Thursday, January 7, 2016

గీతా రహస్యం- అక్షర అంతర్జాలపత్రికలోని కథానిక


'పజ్జెనిమిదో అజ్జ్యాయం.. మోక్ష సన్యాస యోగం.. ముప్పైరెండో శ్లోకం.. ఏం చెబుతుందో తెలుసుట్రా చలపతీ!' అనడిగాడు ప్రసాద్.
'పనీ పాటా మానేసి నువ్విట్లా నిత్యం గీతాపారాయణం చేస్తూ కూర్చుంటావని..' అన్నా కసిగా.
'గీత అంతా పారాయణం చేయను. కేవలం పది.. ఏడు.. ఐదు.. నాలుగు.. మూడు.. రెండు శ్లోకాలు మాత్రమే చేస్తాను.' అన్నాడు వాడు నింపాదిగా.
''అదేం?!'
'పదివేల సంవత్సరాలు చంద్రలోకంలో సుఖంగా ఉండేందుకు ఆ మాత్రం చాలని గీతాసూత్రం చెబుతుందిలే!'
ఆవుపాఠంలాగా వీడు ఎటునుంచి ఎటు తిరిగినా చివరికీ గీతమీదకే వచ్చి వాలుతున్నాడు!
కృష్ణవేణి చెప్పింది కరెక్టే! 'ఈ మధ్య ఈయనగారి వరసేం బావుండటం లేదన్నయ్యా! అదేందో గీతట! అస్తమానం దాని ధ్యాసే! నా కేదో భయంగా ఉంది. ఒక్కసారి వచ్చి పోరా!' అని అదేపనిగా ఫోన్ కాల్సు!
ప్రసాద్ కాలేజీలో నా క్లాస్ మేటు. బుద్ధిమంతుడని మా బాబాయి కూతుర్నిచ్చి చేశాం.
కాలేజీ రోజుల్లో వీడేదో 'లవ్వం;టూ అఘోరించాడు. ఆ పిల్ల పేరూ 'గీతే' అనుకుంటా! విషయం కనుక్కుందామని నేనే బైల్దేరి వచ్చేసానీసారి. ఎలాగూ నాకు వాడితో చిన్నపనికూడా ఉంది.
నేనో గొప్ప రచయితనని నా ఉద్దేశం. నలుగురి చేతా 'ఔను సుమా!' అని ఒప్పించుకోవాలని దుగ్ద! ఎలాగైనా ఓ పుస్తకం ప్రింటేసి ఉచితంగానైనా పంచిపెట్టని నా బందరు మిత్రులందరూ సలహా ఇచ్చారు. ప్రసాదుకు
రెడ్ హిల్సులో పెద్ద ప్రెస్సుంది. గవర్నమెంటు పనులు అవీ బాగా వస్తుంటాయి. నాకేవైనా సులువుసూత్రం చెవుతాడేమోనన్న ఆశతో కూడా వచ్చాను.
ఆటోదిగి అరగంటైనా వాడు పూజగదిలోనుంచి ఊడిపడడే! ఇదంతా భక్తే!
'ఏం పాడో! అస్తమానం ఆ పూజగది తలుపులు లోపలేసుక్కూర్చుంటారు. కదిలిస్తే చాలు! పాటలూ.. పద్యాలూ! పిల్లలుకూడా బాగాబెదిరిపోయారన్నయ్యా! అంతా నా గీత!' అని నుదురు బాదుకొంటూ టిఫిన్ ప్లేట్ పెట్టిపోయింది కృష్ణవేణి.
ప్లేటునిండా నానేసిన మొలకెత్తిన శనగ్గింజలు.. రకరకాల పచ్చికూరగాయ ముక్కలు!
'ఇంటిల్లిపాదీ ఈ గడ్డే తినాలని ఆయనగారి ఆర్డరు' అంది పాలగ్లాసుతో మళ్ళా వెనక్కివచ్చికూర్చొని కన్నీళ్ళు పెట్టుకొంటూ.
వ్యవహారంతోపాటు ఆహారంకూడా మారిపోయిందన్నమాట! పెళ్లయిన కొత్తల్లో ఈ ప్రసాదు మామగారింటికొచ్చినప్పుడు ఎన్వీ లేదని ఎంతలా గోల చేసాడు! గాంధీ జయంతి ఆ రోజు. దొరకదని మొత్తుకున్నా వింటేనా!
