Saturday, May 30, 2015


మంచి కథలకు కరువా?
కూటికోసం కూలికోసం పట్టణంలో బతుకుదామని వలస వచ్చే కుటుంబాల వెనక తరచి చూస్తే ఓ సినిమాకి సరిపడే సరంజామా దొరుకుతుంది. ఐనా మన సినిమాలకు కథల కరువు?!
తరతరాలుగా పేదలమీద, బాలలమీద మగువలమీద, మతాలమీద దోపిడీలు, పీడనలు, దౌర్జన్యాలు, దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి కొత్త కొత్త రూపాల్లో. నగరం మరుగులో ప్రాణాలు, మానాలు అరచేత పట్టుకుని విరాటపర్వంలో పాండవుల మాదిరి అజ్ఞాతంగా జీవనం సాగించే  అభాగ్యులను గమనిస్తే ఓ భారీచిత్రానికి సరిపడినంత నాటకీయత దొరుకుతుంది.
నయంకాని రోగంతో అనుక్షణం మృత్యువుతో భీకరపోరాటం చేసే బిడ్డ- బతికుండి అనుక్షణం పడే నరకయాతన చూడలేక చావుని వరంగా ప్రసాదించమని న్యాయస్థానాలను వేడుకునే తల్లి కడుపుకోతలో.. సినిమా మెలోడ్రామాకు సరిపడినంత కథ కనిపించడం లేదా?
మారుమూల పల్లెలో ఓ పేరులేని కానిస్టేబులుకి ఆడబిడ్డగా జన్మించినా.. కాలానికి, సంఘానికి ఎదురొడ్డి మరీ అంతర్జాతీయ వేదికపై ‘నెంబరు ఒన్’ వెయిట్ లిఫ్టరై  నిలిచిన ఆ బాలిక ఎదురీతను చిత్రంగా తీస్తే ఎంత స్ఫూర్తిదాయకం! కొత్తరకంగా చూపిస్తే ఎంత ఆదాయం? ఎన్ని సార్లు దెబ్బపడ్డా ఎప్పుడూ ఆ తుప్పుపట్టిన కక్షలు, కార్పణ్యాల ఫాక్షన్ భీభత్సాలేనా చిత్రనిర్మాతలకు?ఓ ప్రేమ ట్రాకును పారలల్ గా నడిపించడం తాజా విధానం!
నగరం నడిబొడ్డున పట్టపగలు పట్టకారుతో షట్టరెత్తి ఏటీయమ్ లూటీచేశాడో  విద్యావంతుడైన నిరుద్యోగి. దారి తప్పిన ఆ యువకుడి ప్రతిభ వెనక దాగిన చీకటి కోణాలేమిటో పరిశీలించాలేగానీ.. హాలీవుడ్ అమ్మమొగుడులాంటి షాకింగ్ స్టోరీ బైటపడవచ్చు.   యువతమీద సానుభూతితో మంచి కథ రాసుకుంటే సమాజానికి పనికొచ్చే  సందేశమిచ్చినట్లే  కాదు.. సరికొత్త అంశంతో నాలుగు కాసులు  రాబట్టుకొనే అవకాశాలూ ఎక్కువే.. సరిగ్గా హ్యాండిల్ చేయాలంతే! ఆ గుండె ధైర్యాలేవీ ఇవాళ్టి సినీజీవులకి?
అయిదొందలేళ్ళ కిందట కనుమరుగయిందనుకున్న కవిలపిట్ట హఠాతుగా వైయస్సార్ జిల్లా  అభయారణ్యాల్లో కనువిందు చేసి ఎంతోమంది జీవితాల్లొ సంచలనం సృష్టించింది. విని ఆశ్చర్యపోవడం వరకే మన సినీకవుల పని. అదే ఏ హాలివుడ్ రచయితయితేనో!  హాశ్చర్యపోయే ఫక్కీలోమన బాక్సాఫీసులూ బద్దలయ్యే కథ వండుతాడు..
