Showing posts with label Family. Show all posts
Showing posts with label Family. Show all posts

Monday, February 22, 2021

వల - కథానిక -కర్లపాలెం హనుమంతరావు - ఆంధ్రభూమి ప్రచురితం






 

శారద ఆ టైములో రావడం ఆశ్చర్యం అనిపించింది.

ఇంట్లో ఎవరూ లేరు. సుమతి కాలేజీకి వెళ్లిపోయిందిరఘు పొద్దున్నే డ్యూటీకి వెళ్లిపోయాడుతను చేసేది ఆలిండియా రేడియోలో ఉద్యోగం

నేనూ ఆఫీసుకు బయలుదెరే హడావుడిలో ఉన్నాను. 'ఇదేమిటమ్మా! ఈ వేళప్పుడు వచ్చావ్?' అనడిగాను భోజనానికి కూర్చోబోతూ

మాట్లాడలేదుతలొంచుకు కూర్చుంది అక్కడే ఉన్న కుర్చీలోమాటి మాటికీ కళ్లు తుడుచుకోవడం  గమనించాను

విషయమేదో సీరియస్సే.

రెండు నిమిషాలు వెక్కిళ్లు పెట్టి చెప్పింది చివరికి 'వాడీ మధ్య ఆడపిల్లలతో తిరుగుతున్నాడన్నయ్యా!'

'వాడంటే ఎవరూ?'

'మురళి'

మురళి నా మేనల్లుడుకంప్యూటరింజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడిప్పుడుమనిషి మంచి చురుకుకారెక్టర్ కూడా మంచిదేనే! కానీఇదేమిటీకన్నతల్లే ఇట్లా చెబుతోంది.. వాడేదో తప్పు చేసినట్లు?!'

ఆడపిల్లలతో స్నేహం చేస్తేనే తప్పు పట్టేటంత సంకుచితంగా ఉండవే మా కుంటుంబాలలో ఆలోచనలు! ఇంకేదో ఉంది

'విషయమేంటో చెప్పు! నా కవతల ఆఫీసుకు టైమవుతుందిఅన్నాను గాభరా అణుచుకుంటూ

బట్టలు మార్చుకుని తన ఎదురుగా వచ్చి కూర్చున్న తరువాత చెప్పింది శారద 'ఈ టైములో అయితే ఇంట్లో ఎవరూ ఉండరని తెలిసి వచ్చానురా! మరీ లేటనుకుంటే ఓ గంట పర్మిషన్ తీసుకోరాదూ! ప్లీజ్.. నా కోసం! నీకు కాక ఇంకెవరికి చెప్పుకోవాలీ బాధ?' అంటూ మళ్లీ కళ్ల నీళ్లు పెట్టుకుందదిఆఫీసుకు ఫోన్ చేసి వచ్చి కూర్చున్నాను 'ఇప్పుడు చెప్పు! మురళి మీద నీకు డౌటెందుకొచ్చిందసలు?' పొద్దున వాడి రూము సర్దుతుంటే వాడి పుస్తకాల మధ్య  దొరికిందన్నయ్యా!అంటూ  పింక్ కలర్ కవరొకటి అందించింది శారద

విప్పి చూస్తే ఉత్తరంతో పాటు ఓ  ఫొటోఫొటో వెనక 'నీ శశిఅని రాసి కనిపించింది.ఉత్తరం ఆ శశి రాసిందని అర్థమవుతూనే ఉంది. దాన్నిండా లేటెస్ట్ మార్క్ శృంగారం ఒలకపోతే

'ఎవరీ శశి?' అనడిగాను

'నాకూ తెలీదురాఅడ్రస్ ఉందిగా! ఒకసారెళ్లి నాలుగు  వాయించి వద్దామనుకుంటున్నా! నువ్వూ తోడు రావాలిఅందు కోసమే వచ్చా!'అంది

'బావగారికేమీ చెప్పలేదా?' అనడిగాను

'చెప్పాలనే చూశా! ఎవాయిడ్ చేస్తున్నారెందుకో! ఎంత సేపటికీ .. తనూ.. తన హాస్పిటలూ.. ఈ మనిషికిఈ రోజుల్లో ఇవన్నీ మామూలే! అని కొట్టిపారేస్తున్నారు కూడాఅందామె కళ్ళు మరోసారి తుడుచుకుంటూ

'అదీ ఒక రకంగా నిజమేనేమో! నువ్వు వూరికే మురళి మీద అపోహ పడుతున్నావేమోనే!'

'కొన్ని రోజులుగా మురళిలో చాలా మార్పు వచ్చిందన్నయ్యా! ఇంటి పట్టున సరిగ్గా ఉండటం లేదుఉన్నా ఎంత సేపటికీ ఆ గదిలోనే మగ్గడం! ఎప్పుడు ఎవరితోనో ఫోనులో గుసగుసలు! వచ్చే ఫోన్లు కూడా అట్లాగే ఉంటాయిఫోన్లతోనే కాలమంతా గడచిపోతోందిచదువు మీద శ్రద్ధ తగ్గిందిఇట్లాగయితే కెరీరేం గాను?అడిగితే ఊరికే కస్సుబుస్సుమంటున్నాడుచెల్లి ప్రీతితో ఎంతో ప్రేమగా  ఉండేవాడుఇప్పుడైతే దాని పొడే గిట్టటం లేదన్నయ్యా! డబ్బు బాగా దుబారా చేసేస్తున్నాడురాత్రిళ్లు కూడా లేటుగా ఇంటికి రావడంఒక్కోసారైతే వాళ్ల నాన్నగారి కన్నా లేటుగా వస్తున్నాడుఅయినా ఆయనేమీ అడగడం లేదునాకు పిచ్చి పట్టినట్లుంటోదీ మధ్య!వెక్కి వెక్కి ఏడిచే శారదను చూసి బాధేసింది

'ఈ కాలంలో కుర్ర సజ్జంతా అంతేనమ్మాయ్! మా రఘుగాడితో మేమూ పడ్డాం కొన్నాళ్లువాళ్లమ్మ కూడా ఇదిగో ఇట్లాగే బెంబేలు పడిపోయిందప్పట్లో! ఇప్పుడంతా సర్దుకుపోలేదూ! ఇదీ అంతేనేమోలే!సముదాయించడానికని ఏదో చెప్పాను

'ముందు నేనూ అట్లాగే అనుకున్నానురా! కానీ రోజు రోజుకూ పెడసరితనం పెరుగుతున్నదే కాని .. తగ్గుముఖం పట్టే సూచనల్లేవుతల్లిని.. నా మనస్సెట్లా ఊరుకుంటుంది చెప్పు! ఈ ఉత్తరమొక్కటే అయితే అదో దారిరా...' అని కొద్దిగా తటపటాయించి ఇంకో కవరిచ్చింది నా చేతికి. 'ఖర్మ! తల్లి నయినందుకు ఇవన్నీ భరించాలి కాబోలుఇప్పుడు కాదుతర్వాత చూసుకో.. నేను పోయిన తర్వాత'  అంది

అప్పటికే ఆమె ముఖమంతా ఎర్రగా అయిపోయింది అవమానభారంతో

చేత్తో తడిమితే అర్థమయింది.. అది నిరోధ్ పాకెట్!

'పొద్దున మురళి గాడి టేబుల్ సొరుగులొ దొరికిందిఇక ఉండబట్ట లేక  నీ దగ్గరకు పరుగెత్తుకొచ్చాఅని భోరుమందిమురళీగాడు చాలా దూరం వెళ్లాడే! బావగారేమీ పట్టించుకోకపొవడం ఆశ్చర్యంగా ఉందిచెల్లెలి కుటుంబాన్ని ఆదుకోవడం అన్నగా నా బాధ్యత అనిపించింది. 'రెండు రోజుల్లో నేను మేటర్ సెటిల్ చేస్తాగా! నువ్వురికే బాధ పడవాక' అన్నాను.

ఆ ఆశతోనే ఇక్కడికొచ్చిందన్నయ్యా!'అని లేచి నిలబడింది శారదశారదను వాళ్లింట్లో డ్రాప్ చేసి నేనాఫిసుకు వెళ్లిపోయాను

సుబ్రహ్మన్యమనీ నా బాల్య స్నేహితుడుఆప్త మిత్రుడు కూడాకమర్షియల్ ఆర్ట్ లైన్లో ఉన్నాడుసాయంత్రం వాడిని కూర్చోబెట్టి వివరంగా అంతా చెప్పి సలహా ఆడిగానురెండు నిమిషాలు ఆలోచించి 'రేపు.. ఆదివారంమనిద్దరం ఒకసారి ఆ  పిల్ల ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి వద్దాంరా' అన్నాడు సుబ్రహ్మణ్యం. 

ఉత్తరంలోని అడ్రస్ కనిపెట్టడం కాస్త కష్టమయిందిఇల్లు ఒక సన్నటి సందులో ఉందిపెంకుటిల్లులోవర్ మిడిల్ క్లాస్ వాతావరణంఇంట్లో ఎవరెవరో ఉన్నారుమేం వెళ్లి కూర్చున్న పది నిమిషాలకు గాని ఆ అమ్మాయి ఊడిపడలేదుమా ముందుకు రావడానికి శ్రద్ధగా అలంకరణ చేసుకోవడానికి ఆ టైము పట్టినట్లు అర్థమయింది

ఏ మాటకామాటే పిల్ల నదురుగా ఉందిమురళి లాంటి వయసులో ఉన్న మగపిల్లలు ఆమె వలలో పడ్డంలో ఆశ్చర్యం లేదుఆ అమ్మాయి చొరవ చుస్తే అట్లాగుంది మరి

'మీ మురళీని చూస్తే నాకు జలసీగా ఉంది గురూ!అన్నాడు చిన్నగా ఆమె కాఫీలకని లోపలకు వెళ్లినప్పుడు సుబ్రహ్మణ్యం

'నీ బొందముందు వచ్చిన పని చూడు!అని నేనే మందలించా వాడిని

 'నేనో  టీ.వీ సీరియల్ చేస్తున్నానుఅందులో హీరోయిన్ రోలుకు మీరయితే బాగుంటుంది అనిపించిందిఅన్నాడు సుబ్రహ్మణ్యం శశి కాఫీ కప్పులతో తిరిగొచ్చింతరువాత.

'మీరు నన్నెక్కడ చుశారు?' అని ఆశ్చర్యంగా అడిగిందా అమ్మాయి

'డాక్టర్ కరుణాకర్ గారి హాస్పిటల్లోనేను అక్కడ ట్రీట్ మెంట్ కని వచ్చినప్పుడు మిమ్మల్ని ఛూశానువాళ్లే ఇచ్చారు ఈ అడ్రస్ఇతను నా పార్ట నర్రామచంద్రరావు.మిమ్మల్ని చూపించినట్లుంటుందిమీరు ఒప్పుకుంటే అతని ఎదుటే టర్మ్స్ మాట్లాడుకున్నట్లూ ఉంటుందని నేనే వెంటబెట్టుకొచ్చానుఅన్నాడు సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం వడుపుగా విసిరిన వలలో పడినట్లే ఉంది చేప్పిల్ల. 'మీ టర్మ్స్ ఏమిటో చెప్పండి ముందుఅంది ఆమె కుతూహలంగా

'మీ పెద్దవాళ్లను కూడా పిలవండి! మాట్లాడుకుందాం!అన్నాడు సుబ్రహ్మణ్యం

'అక్కర్లేదులేండినేనేం చేసినా మా అమ్మా నాన్నా కాదనరు.  నిజానికి నాకు నాలుగు రాళ్లు ఎక్కువ వస్తాయంటే ముందు సంతోషపడేదీ వాళ్ళే! ఏట్లా వచ్చాయని కూడా అడగరుఅంత నమ్మకం నా మీద' అంది శశి. 

అక్కడే మంచం మీద పడుకొని ఉన్నాడామె తండ్రిదగ్గుతున్నాడు ఉండుండీఏదో జబ్బులాగా ఉందికాఫీ కప్పులు తీసుకువెళ్లదానికని వచ్చిందామె తల్లికూతురు చూపులను అనుసరించి తహతహలాడుతూ ఆమె తిరగడాన్ని బట్టే అర్థమవుతుంది.. శశి ఆ ఇంట్లో పూర్తిగా స్వతంత్రురాలని

'మీరు హాస్పిటల్లో చేసే ఉద్యోగానికి కొంత కాలం సెలవు పెట్టాల్సి వస్తుందిఅన్నాడు సుబ్రహ్మణ్యం

'నో ప్రాబ్లం'

'డాక్టర్ గారు ఒప్పుకుంటారా?’

'ఒప్పుకుంటారు సాధారణంగాఒప్పుకోకపోతే ఆ నర్స్ జాబ్ కి  రిజైన్ చెయ్యడానికైనా నేను రెడీనే!అందామె దృఢంగా

'బంగారంలాంటి ఉద్యోగాన్ని వదులుకోవడమెందుకులీవ్ తీసుకోండి.. సరిపోతుంది!'

