కవిత
ప్రశ్నల బేతాళుడు.. కుపించుటలేదు !
- కర్లపాలెం హనుమంతరావు
అన్నం ముద్దలో సున్నం కనపడుతున్నా
తాగే నీళ్లల్లో నాచు తేలుతున్నా
కడుపు నింపుకోవటమే
మేటి సిద్ధాంతం మాకు!
ఎత్తిన చేతులకు
పసిడి కడియాలు
తొడుగుతున్నప్పుడు
వేలెత్తి చూపించి
నెత్తికి తెచ్చుకోవడమెందుకు?
బతుకు
బజారు అమ్మకం సరుకైన తరువాత
తిరుగుబాటు కాదు
జరుగుబాటే మేలు
కుర్చీలని ప్రశ్నించి
గోడ కుర్చీలేయట మెందుకు ?
శిలలను ధిక్కరిస్తే
శిలువలే కదా
దక్కే బహుమానాలు!
కౌరవుల పాలనలో
పాండవులు మాత్రం
అజ్ఞాతంలో లేరూ!
సత్యానికి విజయం
తథ్యం మంటావు
నిజమే
చివరి సీనులో కదా
జయం ప్రత్యక్షం ?
అందాకా అయినా
మందలో గొర్రెల్లా
నలుగురితో నారాయణా...!
టూత్‌పేస్ట్ యాడ్
నవ్వుల పోటీకైనా
వెనకుండిపోవడం
వట్టి వెర్రిబాగులతనం
అందుకే
మా మెదడు దుకాణంలో
ప్రశ్నల స్టాకు లుండవు!
బదులు చెప్పే ధర్మరాజులు
కరువైనప్పుడు
ప్రశ్నలడిగే యక్షుడవడం
వృధా గదా!
జీవిత
పరమపద సోపానపటంలో
నిచ్చెలకు మించి
పాములే ఉన్నప్పుడు
తోకలను పట్టుకునైనా
పైకెగబాకటమే
'ఆర్టాఫ్ లివింగ్'!
అందుకే
మెదడులోని భేతాళుణ్ణి
ప్రశ్న కథలడకుండా
ఎన్నడో తన్ని తరిమేశాం!
***
No comments:
Post a Comment