శ్రుతిమించుతున్న
రాగం
మోదీజీ
ఏడాదిపాలన ప్రచార ప్రహసనం
మోదీజీ
పాలనకు ఏడాది గడిచిన సందర్భంలో గత కొన్నిరోజులుగా
మీడియాలో మరీ ‘మోత’ ఎక్కువైపోయింది. సినిమా విజయోత్సవాలను తలపిస్తున్నదీ హడావుడి. అవినీతి అంతరించిపోయిందని, విదేశాల్లో భారతీయుల ప్రతిష్ఠ అమాంతం
ఆకాశాన్నంటుకుందని, విదేశీపెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా
వచ్చిపడుతున్నాయని, ధరలు పెరగడం ఆగిపోయిందని, సాధారణ పౌరుడికి జీవితంమీద కొత్త భరోసా ఏర్పడిందని, స్వచ్చతా
ఉద్యమం అట్టడుగుస్థాయికి చేరిందని.. ఇలాగా ఎవరి ఊహలకు తోచినట్లు వాళ్ళు చిలవలు పలవలుచేసి
మోదీజీ గొప్పతనాన్ని పోటీ;ఉ పడి మరీ చాటుతున్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న కారణాన వారి నిరసన
స్వరం ఈ సంతగోలలో సామాన్యుడి చెవిదాకా చేరే అవకాశం తక్కువ. అదలా పోనీయండి! ఏ
రాజకీయపక్షంమీద ప్రత్యేకంగా ఆపేక్షలేని ఓ ఆలోచనాపరుడైన సామాన్యుడు మోదీజీ
పాలనగురించి ఏమనుకుంటున్నాడో.. ఎవరైనా ఆలోచించారా?!
పదవీ
ప్రమాణ స్వీకారోత్సవసందర్భంలో మోదీజీ ఆహ్వానంమీద ఇక్కడికి చాలామంది దేశాధినేతలే తరలివచ్చారు. అంతమాత్రం చేత వాళ్ళకు
ఆయా దేశాల్లో ప్రతిష్ఠ పెరిగిందని అనుకోలేం. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర
రాజ సక్సే ఇక్కడి కొచ్చిపోయిన ఏడాదిలో జరిగిన
ఎన్నికల్లోనే ఘోరంగా ఓడిపోయారు. ఆయన మన తిరుపతిదాకా వచ్చి ఏడుకొండలవాడిని దర్శించుకొన్నా ఫలితం దక్కనేలేదు.
అమెరికా అధ్యక్షుడు, ఆయన మంత్రివర్గ సహచరులు
ఏటికేడాదీ ప్రపంచదేశాల్లో చక్కర్లు కొడుతుంటారు. అంతమాత్రం చేత అమెరికాలో వాళ్ల ప్రతిష్ఠ
ఇనుమడించినట్లా? ప్రధానిపదవి అలంకరించిన వెంటనే మన మోదీజీ విదేశాలవెంటబడి అదేపనిగా తిరగడం మనకి ఏ విధంగా
గౌరవప్రదం?! ఏ దేశప్రతిష్ఠ అయినా విదేశాల్లో పెరగాలంటే ప్రధానంగా కావాల్సింది
ఆర్థికపరిపుష్టి. రూపాయివిలువకు స్థిరత్వం కల్పించకుండా విదేశాల్లో ప్ర్రతిష్ఠ
పెరిగిందని ప్రచారం చేసుకోవడం తమాషాగా ఉంది.
విదేశీపెట్టుబడులు
ధారాళంగా రావడమనేది .. అంకెల రూపంలో నివేదికలు వస్తేగాని నిగ్గుతేలే విషయం కాదు. అప్పటివరకు ఏం
మాట్లాడినా అమాయకులను ఆకటుకునే కోటలుకిందకే వస్తాయి న్యాయంగా.
