసిన తరువాత సుభద్రా మొండికి దిగింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిందనే అనుకొంది  శశి.. మూడు నెలల తరువాత ఆ రామారావు శశి పనిచేసే ఆఫీసు వెతుక్కుంటూ వచ్చి ఓ  ప్రపోజల్ ముందుంచిందాకా. 'మీ చెల్లెలు చక్కనిది. చిన్నపిల్ల. ఇవాళ కాకపోతే రేపైనా మంచి జోడు దొరక్కపోదు. పి. జి. పూర్తి కానీయండి! మీ సంగతే మీరు ఆలోచించుకోవాలి ముందు!' అన్నాడతను.
'అంటే?' భృకుటి ముడిచింది శశి కాస్త సీరియస్ గా.
'సారీ! ఉచితసలహాలు ఇస్తున్నాననుకోవద్దు మ్యాడమ్!  చెల్లెలు వెళ్లిపోయింతరువాత మీరు ఒంటరిగా ఉండాలి. సమాజం ఏ తీరులో ఉందో నాకన్నా ఆడవారు మీకే బాగా తెలుసు. '
రామారావు ఏ ఉద్దేశంతో అన్నా అతనన్న మాటల్లో వందశాతం వాస్తవముంది. వయసులో ఉన్న ఆడది వంటరిగా ఉందని తెలిస్తే చాలు..  దొరలమనసుల్లో కూడా దొంగబుద్ధులు తొంగిచూస్తున్నాయి.  తను రోజూ   అనుభవిస్తున్నదే ఈ రంపపుకోత. అలాగని ఒకసారి పెళ్లయి మొగుణ్ణి పోగొట్టుకొన్న స్త్రీని ఏ స్వార్థంలేకుండా జీవితంలోకి ఆహ్వానించేంతగా మగజాతిమాత్రం అభివృద్ధి చెందిందా?! సంస్కారవంతులమని అనిపించుకోడానికి ఏ కొద్దిమందో ముందు  ముందుకొచ్చినా .. కలకాలం ఆ ఉత్సాహం అలాగే ఉంటుందన్న గ్యారంటీమాత్రం ఎక్కడుంది?!'
ఆ మాటే అన్నప్పుడు నీళ్ళు నమలకుండా మనసులోని మాట బైటపెట్టేడు రామారావు'మీ చెల్లెల్ని చూసింతరువాత నేను రెండు మూడు సంబంధాలు చూసాను. ఎక్కడ పెళ్లచూపులకని వెళ్ళినా  ఆ పిల్ల స్థానంలో మీరే కళ్లముందు కదిలేవారు. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. కానీ నా మనసులోని మాటను ఇంకెలా చెప్పాలో తోచటంలేదు.  ఊరికే మధనపడుతూ కూర్చునేకన్నా ఒకసారి నా ఫీలింగ్సుని మీకు తెలియచేస్తే బాగుంటుందని ఇలా సాహసం చేసాను. ఆ తరువాత మీ ఇష్టం. నా అదృష్టం' అంటూ శశి స్పందనకోసమన్నట్లు ఆగాడు.
ఇలాంటి విషయాల్లో సత్వరం స్పందించడం అంత తేలికా?! అందులోనూ ప్రపోజల్ పెట్టిన వ్యక్తి ఎదురుగా ఉంటే ఏ ఆడపిల్లయినా ఏమని చెబుతుంది?! శశిదీ అదే పరిస్థితి. తను కలలోనైనా ఊహించని ప్రపోజలుతో వచ్చాడితను. ఏం చెప్పాలి? ఏమీ చెప్పకపోయినా ఇబ్బందే! అదే అలుసుగా తీసుకుని ఆనక వేధించడని గ్యారంటీ ఏమిటి? కాస్త కరుకుదనం రంగరించి అడగదలుచుకున్నది సూటిగానే అడిగింది శశి' నా గురించి మీరు అన్నీ తెలుసుకొని రాలేదనుకుంటాను!'
'తెలుసు మ్యాడమ్ గారూ! సుబ్బరాజుగారి స్నేహితుడు మోహనరావు నా క్లోజ్ క్లాస్ మేట్'
'మోహనరావుగారిక్కూడా తెలీని కొన్ని విషయాలు ఉన్నాయండీ! సారీ! .. బట్ థేంక్యూ ఫర్ యువర్ కన్సర్న్.. సర్!' అని లేచి వచ్చేసింది శశి.
