Tuesday, June 2, 2015


కూరగాయలు- క్రూరగాయాలు
బంగారంధర పడిపోయిందనో.. వెండిధర కొండెక్కిందనో గుండెలు బాదేసుకొంటున్నాం!  రోజూ కంచంలో పడే కూరముక్కలకు రెక్కలెలా మొలుస్తున్నాయో తలుచుకొనే  నాధుడే కనిపించడం లేదెక్కడా! ఏ నోటవిన్నా మండే ఎండల్నిగురించేగాని, మండిపోయే కూర మండీలను గురించి ఆర్తనాదాలేవీ!
మా పెద్దన్నయ్యగారమ్మాయి కొచ్చిన బంగారంలాంటి సంబధం ఈ పాడుకూరగాయల మూలకంగానే తప్పిపోయింది. కట్నాలు. కానుకలు, పెట్టుపోతలంటే.. ఎన్ని కోట్లయినా ఏదో తలతాకట్టు పెట్టైనా తట్టుకోవచ్చు. పెళ్ళివారికి ముప్పూటలా విందుల్లో క్రమం తప్పకుండా నాలుగు రకాల నవగాయకూరలు వండి వడ్డించాలంటే .. నడ్డి నిలబడేనా? రూపాయలంటే ఏదో తంటాలుపడి తెచ్చిపోయచ్చుగానీ.. కూరగాయలు ఏ దొడ్డిలో సృష్టించి తేగలం ఈ కటిక  కరువు రోజుల్లో?!
శ్రీకృష్ణుడంతటివాడు ద్వాపరంలో తూకంలో ఒక్క తులసాకుకే తూగాడంటే ఏమోలే.. పురాణం కథ కదా అనుకున్నాం. నిజమేంటో ఈనాటికి అనుభవపూర్వకంగా తెలుసుకొంటున్నాం. అప్పుడూ ఇప్పట్లానే ఏ మహా కరువుకాటకాలో వచ్చి పడుంటాయీ! అందుకే పాపం..  అంతలావు నవనీత ప్రియుడూ వట్టి తులసాకు రెబ్బకే సిబ్బెలోనుంచి దూసుకొచ్చేసాడు!  దేవుళ్లకీ తప్పలేదన్నమాట కరువుకాటకాల శాపం!
అంతకుముందు అవతారాల్లో మాత్రం? చెంచులక్ష్మి నరసింహస్వామంతవాణ్ణి పట్టుకొని 'చెట్టులెక్కగలవా.. ఓ నరహరీ? పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి చిటారుకొమ్మన చిగురు కోయగలవా?' అంటూ వెంటబడింది! కాబోయే దంపతులేగదా.. సరసాలకేదో అనుకొంటున్నారనుకొన్నాంగాని, సరసమైన ధరలకు చివరికి చింతాకు చిగురైనా దొరకనంత కరువొచ్చిపడిందని   తెలుసుకోలేక పోయాం. కనీసం కాయో కసరో ఐనా  పోగేసుకు రాలేని పోరణ్ని చెసుకొంటే  సుఖపడేదేముండదన్న జ్ఞానం ఆ నాటి అడవిపిల్లలకే  వచ్చేసిందన్న మాట!
ఇప్పుడూ అదే వరస! అబ్బాయి ఏ ఐఐటీనో చదివి గొప్ప ఉద్యోగంచేస్తున్నా నెలకెన్ని లక్షలు  తెచ్చిపోస్తాడని కాదు ఆడపిల్లలు చూస్తున్నది.  వారానికో సారైనా కనీసం కూరలోకి  క్యాబేజీ పూవైనా కొని తేగల మొగాడేనా మగడు?'అని చూసుకొంటున్నారు!
కాకిముక్కుకి దొండపండని  ఎద్దేవా చేసేరోజులు వెళ్ళిపోయాయమ్మా! ముక్కుకి దొండపండుంటే కాకి అయినా సరే కోకిలకన్నా  రేటెక్కువ పలికే రోజులు నాయనా! ముదిరితే బ్రహ్మచారి పనికి రాడేమోగాని..  ముదురుదో, ముచ్చదో అసలు ఏదో  కూరగాయంటూ ఓటి కంటబడితే చాలు బ్రహ్మానందపడిపోయే రోజులు బాబూ ప్రస్తుతం  తన్నుకొస్తున్నవి! బిడ్డల్ని బంగారుకొండలని కాదు.. 'బంగాళాదుంప గంపల'ని గారాబంచేసే రోజులొచ్చి పడ్డాయి మరి! గాభరా పడితే ఎలా?
నిండుసభలో చెల్లమ్మకు పరపరా చీరెలు తానులకొద్దీ సరఫరా చేసిన నల్లనయ్యయినా సరే.. ఆ ముద్దుల చెల్లాయి సర్దాగా 'ఓ తట్ట కూరగాయలు తెచ్చి పెట్టరాదా!' అనడిగితే? తెల్లమొగమేయడం ఖాయం! అంతలావు కటిక కరువురోజులొచ్చి పడ్డాయి చివరకు!