'ఇలాంటి ఉద్యోగాలు వస్తూ ఉంటాయిపోతు ఉంటాయి సార్! ఇది నా మొదటి ఉద్యోగం కాదుఇదే చివరిదీ కాబోదునాకు నా కెరేర్  ముఖ్యం'

కెరీర్ కోసం ఏమైనా చేసే తెగువ ఆమెలో కనిపిస్తూనే ఉందిసుఖం కోసంపై అంతస్తు కోసం పరితపిస్తున్నది కనకనే మురళి లాంటి హోదాగాల ఇంటి కుర్రాడికి వల విసిరింది

మళ్లీ ఆదివారం కలుస్తామని చెప్పి వచ్చేశాం

సుబ్రహ్మణ్యానికి నిజంగానే టీ.వీ సీరియల్ తీసే ఆలోచన ఉన్నట్లు అప్పుడు తెలిసింది నాకు. 'శశిని నిజంగానే బుక్ చేద్దామనుకుంటున్నానురాఅన్నాడు బైటికొచ్చిన తరువాత

'షూటింగ్ కోసం బైట ఎక్కడెక్కడో తిరగాలి ఓ రెణ్ణెల్లుఈ లోపు ఆ పిల్ల మీ మురళిని పూర్తిగా మర్చిపోతుందిలే. నాదీ గ్యారంటీఅని హామీ కూడా ఇచ్చేశాడు

ఈ చల్లని కబురు శారద చెవిలో వేశాను

'ఈ రెండు నెలలు మురళిని క్లోజ్ గా వాచ్ చెయ్యి! వాడు మళ్లీ మనుషుల్లో పడేటట్లు చూసే బాధ్యత నీదే! ఆ పిల్ల కాంటాక్ట్ లోకి రాకుండా చూసే పూచీ సుబ్రహ్మణ్యానిదిఅలాగని వాడు హామీ ఇచ్చాడు కూడా!'అన్నాను. 'సుబ్రహ్మణ్యంగారికి నా తరుఫున థేంక్స్ చెప్పరా!అంది శారద సంబరంగా

సుబ్రహ్మణ్యం షూటింగ్ మొదలుపెట్టాడువారం రోజుల్నుంచి వాళ్ళు అరకులో ఉన్నారు గానీ ఆచూకీ బైటవాళ్లకు తెలీకుండా జాగ్రత్తపడ్డాడు సుబ్రహ్మణ్యం.. 

ఒకరోజు సుబ్రహ్మణ్యం నుంచి ఓ కవరొచ్చిందిచింపి చూస్తే ఉత్తరంతో పాటు కొన్ని కాగితాలు

'శశి దొరకడం నిజంగా చాలా అదృష్టంరా! బాగా యాక్ట్ చేస్తోందిమీ బావగారి హాస్పిటల్ని పూర్తిగా మర్చిపోయిందినిజంగా మీ బావగారికిది పెద్ద షాకే! దీంతో పాటే పంపించిన లవ్ లెటర్లు చూడు! నీకే తెలుస్తుందంతా! అడిగితే శశే ఇచ్చేసింది ఉత్తరాలుఇప్పుడు నేనేమడిగినా ఇచ్చే నిషాలో ఉందిలే ఈ అమ్మాయిఇవి ఈ పిల్ల దగ్గరుండడం డేంజరని నీకు పంపిస్తున్నా!' అని ఫోనులో చెప్పాడు సుబ్రహ్మణ్యం.

అవన్నీ ప్రేమలేఖల్లాంటి ఉత్తరాలే! శశికి మురళి రాసినవి కావుమురళి తండ్రి డాక్టర్ కరుణాకర్ శశికి రాసినవిపేరు లేకపోతేనేం.. దస్తూరీని బట్టి సులువుగా పోల్చుకోవచ్చు

తన దగ్గర పనిచేసే నర్సును ప్రేమ పేరుతో లోబరుచుకోవాలనుకునే బావగారు.కెరీర్ కోసం ఎంతకైనా తెగించే ఆ అమ్మాయి.. 

'పాపం.. శారద!అనిపించింది నాకా క్షణంలో

'ఇట్లాంటి సంగతులు అమ్మకెట్లా చెప్పాలో తెలీకే నేనో దొంగ ఉత్తరం సృష్టించి నా రూములో అమ్మ కంట పడేటట్లు పెట్టింది మామయ్యా! అమ్మకు తెలిస్తే ఎట్లాగూ ఊరుకోదుఆ రాక్షసిని వెళ్లగొట్టే దాకా ఏదో ఒకటి చెయ్యకుండా ఉండదని తెలుసు కనకనే ఇట్లా చేశాం నేనూ ప్రీతీ! అమ్మ వైపు ఉన్నట్లుంటూనే నేను చెప్పినట్లు నాటకం రసవత్తరంగా నడిపించింది చెల్లి. లేకపోతే నాకా దయ్యంతోనా  గిల్లికజ్జాలు! నెవ్వర్!అన్నాడు మురళి విడిగా నేను పిలిపించి ఆడిగినప్పుడు.. భళ్ళున నవ్వేస్తూ! నేను షాక్!

తేరుకుని 'ఈ సంగతి ఇప్పుడు మీ అమ్మకు తెలిస్తే..'

'ఏడుస్తుందిఅమ్మ అట్లా ఏడవకూడదనేగా ఇంత దరిద్రమైన నాటకానికి తెరలేపింది.. సారీ.. మామయ్యా ,, నాన్నను పూర్తిగా దారిలోకి తేవాలి ముందు. దానికి.. నీదీ నీ ఫ్రెండుదీ సహకారం ఎంతో అవసరం!అన్నాడు మురళి. ఆప్యాయంగా  దగ్గరకు తీసుకున్నా చెల్లి కొడుకును.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి సచిత్రమాస పత్రిక, అక్టోబర్, 2002 సంచికలో ప్రచురితం)


 

 

Monday, February 15, 2021

' ఛుక్‌ ఛుక్‌ రైలు ' - కథానిక - కర్లపాలెం హనుమంతరావు - కథానిక - రచన కథాపేఠం పురస్కారం


 

ఒక ప్రముఖ చినపిల్లల మాసపత్రికవాళ్ళు ఆ సంవత్సరం బాలల దిఓత్సవం సందర్భంగా గేయ కథల పోటీ నిర్వహిస్తున్నార్రు.సెలెక్షన్ కమిటీలో నేనూ ఒక మెంబర్ని.

దాదాపు మూడువందల ఎంట్రీలు వచ్చాయి. మొదటి వడపోతలో ఒక వందదాకా పోయినా.. ఇంకా రెండువందలవరకు మిగిలాయి.

పిల్లలకోసం ఇంతమంది రాసేవాళ్ళు ఉన్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపించినవాళ్ళలో లబ్దప్రతిష్ఠులూ ఉండటం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింతగొలిపే విషయమేమిటంటే కొత్తగా రాస్తున్నవాళ్లలో కొంతమంది ఎంతో చురుకుగా రాసారు! నిజానికి ప్రముఖుల రచనలకన్నా అవి ఎందులోనూ తీసిపోవు. కొన్నయితే మిగిలిన వాటికన్నా  బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమయింది. మొత్తంమీద అందరం కలసి కూర్చుని అన్ని కోణాల్లోనూ పరిశీలించి  ఫైనల్గా ఒక పది రచనలను ఎంపిక చేసాం. వాటిలో ఒకటి, రెండు, మూడు బహుమతుల ఎన్నికను సంపాదకులకే వదిలేసాం. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోవచ్చని సలహా ఇచ్చాం. అట్లాంటీ సాధారణ ప్రచురణకు ఎన్నికైనదే 'ఛుక్ ఛుక్ రైలు'. గేయ రచయిత సి. ఆంహనేయులు, దేశాయిపేట.

దేశాయిపేట మా ఊరికి దగ్గర్లోనే ఉంటంది. మా ఊర్లో హైస్కూలున్నా దేశాయిపేటలో చదువు బాగుంటుందని మా నాన్న ఎస్సెల్సీలో  నన్ను అక్కడ చేర్చాడు. నాకెప్పుడూ ఫస్టు ర్యాంకే వస్తుండేది. క్లాసులో కృష్ణగాడికి రెండో ర్యాంకు. వాడి అన్నయ్యే ఆంజనేయులు.

ఆంజనేయుల్ని చూస్తే మాకు ఎడ్మైరింగుగా ఉండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కొరుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. సోషల్ సబ్జెక్టులో సంవత్సరాలు, యుద్ధాలూ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అదే పనిగా బటీ పడుతుంటే.. అలా చేయడం తప్పనీ.. గుర్తు పెట్టుకోవడానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు 'రిటెన్షన్ ఆఫ్ మెమరీ పవర్' అనే 

టెక్నిక్కు ఆన్ లైన్లో కోచింగ్ తీసుకొంటున్నారు. అందులో చెప్పిన సూత్రాల్లో కొన్ని నలభై ఏళ్లకిందట ఆంజనేయులు చెప్పినవే! అతఏమీ కోర్సులు చదువుకోలేదు. వాళ్ల నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్లకంత స్తోమతూ లేదు.

కృష్ణగాడితో కంబన్డు స్టడీసుకని నేను వాళ్ళింటికి వెళుతుండేవాణ్ని. ఆంజనేయులుకి ఇంకా చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారుచేసెవాడు. రంగుపెన్సిళ్లతో బ్రహ్మాండంగా బొమ్మలేసేవాడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తపని చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. చేయడానికేమీ లేదనుకొన్న రోజున పేపరూ, పెన్నూ పటుకుని కూర్చునేవాడు. కథలు రాసేవాడు.కవితలల్లి వినిపించేవాడు. మా స్కూలు యానివర్సిరీకీ మా కోసం ఒక హాస్యనాటిక రాసి తనే డైరెక్టు చేసి మెప్పించాడు.గ్రీన్ రూంలో మాకు మేకప్ చేసిందికూడా ఆంజనేయులే. ఆ మేకప్ సామాను స్వయంగా తయారు చేసుకొన్నాడు. 

 మాఅన్నయ్య అమెరికాలో పుట్టివుంటే చాలా గొప్పవాడయివుండేవాడు' అంటుండేవాడు కృష్ణ ఎప్పుడూ.

అమెరికా సంగతేమోగాని.. ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తరువాత అతను చాలా మంచిపేరు తెచ్చుకొంటాడు అనుకొనేవాళ్లం. కానీ అతనికి చపలత్వం ఉండేది. ఏ పనీ స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో ఆడుకొనేవాడు. ఆటలాడుకోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండేవాడు. ఊళ్ళో వాళ్లెంత మెచ్చుకొంటున్నా ఇంట్లోవాళ్లచేత తిట్లు తింటుండేవాడందుకే. కృష్ణకున్న స్థిమితంలో పాతికోవంతు  ఆంజనేయులుకున్నా నిజంగా చాలా మంచిపేరు తెచ్చుకొనుండేవాడే.

నేను డిగ్రీ చదువులకని మా తాతగారి ఊరికెళ్ళిపోయిన తరువాత ఆంజనేయులు సంగతేమయిందో పట్టించుకోలేదు.

 

నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజుల్లో ఓ రోజు ఆంజనేయులు నన్ను వెదుక్కొంటూ వచ్చాడు. వయసు అతనిలో ఆట్టె మార్పు తీసుకురాలేదు. కూర్చున్న పదినిమిషాల్లో వంద విషయాలను గురించి మాట్లాడాడు. మనది వాస్తవంగా లౌకిక ప్రజాస్వామ్యమేనా? అన్న అంశంనుంచి.. పారలల్ సినిమా వరకు.. అన్ని అంశాలమీద అడక్కుండానే  సుబ్బారావు. చనువున్నవాళ్లు సుబ్బు అంటారు. ఆంజనేయులికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం.

అతను ఇచ్చిన కథ ఎడిటరుగారికి నచ్చింది. 

ప్రచురించబడిన తరువాత నేనే అతనికి స్వయంగా కబురు చేసాను. ముందు ముందు ఇంకా మంచి కథలు రాస్తుండమని సలహాకూడా ఇచ్చాను.

రెండు నెలల తరువాత ఒక నవల పంపించాడు. బాగుంది. కొద్దిమార్పులతో ప్రచురించడానికి అంగీకారమయింది. 

క్రమంగా ఆంజనేయులు రచయితగా మిగతా పత్రికల్లోకూడా కనిపించడం మొదలుపెట్టాడు.

రేడియోలో అతను రాసిన  నాటకాలూ రావడం మొదలుపెట్టాయి.

కవి సమ్మేళనాల్లో అక్కడక్కడా కనపడుతుండేవాడు. 

ఒక నాటకపరిషత్తులో పోటీ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 'రివ్యూ'కోసం పత్రిక తరుఫున నేనే హాజరవుతున్నాను. రెండో రోజున భుజాన వేళ్లాడే సంచీతో  ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేట నుంచి  నాటకం తయారు చేసుకొచ్చాట్ట! అక్కడికి దగ్గర్లోనే ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాటకం బాగా పండింది. ఆంజనేయులు మూగవాడిపాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం అతనిదే. రచన సంగతి  సరేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులికి దక్కింది. 'అందుకేనన్న మాట ఈ మధ్య పత్రికల్లో ఎక్కువగా కనిపించడం లేదు' అన్నాను అతన్ని అభినందిస్తూ. 

