Showing posts with label Magazine. Show all posts
Showing posts with label Magazine. Show all posts

Wednesday, December 8, 2021

చూసేదంతా.. !- కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

ఖరీదైన ఆ భవంతిలో ఆధునాతనమైన సౌకర్యాల  మధ్య విశ్రాంతి దొరికినప్పుడు లోకంతీరును గురించి ఎన్నో కథలు, నవలలు అల్లి ఓ గొప్ప రచయిత్రిగా  పేరు  గడించింది శ్రీమతి రమాదేవి అతి పిన్నవయసులోనే.

ఆ రమాదేవికి పెళ్లయి ఇప్పుడో పది నెలల పసిపాప. భర్త రమణారావు ప్రాఖ్యా కంపెనీ పేరుతో సొంతంగా మాధాపూర్ మెయిన్ సెంటర్లో కంప్యూటర్ సొల్యూషన్ సంస్థ ఒకటి నడుపుతూ నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటాడు. ఎక్కువ కాలం విదేశీ టూర్ల మీదనే గడపాల్సిన వ్యాపారం అతగాడిది. ఇంట్లో పని సాయానికని, భార్య ఒంటరితనం తగ్గించాలన్న ఉద్దేశంతో తానే బాగా విచారించి సీత అనే ఒక పేద మహిళను ఫుల్ టైం హౌస్-మెయిడ్ కింద కుదిర్చిపెట్టాడు రమణారావు.

 

సీత ఓ అనాథ మహిళ. పెళ్లయితే అయింది కాని, భర్త ఊసెత్తితే మాత్రం ఆట్టే సంభాషణ పొడిగించదామె. తల్లి లేనందున రోగిష్టి తండ్రిని తన దగ్గరే ఉంచుకుని సాకే ఆ మహిళకు చంకలో ఓ బిడ్డ .. చంక దిగిన ఇంకో ఇద్దరు పిల్లలు! ఇన్ని సంసార బాధ్యతలు  లేత వయసులోనే  నెత్తి మీద పడటం చేత పరాయి ఇంట్లో ఆయాగా కుదురుకోక తప్పని దైన్య స్థితి సీతది.

సీత మంచి అణుకువగల మనిషి. పనిమంతురాలు కూడా. అన్ని సుగుణాలు ఒకే చోట ఉన్నవాళ్లకే లోకంలో అదనంగా పరీక్షలంటారు! ఆమె  జీవితం మీద ఓ జాలి కథ కూడా రాసి కథల పోటీలో బహుమతి పొందిన ఘనత రచయిత్రి రమాదేవిది.

 

'అలాంటి సీత ఇలాంటి నీచమైన పని చేస్తుందంటే నమ్మ బుద్ధి కావడం లేదు?!' ఇప్పటికి ఏ వంద సా్లర్లో అనుకుని ఉంటుంది రమాదేవి.  ముందు రోజు మధ్యాహ్నం తన గది కిటికీ గుండా  ఆమె చూసిన దృశ్యం అంతగా డిస్టర్బ్ చేసేసిందా రచయిత్రిని. గతంలో ఏవో కథల్లో, సినిమాలలో కల్పించి రాసుకున్న సన్నివేశాలు ఇప్పుడు అంతటా నిజమవుతున్న తీరు రచయిత్రయి ఉండీ ఆమే జీర్ణించుకోలేని పరిస్థితి!

ఎదురు డాబాఇల్లు లాయరుగారిది. ఆయనగారి పడగ్గదిలో.. పడక మీద సీతను చూసింది ముందు రోజు అపరాహ్నం పూట! ఈమె అటు తిరిగి పడుకొని.. వంటి మీది పై భాగపు దుస్తులను  స్వయంగా తన చేతులతోనే విప్పేసుకుంటోన్నది!   సిగ్గూ ఎగ్గూ లేని ఆ లాయరు మహానుభావుడు ఇటు వైపు  వంగి నిలబడి ఏదో తొంగి చూస్తున్నాడు! ఇంకాసేపట్లో ఆ మహాతల్లి పడక మీదకే నేరుగా చేరివుంటాడేమో కూడా! జుగుప్సతో అప్పటికే రమాదేవి టకాల్మని తన కిటికీ రెక్కలు మూసేసుకుంది. 

కిటికీ రెక్కలనైతే మూయగలిగింది గాని.. మనసు ఆలోచనా ద్వారాలను ఎలా మూయాలీ తెలియక సతమయిపోతున్నది నిన్నటి నుంచి రమాదేవి. కాలం గడిచే కొద్దీ ఊహల ఉధృతి పెరిగిపోసాగింది. అక్కడికీ అదుపు చేసుకునేందుకు డాక్టర్ గారిచ్చిన టాబ్లెట్ రెండు మింగింది కూడా. వాటి ప్రభావమూ అంతత మాత్రమే ఈ సారి.

‘అవ్వఁ! పట్ట పగలు! అదీ మిట్ట మధ్యాహ్నప్పూట! ఎంత తలుపులు మూసుకుంటే మాత్రం ఏ  కిటికీ సందుల గుండానో సంబడం బైటపడకుండా ఉంటుందా? ఎదిగారు ఇద్దరూ తాడి మానులకు మించి.. ఎందుకూ! ఇంగితమన్న మాట పక్కన పెట్టేసిన తరువాత ఏ కిటికీలు, తలుపులు వాళ్లనా మదపిచ్చి చేష్టల నుంచి కట్టడి చెయ్యగలవు!

అతగాడి  భార్య పోయి ఇంకా రెండు వారాలైనా పూర్తిగా నిండ లేదు. ఆయనింట జరిగిన అరిష్టానికి  ఇక్కడ పేట పేటంతా అయ్యో పాపం అని ఆక్రోశపడుతుంటే.. అక్కడ మాత్రం  ఆ సిగ్గూ శరంలేని పెద్దమనిషికి అప్పుడే ఒక ఆడతోలు కావాల్సొచ్చిందా! కక్కుర్తిలో ఆయనకూ, ఆయనింట్లో పెరిగే ఆ కుక్కలకూ ఇక తేడా ఎక్కడేడ్చింది! మగవాడు వాడికి నీతి లేకపోతె మానె.. ఆడపుటక పుట్టిన ముండకు దీనికైనా బుద్ధీ జ్ఞానం ఉండాలా.. అక్కర్లేదా?

ఇందుకా ఈ మహాతల్లి నాలుగయిదు రోజుల బట్టి ఒకే హైరానా పడ్డం! తాను ఇంకా ఇంట్లో సమస్యలేమోలే అనుకుంటుంది. అడిగింది కూడా! ఎప్పటిలా ఎదురు బదులేదీ? నవ్వేసి ఊరుకుంది నాటకాల మనిషి! ఒకే వేళకు 'బైట కాస్త పనుంది పోయొస్తాన'మ్మా అని  పర్మిషన్ తీసుకుని వెళ్లి ఆలస్యంగా రావడం ఈ ఘనకార్యానికా!

శుచి శుభ్రత, నీతి నిజాయితీ ఉందనే గదా భర్త విచారించి మరీ ఈ మనిషిని నమ్మి ఇంట్లో ఉంచి వెళ్లడం! తను విన్న దానికి తగ్గట్లే ఎంతో మెలుకువగా ఇంటి పనులన్నీ శుభ్రంగా చక్కగా చేసుకుపోయే మనిషే! ఇంతలోనే ఏ పురుగు కుట్టి చచ్చిందో!  భార్య పోయిన మగాడి పడక గదిలో పగలే దూరిపోవాలంటే ఎంత తెగింపు ఉండాలి!

'ఛీఁ..ఛీఁ! ఇట్లాంటి నీచురాలి చేతిలోనా తన బిడ్డ పెరిగి పెద్దవనే కూడదు! భయంతో వణికిపోయింది రచయిత్రి రమాదేవి. ఆ గంట సేపూ!

అది వచ్చీ రాగానే అడగవలసిన నాలుగు మాటలు అడిగి సాగనంపేయాలని ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికొచ్చేసింది రచయిత్రి రమాదేవి.  

అరగంట తరువాత  తాపీగా ఇంటి కొచ్చి ఏమీ జరగనట్లే తన పనిపాటల్లో ఎప్పట్లా పడిపోయిన సీతను చూసి ఎట్లా అడగాలో అర్థమవలేదు రమాదేవికి. సాటి ఆడదానితో ఎట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడడం!   ఇంత నటనా కౌశలం గల ఈ మనిషి నోటి నుంచి తాను నిజం కక్కించగలదా! భర్త రమణారావు వచ్చిన తరువాత విషయం చెప్పేస్తే ఆయనే చూసుకుంటాడు ఈ చెత్త వ్యవహారాన్ని! అయినా.. వేరే ఎవరి కాపురాల గోలో తనకెందుకు! ముందు ఇది తన కొంపకు నిప్పు రవ్వ రాజేయకుండా ఉంటే చాలు. తాను జాగ్రత్తపడాలి!' అని సర్దిచెప్పుకుంది రమాదేవి.   కథల్లో పాత్రల చేతయితే రకరకాలుగా మాట్లాడించే రచయిత్రి నిజజీవితంలో ఒక దౌర్భాగ్యకరమైన సంఘటన   నిజంగానే ఎదురైతే ఎట్లా డీల్ చేయాలో తోచక   చేష్టలుడిగినట్లయిపోయింది. ఆ పూటకు సీత ఉద్వాసన వ్యవహారం వాయిదా పడింది.  

అ రాత్రి రమణారావు రమాదేవి చెప్పిందంతా విన్నా తేలిగ్గా కొట్టిపారేశాడు

'అనుమానం పుట్టి మీ ఆడవాళ్లు పుట్టారన్న మాట నిజమే అనిపిస్తోందిప్పుడు. ఇంతకాలంగా చూస్తున్నా ఆవిడను, ఎంత ఒద్దికగా తన పని తాను చేసుకుపోతుంది! చిన్న పొరపాటైనా తన వల్ల దొర్లుతుందేమోనని  ఆమె చూపించే శ్రద్ధ నీకు కనిపించడం లేదా? ఏదో విధి బావోలేకనో, మొగుదు చేసిన మోసం వల్లనో ఇట్లా పరాయి ఇళ్లలో పడి చాకిరీ చేసే సాటి ఆడదాని మీద గట్టి ఆధారం లేకుండా అభాండాలు వేయడం దారుణం రమా!  నువ్వేగా.. అమెను దృష్టిలో ఉంచుకుని మహగొప్పగా కథోటి రాసి బహుమతి కొట్టేసింది! ఇప్పుడేమో మతి లేకుండా ఏవేవో అవాకులూ చవాకులూ కూసేస్తుంటివి!' అంటూ ఎద్దేవాకు దిగిన భర్త మీద పీకల్దాకా మండుకొచ్చింది రమాదేవికి.

