Thursday, December 10, 2020

తారుమారయింది ! శ్రీ సి.వి.ఎన్. ప్రసాద్ కథానిక ' అబ్బాయి పెళ్లి ' పై నా పరామర్శ ( ఈనాడు – ఆదివారం సౌజన్యంతో )

 

ఒకానొక కాలంలో ఎదిగిన ఆడపిల్ల నట్టింట తిరుగుతుంటే లక్ష్మీదేవి నర్తిస్తున్నంత ప్రసాదంగా ఉండేది ఇల్లంతా. ఆడపిల్ల అనగానే కన్న వారికి మహా మురిపెంగా ఉండటం సహజమే గదా! ' కంటే కూతుర్నే కనాలి ' పేరుతో ఒక పెద్ద హిట్ మూవీ కూడా తీసారు ప్రముఖ దర్శకుడు దాసరి. గడచిపోయిన తమ బాల్యం నాటి కమనీయమైన పాత ముచ్చట్లన్నీ ఆడబిడ్డ రూపేణా మళ్లీ ఉన్నంతలో తీర్చుకోవచ్చని ఆ ఉల్లాసం. ఎన్ని ఆనందోత్సవాలు సంబరంగా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చివరికి చిదిపి నట్టింట నిత్యం వెలిగించుకోవలసిన ఆ దీపం మరో ఇంటి జీవన జ్యోతిగ తరలిపోవలసిన తరుణం ఒకటి ఎలాగూ తప్పదు ఎప్పటికైనా . బంగారు తల్లులను ఎంత గారాబంతో పెంచుకున్నప్పటికీ మరో ఇంటికి ధారాదత్తం చేయబోమంటే సమాజమే తప్పు పడుతుంది కూడా . ఆడపిల్లను మరో అయ్య చేతిలో పెట్టే ఆ భారతీయ గృహస్థ జీవన విషాద సౌందర్య ఘట్టాన్ని కాళిదాసు నుంచి కాళ్లకూరి వరకు ఎందరో కవి పండితులు తమ తమ పాండితీ ప్రకర్షలతో తీర్చిదిద్ది సదా మననీయం చేసిపోయారు . కళ్యాణ శోభలో ఆఖరి అంశం అప్పగింతలు.. అది సాకారమవడానికి ముందు కొన్ని దశాబ్దాల కిందటి దాకా చాలా పెద్ద క్షోభ కథే నడిచేది; ముఖ్యంగా సగటు మధ్య తరగతి కుటుంబాలలో.
కాళ్లకూరివారు 1923 ప్రాంతాలలో ఈ ఆడపిల్లల పెళ్లిళ్ల ఇబ్బందులనే ఇతివృత్తంగా ఎంచుకొని 'వరవిక్రయం ' అనే నాటకం సృష్టించారు . ఆ రూపకం మొదటి రంగంలోనే కాళింది, కమల అన్న ఇద్దరు చక్కని చుక్కలను కన్న తల్లి భ్రమరాంబ 'కన్య నొక్కరి కొసగి స-ద్గతులు గాంతు/ మనుచు సంతోషపడు కాల - మంతరించి,/ కట్నములు పోయ జాలక - కన్య నేల/ కంటిమా యని వ్యథపడు - కాల మొదవె!'అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఒక పెళ్లి , తత్సంబధమైన కట్న కానుకల చుట్టూతానే ఆ నాటకమంతా నడిచినప్పటికీ నిజానికి ఆడపిల్లకు పిండ దశ నుండే ఎన్నో గండాలు ఎదురుగ నిలబడి ఉండేవి ఇటీవలి కాలం వరకు. ఆయా సామాజిక పరిస్థితులను పొల్లుపోకుండా, ఎక్కడా అతిశయం లేకుండా పూసగుచ్చిన చందంగా వివరించిందా ప్రబోధాత్మక నాటకం. ఆ రూపకంలో చెప్పినట్లు ఆడపిల్లల పెళ్లిళ్ల ఈడు దగ్గర పడ్డప్పటి బట్టి కన్నవాళ్ల గుండెల మీద కుంపట్లు రగలడం మొదలయినట్లే .
