Friday, January 1, 2016

ఆకలి మింగిన రోకలి- కౌముది కథానిక

చంద్రగ్రహణం పట్టిన రోజున  నీళ్ళు పోసి నిలబెడితే పడకుండా గ్రహణం ఉన్నంతసేపూ రోకలి అలాగే నిలబడి ఉంటుంది! రోకలికి గ్రహణంతో ఏం సంబధమో విజ్ఞానశాస్త్రమే వివరించాలి! రోలొచ్చి రోకలితో మొరపెట్టుకొందని మనకో సామెతా ఉంది.
'పిచ్చి ముదిరింది. రోకలి తలకు చుట్ట'మని మరో నానుడి. పిచ్చికి రోకలి ఎలా  మందయిందో తెలీదుగాని.. ఆకలికి మాత్రం రోకలే మంచిమందని మనవాళ్ళు మనసారా నమ్మినట్లున్నారు.
'అమ్మా! ఆకలేస్తుందే!' అని ఆ పిల్లాడు కొంగుపట్టుకొని వేళ్లాడుతుంటే ఆ వేధింపులకు తాళలేక 'ఆకలేస్తే  రోకలి మింగు!' అని ఈసడించుకొంది ఆ తల్లి.
అడక్కుండానే బిడ్డకు అన్నం పెట్టాలన్న ద్యాస ఏ తల్లికైనా ఎందుకుండదు!
ఘోరకరువులు! మూడేళ్ళుగా వరసబెట్టి వచ్చి దుంపతెంపి పోతుంటే ఊరు ఊరంతా బీడుగా మారి పోయుంది. గాదెలో దాచిన ధాన్యమూ పూర్తిగా నిండుకొని అడుగు తాటాకు బద్దల్ని గీరుకు తింటున్నాయి ఎలుకలు.
పనులుంటే ఆ ఇంటి యజమానేమైనా పాలుమాలే రకమా!
పస్తులుంచడం ఆ ఇంటి ఇల్లాలుకేమన్నా వ్రతమా!
పనిపాటలు లేక పల్లెలకు పల్లెలే పట్టణాలకు వలసబాట పట్టడం మొదలయి రెండేళ్ళు దాటింది. అదీ వల్లగాని నిర్భాగ్యులతో మాత్రమే ప్రస్తుతంపల్లె నిండి ఉంది.
పిల్లాడి ఆకలి తీర్చే మార్గంవెదుక్కుంటూ ఇల్లాలు వీధులెంట బడింది.  ఇంట్లో వంటరితనం. కడుపులో ఎలుకల రొద. ఆలకించే నాథుడు కరువై బైటికి వచ్చి నిలబడ్డాడు బుడతడు.
ఎదురింటి డాబా ఆవరణలో ఐదేళ్ళ పాప అన్నాలాట ఆడుతుంది. నాన్నకోసం వెదుకుతున్నట్లుంది. ఏడిచే బుడ్డాడిని చెయ్యిపెట్టి పిలిచింది.. ‘రా.. రమ్మ’ని.
'అన్నాలాట ఆడుకుందాం! వస్తావా!' అని ఆహ్వానం, 'నేను అమ్మను. నువ్వు నాన్నవు' అనికూడా పాత్రలు నిర్దేశించింది.
'అయితే ఆకలేస్తే అన్నం వండి పెడతావా? అట్లాగయితేనే వస్తాను' అని ఆశగా అడిగాడు మూడేళ్ళ బుడతడు.
'' అంటూ చేటలో బియ్యం పోసుకొని చెరిగి చట్టిలోని నీళ్లలో పోసి ఎసరు పెట్టి ..'రోటి పచ్చడి చేస్తాను.. ఉండండీ!' అంటూ కారం సరంజామా కోసం ఇంట్లోకి పోయింది.. పాప.. పెద్ద ఆరిందాలాగా.
పోయిన పిల్లతల్లి ఎంతకూ బైటకు రాదే!
అసలే ఆకలిమీదున్నాడేమో అమ్మమాట గుర్తుకొచ్చింది నాన్న బుడతడికి.  అక్కడే పడున్న చెక్కపేడు రోకలిని గభుక్కున మింగేశాడు!
***
ఆనక పెద్దాసుపత్రిలో సమయానికి వైద్యందొరికి ఈ లోకలోకి గనక వస్తే గిస్తే..' ‘రోకలి ఎందుకు మింగావురా వెధవా!' ని ఎవరైనా అడిగారనుకోండి..
'అమ్మ చెప్పింది' అని నిజం కక్కేస్తాడేమో!
పాడు కలికాలమా,, ఎంతకు తెగించావూ!
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల మాసపత్రిక జనవరి సంచికలో ప్రచురితం)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...