పిల్లనల్లగా
పుట్టిందని సాంబమూర్తి సంబరం. 'పాలనురుగు రంగుతో పుడితే నురుగులు కక్కాలిరా
మేమందరం. పాలడబ్బాలకి తోడు పవుడరు డబ్బీల ఖర్చుకూడా కరువు రోజుల్లో! ఢిల్లీ కాలుష్యం గురించి వేరే చెప్పాలా! పెళ్లి
దిగులుకూడా లేకుండా చేసింది మా పిచ్చితల్లి. నల్లబంగారమంటే ఎవరైనా ఇట్టే ఎగరేసుకు
పోతారు' ఆవటా అని సాంబయ్య సంతోషం!
మిల్కీ వైటంటే మహా
పిచ్చి మా మోహన్రావుకి. మొన్నే కొన్నాడు కొత్త మోడల్ మారుతీ ఆల్టో యూరో-టు! ఏం లాభం! కేడిలాక్ మోడలు కారునలుపుకి
తిరిగింది పదిరోజులపాటు హస్తిన వీధుల్లొ తిరిగేసరికి!
సాయిబాబా అని నా బాల్యమిత్రుడు కవిగాడు. చిన్నప్పట్నుంచే
చైన్ స్మోకరు. లంగ్ కేన్సరొస్తుందని లక్షమంది బెదిరించుగాక లక్ష్యపెట్టని జగమొండి. అరవయ్యో పడిలో పడీ అడయారు ఊడల మర్రిలా దృఢంగా
ఉన్నవాడు కాస్తా.. మొన్నదేదో పురస్కార ప్రదానోత్సవానికని దేశరాజధానిదాకా వెళ్ళొచ్చాడు. మర్నాడే పైకి టపా కట్టేసాడు! దిల్లీ గాలి ఓ గంట పీల్చినా చాలుట.. చార్మీనార్
నాన్-ఫిల్టరు సిగిరెట్లు పాకెట్టు పీల్చినంత చేటు' అని
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో హెచ్చరించింది.
ఆమ్ ఆద్మీ కమాండరు ఆ అరవింద్ కేజ్రీవాల్ని ఇవాళా రేపూ అంతా తెగ ఆడిపోసుకుంటున్నాంగానీ.. ఆ అబ్బి
వేసవికాలంలో సైతం ముఖం చుట్టూతా మఫ్లరు చుట్టుకోడం.. ఎడతెరిపి లేకుండా పొడిదగ్గు
దగ్గడం.. చూస్తే ఎంతటి భాజాపా భక్తుడికైనా గుండె తరుక్కుపోడం ఖాయం! మోదీ సాబంటే పి యం కాబట్టి విదేశాల్లో ఏదో పని పెట్టుకొని
రాజదాని వాయుగండంనుంచి రక్షణ పొందచ్చు.
దిల్లీకి అచ్చంగా ముఖ్యమంత్రయిపోయాడే
కేజ్రీవాల్జీ! కదిలేందుకు లేదు.. మెదిలేందుకు లేదు పక్కకి! ఏ ఉపాయం కనిపెట్టైనా సరే ఇక్కడే రాజకీయాలు చేసుకోక తప్పని దుస్థితి!
సరి, బేసి అంకెల్ని కనిపెట్టిన మహామేధావుల్ననాలిగానీ..
వాటి ఆధారంగా కార్లకు సంకెళ్లు వేస్తానంటున్నాడని
కేశవయ్యలా కేజ్రీవాలుమీద రంకెలేయడమేం
బావుంది! 'సరి సంఖ్యల కార్లన్నీ రోడ్లమీద కొచ్చేసి సర్దా
చేస్తుంటే బేసంకెలున్న పాపానికి బేకారుగా బేసుమెంట్లలోనే పడుండాలా మా కార్లన్నీ'
అని అతగాడి చిందులు!
'మరే!