'స్వయంగా నా కళ్లతో నేను చూసింది చెప్పినా మీకు నమ్మకం కలగడం లేదా? నా కన్నా  దాని మీదే మీకు ఎప్పట్నుంచి నమ్మకం ఎక్కువయిందో! అవును!  మీరూ ఓ మగాడేగా! ఇట్లాంటి ఓ ఆడది ఇంటి పట్టునే ఉంటే గుట్టుగా మోజు తీర్చుకోవచ్చని అశ కలుగుతున్నట్లుందే తమక్కూడా' అంటూ అదుపు లేకుండా రెచ్చిపోయింది ఉక్రోషంలో రమాదేవి.

'కంట్రోల్ యువర్ సెల్ఫ్ రమా! ముందీ టాబ్లెట్ వేసుకో!  ఇప్పుడు ఎన్ని చెప్పినా నువ్వు వినే మూడ్ లో లేవని అర్థమవతూనే వుంది.  మన సమస్యల మధ్య ఇప్పుడు ఈమె భాగోతం కూడా ఎందుకులే! నువ్వు చెప్పినట్లే చేద్దాంలే! మరో మంచి ఆయా దొరికిందాకా కాస్త ఓపిక పట్టు ప్లీజ్!' అంటూ భార్య కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడా మానవుడు అప్పటికి.

మర్నాడు ఎప్పటిలా అదే టైముకు సీత రమాదేవిని పర్మిషన్ అడిగింది. తమ తలాడించగానే బైటికి వెళ్లిన మనిషి మరో రెండు నిముషాలల్లో లాయరుగారి ఇంటి ముందు తేలింది. ఈమె రాకను చూసి అప్పటి వరకు అసహనంగా ఎదురు తెన్నులు చూస్తోన్న లాయరుగారి మొహంలో ఒక మాదిరి రిలీఫ్ కనిపించడం ఇద్దరూ ఇంటిలోకి పోయిన వెంటనే తలుపులు మూతబడడం.. మరో రెండు నిముషాలల్లో సీత లాయరుగారి బెడ్ రూంలో తేలడం రోజుటిలాగే యధావిధిగా సాగిపోయాయి క్రమం తప్పకుండా!

మరో అరగంట తరుతావ తరువాత సీత బెరుకుగా బ్లౌజు గుండీలు సర్దుకుంటూ బైటకు రావడం.. వెండితెర సినిమా అంత స్పష్టంగా కనిపించిందీ సారి.. సూది మొనంతైనా అనుమానానికి సందు లేకుండా!

'ఇప్పుడేమంటారో  శ్రీవారు?' అంది ఎకసెక్కంగా రమాదేవి.

అప్పటికే రమణారావును ఆమె పిలిపించి సిద్ధంగా ఉంచింది.. ఈ దృశ్యం అతనే స్వయంగా చూసి తరిస్తాడని!

రమణారావు ఏదో చెప్పబోయి తటపటాయించడం చూసి చిర్రెత్తుకొచ్చింది రమాదేవికి. నోరింత చేసుకుని  'ఇప్పటికీ  మీ సీతమ్మ తల్లి రామాయణంలోని సీతమ్మవారేనంటారు! ఆ ఎదురింటి పెద్దమనిషి కలియుగ శ్రీరామచంద్రమూర్తా!'

'మైండ్ యువర్ టంగ్ రమా! నిన్నటి బట్టి నీ మాటలు  వినీ వినీ నా సహననం చచ్చిపోయింది. నీకూ ఒంట్లో బావో లేదని   ఓపిగ్గా పడుతున్నా! ఇహ నా వల్ల కాదు! ఇంకొక్క కారుకూత  చెవిన బడ్డా నేనేం చేస్తానో నాకే తెలీదు' 

లక్ష్యపెట్టే స్థితిలో లేదు రమాదేవి 'అహాఁ!  నాకంతా  ఇప్పుడు స్పష్టంగా కళ్లక్కడుతోంది ! మనింట్లో కూడా ఓ మహా రామాయణం నడుస్తోంది. అందులో తమరే కదా  శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఆ శూర్పణఖ మీ కంటికి సీతమ్మవారిలా కనిపిస్తోంది..'

'షటప్..' కొట్టేందుకు చెయ్యేత్తేడు ఓర్పు సహనం పూర్తిగా నశించిన రమణారావు.

 

ఎప్పుడొచ్చిందో సీత .. గభాలున దంపతులిద్దరి మధ్యకు  వెళ్లి నిలబడింది. ఆ దెబ్బ సీత ముఖం మీదకు విసురుగా పడ్డం.. బీపీ ఎక్కువైమ రమాదేవి కళ్ళు తిరిగి కిందకు వాలిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి!

***

మళ్లీ కళ్లు తెరిచే సరికి ఎదురుగా భర్త.. పక్కనే డాక్టర్ రామానుజం. 'పాపకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ పనికిరాదు! చెప్పిన జాగ్రత్తలన్నీ స్ట్రిక్టుగా పాటించండి! మళ్లీ మూడు రోజుల తరువాత సేంపుల్సవీ  చూసి కానీ ఏ నిర్ధారణకూ రాలేం' అని వెళ్లిపోయాడు.. డాక్టర్ కిట్ సర్దేసుకుని.

'నా కేమయిందండీ!' అయోమయంగా అడిగింది రమాదేవి .

'నీ పాత ఫ్రీజర్సే! మళ్లీ తిరగబెట్టింది! చూసేవన్నీ నిజాలు కావు. చూడనంత మాత్రాన కొన్ని అబద్ధాలు అయిపోవు.  అందుకే నిన్ను లేనిపోనివి ఊహించుకుంటూ టెన్షన్ పడద్దనడం! పేరుకే పెద్ద రచయిత్రివి.. ప్రశాంతంగా మంచీ చెడూ తర్కించడమే  రాకపాయ ఇప్పటికీ! మూడ్రోజుల్నుంచి ఇట్లాగే బెడ్ మీద పడుంటే నేనూ, పాపా ఏమై పోవాలని'అని మంద్రస్వరంతో మందలించాడు రమణారావు.. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని లాలిత్యం ఉట్టిపదే ప్రేమభావనతో. రమాదేవి కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. గిల్టీగా అనిపించింది.  'మూడు రోజుల్నుంచీ ఫ్రీజర్సా! మరి పాపకు పాలు..'

'అదిగో మళ్లీ చింతలు మొదలు! నువ్వు నిశ్చింతగా ఉండడం అవసరం రమా! అట్లా ఉండాలనే కదా వెదికి వెదికి నేను సీతను ఎంతో కష్టపడి పట్టుకొచ్చింది!' అన్నాడు రమణారావు నిష్ఠురంగా!

ఉయ్యాలలని పసిపాప కక్కటిల్లుతుంటే  లేచి బైటికి నడిచాడు రమణారావు,

పసిబిడ్డను లాలనగా ఒడిలోకి తీసుకుని గోడ వైపుకు తిరిగి తన దుస్తులు పై భాగం  సడలించుకుంటోంది సీత.

ఆ క్షణంలోనే తాను చేసిన పొరపాటు ఏమిటో  రమాదేవికి అర్థమైంది. లాయరుగారికీ పసిపాప ఉంది. ఆ పాప తల్లి పోయి రెండు వారాలే అయింది!

తన తొందరపాటు ఆలోచనకు చాలా సిగ్గని  అనిపించింది రమాదేవికి. బొజ్జ నిండి కుడిచి, నిద్రకు పడిన పాపాయిని తెచ్చి తన బెడ్ పక్కన ఉన్న ఉయ్యాలలో బజ్జోపెట్టే సీత ఆమె కళ్లకు ఇప్పుడు నిజంగానే అన్నపూర్ణమ్మ తల్లిలా కనిపించింది.

 

 తనను దగ్గరగా పిలిచి రెండు చేతులూ పట్టుకుని కన్నీళ్లు పెట్టుకునే రమాదేవితో అంది సీత ప్రశాంతమైన మనసుతో ''ఛ.. ఊరుకోండమ్మా! తమరు పెద్దోరు! బావోదు. అయినా! ఇదేమైనా నేను మొదటి సారి గాని చేస్తున్నానా? ఉదారంగా చేస్తున్నానా? ఆ లాయరుబాబుగోరి కాడలాగే అయ్యగారి కాడా తీసుకుంటున్నాగా తల్లీ! బైటి కెళ్లేముందు మీకిదంతా చెప్పేసుంటే ఇంత కథే ఉండకపోను! ఆడముండని.. బిడియం అడ్డొచ్చింది తల్లీ!' అంది!

 'న్యాయానికి.. పసిబిడ్డకు చన్నిచ్చి ఇట్లా డబ్బులు తీసుకోడం కూడా పాపమేగా తల్లీ! కానీ.. ఏం చెయ్యాలా? గంపెడంత ఇల్లు గడవాలా!' అంటున్న సీత ఔన్నత్యం ముందు కుచించుకుపోయినట్లున్న తన వ్యక్తిత్వాన్ని చూసుకుని సిగ్గుపడింది  గొప్ప సామాజిక దృక్పథం తన సొంతమనుకుంటూ వస్తోన్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి రమాదేవి.  

'చూసేవన్నీ నిజాలు కావు. చూడనంత మాత్రాన కొన్ని అబద్ధాలు అయిపోవు' అంటూ భర్త హమేశా చేసే హెచ్చరిక మరో సారి ఆమె చెవిలో గింగురుమంది.

 ***

-కర్లపాలెం హనుమంతరావు

19 -03 =2021

(ఆంధ్రభూమి- వారపత్రిక 13 నవంబర్, 2008 లో 'కళ్లు చేసే మోసం' పేరుతో ప్రచురితం)








Tuesday, December 7, 2021

భాష - వ్యాసం అమ్మ భాష ' మమ్మీ ' పాలు! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం)

 



భాష - వ్యాసం 

అమ్మ భాష ' మమ్మీ ' పాలు! 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు  సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


తొలిదశలో విద్యాబోధన మాతృభాషలోనే నిర్బంధంగా  జరగాలనే కర్ణాటక ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన కొన్ని వ్యాఖ్యల సేపథ్యంలో బోధనాభాషగా మాతృభాష పాత్ర ఏమిటనే చర్చ  ప్రారంభమయింది. 


