చేస్తున్న పని ఆపి కాలుతున్న చుట్టను ఒక దమ్ము లాగి మళ్లా పక్కనే పెట్టాడు సుబ్బులు. నడుముకు వారుతో తగిలించుకున్న వంకీతో డోలుకున్న వారు పట్టెల్ని మరోమారు లాగాడు. నిలబెట్టుకున డోలు కుడి మూతను నాలుగైదు సార్లు తట్టి శృతి చూసుకున్నాడు. మళ్లా చుట్ట చేతిలోకి తీసుకుని రెండు మార్లు దమ్ములాగాడు. చుట్ట అయిపోవడంతో దూరంగా విసిరేశాడు. అదెళ్లి టెంకాయ చెట్టు మొదట్లో పడి అక్కడున్న నీళ్ల తడికి సుయ్యిమంది.
డోలును ఎడం మూత పైకి వచ్చేటట్లు తిప్పాడు. డోలు
పుల్ల తీసుకుని దాని మీదా కొట్టి చూశాడు. అనుకున్నట్లు మోగలేదేమో 'ఛీ!
దీనమ్మ' అనుకుంటూ డోలును మళ్లీ వంకీతో లాగడం మొదలుపెట్టాడు.
కుడి మూత రంధ్రం నుంచి డోలు కర్ర మీదుగా ఎడం మూత రంధ్రంలోకి దూర్చుతూ డోలు కర్ర
పట్టీ చుట్టూ ఉన్న వారుపట్టీలను లూజు లేకుండా బిర్రుగా లాగాడు.
సుబ్బులకు గొంతు కింద పోస్తున్న చెమట గుండె మీద
నుంచి నడుం వరకు కారుతోంది. నల్లటి శరీరానికి నిమ్మచెట్ల మీద నుంచి వచ్చే గాలి
తగలడంతో హాయిగా అనిపించింది. పక్కనే ఉన్న పై కండువాతో శరీరాన్ని తుడుచుకున్నాడు.
అలా నాలుగు సార్లు శృతి చూసుకున్నాక మిగిలిన
వారును డోలు అడ్డకర్రల పట్టీగా నాలుగైదు వరుసలు చుట్టాడు. సొప్ప తీసుకుని ఎడం మూత
కడెంలోకి చొచ్చుకొనొచ్చిన పిచ్చులపై ఆనించి గుండ్రాయితో తడుతూ పిచ్చుల్ని ఇంకా
లోపలికి కొట్టాడు. ఎండ తగిలేటట్టు ముందు రోజు తయారు చేసి ఏలాడ గట్టిన బొట్టెల్ని
తీసుకొనొచ్చాడు. మంగలి పొదిలో నుంచి
గోరుగాలు తీసుకుని గోగుపుల్లల చుట్టున్న బొట్టెల్ని జాగ్రత్తగా గుండ్రంగా కోసి
వాటి నుంచి బైటికి తీశాడు. వాటిని ఎడం చేతి బొటన వేలుకు మినహా అన్ని వేళ్లకు
పెట్టుకున్నాడు. గోతం పట్టని సరి చేసి డోలు కొట్టడం మొదలు పెట్టాడు.. పాల వరసల
నుంచి .
యుద్ధానికి సిధమయ్యే సైనికుడిలా.. కళను
సృష్టించబోయే ముందు కళాకారుడి ఆత్మనివేదనలా.. తదేక దృష్టితో సుబ్బులు దానిలో
మునిగిపోయాడు.
ఇంటర్మీడియెట్ చదువుతున్న సుబ్బులు చిన్నకొడుకు
కాలేజీ ఫీజుల కోసం కావలి నుంచి వచ్చాడు. సిటికేసర చెట్టు కింద, పొయ్యిలోకి
కరతమ్మ పుల్లల్ల్ని చిదుగులుగా కొడుతూ తండ్రి వాయించే డోలుకు తలూపుతున్నాడు.
