పెరుగుట (నడ్డి) విరుగుట కొరకే!
తెలుగువాడు పాలిటిక్సులో ఎంత చురుకో.. పాకశాస్త్రంలో అంతకు
మించి చురుకు! తింటే గారెలే తినాలనుకొనే
చాపల్యం తెలుగునాలికది.
నలుడికి, భీముడికి
నవగాయ పిండివంటలు రుచికరంగా చేయడం నేర్పింది తెలుగువాడే! పంచదారకన్న, పాలమీగడకన్న, జుంటి తేనియకన్నా, జున్నుకన్న, వెన్నకన్న,
దోరమాగిన మామిడికన్న తనపలుకే తీపిగా ఉంటుందని డప్పుకొట్టుకొంటాడు తెలుగువాడు. పాకశాస్త్రంమీద
ఎంతో పట్టు ఉంటేగాని ఇంతటి జ్ఞానవంతమైన 'ఉప్మా'నాలు
ఊహలకు తట్టవు సుమా!
పరమాత్మతత్వాన్ని పరిచయంచేసే ఆంధ్రభాగవతం మాత్రం?! సందుచూసుకొని మరీ బమ్మెర పోతనామాత్యుడు
గొల్లపిల్లల వేళ్ళసందుల్లోని మాగాయపచ్చడి పసందునుగూర్చి నోట నీరూరించే సుందరశైలిలో వర్ణించేసాడు. ఇహ
కర్పూరవిడియాన్నిగూర్చి కవిసార్వభౌములవారు
చెప్పుకొచ్చిన విశేషాలకు కొదవే లేదు!
'భరత ఖండా'న్ని ఒక చక్కని పాడియావుతో పోల్చాలన్న గొప్ప తలపు తెలుగువాడికికాక మరెవరికి తడుతుందబ్బా! చిక్కని పాలమీది మిసమిసలాడే మీగడను పంచదారతో
కలిపి నంచుకున్నట్లు రామామృత రూపలావణ్యాలను ప్రేమ దాస్యాలనే దోసిళ్లతో జుర్రుకొంటానం'టాడు భద్రగిరి రామదాసు! ‘ఓ రామ! నీ నామమెంత రుచిరా! ఎంత రుచి.. ఎంత రుచి.. ఎంత రుచిరా!’ అంటూ అన్నేసి
మార్లు చంటిపిల్లకు మల్లే లొట్టలేసేటంత చాపల్యం
తెలుగు నాలికకి కాక మరెవరి నాలిక్కుంటుందీ!
అలంకారాలలో ఉపమాలంకారం, పండుగల్లో అట్లతద్దె తెలుగువాడి ప్రత్యేకతలు. బిడ్డ- పేగు మెళ్ళో వేసుకొని
పుడితే మేనమామకు అరిష్టమని నమ్మకం. అయినా సరే.. కరకరలాడే గారెలుగాని ఓ బాండీడు దండిగా వండించి దండగా మేనబిడ్డ
మెళ్లో వేయించేస్తే సరి.. అరిష్టం గిరిష్టం చిటికెలో మటుమాయంట! ఎంత తిండిపోతులు
కాకపోతే తెలుగువాళ్లకి ఇంత వింతైన
చిట్కాలు తడతాయి!
బందరులడ్డు, కాకినాడకాజా, హైదరాబాదుబిర్యానీ.. ఊరుకో ఖాద్యంపేరు
తెలుగునాట! ఊళ్ళపేళ్ళకన్నా
తినుబండారాలపేర్లే తేలికైన బండగుర్తులు కాబోలు తెలుగుబుర్రలకు!
తెలుగు పిల్లలుకూడా 'కాకి- రొట్టె'లాంటి కథలంటేనే లొట్టలేసుకొంటూ వింటారు! 'తిండి
గలిగితే కండగలదోయ్! కండకలవాడేను మనిషోయ్!' అంటూ
గురజాడవారిదీ తిండిదండకమేనాయ! ‘రొట్టెముక్క,
అరటి తొక్క.. ఏదీ పక్కకు తీసిపెట్టేది కాద’ని రుక్కుల్లో మహాకవి
శ్రీ శ్రీ నే అంత నొక్కిచెప్పిం తరువాత ఇహ తెలుగువాడి
జిహ్వచాపల్యాన్నిగూర్చి వేరే చర్చ అవసరమా!
పరబ్రహ్మను సరే.. పకోడీలనూ వదలకుండా పద్యాలు అల్లేడే మన తెలుగుకవి! 'పీత్వా పీత్వా స్వర్గలోకమ్ అవాప్నుయేత్' అని ఓ కాఫీగత
తెలుగుజీవి కితాబు! అన్నట్లు రాగాలలో సైతం కాఫీరాగం అంటే
తెలుగువాడికెందుకో అంత ప్రత్యేకాభిమానం!