టీనేజీ దాటని ఇద్దరు పిల్లలు సమాజానికి భయపడి చీకటి ఇంట్లో తల్లిశవం పక్కన బజ్జీలు తింటూ నాలుగు నెలలు కాలక్షేపం చేసిన ఘోరం హాలివుడ్ ‘సైకో’ థ్రిల్లర్ని మించి భయపెడుతుంది. ఈ మధ్యనే మన మధ్య జరిగిన ఈ విచిత్రం మన తెలుగు చిత్రాలనేమీ ప్రభావితం చేయలేదు! విచిత్రం! పొరుగునున్న ఏ మళయాళీనో సినిమాగా తీస్తే హిట్ కొడితే మాత్రం ఆ హక్కులు కొనుక్కుని నాలుగు కాసులు రాల్చుకునే ఆరాటం తెగ చూపిస్తాం!
పల్లెటూరంటే పోరంబోకులుగా పిల్లకాయలు తిరిగే ఊళ్లని మాత్రమే మన సినిమావాళ్ల రొటీన్ అభిప్రాయం. అలగాగా చూపిస్తేనే జనం ఎగబడి చూస్తారని ఓ దురభిప్రాయం. కరెంటేలేని ఓ పల్లెలో గ్యాస్ బండసాయంతో మోటారు ఆడించి ఇరవైనాలుగ్గంటలకో ఎనిమిది ఎకరాలకు నీరందింఛాడా యువకుడు! పుట్లకు పుట్లు ధాన్యం పండించిన ఆ అబ్బాయి బడుద్దాయా? ఏటికి ఎదురీదే ఆ రైతుజీవితం సినిమాగా వస్తే ఎంత ఉత్తేజితంగా ఉంటుంది!  ఉత్తమ చిత్రంగా పురస్కారాలందుకుంటుంది! లొల్లాయికథలు అల్లుకోవడమే తప్ప మంచి కథలుమీదకు  మనవాళ్ల మనసు ఎప్పుటికి మళ్ళుతుందో?!
నాసా యువశాస్త్రవేత్త తన ఆయా ఉండే  పల్లెలో బిజిలీ పుట్టించేందుకు పడ్డ తపన హిందీ చిత్రంగా వస్తే దేశమంతా భాషతో నిమిత్తం లేకుండా ఆ 'స్వదేశీ'ని ఆకాశానికి ఎత్తేసింది. ఐనా మన తెలుగు సినిమాలవాళ్ళకు అందులో రవ్వంత వెలుగు కనిపించలేదు?!
చెయ్యిపోతే కాలితో చేతిపని చేసేవారున్నారు. కళ్లు లేకపోయినా భగవద్గీతను బ్రెయిలీ భాషలో తిరగరాసి అంధులకు అందించిందో అమ్మాయి. చక్రాల కుర్చీల్లోనే ఉండనీయండి.. పరుగుపందెమన్నాక అందరికన్నా ముందే ఉండాలన్న పట్టుదలతో ఓపికనుమించి సాధన చేసే పోలియోబాదితబాలలు బోలెడంతమందున్నారు ప్రపంచంలో.’ఫిజికల్లీ ఛాలెంజ్ డ్’ అభాగ్యుల కథలు మాకొద్దని ఎవరన్నా మన తెలుగు సినిమాలవాళ్ళ చెవిలో వూదిపోయారా? కళాతపస్వి విశ్వనాద్ తీసిన మూగ, గుడ్డి జంట ప్రేమకథ తెలుగు సినీనందనవనంలో సిరివెన్నెలలు పూయించలేదా? వార్తాపత్రికలో వచ్చిన ఓ మారుమూల కథనంతో స్ఫూర్తిపొంది కృత్తిమపాదంతో నర్తించే సుధాచంద్రన్ కథను 'మయూరి' చిత్రంగా మలిచి కాసుల పంట పండించారు ఉషాకిరణ్ మూవీస్ రామోజీరావుగారు.