అంతటితో ముగిసిపోతే ఈ కథే ఉండేది కాదు. మూడునెలల తరువాత ఒకాదివారం మధ్యాహ్నంపూట రిలాక్సుడ్ గా కూర్చుని టీ.వీ చూస్తున్న వేళ.. ఒక ముసలి జంట గేటు నెట్టుకుని లోపలికి వచ్చారు. ముందు గుర్తుపట్టలేదుకానీ వాళ్ళు రామారావు తల్లిదండ్రులు. ఇంతకుముందు సుభద్రను చూడటానికి రామారావుతో కలసి వచ్చారు. సుభద్ర విషయం మాట్లాడటానికి వచ్చారేమో అనుకుంది. రామారావు సలహా తరువాత సుభద్రపెళ్ళి చదువయిందాకా వాయిదా వేయాలనే ఉద్దేశంలోనే  ఉంది శశి. ఆ మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే పెద్దావిడ అంది 'మా అబ్బాయి రామారావు నీకు తెలుసుటకదమ్మా! వాడు నిన్ను తప్ప చేసుకోనని మొండికేస్తున్నాడు. నువ్వే కాస్త నచ్చచెప్పాలి తల్లీ!మాకీ వయసులో భగవంతుడీ కష్టం ఎందుకు తెచ్చిపెట్టాడో అర్థం కాకుండా ఉంది.'
ఆమె అభ్యర్థిస్తుందా? నిష్ఠురమాడుతుందా? అర్థం కాలేదు శశికి. ఐనా వాళ్ళబ్బాయికి తను నచ్చచెప్పడమేమిటి? ఏమని నచ్చచెప్పాలి?
ముసలాయన మాత్రం మనసులోని మాటను సూటిగా చెప్పేసాడు. 'మా వాడి కడుపున ఒక కాయకాసి  వంశం నిలబడడం మాకు ముఖ్యం తల్లీ! వాడి మొదటి భార్య పోయిన సంగతి నీకూ చెప్పాట్టగా! నీ పరిస్థితీ మాకూ చెప్పాడు. అయినా మీ ఇద్దరికీ ముడిపెట్టి ఉంటే ఆపడానికి మేమెవరం? ఆ సంగతి చెప్పిపోదామనే వచ్చాం ఇంత దూరం. ఇక పదవే పోదాం!' అంటూ భార్యతో సహా వెళ్ళిపోయాడు పెద్దాయన.
శశి ఆశ్చర్యానికి అంతు లేదు. మళ్ళా పెళ్ళి అనే ఆలోచనే మనసులో లేని తనవెంట పడుతున్నాడేమిటీ రామారావు ఇలా?! కొంపదీసి అతను తనను నిజంగానే ప్రేమిస్తున్నాడా సినిమాల్లోకి మల్లే! ఇప్పుడు తనేం చేయాలి? మెదలకుండా ఉన్నా  నిలవనిచ్చేట్లు లేడే ఈ మహానుభావుడు! ఊళ్ళో ఉన్న మామయ్యను 'ఒకసారి వచ్చి కలిసి పొమ్మ'ని కబురు చేసింది శశి.
మామయ్య రాకతో పరిస్థితి మరింత ముదిరింది. విషయం విని ఆయనా సంతోషంతో గంతులేసేంత పని చేసాడు. 'ఆ రామారావుని దేవుడే పంపించినట్లున్నాడమ్మా! ఈ అవకాశం వదులుకోవద్దు! ఆడది వంటరిగా ఉండాలంటే ఈ సమాజంలో కుదిరే పని కాదు. సమస్య శారీరకమైనదే కాదు తల్లీ! ఒక వయసుదాటిన తరువాత ఒంటరి జీవితం తెచ్చిపెట్టే యాతనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు నీకు అర్థం కాదు. బిడ్డలు లేకుండా ఈ వయసులో నేనూ , మీ అత్తమ్మా పడుతున్న అవస్థలు చూడు! ఏం చేయాలో నీకే తెలుస్తుంది' అంటూ నచ్చచెప్పడం మొదలుపెట్టాడు.
మామయ్యకుకూడా చెప్పలేని సంకటం తనది. ఆయనే రామారావుని కలిసాడో, రామారావే ఆయన్ని కలిసాడో! ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చాలాకాలంగా పరిచయమున్నవాళ్ళకు మల్లే కలివిడిగా తిరగడం మరీ ఆశ్చర్యమనిపించింది శశికి. సుభద్రమీదా ఏ మత్తుమందు చల్లాడోగానీ.. అదీ మాటమాటకూ ఈ మధ్య 'బావగారం'టూ రామారావునే తలుచుకొంటోంది! ఇంతమంది దృష్టిలో మంచివాడు అనిపించుకున్న మనిషిలో నిజంగా మంచితనం ఉండకుండా ఉంటుందా? మంచి ఉద్యోగం. వయసూ మరీ అంత మించిపోలేదు. కావాలనుకుంటే అతను పెళ్ళిచేసుకోడానికి ఆడపిల్లలే దొరక్కపోతారా? అందాకా ఎందుకు? తను సుభద్రను ఇవ్వాలనుకోలేదూ! అయినా ఇవేవీ కాదనుకుని తనమీదే దృష్టి నిలిపాడంటే.. సినిమాల్లోలాగానే తనంటే ఇష్టమున్నట్లుంది!
తను ఇష్టపడేవాళ్లకన్నా ..తనను ఇష్టపడేవాళ్ళు దొరకడం నిజంగా అదృష్టమే! చేతిదాకా వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకోవడం తెలివైన పనేనా? శశిమనసులో సుడులుతిరిగే ఆలోచనా తరంగాలు.
