Saturday, May 23, 2015

మోదీజీ ఏడాది పాలన- నా సమీక్ష


ఈ మే 26కి మోదీజీ అధికారపగ్గాలు చేతబట్టి ఏడాది. ఈ ఏడాదిలో ఆయన పాలన ఏ తీరులో ఉందో ఓ సారి అనుకోవడానికే ఈ చిన్నవ్యాసం. మోదీజీ పాలన అనడానికి కారణం ఉంది. పేరుకి ఎన్. డి. యే నే ఐనా అటు సర్కారులో ప్రధానమంత్రిగా, ఇటు పార్టీలో అమిత్-షా రూపంలో పరోక్ష అధ్యక్షుడిగా కర్తా కర్మా క్రియా అంతా తానే అయినడిపిస్తున్నాడు కనక. ఎన్నికల్లో సైతం జనం భాజాపాకన్నా మోదీమంత్రమే ఎక్కువగా జపించారు కనక. యూ.పి. యే ప్రధాని మన్మోహన్ జీ ఎంత అస్వతంత్రుడో.. ఎన్.డి.యే ప్రధాని మోదీజీ అంత స్వతంత్రుడు.
మోదీజీ అధికార పగ్గాలు చేపట్టినవెం టనే అందుకొన్న నినాదం 'స్వచ్చ్ భారత్'. స్వచ్చ ఉద్యమాలు దేశానికి కొత్తవి కాకపోయినా.. మోదీజీ వచ్చిన పిదప దాని 'మోత' మరీ ఎక్కువయింది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతమీద శ్రద్ధ  వ్యక్తిగతస్థాయిలో తీసుకొనేకన్నా, ప్రభుత్వాలస్థాయిలో  తీసుకొంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. కావాల్సింది చిత్తశుద్దే. ప్రభుత్వప్రాపకంకోసం చీపుర్లు పట్టుకొనే వివిఐపీలు ఎప్పుడూ ఉంటారు. వారితో అయేదేమీ కాదీ భారీ కార్యక్రమం. ప్రభుత్వాల చిత్తశుద్ధి బైటపడేది నిధుల కేటాయింపులు.. వాటి సద్వినియోగంలో నిజాయితీ. మోదీజీ స్వచ్చ భారత్ ప్రస్తుతానికి మాటలవరకే పరిమితం. గణనీయమైన నిధుల విడుదల ఏదీ కనిపించడం లేదు! ఏడాదే కదా అంటారా.. అదీ చూద్దాం.. ముందు ముందు మరెంత లక్షణంగా ఈ స్వచ్చతా కార్యక్రమం ముందుకు సాగుతుందో!
మోదీజీ మరో ఆకర్షణీయమైన వ్యూహం 'మేకిన్ ఇండియా'.850 పళ్ళచక్రాలు, 10 టన్నుల బరువున్న భారీ సింహం బొమ్మను ప్రధమ గణతంత్రదినోత్సవ వేడుకల్లో ఘనంగా ప్రదర్శించారు. ఉత్పత్తి రంగంలో భారత్ ను సింహంలా మార్చాలన్న మోదీజీ ఆలోచన అభినందనీయమే. ఆ దిశగా ఆయన అధికారపగ్గాలు చేపట్టినప్పట్నుంచి చాలా దేశాలు పర్యటించి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారుకూడా. కాకపోతే ఆ ప్రభావంతో ఇండియాకొస్తామంటున్న సైన్సు గ్రూప్ సంస్థ, హిటాచీ, సామ్ సంగ్ వంటి ప్రముఖ సంస్థలకు దారి సుగమం చేయడంలో తాత్సారం ఎందుకవుతుందో?! పాలన మొదలై ఏడాదేగదా అయింది.. ముందు ముందు చూడండి మా తడాఖా అంటారా? సరే.. ఆలాగే కానీయండి!
భారతదేశం అంటే పంచవర్ష ప్రణాళికలు.. ప్రణాళికా సంఘం అని చదువుకున్నాం మనమందరం ఇప్పటివరకూ. మోదీజీ వచ్చీరాగానే దానికి మంగళం పాడేసారు. నీతి ఆయోగ్ (భారతీయ పరివర్తన సంస్థ) పుట్టుకొచ్చింది దాని స్థానంలో. రాష్ట్రాలకు ఇప్పటిదాకా పాత ప్రభుత్వాలు నిర్వహించిన కర్రపెత్తనంలాంటి వాటినుంచి విముక్తి కలిగించాలన్నది మోదీజీ లక్ష్యం. సమాఖ్య స్ఫూర్తిని ఆచరణలో పెడతామంటే ప్రజాస్వామ్యానికి అంతకుమించి జరెగే మంచేముంటుంది? కేంద్రదగ్గరున్న పన్నుల నిధుల్లో రాష్ట్రాల వాటా ఏకంగా పదిశాతానికి పెంచడం మామూలు విషయం కాదు.  నిధుల వినియోగంలోనూ మునపటి మాదిరిగా కేంద్రం జోక్యం ఉండదని కూడా చెబుతున్నారాయ. మోదీజీ సర్కారుని ఈ విషయంలో కచ్చితంగా అభినందించి తీరవలసిందే.
విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం అభివృద్ధికి దోహదంచేసే కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. నేఇన్ ఇండియాకి అనుకూలమైన ఈ విధానం ఆహ్వానించదగ్గదే కానీ.. మొన్నటి 2015-16 బడ్జెట్ ముందువరకూ ఏ శిక్షణా కేంద్రాలు నిర్వహించే కేటాయింపులు లేకపోవడమే కొంత విచారకరం. ఇకముందైనా ఈ స్వయం ఉపాధి తరహా పథకాలు వేగం పుంజుకొంటే అభినందనీయమే!
మోదీ సర్కారు అత్యవసర ఆదేశాలు జారీచేసే విషయంలో మాత్రం అభాసుపాలవుతున్నదనే చెప్పాలి. ముఖ్యంగా భూసేకరణ విషయంలో. తెల్లవాళ్లపాలననాటి చట్టానికి కొత్తగా కోరలు తొడిగి గత కాంగ్రెసుసారథ్యసర్కారు 2013లో ప్రాణప్రతిష్టచేసిన చట్టానికి సవరణలు తెచ్చే విషయంలోమాత్రం వ్యవహారాన్ని సజావుగా నిర్వహించలేక ఆపసోపాలు పడుతున్నది. రైతన్నల భూమిని పారిశ్రామికవేత్తలకు ఉదారంగా ధారాదత్తం చేస్తుందన్న ప్రతిపక్షాల ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమవుతున్నది. ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన ప్రతిపక్షాలకు ఉమ్మడివ్యూహ కల్పన చేసే అవకాశం చేజేతులా ఇచ్చి మోదీజీ పార్లమెంటరీ వ్యవహారల సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. గడిచింది ఏడాదే కాబట్టి ముందుముందు ఏమైనా జరగవచ్చంటారా! ప్రస్తుతానికైతే భూసేకరణ, దానితో పాటు ఎన్ జె ఎ సి- జాతీయస్థాయిలో న్యాయాధీశుల నియామకాలకు సంబధించిన కొలీజియం ఏర్పాటు- విషయంలో మాత్రం లభించినవి చేదు అనుభవాలే.
మోదీమంత్రంమీద అధికారంలోకి వచ్చిన తరువాత అదే చారిష్మాను నమ్ముకొని ఎన్ డి యే  ఈ ఏడాదిలో   ఎదుర్కొన్న ఎన్నికలు ఐదు. ఒక్క హర్యానాలో బొటబొటి మెజార్టీ మినహా.. మిగతా రాష్ట్రాల్లో మునుపటంతటి హవా కనిపించకపోవడం గమనార్హం. జార్ఖండులో మోదీజీ తిరగని చోటు లేదు. అయినా అధికారానికి దూరంగానే ఉండిపోయింది భాజపా. అధికారంలోకొస్తామనుకొన్న మహారాష్ట్రలో కేవలం పెద్దన్న పాత్రకే పరిమితమయింది. కాశ్మీరులో విలువలకు తిలోదకాలిచ్చి సర్కారులో భాగస్వామ్యానికి ఒప్పుకోడంద్వారా ఎదుర్కోలేని విమర్శపాలయింది. ఇహ దిల్లీగాయం సంగతి చెప్పనవసరమేలేదు. కేంద్రమంత్రులతోపాటు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులంతా వచ్చి సందుసందుల్లో ప్రచారం చేసినా మూడు సీట్లకుమించి గెలిపించలేకపోయింది మోదీ మాయాజాలం! ముందు ముందు దేశంలో సాధ్యమవబోయే ప్రతిపక్షాల సఖ్యతకు ఇది తొలివిజయంగా కాంగ్రెసువంటి పార్టీలు బడాయిలు పోయాయి. ముంచుకొస్తున్న బీహారు ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమైన ఉత్తరాది పార్టీలు ఏకమవడానికి పడే ఆపసోపాలు చూస్తుంటే కాంగ్రెసువారివి బడాయిమాటలే అనుకోవాలి మరి! అధికారంలో ఉన్నదేపార్టీ అన్నదానితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ అసమ్మతి రాగంమాత్రమే ఆలపించడం తెలిసిన వామపక్షాలమీద సామాన్యుడికి నమ్మకం కుదిరే రోజులు సమీపంలో లేనంతకాలం మోదీజీకిగాని.. మోదీజీ పార్టికిగాని తక్షణమే వచ్చే ప్రమాదం ఏమీ లేకపోవచ్చు. చేయాల్సిన చెరుపంతా స్వపక్షీయులే చేస్తున్నప్పుడు .. ప్రతిపక్షీయులకు ఆ మేరకు శ్రమ తగ్గించినట్లే కదా!
