ఆంధ్రభూమి- వారపత్రిక- 4 జూన్ 2015 సంచికలో ప్రచురితమైన నా
కథ
కథానిక
పరీక్ష
రచనః కర్లపాలెం హనుమంతరావు
మొదటి రాత్రి. శశి గదిలోకి వచ్చింది పాలగ్లాసుతో. రామారావా
గ్లాసందుకొని టేబుల్ మీదుంచి తలుపులు లోపలికి గడియవేసి బిడియంగా నిలబడున్న
అర్థాంగిని మృదువుగా పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. తలొంచుకొని కూర్చోనున ఆమె
మొహాన్ని అరచేత్తో కొద్దిగా పైకెత్తి చిర్నవ్వులు చిందిస్తూ అన్నాడు రామారావు 'మనిద్దరికీ ఇది మొదటి పరిచయం కాదుగా!ఎందుకంత
సిగ్గు?'
శశి కళ్ళల్లో నీరుచూసి కంగారుగా అన్నాడు' సారీ! నేనేమన్నా అనరాని మాట అన్నానా?'
శశి గభాలున బెడ్ దిగి రామారావుపాదాలు కళ్ళకద్దుకుంది.
రామారావు షాక్!
;ఇదేంటి శశీ కొత్తగా! ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? అంటూ ఆమెను పైకి లేపి మళ్లీ బెడ్ మీద పక్కన
కూర్చోపెట్టుకున్నాడు. 'ఏదైనా సరదాగా కబుర్లు చెప్పచ్చుగా! ఈ
పాదాభివందనాలు.. ఇవీ ఏంటీ.. మరీ పాతకాలంనాటి సినిమాల్లోలాగా!' అనంటుంటే సశి నోరు తెరిచి నిదానంగా అన్నది ఒక్కొక్క మాటే వత్తి పలుకుతూ 'మీకు తెలీదు మీరు నాకెంత ఉపకారం చేసారో! నా జన్మంతా ఊడిగం చేసుకున్నా మీ
రుణం తీరేదికాదు'
'ఇది మరీ బాగుంది. డైలాగులుకూడా సినిమాల్లోవే! ఏమైంది శశీ..
మరీ అంత సెంటిమెంటల్ గా ఫీలవుతున్నావు? ఇందులో నేను చేసిన ఘనకార్యంమాత్రం ఏముంది? నువ్వు
నాకు నచ్చావు. నా అదృష్టం బాగుండి నేనూ నీకు నచ్చాను. మనిద్దరి అదృష్టం బాగుండి
మీవాళ్లకి, మా వాళ్ళకికూడా మనమిలా ఒకటవడానికి అభ్యంతరం
లేకుండా పోయింది. కథ క్లైమాక్సు సీన్లుకూడా అయిపోయాయి మ్యాడం! 'శుభమ్' కార్డు వేసేయాలి తమరింక'.
వాతావరణాన్ని తేలికపరఛడానికి రామారావు అలవాటు లేని సరదాతనాన్ని ప్రదర్శిస్తుంటే ..
శశి అంది చివరికి 'పెళ్ళి మగవాడికి ఒక అవసరం
మాత్రమే అంటారు. ఆడదానికి అదే జీవితమండీ! ఆ అదృష్టానికి ఆడది నోచుకొనేది జీవితంలో
ఒకే ఒకసారి ఈ దేశంలో. ఖర్మకాలి ఆ పెళ్ళిగాని వికటిస్తే జీవితాంతం మోడులాగా మాత్రమే
బతకాలని శాస్తిస్తుందీ సమాజం. కాలం ఎంత మారినా.. అభిరుచులు ఎంత మారినా ఆడదాని
విషయంలో మాత్రం ఏ తేడా లేదు.. ఈ అధునాతన యుగంలో కూడా! అట్లాంటిది ఒకసారి
పెళ్ళిపీటలమీద కూర్చుని భర్తను పోగొట్టుకున్న నష్టజాతకురాలిని .. నాకు మరోసారి ఈ
మాంగల్యజీవితం లభించిందంటే ఏదో కలలోలాగా ఉందంతా! మనమంటే వయసులో చిన్నవాళ్ళం.
