హృదయతంత్రుల్ని
మీటి భావమాధుర్యాన్ని పంచే
విపంచి- కవి
కొరకంచు వంటి లోకానుభవం, రస బంధురమైన హృదయ స్థానం, కన్ను కలిగి
చరించే చిత్తం, గంభీరమైన భావ ప్రకటన కవిత్వానికి అవసరమైన
దినుసులు-
'కవిత్వతత్త్వ విచారము'లో
కట్టమంచి రామలింగారెడ్డి
హృదయ తంత్రుల్ని మీటి భావ మాధుర్యాన్ని పంచే విపంచి - కవి. మీన మేషాలు లెక్కించుకుంటూ, గుణ, సూత్ర బద్ధంగా, చెమటోడ్చి
చేసే రచన భౌతికశాస్త్రం అవుతుందేమో కానీ కవిత్వం మాత్రం కాదు. కాలేదు. కృత్రిమత్వానికీ మూర్తిమత్వం ప్రసాదించే అసాధారణ ప్రజ్ఞ (భావనా శక్తి) కవికి ఉండే ప్రత్యేక లక్షణం.
మానవులను మిగతా జీవరాశినుంచి విడదీసి ప్రత్యేక జాతిగా
నిలబెట్టే ప్రాకృతిక గుణాలు
1. ఆలోచనలు(Thinking) 2. భావాలు(Feeling) 3. సంకల్పాలు(Willing).
భావాలను ఉత్తేజపరిచే గుణం
అధికంగా గల వ్యక్తికే కవిత్వ లక్షణాలు అలవడేది. కవిత్వం ఏ నిర్వచనానికీ
అందని ఒక బ్రహ్మపదార్థం. ఒకడు కేవలం కవి మాత్రమే ఎందుకు కాకుండా ఉండ లేడో.. మరొకడు
ఎంత ప్రయత్నించినా కవిగా ఎందుకు మారలేడో అంతుబట్టని వింత. కవికి మాత్రమే ఉండవలసిన ప్రత్యేక లక్షణాలు ఏవో
కవులనైజంలో ఉండి ఉండాలి.
ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే అది భౌతికశాస్త్ర సిద్ధాంతం అవుతుంది. కన్నది కన్నట్లుగా వ్యక్తీకరిస్తే అది కవిత్వ రసాయానికి చెందుతుంది. ఉన్నదానికీ, కన్నదానికీ మధ్య ఒక సన్నని
తెర ఎప్పుడూ కదలాడుతూ ఉంటుంది. ఆ తెరను తొలగించుకుని మరీ సత్యశోధనకు తాపత్రయపడే తత్వం శాస్త్రజ్ఞుడిదైతే.. తెరకు ఈవలి వైపునే నిలబడి కంటికి కనిపించే దృశ్యాన్ని కమనీయంగా వర్ణించే నైజం కవిది. కవికి సత్యాన్వేషికిలాగా శుద్ధసత్యంతో నిమిత్తం లేదు. వాస్తవ నైజాన్ని గజం దూరం నుంచైనా సరే నిలబడి మనస్సనే సాధనంతో ఊహించే పని కవికి ఇష్టం.
బుద్ధిజీవులకు కవులభాష చాలా సందర్భాల్లో అసంబద్ధంగా చికాకు
పుట్టిస్తుండేది అందుకే. అయినా కొన్ని
సందర్భాల్లో ఆ కవిత్వమే తార్కికులకూ
సాంత్వన చేకూర్చే మంచి ఔషధం అవుతుంటుంది. అదే కవిత్వం విశేషం.
కవిత్వానికుండే మరో ప్రత్యేకమైన మంచి లక్షణం చంచలత్వం..
దాని మూలకంగా సంతరించే తాజాదనం. ఒకే వస్తువును కొన్ని నిర్దేశిత సూత్రాలకు లోబడి పరీశీలించగలిగితే ఒకే వస్తువు లాగా నిర్థారించడం అసంభవం కాదు. కానీ
ఒకే వస్తువు కవులందరికీ ఒకే విధంగా కనిపించదు. ఆ మాట కొస్తే అదేవస్తువు అదేకవికీ అన్నివేళలా ఒకే రకంగా కూడా కనిపించదు. కాళిదాసునే
మేఘదూతం మళ్ళీ తిరగరాయమంటే సరిగ్గా అలాగే రాయగలడని భరోసా లేదు. చూసే సమయ సందర్భాలను బట్టి, ఆ సమయంలో ఉండే రసస్థాయి ఆధారంగా కవి వ్యక్తీకరణ ధోరణులు మారుతుంటాయి. ఆటంబాంబు నిర్మాణసూత్రానికి మల్లే ఆడదాని ప్రేమభావనకి ఓ శుద్ధ నిత్యసత్య సూత్రం ఆవిష్కరించడం ఆమెను పుట్టించిన బ్రహ్మకైనా సాధ్యమవుతుందా? అటువంటి అసాధ్యతలోనే కవిత్వపు అసలు తాజాదనపు సౌరభరహస్యం దాగి ఉంది. గురజాడవారి మతం ప్రకారం ఆకులందున అణగి మణగి కూయడమే కవిత్వపు భావనాశక్తి అసలు సిసలు సౌందర్యం.
