వివాదం నా వేదం!
రాజకీయాలు, వివాదాలు
అప్పచెల్లెళ్ళు. ఆ రెండింటినీ తన మద్దెలమోతలకు తగ్గట్లు ఆడించేవాడే గడసరి. కెసిఆర్ ఆ గడసాములో ఎంతలా
ఆరితేరారో స్థాలీపులాక న్యాయంగా చర్చించడమే ఈ చిరువిశ్లేషణ లక్ష్యం.
ఉద్యమంద్వారా వేడి పుట్టించి సాధించిన తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయినాక న్యాయంగా ఇంక ఆ
ఉద్యమస్ఫూర్తిని రాష్ట్ర పునర్నిర్మాణంవైపుకు మళ్లించాలి. కానీ కెసిఆర్ ఇంకా ఆ
ఉద్యమంనాటి వేడిసెగలను రాజేసే వ్యూహాలే
రచిస్తున్నారు! హైదరాబాద్ గ్రేటర్
ఎన్నికల్లో తగినంత పట్టుదొరక్కపోవడంతో రాబోయే నగరపాలక సంస్థల ఎన్నికల్లోనైనా ఆ
దిశగా విజయం సాధించాలన్న పంతంతో ఆయన ముందుకు వెళుతున్నారు. తెలంగాణా రావడంలో కీలక
పాత్ర పోషించిన కాంగ్రెసుమీద, గ్రామస్థాయినుంచి
కార్యకర్తల మద్దతు చెక్కుచెదరకుండా ఉన్న తెదేపామీద పూర్తిస్థాయి ప్రజావ్యతిరేకత
రాజేయడంద్వారా సంపూర్ణంగా లాభపడాలని తెరాస అధినేత ఎత్తు. సందర్భం ఉన్నప్పుడు,
లేనప్పుడుకూడా 'ఆంధ్రోళ్ళ'ను ఆడిపోసుకోవడం ఆ వ్యూహంలో భాగమే!
ప్రజాసంబందమైన ప్రకటన ఒక్కటైనా వివాదరహితంగా కెసిఆర్
నోటినుంచి వస్తున్నదా?! ఇక్కడి నగరాన్ని ఆంధ్ర్రావాళ్ళు పాడుచేసారని ఇప్పుడంటున్న
కెసిఆర్ ఆ సమయంలో ప్రతిపక్షంలోనే ఉన్నారుగా? అప్పుడు మాటవరసకైనా ఒక్క నిరసన పదం పలకని పెద్దలు ఇప్పుడు పొద్దున లేచింది
మొదలు, పొద్దుపోయేదాకా పక్కతెలుగురాష్త్రంమీద నిప్పులు
చల్లడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. సాగర్ చుట్టూ ఆకాశహార్మాలు నిర్మిస్తామని
ప్రకటనలు గుప్పించడం మొదలు.. తాజాగా ఉస్మానియా భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని
ప్రకటించడం వరకు ప్రతి పథకంలోనూ ఒక భారీ వివాదం చోటుచేసుకోవడంకూడా పెద్దాయన
వ్యూహాల్లో ఒక భాగమే. కాకతాళీయంగాకాక, ఈ 'కాక'
ఉద్దేశపూరితంగా రేపడమూ ఓ ఎత్తుగడే. ఏదో ఒక మిషతో ప్రతిపక్షాలడ్డుకుంటాయని
ఆయనకు తెలుసు.(ఆ ప్రకటనలూ అందుకే ఆ విధంగా ఉంటాయి) అప్పుడా పక్షాలని పేదలకు
వ్యతిరేకమైనవనిగా చిత్రించాలని పన్నాగం.
పేదలకు ఇళ్లు నిర్మించాలంటే ఉస్మానికయా భూములే కావాలా?! విద్యార్థులు సూచిస్తున్నట్లు
ప్రజాప్రతినిధులు అక్రమంగా ఆక్రమించుకొన్న
స్థాలాలు స్వాధీనం చేసుకొని నిర్మాణాలు సాగించలేరా?