చిన్నగా నవ్వాడు ఆంజనేయులు 'సుబ్బూ! ఒకసారి నువ్వు మా ఊరు రావాలి!' అన్నాడు.

'ఏమిటీ విశేషం?'

'అఖిల భారత స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాం. నువ్వూ ఒక జడ్జిగా ఉంటే బాగుంటుంది'

'అమ్మో! పాటల గురించి  నాకు ఏబిసిడిలు కూడా తెలీవన్నా!'

మేమందరం ఆంజనేయుల్ని 'అన్నా' అనే పిల్చేవాళ్లం కృష్ణతోపాటే.

'అలాంటివాళ్ళే నిజమైన న్యాయనిర్ణేతలవుతారు. నీకెందుకు నువ్వు రా!' అంటూ అడ్రసూ డేటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. 

ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న ఊరే అయినా ఆంజనేయులు  టీచరుగా వెళ్ళిన తరువాత  ఊరు పరిస్థితుల్లో చాలా మంచి మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడి జనం. ముఖ్యంగా కుర్రకారులో అతనికి మంచి ఫాలోయింగుంది. పెద్దవాళ్లలో గౌరవమూ ఉంది. పిల్లకాయల పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు పెద్దవాళ్ళు. ఊరిపెద్దల సహకారం లేనిదే అంత పెద్ద కార్యక్రమం చెయ్యడం బైటివాళ్లకు సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ ఊళ్లో ఆంజనేయులు మరో అవతారం చూడగలిగాను. అప్పటి దాకా  చూడని అవతారం.. సోషల్ వర్కర్ అవతారం!

ఊళ్లో ఉచితవైద్యం చేస్తున్నాడు. అందుకోసం పుస్తకాలు తెప్పించుకొని చదువుతున్నాడు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేయడం నేరం కదా  అనడిగితే కలకత్తా బ్రాండ్ 'ఆర్ ఎం పి' సర్టిఫికేట్ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం సేవే. లాభార్జన కాదు. చిన్న చిన్న రోగాలకే వైద్యం చేస్తున్నది.. ఉచితంగా. 'కొద్దిగా కాంప్లికేటేడ్ గా ఉన్నా పట్నం పొమ్మంటా' అన్నాడు ఆంజనేయులు. 

ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయం కూడా  పెట్టించాడు. 

అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరిసమస్యలని పరిష్కరించే విధానం. బోరింగుల్లోకి నీరు రాకపోయినా, వీధిదీపాలు వెలక్కపోయినా, వినాయక చవితి, శ్రీరామనవమిలాంటి పండుగలకి ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నా, పంచాయితీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిగ్గా  అందరిముందు చర్చించుకొనే అలవాటు చేయించాడు. ఆంజనేయులు ఒక్క టీచరే కాదు.. ఊరి పెద్దల్లో ఒకడూ ముఖ్యుడూ అయికూర్చున్నాడు.

'ఇన్నిపనులు చెయ్యటానికి నీకు టైమెక్కడిదన్నా?' అనడిగాను ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు. 

'ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. నువ్వైనా చెప్పు బాబూ! ఆరోగ్యం సంగతి చూసుకోవద్దూ !' అంది ఆంజనేయులు భార్య,

ఆమె కంప్లయింటు సమంజసమైందే అనిపించింది. కానీ నేను ఆంజనేయులుకి చెప్పేటంతటివాడినా!

'ఇప్పుడంటే ఫరవాలేదు. ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చిన తరువాత  కూడా తిరుగుతానంటే ఎట్లా?' అందామె.

'అప్పటి సంగతి చూద్దాంలేవోయ్  !' అని నవ్వి ఊరుకొన్నాడు ఆంజనేయులు.

అప్పటికి ఆంజనేయులు భార్య గర్భంతో ఉంది. అదీ ఆవిడ భయం.

ఆంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామె 'నువ్వూ మా కృష్ణలాంటివాడివే బాబూ! నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి నేను? వినేందుకు ఎవరున్నారు గనక! నన్ను చేసుకొన్నారని ఆయన్ని వాళ్ల వాళ్లు వెలేసినంత పని చేసారు. ఎవరూ ఇటువైపు రారు. మా వాళ్లు మరీ మొరటువాళ్లు' అని కన్నీళ్లు పెట్టుకొందావిడ.

ఆంజనేయులు ఇంతకుముందు పనిచేసిన ఊళ్ళోనే ఈ పెళ్ళి చేసుకొన్నాడు. కులాంతర  వివాహం. ఎవరు వారించినా వినకుండా చేసుకొన్నాట్ట! ఆయన బ్రాహ్మడు. ఈవిడది షెడ్యూల్డ్ కులం. ఇరువైపుల పెద్దలకూ ఈ వివాహం ఇష్టంలేకపోయింది. ఆ ఊళ్లోవాళ్ల బాధపడలేకే ఇక్కడికి బదిలీ చేయించుకొన్నాడు ఆంజనేయులు.

ఆంజనేయులు కులాంతర వివాహాలను గురించి కొన్ని కథలు రాసాడు. తను రాసిందే   ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేట్! ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకొన్నాను ఆ క్షణంలో.

 తరువాత నేను ఉద్యోగం మారి ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే దాదాపు మూడు దశాబ్దాలు ఉండిపోయాను. పెల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్లయిపోయారు. మధ్య మధ్యలో ఆంధ్రా వస్తున్నప్పుడు ఆంజనేయుల్ని గురించి వాకబు చేస్తుండేవాణ్ణి. ఉద్యోగాల రీత్యా అతనెక్కడెక్కడో ఉంటుండేవాడు. ప్రతిసారి ఏదో కొత్త ఆడ్రసు చెప్పేవాళ్ళు.

ఒకసారతన్ని మాచర్లలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లలు. పెద్దది పాప. సెకండ్ క్లాసు. రెండో వాడు యూ.కె.జి. చాలా చురుకుగా ఉన్నారిద్ద్దరూ. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీషులో  రైమ్సు.. తెలుగులో పద్యాలు గడ గడ చదివేస్తున్నారు. పిల్లలిద్దర్నీ డ్యాన్సు స్కూల్లో చేర్పించారు. 

'మైత్రికి పెయింటింగ్ కాంపిటీషన్లో టౌన్ మొత్తానికీ ఫస్టొచ్చింది.  ఇదిగో ప్రైజ్. చిన్నాడుకూడా చిచ్చర పిడుగే. వీడికీ సీతారామరాజు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్లో ప్రయిజొచ్చింది. సంగీత్సం కూడా  నేర్పించాలని ఉంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే!' అన్నాడాంజనేయులు.  అక్కడున్నంత సేపూ మొగుడూ పెళ్ళాలు తమ పిల్లల్ని గురించే మాట్లాడారు. 

'నువ్వేమన్నా వేరే ఏక్టివిటీస్ చేస్తున్నావా అన్నా?' అనడిగాను.

లోపలికి వెళ్లి ఓక ఫోటో ఆల్బమ్, రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు. అల్బంనిండా వాళ్ళ పిల్లల ఫోటోలే, రకరకాల భంగిమల్లో.. రకరకాల చోట్ల తీసినవి.

'వీళ్ళకోసం ఫొటోగ్రఫీ నేర్చుకొంటున్నాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే!.. బాగున్నాయా?' అనడిగాడు.

నిజంగా ఫోటోలు బాగా వచ్చాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తీసిన స్థాయుకి ఏమాతం తగ్గవు అవి. ఆంజనెయులు చెయ్యి ఎందులో పడినా అంతే! బంగారం! అందులోనుంచి మచివి రెండు ఏరి ఇచ్చాడు. 'నీకు తెలిసిన పత్రికలు వీలుంటే వేయించు' అన్నాదు.

'పాటలు  రాశాను కొన్ని.  బాలల గేయాలు.. గేయ కథలు ఉన్నాయనుకో! మా పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి నోరు తిరిగే    రీతిలో బాణీలు కట్టి రాసినవి. మైత్రీ! ఒక పాట పాడమ్మా! 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాట అందుకొని దాదాపు ఐదారునిమిషాలు ఆపకుడా పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లవాడు అక్కకు తోడుగా గొంతు కలపడం..!

'వీళ్ళు పాడే పాటలన్నీ నేను రాసినవే. వీళ్లకోసమే రాసాను. వీటిని కేసెట్టుల్లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తయేమో చూడు!'  అంటూ కేసెట్టూ.. పుస్తకమూ అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న రెండుగంటలూ ఆంజనేయులు తన పిల్లల్నిగురించి తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్ లోకి వెళితే ఆయన భార్య   సవరించేది. వాళ్ల ప్రపంచమంతా ప్రస్తుతం ఆ ఇద్దరి పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే ఉంది. 

'తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు' అనిపించిందా  క్షణంలో. 

నాకు పరిచయమున్న పత్రికకు అతనిచ్చిన ఫొటోలు, గేయాలు పంపించాను. రెండు ప్రచురించారు. మంచి స్పందనా వచ్చిందని చెప్పారు. 

'పిల్లల శీర్షికలకన్నా రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేయమ'ని ఎంకరేజింగ్ గా సలహా ఇస్తూ ఆంజనేయులకి ఉత్తరం రాసాను.

కొన్నేళ్ళు ఆంజనేయులు రెగ్యులర్ గా రచనలు పంపించాడుట. 'మంచి క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ అండ్ ఒరిజినల్' అని మెచ్చుకొన్నారు ఎడిటరుగారు నేనొకసారి ఆయన్ని కలిసినప్పుడు. '.. కానీ ఈ మధ్య ఏవో కామిక్సు పంపిస్తున్నాడు. అవి అంత ఒరిజినల్ కాదు. అయినా ఫరవాలేదనుకొని కొన్ని ప్రచురిస్తున్నాం' అన్నాడాయన. అంటే ఆంజనేయల  పిల్లలు హైస్కూలు చదువులకు వచ్చారన్నమాట..' అనుకొన్నాను, 'ఇంకొద్దికాలంపోతె ఇవీ రాయడు చూడండి! సస్పెన్సు.. క్రయిం  థిల్లర్ టైపు నవలలొస్తాయి' అన్నాను ఆ ఎడిటరు మిత్రునితో.

మరో ఐదేళ్ళ తరువాగ్త ఆ మిత్రుడు ఓ పెళ్ళిఫంక్షనులో కలిసాడు. ఆ

 మాటా ఈ మాటా అయిన తరువాత టాపిక్ నవలలమీదకు మళ్ళింది. 

'అన్నట్లు.. మర్చిపోయా!.. మన ఆంజనేయులు ఈ మధ్య ఒక క్రైం థిల్లర్ పట్టుకొచ్చాడు. అగాథ క్రిస్టీకి నకలుగా ఉందది. అతని దగ్గర్నుంచి రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రిక్కూ, అతనిక్కూడా  ప్రేరు పోతుంది. చూస్తాలే.. అని పక్కన పెట్టేసాను' అన్నాడు. 

ఈ మలుపు నేనూహించిందే అయినా.. ప్రాణం ఉసూరుమంది. ఆంజనేయుల్లో ఎంత టేలెంటుంది! ఎంత వెర్సటాలిటీ ఉంది!  ఏమయిందా ప్రతిభంతా?!

తరువాత కొంతకాలానికి ఆంధ్రా వైపొచ్చానుగాని.. పని వత్తిడివల్ల అతన్ని కలుసుకోవడానికి కుదరలేదు.  

తరువాత ఎప్పుడో అనుకోకుండా ఓ పెళ్ళిలో కృష్ణ కలిసాడు. చాలా ఏళ్ల తరువాత కలుసుకొన్నాం. గంటలకొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగడం లేదు.

'ఇట్లా కాదు.. ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా!' అని బలవంతాన ఇంటికి తీసుకువచ్చాను మర్నాడు. రాత్రి భోజనాలయిన తరువాత ఇద్దరం డాబామీద  కూర్చొని కబుర్లలో పడ్డాం. టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయులుదగ్గరికొచ్చి ఆగింది. 

నేనే అన్నాను 'మీ అన్నయ్య నిజంగా ఎంత టేలెంటు ఉన్నవాడూ! సిన్సియర్! కులాంతర వివాహం చేసుకొన్నాడని మీరంతా ఆయన్ని దూరం పెట్టడం ఏం బాలేదురా! ఇంట్లో వాళ్లంతా వెలి వేస్తే   ఆ లోటు పూడ్చుకోడానికి ఆ రోజుల్లో అతను చేసిన సోషల్ సర్వీసు అపూర్వం.  అట్లాంటివాడు పిల్లలు పుట్టేసరికి అప్పటివరకూ తాను సేవించిన సొసైటీనికూడా పూర్తిగా మర్చిపోయి .. ఆ పిల్లలలోకంలోకి వెళ్ళిపోయాడు!..  ఎంత విచిత్రమైన మనిషో!