ఉన్న ఒక్క వాహనాన్నీ రోజు మార్చి రోజు
కొంపలో దాపెట్టుకొని.. పనిచేయని రెండు కాళ్ళకి పని చెప్పాలంట
విడ్డూరం! మిల్కా సింగు మనమళ్లమా?.. పి.టి ఉష చెల్లెళ్లమా? అవ్వ! పిచ్చాళ్ల రాజ్యమైపోయిందంతా!
దావా వేసేసెయ్యాల్సిందే ఎవరైనా!'
లాయరు కృష్ణప్పయ్యరు లా పాయింటు!
'అవీ అయ్యాయిలేవయ్యా! కేసులు గీసులూ గుడ్డూ గూసుల్తో ఏమవుతుందీ! వారానికెటూ
రెండ్రోజులు సెలవులేనాయ ఆఫీసులకి! ఇంకో రెండ్రోజులు
అదనంగా సెలవులిచ్చేసి ఇంటిపట్టునే ఆ పనేదో చేసుకు రమ్మంటే సరి! పిల్లకాయలక్కూడా బళ్లసెలవులు పెంచేసి ఇళ్లదగ్గరే
ఆ బండహోంవర్కులేవో ముగించుకు పొమ్మంటే
సరి! సరి, బేసి అంకెల్తో సతమతమవాల్సిన ఖర్మే
ఉండదు.
'అదెలా కుదురుంతుందన్నయ్యా!
ఆఫీసుల్లో కాస్త కునుకేసినా లంచవరు వరకు అడిగే పాపాత్ముడుండడు కదా! ఇంట్లో ఆ సౌకర్యాలెట్లా సమకూర్తాయ్ భయ్యా!
కారు సమస్యలు చూసుకుంటే గృహసమస్యలు పెరగవా!' ఆనందరావు అభ్యంతరం.
'మరే!
మొగాళ్లు ఇంటి పట్టునే ఉంటే ఆడంగులకి అంతకన్నా నరకం లేదు. ప్రతికొంపా ఓ మెగాసీరియలయి
పోతుంది' అడ్డం తిరిగారు అపార్టుమెంటు అసోసియేషను
ప్రెసిడెంటు ఆండాళ్లమ్మగారు.
‘పని నిమ్మళంగా చేసుకొనే
దేశాలకేమన్నా 'ఇంట్లో
ఆఫీసు పన్లు' పన్జేస్తాయేమొ గానీ.. చాయ్ పానీలకు బాగా అలవాటుపడ్డ
ఆఫీసు ప్రాణులం మనం! ఇంటిపట్టునుంటే అంత శ్రద్ధుంటుందా అల్లుడూ! దేశరాజధానంటే నేల
నాలుగు చెరగుల్నుంచీ మనుషులు రోజూ చీమలదండుల్లా వచ్చిపోయేచోటు! లాబీయింగులు గట్రా చేసుకొనే స్పాటు. టిక్కీ అపార్టుమెంట్లలో ఆ కేంటిన్లూ కేరిడార్లు కుదిరే పనేనా
! ఇంటి దగ్గర భార్యో, భర్తో బాసిజం అంటే ఏదో అలవాటైపోయాం కాబట్టి సర్దుకుపోవచ్చు. ఆఫీసులో బాసుని బెటరాఫ్ గా
చూసుకోడం వరస్టు ఐడియా!’ గోపాలరావు గోల.
'కేవలం
రెండువారాలు ప్రయోగాత్మకంగా నడిపిద్దాం.
వచ్చే స్పందనను బట్టి ముందుకు పోదామా.. వద్దా ఆలోచిద్దాం'
అని ముందునుంచీ మొత్తుకొంటున్నాడు ఆమ్ ఆద్మీ కమాండరు!
కొత్తగా ఓ ఆలోచన ఆచరణలోకి
రావాలంటే ఎన్ని శిశుగండాల్రా బాబూ ఈ దేశంలో!
మా తోడల్లుడు
వీరాంజనేయులుగారి రెండోవాడు దిల్లీలో ఉద్యోగం.