గోంగూర పేరు చెబితే గంగవెర్రులెత్తిపోతుంది తెలుగుమనసు. పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలాంటి దేశాలు
పట్టిపోతోంటే వాళకి ఏ
పచ్చళ్ళు ప్యాకు చేసి పెట్టాలా అని తెలుగుతల్లులు తల్లడిల్లిపోతుంటారు.
సాఫ్టువేరంటే ఇప్పుడొచ్చిందికానీ, అప్పట్లో
అంతర్జాతీయంగా తెలుగువాడికి
ఖ్యాతితెచ్చింది ఊరగాయ పచ్చళ్ళేగా! తెలుగువాడి గుత్తొంకాయకూరమీద ఇంతదాకా
ఎవరూ పరిశోధనకు పూనుకోలేదు! ఎంతాశ్చర్యం!
ఉల్లిచేసే మేలు తల్లికూడా చెయ్యదని కనిపెట్టింది కచ్చితంగా
తెలుగువాడే అయుండాలి. వేపాకును రెబ్బనుకూడా వదిలిపెట్టడు తెలుగువాడు. 'తినగ తినగ వేము తీయగనుండు' అని దానికీ ఓ ప్రయోజనం
సాధించిన మొనగాడు మన తెలుగువాడే!
'మాయాబజారు' చిత్రంమీద
ఆ తొలినాటిమోజు తెలుగువాడికి ఎన్ని తరాలు గడిచినా తీరిపోదు. ఎందుకో తెలుసా?
' పెళ్ళివారికని చేసిన వంటకాలన్నింటినీ ఘటోత్కచుడు వంటింట్లోదూరి
ఒక్కొక్కటే ఠకాల్ ఠకాల్మని లాగించేస్తాడు చూడండి! ఆ ఒక్క దృశ్యంకోసమే ఎన్నొందలేళ్ళయినా విసుగులేకుండా
తెలుగుప్రేక్షకుడు ఆ చిత్రాన్నాదరిస్తాడు!
ఆహా! ఆ 'వివాహ భోజనం'లోని అనుపాకాల పేర్లు విటుంటే చాలదూ.. తెలుగునోటెంట లాలాజలం గంగాజలంలా వరదలై వూరేందుకు!
పెళ్ళిని
పప్పన్నమని ముద్దుగా పిలిచేది ప్రపంచంమొత్తంమీద ఒక్క తెలుగువాడే!
అప్పుచేసైనా సరే పప్పుకూడు తినడం తెలుగువాడిలి తప్పుకాదు. పైపెచ్చు గొప్పకూడాను!
పిండివంటల ఊసులేకుండా ఏ తెలుగు పండుగైనా ఉంటుందేమో చెప్పండి చూద్దాం! ఒకానొకప్పుడు
పెళ్ళిచూపుల్లో మగపెళ్ళివారు ఆడపిల్లని అడిగే ముఖ్యమైన ప్రశ్నే'వంట'ను గురించి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని తెలుగువాడికి
తెలిసినంతగా మరో భాషవాడికి తెలుసా?
క్షీరసాగరమధన సమయంలో
నోరున్న తెలుగువాడుగాని ఉండుంటే అమృతం చిలకడానికన్నా ముందు ఓ
అరకప్పయినా కాఫీ కడుపులో పడాలని పేచీ
పెట్టుండేవాడు. తిండిపోతుపోటీలు
ఒలంపిక్సులో జరుగుతుంటే..
తెలుగువాడికే ఎప్పుడూ కప్పులూ సాసర్లూ!
తెలుగురాష్ట్రాన్ని 'పూర్ణగర్భ'గా చెప్పుకొని రొమ్మువిరవడం ఒక్క తెలుగువాడికే
చెల్లింది. రైతన్నను ‘అన్నదాత’ అని గౌరవించే సంప్రదాయం తెలుగువాడిదే! ఇప్పుడంటే ఎక్కడబడితే అక్కడ
మందుపాతర్లుకానీ.. మొన్న మొన్నటి వరకు అడుగడుక్కీ బియ్యంపాతర్లే కదూ కృష్ణాగోదావరీ
తీరాల్లో!
తెలుగువాళ్ళకు మల్లే తెలుగుదేవుళ్లకీ ప్రసాదాలంటే సాదాసీదా
ఇష్టం కాదు. తిరుపతి లడ్డుకు తిరుపతి వెంకన్నకున్నంత గ్లామరు! రుద్రాక్షమాల తిప్పే
సన్యాసిగాని తెలుగువాడైతేనా! 'ద్రాక్ష'
మాట చెవినబడంగానే దీక్ష .. గీక్ష జాన్తానై! పుంజాలు తెంపుకొని పరుగందుకోడూ!
పాల, మీగడలకోసం బాలగోపాలుడిచేత పోతన చేయించిన ఆగడాలు
అన్నా ఇన్నా?!