కృష్ణ అందుకొని మిగతా భాగం పూర్తిచేసాడు '.. అన్నయంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే ఉండేది. వేరే కులం పిల్లని చేసుకొన్నాడని ఇంత్లో వెలేయకపోతే చెల్లెళ్లకు పెళ్ళిళ్ళవడం కష్టమయేదిరా! ..పోనీ అక్కడన్నా స్థిరంగా ఉన్నాడా అంటే..  అదీ లేదు. నువ్వు చెప్పిందీ నిజమే ! పిల్లలే లోకంగా మసిలేవాడు. వాళ్లమీదే ఆశలన్నీ పెట్టుకొన్నాడు. వాళ్ళకోసమే తను ఇంతకాలంగా ప్రేమించి పెంచుకొన్న కెరియర్ని కాదని కాలదన్నుకొన్నాడు. కానీ.. చివరికేమైందీ!..'

'ఏమైందీ?!' నా మనసేదో కీడు శంకింస్తోంది.

'కూతురు  అమెరికా పోయి తనలాగే వేరే దేశంవాడిని పెళ్ళి చేసుకొంది. సంబంధాల్లేవు  . కొడుకిక్కడే ఉన్నాడుగానీ.. తండ్రిపొడ గిట్టదు. తాను కోరుకొన్న కోర్సులో  చేర్పించలేదని అలిగి ఇంట్లోనుంచి వెళ్ళిపోతే వెదికి తెచ్చుకొన్నాడా ఉద్ధారకుణ్ణి. ఉన్నదంతా వాడి చదువులకు సమర్పించుకొన్నాడు. చివర్రోజుల్లో బికారిగా మారాడు. వదిన చచ్చిపోయింది. కొడుకూ కోడలే ఆధారం ఇప్పుడు. వాళ్ళు చీదరించుకొంటున్నా పడుండక తప్పని దౌర్భాగ్యం'

'మరి ఈ మధ్య ఏదో గేయం చూసానే! ఏదో పోటీకి పంపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా. 

'పంపే ఉంటాడులే! కొడుకూ, కోడలూ ఉద్యోగాలకు వెళుతున్నారుగదా! పసిపిల్లల్ని వీడి మీద  పడేసి  పోతున్నారు. ఆ పసివాళ్లకోసం  పాటలూ.. గట్రా ఏవన్నా  కడుతున్నాడేమో మళ్ళీ! అదేగా వాడి బలం.. బలహీనతా!' అన్నాడు కృష్ణ   


'శాపవశాన తన శక్తి తనకు తెలీని హనుమంతునివంటి వాడు ఆంజనేయులు. జాంబవంతుడికా  శాపం తెలుసు. కనకనే రామాయణ ధర్మకార్యానికి అతన్ని యుక్తియుక్తంగా ఉపయోగించుకొన్నాడు. అసమాన ప్రతిభా సామర్థ్యాలున్న ఆంజనేయుల్లాంటి వాళ్లను సద్వినియోగించుకొనే జాంబవంతులు సమాజంలో, వ్యవస్థలో క్రమంగా  తరిగి పోతుండమే ప్రస్తుతం పెను విషాదం' అనిపించింది నాకు..


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్ఎ 


***

( ' అడుగో ఆంజనేయులు ! జాంబవంతుడెక్కడ ? ' పేరుతో రచన మాస పత్రిక  2003- ఫిబ్రవరి- 'కథాపీఠం' పురస్కారం; 

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము- తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వారు శీ తారణ ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన  'తెలుగు వెలుగు' 

లో ప్రచురితం)

 

 


పరీక్ష - కథానిక : కర్లపాలెం హనుమంతరావు-

 మొదటి రాత్రి. శశి గదిలోకి వచ్చింది పాలగ్లాసుతో. రామారావా గ్లాసందుకొని టేబుల్ మీదుంచి తలుపులు లోపలికి గడియవేసి బిడియంగా నిలబడున్న అర్థాంగిని మృదువుగా పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. తలొంచుకొని కూర్చోనున ఆమె మొహాన్ని అరచేత్తో కొద్దిగా పైకెత్తి చిర్నవ్వులు చిందిస్తూ అన్నాడు రామారావు 'మనిద్దరికీ ఇది మొదటి పరిచయం కాదుగా!ఎందుకంత సిగ్గు?'

శశి కళ్ళల్లో నీరుచూసి కంగారుగా అన్నాడు' సారీ! నేనేమన్నా అనరాని మాట అన్నానా?'

శశి గభాలున బెడ్ దిగి రామారావుపాదాలు కళ్ళకద్దుకుంది. రామారావు షాక్!

;ఇదేంటి శశీ కొత్తగా! ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? అంటూ ఆమెను పైకి లేపి మళ్లీ బెడ్ మీద పక్కన కూర్చోపెట్టుకున్నాడు. 'ఏదైనా సరదాగా కబుర్లు చెప్పచ్చుగా! ఈ పాదాభివందనాలు.. ఇవీ ఏంటీ.. మరీ పాతకాలంనాటి సినిమాల్లోలాగా!' అనంటుంటే సశి నోరు తెరిచి నిదానంగా అన్నది ఒక్కొక్క మాటే వత్తి పలుకుతూ 'మీకు తెలీదు మీరు నాకెంత ఉపకారం చేసారో! నా జన్మంతా ఊడిగం చేసుకున్నా మీ రుణం తీరేదికాదు'

'ఇది మరీ బాగుంది. డైలాగులుకూడా సినిమాల్లోవే! ఏమైంది శశీ.. మరీ అంత సెంటిమెంటల్ గా ఫీలవుతున్నావు? ఇందులో నేను చేసిన ఘనకార్యంమాత్రం ఏముంది? నువ్వు నాకు నచ్చావు. నా అదృష్టం బాగుండి నేనూ నీకు నచ్చాను. మనిద్దరి అదృష్టం బాగుండి మీవాళ్లకి, మా వాళ్ళకికూడా మనమిలా ఒకటవడానికి అభ్యంతరం లేకుండా పోయింది. కథ క్లైమాక్సు సీన్లుకూడా అయిపోయాయి మ్యాడం! 'శుభమ్' కార్డు వేసేయాలి తమరింక'.

వాతావరణాన్ని తేలికపరఛడానికి రామారావు   అలవాటు లేని సరదాతనాన్ని ప్రదర్శిస్తుంటే .. శశి అంది చివరికి 'పెళ్ళి మగవాడికి ఒక అవసరం మాత్రమే అంటారు. ఆడదానికి అదే జీవితమండీ! ఆ అదృష్టానికి ఆడది నోచుకొనేది జీవితంలో ఒకే ఒకసారి ఈ దేశంలో. ఖర్మకాలి ఆ పెళ్ళిగాని వికటిస్తే జీవితాంతం మోడులాగా మాత్రమే బతకాలని శాస్తిస్తుందీ సమాజం. కాలం ఎంత మారినా.. అభిరుచులు ఎంత మారినా ఆడదాని విషయంలో మాత్రం ఏ తేడా లేదు.. ఈ అధునాతన యుగంలో కూడా! అట్లాంటిది ఒకసారి పెళ్ళిపీటలమీద కూర్చుని భర్తను పోగొట్టుకున్న నష్టజాతకురాలిని .. నాకు మరోసారి ఈ మాంగల్యజీవితం లభించిందంటే ఏదో కలలోలాగా ఉందంతా! మనమంటే వయసులో చిన్నవాళ్ళం. పెద్దవాళ్ళైన మీ అమ్మానాన్నలుకూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారంటే నాకిప్పటికీ నమ్మబుద్ధికావడం లేదండీ!

'ఆఁ..! వూరికే ఒప్పుకొనుంటే అది గొప్పతనమయుండేది. పరీక్షలు పెట్టారుగా..!' అన్నాడు రామారావు నిష్ఠురంగా. 

'అయినా సరే! పరీక్షలో తప్పిన విద్యార్థికి గ్రేసుమార్కులిచ్చి పాసుచేయడంకూడా గొప్పేనండీ!' అంది శశి.

రామారావుకు ఏమనాలో అర్థంకాక శశివంక అలా చూస్తూ ఉండిపోయాడు. 'పరీక్ష' ఏంటో తెలియాలంటే  మనమూ కాస్త వెనక్కి వెళ్ళాల్సుంటుంది.

***

శశి తండ్రి పాపారావుగారు ప్రభుత్వోపాధ్యాయుడు. శశి ఆయనికి మొదటి సంతానం. తరువాత ఇద్దరు ఆడపిల్లలు. శశి డిగ్రీలో ఉండగా సుబ్బరాజు సంబంధం వచ్చింది. పిల్లాడు ఆర్టీసీలో డ్రైవరు. అన్నిరకాలుగా విచారించుకున్న తరువాతే పాపారావుగారీ సంబంధం ఖాయం చేసుకున్నారు. 

ప్రధానం అయిపోయినా  పెళ్ళిమూహూర్తాలు శశి పరీక్షలయిపోయిన తరువాత పెట్టుకున్నారు. శశి రోజూ సుబ్బరాజు ద్యూటీలో ఉన్న బస్సులోనే కాలేజీకి వెళ్ళిరావడం అలవాటు చేసుకుంది. 'కాబోయే దంపతులే కదా.. ఇందులో పెద్దగా అభ్యంతర పెట్టాల్సిందేముంది?' అనుకున్నారు ఇరుపక్షాల పెద్దలు. 

శశి పరీక్షలు అయిపోయిన  నెలలోనే ఏ ఆటంకం లేకుండా పెళ్ళి జరిగిపోవడంతో పాపారావుగారు ఊపిరి పీల్చుకున్నారు. ఆయనకు కాస్త జాతకాలమీద నమ్మకం జాస్తి. మంచి ముహూర్తం చూసుకుని మూడు రోజుల తరువాత 

శోభనం పెట్టుకొన్నారు.

మొదటి రాత్రి అయిపోయిన మర్నాడు సుబ్బరాజు డ్యూటీకి బయలుదేరుతుంటే 'ఈ రెండు రోజులుకూడా సెలవు పెట్టాల్సింది బాబూ!' అని బాధపడ్డారు పాపారావుగారు. 'సెలవులాట్టే లేవు మామగారూ! రేపు శశిని కాపురానికి తీసుకు వెళ్లాల్సివచ్చినప్పుడు మళ్ళా పెట్టాలిగదా! మా అమ్మకుకూడా వంట్లో బాగుండటం లేదు. ఎప్పుడే అవసరమొస్తుందో తెలీదు. ఇప్పుడు మాత్రం ఏమైంది? సాయంత్రం డ్యూటీ దిగంగానే ఇటే వచ్చేస్తానుగా!' అంటూ వెళ్ళిపోయాడు సుబ్బరాజు. చిక్కడపల్లి క్రాసురోడ్డులో ఎదురుగా వస్తున్న మిలటరీ ట్రక్కు గుద్దుకొని సుబ్బరాజు డ్యూటీ చేస్తున్న బస్సు తుక్కు తుక్కయిపోయింది. ఆ ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులకు గాయాలయినా ప్రాణాలు పోయిందిమాత్రం ఒక్క సుబ్బరాజువే!

శశి దురదృష్టజాతకురాలన్నారు. ఆర్టీసీలో శశికి ఉద్యోగం వచ్చిందికానీ.. సుబ్బరాజు తనవెంట తీసుకుపోయిన మాంగల్య సౌభాగ్యమో?!

శశి తన జీవితాన్ని గురించి ఆలోచించడం మానేసి చెల్లెళ్ళిద్దరి బతుకుల్ని తీర్చిదిద్దడంలో తండ్రికి సాయపడ్డంలో మునిగిపోయింది. రెండోకూతురు పెళ్ళికూడా అయిందనిపించి పాపారావుగారు టపా కట్టేసారు. ఇంటిపెద్ద హోదాలో చివరిచెల్లెలికి పెళ్ళిసంబంధాలు చూసే పని శశిమీదే పడింది. ఆ సందర్భంలో కలిసాడు రామారావు.