వాస్తవానికి కెసిఆర్ ప్రకటించిన విధంగా ప్రతి పేదవాడికి
నగరంలో రెండు పడకగదుల నివాసాలు నిర్మించి ఇవ్వాలంటే సుమారు 18000 కోట్ల రూపాయలు
కావాలి. ప్రభుత్వం దగ్గర అంత సొమ్ము ఉందా? ఉన్నా ఒక్క ఇళ్లనిర్మాణాలకే అంతా కేటాయించడం కుదరదు కదా! ఈ విషయాలన్నీఅమాయకులైన బడుగులకు తెలియక పోవచ్చు. ప్రభుత్వాలు నడిపే
పెద్దలకు తెలియకుండా ఉంటాయా?! అయినా మరి సచివాలయం తరలింపు, కళాభారతి నిర్మాణం వంటి భారీ వివాదస్పద ప్రకటనలు ఎందుకంటే.. ముందు ముందు
నగర పాలిక ఎన్నికలు ముంచుకొస్తున్నందుకు.
అధికారంలో ఉన్నందుకు 'ఆకర్షక' పథకం ఎలాగూ కొనసాగుతుంది. అది నేతలమధ్య జరిగే లాలూచీ వ్యవహారం. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనేది ఓటరు. అతగాడు ఎటువైపు మొగ్గుతాడో గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి.
అందుకే ఎన్నికలగండం తప్పిపోయేదాకా ఈ తిప్పలు.
వాస్తుదోషం మిషతో సచివాలయాన్ని ముందు చాతీఆసుపత్రి
ప్రాంగణంలోకి.. ఆనక సికిందరాబాదు
రక్షణశాఖవారి భూముల్లోకి మళ్ళించాలన్న నిర్ణయాలు తీసుకొన్నప్పుడే.. అవి
వివదాస్పదమవుతాయని కెసిఆర్ కి తెలుసు. ప్రతిపక్షాల, మేధావుల, న్యాయస్థానాల అభ్యంతరాలకి గురయి అవి ఆగిపోతాయనీ
తెలుసు. అయినా అలాంటి వివాదస్పద నిర్ణయాలే ఎందుకంటే.. అమాయక జనాలను బుట్టలో
వేసుకోవడానికి. అధికారానికి అడ్దమొచ్చే ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టడానికి.
కెసిఆర్ సార్ గొప్పలు చెప్పుకుంటున్నట్లు తెలంగాణా నిజంగా
ధనిక రాష్ట్రమేనా? సర్కారు బొక్కసంలో పుష్కలంగా పైసలుంటే మరి బాండ్లరూపంలో
రెండుసార్లు వెంటవెంటనే 3900 కోట్ల రూపాయలకుగాను రుణాలకు వెళ్ళవలసిన అగత్యం ఏమిటో?! 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెటు ప్రకారం
అభివృద్ధి పనులకోసం 4385 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. అయినా ఏప్రియల్ నెలలో కేవలం 2500 కోట్లు మాత్రమే
ఎందుకు ఖర్చయినట్లు? పన్నుల ద్వారా 5000 కోట్లు రాబడి
లక్ష్యంగా పెటుకొన్నా కేవలం అందులో మూడువంతులు మాత్రమే వసూలవడంవల్ల కాదా? పన్నేతర ఆదాయమూ(భూముల అమ్మకాలు, క్రమబద్ధీకరణ
వంటివాటిముంచి వచ్చేవి) అంచనాల మేరకు రాబట్టడంలో వైఫల్యం చెందుతున్నారా? రెవెన్యూ ఖర్చులకు, ఆదాయానికి లంగరు అందని పరిస్థితే
ప్రభుత్వంలో ఇప్పటికీ
కొనసాగుతున్నదా? నెలకు దాదాపు 1200 కోట్ల
రూపాయలు చొప్పున
రెవెన్యూలోటు నడుస్తున్నట్లు ఆర్థికశాఖ అధికారులే అనధికారికంగా
చెప్పుకుంటున్నారు. ముళ్లపూడి వారి అప్పుల అప్పారావు అప్పుకోసం వెళ్ళేటప్పుడూ పరమ డాంబికం
వెళ్లబోస్తాడు. తెలంగాణా సర్కారు ప్రస్తుతం ఆ అప్పారావు మార్గాన్నే
నమ్ముకొన్నట్లుంది. ఎటూ చివరికి
కట్టేవికాదు.. పెట్టేవికాదు అన్న తెలివిడితోనే
భారీ నిర్మాణ ప్రకటనలు జారీచేసి వాటిచూట్టూ వివాదాలు ముసురుకొనేటట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
చేయిస్తున్నారు తెరాస అధినేత కెసిఆర్.
ఎన్నికల గండం గడిచిందాకానే ఈ హడావుళ్ళు. మళ్లీ చూడాలంటే
సార్వత్రిక ఎన్నికలముందే.
***
No comments:
Post a Comment