సల్మాన్ ఖాన్ ముసల్మాన్ కాబట్టే బెయిలంత సులభంగా దొరికిందని ఒక సాద్వి అంటే, సోనియాజీది తెల్లతోలు కాబట్టే హస్తంపార్టీ బ్రహ్మరథం పట్టిందని మరొకడంటాడు. రాహుల్ బాబు గోమాంసంతిని ప్రాయశ్చిత్తం చేసుకోకుండా వెళ్ళినందుకే కేదార్ నాథులో అంత భూకంపం వచ్చిందని మరో మహానుభావుడంటే, మదర్ థెరిసా సమాజసేవ అంతిమలక్ష్యం మతమార్పిడులేనని మరో పెద్దాయన సెలవిస్తాడు. అదుపుచేయాలని కూడా అనిపించకపోవడాన్ని మోదీజీ వైఫల్యంగానే చూస్తున్నది ప్రజాస్వామ్య భారతదేశం. ఇండియా టు డే- సిసిరో వారు సంయుక్తంగా నిర్వహించిన తాజాసర్వేలో మోదీజీ అనుకూల ఓట్లకు 24% గండిపడటం దేనికి సంకేతం. 'మోదీజీ పాలన బాగుంది' అని 56% అంటున్నా.. 'అచ్చేదిన్ ఇంకా రాలేదు' అని చప్పరించేవారూ 53% ఉన్నారు. ధరల అదుపుదల, అవినీతిమీద దృష్టి, స్వచ్చభారత్, మైనార్టీల భద్రత, జన్ ధన్ లాంటి పథకాలవల్ల మోదీజీ ప్రభుత్వానికి ఎంత మంచిపేరు వస్తున్నదో.. రైతువ్యతిరేకముద్ర అంతబలంగానూ పడుతున్నది. సూటు-బూటు సర్కారు అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేయడానికి మోదీజీ బాహ్యాడంబరం, వాగాడంబరాలే కారణాలేమో! మోదీజీ తన సర్కారు పనితీరుకు ఎన్ని మార్కులు ఇచ్చుకొంటారో తెలీదు. హస్తం రాహుల్ బాబైతె పదికి సున్నా మార్కులు వేస్తున్నారు. వామపక్షాలైతే ఆ సున్నాకూడా ఇవ్వడానికి పస్తాయిస్తున్నారు. ప్రతిపక్షాల రాజకీయాల సంగతి అలా వదిలేద్దాం. ఆమ్ ఆద్మీ మోదీజీని, ఆయన పాలన గురించి ఏమనుకుంటున్నాడో..మరో నాలుగేళ్ళకుగానీ నికరంగా తెలీదు. నేతాజీ మరణం మిస్టరీకి మళ్ళీ ఊపిరులూదడం, సర్దార్ వల్లభాయ్ పటేలుకి పునః ప్రాణప్రతిష్ఠ చేయడం వగైరావ్యూహాలన్నీ రాజకీయంగా ఎవరికి మేలు చేస్తాయో.. ఎవరికీ కీడు చేస్తాయో? సామాన్యుడి జీవనప్రమాణాల మెరుగుదలకు దోహదపడే అంశాలేవీ ఇందులో లేవు. మళ్ళీ ఎనికలనాటికి 'నమో' మంత్రం మునపటిలాగానే సమ్మోహనం చేయాలంటే మోదీజీ సామాన్యుడివైపునుంచి ఆలోచించడమేకాదు.. చర్యలు తీసుకోవడంకూడా సత్వరమే ఆరంభించాల్సివుంది. ఐదేళ్లలో ఒకేడాది గడిచే పోయింది.
బీహార్ సి.యం నితిష్ జీ అన్నట్లు' ఏక్ పూరా సాల్ బర్బాద్' కాలేదు. అలాగని అరుణ్ జైట్లీ డబ్బాకొట్టినట్లు దేశం మరీ అంతగా పురోగతిలో ముందుకు దూకడమూ లేదు.
మోదీజీ ఏడాది సర్కారు పాలనకు నేనిచ్చే మార్కులు పదికి ఆరు. మరి మీరో?!



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...