శశి మ్యారేజి బ్యూరోలో ఇచ్చిన ప్రకటనకు స్పందించి శశిచెలెలు సుభద్రను చూడటానికని వచ్చాడు రామారావు. రామారావు ఏజీ ఆఫీసులో యూడీసీ. కట్నం మీదాట్టే ఆశలేదు. చూడ చక్కంగా ఉండి ఇంటి పనులు చక్కపెట్టుకునేపాటి తెలివితేటలుంటే చాలనుకునే పెద్దలు రామారావు తల్లిదండ్రులు. సుభద్ర వాళ్లకన్ని విదాలా నచ్చింది. సుభద్రకూ ఓకేనేగానీ.. రామారావే అడ్డం తిరిగాడు. 'పిల్ల మరీ చిన్నపిల్ల' అని అతగాడి పేచీ. సర్ది చెప్పడానికని వెళ్ళిన శశిని ప్రత్యేకంగా పక్కకు తీసుకు వెళ్ళి నిజం చెప్పేశాడు రామారావు' నాకిది మొదటి పెళ్ళి కాదు. కాన్పు ఇబ్బందై ఆవిడ పోయింది. బిడ్డా పోయింది. ఈ విషయాలన్నీ పెళ్ళైన తరువాత నెమ్మదిగా చెబుదామనుకుంటున్నారు మా వాళ్ళు, మీరూ అనుభవంలేక తొందరపడుతున్నారు. సారీ! ఇలా అన్నానని మరో విధంగా భావించకండి! మీ చెల్లెలైతే నా కంటికి నా చెల్లెల్లాగానే ఉంది'

విషయం తెలిసిన తరువాత సుభద్రా మొండికి దిగింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిందనే అనుకొంది  శశి.. మూడు నెలల తరువాత ఆ రామారావు శశి పనిచేసే ఆఫీసు వెతుక్కుంటూ వచ్చి ఓ  ప్రపోజల్ ముందుంచిందాకా. 'మీ చెల్లెలు చక్కనిది. చిన్నపిల్ల. ఇవాళ కాకపోతే రేపైనా మంచి జోడు దొరక్కపోదు. పి. జి. పూర్తి కానీయండి! మీ సంగతే మీరు ఆలోచించుకోవాలి ముందు!' అన్నాడతను.

'అంటే?' భృకుటి ముడిచింది శశి కాస్త సీరియస్ గా.

'సారీ! ఉచితసలహాలు ఇస్తున్నాననుకోవద్దు మ్యాడమ్!  చెల్లెలు వెళ్లిపోయింతరువాత మీరు ఒంటరిగా ఉండాలి. సమాజం ఏ తీరులో ఉందో నాకన్నా ఆడవారు మీకే బాగా తెలుసు. '

రామారావు ఏ ఉద్దేశంతో అన్నా అతనన్న మాటల్లో వందశాతం వాస్తవముంది. వయసులో ఉన్న ఆడది వంటరిగా ఉందని తెలిస్తే చాలు..  దొరలమనసుల్లో కూడా దొంగబుద్ధులు తొంగిచూస్తున్నాయి.  తను రోజూ   అనుభవిస్తున్నదే ఈ రంపపుకోత. అలాగని ఒకసారి పెళ్లయి మొగుణ్ణి పోగొట్టుకొన్న స్త్రీని ఏ స్వార్థంలేకుండా జీవితంలోకి ఆహ్వానించేంతగా మగజాతిమాత్రం అభివృద్ధి చెందిందా?! సంస్కారవంతులమని అనిపించుకోడానికి ఏ కొద్దిమందో ముందు  ముందుకొచ్చినా .. కలకాలం ఆ ఉత్సాహం అలాగే ఉంటుందన్న గ్యారంటీమాత్రం ఎక్కడుంది?!'

ఆ మాటే అన్నప్పుడు నీళ్ళు నమలకుండా మనసులోని మాట బైటపెట్టేడు రామారావు'మీ చెల్లెల్ని చూసింతరువాత నేను రెండు మూడు సంబంధాలు చూసాను. ఎక్కడ పెళ్లచూపులకని వెళ్ళినా  ఆ పిల్ల స్థానంలో మీరే కళ్లముందు కదిలేవారు. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. కానీ నా మనసులోని మాటను ఇంకెలా చెప్పాలో తోచటంలేదు.  ఊరికే మధనపడుతూ కూర్చునేకన్నా ఒకసారి నా ఫీలింగ్సుని మీకు తెలియచేస్తే బాగుంటుందని ఇలా సాహసం చేసాను. ఆ తరువాత మీ ఇష్టం. నా అదృష్టం' అంటూ శశి స్పందనకోసమన్నట్లు ఆగాడు.

ఇలాంటి విషయాల్లో సత్వరం స్పందించడం అంత తేలికా?! అందులోనూ ప్రపోజల్ పెట్టిన వ్యక్తి ఎదురుగా ఉంటే ఏ ఆడపిల్లయినా ఏమని చెబుతుంది?! శశిదీ అదే పరిస్థితి. తను కలలోనైనా ఊహించని ప్రపోజలుతో వచ్చాడితను. ఏం చెప్పాలి? ఏమీ చెప్పకపోయినా ఇబ్బందే! అదే అలుసుగా తీసుకుని ఆనక వేధించడని గ్యారంటీ ఏమిటి? కాస్త కరుకుదనం రంగరించి అడగదలుచుకున్నది సూటిగానే అడిగింది శశి' నా గురించి మీరు అన్నీ తెలుసుకొని రాలేదనుకుంటాను!'

'తెలుసు మ్యాడమ్ గారూ! సుబ్బరాజుగారి స్నేహితుడు మోహనరావు నా క్లోజ్ క్లాస్ మేట్'

'మోహనరావుగారిక్కూడా తెలీని కొన్ని విషయాలు ఉన్నాయండీ! సారీ! .. బట్ థేంక్యూ ఫర్ యువర్ కన్సర్న్.. సర్!' అని లేచి వచ్చేసింది శశి.

అంతటితో ముగిసిపోతే ఈ కథే ఉండేది కాదు. మూడునెలల తరువాత ఒకాదివారం మధ్యాహ్నంపూట రిలాక్సుడ్ గా కూర్చుని టీ.వీ చూస్తున్న వేళ.. ఒక ముసలి జంట గేటు నెట్టుకుని లోపలికి వచ్చారు. ముందు గుర్తుపట్టలేదుకానీ వాళ్ళు రామారావు తల్లిదండ్రులు. ఇంతకుముందు సుభద్రను చూడటానికి రామారావుతో కలసి వచ్చారు. సుభద్ర విషయం మాట్లాడటానికి వచ్చారేమో అనుకుంది. రామారావు సలహా తరువాత సుభద్రపెళ్ళి చదువయిందాకా వాయిదా వేయాలనే ఉద్దేశంలోనే  ఉంది శశి. ఆ మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే పెద్దావిడ అంది 'మా అబ్బాయి రామారావు నీకు తెలుసుటకదమ్మా! వాడు నిన్ను తప్ప చేసుకోనని మొండికేస్తున్నాడు. నువ్వే కాస్త నచ్చచెప్పాలి తల్లీ!మాకీ వయసులో భగవంతుడీ కష్టం ఎందుకు తెచ్చిపెట్టాడో అర్థం కాకుండా ఉంది.'

ఆమె అభ్యర్థిస్తుందా? నిష్ఠురమాడుతుందా? అర్థం కాలేదు శశికి. ఐనా వాళ్ళబ్బాయికి తను నచ్చచెప్పడమేమిటి? ఏమని నచ్చచెప్పాలి?

ముసలాయన మాత్రం మనసులోని మాటను సూటిగా చెప్పేసాడు. 'మా వాడి కడుపున ఒక కాయకాసి  వంశం నిలబడడం మాకు ముఖ్యం తల్లీ! వాడి మొదటి భార్య పోయిన సంగతి నీకూ చెప్పాట్టగా! నీ పరిస్థితీ మాకూ చెప్పాడు. అయినా మీ ఇద్దరికీ ముడిపెట్టి ఉంటే ఆపడానికి మేమెవరం? ఆ సంగతి చెప్పిపోదామనే వచ్చాం ఇంత దూరం. ఇక పదవే పోదాం!' అంటూ భార్యతో సహా వెళ్ళిపోయాడు పెద్దాయన. 

శశి ఆశ్చర్యానికి అంతు లేదు. మళ్ళా పెళ్ళి అనే ఆలోచనే మనసులో లేని తనవెంట పడుతున్నాడేమిటీ రామారావు ఇలా?! కొంపదీసి అతను తనను నిజంగానే ప్రేమిస్తున్నాడా సినిమాల్లోకి మల్లే! ఇప్పుడు తనేం చేయాలి? మెదలకుండా ఉన్నా  నిలవనిచ్చేట్లు లేడే ఈ మహానుభావుడు! ఊళ్ళో ఉన్న మామయ్యను 'ఒకసారి వచ్చి కలిసి పొమ్మ'ని కబురు చేసింది శశి. 

మామయ్య రాకతో పరిస్థితి మరింత ముదిరింది. విషయం విని ఆయనా సంతోషంతో గంతులేసేంత పని చేసాడు. 'ఆ రామారావుని దేవుడే పంపించినట్లున్నాడమ్మా! ఈ అవకాశం వదులుకోవద్దు! ఆడది వంటరిగా ఉండాలంటే ఈ సమాజంలో కుదిరే పని కాదు. సమస్య శారీరకమైనదే కాదు తల్లీ! ఒక వయసుదాటిన తరువాత ఒంటరి జీవితం తెచ్చిపెట్టే యాతనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు నీకు అర్థం కాదు. బిడ్డలు లేకుండా ఈ వయసులో నేనూ , మీ అత్తమ్మా పడుతున్న అవస్థలు చూడు! ఏం చేయాలో నీకే తెలుస్తుంది' అంటూ నచ్చచెప్పడం మొదలుపెట్టాడు. 

మామయ్యకుకూడా చెప్పలేని సంకటం తనది. ఆయనే రామారావుని కలిసాడో, రామారావే ఆయన్ని కలిసాడో! ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చాలాకాలంగా పరిచయమున్నవాళ్ళకు మల్లే కలివిడిగా తిరగడం మరీ ఆశ్చర్యమనిపించింది శశికి. సుభద్రమీదా ఏ మత్తుమందు చల్లాడోగానీ.. అదీ మాటమాటకూ ఈ మధ్య 'బావగారం'టూ రామారావునే తలుచుకొంటోంది! ఇంతమంది దృష్టిలో మంచివాడు అనిపించుకున్న మనిషిలో నిజంగా మంచితనం ఉండకుండా ఉంటుందా? మంచి ఉద్యోగం. వయసూ మరీ అంత మించిపోలేదు. కావాలనుకుంటే అతను పెళ్ళిచేసుకోడానికి ఆడపిల్లలే దొరక్కపోతారా? అందాకా ఎందుకు? తను సుభద్రను ఇవ్వాలనుకోలేదూ! అయినా ఇవేవీ కాదనుకుని తనమీదే దృష్టి నిలిపాడంటే.. సినిమాల్లోలాగానే తనంటే ఇష్టమున్నట్లుంది!

తను ఇష్టపడేవాళ్లకన్నా ..తనను ఇష్టపడేవాళ్ళు దొరకడం నిజంగా అదృష్టమే! చేతిదాకా వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకోవడం తెలివైన పనేనా? శశిమనసులో సుడులుతిరిగే ఆలోచనా తరంగాలు.

ఒకసారి ఆలోచనంటూ చొరబడాలేగాని.. దాన్ని మనసులోనుంచి తరిమేయడం అంత సులభం కాదు. ఆర్నెల్ల పైనుంచి నడుస్తోందీ వ్యవహారం. శశికి తెలియకుండానే రామారావు ఆమె మనసులో తిష్టవేసాడు. సుబ్బరాజుతో ఆమె పరిచయం కేవలం రెండునెలలే! రామారావుతో స్నేహం ఎన్నో ఏళ్లబట్టి నడుస్తోన్నట్లనిపిస్తుందీ మధ్య మరీ. 

శశి పెళ్ళికి 'ఊఁ' అనడంతో కథ సుఖాంతమయింది. ఈ మాఘమాసంలోనే శశి, రామారావుల పెళ్ళి జరిగిపోయింది. ఇవాళ మొదటి రాత్రి.

*** 

'ఎళ్ళి చూపులు అంటేనే ఆడపిల్లకు ఒక పరీక్ష. అందులో నెగ్గితేనే కదా 'శ్రీమతి' డిగ్రీ వచ్చేది! నాకా బాధ లేకుండా పోయింది. ఇక మీ వాళ్ళు పెట్టిన పరీక్ష అంటారా? ఒకసారి పెళ్ళిపీటలమీద కూర్చొని లేచినదాన్ని. ఇలాంటి పరీక్షలు తప్పవులేండి! దానికి మీ అమ్మానాన్నలను తప్పుపట్టడం భావ్యంకాదు.' అంది శశి రామారావువంక ప్రేమగా చూస్తూ. 

రామారావు సీరియస్ గా అన్నాడు 'శశీ! నీకు ఒక విషయం చెప్పాలి. ఇద చెప్పకుండా దాచిపెడితే నాకూ .. మా అమ్మానాన్నలకూ తేడా ఉండదు'

'ఏంటండీ.. ఉన్నట్లండి అంత సీరియస్సయి పోయారు?' అంది శశి భయంభయంగా.

'విషయం కాస్త సీరియస్సే! నువ్వెలా రిసీవ్ చేసుకొంటావోనని బెంగగా కూడా ఉంది.  అయినా చెప్పడం నా ధర్మం. దాచివుంచడం నా నైజంకూడా కాదు'

'ఏంటండీ.. అంతగా దాచివుంచిన రహస్యం?' శశి గుండెలు గుబగుబలాడుతున్నాయి. 