పెద్దవాళ్ళైన మీ అమ్మానాన్నలుకూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారంటే నాకిప్పటికీ
నమ్మబుద్ధికావడం లేదండీ!
'ఆఁ..! వూరికే ఒప్పుకొనుంటే అది గొప్పతనమయుండేది. పరీక్షలు
పెట్టారుగా..!' అన్నాడు రామారావు నిష్ఠురంగా.
'అయినా సరే! పరీక్షలో తప్పిన విద్యార్థికి గ్రేసుమార్కులిచ్చి
పాసుచేయడంకూడా గొప్పేనండీ!' అంది శశి.
రామారావుకు ఏమనాలో అర్థంకాక శశివంక అలా చూస్తూ ఉండిపోయాడు. 'పరీక్ష' ఏంటో
తెలియాలంటే మనమూ కాస్త వెనక్కి వెళ్ళాల్సుంటుంది.
***
శశి తండ్రి పాపారావుగారు ప్రభుత్వోపాధ్యాయుడు. శశి ఆయనికి
మొదటి సంతానం. తరువాత ఇద్దరు ఆడపిల్లలు. శశి డిగ్రీలో ఉండగా సుబ్బరాజు సంబంధం
వచ్చింది. పిల్లాడు ఆర్టీసీలో డ్రైవరు. అన్నిరకాలుగా విచారించుకున్న తరువాతే
పాపారావుగారీ సంబంధం ఖాయం చేసుకున్నారు.
ప్రధానం అయిపోయినా పెళ్ళిమూహూర్తాలు
శశి పరీక్షలయిపోయిన తరువాత పెట్టుకున్నారు. శశి రోజూ సుబ్బరాజు ద్యూటీలో ఉన్న
బస్సులోనే కాలేజీకి వెళ్ళిరావడం అలవాటు చేసుకుంది. 'కాబోయే దంపతులే కదా.. ఇందులో పెద్దగా అభ్యంతర పెట్టాల్సిందేముంది?'
అనుకున్నారు ఇరుపక్షాల పెద్దలు.
శశి పరీక్షలు అయిపోయిన
నెలలోనే ఏ ఆటంకం లేకుండా పెళ్ళి జరిగిపోవడంతో పాపారావుగారు ఊపిరి
పీల్చుకున్నారు. ఆయనకు కాస్త జాతకాలమీద నమ్మకం జాస్తి. మంచి ముహూర్తం చూసుకుని
మూడు రోజుల తరువాత
శోభనం పెట్టుకొన్నారు.
మొదటి రాత్రి అయిపోయిన మర్నాడు సుబ్బరాజు డ్యూటీకి
బయలుదేరుతుంటే 'ఈ రెండు రోజులుకూడా సెలవు
పెట్టాల్సింది బాబూ!' అని బాధపడ్డారు పాపారావుగారు. 'సెలవులాట్టే లేవు మామగారూ! రేపు శశిని కాపురానికి తీసుకు
వెళ్లాల్సివచ్చినప్పుడు మళ్ళా పెట్టాలిగదా! మా అమ్మకుకూడా వంట్లో బాగుండటం లేదు.
ఎప్పుడే అవసరమొస్తుందో తెలీదు. ఇప్పుడు మాత్రం ఏమైంది? సాయంత్రం
డ్యూటీ దిగంగానే ఇటే వచ్చేస్తానుగా!' అంటూ వెళ్ళిపోయాడు
సుబ్బరాజు. చిక్కడపల్లి క్రాసురోడ్డులో ఎదురుగా వస్తున్న మిలటరీ ట్రక్కు
గుద్దుకొని సుబ్బరాజు డ్యూటీ చేస్తున్న బస్సు తుక్కు తుక్కయిపోయింది. ఆ ప్రమాదంలో
నలుగురు ప్రయాణీకులకు గాయాలయినా ప్రాణాలు పోయిందిమాత్రం ఒక్క సుబ్బరాజువే!