మనరాష్ట్రంలో ప్రభుత్వమే ఆరో తరగతి నుంచి ఆంగ్లభాషను బోధనా మాధ్యమంగా ముందుకు తెచ్చినందువల్ల ఈ చర్చకు ఇక్కడ మరింత ప్రాధాన్యత  ఏర్పడింది. 


ఉనికి కోసం పోరాటం: 


కర్ణాటక ప్రభుత్వం 1994లోనే ఒకటినుంచి నాలుగు తరగతుల దాకా కన్నడ భాషను నిర్బంధంగా బోధించాలని ఆదేశాలిచ్చి అమలు జరుపుతోంది. ఇంగ్లీషు మాధ్యమంగా కొత్త పాఠశాలల్ని ప్రారంభించాలన్నా, ఉన్న పాఠశాలల్లోనే కొత్త తరగతులు తెరవాలన్నా ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తోంది. కర్ణాటక ఐక్య  పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వ ఉత్తర్వుపై 2004లో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది .  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పురావడంతో కర్ణాటక ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థాను తలుపు తట్టింది. ఈ దశలో  ఉన్నత న్యాయస్థానం తీర్పు అమలును నిలుపుదం  చేయటానికి నిరాకరిస్తూనే  జులై 21న ప్రాథమిక పాఠ శాలలో ఆంగ్ల విద్యాబోధన సాగకపోతే విద్యార్థులు గుమస్తా ఉద్యోగాలకైనా పనికిరాకుండా  పోతారని, అరవై నుంచి యాభైవేల రూపాయల దాకా ఫీజులు  చెల్లించి తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో వేయటానికి తల్లిదండ్రులే సిద్ధ పడుతుంటే ప్రభుత్వానికేమి ఇబ్బందని అర్థం వచ్చేలా సర్వో నత న్యాయస్థానం  కొన్ని వ్యాఖ్యలు చేసింది.


కేవలం 26 అక్షరాలు రెండున్నర లక్షల పద బంధా లున్న ఆంగ్ల భాషను శ్వేతజాతి నేతలు అప్పట్లో తమ సామ్రాజ్యం విస్తరించిన అన్ని చోట్లా స్థానిక భాషలమీద పెత్తనం చేయటానికి  వాడుకున్నారు. 


రాజాదరణ దొరికిన భాష రాణిస్తుంది. ' మనభాష, మన తిండి ఒంటబట్టిన మనిషి మరో చోటికి వెళ్ళలేడు . మనకే లొంగి ఉంటాడు' అనేది మెకాలే సిద్ధాంతం. దానిమీదే భరత ఖండంలోనూ  మిగతా బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ  ఆంగ్లభాషను స్థాని కులు తమకు దాసులయ్యే మేరకే వాడుకలోకి తెచ్చారు. ఆ క్రమంలో ఆంగ్లభాష అభివృద్ధి చెందుతూ స్థానిక భాషలు, వివిధ మాతృభాషలు మరుగునపడుతూ వచ్చాయి. 


ప్రస్తుతం మన రాష్ట్రంలో తెలుగు దీనావస్థలో ఉండటం మాతృభాషాభిమానులందరికీ ఆందోళన కలిగిస్తోంది. తమిళనాట  భాష ఆధారంగా పెద్ద ఉద్యమాలు వచ్చాయి. తమ భాషను ఉపయోగించుకుంటూనే శాస్త్రాలను, ఇతర అంశా లను పరిపుష్టం చేసుకునే విధానం అక్కడ కొనసాగుతోంది.  తమిళతనం ప్రజల భాషలో సజీవంగా ఉండే విధానాన్ని ఎంత ప్రపంచీకరణలోనూ వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. 


ఉత్తరాదిన హిందీ భాషోద్యమం కారణంగా ఆంగ్లం కన్నా హిందీలో మాట్లాడటం గౌరవంగా భావిస్తారు. ఆంగ్ల భాష జనజీవనంలోకి అవసరానికి మించి చొచ్చుకునివచ్చి చేస్తున్న హానిని గుర్తించిన రామ్మనోహర్ లోహియా లాంటి సోషలిస్టు వాదులు ఒక దశలో ' అంగ్రేజీ హటావో'  అనే ఉద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టిన చరిత్ర ఉంది. 


మనకు మన తెలుగు పనికిరాకుండా పోతోంది. అమెరికా లాంటి దేశాలకు వలస పోవటానికే ఈ ఆంధ్రదేశంలో పుట్టామని భావించే కుర్రతరం క్రమక్రమంగా అధిక మవుతోంది. ప్రపంచం మొత్తంమీద తెలుగు మాట్లాడేవాళ్లు 15 కోట్లమంది . చాలా యూరోపియన్ భాషల కన్నా మన భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ . ఒక్క భారతదేశంలోనే హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడేది తెలుగు భాష . యాభై ఆరు అక్షరాలు, ఆరులక్షల పదబంధాలున్న మనభాష చేత ఇరవయ్యారు అక్షరాలున్న ఆంగ్లానికి ఊడిగం చేయించాలని ఉబలాట పడుతున్నాం. సొంత రాష్ట్రoలో ఉద్యోగం చేయటానిక్కూడా తెలుగు మనకు పనికి రాకుండా పొతున్న పరిస్థితి.


దాదాపు రెండు తరాల విద్యార్థుడు  తెలుగు భాష రాకుండానే .. తెలుగు భాషపై అవగాహన లేకుండానే విశ్వ  విద్యాలయాలనుంచి బైటికి వచ్చిన వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. 


ఇప్పుడు ఇళ్లల్లో తెలుగు అక్షరం కనిపించదు. తెలుగు పదం వినిపించదు . మరో రెండు తరాల పాటు ఈ నిర్లిప్తత ఇలాగే కొనసాగితే తెలుగు భాష ఏక మొత్తంగా ఉనికి లేకుండాపోయే ప్రమాదం పొంచి ఉందనే భాషాభిమానులు ఆవేదనలో అర్థం ఉంది .


మాతభాషను మించినది లేదు. ప్రజలకు  ప్రాణం పోసేది  తల్లిభాషే.  ప్రాథమికస్థాయి నుంచి  మాతృభాషలో  విద్యాభ్యాసం  చేసి అవసరాన్ని బట్టి పరభాషలను ఉపయోగించుకున్న వాళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 


మనరాష్ట్రం నుంచి  ఐఐటి కి  ఎన్నికయిన  వారిలో ఎక్కువమంది పది వరకూ తెలుగులో విద్యాభ్యాసం చేసినవాళ్ళే.  బాల్యంనుంచే ఆంగ్లభాషను మప్పినంత మాత్రాన భవిష్యత్తులో ఆ భాష మీద పట్టు సాధించగలమన్న గ్యారంటీ మాత్రం ఏముం టుంది ? తెలుగులో చదువుకున్న వాళ్ళంతా నన్నయలూ, తిక్కనలూ అవుతున్నారా? నోబెల్ బహమతి గ్రహీతల్లో ఎక్కువ మంది ఇంగ్లీషు భాషలో రాసినవారు కాదు. ఆంగ్ల భాషతో పనిలేకుండానే చైనా, రష్యా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి కదా! ఫ్రెంచి, జర్మన్, స్పానిష్ లాంటి భాషల్లో సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం  ఆంగ్లభాషల్లో కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ . ఇవన్నీ  ఆంగ్ల భాష మీద వ్యతిరేకతతో చెప్పే మాటలు కావు . తెలుగువాళ్ళకు అసలు ఇంగ్లీషు వద్దని చాదస్తంగా  చెప్పటానికి కాదు. ఏ భాషనైనా ఆవసరాన్ని  బట్టి తప్పక నేర్చుకోవాల్సిందే. అయితే ఒక దశ  వరకూ మాతృభాష  మాత్రమే  మాధ్యమంగా ఉండితీరాలని చెప్పటమే ఇక్కడి ఉద్దేశం.


బహుశా ఈ శాస్త్రీయ దృక్పథంతోనే కర్ణాటక ప్రభుత్వం కన్నడం ప్రాథమిక స్థాయిలో తప్పని సరి  బోధనా భాషగాఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు . ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కనీసం తల్లి భాష/ స్థానిక భాషలలో ఏ ఒక్క దానిలో కూడా విద్యాబోధన అంటూ ఉండనవసరం  లేదని తాత్పర్యం చెప్పుకొనే విధంగా ఉండటమే ఆశ్చర్యకరం


ఆంగ్లంలోనే విజ్ఞానం యావత్తూ  ఉందనీ..  అంతర్జాతీయ స్థాయిలో విద్యా ఉద్యోగాలకు అవసరమైన బిడ్డకు తల్లి  గర్భంలోనుంచే ఆంగ్లం నూరిపోయాలని  వాదించేవారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉంది. ఇవాళా సాష్ట్  వేర్ రంగంలో ఉద్యోగాలా చేస్తూ , విమానాలలో  విదేశాలకు ఎగిరిపోయిన వాళ్లలో అధిక భాగం అనివార్యంగా ప్రాథమిక దశలో మాతృ భాషలోనే విద్యాభ్యాసం చేసిఉంటారు. 


అప్పటి విద్యావిధానం అలాంటిదే మరి . సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తిన  రెండో అభ్యంతరం ఆర్థిక సంబంధమైనది. వేలు ఖర్చుపెట్టి తమ పిల్లల్ని ఆంగ్ల పాఠశాలల్లో చేర్పించటానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్న నేపధ్యంలో  ప్రభుత్వనికి ఎందుకు నొప్పి .. అని సుప్రీంకోర్టు వ్యాఖ్య! ఈ తరహా  పరిశీలన కార్పొరేట్ మార్కెట్ వర్గాల నుంచి కాకుండా నేరుగా సమున్నత న్యాయస్థానం నుంచే రావటం ఆందోళన కలిగించే విషయం.


ఈ వ్యాఖ్య ఏ మేరకు సమంజసమో తేలాలంటే దీని నేపథ్య౦ ముందు కొంత అర్థంచేసుకోవాలి . 