సుబ్బులు కూతురు అత్తగారింటి నుంచి వచ్చుంది.
మళ్లా పంపాలంటే చీరన్నా పెట్టాల్సిందే. దారి ఖర్చులూ ఇవ్వాల్సిందే.
సాయబ్బుల పీర్ల పండక్కి వాయిస్తే ఈ దఫాకి మీ
ఇద్దరి గొడవా వదిలినట్లే అన్నాడు వారం రోజుల కిందట సుబ్బులు. కానీ ప్రతి ఏడాదిలా ఈ
ఏడు పీర్ల పండగ మేళం సుబ్బులుకు ఊరకే రాలేదు. పెద్ద తిరకాసే జరిగింది.
***
ఆ రోజు సుబ్బులు బస్టాండులో ఉన్నాడు. ఎవరో
వస్తే గడ్డం చేస్తున్నాడు. సాయబ్బులపాలెం నుంచి మదర్సా హడావుడిగా వచ్చాడు. 'అరేయ్
సుబ్బులూ! ఈసారి పీర్ల పండక్కి మేళాల కోసం పెద్ద రబస జరిగిందిరా! అన్ని
సావిళ్లోళ్ళు ఈసారి పక్కూరి నుంచి పిలిపిద్దాం'అన్నారు. 'కొత్తపట్నం, అలకురపాటి నుంచి తెప్పిద్దాం'అన్నారు.
గడ్డం చేస్తున్నోడల్లా ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు
సుబ్బులు. 'అవున్రా! మనూరోళ్ల కంటే కొత్తపట్నమోళ్ళు బాగా వాయిస్తన్నారని అంటున్నారు.
ఎంత చెప్పినా వింటన్లే!'
'అదేందిరా మదర్సా! మీకు
ఒడుగులైనా.. గిడుగులైనా మేమే కదరా వచ్చేది. చిన్నప్పట్నుంచి కలసి మెలసి తిరిగాం.
గడ్డమైనా.. క్రాఫైనా ఎంతిస్తే అంతే తీసుకున్నాం. మన సాయబ్బులే.. మనోళ్లే..
అనుకున్నాం. ఇప్పుడేందిరా.. ఇదీ!' అన్నాడు.
'అవున్రా! నేనూ అదే చెప్పా! కానీ
.. కుర్రోళ్లు .. ఎదిగొఛ్చారు కదా! ఇంటంలా! మిగతా మూడు సావిళ్లు మా చేయి
దాటిపోయింది. మా సావిడి మేళం మాత్రం సుబ్బులన్నే అని గట్టిగా చెప్పొచ్చారా!'
అన్నాడు.
సాయిబులపాలెం పెద్దలతో మాట్లాడినా ప్రయోజనం
లేకపోయింది. చివరికి ఆ ఒక్క సావిడీ ఒప్పుకుని బయానా తీసుకున్నాడు సుబ్బులు.
అన్నిసావిళ్ల పని ఒప్పుకుని పక్కూళ్ల నుంచి
మేళగాళ్లను తెచ్చి పని జరిపిస్తే కాస్త డబ్బు మిగులుతుంది. అది అందరికి తెలిసిందే.
పక్కూరోళ్లను మేళానికి పిలిచినా అట్లాగే చేస్తారు. కానీ ఈసారి సుబ్బులుకు ఆ అవకాశం
లేదు. అదే అలవాటుగా మారితే ఈ ఊరు మంగలోళ్ల పరిస్థితి ఏమిటి? మేళాలన్నీ
పక్కూరికి పోతే ఈ ఊరి మీద పట్టు పక్కూరికి పోద్ది. అది జరక్కూడదంటే పక్కూరోళ్లకంటే
ఈ ఊరే మేలనిపించాలి. తమ సత్తా ఏంటో పీర్ల పండక్కి చూపించాలి అనుకున్నాడు.