ఏమయిందీ ఆ నాటి నిర్మాతల  కళాభిరుచి? తేలిగ్గా రీళ్ళు చుట్టేసి వారంలోపలే ఐనకాడికి దండుకోవాలన్న వ్యాపారయావేనా టాలీవుడ్డుది? చక్రపాణిగారు చెప్పిన కళాత్మక వ్యాపారానికి ఇహ తెలుగునేలమీద నూకలు చెల్లినట్లేనా?
అడవి బాపిరాజుగారి గోన గన్నారెడ్డి తెలుగులో లేకుంటే ఈ పాటికే ఓ సెల్యులాయిడ్ వండర్ అయివుండేదేమో? కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ఆ నవలనిండా దట్టించి ఉందని తెలియడానికి ముందది చదివుండాలిగా? తీరికున్నవారికి  ఓపిక లేదు.  ఓపికున్నసినీపెద్దల ఓపెనింగ్శు దృష్తి వేరు. దేశభక్తుల పేర్లకు సేలబిలటీ ఎక్కువ కాబట్టి టైటిలు వరకు ఆ పేర్లు పెట్టి రొటీన్ కథలను  వండి వార్చే  కుకవులు ఎక్కువవుతున్నారు. అదే విచారకరం. హాలివుడ్ లో సగం చిత్రాలు నవలల ఆధారంగానే వస్తుంటాయి. వాటినే మక్కీకి మక్కీగా కాపీ కొట్టి కోట్లు కాల్చుకునే బదులు.. లక్షణంగా మన తెలుగు కథలనే సినిమాలుగా తీస్తే నేటివిటీ సమస్య రాదు. క్రియేటివిటీ ఉంటే కాసులే కాసులు. ప్రేమనగర్, మీనా, ఏప్రియల్ ఒకటి విడుదల, బలిపీఠం,  గోరింటాకుల్లాగా.
సామాన్యుల మధ్య నిత్యం నలిగే సాధారణ రచయితలను కదిలించి చూడండి! సాహిత్యంతో నిత్యసంపర్కంగల మేధావుల రచనలను పరిశీలించండి! అసాధారణమైన కథలు బైటపడతాయి. వారం వారం పత్రికలు ప్రచురించే కథనాలు కాస్త ఓపిక చేసుకుని పరిశీలనా దృష్తితో చూడండి! తాజాతాజాకథలకు బీజాలు పడతాయి. టీవీ చానెల్సులో జర్నలిస్టులు  అత్యంత వ్యయప్రయాసలకోర్చి సమర్పించే కొన్ని కథనాలలో ఊహించడానికైనా వీలులేని కొత్త అంశాలు కొన్నిసార్లు తళుక్కుమంటుంటాయి. దండకారణ్యంలో తండాల జీవితాలను పరిశీలించడానికని వెళ్ళిన ఓ మహిళా జర్నలిస్టు అక్కడి మహిళలు వంటిమీద జాకెట్లు వేసుకునే హక్కులకోసం మగవారితో ఎన్నో ఏళ్ళబట్టి సంఘటితంగా పోరాడుతున్నారన్న ఘోరం విని అవాక్కయారు.
ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రేమే జీవితం కాకపోయినా తెలుగు చిత్రాలకు మాత్రం అంతా ప్రేమమయంగానే కనిపిస్తోంది మరీ ఈ మధ్య ఆ ప్రేమ ఎలిమెంటరీ స్థాయికీ దిగింది! ముంబయి భామలచేత చిందులు తొక్కించే చౌకబారు కిటుకులతోనే ఇక్కట్లన్నీ వచ్చి పడుతున్నాయి. ఏ చిత్ర విజయానికైనా కథ, కథనాలే ప్రాణమని తెలిసీ.. సరిగ్గా ఆ ఆయువుపటుమీదే సినిమాజీవులు  చావుదెబ్బ కొట్టుకంటున్నారంటే అంతకుమించిన ఆత్మహత్యాసదృసం ఇంకేముంటుంది?!
పొరుగు చిత్రాల పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉందా? మంచికథలతో అప్ప్డప్పుడైనా కొన్ని విజయాలు సాధించుకుంటున్నారు అక్కడివారు. అక్కడ విజయవంతమైన చిత్రాలను కొని  అతకని కథనాలతో చేతులు కాల్చుకునేకన్నా నేరుగా తెలుగు కథలనే నమ్ముకుంటే ఇన్ని అపజయాలు తరుముకొస్తాయా?