మొన్నీమధ్యనే పెళ్లిచూపులకని ఇక్కడికొచ్చాడు.'పిల్లెలా
ఉందిరా బుల్లోడా?' అనడిగితే ' అక్క
పిఛ్చగా ఉంది. చెల్లెల్లు పచ్చిగా ఉంది. అయినా నో ప్రాబ్లం బాబాయ్!' అని కూసాడు! 'ఇద్దరు పిల్లల్తో నీకేం పనిరా?'
అని నిలదీస్తే అప్పుడు బైటపడింది కడుపులోని ఆలోచన. 'చేసేది దిల్లీలో ఉద్యోగం. ఒక్క కారుతో కుదిరి చావడం లేదు. రెండో కారు
తప్పని సరి. !' అని వాడి గోల!
కట్టుకథ
అనిపిస్తుంది కాని.. ఒట్టు.. మా శ్యామల్రావు కూతురు కాపురంకథకూడా ఇలాగే కేజ్రీవాలు
సరి-బేసి పథకంవల్ల కంచికి చేరింది! ఇష్టపడి ఇంట్లోవాళ్లని ఒప్పించి మరీ చేసుకుందా
వ్యాఘ్రేశ్వర్రావుని పెళ్లి! ఇప్పుడు విడాకులకు నోటీసు పంపించింది. 'మరేం
చెయ్యమంటావ్ మామయ్యా! వ్యాఘ్రూ కారూ.. నా కారూ ఒహటే సరి నెంబర్లయిపోయాయి. ఎంత మార్పించుకుందామన్నా కుదరకే చివరికిలా
విడిపోదామనని నిర్ణయం. మొగుణ్నంటే మార్చుకోగలం గాని.. మూడేళ్లబట్టీ చేసే సచివాలయం
జాబు మార్చుకోలేం గదా!' అనేసింది. ఈసారి చేసుకొనేవాడి కారు
నెంబరు కంపల్సరీగా బేసి నెంబరు అయివుండాలని కండిషను ఆ అమ్మడిది!
మా కొలీగు లక్ష్మీప్రసాదు
కొడుకు లకీనెంబరు ఆరు. కొన్న రెండుకార్లకూ చివర్లో అదే సరి నెంబరు! కొత్త సంవత్సరం మొదటి తారీఖున 'బాసుని
కలిసి శుభాకాంక్షలు చెప్పడం' కుదర్లా! వచ్చే వచ్చే ప్రమోషను బిగుసుకుపోయింది! ఊహించని
చార్జిషీటొచ్చి తగులుకుంది' అని భోరుమన్నాడు మొన్నోసారి ఫోనులో కలిసినప్పుడు. 'బస్సులు బోలెడు అదనంగా
నడుస్తున్నాయిట కదరా! కష్టపడైనా సరే బాసుని కలిసుండాల్సింది!' అని నేనిటునుంచి నిష్టూరాలకు దిగితే 'కలవకుండా ఉంటే
కుదురుతుందా బాబాయ్! అలవాటు తప్పిన ఆ బస్సు బోర్డింగే నా కొంపముంచింది. ఫుట్
బోర్డుమీదనుంచి జారి ఆసుపత్రి బెడ్డుమీద
పడ్డా!' అని గగ్గోలు . కాలుక్కట్టిన కట్టుతో వాట్పప్ లో ఫోటో
పెట్టాడు!
శాపనార్థాలు పెట్టే
ఓటర్ల ఉసురు తగలరాదని అప్పటికీ పాపం ఆ మఫ్లరుసారు కారుచోదకులకు బోలెడన్ని
మినహాయింపులు దయసాయించాడు.
వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. కేజ్రీవాలు సారు సరి-బేసి
పథకం మా కేశవయ్య కొడుకు పోలీసు
ఉద్యోగానికి ఎసరు పెట్టేట్లుంది చివరకు! చేసే చేసే దిల్లీ గస్తీపోలీసుద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాట్ట కేశవయ్య కొడుకు!