ప్రపంచీకరణ విద్యను వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తుంది. ప్రపంచంలోని యువతలో 54 శాతం మనదే శంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఇంటర్మీడియెట్ స్థాయినీ కలుపుకొని దాదాపు ఆరుకోట్ల మంది విద్యార్థులుంటారు. ప్రపంచ విద్యావ్యాపారంలో

అతి పెద్ద మార్కెట్ మనవేశమే.. అని పసిగట్టిన అంతర్జా తీయ పెట్టుబడిదారీ వర్గాలు  ఇక్కడి విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండటం గమనించింది.  విద్య వ్యాపారంగా సాగాలంటే ముందు ప్రభుత్వమనే అవరోధాన్ని  తప్పించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ జనరల్ అగ్రిమెంట్ ఆన్ త్రేడ్ ఇన్ సర్వీసెస్  (జి.ఎ.టి.ఎస్) చర్చల్లో విద్యను ఒక అంశంగా చేర్చటానికి  ఇదే కారణం. దీనికి మనదేశమూ అంగీకరించింది. 


మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే ముసాయిదా బిల్లును తయారుచేసింది. ఈ బిల్లు చట్టమైతే విదేశీ డిగ్రీన్ని ఇక్కడ విరివిగా అమ్ముకోవచ్చు. అంత ర్థాలం (ఇంటర్నెట్) ద్వారా ఇక్కడ కళాశాలలు నడిపించవచ్చు.  ఉద్యోగాలకసలు విదేశీ పట్టాలే ప్రమాణంగా మారే ప్రమాదమూ ఉంది కోట్లు రాబట్టే  ఈ వ్యాపారంలో  ఇక్కడి పెట్టుబడిదారీ వర్గాలూ చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతున్నాయి . కాబట్టే   కేవలం ఆంగ్ల  మాధ్యమంలో మాత్రమే ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యమని దశాబ్దం కిందటి నుంచి కొత్తవాదనను ప్రచారంలోకి తెచ్చాయి.


ప్రభుత్వం అంతటి నిర్లజ్జగా బైటికి  చెప్పలేదు .  కనుక ప్రజానుకూల సంక్షేమమనే తీసిని అద్ది నమా ఉదారవాద సిద్ధాంతానికి  తెరతీసింది. మాటలో ఎంత సంపూర్ణ అక్షరాస్యత, ప్రాథమిక విద్యలో ప్రాధాన్యత, ఉన్నత విద్య , విద్యాహక్కు అంటున్నా.. చేతల్లో మాత్రం దేశీయ విద్య విదేశీ శక్తుల హస్తగతనువుతూ పోవటాన్ని పరోక్షంగా ప్రోత్సహించే ధోరణిలోనే పథకాశాలు రచిస్తోంది. 

మాతృ భాషలో విద్యాబోధన జరగాలన్న నిబంధనను విద్యాహక్కు చట్టం నుంచి  2006 లోనే  తొలగించి ప్రభుత్వం తన నిజస్వరూపం చాటుకుంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కిందటే సక్సెస్ పాఠశా లల పేరుతో ఆంగ్ల మాధ్యమాన్ని సీబీఎస్ఈ పాఠ్యాంశాలతో సహా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అరకొరగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కొత్త పాఠ్య  ప్రణాళికను  ఆంగ్ల మాధ్యమంలో బోధించలేక పాఠాలను  తెలుగు లిపిలో రాయించి బోధిస్తున్నారని చెప్పుకొంటున్నారు. కొత్త మాధ్యమాన్ని  అందుకోలేని విద్యార్థులు తిరిగి తెలుగు మాధ్యమంలోకే వెళ్ళిపోవటమో .. అదీ కుదరని పక్షంలో  ఏకంగా చదువుకే నామం పెట్టేయటమో చేస్తున్నారన్నది నిష్ఠుర సత్యం. 


ప్రాథమిక స్థాయిలో మాతృభాష మాధ్యమ విధానం నుంచి పక్కకు తొలగితే సహజంగానే ఇలాంటి దుష్పరిణా మాలు జరుగుతాయనే- పొరుగునున్న తమిళనాడులో రెండు భాషలనూ సమన్వయం చేసుకుంటూ విద్యాబోధన విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మాతృభాషలో బోధన అంటే ఏమిటో, అన్ని వర్గాల పిల్లలకు దీన్ని ఒక దశ వరకూ నిర్బంధం చేయటం ఏ విధంగా అవసరమో, ఆంగ్ల మాధ్యమం ఏ దశనుంచి ప్రారంభిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో .. ఇత్యాది  ముఖ్యమైన విధానాలను  నిస్వార్ధంగా  నిజాయితీగా , నిదానంగా అన్ని వర్గాల వారికి నచ్చజెప్పటానికి ప్రభుత్వం పూనుకొనుంటే  అసలీ వివాదమే ఉత్పన్నమయ్యేది కాదు. 


ప్రాథమిక దశ తరువాత బోధనా మాధ్యమం ఐచ్ఛికంగా  ఉండాలి. ఎవరు ఏ మాధ్యమం కోరుకుంటే ఆ మాధ్యమాన్ని సమాన సౌక ర్యాలతో అందుబాటులో ఉంచటం  ప్రభుత్వాలు అనుసరిం చవలసిన  ఉత్తమ విధానం.  ధనార్జన కోసమే విద్యాసంస్థలు నడిపే వ్యాపారవేత్తలను  పరోక్షంగానైనా ఏ ప్రజా ప్రభుత్వమూ ప్రోత్సహించరాదు. 15 కోట్ల  మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నప్పటికీ  పరిపాలన అదే భాషలో సాగకపోవడానికి , పరాయితనం  మీద అవసరానికి మించిన మోజే  ప్రధాన కారణమని తెలుసుకున్నపపుడే  తెలుగు భాషకు మళ్ళీ మంచికాలం వచ్చినట్లు లెక్క. 


 మన ప్రజల డబ్బుతో చదువుకొని విదేశాలలో శాశ్వతంగా స్థిరపడిపోవటాన్ని గొప్పతనంగా కాక, సామాజిక ద్రోహంగా మనం చూడగలిగిననాడు  పరిస్థితుల్లో మార్పు క్రమంగానైనా వస్తుంది.


తొలి వెలుగు దీవం


మన కర్ణాటక వివాదం మీద వెలు వరించే మలితీస్సులో భాషా  ఆవశ్యకత ప్రాథమిక దశ వరకు ఎంత అవసరమో గుర్తించి తదనుగుణంగానే మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆశించటంలో తప్పులేదు గదా ! ఈ మధ్య పార్లమెంటు ఆమోదం పొందిన విద్యా హక్కు బిల్లు అందరికీ విద్యను అందించటం ఒక హక్కుగా పేర్కొంది. అట్టడుగు స్థాయివారూ విద్యను సక్ర మంగా అందుకునే పరిస్థితులను కల్పించాల్సింది ప్రభుత్వమే. అప్పుడే  బడుగు జీవికి సక్రమమైన విద్య మాత్న భాషలో  అందేది.  


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈూడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


కథ మా తెలుగు తల్లికి ... మల్లె పూ దండ - కర్లపాలెం హనుమంతరావు ( రచన - మాసపత్రిక - అక్టోబర్ - 2016 - సంచికలో ప్రచురితం )

 కథ : 

మా తెలుగు తల్లికి ... మల్లె పూ దండ !  

- కర్లపాలెం హనుమంతరావు 

( రచన - మాసపత్రిక - అక్టోబర్ - 2016 - సంచికలో ప్రచురితం ) 


విద్యారణ్య!


అన్ని రకాల హైటెక్ హంగులతో నేను నడుపుతున్న విద్యాసంస్థ అది. 


ర్యాంకులు పండించే విద్యాక్షేత్రంలో మా సంస్థ స్థానం మొదటి నుంచి మొదటి మూడింటిలో ఒకటి. శాశ్వతంగా మొదటి స్థానంలోనే స్థిరపడాలన్నది నా లక్ష్యం. 


ఆ లక్ష్యసాధనలో భాగంగానే ప్రపంచ స్థాయి గుర్తింపువున్న  ది 'జీనియస్' గ్రూపుతో 'టైఅప్' అవ్వాలని వ్యూహం. 


ఆ ప్రయత్నాలన్నీ ఓ కొలిక్కి వచ్చి ఇప్పుడు చివరి దశకు చేరు కొన్నాం. 


ఇంకో గంటలో జరగబోయే సాంస్కృతిక ప్రదర్శనలలో  కూడా మా ప్రత్యేకత నిరూపించుకుంటే... ఇహనుంచి నగరంలో మా విద్యారణ్యదే ప్రప్రథమ స్థానం.




కల్చరల్ ఈవెంట్ ఇన్-చార్జ్ మిసెస్ కపర్దీది ఓ ప్రసిద్ధ విద్యాసంస్థకు చెందిన ప్రధానోపాధ్యాయురాలి హోదాలో దాదాపు ముఫ్ఫై ఏళ్ల అనుభవం. అక్కడ పదవీ విరమణ అయిన వెంటనే ఇక్కడకు రప్పించాను పెద్ద జీతంతో! 


ఆమె గత సంబధాల మూలకంగానే 'జీనియస్' దృష్టిలో మా

సంస్థ పడగలిగింది. నిలబడగలిగింది.


గ్రీన్-రూంలో మిసెస్ కపర్దీ విద్యార్థులకు చివరి హెచ్చరి


కలు జారీ చేస్తున్నది. పదో తరగతి పిల్లలు హేమ్లెట్, దిగువ తరగతుల వాళ్ళు బెంగాలీ రవీంద్ర గీత్, పంజాబీ భాంగ్రా, ఒరియా ఒడిస్సీ... అందరికన్నా ముందు కిండర్గాడెన్ పసి మొగ్గలతో వందేమాతరం!


అన్నీ చక్కగా అమిరినట్లే... కదంబంలో పూలవరసలా!


కార్యక్రమ పర్యవేక్షణ కొచ్చిన బృందంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో జాతీయ స్థాయిలో నిష్ణాతులు. శ్యాంలీలా పర్షాద్, మాతంగి రమణ, బిజయ్మిశో, మదన్లాల్ కథేరియా, దివిజ శర్మ. దివిజ శర్మకు మాత్రమే కొద్దిగా తెలుగు భాషతో పరిచయం. 


తెలుగు తెలిసినవారు లేకపోవడం. నిజానికి ఒక అనుకూలమైన అంశం. ఒక తెలుగువాడు మరో తెలుగువాడిని ఎక్కిరానీయడన్న సామెత మనకుండనే ఉందిగదా! అదీ నా బాధ! 