ఇవాళ ఇంటికొకడు అమెరికాలాంటి దేశాలకు వెళుతున్నాడు. కనీసం పోవాలని కలలు కంటున్నాడు. పల్లెటూరి ఇల్లాళ్ళు సైతం సంసారాలు భర్తలమీద వదిలేసి  అరబ్బుదేశాల విమానాలు ఎక్కుతున్నారు. బతుకు తెరువుకోసం దిగువ మధ్యతరగతి చేసే జీవనపోరాటం వెనక ఎంత కుటుంబహింస ఉందో గమనిస్తే గుండె తరుక్కుపోయే కథలు బైటకొస్తాయి.  అమ్మాయిల్ని ప్రేమలో పడెయ్యటమే అబ్బాయిల అంతిమ జీవనసాఫల్యం అన్నట్లు.. ఆ లక్ష్యసాధనలో ఎంత హింస జరిగినా పుణ్యకార్యం చేసినట్లేనని సమాజం భావిస్తున్నట్లు.. అదే పాయింటు చుట్టూ.. ఎన్ని బొప్పిలు కట్టినా.. కథలు అల్లుకుని బొక్కబొర్లాపడే తెలుగు సినిమా జీవులను చూసి నవ్వాలా..ఏడవాలా?
చిత్రం అంటే వినోదమన్న మాట నిజమే కానీ.. ఆ వినోదం వంకతో వంకర వ్యాఖ్యానాలు చేసే చిత్రాలు సమాజానికి నిజానికి  చేసే చెరుపు అంతా ఇంతా కాదు. గతంలోనూ మాయాబజారు, మిస్సమ్మ, జగదేకవీరుడు, గుండమ్మ కథ లాంటి వినోద చిత్రాలు రాలేదా? వాటి విజయానికి కేవలం హాస్యమొక్కటే కారణం కాదు.  కథ నేల విడిచి సాము చేయకపోతే.. సగటు ప్రేక్షకుడి లోకంలోనే నమ్మదగిన రీతిలో సంచారం చేస్తే  సంచలన విజయాలు నమోదు చేసుకోవడం కష్టసాధ్యం కానే కాదు.
తాజాదనమంటే అతకని పాశ్చాత్య జీవన విశృంఖలత కాదు. యాక్షన్ చిత్రమంటే ఫ్యాక్షన్ ఫిక్షను అసలే కాదు. సెంటిమెంటు పండించడమంటే తల్లుల్ని పొగిడి తండ్రులతో వెకిలిగా ప్రవర్తించడం అసలే కాదు. ఇవాళ్టి తెలుగు చిత్రాలలోని లోపాలను ఎత్తి చూపడం కంటే జల్లెడలోని చిల్లుల్ని లెక్కపెట్టడం తేలిక.
కథలకు కరువు ఎప్పుడూ ఉండదు. అంతర్జాలంలోకి ఓ సారి తొంగి చూడండి. అంతర్జాతీయంగా తెలుగువాడు ఎలా వెలిగిపోతున్నాడో  అర్థమవుతుంది. ప్రపంచస్థాయి నెంబర్ వన్ సాఫ్టువేరు మైక్రో సాఫ్టుకి మన తెలుగు వాడు సత్య నాదెండ్లే సారథి. అనంతపురం బండమీదిపల్లె బుల్లోడు ఒకప్పుడు బుష్ ఆంతరంగిక సలహాదారుల్లో ఒకడు. బిల్ క్లింటన్ కి డ్వాక్రా మహిళతో కలిసి స్టెప్పులేయడం ఇష్టం. బిల్ గేట్ స్ కలకత్తాదాకా అని వచ్చి భాగ్యనగరం సౌందర్యంమీద మనసు పారేసుకుని పోయాడు! తెలుగు మహిళ కట్టు, బొట్టు ఖండాతరాల్లో సింగార పతాకం ఎగరేసింది ఎప్పుడో! మన యోగామీద ప్రపంచం చైనా కుంగ్ఫూ కన్నా ఎక్కువ మోజు పడుతున్నది కనకనే ఐక్యరాజ్యసమితి దానికో రోజు ప్రత్యేకంగా కేటాయించిందీ మధ్య. భగవద్గీతను రష్యన్లు ఉగ్రవాద సాహిత్యంగా పొరబడి నిషేధించడానికి పూనుకుంటే ప్రపంచమంతా ఉత్తుత్తినిరసనలు మారుమోగాయా? మన  మంగళంపల్లి బాలమురళికి ఫ్రెంచి ప్రభుత్వం సంగీత సంబధమైన సర్వోత్తమ పురస్కారం అందించిందా మధ్య. మన తెలుగు పిల్లల సాఫ్టువేరు విజయగాథలు ఎన్ని గంటలు చెప్పుకున్నా తరిగి పోనివి.