'మఫ్లర్
సాబ్ పుణ్యమా అని మాలో సగం మందిమి
పిచ్చాళ్లమయి పోతిమి. బండి పేపర్లే చదవాలా? బండ ఫేసులే
ఛూడాలా? ప్లేటుమీది నెంబర్లే కూడాలా? స్పీడో
మీటర్లమీది అంకెలే చూడాలా? వాహనదారుల లింగ నిర్ధారణ మా చావుకొచ్చింది! ముసుగుచోదకులంతా మహిళామణులేనని
నమ్మాలి! బుగ్గమీసాలు కనబడుతున్నా
కుర్రపిల్లలేనంటే బుర్రలూపాలి ! గుండెమీద చెయ్యింటే చాలు. గుండులా
ఉన్నా ఆసుపత్రికే వెళుతున్నట్లే లెక్క.
ఫ్యాక్టరీ గొట్టంకన్నా పొగలెక్కువ కక్కుతున్నా పొల్యూషన్ సర్టిఫికేట్ ప్రకారం పర్ఫెక్టు! మాసి మరకలతో
పెచ్చులూడి వేలాడే నామఫలకంమీది నెంబర్లు సరో..బేసో తెలుసుకోవాలి! గంటకు వంద కిలోమీటర్ల వేగంతో
దూసుకొచ్చే బండి నెంబరు దిల్లీపొగలో చదివేవిద్య పట్టుబడాలి! ఏది
విద్యుత్ వాహనమో.. ఏది వంటగ్యాసు సరుకో.. వాసన పట్టే
నాసికాపుటాలు మూసుకుపోయి చానాళ్లయింది మా పోలీసుద్యోగులకి!’
‘సరి-బేసి’ పథకం కొత్తఏడాది మొదటిరోజే మొదలవడం
మా చావుకొచ్చింది. పీకల్దాకా తాగి బండి నడిపే శాల్తీ సొంత పేరే
గుర్తుకురాక నాలిక మడతేస్తుంటే ఎవడు వి. ఐ. పి నో.. ఎవడు వి.పి.
పుల్లాయో వడబోసేది ఎలా? ఇంకా పథ్నాలుగు రోజులు
నడిపించాలి బండి! నా
వల్ల కాక ఇలా మొండికి తిరిగా డాడీ!' అంటూ చావు కబురు చల్లంగా
ఊదాడు కేశవయ్య కొడుకు.
'పై
రాబడి.. పెద్దాళ్లమధ్య బోలెడు పలుకుబడి! నీ బోడి పదో తరగతి చదువుకి ఈ నౌఖరీనే
గొప్ప. ఇదీ విడిచిపెట్టేసి పెళ్లాం పిల్లలకేం పెడదామనిరా?'
అంటూ నాయన ఇక్కడ వేసే గంతులకి
ఆ మాజీ పోలీసాయన ఇచ్చిన బదులు వింటే చాలు .. మన దేశంలో ఏ కొత్త పథకమైనా ఆదిలోనే ఎందుకు హంసపాదులో పడుతుందో
తెలిసిపోతుంది.
'పోలీసుద్యోగంలోకి
రాకమునుపు మన భాగ్యనగరం రాంకోఠీలో ఐదురూపాలిస్తే చాలు పాత నెంబరు ప్లేటు గీకి కోరిన
అంకెలు చెక్కిచ్చే వాడుట
ఈ కేశవయ్య కొడుకు! ‘మళ్ళీ అదే పనికి దిగుతున్నా! మూడునుంచి
ఐదు వేలు పలుకుతున్నాయి ఫేక్ నెంబరు ప్లేట్లు. నలుగురు కుర్రాళ్లని పెట్టుకొని ఈ పథ్నాలుగు
రోజులు పని నడిపించినా చాలు.. మామూళ్లకు పోను మిగిలేదెంతో తెలుసా డాడీ! బోడి
పోలీసు గొడ్డుచాకిరీలో ఏడాది సంపాదనకి పది రెట్లు!'
నిన్నటిదాకా కేజ్రీవాలుని క్రాకని తిటిపోసిన కేశవయ్య 'గ్రేట్’'
అని
పొగుడుతున్నాడు ఇప్పుడు!
-***
-కర్లపాలెం హనుమంతరావు
( సూర్య దిన పత్రిక కాలమ్ - 10 నవంబర్ 2019 ప్రచురితం )
'
'
No comments:
Post a Comment