తెర లేచింది.


'వందేమాతరం' అద్భుతంగా పేలింది. 


జ్యోతి ప్రజ్వలన అనంతరం మిసెస్ కపర్దీ చేసిన ఆంగ్ల ప్రసంగమూ అంతే..  'ఇంప్రెసివ్'! 


పావుగంట బాలే, అరగంట ఆంగ్ల నాటిక. 


హిందీ గీతమాలిక జరుగుతున్న సమయంలో దివిజ శర్మ వచ్చింది.


'మావాళ్లు మీ తెలుగు ప్రోగ్రామ్సు చూడాలనుకొంటు న్నారు. ఇంటర్మిషన్ తరువాత అవే అరేంజి చేయండి! ఒక గంట చూస్తాం' అంది.


నా గుండెల్లో రాయి పడింది. 


కార్పొరేట్ కల్చర్ కదా! హిందీ, ఇంగ్లీష్ లాంటి వాటిమీద మాత్రమే మోజుంటుందని అనుకొన్నాం!


'ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్  అంటే ఏదో మేనేజ్ చేయ గలంగానీ.. ఇప్పటికిప్పుడు గంటపాటు తెలుగు పోగ్రా మంటే ఎలా సార్?!' అని నాకే ఎదురు ప్రశ్న వేసింది మిసెస్ కపర్దీ!


'ఏదో ఒకటి మేనేజ్ చేయండి మ్యాడమ్! నెక్స్ట్ పోగ్రాం మాత్రం తెలుగులోనే ఉండాలి. ఏం చేస్తారో .. మీ ఇష్టం!' అని చెప్పి నా ఛాంబరుకి వచ్చేసాను.


వచ్చానన్నమాటేగానీ... మనసు మనసులో లేదు. పర్యవేక్షక బృందం ఏదో ఆంతరంగిక చర్చల్లో ఉంది... లంచ్ చేస్తూనే! వాళ్ల మధ్యలో దూరడం మర్యాద కాదుగనక


కాఫీ నా చాంబరుకే తెప్పించుకొని తాగుతూ కూర్చున్నాను. 


ఆరు దశాబ్దాల కిందట బెనారస్ యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పటి సంఘటన గుర్తుకొచ్చింది.


అవి నేను ఎమ్మెస్సీలో ఫిజిక్స్  చేసే రోజులు. అన్ని భాషల వాళ్లకి మల్లేనే తెలుగు వాళ్లకీ ఒక ప్రత్యేకమైన మెస్ ఉండేది.


ఓ చలికాలం ఆదివారం మధ్యాహ్నం భోజనాలు లాగించి

ఆరుబైట బండల మీద వెచ్చదనం కోసం కూర్చొని ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం తెలుగు విద్యార్థులం.


ఒక పొట్టి మనిషి, నుదుట పట్టెనామాలు... ముతక పంచి ... లాల్చీ. చేతిసంచీ ఊపుకొంటో మా మధ్యకొచ్చి నిలబడి, 'మీరంతా తెలుగు పిల్లలే కదుటోయ్! నాకో పని చేసి పెట్టాలి. ఓ గంటపాటు నేనో ఉపస్యాసం ఇచ్చిపోతా. తెలుగు తెలిసిన వాళ్లందర్నీ వెంటనే పోగేయాలి!' అన్నాడు! 


'ఈయనెవడ్రా  బాబూ! పిలవని పేరంటాని కొచ్చిందికాక ఉపన్యాసాలిస్తానంటున్నాడు!' అని మాకు ఒకటే ఆశ్చర్యం. 


మా బృందనాయకుడు సుబ్బరాజుకి మొహమాటం తక్కువ. పొట్టిమనిషి మొహం మీదే, 'తమరెవరు మహాను భావా?' అంటూ వెటకారంగా వెళ్లబోసాడు.


పొట్టాయన ఆ వెటకారాన్నేమాత్రం పట్టించుకోలేదు. ' మా తెలుగుతల్లికి మల్లెపూదండ!' పాట ఎప్పుడన్నా విన్నారుటోయ్? ఆ గీతాన్ని రాసింది నేనే!' అనేసాడు. 


ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి అప్పటికి నిండా పదేళ్లు కూడా నిండలేదు. జనంలో ఇంకా దేశభక్తి ఇప్పట్లా పూర్తిగా ఇంకిపోని కాలం. 'మా తెలుగుతల్లి' పాట చాలాసార్లు విని వుండటంచేత మా ఎదురుగా నిలబడి ఉన్నది శంకరంబాడి సుందరాచారిగారని తెలుసుకొన్నాం. అమాంతం గౌరవం పెరిగిపోయింది. 


సుబ్బరాజూ అందుకు మినహాయింపు కాదు. స్వరంలోని మునుపటి దురుసుతనం తగ్గించుకొని, 'ఇప్పటికిప్పుడు జనాలని పొగేయాలంటే ఎలా సార్?' అని నసిగాడు.


'సరేలేవోయ్! రేపు నాలుగ్గంటలకి పెట్టుకోండి. నేను నేరుగా మీ మీటింగు హాలుకే వచ్చేస్తా!' అంటూ చేతిసంచి ఊపుకొంటూ మాయమైపోయారు శకరంబాడి సుందరాచారిగారు.


తెలుగు సంఘం ఎన్నికలు ఎలాగూ దగ్గరపడుతున్నాయి. ఈ వంకతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేస్తే ఎన్నికల్లో అది తనకు ఉపయోగపడుతుందని సుబ్బరాజు ఎత్తుగడ. 


వాడి పూనికతో భారీగానే పోగయ్యారు జనం.


నాలుగ్గంటలకు అనుకొన్న కార్యక్రమం ఆరు గంటల గ్లానీ మొదలవలేదు. 


ఆలస్యానికి కారణం సుందరాచారి గారే! 


అందుకు క్షమాపణలైనా అడగలేదు. వచ్చీ రాగానే మైకు అందుకోబాయారు.


“ఇప్పుడు మొదలైతే ఎప్పటికయ్యేను? ఇంకో రెండు,   మూడు గంటలయితే మెస్సు కూడా మూసేస్తారు!" అంటూ సుబ్బ రాజు బిగ్గరగానే గొణుకుడు.


విన్నారులాగుంది పెద్దాయన - "తిండి కోసం వెంపర్లాడే

వాళ్ల కోసం కాదు నా ప్రసంగం. ఇష్టంలేనివాళ్లు నిక్షేపంగా

వెళ్లిపోవచ్చు... ఇప్పుడైనా... ఎప్పుడైనా!" అంటూ

మైకందుకొన్నారు.


ఆద్యంతం ఆయన ఉపన్యాసం సాగిన తీరు అత్య ద్భుతం. 


తెలుగు భాష విశిష్టతను గూర్చి సాగిన ఆ ప్రసంగం ఓ రసగంగా ప్రవాహం. తలమునకలా ఆ గంగలో తడిసి ముద్దవని తెలుగువాడు లేడు ఆ పూట .


తొలిఝాములో వినిపించే కోడికూతల నుంచి పొద్దు పోయిన తరువాత వీధుల్లో సంచరించే కుక్కల అరుపులు దాకా... ఆయన అనుకరించని జీవజాలం లేదు. పల్లె జీవనంలోని తెలుగుదనం, కమ్మదనం సుందరాచారిగారి స్వరంలో ఆవిష్కరణ అయిన వైనం మామూలు మాటల్లో వర్ణించనలవి కానిది.


తొలిసంజె వెలుగుల్లో ఇంటి గుమ్మాల ముందు రంగ వల్లులు తీరుస్తూ ఇంతులు పాడుకొనే పాటలు, కోడికూతతో లేచి పొలంబాట పట్టే రైతన్నలు ఆలమందలని అదిలించుకొంటూ తీసుకొనే కూనిరాగాలు, అత్తాకోడళ్లు, వదినామర దళ్లు రోటి పోటుల దగ్గర ఆడిపోసుకొనే సరదా సూటిపోటు పాటలు, పెద్దపండుగ సంబరాల్లో వీధివీధి తిరిగే హరి దాసయ్యల చిందులు, ఇంటిల్లిపాదిని ఆశీర్వదించిగాని పక్క గుమ్మం తొక్కని గంగిరెద్దుల ఆటలు.. శంకరాచారిగారి గొంతులోనుంచి అలా అలా జాలువారుతుంటే మెస్సు భోజనం సంగతి ఇంకేం గుర్తుకొస్తుందెవరికైనా?! 


' తప్పయి పోయింది స్వామీ! క్షమించండి' అంటూ సుబ్బరాజే చివరికి చేతులు జోడించాల్సి వచ్చింది. అంతకన్నా తమాషా. .  ఆయన అవేవీ పట్టించుకోకుండా అప్యాయంగా సుబ్బరాజును

అక్కున చేర్చుకోవడం! 


మెస్సు వాళ్లూ సభలోనే ఉండిపోవడంతో అందరికీ ఉపవాస బాధ తప్పిందనుకోండి ఆఖరికి!


ఆ రాత్రంతా సుందరాచారిగారు మా హాస్టలు గదిలోనే బస చేసారు. ఉపన్యాసం ఎంత ఉదాత్తంగా ఉందో... ఆ పూట ఆయన చెప్పిన మాటలు అంతకన్నా ఉత్తేజకరంగా ఉన్నాయి.


"తేనె లొలికే తెలుగు భాష సౌందర్యాన్ని వివరించి చెప్పడం నా బోటి వామనుడికి తలకు మించిన పని. అయినా కాని, చేతకాదని చేతులు ముడుచుకొని మూల వదిగే మనస్తత్వం కాదు నాది. కాబట్టే చేతనైనంతలో అమ్మ భాష కమ్మదనాన్ని నేల నాలుగు చరగులా ప్రచారం చేయడానికి  పూనుకొన్నది' అంటో చేతిసంచిలో నుంచి కొన్ని పుస్తకాలని తీసి పంచిపెట్టారు మాకందరికీ!


అదృష్టం కొద్దీ నాకూ ఒక పుస్తకం దక్కింది సుందరాచారిగారు స్వహస్తాలతో చేసిన సంతకంతో సహా! ఆ నాటి ఆ పల్లెపదాల పుస్తకం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.


