Friday, January 1, 2016

అనుబంధం- కౌముది కథానిక


రామచంద్రుడు మంచి బాలుడు.. ఒక్క పొగ విషయంలో మినహా!
కళాశాల రోజుల్లో అయిన అలవాటు. మిత్రుడు మృత్యుంజయుడు చలవ! మృత్యుంజయుడు పోయాడుగానీ.. పొగ వ్యసనంగా మిగిలిపోయింది.
నిరుద్యోగంలో, ఇంటి సభ్యులతో వచ్చిన మనస్పర్థల్లో, ఒంటరితనంలో, ప్రేమ వైఫల్యంలో పొగే తనకు ఊరటనిచ్చింది.
పెళ్ళిచూపుల్లో శారద విడిగా  పిలిచి బిడియం వదిలి అడిగినప్పుడు అబద్ధం చెప్పాడు రామచంద్రుడు .. అందమైన పిల్లని వదులుకొనేందుకు మనసొప్పక.
మొగుడు బొంకాడని మొదటిరాత్రే గ్రహించినా సర్దుకుపోయింది శారద.
మొదటి బిడ్డ శరత్ పుట్టినప్పుడు శారద గట్టిగా షరతు పెట్టినప్పుడూ సిగరెట్టుకోసం బిడ్డముద్దులను దూరంగా ఉంచాడు. రెండో బిడ్డ సరితను దొంగతనంగానే సిగిరెట్టుపెదాలతో ముద్దులాడాడు.
కాలంతో పాటు అంతా మారి.. శరత్ అమెరికాలో .. సరిత ఆస్ట్రేలియాలో సెటిలయి.. చేసే ఉద్యోగానికి పదవీవిరమణయి.. పనిలేక ఆరోగ్యం దెబ్బతింటున్నప్పుడూ రామచంద్రుడు సిగిరెట్టును దూరం పెట్టలేక పోయాడు.
అమెరికా వెళ్లినప్పుడుగాని అసలు అగ్నిపరీక్ష మొదలవలేదు రామచంద్రుడికి.
అగ్రరాజ్యంలో తాగడానికి సిగిరెట్టు లభించడం అంత సులభం కాదు. కేవలం సిగిరెట్లకోసం పక్కింటి ఇంగ్లీషుబామ్మగారితో సిగ్గు విడిచి స్నేహం చేసాడు రామచంద్రుడు. ఇంట్లోవాళ్ళు పసిగట్టకుండా ఆమె ఇంట్లోనే నాలుగు దమ్ములు లాగించి వాసన తెలీకుండా ఏ చాక్లెట్టో చప్పరించే వాడు.
శరత్ ఆరునెల్ల చంటిబిడ్డ ఉన్నట్లుండి గుడ్లు తేలేస్తే.. ఎమర్జన్సీలో నోట్లోనుంచి సిగిరెట్టు పీక బైటికి లాగినప్పుడు రామచంద్రుడి బండారం బైటపడింది.
ఆరునెలలు ఉందామనుకొని వెళ్ళిన దంపతులు మూడు నెలలు తిరక్కుండానే ఇండియా వచ్చేయడం బంధువర్గాల నోటికి చాలినంత మేత ఇచ్చింది. సర్దిచెప్పలేక విసిగిన  శారద ఒకరోజు అవమానంతో నిద్రబిళ్లలు మోతాదుకి మించి మింగేసింది. ‘సిగిరెట్లు  తాగడం శాశ్వతంగా మానేస్తానని శారద చేతిలో  ఒట్టేసి అతికష్టంమీద భార్యప్రాణాలు కాపాడుకొన్నాడు రామచంద్రుడు. త్రేతాయుగంనాటి రామచంద్రుడిలాగే ఈసారి మాటా నిలబెట్టుకున్నాడు.
కానీ కాలం మరో విధంగా తన తీర్పు ప్రకటించడానికి సిద్దపడింది.
బైటపడేసరికే రామచంద్రుడికి సెకండ్ స్టేజీ లంగ్ కేన్సర్! ఏడాదికి మించి వైద్యులు  గ్యారంటీ ఇవ్వకున్నా.. ఆరునెలలు తిరక్కుండానే మృత్యుశయ్యమీదకు చేరిపోయాడు రామచంద్రుడు.

ఆ రోజు మరీ ముంచుకొచ్చింది. బిడ్డలకు కబురు చేయించింది శారద. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చూసుకొని వచ్చేందుకు కనీసం  రెండు రోజులు పడుతోంది. అప్పటివరకు అపోలోలో  వెంటిలేటరుమీద అందించే ప్రాణవాయువే ఆసరా!
పడకమీద అచేతనంగా పడివున్నాడు రామచంద్రుడు. భర్తను ఒక్కక్షణం వదిలి పక్కకు పోవడానికి ఇష్ట పడటంలేదు శారద.
తెల్లారడం కష్టం అని డాక్టర్లు చెప్పి పోయారు. పక్కమీద రామచంద్రుడు  అదే పనిగా కలవరిస్తున్నాడు.
'సిగిరెట్టు.. సిగిరెట్టు' అంటూ పెదాలు పదే పదే తడుపుకొంటున్నాడు.

నర్సు బైటికి వెళ్లడం చూసి  తలుపులు లోపలికి బిగించి బ్యాగులోనుంచి సిగిరెట్టు పాకెట్టు బైటికి తీసి ఒకటి భర్త పాలిపోయిన పెదాలమధ్య ఉంచి అగ్గిపుల్ల వెలిగించింది శారద!
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల మాసపత్రిక జనవరి 2016లో మరీచి.క కాలమ్ లో ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...