గొల్లోళ్ల వెంకన్న దగ్గరికెళ్లి మంచి మేక తోలు
తెచ్చి ఆరకొట్టాడు. డోలు కున్న మూతలు విప్పి నానేసి తోలు విప్పాడు. ఆరగొట్టిన
కొత్తతోలు కడాలు సైజుకు తగ్గట్లు గోరుగాలుతో కోశాడు. ఎడం మూత రెప్ప కోసం మంచిగా
తోల్ని సిద్ధం చేసుకున్నాడు. రెండు రోజులు బక్కెట్లో నానేశాడు. మూడు పూట్ల తొక్కి
తోల్ని పొదగడానికి సిద్ధం చేశాడు. చిన్నకొడుకు ఊర్రాముల చిల్లరకొట్టు ఎదురుగా
చింతిత్తులు ఏరుకొచ్చాడు. గుండ్రాయితో చిన్నచిన్న ముక్కలుగా చితక్కొట్టి నానేశాడు.
సుబ్బులు పెళ్లాం వాటిని మెత్తగా రుబ్బి, వండి, మైదా
కలిపి బందన తయారుచేసింది.
సుబ్బులు కడేలుకు బందన పూసి తోలు అతికించాడు.
గట్టిగా అతుక్కునేందుకు బిరుసు గుడ్డతో అదిమాడు. ఎడం మూత పొదగడానికి వల్లూరు
జగ్గయ్య దగ్గరికెళ్లి మిషను తెచ్చాడు. కడానికి తోలు అతికించి బాగా అత్తుకునేందుకు
మిషను బిగించాడు. ఆరపెట్టాడు. రెండు మూతలు ఆరాక చింతగింజలు పెట్టి మధ్య దూరం
సమానంగా ఉండేటట్లు చూసి కళ్లు(రంధ్రాలు) కోశాడు. అక్కడ తోలు నానడానికి
గుడ్డపీలికతో వాటిని తడుపుతూ రోజంతా ఉంచాడు. ఎడం మూత ఆరాక దానిపై రెప్పను అతికించి
మళ్లా పొదిగాడు. డోలు కర్రకు గుడ్డతో నూనె పూసి బాగా సిద్ధం చేసుకున్నాడు. కుడి
మూత మధ్యలో నల్లటి బూడిదరాశాడు.
సుబ్బులు చిన్నకొడుకు, కూతురు
కలసి ఇంట్లో పాత కద్దరు గుడ్డను అంగుళం వెడల్పు ఉండేటట్లుగా పేలికలు పేలికలుగా
చించారు. రెండు గోగుపుల్లల్ని జానెడంతవి నరికి సిద్ధంచేసుకున్నారు. సిమెంటు,
అన్నం కలిపి మెత్తగా నూరారు. గుడ్డలేలికలకు దానిని పూసి
గోగుపుల్లలకి రెండు కొసల దానిని అంటించారు.
వాట్ని ఎండలో ఆరగట్టారు. అవి ఎండాక గోగుపుల్లల్నుంచి విడదీస్తే బొట్టెలు
అవుతాయి.
ఆ రోజు సుబ్బులు పొద్దున్నె అన్నిట్నీ
ముందేసుకుని కూర్చున్నాడు. డోలు కర్రని నిలబెట్టి కింద కుడి మూత, పైన
ఎడం మూత పెట్టి రంధ్రాల గుండా వారు ఎక్కించాడు. మూతలు బిర్రుగా ఉండి, శృతి రావడం కోసం వారు పట్టీలకు వంకీ తగిలించి లాగుతున్నాడు.
లాగుతున్నాడే కానీ, పక్కురోళ్ల
గురించి, వాళ్ల డోళ్ల గురించి, సన్నాయిల
గురించి,వాళ్లు వాయించే విధానం గురించి ఆలోచిస్తున్నాడు.
అంతే కాదు.. సొంతూర్లో పరువు నిలబడాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు.