అవినీతి
ఆగిపోయిందని మోదీజీ భక్తులు మహాజోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒక రేషను కార్డుకోసం
సర్కారు దఫ్తరుకి వెళ్ళివచ్చిన పౌరుడు చెప్పాలి ఆ మాట. బడ్జెటు సంవత్సరాంతంలో నానా తిప్పలు పడి తెప్పించుకున్న పాత బకాయిలు బ్యాంకు కాతాలో పడాలంటే తత్సంబంధిత అధికారిగారి పచ్చసంతకం తప్పనిసరి. మునుపటి
యూపియే హయాంలో మాదిరిగానే 10% వాటాగా అచ్చుకుంది నాకు తెలిసిన విశ్రాంత ఉద్యోగిని!
అవినీతి ఆగిపోయిందెక్కడ? ఎందుకు ఆగిపోతుంది? ఎన్డియే సర్కారేమన్నా
ప్రత్యేకంగా చట్టాలు తెచ్చి చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టిందనా? పైపెచ్చు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటక హైకోర్టు విముక్తి చేసీ
చేయంగానే జయలలితమ్మను బహిరంగంగా అభినందించారు మోదీజీ! అవినీతికి వ్యతిరేకంగా
సర్కారు గట్టిపట్టుదలతో పనిచేస్తుందనడానికి ఇలాంటి సంకేతాలేనా జనాల్లోకి మోదీజీ
పంపించాల్సింది?! అధికారంలోకొచ్చిన మొదటి ఏడాదిలోనే అవినీతి
భాగోతాలు వెలుగు చూడవు. కాగ్ నివేదికలు వచ్చిందాకా టూజీ స్కాంలు బైటపడలేదు! వినోద్
రాయ్ వంటి మొండి అధికారి నిజాయితీగా
నిగ్గు తేల్చిన తరువాతే బొగ్గు కుంభకోణం చర్చనీయాంశమైంది. మీడియా వాసనపట్టి బొఫోర్సు అక్రమం పట్టుదలగా బైటికి
తీసిందాకా రాజీవ్ గాంధీ ‘మిస్టర్ క్లీనే’!
మోదీజీమీద నేరుగా ఏ ఆరోపణలు
లేకపోవచ్చు. కానీ ఆయన మంత్రివర్గ సహచరుల నిర్వాకాలమీద రోజుకో ఆరోపణ
వెల్లువెత్తుతున్నది. వేటిమీదా నోరైనా మెదపకుండా అవినీతి రహిత పాలనంటూ జనాలనలా
ఊదరగొట్టడం పాత పాలకుల పాత రాజకీయమే!
నల్లధనంమీద
ఎన్నికలముందు మోదీజీ చేసిన యాగీ?! ప్రధానిపీఠంమీదకు ఎక్కిన తరువాత ఎందుకయినట్లు
మూగి?!
పేరు
పేరునా బ్యాంకు కాతాలు తెరిపించి
జీవితభీమా ప్రీమియాలు కట్టించినంత మాత్రానే సామాన్యుడికి జీవితంమీదున్న భయాలన్నీ
తొలగిపోతాయన్న అంచనాకు రాలేం. బీమా కంపెనీలతో సామాన్యులకి గతంలోగల అనుభవాలు అంత
మధుర స్మృతులేమీ కావు. క్లెయిము చల్లింపుల సమయంలో కూడా మోదీజీ సర్కారు ఇంతటి
ఉద్యమస్ఫూర్తినే ఆర్థికసంస్థల్లో నిలిపుంచగలిగితేనే ఈ పథకాలు విజయవంతమైనట్లు లెక్క.
దానికి ఇంకా వ్యవధానముంది.
