Saturday, August 8, 2020

వివిధ కోణాలలో శ్రీకృష్ణతత్వం -కర్లపాలెం హనుమంతరావు -సూర్య దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురణ


కృష్’ అంటే శాశ్వతమైన, ‘ణ’ అంటే ఆనందం. పేరులోనే సూచితమయే  ఆ శాశ్వతానందం  అందించే   అవతారమూర్తి శ్రీకృష్ణుడిని విభిన్న కోణాలలో  సందర్శించే  చిన్ని ప్రయాసే ఈ వ్యాస రూపం.
కృష్ణుడు శ్రీకృష్ణుడుగాః
కృష్ణుడు యమునా తటి మధురానగరిలో కళ్ళు తెరిచిన కాలం మౌర్య పాలనకు(క్రీ.పూ.321)  సమకాలీనం. ఉత్తరభారతమంతా చిన్న చిన్న తెగల స్వీయపాలనలు ఉండిన  సమయమది. కృష్ణుడూ ఒక స్వతంత్ర రాజ్య సంస్థాపకుడే! స్వయంగా వీరుడు. అయినా,  రాజ్యాల మధ్య  సమన్వయం సవ్యంగా లేని నాటి రాజకీయ వాతావరణంలో సందర్భాన్ని బట్టి సాటి పాలకులకు సలహాదారుడిగా, రాజ్యాల మధ్య సయోధ్య కుదిర్చే రాజకీయవేత్తగా, రాజధర్మం బోధించే యోగపురుషుడుగా, సామాజికన్యాయం ప్రవచించే సుంఘసంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞలను విజయవంతంగా ప్రదర్శించిన ప్రతిభ కృష్ణయాదవుడిది. పాండవుల పట్ల  పరమాప్తుడుగా ప్రవర్తించిన ఆ లౌక్యుడు కాలక్రమేణా మోక్షకాముకులంతా కాంక్షించే దైవసమానుడి స్థాయికి ఎదిగేందుకు కాలం కూడా కలసిరావడం ఒక కారణమని చరిత్రకారుల అభిప్రాయం.
దేవతారూపాలుః
ఎనభైనాలుగు లక్షల జీవజాతులతో వర్ధిల్లే సృష్టిలో వివేచనబుద్ధిగా   మేధస్సులో స్థిరపడి మానవజన్మను మహోన్నతంగా తీర్చిదిద్దే చోదకశక్తి పరమాత్ముడన్న పారమార్థిక చింతన మనిషిలో ఎప్పటి బట్టి  ప్రబలమయిందో   రుజువులు దొరకని అంశం. పరమాత్మ, దివ్యత్వం వంటి అలౌకిక  భావజాలం బలం పుంజుకున్న కొద్దీ ఆరాధనార్థం  మనిషికి ఒక  బౌద్ధిక మూర్తి ఆవశ్యకత ఏర్పడింది. మానసిక భావోద్వేగాల అక్కరలు  నిమిత్తం పుట్టుకొచ్చినవే దేవతారూపాలు.
మహిమలుః
వాస్తవజీవితంలో తాను అనుభవించాలని ఆరాటపడే భోగభాగ్యాలన్నిటికీ ‘స్వర్గం’ పేరుతో ఓ ఊర్థ్వలోకం కల్పన చేసుకున్నట్లే, ఓపలేని ఈతి బాధలకూ ‘నరకం’ పేరుతో ఓ అథోలోకం కల్పించుకున్న ఘనుడు మనిషి. సహజంగానే  భగవంతుడు ఆ తరహా అతని స్వర్గానికి అధిపతి. స్వర్గప్రాప్తి, నరకవిముక్తి  మనిషి ఇహలోకంలో ఉన్నప్పుడే సాధించవలసిన పారమార్థిక లక్ష్యాలయాయి.  వాటిని పొందే వైనం లౌకిక భావజాలంతో నిర్వచించుకునే శక్తి చాలక ‘మహిమలు’ వంటి   అలౌకిక శక్తులను భావించుకుని, వాటిని  ప్రదర్శించే బాధ్యత భగవంతుడికే అప్పగించాడు మనిషి.