ఇవన్నీ నాణేనికి ఒక వైపు. మరో వైపు బక్కెటు నీళ్లకోసం మైళ్ళు మైళ్ళు నడిచి వెళ్ళి పాతాళంనుంచి రెక్కలు విరుచుకుని చేదుకునే చేదు అనుభవాలు.  ‘ఫ్రీ- సెక్సు’ మన సంస్కృతి కాకపోయినా  అడుగడునా  పంజాలు విసిరే పులిరాజాల జోరు రోజురోజుకు ఎక్కువవుతున్న తీరు. విదేశీ మహిళనైనా అత్యంత పధాన శక్తిగా నెత్తిన పెట్టుకున్న జాతిలోనే ముక్కు పచ్చలారని బాలికలకు పరువు హత్యల బెదురు. ప్రపంచ సుందరులూ ఇక్కడినుంచే. తెల్లతోలు కనకే అధికారం అప్పగింతలన్న అవాకులు చెవాకులూ ఇక్కడనుంచే!. చీడను చంపలేని పురుగుమందు అన్నదాత ఆత్మాహుతి క్రతువులో మాత్రం ఎన్నడూ విఫలమవడం లేదు! అవినీతిలో మన దేశం ఎప్పుడూ అగ్రస్థానంనుంచి దిగింది లేదు. సాగునీటి పథకాల ఉచ్చులో చిక్కుకున్న సామాన్యుడు  వరద ముంచుకొస్తే మాత్రం ఇంటి కప్పునుంచి దిగడం లేదు. అన్నం పెట్టని సర్కారు పథకాలు.. గన్నులు పట్టిన రక్షకభట వర్గాలు.. అన్నింటి గురి సామాన్యుడి ఊపిరిమీదే! వత్తిళ్ళు, అనారోగ్యం, నిరుద్యోగం, పరాయీకరణ, పాశ్చాత్యీకరణ, విచ్చిన్నమవుతున్న మానవ సంబంధాలు, నిలకడ మరిచిన రూపాయి నడక,    కూలిపోయే కుటుంబ విలువలు, మతాంతరీకరణలు.. అన్నింటికీ మించి  నొప్పి తెలియకుండా చీపులిక్కరు గొంతులో  వంపే తీరులో ఇప్పుడీ నీతి మాలిన  కథలతో తెలుగు చిత్రాలు! 
కథలు పుట్టాల్సింది మనిషిని చైతన్యపరిచే సమస్యలోనుంచా? కడప తరహా బాంబుల,భీభత్స ప్రయోగాల  నుంచా? కరువు కాటకాలు వర్ధిల్లుతున్నంత కాలం కథలకు కరువుండ కూడదు న్యాయంగా.  కానీ తెలుగు సినిమాలకు కథల కరువు?!  మంచి చిత్రాలు మనం చూడలేకపోవడానికి  కారణం మంచి కథలు  కరువై కాదు. మంచి కథలతో చిత్రాలు చేద్దామన్న సంకల్పం సినీజీవులకు కరువవడం వల్ల!
***




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...