భావనాశక్తి పలుమాయలు పన్నగల లీలా వినోదిని- అంటారు కట్టమంచి రామలింగారెడ్డిగారే 'కవిత్వతత్వవిచారము'లో మరో చోట. నిజమే. కవి తన హృదయంలో అప్పటికి ఉప్పతిల్లిన భావాల అధారంగా చదువరిచేత రూపసందర్శనం చేయిస్తాడు. కవి సమకూర్చిన దూరదర్శినితోనే చదువరికి వ్యోమసందర్శనం చేయక తప్పని పరిస్థితి. ఆ సందర్శనకు సత్యసంధతతో నిమిత్తం లేదు. రసానుభూతి మాత్రమే అంతిమ లక్ష్యం.
ఆంగ్లకవి టెన్నిసనులాంటి మహానుభావులైతే తమ అసమాన ప్రజ్ఞా పాటవాలతో నందిని పందిలాగా, పందిని నందిలాగా సైతం చూపించ గల సమర్థులు.
విద్యుత్తరంగాల వేగంతో పాఠకుడి మనోయవనికమీద ఒక అత్యద్భుతమైన చలనచిత్రాన్ని ప్రదర్శించ గల గడసరులు.
మరుపురాని, అనిర్వచనీయమైన అనుభవాన్ని అందించడమే కవిత్వం అంతిమలక్ష్యం.
కాళిదాసులు, భవభూతులు, పోతనలు, జాషువాలు, నాజర్లు, గద్దర్లు.. జనం నాలుకల మీద ఈనాటికీ నాట్యం చేస్తూనే ఉన్నారంటే.. అలాంటి
చిరంజీవత్వం కలగడానికి
కవిత్వానికి ఎంత ఉపజ్ఞత కావాలి! ఆ ఉపజ్ఞతను సృజించే కవి ఎంత సుకృతం చేసుకుని ఉండాలి!
వాల్మీకి లేనిదే రాముడు లేడు. వ్యాసులవారు
పూనుకోక బోయుంటే గీతాచార్యుడి ఆనవాలే మనకు దొరికి ఉండేది కాదు. తిక్కన అంత అద్భుతంగా కవిత్వరీకరించబట్టే పాంచాలి లోకపరీక్షకు
తట్టుకుని గొప్ప సాథ్విగా నిలిచింది. పెద్దనగారి బుద్ధికి ప్రవరాఖ్యుడు, సూరనగారి సంగీత ప్రజ్ఞకి శుక్తిమతి, తెనాలి
రామలింగ కవి చతురతకి సుగుణశర్మ పెద్దక్క.. ఇలా.. నాటి చేమకూర కవి విజయవిలాస కథానాయిక సుభద్ర నుంచీ ఇటీవలి
గురజాడవారి కన్యాశుల్కం తాలూకు మధురవాణి వరకూ సహృదయుల మనసుల్లో శాశ్వతంగా గూడు కట్టుకుని ఉన్నారంటే.. ఆ పుణ్యమంతా ఆయా కవుల ప్ర్జ్ఞజ్ఞా పాటవాలదే. భూమి గుండ్రంగా ఉందన్న విశ్వాసం మరో సిద్దాంతం వచ్చి రద్దై పోవచ్చునేమో కానీ.. 'భూమిపుత్రిక సీత రాముని
ఏకపత్నీ వ్రతానికి భూమిక' అన్న నమ్మకం ఎన్ని యుగాలు గడిచినా
జనం గుండెలనుండి చెదరిపోదు.
శాస్త్రవేత్తలకు ఉండే పరిమితులు కవులకు
ఎందుకు ఉండవో.. కవులు భౌతిక సత్యాన్వేషకులకన్నా ఒక మెట్టు ఎప్పుడూ పైనే
ఎందుకుంటారో ఈ ఒక్క ఉదాహరణ తరచి చూస్తే చాలు తేలిపోతుంది. కాటికి సాగనంపిన పిదప.. ఫొటోచట్రాల్లో
బిగించడంతో కన్నవారి రుణం
తీరిపోతున్నట్లు నేటితరాలు భావిస్తున్న
పిదప కాలంలో ఏ రక్తసంబంధమూ లేకపోయినా గుండెల్లో గుడులు కట్టించుకుని మరీ రాముళ్ళూ, కృష్ణుళ్ళూ, సీతలూ,
సావిత్రులూ.. జనం నీరాజనాలు అందుకుంటున్నారంటే .. ఆ
వైభవ ప్రాభవాల వెనకున్నదంతా ఆయా పాత్రల్ని సృష్టించిన కవుల కలాలచలవే.
కవిగా పుట్టడం ఒక వరం. కొంచపడవలసిన అవసరం లేదు. వేలాదిమందిలో ఏ ఒకరికో గాని ఈ శారదాప్రసాదం లభించదు. ఆయాచితంగా లభించిన ఈ ఉపజ్ఞతావిశేషాన్ని మానవత్వపు విలువలు మరింత పెరిగే రీతిలో ఉపయోగించుకునే భాధ్యత మాత్రం కవులదేనని మరిచి పోరాదు*
కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు ఆధ్వర్యంలోని తెలుగు వెలుగు మాసపత్రికలో ప్రచురితం)