భగవంతుని అవతారాలుః
బిడ్డల కోసం కన్నవారుగా తాము పడే తపన మనిషికి  స్వానుభవమే! తల్లీ.. తండ్రీ వంటి దేవుడూ తమ భద్రత  కోసమై ఆయా సందర్భాలకు అనుగుణంగా  భూతలానికి  దిగివచ్చి  దుష్టశిక్షణ, శిష్టరక్షణల వంటి ధర్మకార్యాలు నిర్వహిస్తాడన్న విశ్వాసంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన  ‘భగవంతుని అవతారం’. భగవద్గీత 4వ అధ్యాయంలోని 7,8  శ్లోకాలను('యధా యధా హి ధర్మస్య; పరిత్రాణాయ సాధూనాం) బట్టి భారతయుద్ధం నాటికే ఈ అవతార సంపద్రాయం స్థిరపడినట్లు, భగవానుడు  ధర్మోద్ధరణ కోసమే కృష్ణావతారమెత్తినట్లు  జనం భావించినట్లు అర్థమవుతుంది.
సమకాలికుడు కావడంతో కృష్ణుడి దివ్యత్వాన్ని(మానవ మాత్రులకు అసాధ్యాలనుకునే పనులు) వ్యాసుడు కళ్లారా చూసే అవకాశం కద్దు. తన అవగాహన  మేరకు శ్రవణాసక్తుల మేధోసామర్ధ్యమే లక్ష్యంగా వాసుదేవుడిని ఓ అవతారమూర్తిగా చిత్రించడం రచనా ప్రయోజనం సాధించడానికైనా కావచ్చు. ఏదేమైనా  కృష్ణకథను  ‘శ్రీకృష్ణవృత్తాంతం’గా  ఒక క్రమపద్ధతిలోఉదాత్తంగా చిత్రించిన ప్రథమ సాహిత్యరచన చరిత్రకు తెలిసినంత వరకు  మహాభారతమే. కాకపోతే  భారతవాజ్ఞ్మయంలోని శ్రీకృష్ణుని విశేషాలకు, వైదికవాజ్ఞ్మయంలోని శ్రీకృష్ణుని విశేషాలకు మధ్య కొంత సమన్వయ లొపం ఉందని చెప్పుకోవాలి.
వైదికవాజ్ఞ్మయంలో శ్రీకృష్ణుడుః
రుగ్వేదంలో కృష్ణుడు  చాలా చోట్ల కనిపిస్తాడు. ఎనిమిదో మండలంలో  అంగీరసుడు సోమపానీయం చేసే  సోముణ్ణి స్తుతించినప్పుడు, మొదటి మండలంలో విష్ణాపు తండ్రి 'కృష్ణీయ'గా సూచితుడయినప్పుడు, ఎనిమిదో మండలంలొ ఆర్యదేవతలకు వ్యతిరేకంగా వృత్తాసురుడిగా చిత్రితుడయినప్పుడు, కౌషీతకం బ్రాహ్మణంలో  అంగీరస మహర్షిగా అభివర్ణితుడయినప్పుడు, ఐతరేయ అరణ్యకం కృష్ణహరీతుని పేరున మహర్షుల కోవలోచేర్చి ప్రస్తుతించినప్పుడు.   ఛాందోగ్యోపనిషత్ అయితే 'తద్దైవద్యోరంగీరసంః కృష్ణాయదేవ’(3-17-6) అనే శ్లోకం ద్వారా ఘోరఅంగీరసుని శిష్యుడైన దేవకీపుత్రుడిగా కూడా కృష్ణుడిని  పేర్కొన్నది. వైదికవాజ్ఞ్మయం ఇట్లా పరస్పర విరుద్ధ చిత్తప్రవృత్తులున్నఒక మహర్షిని, మరో అనార్యనాయకుడిని కూడా కృష్ణనామధేయంతో పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే అంశం! కానీ,  ఈ రెండు పాత్రలకూ, దేవకీ పుత్రుడైన  కృష్ణుడుకి పేరులో మాత్రమే పోలిక.