శశి దురదృష్టజాతకురాలన్నారు. ఆర్టీసీలో శశికి ఉద్యోగం
వచ్చిందికానీ.. సుబ్బరాజు తనవెంట తీసుకుపోయిన మాంగల్య సౌభాగ్యమో?!
శశి తన జీవితాన్ని గురించి ఆలోచించడం మానేసి
చెల్లెళ్ళిద్దరి బతుకుల్ని తీర్చిదిద్దడంలో తండ్రికి సాయపడ్డంలో మునిగిపోయింది.
రెండోకూతురు పెళ్ళికూడా అయిందనిపించి పాపారావుగారు టపా కట్టేసారు. ఇంటిపెద్ద
హోదాలో చివరిచెల్లెలికి పెళ్ళిసంబంధాలు చూసే పని శశిమీదే పడింది. ఆ సందర్భంలో
కలిసాడు రామారావు.
శశి మ్యారేజి బ్యూరోలో ఇచ్చిన ప్రకటనకు స్పందించి శశిచెలెలు
సుభద్రను చూడటానికని వచ్చాడు రామారావు. రామారావు ఏజీ ఆఫీసులో యూడీసీ. కట్నం
మీదాట్టే ఆశలేదు. చూడ చక్కంగా ఉండి ఇంటి పనులు చక్కపెట్టుకునేపాటి తెలివితేటలుంటే
చాలనుకునే పెద్దలు రామారావు తల్లిదండ్రులు. సుభద్ర వాళ్లకన్ని విదాలా నచ్చింది.
సుభద్రకూ ఓకేనేగానీ.. రామారావే అడ్డం తిరిగాడు. 'పిల్ల మరీ చిన్నపిల్ల' అని అతగాడి పేచీ. సర్ది
చెప్పడానికని వెళ్ళిన శశిని ప్రత్యేకంగా పక్కకు తీసుకు వెళ్ళి నిజం చెప్పేశాడు
రామారావు' నాకిది మొదటి పెళ్ళి కాదు. కాన్పు ఇబ్బందై ఆవిడ
పోయింది. బిడ్డా పోయింది. ఈ విషయాలన్నీ పెళ్ళైన తరువాత నెమ్మదిగా
చెబుదామనుకుంటున్నారు మా వాళ్ళు, మీరూ అనుభవంలేక
తొందరపడుతున్నారు. సారీ! ఇలా అన్నానని మరో విధంగా భావించకండి! మీ చెల్లెలైతే నా
కంటికి నా చెల్లెల్లాగానే ఉంది'
విషయం తెలిసిన తరువాత సుభద్రా మొండికి దిగింది. ఈ వ్యవహారం
అంతటితో ముగిసిందనే అనుకొంది శశి.. మూడు
నెలల తరువాత ఆ రామారావు శశి పనిచేసే ఆఫీసు వెతుక్కుంటూ వచ్చి ఓ ప్రపోజల్ ముందుంచిందాకా. 'మీ చెల్లెలు చక్కనిది. చిన్నపిల్ల. ఇవాళ
కాకపోతే రేపైనా మంచి జోడు దొరక్కపోదు. పి. జి. పూర్తి కానీయండి! మీ సంగతే మీరు ఆలోచించుకోవాలి
ముందు!' అన్నాడతను.
'అంటే?' భృకుటి
ముడిచింది శశి కాస్త సీరియస్ గా.
'సారీ! ఉచితసలహాలు ఇస్తున్నాననుకోవద్దు మ్యాడమ్! చెల్లెలు వెళ్లిపోయింతరువాత మీరు ఒంటరిగా
ఉండాలి. సమాజం ఏ తీరులో ఉందో నాకన్నా ఆడవారు మీకే బాగా తెలుసు. '
రామారావు ఏ ఉద్దేశంతో అన్నా అతనన్న మాటల్లో వందశాతం
వాస్తవముంది. వయసులో ఉన్న ఆడది వంటరిగా ఉందని తెలిస్తే చాలు.. దొరలమనసుల్లో కూడా దొంగబుద్ధులు
తొంగిచూస్తున్నాయి. తను రోజూ అనుభవిస్తున్నదే ఈ రంపపుకోత. అలాగని ఒకసారి
పెళ్లయి మొగుణ్ణి పోగొట్టుకొన్న స్త్రీని ఏ స్వార్థంలేకుండా జీవితంలోకి
ఆహ్వానించేంతగా మగజాతిమాత్రం అభివృద్ధి చెందిందా?! సంస్కారవంతులమని అనిపించుకోడానికి ఏ కొద్దిమందో ముందు ముందుకొచ్చినా .. కలకాలం ఆ ఉత్సాహం అలాగే
ఉంటుందన్న గ్యారంటీమాత్రం ఎక్కడుంది?!'