'ఇంతకీ ఈ తిండిగోలంతా ఇప్పుడు దేనికండీ?' అనికదూ తమరి సందేహం! కందిపప్పు కిలో వంద అందుకుంటోంది. ఎండుమిర్చి కిలో డెబ్బయ్ పైమాటే! వేరుశనగనూనైతే సెంచరీకొట్టి ఏడాది దాటింది! చక్కర
ధరవింటె నోరు చేదెక్కుతోంది! ఉల్లి కొనకముందే కంటికి నీళ్లు! పాతబియ్యం సామాన్యుడు
కొని తినే స్థాయిలో ఉన్నాడా?! అన్ని దినుసుల విహారం ఆకాశ
మార్గానే! ఎండల్లాగే
మండుతున్నాయి ధరలు. ఆ కడుపుమంట
చల్లారడానికేనండీ ఇన్ని తిప్పలు!
శ్రీకృష్ణపరమాత్ముడీ సీజన్లోగాని సీనులోకొచ్చుంటే
పదహారువేలమంది గోపికలను భరించలేక అర్థాంతరంగా అవతారం చాలించుండేవాడు! అన్నబలమే
అన్నిబలాలకూ మూలమన్నారు కదా పెద్దలు!
దశకంఠుడుగాని ఆ మాటవిని తన పదినోళ్లకు ముప్పూటలా ముద్దందంచాలనుకొంటే లంకను ఏ అమెరికన్ బ్యాంకుకో తాకట్టు పెట్టక
తప్పేది కాదు! ద్వాపరంలోకనక తలా ఓ వూరిస్తే చాలని కౌరవులతో కాళ్లబేరాని కెళ్ళారు
పాండవులు. అదే ఈ కరువుకాలంలో అయితేనో?! మినిమమ్ ఓ ఐదుమండలాలకు తగ్గకుండా డిమాండు
ఉండుండేది! బకాసురుడు రోజూ ఓ బండెడు అన్నం,
పప్పూ కూరలు, నంజుకుకునేందుకు ఓ మనిషి కావాలని
షరతు పెట్టాడు విరాటపర్వంలో! ఒక్క మనిషి
మినహా అన్నంకూరలను అంబానీసోదరులైనా కొని తట్టుకోగల స్థితిలో లేదు కాలం!
వేలు పోసినా నాలుగువేళ్ళూ నిమిషంపాటైనా నోట్లోకి పోవడం
గగనంగా ఉంది. పెరిగే ధరలను గూర్చి నిలదీస్తారని భయం! తిరుపతి గుళ్ళో భక్తుల్ని
స్వామివారిముందు కనీసం కనురెప్పపాటైనా
నిలబడనీయడం లేదు! ఈ కరువు కాటకాలిలాగే కొనసాగితే చివరికా భద్రాద్రిరాముడికి
కూడా 'శబరి' ప్రసాదమే
మహానైవేద్యమవుతుందేమో!
సౌదీ అరేబియాలో భర్తకు
చాయినీళ్ళు పోయని ఇల్లాళ్ళకు ఈజీగా
విడాకులిచ్చేయచ్చంట! ఇక్కడా అలాంటి గృహవిచ్చిన్నాలు ఘోరంగా పెరక్కముందే
ఉభయ సర్కారులు మేలుకొంటే మేలు.
కైలాసంలో మజ్జిగ దొరక్కే శివుడు నీలకంఠుడయాడని, వైకుంఠంలో
మజ్జిగ దొరికుంటే విష్ణుమూర్తి నల్లబడేవాడు కాడని. అమృతానికి బదులు మజ్జిగ్గాని
వాడుంటే స్వర్గాధిపతి మరీ అంతలా డీలా పడడని, మజ్జిక్కి దూరంగా ఉన్నందువల్లే లంబోదరుడికా బానబొజ్జ ప్రాప్తించిందని .. 'యోగరత్నాకరం' మొత్తుకొంటోంది.
ధరలు దారుణంగా పెరిగే రోజుల్లో 'పెరుగు' 'పెరుగు' అని
కలవరించకుండా ఓ కుండనిండా చల్లని మజ్జిగ చిలుక్కొట్టుకొని తాగితే వంటికి, ఇంటికి మంచిదని చిట్కా! మంచిదే కానీ.. ఆ పెరుగు వచ్చే పాలుమాత్ర్రం సర్కారుసారాలా
ధారాళంగా ఏమన్నా పారుతున్నదా దేశం నలుమూలలా?
మంది ఎక్కువైతే పెరుగు దానిపాటికదే మజ్జిగ అవుతుంది. నిజమేకాని, ధరలూ అలా ఆగకుండా ఆకాశంలోకి పెరుగుతూ
పోతుంటే ఆ మజ్జిగా చూరునీళ్లకన్నా జావగారొచ్చు! 'పెరుగుట విరుగుట
కొరకే' అంటారా! బాగుంది. ఆ విరగుడు
కార్యం జరిగే లోపల మన తెలుగు నడుములు విరక్కుండా ఉండాలి కదా తమ్ముళ్లూ!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- సంపాదకీయం పుట గల్పిక- 07-06-2009)
No comments:
Post a Comment