పండిత పామర జనరంజకంగా తెలుగుభాష సౌంద ర్యాన్ని పుస్తకరూపంలో ప్రచురించాలని సుందరాచారిగారి ఆశయంట. 


అందుకోసం ఓ అయిదంచల ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకొనే నిమిత్తం  పెద్దలందరిని కలుస్తున్నారుట. 


అప్పట్లో హస్తినలో పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు.


" ఆయన్ని కలసి తిరిగి వెళుతూ తెలుగు పిల్లలు మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. తెలుగు ఎక్కడుంటే నేనక్కడ ఉండాలన్నది నా ఆకాంక్ష. తెలుగును ఎవరన్నా చిన్నచూపు చూస్తే నాకు తిక్కరేగుతుంది. వేల ఏళ్ల చరిత్రగల మన తెలుగు ఇతర భాషల దాష్టీకంవల్ల నష్టపోరాదన్నదే నా పంతం" అనిచెప్పుకొచ్చారాయన... ఆ రాత్రంతా నిద్ర మానుకొని... మమ్మల్ని నిద్ర పోనీయకుండా!


'ఇప్పటి నా కష్టాన్ని కూడా గట్టెక్కించడానికి రాకూడదా గురువుగారూ!' అనిపించింది నాకు ఆ క్షణంలో. . మరుక్షణంలోనే నా పిచ్చి ఊహకు నవ్వూ వచ్చింది.


ఎక్కడో ఓ కంఠం ఖంగున మోగుతుంటే ఈ లోకంలో

కొచ్చి పడ్డాను. 


"అదే గొంతు! అదే వాగ్ధార ! శంకరంబాడి సుందరాచారి గారిది! 


ఇక్కడికి ఎందుకొస్తారు? ఎలా వస్తారు? నా భ్రమ కాకపోతే? 


లేచి ఛాంబర్ బైటికి వచ్చాను. 

వేదిక మీద మైకు ముందు కార్యక్రమాలకని ఏర్పాటు చేసిన అలంకరణ విద్యుద్దీపాల వెలుగులో సుందరాచారిగారు కంచు కంఠంతో ఉపన్యాసం దంచేస్తున్నారు... తెలుగులో! 


తెలుగు రాని పర్యవేక్షక బృందం కూడా మంత్ర ముగ్ధ అయినట్లు  వింటోంది! కనురెప్ప కొట్టడం కూడా మర్చి పోయేటంతగా కనికట్టు చేస్తున్నది ఆ మాట... పాట... ఆట!


మధ్య మధ్యలో ఆంగ్ల పదాలతో... హిందీ పద ప్రయోగా లతో... సంస్కృత శ్లోక భూయిష్టంగా తెలుగు భాష ఔన్నత్యాన్ని గూర్చి ఆయన చేసే ప్రసంగం అచ్చు శంకరం బాడిగారి శైలిలోనే ఉద్వేగంగా ఉరకలేస్తోంది! 


' మంచి ప్రసంగం!’ అంటూ మధ్యలో దివిజ శర్మ లేచొచ్చి

నన్ను అభినందించడంతో ఫలితం సగం తెలిసిపోయినట్ల

యింది.


శంకరాచారిగారి ఉపన్యాసంలోని చాలా అంశాలు నాకే చురకలు అంటించే విధంగా ఉన్నాయి. 


' ఐ నెవ్వర్ స్పీక్  ఇన్ తెలుగు' అని రాసిన పలకలు పసిపిల్లల మెడల్లో వేయడం కన్నా అమానుషం మరోటుందా? మాతృభాష ప్రాముఖ్యం తెలీని మూర్ఖులు చేసే వికృత చేష్టలవి. పసిబిడ్డల్ని తల్లిభాష నుంచి వేరు చేయాలనుకోవడం తల్లి నుంచి వేరుచేయడ మంత పాపం. పరిసరాల నుంచి సహజసిద్ధంగా అబ్బే సంపద తల్లి భాష ద్వారా అందే విజ్ఞానం. దానికి దూర మయే బిడ్డ భాగ్యశాలి  ఎలా అవుతాడు? బాల్యంలో అమ్మ భాష సాయంతో లోకాన్ని అర్థం చేసుకొన్నవాడే ఎదిగి వచ్చిన తరువాత కొత్త భాషల సారాన్ని జుర్రుకొనేది. భాషా వేత్తల నుంచి, మానసిక శాస్త్రవేత్తల దాకా అందరూ నిర్ధారి స్తున్న సత్యం ఇదే! 


ఇహ తెలుగుకి వద్దాం! ఇటాలియన్ భాషకి మల్లే పదం చివర హఠాత్తుగా విరగని మంచి గుణం తెలుగుకి వరం. వేదాలు ఆదిలో తెలుగులోనే ఉన్నాయని ఊహించడానికి ఈ సంగీత గుణమే కారణం. ఏ భాషాపదాన్నయినా తల్లి బిడ్డను పొదువుకొన్నట్లు పొదువుకోగలదు తెలుగు భాష. సంగీతంలోని ఏ శబ్దానికైనా తెలుగంత సమీపంలోకి రాగల ద్రవిడ  భాష మరొకటి లేదు. కంప్యూ టర్లో వాడే బైట్స్ పరిజ్ఞానానికి తెలుగంత అనుకూలత ఆంగ్లానిక్కూడా లేదని ఏనాడో 'సైన్స్ టుడే' లాంటి వైజ్ఞానిక పత్రికలు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించాయి. 


జనం నాలుకల  మీద సహజంగా పలికే భాషలో చెబితేనే ఏ విషయమైనా చొచ్చుకుపోవడం సులభమవుతుంది. క్రైస్తవ మత ప్రచారకుల నుంచి, శైవ మత ప్రచారకుల వరకు అర్థమయిన ఈ విశేషం  మన తెలుగు నవనాగరీకులకు  ఎందుకో తలకెక్కడం లేదు! 


ఆంగ్లం పట్టుబడకపోతే నేటి పోటీ ప్రపంచం ధాటికి తట్టుకోవడం కష్టమని తల్లిదండ్రుల భయం. ఆ భయం అర్థం చేసుకోదగ్గదే! కానీ... అందుకోసం బిడ్డ కడుపులో పడ్డనాటినుంచే ఏబిసిడిలు తప్ప మరోటి 'అనరాదు... వినరాదు... కనరాదు' అని ఆంక్షలు విధించ డమే విడ్డూరం! వసతో పాటు ఆంగ్లాన్ని రంగరించి పోయాలన్న తల్లిదండ్రుల ఆతం చూస్తే నవ్వొస్తోంది. కోపమూ వస్తోంది. 


అభివృద్ధికి ఆంగ్లానికి ముడిపెట్టేవాళ్ళు చైనా, రష్యాల్లాంటి దేశాల ప్రగతికి ఏం సమాధానం చెబుతారు?! సొంత భాషంటే - సొంత ఉనికిని చాటే ప్రకటన. తమిళుడికి తమిళమంటే ప్రేమ. కన్నడిగుడికి కన్నడమంటే ప్రాణం. మరాఠీ వాడికి మల్లే మనమూ మన భాషను ఠీవికి దర్ప ణంగా ఎందుకు భావించమో అర్థం కాదు! 


పిల్లల కాదు... ముందు బుద్ధి రావాల్సింది పెద్దలకి, తల్లిదండ్రులకి, విద్యా వేత్తలకి! ముఖ్యంగా ఈ తెలుగు గడ్డ మీద! ఆ ముక్క. చెప్పిపోదామనే నేనిక్కడ దాకా వచ్చింది' అంటుంటే హాలు హాలంతా కరతాళ ధ్వనులతో మిన్నుముట్టింది.


'స్టాండింగ్ ఒవేషన్' ఇచ్చిన వాళ్ళలో పర్యవేక్షక బృందమూ ఉంది.


'జీనియస్' సంస్థ నగర ఫ్రాంచైసీ మా 'విద్యారణ్యకే దక్కిందని వేరే చెప్పవల్సిన పని లేదనుకొంటా. 


అరవై ఏళ్ళ కిందట పిలవని పేరంటానికి వచ్చి మమ్మల్నంతా మంత్రముగ్ధుల్ని చేసారు శంకరంబాడి సుంద రాచారిగారు. 


మళ్ళీ అదేతరహా మాయాజాలం చేసి మమ్మల్ని గట్టెక్కించి పోవడానికి రావడం ఎలా సంభవం?!


ఎవరు పిలిచారని ఇక్కడి దాకా వచ్చి తెలుగు ఔన్నత్యంతో పాటు అవసరాన్ని గురించి కుండబద్దలు కొట్టినట్లు! 


వేదిక మీద ప్రసంగం చేసిన సుందరాచారిగారు సుంద రాచారిగారు కాదు. ఆ ద్రోణాచార్యుడి ఏకలవ్య శిష్యపరమాణువు..  రామాచారిగారుట! 


గంటపాటు తెలుగు కార్యక్రమం సమర్పించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మిసెస్ కపర్దీకి ఠక్కు మని గుర్తుకొచ్చిన ఆపద్భాంధవుడు ఆయన. మిసెస్ కపర్దీ పూర్వం పనిచేసిన కార్పొరేట్ విద్యాసంస్థలో ఆంగ్ల ఉపాధ్యా యుడు. పిల్లలకి ఆంగ్ల పాఠాలు చెబుతూనే తెలుగు భాష గొప్పతనాన్ని గురించీ కథలు, పాటలు, పద్యాలు చెబుతుండే వాడుట! ఆ విషయమై యాజమాన్యంతో గొడవలైతే ఉద్యోగం వదులుకోవడానిక్కూడా సిద్ధపడ్డాడుట!


‘పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆంగ్ల, తెలుగు సబ్జెక్టుల్లో తర్ఫీదు ఇచ్చే ఏదో కోచింగు సెంటర్లో అత్తెసరు జీతానికి పొట్టపోసుకొంటున్నాడు ప్రస్తుతం' అని మిసెస్ కపర్దీ వివరించింది.


రామాచారిగారు చేసిన ఉపకారానికి తృణమో పణమో

ఇద్దామనుకొన్నాను. 


తృణంలాగే తృణీకరించాడా సాయాన్ని!


 పణంగా కోరిన కోర్కె మాత్రం విచిత్రమైనది. 


"మీ ఉదయం పూట పార్థనల్లో 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' పాట పాడించండి చాలు! అలాగైనా పిల్లలకు 'మన తెలుగు భాషం'టూ ఒకటుందని మన్నన ఉంటుంది" అనేసాడు.