వాయించడం అయిపోయాక, అన్నిట్నీ
నెమరు వేసుకున్నాక, డోల్ని మరోసారి సరిచూసుకుని పట్టెడ
తగిలించాడు. గుడ్డ కప్పాడు. ఇంట్లో దేవుడి మూలనున్న పీటపై పెట్టొచ్చి ప్రశాంతంగా
గాలి పీల్చుకున్నాడు. నిప్పెట్టె తీసి చుట్ట అంటించాడు. దమ్ములాగుతూ మార్కెట్లో
ఉన్న పంచలోకి వెళ్లి కూర్చున్నాడు.
***
సుబ్బులూ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. పెద్దోడు
సన్నాయి,
రెండోవాడు .. అదే సుబ్బులు, మూడో వాడు మళ్లీ
సన్నాయి, నాలుగోవాడు మళ్లీ డోలు.. వాయిస్తారు. వాళ్లయ్య
చస్తూ చస్తూ ఊరిని, వృత్తిని చూపించిపొయ్యాడు. పక్కూరు
మంగలోళ్లకు ఈ నలుగురు అన్నదమ్ములంటే హడల్. కాని, డబ్బులు
బాగా ఇస్తారని ఈ కొత్తపట్నపోళ్లు, అలకురపోటోళ్లు
ఒప్పుకున్నారు. ఈ విషయం నలుగురు అన్నదమ్ములకు తెలుసు. అందుకే వాళ్లు సన్నాయిల్ని
కూడా గట్టిగా సిద్ధంచేసుకున్నారు.
పీర్ల పండగ రానే వచ్చింది. మొదట్రోజు
సావిట్లోంచి పీర్లను దించడం. మామూలుగానే సాగిపోయింది. సుబ్బులు ఆ ఊరు
మంగలోళ్లకున్న పీరు దగ్గరకు వెళ్లి 'మా పరువు నీవే కాపాడాల' అని వేడుకున్నాడు. పెళ్లాంతో కలిసి బొరుగులు, వేగించిన
శెనగపప్పు, బెల్లం పీర్లకు ఇచ్చొచ్చాడు. తర్వాతి రోజు గుండం
తొక్కడం కూడా అయింది. ఆ తర్వాతి రోజే పీర్ల ఊరేగింపు.
ఆ రాత్రి సాయిబులపాలెంలో ప్రతి సావిడి దగ్గర
సినిమాలు,
నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులు.. పోటీపడి
వేస్తారు. వేకువ జాము మూణ్ణాలుగ్గంటలకు పీర్లు ఊరు చుట్టూ తిరుగుతాయి. ట్రాక్టర్ల
మీద డూపు హీరోలు, హీరోయిన్లు ఎగురుతుంటే జనాలకు సందడే సందడి.
పదిగంటలకల్లా పీర్లు ఊరు చుట్టూ తిరుగుతుంటే
నీళ్లతో వారు పోసేవాళ్లు పోస్తూనేవున్నారు. అందరు ఇళ్ల నుంచి బయటికొచ్చి
చూస్తున్నారు. సాయిబుల పిల్లలు ఎగురుతుంటే దానికి అనుగుణంగా మేళం మోగుతోంది.
పీర్ల ఊరేగింపు తిరుగుతూ తిరుగుతూ ఊరి మధ్యలో
ఉన్న రాంసామి మేడ దగ్గరి కొచ్చింది. పీర్లు అన్నీ వరుసగా నిలబడ్డాయి. ఏ పీరు కాడున్న మేళగాళ్లు ఆ పీరు దగ్గర
వాయిస్తున్నారు. సన్నాయిలు శృతిమించి మోగుతున్నాయి. జనాలందరూ విరగబడి చూస్తున్నారు, ఎగిరేవాళ్లు
ఎగురుతూనే ఉన్నారు.
