Friday, November 4, 2016

భోజ రాజీ(జకీ)యం- వ్యంగ్య కథానిక-

కారులు దూరని కారడవి. బెబ్బులి నిబ్బరంగా బబ్బొని కునుకు లాగిస్తోంది.
'నమస్తే వ్యాఘ్రోత్తమా!'.. వీపు మీదెవరో గోకిన భావన..
బద్ధకంగా కళ్ళు విప్పార్చి చూసింది బెబ్బులి. ఎదురుగా గోమాత!
ఉలిక్కిపడి గభాలున లేచి నిలబడింది పులి.
'బాగున్నారా పుండరీకంగారూ! ఎప్పుడో భోజరాజీయంలో తటస్థపడ్డాం ఇద్దరం.  వేట దూకుడుమీద ఉన్నారు తమరప్పుడునేను తమరి  కంట పడ్డాను. చంపుకు తింటానని వెంటబడ్డారు. 'ఇంటిదగ్గర చంటి బిడ్డున్నది. చన్ను గుడిపి రెండు మంచి మాటలు చెప్పొస్తాను.. దయ చూడమ'ని నేను ప్రాధేయపడ్డాను..'
'ఆఁ! ఆఁ!.. ఆ పాత పురాణాలన్నీ నెమరేసుకోడానికేనా  నువ్వింత దూరభారాలైనా   లెక్కచేయకుండా తరలి వచ్చింది సురభి తల్లీ! నేనోదో పిచ్చిగా ఒప్పుకోడం.. నువ్వంత కన్నా అమాయకంగా ఇచ్చిన మాటక్కట్టుబడి తిరిగి రావడం!  దంతా ఓ పిచ్చిమారాజుల కాలంకదా.. ఇప్పట్లా కాదు!' అంత కంగారులోనూ బెంగాలు టైగరుగారి మీసాలమీదో మంచహాసం మెరిసింది.
కపిలాంబ ఆ  సంబరంలో పాలుపంచుకొనే మూడ్ లో లేదు 'నన్నానాడే చంపుకు తినేసుంటే.. బతికి పోయుండేదాన్నిగదా పుండరీకోత్తమా! నా 'విమల సత్య ప్రౌఢికి మెచ్చి వదిలేయడంతో చచ్చే చావొచ్చి పడింది నాకిప్పుడు'
'మును మును బుట్టె నొక ముద్దుల పట్టి యతండు  పుట్టి యేడెనిమిది నాళ్ల పాటి గలడం' టూ అప్పట్లో బుడి బుడి రాగాలు తీసిందెవరు మిత్రమా! అయినా  ఎప్పుడో ఏదో జరిగిందానికి ఇప్పుడిలా వచ్చేసి దెప్పడం భావ్యమా!'
'నిజమేననుకో! ఇంతయు పూరియ మేయనేరడం'టూ  నీ దగ్గరానాడు వాపోవడం ఎంత పెద్ద నేరమో ఇప్పుడి ప్పుడే మెల్ల మెల్లగా అర్థమవుతోంది. అప్పటి ఆ ముద్దుల పట్టి ఇప్పుడో గోముఖ వ్యాఘ్రం’లాగా తయారైంది నా ప్రాణానికి'
వ్యాఘ్రం మొహం ఎర్రబడింది.. గోమాత ‘పంచ్’ కి.
జరిగిన  పొరపాటు ఆవుకు అప్పుడర్థమయింది. 'సారీ! పొలిటికల్ మనుషుల మధ్య నలిగీ నలిగీ నా  నాలుకక్కూడా ఆ పాడు భాషే  బాగా అలవాటయింది పులిరాజా! ఏమనుకోకేం! నా ఉద్దేశం.. నేనప్పట్లో గారాల బిడ్డగా పెంచుకున్న నా బాలధేనువు ఇవాళ ఆబాల గోపాలం పాలిట పెద్ద శనిదేవతయి కూర్చుందని. గో రక్షక దళం పేరుతో కొత్తగా రెచ్చిపోతున్నాయి కొన్ని శక్తులీ మధ్య కొత్త సర్కారు వచ్చినప్పట్నుంచీ.  దానికిప్పుడు ఆ దున్నపోతులతో బాగా  పొత్తు బలిసింది..’