ఆ మాటే అన్నప్పుడు నీళ్ళు నమలకుండా మనసులోని మాట
బైటపెట్టేడు రామారావు'మీ చెల్లెల్ని చూసింతరువాత నేను
రెండు మూడు సంబంధాలు చూసాను. ఎక్కడ పెళ్లచూపులకని వెళ్ళినా ఆ పిల్ల స్థానంలో మీరే కళ్లముందు కదిలేవారు.
ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. కానీ నా మనసులోని మాటను ఇంకెలా చెప్పాలో
తోచటంలేదు. ఊరికే మధనపడుతూ కూర్చునేకన్నా
ఒకసారి నా ఫీలింగ్సుని మీకు తెలియచేస్తే బాగుంటుందని ఇలా సాహసం చేసాను. ఆ తరువాత
మీ ఇష్టం. నా అదృష్టం' అంటూ శశి స్పందనకోసమన్నట్లు ఆగాడు.
ఇలాంటి విషయాల్లో సత్వరం స్పందించడం అంత తేలికా?! అందులోనూ ప్రపోజల్ పెట్టిన వ్యక్తి
ఎదురుగా ఉంటే ఏ ఆడపిల్లయినా ఏమని చెబుతుంది?! శశిదీ అదే
పరిస్థితి. తను కలలోనైనా ఊహించని ప్రపోజలుతో వచ్చాడితను. ఏం చెప్పాలి? ఏమీ చెప్పకపోయినా ఇబ్బందే! అదే అలుసుగా తీసుకుని ఆనక వేధించడని గ్యారంటీ
ఏమిటి? కాస్త కరుకుదనం రంగరించి అడగదలుచుకున్నది సూటిగానే
అడిగింది శశి' నా గురించి మీరు అన్నీ తెలుసుకొని
రాలేదనుకుంటాను!'
'తెలుసు మ్యాడమ్ గారూ! సుబ్బరాజుగారి స్నేహితుడు మోహనరావు నా
క్లోజ్ క్లాస్ మేట్'
'మోహనరావుగారిక్కూడా తెలీని కొన్ని విషయాలు ఉన్నాయండీ! సారీ!
.. బట్ థేంక్యూ ఫర్ యువర్ కన్సర్న్.. సర్!' అని లేచి వచ్చేసింది శశి.
అంతటితో ముగిసిపోతే ఈ కథే ఉండేది కాదు. మూడునెలల తరువాత
ఒకాదివారం మధ్యాహ్నంపూట రిలాక్సుడ్ గా కూర్చుని టీ.వీ చూస్తున్న వేళ.. ఒక ముసలి జంట
గేటు నెట్టుకుని లోపలికి వచ్చారు. ముందు గుర్తుపట్టలేదుకానీ వాళ్ళు రామారావు
తల్లిదండ్రులు. ఇంతకుముందు సుభద్రను చూడటానికి రామారావుతో కలసి
వచ్చారు. సుభద్ర విషయం మాట్లాడటానికి వచ్చారేమో అనుకుంది. రామారావు సలహా తరువాత
సుభద్రపెళ్ళి చదువయిందాకా వాయిదా వేయాలనే ఉద్దేశంలోనే ఉంది శశి. ఆ మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే
పెద్దావిడ అంది 'మా అబ్బాయి రామారావు నీకు
తెలుసుటకదమ్మా! వాడు నిన్ను తప్ప చేసుకోనని మొండికేస్తున్నాడు. నువ్వే కాస్త
నచ్చచెప్పాలి తల్లీ!మాకీ వయసులో భగవంతుడీ కష్టం ఎందుకు తెచ్చిపెట్టాడో అర్థం
కాకుండా ఉంది.'