ఒకసారి ఆలోచనంటూ చొరబడాలేగాని.. దాన్ని మనసులోనుంచి తరిమేయడం అంత సులభం కాదు. ఆర్నెల్ల పైనుంచి నడుస్తోందీ వ్యవహారం. శశికి తెలియకుండానే రామారావు ఆమె మనసులో తిష్టవేసాడు. సుబ్బరాజుతో ఆమె పరిచయం కేవలం రెండునెలలే! రామారావుతో స్నేహం ఎన్నో ఏళ్లబట్టి నడుస్తోన్నట్లనిపిస్తుందీ మధ్య మరీ.
శశి పెళ్ళికి 'ఊఁ' అనడంతో కథ సుఖాంతమయింది. ఈ మాఘమాసంలోనే శశి, రామారావుల పెళ్ళి జరిగిపోయింది. ఇవాళ మొదటి రాత్రి.
***
'ఎళ్ళి చూపులు అంటేనే ఆడపిల్లకు ఒక పరీక్ష. అందులో నెగ్గితేనే కదా 'శ్రీమతి' డిగ్రీ వచ్చేది! నాకా బాధ లేకుండా పోయింది. ఇక మీ వాళ్ళు పెట్టిన పరీక్ష అంటారా? ఒకసారి పెళ్ళిపీటలమీద కూర్చొని లేచినదాన్ని. ఇలాంటి పరీక్షలు తప్పవులేండి! దానికి మీ అమ్మానాన్నలను తప్పుపట్టడం భావ్యంకాదు.' అంది శశి రామారావువంక ప్రేమగా చూస్తూ.
రామారావు సీరియస్ గా అన్నాడు 'శశీ! నీకు ఒక విషయం చెప్పాలి. ఇద చెప్పకుండా దాచిపెడితే నాకూ .. మా అమ్మానాన్నలకూ తేడా ఉండదు'
'ఏంటండీ.. ఉన్నట్లండి అంత సీరియస్సయి పోయారు?' అంది శశి భయంభయంగా.
'విషయం కాస్త సీరియస్సే! నువ్వెలా రిసీవ్ చేసుకొంటావోనని బెంగగా కూడా ఉంది.  అయినా చెప్పడం నా ధర్మం. దాచివుంచడం నా నైజంకూడా కాదు'
'ఏంటండీ.. అంతగా దాచివుంచిన రహస్యం?' శశి గుండెలు గుబగుబలాడుతున్నాయి.
'నీతో పెళ్ళికి ఒప్పుకోవడానికి మా అమ్మావాళ్ళు ఒక షరతు పెట్టారు. నిన్ను మెడికల్ గా పరీక్ష చేయించాలని. కన్య అని రుజువయితేనే తాళి కట్టాలని..'
శశి మొహం ఒక్కసారిగా జేవురించింది. రామారావు తనధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు. 'నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకూ ఇట్లాంటి సమస్యే ఒకటి ఎదురయింది. టైపు, షార్టుహ్యాండు ప్రాక్టీసు చేస్తున్నానారోజుల్లో. మా తాతగారు ఆరోగ్యం బాగోలేక దాదాపు డెత్ బెడ్ మీదున్నారు. ఆ వత్తిడిలో నాపరీక్ష పోయింది. నేనా పరీక్ష పాసయితే తను పనిచేసిన కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించాలని మా తాతగారి ఆశ. డాక్టర్లింక కొన్ని రోజులు మాత్రమే టైముందని ప్రకటించిన సమయంలోనే  నా పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 'పరీక్ష ఏమయిందిరా?' అని ఆప్యాయంగా పక్కన కూర్చోబెట్టుకొని అడిగితే 'పాసయ్యాను తాతయ్యా!' అంటూ స్వీటు నోట్లో పెట్టాబోయాను. స్వీటయితే తినలేదుగానీ..  ఆ సంతోషంలో తృప్తిగా కన్నుమూయడం నాకింకా బాగా గుర్తు. నా చేత ఆ రోజు అట్లా అబద్ధమాడించింది మా నాన్నే!'
'ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నట్లు?!'అని అయోమయంగా అడిగింది శశి.
'అట్లాంటి సంఘర్షణే మళ్ళా వచ్చింది శశీ నా జీవితంలో! పెళ్ళికిముందు క్యాజువల్ గా చేయించామని చెబుతున్న  పరీక్షలు నిజానికి  'వర్జిన్ టెస్టులే'
'కావే! అయుంటే నాకు తెలిసుండేవి' అంది శశి ఆశ్చర్యంగా. ఆమె పెదాలు ఆవమానభారంతో వణుకుతున్నాయి.
'కావు. నాకు తెలుసు. కానీ ఉద్దేశం అయితే అదే కదా! అమ్మానాన్నలను ఒప్పించడానికి నాకు తెలిసిన డాక్టర్లచేత అట్లాంటి నీచమైన నాటకం ఆడించాను. లేకపొతే నువ్వు నాకు దక్కవని భయమేసింది'
శశినుంచి సమాధానం రాలేదు. రెండు మోకాళ్ళమధ్య తల పెట్టుకొని అలా ఉండిపోయిందామె చాలా సేపు.