ఉపనిషత్తులలో శ్రీకృష్ణుడుః
ఉపనిషత్తుల కాలానికే ‘అవతారమూర్తుల’ భావన ఆరంభమైందని చరిత్ర భావిస్తుంది. 'అగ్నిం వరుణ మిత్రం ఇంద్రం ఆర్యమా ఐమాహః'  అన్న రుగ్వేదంలోని శ్లోకాన్ని బట్టి ఒకే దేవుడికి వివిధ నామాలు గల సంప్ర్రదాయం నుంచి ఉపనిషత్తుల కాలం(క్రీ.పూ 7వ శతాబ్దం)  వచ్చే సరికి ఒక్కో దేవుడికి ఒక్కో పేరు స్థిరపడే  సంప్రదాయం బలపడినట్లు చరిత్రకారుల అభిప్రాయం.  దశావతారాల సంప్రదాయానికీ ఆరంభం కూడా   అదే అయే అవకాశం కద్దు.
పురాణాలలో శ్రీకృష్ణుడుః
మహాభారతం తరువాత వెలసినవే కాబట్టి శ్రీకృష్ణ పాత్రను ఒక 'పూర్ణతమావతారం'గా దాదాపు అన్ని పురాణాలు  గొప్ప హంగులతో తీర్చిదిద్దాయని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 'యస్తు నారాయణో నామదేవ దేవః తస్యాంశో మానుషేష్వా సీద్వాసుదేవః ప్రతాపవాన్' అని భారతం చెబితే, 'మత్సాశ్వకచ్చప నృసింహ వరాహహంస రాజస్య విప్రవిబుధేషు కృతావతారః' అని అన్ని అవతారాలు తాను ధరించినవే అన్నట్లు స్వయంగా శ్రీకృష్ణుడే భాగవతంలో చెప్పుకొచ్చాడు. కృష్ణుని రాసలీలలు నుంచి రాచకార్యాల వరకు అన్నీ దైవలీలలే  అన్నంత భక్తిపారవశ్యంతో పూసగుచ్చినట్లు వర్ణించాయి దాదాపు వైదిక  పురాణాలన్నీ!  రాధాకృష్ణుల ప్రణయ వృత్తాంతాన్ని ఏకరువుపెట్టింది ఏ చరిత్రా కాదు.. సాక్షాత్ పురాణాలే! పురాణాల కాలం వరకు ఉత్తర భారతానికి మాత్రమే పరిమితమైన కృష్ణకథ తదనంతర కాలంలో తెలియని ఏ కారణం చేతనో  దక్షిణావనికీ  పాకి అత్యంత తక్కువ వ్యవధానంలోనే మహా విస్తృతంగా వ్యాపించింది. తెలుగునాళ్ల వరకు ఈ వ్యాప్తిలో   బమ్మెర పోతన భాగవతం పోషించిన పాత్ర అనన్యం. బౌద్ధసాహిత్యమూ కృష్ణకథ (ఘటజాతకం)ను ప్రచారంలో ప్రదర్శించిన ఉత్సాహం ఆశ్చర్యకరం.
పాశ్చాత్యుల  దృష్టిలో శ్రీకృష్ణుడుః
సనాతనకాలంలో రాముడు, కృష్ణుడు వంటి గొప్ప వ్యక్తులు  దివ్యశక్తులుగా వర్ధిల్లారు.  ఒకరి తరువాత ఒకరుగా అవే  దివ్యాకర్షణలతో వరుస చెదరకుండా మానవాతీతులు ఉద్భవించే  క్రమం ఆస్తికులలో  అవతారాలపై   విశ్వాసం మరంతగా  పెంచిందన్నది పాశ్చాత్య పరిశోధకుల భావన. అవతార సంప్రదాయానికి అదనంగా  పడమటి మేధోవర్గం  తమదైన వ్యూహాల (strategies) సిద్ధాంతం  జతచేయడం ప్రత్యేకంగా పరిశీలించదగ్గ విశేషం.
అవతారాలు వేరు.. వ్యూహాలు వేరు. ఒకే అవతారంలో భిన్న కార్యాల నిర్వహణకై  విభిన్న రూపాలు ధరించడం వ్యూహాల ప్రయోజనం. పాశ్చాత్యుల భావధారకు అనుగుణంగానే,  కృష్ణావతారంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.  భీష్మపర్వం ఈ వ్యూహాలనే వైదాంతిక   ధోరణిలో పురుషుడు, జీవుడు, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలుగా భావించింది(42-314). ఈ వ్యూహ సముదాయాన్నే మరో సందర్భంలో నరనారాయణులు, హరికృష్ణులనే  వ్యూహాలుగా కూడా భావించింది. 