'ఆ సోదంతా నాకిప్పుడెందుకులే గానీ.. చప్పున నువ్వొచ్చిన పనేదో  టూకీగా చెప్పి పోరాదా  మిత్రమా!  గుజారాతీ 'ఉనా'  టైపు.. అదే ‘చర్మం వలుచుకోడానికి గోవును చంపి తీసుకెళుతున్నాడ’ని కసాయోడి చర్మం వలిచి చంపినలాంటి’  ఊసులైతే నా దగ్గరసలు ఎత్తద్దు. నీ పుణ్యముంటుంది! తమ గోవుల  నిర్వాకం వల్ల.. పాపం..  ఆ  ఆనంద్ బెన్ జీ ముఖ్యమంత్రి పదవికే గండి పడింది అప్పట్లో.. ఇహ నేనెంత?'
'అదిగో! అందర్లా నువ్వూ   నామీదలా నిందలేస్తున్నావా.. ఉత్తిపుణ్యానికే!?  నా కీ జీవితంమీద ఇఛ్ఛ పూర్తిగా చచ్చిపోయింది మిత్రమా! అందుకే తమరి దగ్గరికిలా పరుగులెత్తుకుంటూ వచ్చింది’
'బావుందమ్మా వరస! బంగారం లాంటి ఆవు పుట్టుక నీకు చేదయిందా సురభి తల్లీ!  నీ ముఖమేనా.. పృష్ఠభాగం కూడా  అదృష్టం తెచ్చిపెట్టేస్తుందని నీ భక్తజనాలు తెగ డప్పుకొడుతుంటారే! ఒక్క  మలమే కాదు.. మూత్రం కూడా మందు- మాకు’లకింద చెల్లిపోయే  సౌభాగ్యం మ జంతు జాతిలో నీకులాగా  ఇంకెవరికమ్మా దక్కింది!  గో సేవకులో.. గొప్పోళ్ళ అదృశ్య శక్తులో కమ్మంగా  నిన్నో కామధేనువు కింద  కంటికి రెప్పలా కాపాడుతుంటే..  తోకూపుకుంటూ కాలక్షేపం చెయ్యాలి గానీ.. ఇలా   బతుకంత   ఎకసక్కెమయిపోయినట్లు ఎక్కిళ్ళు పెట్టడమేంటో.. విడ్డూరం కాకపోతే!’
'నా మూలకంగా ఏమీ తెలీని అమాయక జీవుల ప్రాణాలెన్ని అన్యాయంగా గాలిలో కలిసిపోతున్నాయో నీకు తెలీడం లేదు పుండరీకమా! గోమాతగా అంతా నన్ను  పూజించేస్తున్నారు.. అదే గొప్ప సౌభాగ్యమని..  గాలిలో తేలిపొమ్మనడం నీకు భావ్యమా ! నా వల్ల కాదు.   నన్నేదైనా వల్లకాటికి చల్లంగా  పంపించే పూచీ నీదే సుమా! గంపెడాశతో నీ దగ్గరికిలా  గంతులేసుకొంటూ వచ్చాను. నా ఆశ నిరాశ చేయబోకు  శార్దూలరాజమా!'
గోమాత భావోద్వేగాలు కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి   శార్దూలం రాజావారికి. అయినా ఇంకా  ఏదో సంధిగ్ధం!
‘అవును గానీ ఆవు మిత్రమా!  నిజంగానే  నీకు  బతుకంత వెగటనిపిస్తే మీ  జనావాసాల మధ్యే చచ్చేటన్ని సదుపాయాలేడ్చాయి కదా.. చావడానికి! స్వచ్చ భారత్ ఉత్సవాలంత ఉత్సాహంగా నిర్వహించిన  తరువాతా రాస్తాలమీద బస్తాల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తూనే ఉన్నాయి  ఏ గల్లీ గట్టర్లలో  చూసినా! గుట్టుగా ఏ రెండు కట్టల  ప్లాస్టిక  వ్యర్థాలో గుటుక్కుమని మింగేసి.. కుళ్లాయి కంపు నీళ్ళో గుక్కెడు గొంతులో పోసేసుకుంటే  నీ చావు ముచ్చట ఇంచక్కా  తీరిపోను కదా! ఆ మాత్రం భాగ్యానికి  కాలగర్భంలో కలిసిపోడానికింత రొప్పుతూ రోస్తూ  కారడవిలోకి పడీ పడీ పరుగెత్తుకు రావాలా.. అదీ నన్ను ప్రత్యేకంగా నా చేతే చంపించుకోదానికీ?!’