ఏం చేయాలో అర్థంకాలేదు రామారావుకి. సాహసంచేసి  బలవంతంగా ఆమె చుబుకం  పైకెత్తాడు. అగ్నిగోళాల్లా మండుతున్నాయి శశి రెండు కళ్ళు. 'మీరు మీ వాళ్ళకి నిజం చెప్పుండాల్సింది. సుబ్బరాజుగారు నేనూ ఆ మొదటి రాత్రి.. '
చప్పున ఆమె నోరు మూసేసాడు రామారావు 'మోహనరావు చెప్పాడదంతా.  సుబ్బరాజుగారు చనిపోయేముందు అందుకే తనకన్నా నీ గురించే ఎక్కువ వర్రీ అయాడనీ చెప్పాడు. అది వినప్పట్నుంచే నిన్నెలాగైనా నా దాన్ని చేసుకోవాలనుకున్నాను శశీ!'
నమ్మలేనట్లు  చూసింది శశి కళ్ళింతింత చేసుకుని.
'అయితే జాలితో పెళ్ళి చేసుకున్నారా?' అనినువ్వడగచ్చు.  చూడకముందు సానుభూతి.. చూసిన తరువాత ప్రేమానుభూతి.. అదీ టూకీగా నా ప్రేమకథ' అన్నాడు రామారావు.
'సినిమాల్లోనే ఉంటారనుకున్నాను.. మీలాంటి మంచివాళ్ళు నిజంగాకూడా ఉంటారన్నమాట!' అంటూ శశి రామారావు గుండెలమీద వాలిపోయింది.
'పెళ్ళి తరువాత నువ్వు గడిపింది ఒక్కరాత్రే. నా భార్య పోయింది నా బిడ్డను కనలేక. తనూ పోయేటప్పుడు సుబ్బరాజుగారిలాగానే నా గురించి ఎక్కువ బాధపడింది. నేను నిన్ను స్వీకరించడంలో గొప్పేముంది? నువ్వు నన్ను ఆమోదించడంలోనే ఉందసలు గొప్పదనమంతా!' అంటూ శశిని తన గుండెలమీదకు లాక్కున్నాడీసారి చొరవగా రామారావు. గువ్వలా అతని గుండెల్లోకి ముడుచుకుపోయింది ఆమె కూడా!
***






వివాదం నా వేదం!
రాజకీయాలు, వివాదాలు అప్పచెల్లెళ్ళు. ఆ రెండింటినీ తన మద్దెలమోతలకు తగ్గట్లు  ఆడించేవాడే గడసరి. కెసిఆర్ ఆ గడసాములో ఎంతలా ఆరితేరారో స్థాలీపులాక న్యాయంగా చర్చించడమే ఈ చిరువిశ్లేషణ  లక్ష్యం.
ఉద్యమంద్వారా వేడి పుట్టించి సాధించిన తెలంగాణా రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా ఎన్నికయినాక న్యాయంగా ఇంక ఆ ఉద్యమస్ఫూర్తిని  రాష్ట్ర పునర్నిర్మాణంవైపుకు మళ్లించాలి. కానీ కెసిఆర్ ఇంకా ఆ ఉద్యమంనాటి వేడిసెగలను రాజేసే  వ్యూహాలే రచిస్తున్నారు! హైదరాబాద్  గ్రేటర్ ఎన్నికల్లో తగినంత పట్టుదొరక్కపోవడంతో రాబోయే నగరపాలక సంస్థల ఎన్నికల్లోనైనా ఆ దిశగా విజయం సాధించాలన్న పంతంతో ఆయన ముందుకు వెళుతున్నారు. తెలంగాణా రావడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెసుమీద, గ్రామస్థాయినుంచి కార్యకర్తల మద్దతు చెక్కుచెదరకుండా ఉన్న తెదేపామీద పూర్తిస్థాయి ప్రజావ్యతిరేకత రాజేయడంద్వారా సంపూర్ణంగా లాభపడాలని తెరాస అధినేత ఎత్తు. సందర్భం ఉన్నప్పుడు, లేనప్పుడుకూడా 'ఆంధ్రోళ్ళ'ను ఆడిపోసుకోవడం ఆ వ్యూహంలో భాగమే!