గ్రీక్ తత్వవేత్త హెలియోడోరస్  ప్రతిష్ఠించిన గరుడస్తంభ వృత్తాంతంతో ఈ వ్యూహాలకు పోలిక కద్దు. ఆర్య సంస్కృతి ప్రారంభ దశల్లో పశుపాలన, వ్యవసాయం ప్రధాన వృత్తులు కాగా వాసుదేవ, సంకర్షణ వ్యూహాలు ఈ రెండు వృత్తులకు ప్రతీకలుగా భావించబడి ఆ ధోరణిలోనే  కాల్పనిక సాహిత్యం పుట్టుకొచ్చినట్లు పాశ్చాత్య పండితుల భావిస్తున్నారు.
శ్రీకృష్ణుని జీవితకాలం:
మహాభారతంలో శ్రీకృష్ణుడిది ప్రధాన పాత్ర. కురుక్షేత్రయుద్ధ కాలాన్ని బట్టి  కృష్ణుడి జీవితకాలం మీదా ఒక అంచనాకు రావచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారతంలో  పర్షియన్లు, గ్రీకులు, రోమన్ల తాలూకు ప్రస్తావనలు ఉండటం వల్ల మహాభారత కథాకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీ.పూ 4వ శతాబ్దానికి ముందు నాటిదిగా చెప్పడానికి లేదన్నది  సుప్రసిద్ధ పురాతత్వశాస్త్రవేత్త బి.బి. లాల్ పరిశోధన (మహాభారత్ మిత్ అండ్ రియాలిటీ -1976 -పుట.52) అభిప్రాయం. పాణిని అష్టాధ్యాయీ మహాభారత కథాకాలాన్ని క్రీ.పూ 5 వ శతాబ్దం దాకా  తీసుకువెళ్లడం గమనార్హం. రెండవ పులకేశి  తాలూకు క్రీ.పూ.634 నాటి ఐహొళె శాసనం  ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది సదరు శాసనం నాటించిన 3735 సంవత్సరాలకు ముందు.
అంటే (3735-634=3101) క్రీ.పూ 3101 ప్రాంతంలో!  మహాభారతం మౌసలపర్వం మొదటి శ్లోకం ప్రకారం కృష్ణుడి నిర్యాణం జరిగింది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత. అంటే (కలియుగం ఆరంభమయిన క్రీ. పూ 3101+ మౌసలపర్వం ప్రథమ  శ్లోకం చెప్పిన 36 సంవత్సరాలతో కలుపుకొని) క్రీ.పూ3137 లో!
పురాతత్వచరిత్ర కోణంలో విశేషాలుః
చరిత్ర అంటే  జరిగిన సంఘటనల సాధికారిక ప్రకటన. 'హెలియో డోరస్' అనే గ్రీకు దేశీయుడు  క్రీ.పూ 2వశతాబ్దిలో విదిసా నగరం నడిబొడ్డున  గరుడ ధ్వజాన్ని ప్రతిష్ఠి౦చినట్లు   శాసన మొకటి  కనిపిస్తుంది. ఇదే శతాబ్దిలో సంకర్షణవాసు దేవతత్వాన్ని గౌరవించే  కట్టడం  ఉదయ్ పూర్ లో నిర్మించినట్లు డి.పి.సర్కార్ 'సెలెక్ట్ ఇన్ స్క్రిప్షన్స్' మొదటి సంపుటి తెలుపుతోంది. ఈ కాలానికి  ముందూ వెనుకలుగా వైష్ణవతత్వం తెలియచేసే పాంచరాత్రం ప్రాధాన్యత గల ఛాందగ్యోపనిషత్ రచన జరిగింది. మహాభారతంలోని హస్తినాపురం ఇప్పటి ఢిల్లీ, మీరట్ ప్రాంతాలు. అక్కడ  జరిగిన తవ్వకాల తాలూకు బైటపడ్డ రంగుల కుండ పెంకుల ఆధారంగా భారతయుద్ధ కాలం క్రీ.పూ 1100 ఏళ్ల కిందటిది.  ఐహొళె శాసనం పేర్కొన్న విధంగా క్రీ.పూ 3101 కాకుండా, మహాభారత కాలం మరింత ముందుకు జరికి క్రీ.పూ 1200 నాటిది కూడా అయివుండవచ్చు, ఇన్ని కారణాలుగా శ్రీకృష్ణుడి జీవిత కాలమూ అదేనన్న భావన క్రమేపీ బలపడుతున్నది ఇప్పుడు. ఏదేమైనా, కృష్ణుడు శ్రీకృష్ణుడుగా సుమారు 3200 సంవత్సరాల నుండి ఈ భరతభూమిలో ఆరాధ్యుడన్నది  ఒప్పుకోక  తప్పని నిజం.  చిత్రకళల్లోని శ్రీకృష్ణుడూ  ఈ వాదన వైపుకే మొగ్గు చూపడం విశేషం,