వాడు అప్పటికే కాంగ్రిసుపార్టీలో ఓ చోటా సైజు పేట నాయకుడు!
ఇప్పుడు ఇంట్లో వాతావరణంకూడా బాగా మారిపోయింది. ఇదివరకు గోడలమీద గాంధీ, నెహ్రూల్లాంటి నేతలు వేలాడే చోట ఇప్పుడు నిలువెత్తు తైలవర్ణ చిత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు  నిలువుకాళ్లమీద గీతాబోధన చేస్తున్నాడు. 'ఈ కృష్ణుణ్నెక్కడ చూసానబ్బా!' అని ఆలోచిస్తుంటే.. ప్రసాదు ఊడిపడ్డాడు గదిలోనుంచి.
పట్టెనామాలు.. పట్టుబట్టలు.. అచ్చంగా భజరంగ బలి కార్యకర్తలాగున్నాడు.
కాలేజీరోజుల్లో వాడో పెద్ద కమ్యూనిస్టు! కాలంతో పాటు మార్పూ సహజమేగానీ.. మరీ ఇంత యాంటీగానా!
'ఏంటీ ఈ అవతారం?' అనడిగా.
'వాసాంసి జీర్ణాయ యథా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాణి..'అంటూ సి.డి పెట్టాడు.
 అర్థం కాలేదు! కృష్ణవేణయితే గుడ్లప్పగించి చూస్తోంది.
'చిరిగిపోయిన పాతబట్టలను వదిలేసి మనిషి కొత్త బట్టలను ధరించినట్లే.. మనం పనికిరాని పాతవస్తువులను వదిలిపెట్టి కొత్తవి తెచ్చుకోవచ్చు..' అన్నది.
'ఎవరు?'
'గీత'
'కృష్ణవేణి కన్నీళ్ళాపుకోలేక గిరుక్కని తిరిగి వెళ్ళిపోయింది.
'ఎవర్రా ఈ గీత?' కోపం ఆపుకోలేక అరిచేసా. గోడమీది కృష్ణుడివంక చూపించాడు.
చటుక్కుమని చిక్కుముడి విడిపోయింది.
ఏమీ లేనిదానికి కౄష్ణవేణి ఎంతార్భాటం చేసేసిందీ! అనవసరంగా నేనూ ప్రాణమిత్రుణ్ణి  అపార్థం చేసేసుకొన్నానే!
'గీతంటే భగవద్గీతని ఇంట్లో పెళ్లానికైనా నచ్చచెప్పుకోవద్దుట్రా!' అని కూకలేసే.
'ఎంత గీతయితే మాత్రం! కటుకొన్న పెళ్లాన్నీ.. కన్న పిల్లల్నీకూడా మర్చిపోవాలా! ఖర్మ! భక్తి.. యోగం.. శ్రద్ద.. నా శ్రాద్ధం! సంసారం చేసుకునేవాళ్లకీ సన్నాసియోగం.. విబూదియాగం.. ఏంటన్నయ్యా! రాజకీయాలంటే.. ఏదో సరిపెట్టుకొని వస్తుంటే.. సరాసరి ఇప్పుడు రామకృష్ణ మఠాన్నే తెచ్చి నట్టింట్లో పెడతున్నారు. ఎట్లా?' అంటూ ముక్కు చీదుకొంటున్న పెళ్లాంవంక తిరిగి 'కృష్ణా! గీత దాటుతున్నావ్!' అని గద్దించాడు ప్రసాదు.
కిక్కురుమనకుండా కృష్ణవేణి లోపలికి వెళ్ళిపోయింది పాపం.
' 'సర్వ ధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం ప్రజ'.. అని భగవానుడు ఉత్తినే అనలేదురా చలపతీ!' అని మొదలుపెట్టాడు మళ్లీ నా వంక తిరిగి.
'గీత ఒక శాస్త్రం కాదు. అస్త్రం. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణభగవానుడు ఉపదేశించిన గీతను నేటి నాయకులు ఎన్నికలముందరే ఎందుకు వినిపిస్తున్నారో అర్థం చేసుకో! పెద్ద రచయితవు కదా!' అన్నాడు శనగ్గింజల పళ్లెం ముందుకు లాక్కొని.