ఆ తరువాతా కూతుర్ని కట్టుకున్న అల్లుడు దశమ గ్రహ రూపంలో వాయిదాల పద్ధతిలో అత్తింటి వారిని వేపుకు తినడం ఒక సామాజిక హక్కు రూపంలో స్థిరపడ్డ దుస్థితి కలవరపరుస్తుంది. అందుకే కాళ్లకూరి ఇదే రూపకంలో ఆ ఆడపిల్లల తల్లి నోటితోనే - అప్పిచ్చినవాడితోను, ఇల్లు అద్దెకిచ్చినవాడితోను, జీతమిచ్చి పనిచేయించుకునే యజమానితోను , కులం పేరుతో నిందించేవాడితోను, పన్నులు కట్టించుకునేవాడితోను పిల్లను కట్టుకున్న అల్లుడిని పోల్చి మరీ కచ్చె తీర్చుకున్నారు. ఇన్ని బాధలుంటాయి కాబట్టే ఆ బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా అల్లుళ్లకు హడలి కూతుళ్లను కనడం మానుకొన్నట్లు కవిగారు అంటించినవి చురకలే అయినప్పటికీ, నిత్య జీవితంలో వ్యధకలిగించే పచ్చినిజాల నుంచి పుట్టుకొచ్చినవే ఆ వెటకారాలన్నీ . ఆడదై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టడం మేలు - అన్న నానుడి ఉట్రుడియంగా పుట్టుకురాదు గదా! ' తండ్రులకు గట్న బాధయు- దల్లులకు వియోగ బాధయుదమకు నిం-కొకరి యింటిదాస్యబాధయుగల దరి-ద్రపు టాడు బుట్టువే పుట్టరాదని - బుద్ధి నెంతు' అంటూ పురుషోత్తమరావుగారి చిన్న కూతురు కమల ఆకాలంలో పుట్టింది కాబట్టి అట్లా వేదన పడ్డది. ఇప్పడా ఆవేదన పడే తంతు మగవాడి వైపుకు ఎట్లా మళ్లిందో వాస్తవంగా చిత్రించింది ఈ ' అబ్బాయి పెళ్లి ' కథ యావత్తూ.
అవిద్య, అజ్ఞానం, అబలత్వం, సంప్రదాయం, ఆర్థికపరమైన పరాధీనత, సంఘభయం వంటి ఎన్నో సంకెలలు ఇన్ని శతాబ్దాలుగా స్త్రీ జగత్తు పురోగతికి ప్రతిబంధకాలు అవుతూ వచ్చాయి. ఇప్పుడా పరిస్థితిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మారుతున్న మగవాడి పాత్ర ఆధారంగానే శ్రీ సి.వి.యన్. ప్రసాద్ సృష్టించిన చక్కని చిన్న కథ' అబ్బాయి పెళ్లి ' .
ఆకాశంలో నేనూ సగం - అన్న అంతరంగంలో అణగి పడి ఉన్న స్వాభిమానం బాహ్య ప్రకటన రూపంలో రూపాంతరం చెందే దిశగా స్వతంత్రమైన ఆలోచనలతో నేటి మహిళ అడుగులు ఎంతలా వేగంగా పడుతున్నాయో ప్రపంచం అంతటా ప్రస్తుతం విస్తృతంగా చూస్తున్నాం.
నూతన శతాబ్దిలో అంది వచ్చిన అత్యద్భుతమైన సాంకేతిక జ్ఞానం సాయంతో తన స్థాయి ఏమిటో తెలిసొచ్చి ఇప్పుడిప్పుడే స్పృహలోకొస్తున్న మహిళకు .. అంత: చైతన్య శక్తి కూడా అదే స్థాయిలో వికసిస్తున్న వేళ మునుపెన్నడూ లేనంత పెనువేగంతో మగజాతిని క్రమంగా అధిగమిస్తో ప్రగతి పథం దిశగా స్ఫుత్నిక్కుల వేగంతో దూసుకెళుతున్న వాస్తవం కాదనలేం. ఆ పెనుమార్పుల తాలూకు ప్రభావం సంస్కృతీ సంప్రదాయాలలో సైతం సృష్టంగా కనిపిస్తోంది కూడా . ప్రపంచమంతటా సంభవిస్తోన్న ఈ సాంస్కృతిక పునరుజ్జీవన పరిణామ క్రమానికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకూ మినహాయింపుగా కనిపించక పోవడమే ఈ చిన్నకథ ప్రధాన ఇతివృత్తం.