చిత్రకళలో శ్రీకృష్ణుడుః
భారతీయ చిత్రకళలో కృష్ణుని చిత్రం క్రీ.పూ 2వ శతాబ్ది నుంచి దర్శనమిస్తోంది.  నేటి హర్యానా సగ్ ప్రాంతంలో దొరికిన (ఆధారం: పి.బెనర్జీగారి 'కృష్ణా ఇన్ ఇండియన్ ఆర్ట్) సాందీపుని దగ్గర్ర శ్రీ కృష్ణుడు బ్రహ్మీ అక్షరాలను అభ్యసించే చిత్రం మొదటి సారి నాణేల మీద ముద్రించిందీ  ఇదే శతాబ్దానికి చెందిన అగతక్లీన్. కుషాణశైలిలో శిల్పాలపై చెక్కిన కృష్ణ చిత్రాలు విస్తారంగా కనిపిస్తాయి.  శ్రీకృష్ణుడిని క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాలలో మధుర ప్రాంతాలలో దైవంగా భావించి, ఆరాధించడటమే ఇందుకు నిదర్శనం. తిలక్ తన  గీతారహస్యంలో భగవద్గీతను క్రీ.పూ 500 సంవత్సరాల నాటిదిగా తేల్చిచెప్పారు. ఆ భావనకే పాశ్చాత్య పరిశోధకులూ తలలాడించారు. పాశ్చాత్య పండితుడు డి.హిల్ కృష్ణావతారం క్రీ.పూ 2వ శతాబ్దం నాటికే స్థిరపడ్డట్లు భావించడం ఇందుకో ఉదాహరణ.(ఆశా గోస్వామి 'కృష్ణా అండ్ అల్లైడ్ మ్యాటర్స్ -1954,పుట 189).
కృష్ణకథ- భారతకథ- వాస్తవికత
కృష్ణకథ- భారతకథకు అనుసంధానం సరే! అసలు మహాభారతం నిజంగా జరిగిందా?అనే  సందేహం సహజంగానే తలెత్తుతుంది  కదా ఏ పరిశోధనకైనా? యధాతధంగా కాకపోయినా వ్యాస విరచిత భారతంలోని కొన్ని సంఘటనలకు వాస్తవ జగత్తులో రుజువులు లభిస్తున్నాయి. వి.సి. పాండే మహాభారతం మిత్ అండ్ రియాలిటీ (పు.183) ప్రకారం భారతం కథలోని పాత్రలు వైదికవాజ్ఞ్మయంలో కనిపిస్తున్నాయి. భారతం చెప్పిన  యాత్రాస్థలాలు కొన్ని ఈనాటికీ  మన కళ్ల ముందు కనిపిస్తున్నవే! కృష్ణుడు భీమార్జునులతో కలసి జరాసంధుని నగరానికి పయనిస్తూ మార్గ మధ్యంలో చూసిన పద్మ సరస్సు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రానికి 182 కి. మీ దూరంలో నేటికీ దర్శనమిస్తున్నది. అగస్త్యుని పేరు మీద ఏర్పడ్డ ప్రాంతంగా ప్రాంతీయులు విశ్వసించే  ‘అమీన్’  ప్రాంతమూ కురుక్షేత్రానికి 9 కి.మీ దూరంలో ఉంది.  'సపిదన్'  జనమేజయుడు చేసిన సర్పదమన యజ్ఞాన్ని తలపుకు తెచ్చే మరో స్థలం. కురుక్షేత్ర సమరం కేవలం వైదికమతమే కాదు, జైన, బౌద్ధ మతాలూ అంగీకరిస్తున్న సమాచారమే.  పురాతత్వశాఖవారి  తవ్వకాలలో భారతకాలానికి చెందిన   అవశేషాలు విశేషంగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బైటపడుతున్న నేపథ్యంలో   భారతకథ వాస్తవీయతను గూర్చి చర్చ అసందర్భమేమో!