ధరల
పెరుగుదల ఆగిపోయిందని సర్కారు లెక్కలు కాదు నిగ్గు తేల్చాల్సింది. మాజీ ప్రధాని మన్మోహన్ జీ ప్రభుత్వం పదమూడు
రూపాయల చిల్లర రోజువారీ ఆదాయంగా వచ్చినవారినల్లా
కుబేరుల జాబితాలో వేసి దేశార్థికస్థితి అద్భుతంగా ఉందని జోకులేసింది! ధరల స్థిరీకరణకు సర్కార్ల స్థాయిలో
కొత్తగా వచ్చిన గొప్ప చట్టాలు ఏమిటో? వాటిని
ఉల్లంఘిస్తున్న వారిమీద తీసుకుంటున్న గట్టి చర్యలేమిటో? ఏవీ చెప్పకండా చందమామ కథలు వల్లిస్తే జీవనవ్యయభారాన్ని ప్రత్యక్షంగా అనుభవించే
సామాన్య పౌరుడు విశ్వసిస్తాడనేనా?!
మాటలు
ఎన్నైనా చెప్పుకోవచ్చు. అందులోనూ మోదీజీవంటి మాటకారి సంగతి వేరే చెప్పనవసరమే లేదు. ఏ ప్రభుత్వ వాస్తవ స్వరూప, స్వభావాలైనా అవి తెచ్చే బిల్లులు, వాటిని చట్టబద్ధం
చేసే తీరునుంచి మరుగు పడలేవు. బీమా, బొగ్గు, విదేశీ పెట్టుబడులు, గనులు, ఖనిజవనరులు, కంపెనీ
చట్టాలు వంటి రంగాల్లో అత్యవసరాదేశాల ద్వారానైనా సరే పాలన సాగించడానికి చూపించే
పట్టుదలలో పదోవంతు లోకాయుక్త, లోక్ పాల్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధం వంటి ప్రజాస్వామ్యస్ఫూర్తిని పెంచే అంశాలమీదా
చూపిస్తేనే కదా మోదీజీ సర్కారు ప్రజల పక్షాన, అవినీతి రహిత
సుపరిపాలన తెచ్చేప్రయత్నం నిబద్ధతతో చేస్తున్నదని సామాన్యుడు నిస్సంకోచంగా నమ్మడానికి!
స్వచ్చ
భారత్, భేటీ బచావ్, పఢావ్, నీతి ఆయోగ్ వంటి నూత్న పథకాలా? కొత్తగా వచ్చిన ఏ ప్రభుత్వమైనా తన సొంతముద్రకోసం ఏవో కొన్ని కొత్తపథకాలని ఆర్భాటంగా మొదలెట్టడం సర్వసాధారణంగా జరిగే వ్యవహారమే. మోదీజీ
వచ్చిఏడాదిమాత్రమే అయింది. ఈ అతితక్కువ సమయంలో ఆయన పాలనాసామర్థ్యాన్ని తక్కువ చేసి
చూపడం మంచిపద్దతి కాదని తెలుసు. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిజంగానే సామాన్యుడి
జీవనప్రమాణాల్లో సగుణాత్మకమైన మార్పులు
తెచ్చే పదకాలు చిత్తశుద్ధితో ముందుకు తెస్తామంటే ఆనందించని ప్రజాస్వామ్యవాది ఎవరు?
అభ్యంతరమల్లా ఒక్క పన్నెండు నెలల పాలనాభాగ్యానికే భూమి బద్ధలైపోయేటంత సంస్కరణలు తెచ్చేసినట్లు
మోదీజీ, ఆయన తైనాతీలు తతిమ్మా పాలనా వ్యవహారాలన్నీ
అటకెక్కించేసి బూరాలు వాయిస్తూ ఊరూరా తిరగడమే
సిల్లీగా ఉంది!