శీలహననం జరిగితే మానమార్యాదల కోసమై నిశ్శబ్దంగా లోలోపలే శిథిలమయ్యే సర్దుబాటు ధోరణి నుంచి దుర్మార్గం నుంచి రక్షణ కోసం గానూ నిర్భయంగా, బహిరంగంగా, కలసికట్టుగా ఎలుగెత్తి ఉద్యమించే చైతన్యం సంతరించుకునే దశ దాకా ఎదిగింది ఇప్పుడు మగువ. గృహాంతర పాలన నుంచి గ్రహాంతరయానం దాకా ఎదిగిరాగల శక్తి సామర్ధ్యాలలో ఆమె తన అసమాన ప్రతిభా పాటవాలతో ఢీ కొంటున్న వైనం మగజాతిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న మాట కాదనగలమా? ఇన్ని శతాబ్దాలుగా.. పుట్టుక, పెంపకం , బాధ్యతలు , హక్కులు, ఆస్తులు పంపకాల వంటి అనేక ముఖ్య జీవితాంశాలలో సమ భాగస్వామ్య విషయకంగా జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోయేది లేదంటూ అనేక రకాలుగా ఏకకంఠంతో సంకేతాలను అన్ని కార్యక్షేత్రాల నుంచి బలంగా పంపుతున్నది కూడా ఇప్పటి ఇంతి. ఈ యుగసంధిలో జరుగుతున్న లైంగిక పాత్రల నిర్వహణ తారుమారులో భాగంగానే గత రెండు దశాబ్దాల బట్టి మనదేశంలోనూ మహిళల పరంగా పొడసూపుతున్న పెనుమార్పులు మగలోకపు ఊహలకు ఇప్పటి వరకు అందకుండా మును ముందుకు సాగుతునే ఉన్నాయి .
అర్ధిక క్షేత్రంలో స్వాతంత్ర్యం సముపార్జించుకున్న అనంతరం .. మునుపటి మానసిక బలహీనతలనూ తొలగ తోసుకునే తీవ్ర ప్రయాసలో నేటి మహిళ వివాహబంధం వరకు వచ్చేయడం సమాజంలో స్పష్టంగా కనిపించే విస్తుగొలిపే మార్పు .
నిన్నటిదాకా పెళ్లిని ఒక క్రీడగా భావించే లోకంలో మగవాడిదే మొదటి ఎత్తు-గా ఉండటం చూసాం. ఆ తరహా వ్యవస్థకు అలవాటూ పడిపోయాం. ఆ భావనకు ఇప్పుడు కాలం చెల్లిందంటుంది ఈ ' అబ్బాయి పెళ్లి ' కథ . నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కాదనుకుంటే మధ్యలో తుంచుకోవడం, మనసు పుడితే మరో భాగస్వామిని అదనంగా ఉంచుకోవడం, యధేచ్ఛగా కోరిక తీర్చుకునే హక్కును ఇదేమని నిలదీసే స్వాభిమానితో బంధం తెంచుకోవడం వగైరా వికృత పోకడలన్ని గతంలో మాదిరి మగవాడికి పుట్టుకతో అబ్బిన హక్కులు కావిప్పుడు. పెళ్లి బజారులో గతం మాదిరి మగాడిప్పుడు అదనపు కట్న కానుకలు, పెట్టు పోతలు పేరుతో చెట్టుసురులకు దిగడం కుదరదు. సరికదా అసలు డౌరీ పేరెత్తే సాహసమే మగపెళ్లివారి నుంచి కనిపించడం అరుదైన సందర్భాలు అబ్బురం కలిగిస్తున్న మాట వాస్తవం .