ఆ పని ఎటూ నేను చేయాలనుకొన్నదే! పాఠ్యప్రణాళికతో నిమిత్తం లేకపోయినా మాతృభాషను కనీసం ఐదు తరగతుల వరకైనా ఐచ్ఛికంగా  నడపడానికి  సిద్ధపడ్డ పిల్లలకే మా విద్యారణ్యలో ప్రవేశం. 


ఆ నిబంధన విధించడానికి అంగీకరించిన తరువాతే 'జీనియస్ సంస్థ ' మాతో టైఅప్ అవడానికి సిద్ధపడింది.


'తెలుగు విభాగానికి రామాచారిగారినే బాధ్యులని చేస్తే సరి. సుందరాచారిగారే మన మధ్య మసలుతున్నట్లుంది గదా సార్!' అని సలహా ఇచ్చింది మిసెస్ కపర్దీ. 


మంచి సూచన. 


'తెలుగు ఎక్కడ ఉంటుందో తనక్కడ ఉండాలన్న గురువు గారి ఆకాంక్షా నెరవేర్చినట్లుంటుంది' అనిపించింది నాకు. 


' అది సరికాదేమో సార్! సుందరాచారిగారిలాంటి వాళ్ళెక్కడ ఉంటే అక్కడ మాత్రమే తెలుగు వినబడే పరిస్థితి వచ్చిందేమో!' అన్నాడు రామాచారిగారు ఆ తరువాత కలిసి నప్పుడు!


కాదనగలమా!?


( గమనిక: ఈ కథలోని శంకరంబాడి సుందరాచారి కీ.శే ' తెలుగు తల్లి ' గీతా కర్తలు శ్రీ శంకరంబాడి సందరాచారి కాదని గమనిక . కథలోని పాత్ర కేవలం కల్పితం ) 


- కర్లపాలెం హనుమంతరావు 

( రచన - మాసపత్రిక - అక్టోబర్ - 2016 - సంచికలో ప్రచురితం ) 



























కొత్త రచయితా!.. కొంచెం జాగ్రత్త! - కర్లపాలెం హనుమంతరావు ( మే 2009 విపులలో ప్రచురితం ) - కథానిక





  కథానిక: 

కొత్త రచయితా!.. కొంచెం జాగ్రత్త!

- కర్లపాలెం హనుమంతరావు 

( మే 2009 విపులలో ప్రచురితం ) 


యువ రచయితలకు శుభవార్త! పబ్లిషర్ల, పత్రికల ఆదరణకి నోచుకోని సోదరులారా! మీ మంచి కథనొకటి ఎంచి మాకు పంపించండి. జనవరి ఒకటికి మేము వెలువరించబోయే సంచికలో ప్రచురించటమే కాకుండా, తగిన పారితోషికమందిస్తాం. మీ ప్రతిభను వెలుగులోకి తెచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ముందు ముందు మీతో సాహిత్య సంబంధాలను బలపరచుకునేందుకు వీలుగా, ఉత్తర ప్రత్యుత్తరాల కోసం తగినన్ని తపాలా బిళ్ళలు జతచేయటం మరవకండి.  మీ ఉత్సాహమే మాకు ప్రోత్సాహం


జి. గురునాధం

సాహిత్యసాగర్

బొగ్గులకుంట 

18.9.2008


*******


జి. గురునాథం 

సెక్రటరీ

సాహిత్యసాగర్


శతకోటి నమస్కారాలు! 

 'బాకా' పత్రికలో మీ ప్రకటన చూశాను. ఎంత ప్రతిభ వున్నా ఏ  పత్రికా ఉదారంగా కొత్తవారిని ఏ ఆదరించని ఈ రోజుల్లో, మీరు తలపెట్టిన సాహిత్యసాగర్ ఉద్యమం మాబోటివారికి ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. 


'శివం' అనే ప్రసిద్ధ రచయితతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. అతని రచనలు అచ్చుగాని పత్రిక లేదు. ప్రచురణ కర్తలు అతని నవలల కోసం వేధించటం నేనెరుగుదును. నిజానికి అతను రాసేదంతా వట్టిచెత్త. వాటి వెంటబడే పత్రికలు, ప్రచురణకర్తలు రచనలను నా కనీసం వేలైనావేసి ఎందుకంటుకోవటం లేదో తెలీదు! 


నా 'పిచ్చి' కథ జతచేస్తున్నాను. ఇది చదివితే మీకే తెలుస్తుంది నా ప్రతిభ. మీ దయవల్ల నా పిచ్చి వెలుగులోకొస్తే మీకు ఆజన్మాంతం రుణపడివుంటాను. మీరు కోరినట్లు తపాలా బిళ్ళలు జతచేస్తున్నాను. 


కొత్త సంవత్సరంలో వచ్చే మన కథాసంకలనం కోసం ఎదురుచూస్తూ.. 


సదా మీ సహకారాన్ని కోరుకునే

మీ (సంతకం) 

బిపాసా ( బొగ్గులకుంట పార్ధ సారథి) 

తేదీ: 21.9.2008


****************



సాహిత్య మిత్రులు బిపాసాగారికి 


మీ 'పిచ్చి' కథ అందింది. ప్రచురించగలం. 

మీలాంటి ప్రతిభావంతులు మా సాహిత్య సింధువులో ఓ బిందువైతే ఉచితంగా వుంటుందనే ఉద్దేశంతో, సభ్యత్వ ఫారాలు పంపిస్తున్నాం. ప్రాథమిక సభ్యత్వం వంద రూపాయలు. సంస్థ సెక్ర టరీ పేరున ఎమ్. ఓ చేసి ఆ రసీదును, నింపిన ఫారాలతో జతచేయటం తప్పని సరి. 

మా సంస్థ నియమ నిబంధనల ప్రతి వి.పి.పి. ద్వారా పంపుతున్నాం. ఐదువందలు ఇచ్చి విడిపించుకోవాలని మనవి.


జి. గురునాథం

సెక్రటరీ; సాహిత్య సాగర్, 

బొగ్గులకుంట,

25.9.2008


పి.యస్: కథా సంకలనం ఏర్పాట్లలో ఉన్నట్లు తెలియ చేయటానికి సంతోషిస్తున్నాం. 


***************


గౌరవనీయులైన జి. గురునాథంగారికి, 


శతకోటి వందనాలు

మీరు కోరినట్లు సాహిత్యసాగర్ సంస్థ సభ్యునిగా చేరుతున్నాను. ఎమ్.ఒ. రసీదు జతచేసిన సభ్యత్వ ఫారాలను స్వీక రించగలరు. ఈరోజే వచ్చిన వి.పి.పి. ని విడిపించాను. మీరు కొత్తవారిని స్వచ్ఛందంగా ఆదరించటమే కాకుండా, పారితోషికాలిచ్చి ప్రోత్సహించటం అపూర్వం.


పత్రికలు, పబ్లిషర్లు, సాహిత్య పీఠాధిపతులలాగా పెత్తనం చెలాయించకుండా సాహిత్యసాగర్ లాంటి సంస్థలు ఉద్య మాలు నిర్మిస్తే ఉచితంగా ఉంటుంది. ఆలోచించాలని మనవి.


కథా సంకలనంకోసం ఎదురుచూస్తూ


సదా 

మీ అభిమానాన్ని ఆశించే

బిపాసా 

తేదీ: 25.11.2008


****************


సంస్థ సాధారణ సభ్యులు బిపాసాగారికి 


సాహితీ అభివందనాలు

కథాసంకలనంలో ప్రచుణార్ధం ఆంధ్ర దేశం నలుమూలల నుండి వేలాది రచనలు వచ్చిపడుతుండటం వల్ల, పని వత్తిడి రెట్టింపయింది. ముందుగా ప్రకటించిన విధంగా జనవరి నాటికి కాక ఉగాదికి పుస్తక ప్రచురణ పూర్తవుతుందని భావిస్తున్నాం. 


పుస్తక ప్రచురణ ఈరోజుల్లో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంగా మారింది. అందుకే సభ్యులందరూ ఏడాది చందా ముందుగా కట్టి ఆర్థికంగా చేయూతనివ్వాలని అర్థిస్తున్నాం.


కథా సంకలనంలో ప్రచురించే ప్రతి కథకూ వెయ్యి నూట పదహార్లు పారితో షికంగా ఇవ్వాలని కార్యవర్గం తీర్మానించిందని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. ఒకాయిలు లేని సభ్యుల రచనలు మాత్రమే సంకలనంలో చోటుచేసుకొంటాయని గమనించగలరు.

మీ సహాయ సహకారాలనాశిస్తూ

జి. గురునాథం



అనంతపురం, 

3.2.2009


నమస్కారం.

పుస్తక ప్రచురణ వ్యవహారంలో తలము నకలవుతున్నందువల్ల, జాబు రాయటం కాస్త ఆలస్యమయింది. అన్యథా భావించరని తలుస్తాను.


ప్రచురణ పని దాదాపు పూర్తయింది. కవరు పేజీ హైదరాబాదు పల్లవి గ్రాఫిక్స్ లో తయారవుతుంది.


సాహిత్య ప్రచురణతో పాటు ప్రచారం కూడా సంస్థ లక్ష్యాలలో ఒకటి. కాబట్టే అందంగా అచ్చొత్తించిన ఈ సంకలనం అందరి చేతుల కందేవిధంగా ఏర్పాట్లు అవుతున్నాయి.


సభ్యుల జీవిత విశేషాలను ఫోటోతో సహా ఈ పుస్తకంలో పొందుపరచాలని సంస్థ తీర్మానించింది. సమయం తక్కు వగా ఉన్నందువల్ల, మీరు వెంటనే మీ పాస్పోర్ట్ సైజు ఫోటో బ్లాక్ మేకింగ్ ఛార్జీలు వందరూపాయలతో సహా పంపాలని మనవి. వారం రోజులలోగా అందితేనే, సంకలనంలో  ప్రచురించటానికి వీలవుతుందని గమనించగలరు. 