అప్పటికే మేళగాళ్లకి మందు సరఫరా అయింది.
సుబ్బులుకి,
వాళ్లన్నకు మందు అలవాటు లేదు. మిగిలిన పీర్లకాడ వాళ్లు తాగిన మైకంలో
వాయిస్తున్నారు. అలకురపాటి ఎంకట్నర్సు రేపు చూసుకుందాం అన్నట్లు సుబ్బుల్ని చూసి
తలెగరేశాడు. కొత్తపట్నం సీను సన్నాయిని గుండ్రంగా తిప్పుతూ సై అన్నట్లు చూశాడు.
సుబ్బులుకు కోపం నసాళానికి అంటింది.' నా కొడుకులు వాయించేది
తక్కువ.. ఊగేది ఎక్కువ' అనుకున్నాడు. నిటారుగా నిలబడి డోలు
వాయిస్తున్నాడు. అట్లా పోటీ రంజుగా సాగుతుంటే 'టైం లేదు ..
టైం లేదు.. పదండి.. పదండి' అంటూ సాయిబుల్లోని పెద్దలు
పీర్లని ముందుకు కదిలించారు.
మరుసటి రోజు గుమ్మటాలు. అదే చివర్రోజు.
గుమ్మటాలన్నీ ఊర్లోని పెద్ద బజారుగుండా సముద్రానికి వెళతాయి. అక్కడే వాట్ని
కలిపేస్తారు.
ఆరు గంటలకల్లా గుమ్మటాలు సాయిబులపాలెంలో
బైలుదేరాయి. ఒక్కో గుమ్మటం దగ్గర జనాలు ఇసకేస్తె రాలనంతగా ఉన్నారు. ఒకచోట ఒకరు
చేతిరుమాలును పళ్ల మధ్య బిగించి నాగిని నృత్యం చేస్తుంటే, మరోచోట
ఇంకోడు పులి డ్యాన్స్! ఇలా అన్ని గుమ్మటాల దగ్గరా కోలాహలం. ఊరు ఊరంతా కులం,
మతం, ఆడ, మగ
భేదాల్లేకుండా ల గుమ్మటాల చుట్టూరా ఉంది.
గుమ్మటాలన్నీ జాలమ్మ చెట్టు దగ్గరకు వచ్చాయి.
అక్కడ బజారు పెద్దదిగా ఉంటుంది. నాలుగు గుమ్మటాలని వరసగా నిలబెట్టారు. వాటి ముందు
మేళగాళ్లు.. వాళ్ల ముందు ఎగిరేవాళ్లు. పోటీ ప్రారంభమయింది అనుకున్నారు
చూసేవాళ్లంతా. అప్పటికే వాయించేవాళ్లు తాగున్నారు. ఒక్కొక్కరు మోకాలి దండేసి డోలు
కొడుతున్నారు. సన్నాయిని గాల్లోకి తిప్పుతు ఆకాశం కేసి చూస్తూ ఊదుతున్నారు. రాగాలు, తాళాలు మారుమోగుతున్నాయి.
ఎగిరేవాళ్లకు అనుగుణంగా వాయిస్తున్నారు.
సుబ్బులు నిశ్చలంగా నిలబడి ఒక మౌనిలా
వాయిస్తున్నాడు. తాళాలన్నీ శృతికి అనుగుణంగా పడుతున్నాయి.
ఎంకట్నర్సు సుబ్బులు వంక చూసి కొత్త తాళం
అందుకున్నాడు. అక్కడి సన్నాయిలూ అందుకు అనుగుణంగా మారిపోయాయి. సుబ్బులు కూడా
కొత్తతాళం ఎన్నుకున్నాడు. కొత్త కళాసృజన ప్రారంభమయింది.
సుబ్బులు దుమికే జలపాతంలా మారిపోయాడు. జనాలందరూ
సుబ్బులు డోలు చూడ్రా! ఎట్టా మోగుతుందో! అంటూ ఆ గుమ్మటం దగ్గరకు వచ్చేస్తున్నారు.