పెళ్లిచూపుల వంకతో కాబోయే ఇంటి కోడళ్లకు కాదీ కాలంలో శల్య పరీక్షలు. . మగవాడికి ఆ శిక్షలు! అతగాడి నాలుగంకెల జీతానికి గతంలో మాదిరి క్యూలు కట్టడం లేదీకాలపు ఆడపిల్లలు ఎక్కడా ! ఐదొందల నోటొకటి వదిలితే చాలు .. ఆరేడు రకాల డిష్టులతో అప్పటికప్పుడు ఏ డీలక్సు రెస్టరెంటో లగ్జోరియస్ లంచ్ ప్యాక్ చిటికేసే లోపు డెలివరీ చేసే కాలంలో .. వంటొచ్చా ?అని ప్రశ్నేసే మగాడిని అసలు మగాడుగా ఒప్పుకునే మూడ్ లోనే ఉండటం లేదీ మోడరన్ వుడ్ బి బ్రైడ్ . చాకలి పద్దుల చదువులు, హారుమొనీ మెట్టు రాగాలు, అత్తగారి కాళ్లొత్తే వినయాలు, మామగారికి కళ్లెదుట పడలేని బిడియాలు .. టైపు ఆడపిల్లలను కలలోనైనా ఉహించడం కుదరదు. ఆస్తిపాస్తులుండటమే కాదు.. చేసుకునే పిల్లకు తోబుట్టువు లెవరూ ఉండని సంబంధాలకై ఆనాడు మగపెళ్లివాళ్లు వెంపర్లాడినట్లే .. తల్లిదండ్రులు దగ్గరుండని పెళ్లి కొడుకుల కోసం ఆడపిల్లలు ఇప్పుడు ఆరాట పడుతున్నారు! ఆ కధా కమామిషు అంతా సూచ్యార్థం శైలిలో మినోదం ముదరకుండా సహజభాషలో చెప్పుకుపోతుందీ ప్రసాద్ గారి 'అబ్బాయి పెళ్లి ' కథ.
కాలం తన మాయాజాలంతో సంసారమనే నాటకంలో పాత్రల నైజం ఎంతవింతగా తిరగరాసేస్తుందో ఆకళింపు చేసుకొనేందుకైనా ఈనాడు ఆదివారం ప్రత్యేక అమబంధం 30, ఆగష్టు, 2010లో ప్రచరించిన శ్రీ సి.వి.ఎన్. ప్రసాద్ కథానిక ' అబ్బాయి పెళ్లి ' చదివితీరాలి.
పెళ్లికెదిగిన మగపిల్లలు కళ్ల ముందు తిరిగే కన్నవారు చదివితే ఎంతో సహజంగా ఉంది అని నిట్టూర్పు విడుస్తారు. ఆ తరహా గుండెల మీద కుంపట్లు రగలుతుండని అదృష్టవంతులు చదివితే మాత్రం ' మరీ అతిశయంగా ఉంది ' అని పెదవి విరవడమూ ఖాయమే ..
పదేళ్ల కిందటి నాకులాగే!
ముక్తాయింపు: కాలంలో జరిగే మార్పులను యధోచితంగా కళా నైపుణ్యాలకు కొదువ లేకుండా నమోదు చేసే సాహిత్యంలోని ఏ ప్రక్రియ రచన అయినా ఆ ప్రక్రియ వరకు ఉత్తమ శ్రేణిలో కుదురుకున్నట్లే లెక్క. ఆ కొలమానం ప్రకారం సి.వి. ఎన్. ప్రసాద్ గారి ఈ ' అబ్బాయి పెళ్లి ' కథానికకు గుర్తుంచుకోదగిన కథల జాబితాలో స్థానం దక్కాలి న్యాయంగా ! అవకాశం ఉండీ హాస్యం కోసం ఎక్కడా అతిశయాలంకార ప్రలోభాలకు లొంగని నిగ్రహ శిల్పం కథను పాఠకుడికి మరింత దగ్గరకు చేరుస్తుంది. శ్రీ ప్రసాద్ ఇందుకు ప్రత్యేకంగా అభినందనీయులు.
☘️
రచయితకు మనసారా అభినందనలు
🙏🏻🙏🏻👏👏
- కర్లపాలెం హనుమంతరావు
08 - 12 - 2020
బోథెల్ ; యూయస్ఏ






No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...