ఇట్లు

మీ

జి.గురునాథం 

*************


తేది: 27.8.2009

శ్రీ బిపాసా గారికి, 


నమస్కారం

పుస్తక ప్రచురణ పూర్తయిందని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం, ముందుగా నిర్ణయించిన ప్రకారం పారితోషికం నగదు రూపంలో కాకుండా  వస్తకాల రూపంలో అందజేస్తే ఉచితంగా ఉంటుందని సంస్థ భావిస్తున్నది.   పుస్తకం విలువ రూ. 200/ గా నిర్ణయించాం. తక్కువలో తక్కువ పది కాపీలను పంపటం ద్వారా పారితోషికాలను చెల్లించాలని సంస్థ తీర్మానించింది. పదిరోజులలోపు మీరు మీకు కావాల్సిన కాపీల విలువను (సభ్యులకు మాత్రమే ఈ సదవకాశం) ఎం.ఒ. చేస్తూ రసీదును జతచేయాలని మనవి. విడి కాపీలను పంపటం కుదరదని

గమనించగలరు.


సాహిత్య ప్రచారోద్యమంలో భాగంగా, మీనుండి ఎంవో రసీదు అందిన వెంటనే మీరు కోరుకున్నవారికి మేమే నేరుగా తపాలాఖర్చులు భరించి పంపగలం. గడువుతీరిన తరువాతగానీ, కాపీలు అయిపోయిన తరువాతగానీ ఈ సదు

పాయం నిలిచిపోతుందని గమనించగలరు


మీ ఆర్డరుకోసం ఎదురు చూస్తూ.. 


జిగురునాథం. 


పి. యస్: తపాలా ఖర్చులుపోను, పారి తోషికంలో మిగులు ఉంటే  ఆ విలువకు సరిపడా మీకు పుస్తకం కాపీలు పంపిస్తామని గమనించగలరు. 


****************************************


 బిపాసా ( బి.పార్థ సారథి ) 

బొగ్గులకుంట 

11.8.2000


సాహితీ మిత్రులు శివంగారికి ,


నమస్కారం. 


చాలాకాలానికి మీకు ఉత్తరం రాసే అవకాశం కలిగింది. నేను బొగ్గులకుంట పార్థసారథిని, బిపాసా నా పెన్నేమ్ గుర్తు కొచ్చారని ఆశిస్తాను.


కాకినాడ బ్రాంచిలో కలిసి పనిచేశాం. ఆ రోజుల్లో మనిద్దరి మధ్య తరచూ వివాదం చెలరేగుతూ  ఉండేది. పత్రికలుగానీ, పబ్లిషర్లుగానీ పేరుకే గాని, రచనలకు విలువ ఇవ్వరని నేనంటే మీరు నా వాదనను ఖండించేవారు. 


రచయితగా నేను మీకన్నా సీనియర్.  ' రచన'  నుంచి ' రసికప్రియ ' వరకు నేను నా కథలను పంపించని పత్రిక లేదు. అచ్చేసుకున్న పత్రిక అంతకన్నా లేదు. అప్పటికే మీరు లబ్ధప్రతిష్ఠలయినందువల్ల, నాతో ఏకీభవించేవారు కాదు. మీ రచనలకు నా రచనలు ఏ మాత్రం తీసిపోవని గ్యారంటీగా చెప్పగలను. కానీ నాకు మీకున్నంత 'సర్కిల్'లేదు. ఆడపేరుతో రచనలు చేయలేను. ఏ పత్రికైనా.. పబ్లిషరైనా ఇంక నా కథలను ఎందుకు అచ్చువేస్తారు?


పత్రికల, పబ్లిషర్ల సాహిత్య పెత్తనం చెల్లిపోయే రోజులు రావాలని నేను కలలు కనేవాడిని. నా కల నిజం చేయటానికన్నట్లు 'సాహిత్యసాగర్' అనే సంస్థ ఉద్భ వించింది. కొత్తవారికి ప్రోత్సాహమిచ్చి వారి సామర్థ్యాన్ని లోకానికి చాటిచెప్పటానికి పూనుకొంది. అందులో భాగమే రెండురోజుల్లో మీకు చేరబోయే నా కథా సంకలనం. అందులో అచ్చయివచ్చిన నా 'పిచ్చి' కథను చదివి మీ అభిప్రాయాలను ఇకనైనా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇదే కథను తెలుగు పత్రికలన్నీ తిప్పిపంపటంలో ఒక్క తాటిపై నిలిచాయి!.. 'పిచ్చి' కథ అచ్చవకుండా ఆపటం ఏ పత్రిక తరమూ కాదు.


కథ చదివి మీ అభిప్రాయాలను రాస్తారనీ.. మీ రచనలకూ, నా రచనలకూ

వున్న భేదం గుర్తిస్తారని ఆశిస్తూ.. 

బిపాసా 

******************


విజయనగరం 

28.3.2009


మిత్రులు పార్థసారథిగారికి,


నమస్కారం. 

చాలాకాలం తరువాత మీనుండి వచ్చిన వుత్తరం ఆనందం కలిగించింది. కంటెంట్ చూసి బాధకలిగింది. సాహిత్యసాగర్ వారి నుండి కథాసంకలనం అందింది. కానీ.. అందులో మీ 'పిచ్చి' కథ లేకపోవటం చేత, నా అభిప్రాయం రాయలేకపోతు న్నాను. క్షమించండి! 


లాటరీ పద్ధతి మీద ఎన్నికయిన కథ లను మాత్రమే ప్రచురించామని ప్రకటించారు వాళ్ళు. మీ రచన లాటరీలో రాకపో వటం కాకతాళీయం అనుకోవాలేమో! కార్య వర్గ సభ్యులందరి రచనలూ 'లాటరీ’లో తగిలాయి మరి ! మీరు గమనించగలరు. 


లాటరీ పద్ధతిలో రచయితలను తయా రుచేయటం నిజంగా కొత్త పద్ధతే! ప్రచారా నికి సైతం ఈ సంస్థ ఎన్నుకున్న విధానం విలక్షణంగా వుంది! మీకు ఈపాటికే అర్థ మయివుండాలి... సాహిత్య సాగర్' పచ్చి వ్యాపారముఠా.  జి. గురునాధం అనే జిగురు నాథం కన్యాశుల్కం మార్క్ గిరీశాన్ని మించిన కిలాడీ. 


అచ్చులో పేరు చూసు కోవాలని ముచ్చటపడే మీ బోటి వారి బలహీనతను కేష్ చేసుకోవటానికి పకడ్బందీగా వాళ్లు అల్లిన ఉచ్చులో పడ్డారు మీరు. పత్రికల మీద , పబ్లిషర్స్ మీద అప్పట్లో మీకుండే కచ్చ, ఇప్పుడు ఉద్యమస్థాయికి కూడా ఎదిగినట్లు అనిపిస్తుంది. 


పేరున్నవాళ్ళకే ఆదరణ వుంటుందని మీ అభియోగం. ఎంత పేరున్న రచయిత అయినా మొదట్లో కొత్తవాడేగదా? మరెలా పత్రికలో చోటు లభించింది? పలుకుబడి వల్ల అంటారా? ఒప్పుకొంటాను. వాళ్ళు రాసే పలుకుబడిలోని బలంవల్లే ఆ స్థానం లభిస్తుంది. 

పత్రికలు, పబ్లిషర్లు పీఠాధిపతులకుమల్లే పెత్తనం చేస్తున్నారనే ఇంకో ఆక్రోశం మీకుంది. తేలికగా డబ్బు సంపా దించుకునే మార్గాలు కోకొల్లలుగా వున్న ఈ రోజుల్లో కూడా, చదువరుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న పరిణామక్రమంలో కూడా.. వాళ్ళు ఇలా పత్రికలు, పుస్తకాల ప్రచురణను నమ్ముకుని నానాకష్టాలు పడుతున్నారు అంటే కేవలం సాహిత్యాన్ని నమ్ముకునే సుమండీ! మీ రచనలు తరచూ తిరిగిరావటంవల్ల కలిగిన ఉక్రోషం మిమ్మల్ని ఈ నిజం వప్పుకోనీయటంలేదు. 


చివరగా ఒక్కమాట. ఒక పత్రిక ఒక కథను తిప్పిపంపితే అది దాని తప్పను కుందాం. మరి అదే కథను  అన్ని పత్రికలూ తిప్పిపంపుతూ వుంటే 'లోపం' ఎక్క డుందో ఆలోచించండి:


రచనలు చేయటం బ్రహ్మవిద్య కాకపో యినా.. గారడీవిద్య కూడా కాదు. సమాజాన్ని అన్ని కోణాలగుండా పరిశీలిస్తూ, సమ్యక్ దృష్టితో సాహిత్య విలువలను ప్రతిపాదిస్తూ, చైతన్యమార్గం వైపు వేలు చూపించేదే  నిజమైన రచన. పరిశీలన, పరిశోధన, మంచి మార్పు కోసం  ఆవేదన, భాషతో మంచి పరిచయం. కళాత్మకమైన అభిరుచి.. ఇన్ని వుండాలి రచయిత ఆవాలనుకునేవాడిలో! వట్టి  ఆవేశం, దుందుడుకుతనం మాత్రమే వుండే రచనలు కాలనికి నిలవవు. 


అచ్చులో పేరు చూసుకోవాలన్న మోజే మొదట్లో ఏ రచయిత చేతనయినా రచనలు చేయిస్తుంది. కానీ అదే బలహీనతగా మారకూడదు. పార్థసారథిగారూ! సారీ.. బిపాసాగారూ! రచయితకు కావాల్సింది వేదనే కాదు.. సాధన కూడా. అది మీలో ఇంకా పదును తేలలేదన్నం దుకు ఉదాహరణ మీరు ఉత్తరంలో రాసిన 'బేధం' అనే మాట. బికి వత్తో.. 'ద'కి వత్తో తెలీని దశనుండి.. మీరు మరింత పట్టుదలతో ముందుకు సాగి, అచిరకాలం లోనే మంచి రచనలు చేసి, నాకన్నా మంచి పేరు ప్రఖ్యాతులు ప్లస్ డబ్బు సంపా దించుకోవాలని ఒక నిజమైన మిత్రుడుగా నా కోరిక. 


నా సహాయ సహకారాలు ఎప్పుడూ వుంటాయని హామీ ఇస్తున్నాను.


అప్పటిదాకా సాహిత్యసాగర్ లాంటి తాయెత్తులు అమ్ముకునే వాళ్ళ వలలో పడ వద్దని నా సలహా! 


కొత్త రచయితా!.. కొంచెం జాగ్రత్త!


అభినందనలతో

మీ 

శివం


****************************************** 

- కర్లపాలెం హనుమంతరావు 

- మే 2009 విపుల ప్రచురితం 

















మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...