ఆమె అభ్యర్థిస్తుందా? నిష్ఠురమాడుతుందా? అర్థం కాలేదు శశికి. ఐనా
వాళ్ళబ్బాయికి తను నచ్చచెప్పడమేమిటి? ఏమని నచ్చచెప్పాలి?
ముసలాయన మాత్రం మనసులోని మాటను సూటిగా చెప్పేసాడు. 'మా వాడి కడుపున ఒక కాయకాసి వంశం నిలబడడం మాకు ముఖ్యం తల్లీ! వాడి మొదటి
భార్య పోయిన సంగతి నీకూ చెప్పాట్టగా! నీ పరిస్థితీ మాకూ చెప్పాడు. అయినా మీ
ఇద్దరికీ ముడిపెట్టి ఉంటే ఆపడానికి మేమెవరం? ఆ సంగతి
చెప్పిపోదామనే వచ్చాం ఇంత దూరం. ఇక పదవే పోదాం!' అంటూ
భార్యతో సహా వెళ్ళిపోయాడు పెద్దాయన.
శశి ఆశ్చర్యానికి అంతు లేదు. మళ్ళా పెళ్ళి అనే ఆలోచనే
మనసులో లేని తనవెంట పడుతున్నాడేమిటీ రామారావు ఇలా?! కొంపదీసి అతను తనను నిజంగానే ప్రేమిస్తున్నాడా సినిమాల్లోకి మల్లే!
ఇప్పుడు తనేం చేయాలి? మెదలకుండా ఉన్నా నిలవనిచ్చేట్లు లేడే ఈ మహానుభావుడు! ఊళ్ళో ఉన్న మామయ్యను 'ఒకసారి వచ్చి కలిసి పొమ్మ'ని కబురు చేసింది శశి.
మామయ్య రాకతో పరిస్థితి మరింత ముదిరింది. విషయం విని ఆయనా
సంతోషంతో గంతులేసేంత పని చేసాడు. 'ఆ రామారావుని దేవుడే పంపించినట్లున్నాడమ్మా! ఈ అవకాశం వదులుకోవద్దు! ఆడది
వంటరిగా ఉండాలంటే ఈ సమాజంలో కుదిరే పని కాదు. సమస్య శారీరకమైనదే కాదు తల్లీ! ఒక వయసుదాటిన
తరువాత ఒంటరి జీవితం తెచ్చిపెట్టే యాతనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు నీకు అర్థం
కాదు. బిడ్డలు లేకుండా ఈ వయసులో నేనూ , మీ అత్తమ్మా పడుతున్న
అవస్థలు చూడు! ఏం చేయాలో నీకే తెలుస్తుంది' అంటూ నచ్చచెప్పడం
మొదలుపెట్టాడు.
మామయ్యకుకూడా చెప్పలేని సంకటం తనది. ఆయనే రామారావుని
కలిసాడో, రామారావే ఆయన్ని కలిసాడో!
ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చాలాకాలంగా పరిచయమున్నవాళ్ళకు మల్లే కలివిడిగా తిరగడం మరీ
ఆశ్చర్యమనిపించింది శశికి. సుభద్రమీదా ఏ మత్తుమందు చల్లాడోగానీ.. అదీ మాటమాటకూ ఈ
మధ్య 'బావగారం'టూ రామారావునే
తలుచుకొంటోంది! ఇంతమంది దృష్టిలో మంచివాడు అనిపించుకున్న మనిషిలో నిజంగా మంచితనం
ఉండకుండా ఉంటుందా? మంచి ఉద్యోగం. వయసూ మరీ అంత మించిపోలేదు.
కావాలనుకుంటే అతను పెళ్ళిచేసుకోడానికి ఆడపిల్లలే దొరక్కపోతారా? అందాకా ఎందుకు? తను సుభద్రను ఇవ్వాలనుకోలేదూ! అయినా
ఇవేవీ కాదనుకుని తనమీదే దృష్టి నిలిపాడంటే.. సినిమాల్లోలాగానే తనంటే
ఇష్టమున్నట్లుంది!