'అర్థమవుతోంది పులిరాజా నీ మనసులోని గుంజాటన! ఇది వాణిజ్య యుగమని..  రీ సైకిలింగు ఓ యాగమని.. ఆ యాగానికి  సమిధలుగా వాడేవి  వ్యర్థాలైనా సరే మా బోటి  జంతుజాలాలకు వృథాగా ధారపోసే ఉదారులెవరూ ఇక్కడ లెరని.. అంతా    లాబాపేక్ష బలిసిన  వ్యాపార యోగులేనని.. తమరికే అర్థమవడం లేదు రాజోత్తమా! ఇహ కుళ్లాయిలంటావా! తాగి చచ్చేందుకు మనుషులకే బొట్టు రాలటం లేదా కుళ్ళు నీళ్లు.    ఇహ మా బోటి మూగజీవాలనెవరు వంతుకు రానిస్తారు  నేస్తమా!'
'పోనీ.. పంట పొలాలమీద చల్లే క్రిమిసంహారకాలమీదైనా ఓ ప్రయోగం చేసి చూడాల్సింది   మిత్రమా! మొన్నీ మధ్యనే చదివానెక్కడో!  బోల్డన్ని లేళ్లూ.. దుప్పులూ..ప్రాణాలకు తెగించి మరీ  ఆ చేలల్లో పడి  చచ్చేదారులేవో దిగ్విజయంగా ఆవిష్కరించాయని ఏవో ఊళ్ళల్లో! అందుబాటులో వందల కొద్దీ చావుసాధనాలున్నా .. అవన్నీ వద్దనుకొని ఈ కారడవిలోకే నాకోసం  ఇలా పరుగులెత్తుకుంటూ రావడంలోనే...’
‘.. మతలబేమన్నా ఉందని అనుమానం. అంతేనా? ఆహా! కాలమా! నేవెంత గడసరిగా మారిపోయావే సమయమా!  ఆనాడు అనంతాచార్యులవారు రాసిన  ‘భోజరాజీయం’లో ‘చంపద్ద’ని  నేనే బతిమాలుకోవడమా? ఈనాటి భక్తి రాజకీయాల్లోనూ  ‘చంపెయ్య’మని నేనే బతిమాలుకోడమా!’
‘ఆ కాలాల గోలేమిటో  నాకు తెలేదు కానీ..   నాకింకా భవిష్యత్తుమీద బోల్డన్ని గోల్డెన్ అంచనాలున్నాయి మిత్రమా! ప్లీజ్!ఏమముకోవద్దు!  మా పులుల సంఖ్య ఈ మధ్యనే మళ్లా  కాస్తింత మెరుగుపడిందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇంకా మెరుగుపడేందుకేవో  ప్రణాళికలుకూడా రచిస్తున్నామని  తెగ గొప్పలుపోతున్నారు గద్దెనెక్కిన  ప్రభువులు..ఇప్పుడు నిన్ను చంపి మా చావుని పేరంటానికి పిలవమంటావా?’
'హ్హఁ!.. హ్హఁ!.. హ్హఁ!   మా రాజకీయ నేతలు అల్లే  మాటల తట్టలో తమరూ భలే పడ్డారే    పుండరీక మహాశయా! పులుల సంఖ్య పెరుగుతోంది.. మంచిదే! పులుల్ని   వేటాడే మాఫియా రాయుళ్ల  సంఖ్యా ఆ దామాషాలోనే  పెరుగుతోంది! ఆ తమాషా తమరి దృష్టినసలు ఆకర్షించినట్లే  లేదు.  ఇహ మా  రాజకీయ నేతాశ్రీల గప్పాలంటారా!  ఎన్నికలు ముంచుకొచ్చే ముందు  అమాయక జనాలని ముంచేందుకా నేతాశ్రీల గొంతుల్నుంచీ పెకిలొచ్చే నకిలీ ‘ధ్వని’ అనుకరణలవన్నీ..  అసలు గుండెలోతుల్నుంఈ వచ్చినవి కావు!  ఈ అడవి సరిహద్దులు దాటి తమరెప్పుడో తప్ప బైటికి అడుగేయరు. కాబట్టే  భవిష్యత్తుమీద మీకంతంత  అందమైన కలలు! జనావాసాల సంగతి గాలికొదిలేయండి. మీ సొంత ఇలాక.. ఈ మీ కారడవిలోనే ముందు ముందు మీకే మాత్రం భద్రతుందో.. భరోసా లేదు.  