'కౌరవులు వందమంది. పాండవులు ఐదుమంది. నేరుగా పోరుకు దిగితే పాండవులకు పరాజయం ఖాయం. ఆరంభంలోనే అర్జునుడు పారిపోయే మూడ్ లో ఉన్నాడు. రథాన్ని యుద్దంరంగం మధ్య నిలబెట్టి శ్లోకం తరువాత శ్లోకం బాదుతుంటే.. వినేవాళ్ళు ఎంత వీరాధివీరులైనా నీరసం రాదా! ఏడొందల పైచిలుకు శ్లోకాలురా!.. సుమారు ఇరవైనాలుగ్గంటలు!.. పైన విశ్వరూప ప్రదర్శన!.. ఆపైన ఉపసంహరణ! ఎంతటి యోధానుయోధుడైనా యుద్దానికి ముందే సగం చచ్చూరుకుంటాడా లేదా! ప్రిపేరై ఉన్నాడు కాబట్టి అర్జునుడికేమీ అవదుగానీ.. కౌరవులు నీరుగారిపోరా! అదే వాళ్ళ ఓటమికి నాంది అయింది.  కృష్ణభగవానుడా మజాకా! మా భాజపా బాబులా కృష్ణభగవానుడి బాబులు. అందుకే అందిన చోటల్లా .. అవకాశమున్నప్పుడల్లా.. గీతా సీ.డీలు  పెట్టి.. పుస్తకాలు పంచిపెట్టి.. అదరగొట్టేస్తున్నారు. ఇన్నేసి రాష్ట్రాలాయ! ఎప్పుడూ ఎక్కడో ఓ చోట చోటా మోటా ఎన్నికల జాతర్లేనాయ! ఆ మాత్రం ముందుచూపు లేకపోటే ఎట్లాలే!' అన్నాడు తైలవర్న చిత్రానికేసి తాదాత్మ్యంగా చుస్తూ.
నా పుస్తకం ప్రచురణ సంగతి అడిగితే 'ఈ బోడి కవిత్వాలు.. కథలూ రాయడం మానేసి..  మా 'గీత' కు మంచి భాష్యం ఓటి రాయరాదుట్రా! వ్యాసులవారి శ్లోకాలు మరీ వ్యాసాలకు మల్లే ఉన్నాయి. మన మూసలో రాసి తీసుకురా! అచ్చు సంగతి ఆలోచిస్తా!' అనేశాడు.
నేను తిరిగి వచ్చేరోజు స్టేషనులో దిగబెట్టి వెళుతూ 'నీ దగ్గర దాచేదేముందిరా! గవర్నమెంటు పన్లు మా డేంజరుగా ఉన్నాయ్! చూశావుగా! పాఠ్యపుస్తకాలమీదెంత రచ్చవుతున్నదో!అందుకే గీతా పుస్తకాలకీ.. డిజిటల్ మెటీరియల్ సప్లయ్యికన్నా ఎట్లాగైనా కాంట్రాక్టు సంపాదించాలి. ఎన్నికలన్నీ అయిందాకా ఈ సన్నాసి వేషం తప్పదురా! పార్టీ లాబీయింగు! నీకు తెలీనిదేముంది ఈ లోతుపాతులన్నీ! మా పిచ్చిదే అర్థంకాక కంగారు పడిపోతున్నది. మీ చెల్లాయికి నువ్వే ఎలాగైనా నచ్చచెప్పాలి!' అని చేతులు పుచ్చేసుకొన్నాడు!
ప్రసాదు రాజవిద్యారాజగుహ్యయోగం!
గీత చదువుదామని అక్కడే ఉన్న హిగ్గింబాధమ్సులో అడిగా. 'లేద'నే సమాధానమొచ్చింది!
అన్నీ అధికార పక్షం వాళ్ళు పంచడానికి కొనేసారు కాబోలు! వరంగల్లు ఎన్నికల తంతొహటి ప్రస్తుతం నడుస్తున్నది కదా!' అన్నాను ప్రకాశంగా.
'భలే అమాయకులు  సార్ మీరూ! మతతత్వపార్టీలవాళ్లెవరికీ ఆ అవకాశం  అందుబాటులో లేకుండా  మావోయిస్టులే కాపీలన్నీ కొని దాచేసారు' అన్నాడు పక్కనే ఇంగ్లీషు పేపరు కొనే పెద్దాయన!
***
-కర్లపాలెం హనుమంతరావు
(అక్షర అంతర్జాల మాసపత్రిక డిసెంబరు 2015లో ప్రచురితం)






No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...