'నీతో పెళ్ళికి ఒప్పుకోవడానికి మా అమ్మావాళ్ళు ఒక షరతు పెట్టారు. నిన్ను మెడికల్ గా పరీక్ష చేయించాలని. కన్య అని రుజువయితేనే తాళి కట్టాలని..'

శశి మొహం ఒక్కసారిగా జేవురించింది. రామారావు తనధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు. 'నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకూ ఇట్లాంటి సమస్యే ఒకటి ఎదురయింది. టైపు, షార్టుహ్యాండు ప్రాక్టీసు చేస్తున్నానారోజుల్లో. మా తాతగారు ఆరోగ్యం బాగోలేక దాదాపు డెత్ బెడ్ మీదున్నారు. ఆ వత్తిడిలో నాపరీక్ష పోయింది. నేనా పరీక్ష పాసయితే తను పనిచేసిన కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించాలని మా తాతగారి ఆశ. డాక్టర్లింక కొన్ని రోజులు మాత్రమే టైముందని ప్రకటించిన సమయంలోనే  నా పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 'పరీక్ష ఏమయిందిరా?' అని ఆప్యాయంగా పక్కన కూర్చోబెట్టుకొని అడిగితే 'పాసయ్యాను తాతయ్యా!' అంటూ స్వీటు నోట్లో పెట్టాబోయాను. స్వీటయితే తినలేదుగానీ..  ఆ సంతోషంలో తృప్తిగా కన్నుమూయడం నాకింకా బాగా గుర్తు. నా చేత ఆ రోజు అట్లా అబద్ధమాడించింది మా నాన్నే!'

'ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నట్లు?!'అని అయోమయంగా అడిగింది శశి.

'అట్లాంటి సంఘర్షణే మళ్ళా వచ్చింది శశీ నా జీవితంలో! పెళ్ళికిముందు క్యాజువల్ గా చేయించామని చెబుతున్న  పరీక్షలు నిజానికి  'వర్జిన్ టెస్టులే'

'కావే! అయుంటే నాకు తెలిసుండేవి' అంది శశి ఆశ్చర్యంగా. ఆమె పెదాలు ఆవమానభారంతో వణుకుతున్నాయి. 

'కావు. నాకు తెలుసు. కానీ ఉద్దేశం అయితే అదే కదా! అమ్మానాన్నలను ఒప్పించడానికి నాకు తెలిసిన డాక్టర్లచేత అట్లాంటి నీచమైన నాటకం ఆడించాను. లేకపొతే నువ్వు నాకు దక్కవని భయమేసింది'

శశినుంచి సమాధానం రాలేదు. రెండు మోకాళ్ళమధ్య తల పెట్టుకొని అలా ఉండిపోయిందామె చాలా సేపు.

ఏం చేయాలో అర్థంకాలేదు రామారావుకి. సాహసంచేసి  బలవంతంగా ఆమె చుబుకం  పైకెత్తాడు. అగ్నిగోళాల్లా మండుతున్నాయి శశి రెండు కళ్ళు. 'మీరు మీ వాళ్ళకి నిజం చెప్పుండాల్సింది. సుబ్బరాజుగారు నేనూ ఆ మొదటి రాత్రి.. ' 

చప్పున ఆమె నోరు మూసేసాడు రామారావు 'మోహనరావు చెప్పాడదంతా.  సుబ్బరాజుగారు చనిపోయేముందు అందుకే తనకన్నా నీ గురించే ఎక్కువ వర్రీ అయాడనీ చెప్పాడు. అది వినప్పట్నుంచే నిన్నెలాగైనా నా దాన్ని చేసుకోవాలనుకున్నాను శశీ!'

నమ్మలేనట్లు  చూసింది శశి కళ్ళింతింత చేసుకుని. 

'అయితే జాలితో పెళ్ళి చేసుకున్నారా?' అనినువ్వడగచ్చు.  చూడకముందు సానుభూతి.. చూసిన తరువాత ప్రేమానుభూతి.. అదీ టూకీగా నా ప్రేమకథ' అన్నాడు రామారావు.

'సినిమాల్లోనే ఉంటారనుకున్నాను.. మీలాంటి మంచివాళ్ళు నిజంగాకూడా ఉంటారన్నమాట!' అంటూ శశి రామారావు గుండెలమీద వాలిపోయింది. 

'పెళ్ళి తరువాత నువ్వు గడిపింది ఒక్కరాత్రే. నా భార్య పోయింది నా బిడ్డను కనలేక. తనూ పోయేటప్పుడు సుబ్బరాజుగారిలాగానే నా గురించి ఎక్కువ బాధపడింది. నేను నిన్ను స్వీకరించడంలో గొప్పేముంది? నువ్వు నన్ను ఆమోదించడంలోనే ఉందసలు గొప్పదనమంతా!' అంటూ శశిని తన గుండెలమీదకు లాక్కున్నాడీసారి చొరవగా రామారావు. గువ్వలా అతని గుండెల్లోకి ముడుచుకుపోయింది ఆమె కూడా!

*** 

( ఆంధ్రభూమి- వారపత్రిక- 4 జూన్ 2015 సంచికలో ప్రచురితమైన నా కథ) 

ధర్మ నిర్ణయం - కథానిక - కర్లపాలెం హనుమంతరావు

 


ధర్మనిర్ణయం- కథానిక 

- కర్లపాలెం హనుమంతరావు 


 

బ్యాంకుడ్యూటీనుంచి ఇంటికి వస్తూ వసూ రామకృష్ణాపురం ఓవర్ బ్రిడ్జిమీద వెనకనుంచీ వస్తున్న ఇసుకలారీ గుద్ది బైకుమీదనుండి పడిపోయాడు గోవిందరావు.

ఆ సమయంలో చీకటి. వర్షంకూడా జోరుగా పడుతోంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే సాధారణంగా ఆ బ్రిడ్జిమీద జనసంచారం కనిపించదు అంతగా.

దాదాపు రెండు మూడు గంటలు అపస్మారక స్థితిలో పడివున్నాడు గోవిందరావు.

ఎవరో గమనించి అతని దగ్గర ఉన్న సెల్ఫోనులోనుంచి ఇంటివాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఆయన్ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించేసరికి అర్థరాత్రి దాటిపోయింది. 

మెడికో లీగల్ కేసు కనక ముందు పోలీసు రిపోర్టు అవసరం. ఆ తతంగమంతా పూర్తయి చికిత్స ఆరంభమయే వేళకి తెలిసింది.. పేషెంటు కోమాలోకి వెళ్ళిపోయాడని!

గోవిందరావు కొడుకు శరత్ గ్రూప్ త్రీ సర్వీస్ కమీషన్  ఇంటర్వ్యూలకని ఢిల్లీ వెళ్ళివున్నాడా సమయంలో. ఇంటార్వ్యూ ముగించుకొని ఇంటికి ఎలా వచ్చిపడ్డాడో తెలిదు.. ఇల్లంతా శోకసముద్రంలో మునిగివుంది.

'లాభంలేదు.. ఇంటికి తీసుకువెళ్లమంటున్నార్రా డాక్టర్లు! ఏం చేద్దాం?' అనడిగాడు గోపాలరావు. ఆయన శరత్ కి బాబాయి. అన్నగారు చేసే బ్యాంకులోనే లీగల్ ఆడ్వైజరుగా ఉన్నాడు. 

'నాన్న ఉన్నది కోమాలో కదా! ఎంత డబ్బు ఖర్చైనా సరే బతికించుకుంటాం బాబాయ్' అన్నాడు పళ్లబిగువున పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపుకొంటూ శరత్. 

'విషయం ఖర్చును గురించి కాదురా!..' ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు గోపాలరావుకి. 

'మరి?'

'శరత్ ని ఆసుపత్రి బయటవున్న కేంటిన్ కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి విపులంగా చెప్పే ప్రయత్నం చేసాడు గోపాలరావు. 'నాన్న కోమాలో ఉన్న మాట నిజమేకానీ.. డాక్టరులు చెబుతున్నదాన్నిబట్టి ఇంక హోప్స్ లేవురా!.. మనకింకో రెండు మూడు లక్షలు ఖర్చవడం తప్ప! ఇలా అంటున్నందుకు నాకూ బాధగానే ఉందిగానీ.. కొన్ని కొన్నిసార్లు వాస్తవాన్ని డైజస్టు చేసుకోక తప్పదు' 

'వాస్తవమేంటి బాబాయ్! నాన్న సజీవంగానే ఉన్నాడు. డబ్బుకోసం చూసుకొనే సమయం కాదిది. అమ్మకు తెలిస్తె చాలా బాధ పడుతుంది. పదండి.. వెళదాం!' అని లేచాడు శరత్.

బలవంతంగా శరత్ ని కూర్చోబెట్టాడు గోపాలరావు. 'అమ్మలాగా నువ్వూ ఎమోషనల్ గా ఆలోచిస్తే ఎలారా! ప్రాక్టికాలిటీ కావాలి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో!' 

'బతికున్న మనిషిని డబ్బుఖర్చు చూసుకొని ఆసుపత్రినుంచి డిశ్చార్చ్ చేయించుకొని పోవడమేనా ప్రాక్టికాలిటీ అంటే!' 

శరత్ గొంతులోని వెటకారాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు గోపాలరావు. 'చిన్నపిల్లాడు. జీవితమంటే ఏంటో అనుభవం లేనివాడు. తండ్రి అంటే విపరీతమైన ప్రేమాభిమానాలున్న ఏ కొడుకైనా అలాగే ఆలోచిస్తాడు. అన్నీ తెలిసిన తనే ఎలాగో నచ్చచెప్పి అన్నయ్యకుటుంబాన్ని ఈ కష్టంనుంచి గట్టెక్కించాలి' అనుకొన్నాడు గోపాలరావు.

'మీ నాన్న తరువాత నాన్నంత వాణ్ని. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినరా!'అన్నాడాయన.

'తొందరగా చెప్పు బాబాయ్! అమ్మెందుకో కాల్ చేస్తోంది' అంటూ రింగ్ టోన్ కట్ చేసి అసహనంగా కూర్చున్నాడు శరత్.

గోపాలరావు చెప్పాడు' మీ నాన్న రిటైర్మెంటు ఇంకో వారంలో ఉంది. కంపాషియేనెట్ గ్రౌండ్సుమీద బ్యాంకునుంచి బెనిఫిట్స్ రావాలంటే రూల్సు ప్రకారం ఎంప్లాయీ రిటైర్మెంటునాటికి  సజీవుడై ఉండకూడదు'

'డెత్ బెనిఫిట్స్  అంటే మనీనా? ఆ ముష్తి రెండు మూడు లక్షలకోసం జన్మనిచ్చిన తండ్రిని బతికుండగానే చంపేయడం నావల్ల కాదుగానీ.. పద బాబాయ్.. ఇక వెళదాం!.. డాక్టర్లతోకూడా మాట్లాడాల్సిన పని చాలా ఉంది' 

లేవబోయిన శరత్ ని బలవంతంగా లాగి కూర్చోబెట్టి అన్నాడు గోపాలరావు 'సాంతం వినిపోరా! బెనిఫిట్స్ అంటే నాటోన్లీ మనీ.. ఎంప్లాయిమెంటుకూడా! మీ నాన్న సర్వీసులో ఉన్నప్పుడే పోయాడని డాక్టర్లు సర్టిఫై చేస్తేనేగానీ మీ ఇంట్లో ఒకళ్లకి ఉద్యోగం రాదు. ఇది నీ ఒక్కడికే సంబంధించిన విషయం కాదు. చెల్లాయి పెళ్ళి చెయ్యాల్సి ఉంది. మీ నాన్న చేసిన అప్పులున్నాయి!'

గోవిందరావు ఇంటిపరిస్థితులు గోపాలరావుకు తెలియనివి కావు. నీతికి, నిజాయితీకి నిలబడే అధికారిగా మంచిపేరైతే ఉందిగానీ.. కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో అన్నగారు విఫలమయ్యారనే ఒప్పుకోవాలి. శరత్ కి బాగా చదువు అబ్బినా విదేశాలకు పంపించి ఊడిగం చేయించడానికి ఇష్టపడలేదు. కొడుకుచేత ఇక్కడే ఎమ్మెస్సీ చేయించాడు. కూతురు పెళ్ళి ఇంకా వరాన్వేషణ దశలోనే ఉంది.

అయినా బిడ్డలకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి బతికుండగానే 'నీ వల్ల నాకేంటి ప్రయోజనం? వ్యాపారం చేసుకోవాలి.. పెట్టుబడి తెచ్చివ్వు! నీ ఉద్యోగం నాకిప్పించేసి నువు విశ్రాంతి తీసుకో!' అనే సంతానం అంతకంతకూ అధికమవుతున్న ఈ కాలంలో ఇలాంటి బిడ్డల్ని కలిగివుండటంకూడా అదృష్టమే!'శరత్ ను మనసులోనే అయినా  అభినందించకుండా ఉండలేకపోయాడు గోపాలరావు. 