ఏనుగు  బతికినా చచ్చినా  పదివేలే! అదే.. తమరు బతికుంటే పదివేలు. చస్తే  పదింతలు మేలు.. మా మాఫియా మాయావులకు.  తమరి  ఎముకలూ, పుర్రే  గట్రాలు .. మాకు మందూ- మాకులకు. తోళ్లూ, గోళ్లూ, ఎక్సెట్లాలు. దొరబాబుల  ఎక్స్‌ట్రా డాబులూ.. దర్పాలకు! పులిమీద పుట్రలాగా కొత్త సెంటిమెంటింకోటి  బైలుదేరిందీ మధ్య తమరి నోట్లోని  పన్నులమీద! ‘పులిపన్ను‘ షో కేసు’లోగాని పెట్టుకుంటే  పన్నుపోట్లేమీ లేని  సంపన్నుల గుంపులోకి నల్లకుబేరులుకూడా  గుట్టుగా  చేరిపోవచ్చన్న  నమ్మకం   శార్దూలరాజోత్తమా!  ఎర్రచందనంమీద సర్కార్ల బంధనం రోజు రోజుకీ బిగుసుకొంటున్నది కదా! పొట్టకూటికోసం తాపత్రయపడే..  పాపం మా  మాఫియా గుంపులకు మాత్రం ఇంక  మార్గాంతరమేముంది? ఎర్ర ఏగాని ఎక్కడ దొరికితే అక్కడె  ఎవరైనా ఎగబడాల్సింది! అందుకే..  ఇప్పుడు నాలుగు డబ్బులు దండుకొనేందుకు  తమ పులిజాతిమీదకొచ్చి పడిపోబోతున్నారు. వినండి ఆ చప్పుళ్లు!’
అంత లావు బెబ్బులీ బెదిరిపోయిందీ చప్పుళ్లకన్నా ముందు  గో మాత మాటలకు.
బతికుంటే బలుసాకు తినొచ్చు. ఈ అడవి కాకుంటే.. ఆఫ్రికా అడవులకైనా వెళ్ళి తలకాచుకోవచ్చు' అంటూ కాళ్లకు బుద్ధి చెప్పేసింది. వ్యాఘ్రరాజోత్తమం.
***
'శభాష్! మొత్తానికి పులిరాజు బలుసాకు తినేటంత  పరిస్థితి  తీసుకొచ్చావు. పులుల భయం లేకుండా చేసినందుకు ధన్యవాదాలు మిత్రమా. ఇక ఈ అడవంతా మన సామ్రాజ్యమే! ఎన్ని వన వనరులునైనా సొమ్ము చేసుకోవచ్చు. పరిశ్రమలకు భూములమ్ముకోవచ్చు.   ఇదిగో నీ సేవకు తగ్గ పారితోషికం' అంటూ అప్పటి వరకు గుట్టవెనకే దాగున్న మాఫియా మనిషి చప్పట్లు కొట్టుకుంటూ బైటికొచ్చాడు.. సంతోషంగా.
'ఈ కాసిని బోడి  కాసుల కోసమా నేనింత కష్టపడి భోజరాజకీయం రక్తి కట్టించింది!' అంది అప్పటి వరకు తగిలించుకొని ఉన్న గోవు ముఖాన్ని తొలగించుకొన్న నక్క.
' కాసులు కాకపోతే మరింకేం కావాలి? కోరుకో మిత్రమా!' ఆదరంగా ఆడిగాడు మాఫియా మనిషి.
'రేపొచ్చే ఎన్నికల్లో ప్రజాప్రతినిది అయ్యే ఛాన్సు'
'నీ లాంటి జిత్తులమారి నక్కలు సర్కారులో ఉండటం మా మాఫియా గుంపులకీ మంచిదేలే.! ఏ పార్టీ టిక్కెట్టు కావాలో కోరుకో! తప్పకుండా ఏర్పాటు చేద్దాం. అన్ని పార్టీల్లోనూ మనకు ‘ఆత్మ’బంధువులున్నారు!' అన్నాడు మాఫియా  మనిషి మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ!
***
-కర్లపాలెం హనుమంతరావు
('తెలుగిల్లు' అంతర్జాల పత్రికలో ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...