అక్షయపాత్ర మాహాత్మ్యం ప్రస్తుత కాలంలో చెల్లనే చెల్లదు. మొన్న కార్తీకమాసంలో మా కాలనీవాసులు వనభోజనాలని ఓ.. ఒహటే ఊగిపోయారు! కానీ చివరాఖరికి ఉసిరావకాయ పిసరంతైనా   నాలిక్కి రాసుకోకుండానే 'భోజనాంతకాల గోవిందనామస్మరణలు' కొట్టుకొన్నారు!
మొన్నటి దసరా పండక్కి మా సత్తెయ్యగారింటికొచ్చిన కొత్తల్లుడుగారు మాత్రం? అందరం ముందనుకొన్నట్లు ఏ కొత్తమోడలు బైకో మార్పించివ్వమని అడగలేదు! బట్టలకు బదులు  కూరగాయబుట్టలు కొనివ్వమని అలకపానుపెక్కాడు! దీపావళి వచ్చిపోయినా దిగతేనే మానవుడు! 'ఉల్లిపాయ టపాసులంటే ఎన్నివేలైనా ఎలాగో కొనివ్వగలంగానీ.. నిజం ఉల్లిపాయలు. కరేపాకు, కొత్తిమేర కట్టలంటే.. ఈ కరువుకాలంలో ఎక్కణ్ణుంచి తేగలం?' అనా మామగారు ఒహటే మొత్తుకోళ్ళు! 
మా తోడల్లుడుగారు కొంతకాలంగా బ్యాంకులాకర్లలో బంగారం, దొంగపత్రాలకు బదులు.. బంగాళా దుంపలు, కందలువంటి నిలవగడ్డలు దాస్తున్నాడని వినికిడి. ఆయనేమన్నా నాకూ  సాయపడతాడేమోనని ఫోనుచేస్తే 'బ్రదర్! ఇలాంటివన్నీ ఫోనులోనా అడుగుతావు! కొంపలంటుకుపోవూ!  అసలే నామీద ఆదాయప్పన్ను వాళ్ళ కన్ను ఎప్పట్నుంచో పడుంది గదా' అంటూ బాగా మందలించాడు. ఆయనగారంటే గవర్నమెంటాఫీసులో అదేదో శాఖతరుఫున గుత్తేదార్లకు పన్లప్పగించే సీటులో ఉన్నాడు! పెద్దమనుషులు పెద్దపెద్ద పన్లకోసం ఇదివరకు మల్లే చేతులూ అవీ తడపటం లేదట!  బల్లకింద కూరగాయల బస్తాలు దొర్లించిపోతున్నారని వాళ్లావిడ మా ఆవిడతో  గొప్పలు చెప్పుకొంటున్నది!
నన్నడిగితే సిబిఐవాళ్ళు నిజంగా దాడులు నిర్వహించాల్సింది ఎర్రచందనం దుంగలమీద కాదు. ఎర్రగడ్డలు దొంగలమీద. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎవరెవరు  ఎంతంత  సరుకు  ఏ ఏ దేశలకు అక్రమంగా తరలించుకుపోతున్నారో!
అఫ్జల్ గురువంటి ఏ కొద్దిమందికో తప్ప ఇప్పుడు దేశంలో ముప్పూటలా కంచంనిండా కరేపాకు చారైనా కలుపుకు తినే అదృష్టం ఎంతమందికుందంటారు?!
ఫోర్బ్స్ పత్రిక అడపా దడపా ప్రకటిస్తున్న జాబితాలోని కుబేరులైనా కడుపునిండా కూరా.. నారా.. కలుపుకొని తృప్తిగా భోంచేస్తున్నారని గట్టిగా చెప్పలేని పరిస్థితి. పిల్లకాయలు 'పీచుబీరకాయలంటే ఏంట'ని అడిగితే ఏ ప్రదర్శనశాలకో తీసుకెళ్ళి ఏ జనపనార మోడళ్లనో  చూపించాల్సిన దౌర్భాగ్యం.
సర్కారుగాని, స్వచ్చందసంస్థలుగాని ప్రోత్సాహక పురస్కారాలిచ్చే సందర్బంలో 'పర్సులు' గట్రా బహూకరించకుండా..  కూరగాయలు.. రకానికొకటిగా.. కలగలిపి.. కలగూరగంపగా ఓ గంపెడు పురస్కార గ్రహీత నెత్తిమీద పెడితే.. మిగతా వారికీ .. కనీసం ఆ కాయగూరలకోసమైనా.. ఓ సత్కార్యం నిజంగా చెయ్యాలన్న సద్భుద్ధి కలుగుతుందేమో!.
మళ్లీ వచ్చే ఎన్నికలదాకా ఈ కరువు ఇలాగే కొనసాగితే? 'నమో' సర్కారే నగదు బదిలీ పథకం నమూనాలో ఉచిత కూరగాయల పథకమేదో ఒకటి  మొదలు పెడుతంది. ఆ అచ్చేదిన్ వచ్చేలోపలే కూరగాయల ధరలు దిగిరావాలని నా కోరిక!
***
 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...