Saturday, August 1, 2020

పాత సాహిత్యం మీద బ్రౌన్ దొర మోజు - కర్లపాలెం హనుమంతరావు


తెలుగు సారస్వతం తాటాకుల్లో మూలుగుతూ, రక్షించే నాథుడు కరవైన రోజుల్లో విదేశీయుడైన బ్రౌన్ (పుట్టింది భారతదేశంలోనే ఐనా) తెలుగు నేర్చుకుని, పండితులను తన స్వంత డబ్బుతో పోషించి, తాటాకుల్లోని వాజ్ఞ్మయాన్ని కాగితాలమీద రాయించి,అనేక గ్రంథాలకు సంస్కరణ ప్రతులు తయారు చేయించి, వాటికి వ్యాఖ్యానాలు, పదసూచికలు ఏర్పాటుచేసి, కొన్ని గ్రంథాలను ముద్రించి.. ఆంధ్రభాషోద్ధారకుడిగా చరిత్ర ప్రసిద్ధికెక్కాడు.
కోల్ బ్రూక్, విల్కిన్స్, విల్ ఫోర్డ్, విల్సన్ సంస్క్తతభాషావ్యాప్తికి నిస్వార్థంగా పనిచేయాడానికి కారణం వాళ్ళకున్న మత సహనమే అనీ, వాళ్ళు ఒక రకంగా Western Brahmins తో సమానమని కాల్డ్ వెల్ నిర్మొహమాటంగానే అన్నట్లు బంగోరె సంపాదకత్వంలో 1978లో వచ్చిన 'లిటరరీ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సి.పి.బ్రౌన్' పుస్తకంలో కనబడుతుంది(పే.87).బ్రౌన్ వాళ్ళకోవలోకి కచ్చితంగారాడు. హిందూమతంమీద ప్రత్యేకమైన గౌరవం ఉన్నవాడేమీ కాదు.మరి తెలుగుభాషనీ రకంగా ఉద్దరించడానికి కారణం ఏమై వుంటుదనే సందేహం తప్పక అందరికీ కలుగుతుంది.
బ్రౌన్ కి స్వతహాగా పురాతనంమీద గాఢాభిమానంట! పాతపుస్తకాలు చదవడం, వాటిమీద రిమార్కులు రాయడం, విసుగు విరామంలేకుండా సమాచారాన్ని సేకరించడం, పనికిమాలిన విజ్ఞానంపైన అతనికి వుండే ఓ రకమైన ప్రత్యెకమైన ఇష్టం,-ఇలాంటి లక్షణాలన్నీ కలగలసి తెలుగు సాహిత్య పునరుజ్జీవానికి అతడిలో ప్రేరణను కలిగించాయంటున్నారు కాల్డ్ వెల్. బ్రౌన్ కి వుండే ఏనుగుజ్ఞాపకశక్తి, పిడివాదం చేస్తూ ఏది అడిగినా 'ఓహ్..నొ' అంటూ చెప్పటం మొదలుపెట్టే గుణం..ఇవన్నీ ఆయన స్వంతానికి ఎంతవరకూ ఉపయోగపడ్దాయో తెలీదుకానీ..వివిధ కారణాల మూలకంగా అంతవరకూ స్తబ్దంగా పడివున్న తెలుగుభాషామతల్లికి మాత్రం ఎనలేని మేలు కలిగించాయనే చెప్పాలి.ఏమంటారు?
-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...