మహాభారతం పునర్నిర్మాణం:
యుద్ధం జరిగే వేళ వ్యాసుడు రాసినట్లు చెప్పిన భారతం ఈనాడు మనకు అందుబాటులో లేదు.  ప్రచారంలో ఉన్న ప్రతి మూలభారతానికి ఎంత సమీపంలో ఉన్నదో   తెలిసే సాధనమూ లేదు. ప్రస్తుతం లభిస్తున్న భారతం కొద్ది మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం  క్రీ.శ ఒకటో శతాబ్దిది. ఇదీ భారతకథను విపులంగా చెపుతున్నదే తప్పించి.. శ్రీకృష్ణుని దివ్యత్వం మీద ప్రజావళికి విశ్వాసం ఎప్పుడు ఏర్పడిందో  నిరూపించే ఆధారాలేమీ అందులో కనిపించలేదు.
భరతభూమిలో ఎప్పుడో జరిగిన శ్రీకృష్ణుని కథ ఆ తరువాత ఎప్పుడో రాసిన భారతానికి ఎక్కిన కారణంగా భారత రచనాకాలం, కృష్ణుని జీవితకాలం ఒకటి కాకపోవచ్చు అనిపిస్తున్నది. కాకపోతే భారతంలో కనిపించే కృష్ణుడి కథ ఒక క్రమాన్ని అనుసరించి సాగడం, ఆ క్రమాన్నే ప్రమాణంగా తీసుకున్నట్లు తరువాతి కృష్ణసాహిత్యం మొత్తం మరింత విస్తరించడం.. దానికే క్రమేపీ దివ్యత్వం ఆపాదించడం మాత్రం కాదనలేని వాస్తవాలు.
అయినా వ్యాసమహాభారతమే శ్రీకృష్ణుడిని విష్ణువు అవతారంగా చూపించి కథమొత్తానికి సూత్రధారిగా మలిచిన సత్యం మనం మరచిపోకూడదు. భారతయుద్ధం క్రీ.పూ 3101 నుండి క్రీ.పూ 1200 మధ్య కాలంలో జరిగినట్లు చారిత్రిక ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో శ్రీ కృష్ణుని జీవితమూ  ఈ మధ్య కాలంలోనే గడిచింది అనుకోవడం సబబేమో!
ప్రాచీన కృష్ణపాత్రకు అర్వాచీనత సొబగులు:
శ్రీకృష్ణుడు జీవించి పోయిన ఎన్నో ఏళ్లు గడిచిన తరువాత కాని కృష్ణకథ గ్రంథస్తం కాలేదు. ఆ గ్రంథస్తం చేసిందీ  మొదటిసారి  మహాభారతమే. అందులోనూ యెకాయెకి శ్రీకృష్ణునికి దివ్యత్వం నిర్మొహమాటంగా అపాదింపబడింది. మౌర్యులకాలం నుంచి విదేశీ దాడుల వల్ల ఎంతో భారతీయ వాజ్ఞ్మయం నాశనమయింది. ఎప్పటికప్పుడు కోల్పోయిన వాజ్ఞ్మయాన్ని లభ్యమయిన మౌఖిక  కథనాల  అరకొత ఆధారాలతో పునర్నిర్మించుకునే క్రమంలో మూలభారత రూపంలో కొన్ని మార్పులు అనివార్యంగా వచ్చి చేరాయి. అయినా కృష్టతత్వం వెలుగుల మీద ఛాయలెప్పుడూ పడకపోవడం విశేషం. మొత్తానికి క్రీ.పూ 3101 నుండి క్రీ.పూ 1200 మధ్య కాలంలో శ్ర్రీ కృష్ణుని జీవితం బాల్యదశ నుంచి దైవీయభావనలతోనే వర్ధిల్లినట్లు భావించడం ఒక్కటే ముక్తాయింపుగా ప్రస్తుతానికి చెప్పుకొనే సబబైన మాట.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక - ఆదివారం  సంచికలో ప్రచురణం)

***
n








No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...