ప్రజాసంబందమైన ప్రకటన ఒక్కటైనా వివాదరహితంగా కెసిఆర్ నోటినుంచి వస్తున్నదా?! ఇక్కడి నగరాన్ని ఆంధ్ర్రావాళ్ళు పాడుచేసారని ఇప్పుడంటున్న కెసిఆర్ ఆ సమయంలో ప్రతిపక్షంలోనే ఉన్నారుగా? అప్పుడు మాటవరసకైనా ఒక్క నిరసన పదం పలకని పెద్దలు ఇప్పుడు పొద్దున లేచింది మొదలు, పొద్దుపోయేదాకా పక్కతెలుగురాష్త్రంమీద నిప్పులు చల్లడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. సాగర్ చుట్టూ ఆకాశహార్మాలు నిర్మిస్తామని ప్రకటనలు గుప్పించడం మొదలు.. తాజాగా ఉస్మానియా భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించడం వరకు ప్రతి పథకంలోనూ ఒక భారీ వివాదం చోటుచేసుకోవడంకూడా పెద్దాయన వ్యూహాల్లో ఒక భాగమే. కాకతాళీయంగాకాక, 'కాక'  ఉద్దేశపూరితంగా రేపడమూ ఓ ఎత్తుగడే. ఏదో ఒక మిషతో ప్రతిపక్షాలడ్డుకుంటాయని ఆయనకు తెలుసు.(ఆ ప్రకటనలూ అందుకే ఆ విధంగా ఉంటాయి) అప్పుడా పక్షాలని పేదలకు వ్యతిరేకమైనవనిగా చిత్రించాలని పన్నాగం.  పేదలకు ఇళ్లు నిర్మించాలంటే ఉస్మానికయా భూములే కావాలా?! విద్యార్థులు సూచిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు అక్రమంగా ఆక్రమించుకొన్న  స్థాలాలు స్వాధీనం చేసుకొని నిర్మాణాలు సాగించలేరా?
వాస్తవానికి కెసిఆర్ ప్రకటించిన విధంగా ప్రతి పేదవాడికి నగరంలో రెండు పడకగదుల నివాసాలు నిర్మించి ఇవ్వాలంటే సుమారు 18000 కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం దగ్గర అంత సొమ్ము ఉందా? ఉన్నా  ఒక్క ఇళ్లనిర్మాణాలకే అంతా కేటాయించడం కుదరదు కదా! ఈ విషయాలన్నీఅమాయకులైన  బడుగులకు తెలియక పోవచ్చు. ప్రభుత్వాలు నడిపే పెద్దలకు తెలియకుండా ఉంటాయా?! అయినా మరి సచివాలయం తరలింపు, కళాభారతి నిర్మాణం వంటి భారీ వివాదస్పద ప్రకటనలు ఎందుకంటే.. ముందు ముందు నగర పాలిక ఎన్నికలు ముంచుకొస్తున్నందుకు.
అధికారంలో ఉన్నందుకు 'ఆకర్షక' పథకం ఎలాగూ కొనసాగుతుంది. అది నేతలమధ్య జరిగే లాలూచీ వ్యవహారం.   ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనేది ఓటరు. అతగాడు ఎటువైపు మొగ్గుతాడో గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. అందుకే ఎన్నికలగండం తప్పిపోయేదాకా ఈ తిప్పలు.
వాస్తుదోషం మిషతో సచివాలయాన్ని ముందు చాతీఆసుపత్రి ప్రాంగణంలోకి.. ఆనక  సికిందరాబాదు రక్షణశాఖవారి భూముల్లోకి మళ్ళించాలన్న నిర్ణయాలు తీసుకొన్నప్పుడే.. అవి వివదాస్పదమవుతాయని కెసిఆర్ కి తెలుసు. ప్రతిపక్షాల, మేధావుల, న్యాయస్థానాల అభ్యంతరాలకి గురయి అవి  ఆగిపోతాయనీ తెలుసు. అయినా అలాంటి వివాదస్పద నిర్ణయాలే ఎందుకంటే.. అమాయక జనాలను బుట్టలో వేసుకోవడానికి. అధికారానికి అడ్దమొచ్చే ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టడానికి.
కెసిఆర్ సార్ గొప్పలు చెప్పుకుంటున్నట్లు తెలంగాణా నిజంగా ధనిక రాష్ట్రమేనా? సర్కారు బొక్కసంలో పుష్కలంగా పైసలుంటే మరి బాండ్లరూపంలో రెండుసార్లు వెంటవెంటనే 3900 కోట్ల రూపాయలకుగాను రుణాలకు వెళ్ళవలసిన అగత్యం ఏమిటో?! 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెటు ప్రకారం అభివృద్ధి పనులకోసం 4385 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. అయినా  ఏప్రియల్ నెలలో కేవలం 2500 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చయినట్లు? పన్నుల ద్వారా 5000 కోట్లు రాబడి లక్ష్యంగా పెటుకొన్నా కేవలం అందులో మూడువంతులు మాత్రమే వసూలవడంవల్ల కాదా? పన్నేతర ఆదాయమూ(భూముల అమ్మకాలు, క్రమబద్ధీకరణ వంటివాటిముంచి వచ్చేవి) అంచనాల మేరకు రాబట్టడంలో వైఫల్యం చెందుతున్నారా? రెవెన్యూ ఖర్చులకు, ఆదాయానికి లంగరు అందని పరిస్థితే ప్రభుత్వంలో ఇప్పటికీ కొనసాగుతున్నదా? నెలకు దాదాపు 1200 కోట్ల రూపాయలు చొప్పున  రెవెన్యూలోటు నడుస్తున్నట్లు ఆర్థికశాఖ అధికారులే అనధికారికంగా చెప్పుకుంటున్నారు. ముళ్లపూడి వారి అప్పుల అప్పారావు  అప్పుకోసం వెళ్ళేటప్పుడూ పరమ డాంబికం వెళ్లబోస్తాడు. తెలంగాణా సర్కారు ప్రస్తుతం ఆ అప్పారావు మార్గాన్నే నమ్ముకొన్నట్లుంది.  ఎటూ చివరికి కట్టేవికాదు.. పెట్టేవికాదు అన్న తెలివిడితోనే  భారీ నిర్మాణ ప్రకటనలు జారీచేసి వాటిచూట్టూ వివాదాలు ముసురుకొనేటట్లు  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. చేయిస్తున్నారు తెరాస అధినేత కెసిఆర్. 