'ఈ విషయాన్ని ఎలాగూ తల్లితో, చెల్లితో సంప్రదించడు వీడు! పోనీ తనే నేరుగా ఒకసారి వదినతో మాట్లాడితేనో!' అనిపించింది గోపాలరావుకి.

***

గోవిందరావుకి ఇంకో ఆపరేషన్ అవసరమన్నారు ఆసుపత్రి వైద్యులు. ఫస్టు ఆపరేషను వల్ల ఫర్దర్ డేమేజీ కంట్రోలయింది. ఈ ఆపరేషను సక్సెస్ అయితేనే పేషెంటు తొందరగా రికవరయే అవకాశం ఉంది. వికటిస్తేమాత్రం ప్రాణానికి ముప్పు. రిస్క్ ఫ్యాక్టరుమాతం కాస్త ఎక్కువే! ఈ విషయం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి! బట్.. మేటర్ అర్జంట్! 'ఓకే' అనుకొంటే మాత్రం ఒక హాఫ్ ఇన్స్టాల్మెంటుకింద రెండు లక్షలు కౌంటర్లో కట్టేయండి' అంటూ పెద్ద ఫార్మాలిటీస్ లిస్టే చదివాడు ఆసుపత్రి సూపరింటెండు శరత్ ని పిలిచి కూర్చోబెట్టుకొని.

తల్లితో, చెల్లితో సంప్రదించి బాబాయిచేత రెండులక్షలు కౌంటర్లో కట్టిస్తున్నప్పుడు మాత్రం శరత్ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. 

'కూలి పనయినా చేసి నీ సొమ్ము అణాపైసలతో సహా చెల్లిస్తాను బాబాయ్!' అని తన రెండు చేతులూ పట్టుకొన్న అన్నకొడుకుతో అన్నాడు గోపాలరావు 'ఆ కూలీపని చేసే ఖర్మనీకు పట్టకూడదనే అంతగా నీకు చెప్పుకొచ్చింది. ఇప్పుడైనా చెప్పు! మరోసారి ఆలోచించుకొన్న తరువాతే డబ్బు కడదాం!'

'ఈ నిర్ణయం నాదొక్కడిదే కాదు బాబాయ్! అమ్మకూ, చెల్లాయిక్కూడా నాన్నను మళ్లీ మామూలు మనిషిగా చూడాలని ఉంది' అని శరత్ అన్న తరువాత గోపాలరావు మౌనంగా సొమ్ము చెల్లించేసాడు.

ఆ సాయంత్రమే ఆపరేషన్ అయిపోయింది. రాత్రంతా కండిషన్ బాగానే ఉందన్నారు డాక్టర్లు. తెల్లారుఝామునుంచి కంగారు పడటం మొదలుపెట్టారు. 

సోర్యోదయానికన్నా ముందే గోవిందరావు అస్తమించాడు. ఏడుపులు.. పెడబొబ్బలు.. అయినవాళ్ళొచ్చి పరామర్శించడాలు.. చివరిచూపులకని ఎక్కడెక్కడివాళ్లో తరలివచ్చారు. ఫార్మాలిటిసన్నీ యథావిధిగా జరిగిపోయాయి. శరత్ తండ్రి చితికి కొరివిపెట్టాడు.

కొత్తసంవత్సరం ప్రపంచమంతా వేడుక జరుపుకొంటుంటే.. గోవిందరావు లేని లోటును  జీర్ణించుకొంటూ విషాదంగా గడిపింది శరత్ కుటుంబం.

శిశిరం శాశ్వతం కాదు. వసంతం మళ్ళీ రాక మానదు. ప్రకృతి చెప్పే పాఠం ఇదే!

మళ్లీ ఏడాది గడిచేసరికల్లా ఆ ఇంట్లో మరో బుల్లి గోవిందు కేరింతలు వినిపించాయి. తండ్రిపోయిన ఆర్నెల్లలోపే కూతురికి పెళ్ళి జరిపిస్తే ఆ కన్యాదానఫలం తండ్రికె దక్కుతుందని- శరత్ పంతంకొద్దీ చెల్లికి మంచిసంబంధం చూసి కళ్యాణం జరిపించాడు.

శరత్ కి తండ్రి చేసే బ్యాంకులోనే ఉద్యోగం వచ్చింది కంపాషియనేట్ గ్రౌండ్సుమీద. గోవిందరావు యాక్సిడెంట్ సందర్భంలో అయిన ఖర్చంతా బ్యాంకే భరించింది రూలు ప్రకారం. 

గోవిందరావు- రిటైర్మెంటుకి సరిగ్గా ఇరవైనాలుగ్గంటలముందు ఆసుపత్రిలో చేసినా ఆ రెండో ఆపరేషన్ విఫలమై చనిపోవడంవల్లే ఇవన్నీ సంభవమయాయి!

ఆసుపత్రి సూపరింటెండెంటుగారి సహకారంలేనిదే ఇవన్నీ సాధ్యమయేవి కాదు. గోవిందరావు చొరవవల్లె బ్యాంకునుంచి లభించిన రుణం సాయంతో చిన్న ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి పెంచగలిగాడు సూపరింటెండెంటు. గోవిందరావు ఇంటి పరిస్థితి వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకొమ్మని ప్రాఢేయపడింది మాత్రం గోపాలరావే!

డెసెంబరు ముప్పైఒకటో తారీఖునే అంత అర్జంటుగా అవసరం లేకపోయినా.. ఉన్నట్లు కలరిచ్చి రెండో ఆపరేషను చేయాలని నిర్ణయించడం వెనకున్న అంతరార్థం ఇప్పటికీ శరత్ కుటుంబానికి తెలీదు.

***

'ఇంతకాలం మీరు తోటివైద్యులందరికీ నిత్యం బోధించే మెడికల్ ఎథిక్సన్నీ ఇలా గాలికి వదిలేయడం న్యాయమేనా?' అని అడిగింది సూపరింటెండెంటుగారి భార్యామణి భర్తద్వారా ఇంట్లో అసలు విన్నతరువాత.

''నేను ఎథిక్సుని ఎప్పుడూ జవదాటను. ఇప్పుడూ జవదాటలేదు  మైడియర్ శ్రీమతిగారూ! మైండిట్.. ప్లీజ్! ఒక పేషెంట్ అన్ని రోజులు కోమాలో ప్రోగ్రెస్ లేకుండా పడివున్నాడంటేనే మెడికల్ భాషలో 'క్లినికల్లీ డెడ్'.  రిటైర్మెంటుకి ముందే గోవిందరావుగారి మరణాన్ని ధ్రువీకరించడంవల్ల ఏజ్ బార్ కి దగ్గరగా ఉన్న అతని కొడుక్కి బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఆర్థికపరమైన చిక్కుల్నుంచి ఆ కుటుంబం బైటపడింది. నేనా రోజున లోనుకోసం బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈ గోపాలరావుగారు ఏమన్నాడో తెలుసా! 'ఏ వృత్తికైనా ఎథిక్సుంటాయండీ! ఎథిక్సంటే రూళ్లకర్రపట్టుకొని చండశాసనం చేసి నిజాయితీపరుడనిపించుకోవడం ఒక్కటేనా? మేథస్సిచ్చిన వివేకాన్ని  ఉపయోగించి నిజమైన అర్హులను ప్రోత్సహించడంకూడా  కదా! అఫ్ కోర్సు  ఆయనే అన్నట్లు అది అన్నంపెట్టే తల్లిలాంటి సంస్థకి కన్నంపెట్టి చేసే ఘనకార్యంమాత్రం కాకుడదనుకో! నాలాంటి ఎంతోమందికి కొత్తజీవితాలను ప్రసాదించిన ఆ మంచిమనిషికి ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఇలా సాయంచేయడంలో ఎథిక్సును ఎక్కడ అతిక్రమించినట్లు! మరో ముఖ్యమైన విషయం చెప్పనా! అసలీ ఆలోచన చేసిందే ఆ గోవిందరావుగారి తమ్ముడు గోపాలరావుగారు. వృత్తిపరమైన ఎథిక్సుకి ఆయన పెట్టింది పేరు 'అన్నాడు ఆసుపత్రి సూపరింటెండుగారు. 

***

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్;  యూఎస్ఎ 

(స్వప్న కథలపోటీలో 'శ్రీమతి గొర్రెల అప్పాయమ్మ పురస్కారం పొందిన కథ- జూన్ 2012 సంచికలో ప్రచురితం)

 

 


Sunday, February 14, 2021

సేవ -కర్లపాలెం హనుమంతరావు -కథానిక

 




సెల్  మోగుతోంది అదే పనిగా! 

నెంబరు చూసి 'సారీ ఫ్రెండ్స్! మీరు కంటిన్యూ చేయండి! ఫైవ్ మినిట్సులో నేను మళ్ళీ జాయినవుతా!' అంటూ కాన్ఫెరెన్సు ఛాంబర్నుంచి బైటకొచ్చాడు సుబ్బారావుగారు.

'మీరు  ఇక్కడకు రావాల్సుంటుంది. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అన్ని విషయాలు ఫోన్లో డిస్కస్ చెయ్యలేం గదా!' అంది అవతలి కంఠం.

సుబ్బారావుగారికి పరిస్థితి అర్థమైంది. ఫ్లైటుకి టైము కాకపోవడంతో కారులో బైలుదేరారు. 'వీలైనంత వేగంగా పోనీయ్! బట్ బీ కేర్ ఫుల్!' అని డ్రైవర్ని హచ్చరించి సీటు వెనక్కి  వాలిపోయాడాయన.

సుబ్బారావుగారు విజయవాడ దగ్గర్లోని ఓ గాజు ఫ్యాక్టరీ యజమాని.  సంగం మిల్కు ఫ్యాక్టరీలో,  మార్కాపూరు పలకల ఫ్యాక్టరీలో ముఖ్యమైన వాటాదారుడు కూడా. తరాలనుంచి వస్తున్న చీరాల చేసేత  అమెరికన్ షర్టింగ్ ఎక్స్పోర్టింగు వ్యాపారం ఒకటి  నడుస్తోంది. ఆ పనిమీద ఒకసారి చెన్నై వెళ్ళివస్తూ తిరుపతి వెళ్లారు సకుటుంబంగా. పనిపూర్తి చేసుకుని ఘాట్ రోడ్ నుంచి దిగివస్తుంటే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లోయలోకి జారిపోయింది వాళ్లు ప్రయాణించే కారు. పెద్దవాళ్లకేమీ పెద్ద దెబ్బలు తగల్లేదుకానీ.. పిల్లాడికే బాగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో పెద్ద గాలివాన! కరెంటు తీగలు తెగి అంతటా కటిక చీకటి. దూసుకు పోయిన బస్సుకూడా కనుచూపుమేరలో లేదు. బిడ్డ ఏడుపు వినబడుతుందేగానీ.. ఆ చీకట్లో ఏ పొదలో చిక్కుకున్నాడో అర్థమవడం లేదు. భార్య ఏడుపుతో బుర్ర్ర అస్సలు పనిచేయడం మానేసింది. సెల్ ఫోనుకి సిగ్నల్ అందడం లేదు. 'బిడ్డను దక్కించు తండ్రీ! నీ కొండకు  వచ్చి నిలువుదోపిడీ ఇచ్చుకుంటా!' అని మొక్కుకున్నాడు సుబ్బారావుగారు.

ఆ దేవుడే పంపిచినట్లు కనిపించాడు సాంబయ్య అక్కడ ఆ క్షణంలో!  ఆ సమయంలో అతను అక్కడెందుకున్నాడో? కారు లోయలోకి జారే సమయంలో చెలరేగిన ఏడుపులు, పెడబొబ్బలు విని వచ్చినట్లున్నాడు. అలవాటైన చోటులాగుంది!  ఏడుపు వినిపించే లోతట్టులోకి అత్యంత లాఘవంగా  దిగి..  పొదల్లోనుంచి బైటకు తెచ్చాడు బిడ్డడిని.  రెస్క్యూ టీం ఆ తరువాత అరగంటకు వచ్చి అందర్నీ ఆసుపత్రికి చేర్చిందిలే కానీ.. ఆ సమయంలోగానీ సాంబయ్య చొరవ లేకపోతే పిల్లాడు తమకు దక్కే మాట వట్టిదే!


ఒక్కడే వంశోధ్ధారకుడు. అదీ పెళ్లయిన పదేళ్లకు ఎన్ని తంటాలు పడితేనోగానీ పుట్టలేదు. ఎన్ని  వేల కోట్లు, ఫ్యాక్టరీలుంటే మాత్రం ఏం లాభం? వంశాన్ని ఉద్ధరించేందుకు ఒక్క అంకురం అవసరమే గదా! సాంబయ్య ఆ పూట కాపాడింది ఒక్క పసిప్రాణాన్నే కాదు..  ఆగర్భ శ్రీమంతుడైన సుబ్బారావుగారి వంశం మొత్తాన్ని!