తను ఇష్టపడేవాళ్లకన్నా ..తనను ఇష్టపడేవాళ్ళు దొరకడం నిజంగా
అదృష్టమే! చేతిదాకా వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకోవడం తెలివైన పనేనా? శశిమనసులో సుడులుతిరిగే ఆలోచనా తరంగాలు.
ఒకసారి ఆలోచనంటూ చొరబడాలేగాని.. దాన్ని మనసులోనుంచి
తరిమేయడం అంత సులభం కాదు. ఆర్నెల్ల పైనుంచి నడుస్తోందీ వ్యవహారం. శశికి
తెలియకుండానే రామారావు ఆమె మనసులో తిష్టవేసాడు. సుబ్బరాజుతో ఆమె పరిచయం కేవలం
రెండునెలలే! రామారావుతో స్నేహం ఎన్నో ఏళ్లబట్టి నడుస్తోన్నట్లనిపిస్తుందీ మధ్య
మరీ.
శశి పెళ్ళికి 'ఊఁ'
అనడంతో కథ సుఖాంతమయింది. ఈ మాఘమాసంలోనే శశి, రామారావుల
పెళ్ళి జరిగిపోయింది. ఇవాళ మొదటి రాత్రి.
***
'ఎళ్ళి చూపులు అంటేనే ఆడపిల్లకు ఒక పరీక్ష. అందులో
నెగ్గితేనే కదా 'శ్రీమతి' డిగ్రీ
వచ్చేది! నాకా బాధ లేకుండా పోయింది. ఇక మీ వాళ్ళు పెట్టిన పరీక్ష అంటారా? ఒకసారి పెళ్ళిపీటలమీద కూర్చొని లేచినదాన్ని. ఇలాంటి పరీక్షలు తప్పవులేండి!
దానికి మీ అమ్మానాన్నలను తప్పుపట్టడం భావ్యంకాదు.' అంది శశి
రామారావువంక ప్రేమగా చూస్తూ.
రామారావు సీరియస్ గా అన్నాడు 'శశీ! నీకు ఒక విషయం చెప్పాలి. ఇద చెప్పకుండా
దాచిపెడితే నాకూ .. మా అమ్మానాన్నలకూ తేడా ఉండదు'
'ఏంటండీ.. ఉన్నట్లండి అంత సీరియస్సయి పోయారు?' అంది శశి భయంభయంగా.
'విషయం కాస్త సీరియస్సే! నువ్వెలా రిసీవ్ చేసుకొంటావోనని
బెంగగా కూడా ఉంది. అయినా చెప్పడం నా
ధర్మం. దాచివుంచడం నా నైజంకూడా కాదు'
'ఏంటండీ.. అంతగా దాచివుంచిన రహస్యం?' శశి గుండెలు గుబగుబలాడుతున్నాయి.
'నీతో పెళ్ళికి ఒప్పుకోవడానికి మా అమ్మావాళ్ళు ఒక షరతు
పెట్టారు. నిన్ను మెడికల్ గా పరీక్ష చేయించాలని. కన్య అని రుజువయితేనే తాళి
కట్టాలని..'
శశి మొహం ఒక్కసారిగా జేవురించింది. రామారావు తనధోరణిలో తాను
చెప్పుకుపోతున్నాడు. 'నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకూ
ఇట్లాంటి సమస్యే ఒకటి ఎదురయింది. టైపు, షార్టుహ్యాండు
ప్రాక్టీసు చేస్తున్నానారోజుల్లో. మా తాతగారు ఆరోగ్యం బాగోలేక దాదాపు డెత్ బెడ్
మీదున్నారు. ఆ వత్తిడిలో నాపరీక్ష పోయింది. నేనా పరీక్ష పాసయితే తను పనిచేసిన
కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించాలని మా తాతగారి ఆశ. డాక్టర్లింక కొన్ని రోజులు
మాత్రమే టైముందని ప్రకటించిన సమయంలోనే నా
పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 'పరీక్ష ఏమయిందిరా?' అని ఆప్యాయంగా పక్కన కూర్చోబెట్టుకొని అడిగితే 'పాసయ్యాను
తాతయ్యా!' అంటూ స్వీటు నోట్లో పెట్టాబోయాను. స్వీటయితే
తినలేదుగానీ.. ఆ సంతోషంలో తృప్తిగా
కన్నుమూయడం నాకింకా బాగా గుర్తు. నా చేత ఆ రోజు అట్లా అబద్ధమాడించింది మా నాన్నే!'
'ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నట్లు?!'అని అయోమయంగా అడిగింది శశి.
'అట్లాంటి సంఘర్షణే మళ్ళా వచ్చింది శశీ నా జీవితంలో!
పెళ్ళికిముందు క్యాజువల్ గా చేయించామని చెబుతున్న పరీక్షలు నిజానికి 'వర్జిన్ టెస్టులే'
'కావే! అయుంటే నాకు తెలిసుండేవి' అంది శశి ఆశ్చర్యంగా. ఆమె పెదాలు
ఆవమానభారంతో వణుకుతున్నాయి.
'కావు. నాకు తెలుసు. కానీ ఉద్దేశం అయితే అదే కదా!
అమ్మానాన్నలను ఒప్పించడానికి నాకు తెలిసిన డాక్టర్లచేత అట్లాంటి నీచమైన నాటకం
ఆడించాను. లేకపొతే నువ్వు నాకు దక్కవని భయమేసింది'
శశినుంచి సమాధానం రాలేదు. రెండు మోకాళ్ళమధ్య తల పెట్టుకొని
అలా ఉండిపోయిందామె చాలా సేపు.
ఏం చేయాలో అర్థంకాలేదు రామారావుకి. సాహసంచేసి బలవంతంగా ఆమె చుబుకం పైకెత్తాడు. అగ్నిగోళాల్లా మండుతున్నాయి శశి
రెండు కళ్ళు. 'మీరు మీ వాళ్ళకి నిజం
చెప్పుండాల్సింది. సుబ్బరాజుగారు నేనూ ఆ మొదటి రాత్రి.. '
చప్పున ఆమె నోరు మూసేసాడు రామారావు 'మోహనరావు చెప్పాడదంతా. సుబ్బరాజుగారు చనిపోయేముందు అందుకే తనకన్నా నీ
గురించే ఎక్కువ వర్రీ అయాడనీ చెప్పాడు. అది వినప్పట్నుంచే నిన్నెలాగైనా నా దాన్ని
చేసుకోవాలనుకున్నాను శశీ!'
నమ్మలేనట్లు
చూసింది శశి కళ్ళింతింత చేసుకుని.
'అయితే జాలితో పెళ్ళి చేసుకున్నారా?' అనినువ్వడగచ్చు. చూడకముందు సానుభూతి.. చూసిన తరువాత
ప్రేమానుభూతి.. అదీ టూకీగా నా ప్రేమకథ' అన్నాడు రామారావు.
'సినిమాల్లోనే ఉంటారనుకున్నాను.. మీలాంటి మంచివాళ్ళు
నిజంగాకూడా ఉంటారన్నమాట!' అంటూ శశి రామారావు గుండెలమీద
వాలిపోయింది.
'పెళ్ళి తరువాత
నువ్వు గడిపింది ఒక్కరాత్రే. నా భార్య పోయింది
నా బిడ్డను కనలేక. తనూ పోయేటప్పుడు సుబ్బరాజుగారిలాగానే నా గురించి ఎక్కువ
బాధపడింది. నేను నిన్ను స్వీకరించడంలో గొప్పేముంది? నువ్వు నన్ను ఆమోదించడంలోనే ఉందసలు గొప్పదనమంతా!' అంటూ
శశిని తన గుండెలమీదకు లాక్కున్నాడీసారి చొరవగా రామారావు. గువ్వలా అతని గుండెల్లోకి
ముడుచుకుపోయింది ఆమె కూడా!
***
No comments:
Post a Comment