ఎన్నికల గండం గడిచిందాకానే ఈ హడావుళ్ళు. మళ్లీ చూడాలంటే సార్వత్రిక ఎన్నికలముందే.

***

Saturday, May 23, 2015

మోదీజీ ఏడాది పాలన- నా సమీక్ష


ఈ మే 26కి మోదీజీ అధికారపగ్గాలు చేతబట్టి ఏడాది. ఈ ఏడాదిలో ఆయన పాలన ఏ తీరులో ఉందో ఓ సారి అనుకోవడానికే ఈ చిన్నవ్యాసం. మోదీజీ పాలన అనడానికి కారణం ఉంది. పేరుకి ఎన్. డి. యే నే ఐనా అటు సర్కారులో ప్రధానమంత్రిగా, ఇటు పార్టీలో అమిత్-షా రూపంలో పరోక్ష అధ్యక్షుడిగా కర్తా కర్మా క్రియా అంతా తానే అయినడిపిస్తున్నాడు కనక. ఎన్నికల్లో సైతం జనం భాజాపాకన్నా మోదీమంత్రమే ఎక్కువగా జపించారు కనక. యూ.పి. యే ప్రధాని మన్మోహన్ జీ ఎంత అస్వతంత్రుడో.. ఎన్.డి.యే ప్రధాని మోదీజీ అంత స్వతంత్రుడు.
మోదీజీ అధికార పగ్గాలు చేపట్టినవెం టనే అందుకొన్న నినాదం 'స్వచ్చ్ భారత్'. స్వచ్చ ఉద్యమాలు దేశానికి కొత్తవి కాకపోయినా.. మోదీజీ వచ్చిన పిదప దాని 'మోత' మరీ ఎక్కువయింది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతమీద శ్రద్ధ  వ్యక్తిగతస్థాయిలో తీసుకొనేకన్నా, ప్రభుత్వాలస్థాయిలో  తీసుకొంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. కావాల్సింది చిత్తశుద్దే. ప్రభుత్వప్రాపకంకోసం చీపుర్లు పట్టుకొనే వివిఐపీలు ఎప్పుడూ ఉంటారు. వారితో అయేదేమీ కాదీ భారీ కార్యక్రమం. ప్రభుత్వాల చిత్తశుద్ధి బైటపడేది నిధుల కేటాయింపులు.. వాటి సద్వినియోగంలో నిజాయితీ. మోదీజీ స్వచ్చ భారత్ ప్రస్తుతానికి మాటలవరకే పరిమితం. గణనీయమైన నిధుల విడుదల ఏదీ కనిపించడం లేదు! ఏడాదే కదా అంటారా.. అదీ చూద్దాం.. ముందు ముందు మరెంత లక్షణంగా ఈ స్వచ్చతా కార్యక్రమం ముందుకు సాగుతుందో!
మోదీజీ మరో ఆకర్షణీయమైన వ్యూహం 'మేకిన్ ఇండియా'.850 పళ్ళచక్రాలు, 10 టన్నుల బరువున్న భారీ సింహం బొమ్మను ప్రధమ గణతంత్రదినోత్సవ వేడుకల్లో ఘనంగా ప్రదర్శించారు. ఉత్పత్తి రంగంలో భారత్ ను సింహంలా మార్చాలన్న మోదీజీ ఆలోచన అభినందనీయమే. ఆ దిశగా ఆయన అధికారపగ్గాలు చేపట్టినప్పట్నుంచి చాలా దేశాలు పర్యటించి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారుకూడా. కాకపోతే ఆ ప్రభావంతో ఇండియాకొస్తామంటున్న సైన్సు గ్రూప్ సంస్థ, హిటాచీ, సామ్ సంగ్ వంటి ప్రముఖ సంస్థలకు దారి సుగమం చేయడంలో తాత్సారం ఎందుకవుతుందో?! పాలన మొదలై ఏడాదేగదా అయింది.. ముందు ముందు చూడండి మా తడాఖా అంటారా? సరే.. ఆలాగే కానీయండి!