సాంబయ్యకు ఒక పదివేలు ఇచ్చాడు అప్పట్లో! తిరుపతి ఫారెస్టు ఏరియాలో దొంగతనంగా కంప కొట్టి అమ్ముకుని జీవనం సాగించే అశేషమైన బడుగుజీవుల్లో సాంబయ్యా ఒకడని తరువాత తెలిసింది. సాంబయ్యచేత ఆ పని మానిపించి బస్టాండు దగ్గర ఒక బంకు  పెట్టించాడు సుబ్బారావుగారు.

సుబ్బారావుగారు తిరుపతి ఎప్పుడు వచ్చినా సాంబయ్యను పిలిపించుకుని మంచి- చెడు విచారించడం అలవాటు. తన ఫ్యాక్టరీల్లో ఏదైనా పనిచేసుకోమని సలహా ఇచ్చినా ససేమిరా అన్నాడు సాంబయ్య 'ముసిలోళ్ళు తిర్పతి దాటి బైట బతకలేరయ్యా సామీ! ఈ వయసులో ఆళ్లనొదిలేసి నా దారి నే చూసుకోడం నాయవా?' అంటాడు. పని వత్తిళ్లమధ్య ఈ మధ్య తిరుపతి వెళ్లడం కుదరడం లేదు. సాంబయ్య కలిసి చాలా కాలమే అయింది.  ఇప్పుడిలా కలుస్తాడని కలలోకూడా అనుకోలేదు.


నెలరోజుల కిందట ఒకసారి తిరుపతినుంచి ఈ డాక్టరే కాల్ చేసి చెప్పాడు 'పేషెంటు ఫలానా సాంబయ్య.. అతని తాలూకు మనుషులు మీ పేరే చెబుతున్నారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సొచ్చిం'దంటూ.

కొత్త అసైన్ మెంటుని గురించి చర్చలు జరుగుతున్నాయప్పట్లో. ఇన్ కమ్ టాక్సు తలనొప్పుల్నుంచి తప్పించుకునే దారులు వెతుకుతున్నారప్పుడు ఆడిటర్సు. వాళ్ళు ఇచ్చిన సలహా  ప్రకారం ఆదాయం నుంచి కనీసం ఒక్క శాతంతోనైనా ఏదైనా ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటుచేస్తే రెండిందాలా లాభం. గుడ్- విల్ వాల్యూ పెంచి చూపించుకోవచ్చు. త్రూ ట్రస్ట్.. గవర్నమెంటు ఏజన్సీలతో  వ్యవహారాలు స్మూత్ అవుతాయి.  మెయిన్ బిజినెస్  ఇస్యూసుని తేలిగ్గా  సాల్వ్ చేసుకోవచ్చన్నది ఆ సలహా. ఎలాంటి ట్రస్టు పెట్టాలన్న దానిమీద చర్చ సాగుతున్నప్పుడే తిరుపతి నుంచి కాల్ వచ్చింది.

సుబ్బారావు తిరుపతి చేరేసరికి బాగా చీకటి పడింది. నేరుగా ఆసుపత్రికి వెళ్లాడు. బెడ్ మీద పడున్న సాంబయ్య అస్తిపంజరాన్ని తలపిస్తున్నాడు. తనకు పరిచయమయిన కొత్తల్లో పిప్పిళ్ల బస్తాలాగుండేవాడు. డాక్టర్ని కలిసాడు సుబ్బారావుగారు.

'సాంబయ్యకు డయాబెటెస్ టైప్ ఒన్. వంశపారంపర్యంగా ఉంది. ఇప్పుడు జాండిసూ  ఎటాకయింది. కిడ్నీలు రెండూ పనిచేయడం మానేశాయి. ఆల్మోస్టు లాస్ట్ స్టేజ్..'

'హెరిడటరీ అంటున్నారు. మరి వాళ్ళ పిల్లాడికీ…?'

'వచ్చే చాన్సు చాలా ఉంది. జువెనైల్ డయాబెటెస్ అంటాం దీన్ని. అబ్బాయికిప్పుడు ఆరేళ్ళే కనక బైటకు కనిపించక పోవచ్చు. ముందు ముందయితే ఇబ్బందే!'

ఎమోషనలయాడు సుబ్బారావుగారు 'ఏదన్నా చేయాలి డాక్టర్ సాంబయ్యకు! అతని భార్యను చూడ్డం కష్టంగా ఉంది. ఆ రోజు పొదల్లో మా బాబు పడిపోయినప్పుడు మా ఆవిడా ఇలాగే ఏడ్చింది'

'విధికి కొంత వరకే మనం ఎదురు ఈద గలిగేది. సాంబయ్యది హెరిడటరీ ప్రాబ్లం. ఆశ పెట్టుకొనే దశ దాటిపోయింది సార్! ఏం చేసినా ఆ పసిబిడ్డకే చేయాలింక!' అన్నాడు డాక్టరుగారు.

పలకరించడానికని వెళ్ళిన సుబ్బారావుగారిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు సాంబయ్య. ఏదో చెప్పాలని ఉందిగానీ అప్పటికే మాట పడిపోయిందతనికి. కొడుకు చేతిని పట్టుకుని పిచ్చి చూపులు చూసాడు పాపం!

'సాంబయ్యకు ఆట్టే బంధుబలగం కూడా ఉన్నట్లు లేదు. 'పిల్లాడి మంచి చెడ్డలు మనం చూసుకుందాం లేండి! వాళ్లకిష్టమైన చోట మంచి హాస్టల్లో పెట్టించి ఓపికున్నంతవరకు చదివిద్దాం.  ఆ కుటుంబానికి ఏ లోటూ రాకుండా ఏర్పాటు చేద్దాం. ఆ పూచీ నాదీ!' అన్నాడు సుబ్బారావుగారు తిరుగుప్రయాణమయేటప్పుడు  సాంబయ్య భార్య వినేటట్లు.


ఆ మర్నాడే సాంబయ్య పోయినట్లు కబురొచ్చింది విజయవాడకి.  ఆ విషయం చెబుతూ  ' మీరు వెళ్ళిపోయిన తరువాత నేనూ చాలా ఆలోచించాను సుబ్బారావుగారూ! పిల్లాణ్ణి హాస్టల్లో పెట్టి చదివించడం, జీవితాంతం వాళ్ళు నిశ్చింతగా బతకడానికి ఏర్పాట్లు చేయడం.. చిన్న సాయమేమీ కాదు. కానీ.. మీ లాంటి వాళ్ళు చేయదగ్గది.. మీలాంటి వాళ్ళు మాత్రమే  చేయగలిగే కార్యం ఒకటుంది సార్!' అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

'ఏమిటో చెప్పండి.. తప్పకుండా చేద్దాం.. వీలైనదైతే!' అన్నాడు సుబ్బారావుగారు.

'జువెనైల్ డయాబెటెస్ కి ఒక విరుగుడు ఉంది సార్! స్టెమ్ సెల్సుతో చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. పిల్లల వూడిపోయే పాలదంతాలను వూడిపోవడానికి ఒక పదిరోజులముందే తీసి భద్రపరిస్తే.. భవిష్యత్తులో  వచ్చే పెద్ద రోగాలకి చికిత్స చేయడం తేలికవుతుంది. పాలదంతాల్లోని మూలకణాల ద్వారా ఈ వైద్యం సాధ్యమేనని రుజువయింది. దంతాల పల్సులో ఉండే మూలకణాలని ముఫ్ఫై నలభై ఏళ్లవరకు భద్రపరిచే ల్యాబులు ఇప్పుడు ఇండియాలో ఢిల్లీ, ముంబై, పూనేవంటి నగరాల్లో పనిచేస్తున్నాయి. మా కొలీగ్ ఒకతను వాళ్ల పాప పాలపళ్ళు అలాగే ముంబై బ్యాంకులో డిపాజిట్ చేయించానని చెప్పాడండీ!'

సుబ్బారావుగారికీ ఆలోచన బాగా నచ్చింది. కంపెనీ తరుఫు నుంచి పంపించిన వైద్యులు  ఢిల్లీ  బ్యాంక్ పని విధానాన్ని పరిశీలించి సమర్పించిన పత్రంలో మరిన్ని అనుకూలమైన వివరాలు ఉన్నాయి. 'మూలకణాలు శరీరంలో కొన్ని భాగాల్లో ఎక్కువగా.. కొన్ని భాగాల్లో తక్కువగా ఉంటాయి. దంతాల వంటి వాటినుంచి ఒక రెండు మూడు మూలకణాలని రాబట్టినా చాలు.. వాటిద్వారా కొన్ని లక్షల కణాలని సృష్టించుకోవచ్చు. శరీరంలో పాడైన భాగాలను  ఈ కణాలు వాటికవే బాగుచేసుకుంటాయి. బొడ్డుతాడునుంచి మూలకణాలను సేకరించే విధానం చాలా కాలంనుంచి ప్రాచుర్యంలో ఉన్నదే. ఆ అవకాశం లేకపోయినవాళ్ళు నిరాశ పడనవసరం లేదంటున్నారు ఇప్పుడు. పాలదంతాల విషయంలో తగిన జాగ్రత్త పడితే ఫ్యూచర్లో బోన్ మ్యారో, కిడ్నీలవంటి వాటికి సమస్యలొస్తే పరిష్కరించుకోవడం తేలికవుతుంది'.

దంతాలనుంచి మూలకణాలను సేకరించి భద్రపరిచే స్టెమేడ్ బయోటిక్ సంస్థలు ఢిల్లీలోలాగా ముంబై, పూనా, బెంగుళూరు, చెన్నైలలో ఉన్నా..  విభజనానంతరం ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇంకా  ఏర్పడలేదన్న విషయం  సుబ్బారావుగార్లో  మరింత ఉత్సాహం పెంచింది.

సాంబయ్య కొడుక్కి ఆరేళ్లే. అతగాడి పాలపళ్లను గనక భద్రపరిస్తే భవిష్యత్తులో వాడికొచ్చే జువెనైల్ డయాబెటెస్ కి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఆ రకంగా సాంబయ్య రుణం మనం తీర్చుకున్నట్లూ అవుతుంది' అంది సుబ్బారావుగారి సతీమణి ఈ విషయాలన్నీ భర్తనోట విన్నతరువాత.

'నిజమే కానీ.. ఇది కాస్త  ఖరీదైన వ్యవహారంలాగుందే?  ప్రారంభంలోనే అరవై వేల వరకు వసూలు చేస్తున్నాయి ల్యాబులు! ఆ పైన మళ్ళీ ఏడాదికో ఆరేడువేలదాకా రెన్యువల్ ఫీజులు!'

సుబ్బారావుగారిలోని వ్యాపారస్తుడి మథనను పసిగట్టింది ఆయన సతీమణి. 

'సాంబయ్య మనింటి దీపాన్ని నిలబెట్టాడండీ! అతనింటి దీపం కొడిగట్టకుండా చూసే పూచీ మనకు లేదా?  మనకింత ఉంది.. ఏం చేయలేమా?' అనడిగింది భర్తను. 

భార్యదే కాదు.. భర్తదీ చివరికి అదే ఆలోచనయింది.

సుబ్బారావుగారికి ఛారిటబుల్ ట్రస్టు తరుఫున ఏంచేయాలో సమాధానం దొరికింది.  బోర్డు మీటింగులో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ప్రపోజల్ టేబుల్ చేసాడు 'సాధారణంగా కన్నవారు బిడ్డ పుట్టగానే  వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఆలోచిస్తారు. కలిగినవాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు.. సేవింగ్సు కాతాలు ప్రారంబిస్తారు. చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే స్పృహ మాత్రం ఇంకా మన సమాజానికి అలవడలేదు. పుష్టికరమైన ఆరోగ్యాన్ని అందించినంత మాత్రానే ఆరోగ్యభద్రత కల్పించినట్లు కాదు. ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే ఎంత సంపద ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతే! స్టెమ్ సెల్సుని సేకరించి భద్రపరిచే ల్యాబులను మన ట్రస్టు తరుఫున ప్రారంభిద్దాం. పేద పిల్లల పాలపళ్లను సేకరించి వాటినుంచి మూలకణాలని రాబట్టి భద్రపరిచే ఏర్పాట్లూ చేయిద్దాం. ఇదంతా ట్రస్టు తరుఫున మనం సమాజానికి అదించే ఉచిత సేవా సౌకర్యం'

సభ్యులంతా ఆమోదపూర్వకంగా బల్లలమీద చిన్నగా చరిచారు.

సుబ్బారావుగారి సంస్థల తరుఫున ప్రారంభమయిన మూలకణాల సేకరణ, భద్రత ల్యాబు ప్రారంభోత్సవంలో లాంఛనంగా డిపాజిట్ చేయబడిన మొదటి స్పెసిమన్ సాంబయ్యకొడుకు పాలపళ్లనుంచి సేకరించిన మూలకణాలే!

సాంబయ్యకొడుకు మంచి హాస్టల్లో చేరి చక్కగా చదువుకొంటుంటే.. సాంబయ్యభార్య ట్రస్టువారి  బ్యాంక్ ల్యాబులోనే పనికి చేరింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితం)

బోథెల్, యూఎస్ఎ

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...