వస్తూ వస్తూనే ఊగిపోతూ ఎగురుతున్నారు. డోలు గట్టిగా మోగుతోంది. మోగుతూ మోగుతూ
ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. డోలు కుడి మూత టప్పుమని పగిలిపోయింది. సుబ్బులుఉ
నిశ్చేష్టుడైపోయాడు. ముఖాన నెత్తుటి చుక్క లేకుండా పోయింది. గుండె
ఆగిపోయిందనుకున్నాడు. యుద్ధం మధ్యలో అస్త్రాలు కోల్పోయిన సైనికుడిలా నిలబడిపోయాడు.
అంతలో సుబ్బులు తమ్ముడు వెంకటేశ్వర్లు తన మెడలో
ఉన్న డోలు తీసి సుబ్బులు మెడలో వేశాడు.'నువ్వు ఒక్కడివి చాలు.
వాయించన్నా!'అన్నాడు. పక్కనే ఉన్న సుబ్బులు అన్న సన్నాయిలో
కొత్తరాగాన్ని ఎత్తుకున్నాడు. సుబ్బులు తనను తాను నిలదొక్కుకున్నాడు. ఎడం మూతపై
వేళ్లను సప్తస్వరాలుగా కదిలించాడు. కుడి మూత మీద పుల్లను దానికి తగ్గట్లుగా
నర్తింపచేశాడు. ఇప్పుడు మంగలి సుబ్బులు సుబ్బుల్లా లేడు. మ్స్రొ సృష్టి చేస్తోన్న
బ్రహ్మలా మారిపోయాడు.
ఆ ధ్వని అందరి మనసుల్లోకి చొచ్చుకునిపోతోంది.
వాళ్లల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. అందరూ మంత్రముగ్ధుల్లా మారిపోయారు.
అన్ని గుమ్మటాల నుంచి జనాలు వచ్చి చూస్తున్నారు. ఎగిరేవాళ్లు కూడా నిశ్చలంగా
నిలబడిపోయారు. ఒక తపస్సమాధిలో ఉన్నట్లు సుబ్బులు వాయిస్తూనే ఉన్నాడు.
నిజానికి సుబ్బులు డోలు నేర్చుకోలేదు. తండ్రి
వాయిస్తుంటే చూసి నేర్చుకున్నాడు. జవజీవాల్లో నిక్షిప్తమైన కళకు, నేర్చుకున్న కళకు ఉన్న తేడా సుబ్బుల్ని చూస్తే
తెలుస్తుంది.
వెంటనే వెంకట్నర్సు డోలు పక్కన పడేసి సుబ్బులు
ముందు కొచ్చి 'అన్నా..' అన్నాడు. మిగతా గుమ్మటాల దగ్గర ఉన్న
సాయిబులందరూ కూడా సుబ్బులు దగ్గర కొచ్చారు. మేళం రసపట్టులో ఉన్నప్పుడు ఎదుటివాడు
డోలు మీద నుంచి పుల్ల తీయడమే ఒక పెద్ద అవమానం. కానీ,
వెంకట్నర్సు 'అన్నా,.. మీ ఊరు మీదే!మా
ఊరు మా ఊరే!' అన్నాడు ఉద్వేగంగా.
తర్వాత గుమ్మటాలు నెమ్మదిగా సముద్రం వైపు
కదిలాయి. అప్పటికే సమయం రాత్రి తొమ్మిదయింది. సముద్రం నిశ్శబ్దంగా వెన్నెట్లో
మెరుస్తోంది.
రచయిత (పేరు - తెలియదు) ;
(ఆంధ్రజ్యోతి ఆదివారం 16,మే,
2010 సంచికలో ప్రచురితం)
సెల్: 9848425039
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
07, 12 డిసెంబర్, 2020
No comments:
Post a Comment