భారతదేశం అంటే పంచవర్ష ప్రణాళికలు.. ప్రణాళికా సంఘం అని చదువుకున్నాం మనమందరం ఇప్పటివరకూ. మోదీజీ వచ్చీరాగానే దానికి మంగళం పాడేసారు. నీతి ఆయోగ్ (భారతీయ పరివర్తన సంస్థ) పుట్టుకొచ్చింది దాని స్థానంలో. రాష్ట్రాలకు ఇప్పటిదాకా పాత ప్రభుత్వాలు నిర్వహించిన కర్రపెత్తనంలాంటి వాటినుంచి విముక్తి కలిగించాలన్నది మోదీజీ లక్ష్యం. సమాఖ్య స్ఫూర్తిని ఆచరణలో పెడతామంటే ప్రజాస్వామ్యానికి అంతకుమించి జరెగే మంచేముంటుంది? కేంద్రదగ్గరున్న పన్నుల నిధుల్లో రాష్ట్రాల వాటా ఏకంగా పదిశాతానికి పెంచడం మామూలు విషయం కాదు.  నిధుల వినియోగంలోనూ మునపటి మాదిరిగా కేంద్రం జోక్యం ఉండదని కూడా చెబుతున్నారాయ. మోదీజీ సర్కారుని ఈ విషయంలో కచ్చితంగా అభినందించి తీరవలసిందే.
విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం అభివృద్ధికి దోహదంచేసే కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. నేఇన్ ఇండియాకి అనుకూలమైన ఈ విధానం ఆహ్వానించదగ్గదే కానీ.. మొన్నటి 2015-16 బడ్జెట్ ముందువరకూ ఏ శిక్షణా కేంద్రాలు నిర్వహించే కేటాయింపులు లేకపోవడమే కొంత విచారకరం. ఇకముందైనా ఈ స్వయం ఉపాధి తరహా పథకాలు వేగం పుంజుకొంటే అభినందనీయమే!
మోదీ సర్కారు అత్యవసర ఆదేశాలు జారీచేసే విషయంలో మాత్రం అభాసుపాలవుతున్నదనే చెప్పాలి. ముఖ్యంగా భూసేకరణ విషయంలో. తెల్లవాళ్లపాలననాటి చట్టానికి కొత్తగా కోరలు తొడిగి గత కాంగ్రెసుసారథ్యసర్కారు 2013లో ప్రాణప్రతిష్టచేసిన చట్టానికి సవరణలు తెచ్చే విషయంలోమాత్రం వ్యవహారాన్ని సజావుగా నిర్వహించలేక ఆపసోపాలు పడుతున్నది. రైతన్నల భూమిని పారిశ్రామికవేత్తలకు ఉదారంగా ధారాదత్తం చేస్తుందన్న ప్రతిపక్షాల ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమవుతున్నది. ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన ప్రతిపక్షాలకు ఉమ్మడివ్యూహ కల్పన చేసే అవకాశం చేజేతులా ఇచ్చి మోదీజీ పార్లమెంటరీ వ్యవహారల సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. గడిచింది ఏడాదే కాబట్టి ముందుముందు ఏమైనా జరగవచ్చంటారా! ప్రస్తుతానికైతే భూసేకరణ, దానితో పాటు ఎన్ జె ఎ సి- జాతీయస్థాయిలో న్యాయాధీశుల నియామకాలకు సంబధించిన కొలీజియం ఏర్పాటు- విషయంలో మాత్రం లభించినవి చేదు అనుభవాలే.
మోదీమంత్రంమీద అధికారంలోకి వచ్చిన తరువాత అదే చారిష్మాను నమ్ముకొని ఎన్ డి యే  ఈ ఏడాదిలో   ఎదుర్కొన్న ఎన్నికలు ఐదు. ఒక్క హర్యానాలో బొటబొటి మెజార్టీ మినహా.. మిగతా రాష్ట్రాల్లో మునుపటంతటి హవా కనిపించకపోవడం గమనార్హం. జార్ఖండులో మోదీజీ తిరగని చోటు లేదు. అయినా అధికారానికి దూరంగానే ఉండిపోయింది భాజపా. అధికారంలోకొస్తామనుకొన్న మహారాష్ట్రలో కేవలం పెద్దన్న పాత్రకే పరిమితమయింది. కాశ్మీరులో విలువలకు తిలోదకాలిచ్చి సర్కారులో భాగస్వామ్యానికి ఒప్పుకోడంద్వారా ఎదుర్కోలేని విమర్శపాలయింది. ఇహ దిల్లీగాయం సంగతి చెప్పనవసరమేలేదు. కేంద్రమంత్రులతోపాటు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులంతా వచ్చి సందుసందుల్లో ప్రచారం చేసినా మూడు సీట్లకుమించి గెలిపించలేకపోయింది మోదీ మాయాజాలం! ముందు ముందు దేశంలో సాధ్యమవబోయే ప్రతిపక్షాల సఖ్యతకు ఇది తొలివిజయంగా కాంగ్రెసువంటి పార్టీలు బడాయిలు పోయాయి. ముంచుకొస్తున్న బీహారు ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమైన ఉత్తరాది పార్టీలు ఏకమవడానికి పడే ఆపసోపాలు చూస్తుంటే కాంగ్రెసువారివి బడాయిమాటలే అనుకోవాలి మరి! అధికారంలో ఉన్నదేపార్టీ అన్నదానితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ అసమ్మతి రాగంమాత్రమే ఆలపించడం తెలిసిన వామపక్షాలమీద సామాన్యుడికి నమ్మకం కుదిరే రోజులు సమీపంలో లేనంతకాలం మోదీజీకిగాని.. మోదీజీ పార్టికిగాని తక్షణమే వచ్చే ప్రమాదం ఏమీ లేకపోవచ్చు. చేయాల్సిన చెరుపంతా స్వపక్షీయులే చేస్తున్నప్పుడు .. ప్రతిపక్షీయులకు ఆ మేరకు శ్రమ తగ్గించినట్లే కదా!