స్మార్ట్
సిటీలు, గంగా ప్రక్షాళనలు, నదుల అనుసంధానాలు వంటి భాజపా ప్రతిష్ఠాత్మకమైన ప్రణాళికలు కేబినెట్ గడప
దాటి బైటపడడానికే ఏడాది కాలం సరిపోవడం లేదు! అయోధ్య ఆలయ
నిర్మాణం, భగవద్గీతను అధికార గ్రంధంగా చెయ్యడం, మతాలమీద పరోక్ష దాడులు, ప్రజాస్వామ్య సూత్రాలకు ఏమాత్రం
అతకని అంశాలు. ప్రజాపాలనలో ఏ మాత్రం జోక్యం కూడని అధ్యాత్మిక వర్గాలు అడపా దడపా దడుపు పుట్టించే
విధంగా హెచ్చరికలు జారీచేస్తున్నా ప్రధానిస్థాయిలో
మోదీజీ 'మౌనమే నా భాష మనసా!' అనే రీతిలో
ప్రతిస్పందన లేకుండా ఉండడం ఏ విధంగా అర్థంచేసుకోవాలి?
దిల్లీ
ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వానికి మధ్య నడుస్తున్న యుద్దంలో మోదీజీ సారథ్య
ప్రభుత్వం సంపూర్ణ ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ప్రవర్తిస్తున్నదా? భూసేకరణ ఆర్డినెన్సుని ఎలాగైనా చట్టంగా
మార్చితీరాలన్న మోదీజీ పంతంవెనక సామాన్య అన్నదాతకు వెళుతున్న సంకేతాలు ఏమిటి?
మోదీజీ విదేశీపర్యటనల్లో అస్తమానం నీడలాగా అనుసరిస్తూ వస్తున్నవారంతా కొద్దిమంది పారిశ్రామిక పెద్దలే కావడం
కాకతాళీయమా? కేంద్ర మంత్రిత్వ శాఖల
కార్యాలయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలన్నీ
ధనిక, పారిశ్రామిక వర్గాలకు పనిగట్టుకొని ప్రతికూలంగా
ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు కానీ..
మెజార్టీ నిర్ణయాలు వారికి మాత్రమే
అనుకూలంగా ఉండటంలో ఆంతర్యమేమిటి?
ప్రజాస్వామ్యంలో
ఎన్నికలు వస్తుంటాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి. నూతన ప్రభుత్వం ఏర్పడ్డప్పుడల్లా ఒక ఏడాది పూర్తి
అవగానే వారాల తరబడి సంబరాలు చేసుకొనే ధోరణి మాత్రం కొత్తగా ఇప్పుడే మొదలయింది! గత
ప్రభుత్వాల దారిలో మోదీజీ కూడా నడవాలని లేదు. కానీ.. కేవలం 365 రోజుల్లోనే
రావణసంహరణం సంపూర్ణమై రామరాజ్యం వచ్చేసినట్లు జరుగుతున్న భారీ ప్రచారమే
వింతగా ఉంది!
వాజపేయిజీ
పాలన కాలంలో సైతం ఇలాగే 'దేశం వెలిగిపోతోందని' ఊదరగొట్టడం ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఒక అనుచరుడైతే మరికాస్త ముందుకుపోయి
జనతా చీరల పందేరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంలో జరిగిన
తొక్కిసలాటలో ఎంతోమంది పేదమహిళలు దుర్మరణం పాలవడం మోదీజీవర్గం స్మరించుకోవడం మంచిది. ముష్టి యాభై రూపాయలుకూడా చేయని పైబట్టకోసం విలువైన
ప్రాణాలుకూడా లెక్కచేయని మహిళలు లక్షల్లో ఉన్న దేశంలో ఏమి వెలుగులు విరజిమ్మినట్లు?! ఆ సారి ఎన్నికల్లో భాజపాతోసహా దాని సారథ్యంలో పనిచేసిన పార్టీలన్నింటికీ
ఎన్నికల్లో జనం చుక్కలు చూపించడం మోదీజీకూడా మరోసారి గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. ఆర్భాటాలమీదకన్నా
వాస్తవ ఫలితాలమీద దృష్టి నిలిపేందుకు
బుద్ధిని ప్రేరేపిస్తుంది.
***
No comments:
Post a Comment