సల్మాన్ ఖాన్ ముసల్మాన్ కాబట్టే బెయిలంత సులభంగా దొరికిందని ఒక సాద్వి అంటే, సోనియాజీది తెల్లతోలు కాబట్టే హస్తంపార్టీ బ్రహ్మరథం పట్టిందని మరొకడంటాడు. రాహుల్ బాబు గోమాంసంతిని ప్రాయశ్చిత్తం చేసుకోకుండా వెళ్ళినందుకే కేదార్ నాథులో అంత భూకంపం వచ్చిందని మరో మహానుభావుడంటే, మదర్ థెరిసా సమాజసేవ అంతిమలక్ష్యం మతమార్పిడులేనని మరో పెద్దాయన సెలవిస్తాడు. అదుపుచేయాలని కూడా అనిపించకపోవడాన్ని మోదీజీ వైఫల్యంగానే చూస్తున్నది ప్రజాస్వామ్య భారతదేశం. ఇండియా టు డే- సిసిరో వారు సంయుక్తంగా నిర్వహించిన తాజాసర్వేలో మోదీజీ అనుకూల ఓట్లకు 24% గండిపడటం దేనికి సంకేతం. 'మోదీజీ పాలన బాగుంది' అని 56% అంటున్నా.. 'అచ్చేదిన్ ఇంకా రాలేదు' అని చప్పరించేవారూ 53% ఉన్నారు. ధరల అదుపుదల, అవినీతిమీద దృష్టి, స్వచ్చభారత్, మైనార్టీల భద్రత, జన్ ధన్ లాంటి పథకాలవల్ల మోదీజీ ప్రభుత్వానికి ఎంత మంచిపేరు వస్తున్నదో.. రైతువ్యతిరేకముద్ర అంతబలంగానూ పడుతున్నది. సూటు-బూటు సర్కారు అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేయడానికి మోదీజీ బాహ్యాడంబరం, వాగాడంబరాలే కారణాలేమో! మోదీజీ తన సర్కారు పనితీరుకు ఎన్ని మార్కులు ఇచ్చుకొంటారో తెలీదు. హస్తం రాహుల్ బాబైతె పదికి సున్నా మార్కులు వేస్తున్నారు. వామపక్షాలైతే ఆ సున్నాకూడా ఇవ్వడానికి పస్తాయిస్తున్నారు. ప్రతిపక్షాల రాజకీయాల సంగతి అలా వదిలేద్దాం. ఆమ్ ఆద్మీ మోదీజీని, ఆయన పాలన గురించి ఏమనుకుంటున్నాడో..మరో నాలుగేళ్ళకుగానీ నికరంగా తెలీదు. నేతాజీ మరణం మిస్టరీకి మళ్ళీ ఊపిరులూదడం, సర్దార్ వల్లభాయ్ పటేలుకి పునః ప్రాణప్రతిష్ఠ చేయడం వగైరావ్యూహాలన్నీ రాజకీయంగా ఎవరికి మేలు చేస్తాయో.. ఎవరికీ కీడు చేస్తాయో? సామాన్యుడి జీవనప్రమాణాల మెరుగుదలకు దోహదపడే అంశాలేవీ ఇందులో లేవు. మళ్ళీ ఎనికలనాటికి 'నమో' మంత్రం మునపటిలాగానే సమ్మోహనం చేయాలంటే మోదీజీ సామాన్యుడివైపునుంచి ఆలోచించడమేకాదు.. చర్యలు తీసుకోవడంకూడా సత్వరమే ఆరంభించాల్సివుంది. ఐదేళ్లలో ఒకేడాది గడిచే పోయింది.
బీహార్ సి.యం నితిష్ జీ అన్నట్లు' ఏక్ పూరా సాల్ బర్బాద్' కాలేదు. అలాగని అరుణ్ జైట్లీ డబ్బాకొట్టినట్లు దేశం మరీ అంతగా పురోగతిలో ముందుకు దూకడమూ లేదు.
మోదీజీ ఏడాది సర్కారు పాలనకు నేనిచ్చే మార్కులు పదికి ఆరు. మరి మీరో?!



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...