Saturday, June 6, 2015


అమరావతీ!.. అజరామరావతీ!
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి మందడం గ్రామంలోని సర్వే నెంబరు 135, 136లో  కోలాహలంగా భూమి పూజాకార్యక్రమాలు సాగాయ్! వేదపండితుల మంత్రాలతో మందడం  మార్మోగిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అపూర్వఘట్టం. తిలకించేందుకు  పెద్దసంఖ్యలో తరలివచ్చిన జనం. సతీసుత సమేతంగా చంద్రబాబు వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య నవరాజధాని అమరావతి నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంలో విశ్వవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరికీ శుభాభినందనలు!

నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి ఈ రోజు తొలి అడుగు పడినట్లే. కృష్ణానదీతీరాన విజయవాడ- గుంటూరుల నడుమ పాతఅమరావతికి చేయిచేరువులో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన శుభసంధర్భం ఇది.  ‘శుభ’ సందర్భమే!
నాలుగు శతాబ్దాలనాటి గొప్పనగరం భాగ్యనగరం.  రెండు దశాబ్దాలబట్టి ఒక నూతన ప్రగతికి నమూనాగా రూపుదిద్దుకొంటున్న అద్భుతనగరంకూడా. ఉమ్మడి రాష్రానికి రాజధాని అయిన కారణాన ఆంధ్రులూ అనివార్యంగా భాగ్యనగరి అభివృద్ధిలో భాగం పంచుకొన్నమాట వాస్తవం. వట్టి భాగస్వామ్యమేనా? భావనాత్మకమైన అనుబంధమూ ఆ బంధంలో ఉంది. అనేకానేక రాజకీయ, రాజకీయేతర కారణాలవల్ల ఆ పురావైభవాన్ని  సోదరులకు అప్పగించి నవ్యరాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పంతో ఆంధ్రుడు దక్షిణానికి తరలి వచ్చేసిన  సందర్భం. ఆంధ్రసోదరుడి ముందు ముందుగా నిలబడ్డ సవాళ్ళు రాజధాని, దాని నిర్మాణం. అనేకానేకమైన మునకల  పిదప కడకి  ఆ రాజధాని కృష్ణానదీతీరాన తేలింది. పాత అమరావతికి ఈవల అదే పేరుతో కొత్త నగరాన్ని నిర్మించుకోవాలనే సంకల్పం స్థిరపడింది.
వింధ్యకు దక్షిణానున్న దక్కను పీఠభూమి ప్రాంతానికి మొదటినుంచి మూడు ముఖ్యమైన రేవులు ఆయువులు. ఆగ్నేయాసియాతో వారసత్వంగా వస్తున్న వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలకవి జలసంబంధ బాంధవ్యాలు! దేశానికి  తూర్పుదిక్కున అత్యంత విశాల తీరప్రాంతం సహజసిద్ధంగాగల రాష్ట్రమూ ఒక్క ఆంధ్రదేశమే. పడమరనుంచి తూర్పుకి, తూర్పునుంచి ఆగ్నేయాసియా దేశాలకి ఏ పేచీలూ లేని  జలమార్గ వ్యాపారాలకి దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశే అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఈ ఆంధ్రదేశానికి దక్కను పీఠభూమి అనుకూలం. ఈస్టిండియా కంపెనీవాళ్ళు  వ్యాపారానికీ, తెల్లప్రభువులు  పరిపాలనకీ ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మక కేంద్రంగా ఎన్నుకోవడానికి ఈ నైసర్గిక రూపమే ప్రధానకారణం. ఆ నైసర్గికత తిరిగి రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రాధాన్యత సంతరించుకునే  పరిస్థితులు వచ్చిపడ్డాయి. ఆంధ్రులకి ఇది ఆయాచితంగా దక్కిన వరం.
‘చరిత్ర’ భౌగోళికాంశాల చుట్టూతానే ప్రదక్షిణం చేస్తుందని ఒక సూత్రం ఉంది. తదనుగుణంగానే కొత్త అమరావతి పాతఅమరావతికి పొలికేక దూరంలో  ఏర్పడుతోంది.
కాలంతో పాటు ప్రవహించే గుణం లేకుంటే క్షణం చాలు ప్రగతిస్పర్థలో వెనకబడేందుకు. కాటన్ దొర బ్యారేజీ కట్టిన తరువాత గోదావరీ ప్రాంతంలో  వ్యవసాయం మాత్రమే ముమ్మరమయింది, బియ్యం మిల్లులు కట్టి డబ్బులు గడించుకోవాలన్న దుగ్ధ దగ్గరే జనం దృష్టి నిలబడిపోయింది! కాలానుగుణమైన సాంకేతికాభివృద్ధిమీద యువతా బుద్ధి ప్రసరించకపోవడం ఆశ్చర్యమే! గతం గతః ! పై పై పొరగా కనిపించే పదమూడు జిల్లాల కొత్తరాష్ట్రం జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంత ప్రాధాన్యతను సంతరించుకొన్నదో ఇప్పుడైనా అర్థంచేసుకోవాలి. విభజనరూపంలో  ప్రస్తుతం వచ్చింది సంక్షోభం కాదు. సంక్షేమరంగాల అభివృద్ధికి సదవకాశం. ఆ దిశగా ఆంధ్రుడి ఆలోచన సాగాల్సిన తరుణమిది.
చైనా తన దక్షిణప్రాంతంలో పేర్చుకుపోతున్న ఆయుధసామాగ్రిని చూసి అమెరికా అసహనంగా ఉంది. ఆగ్నేయాసియా దేశాలమధ్య ఏదైనా ఓ కొత్త వ్యాపారబంధం ఏర్పడి బలపడితే అగ్రరాజ్యానికి అది బొత్తిగా నిద్రపట్టని కారణమవుతుంది. ఒబామా 2012లో రెండోసారి అధ్యక్షుడయిన వారం రోజులకే కంబోడియా సందర్శించారు. మునుపటి అధ్యక్షులెవరూ పట్టించుకోని ఆ చిన్నదేశానికి అమెరికా  విదేశాంగవిధానం ఇస్తున్న ప్రాధాన్యతనబట్టే  ఆగ్నేయాసియా ప్రస్తుతం అంతర్జాతీయంగా  ఎంత ముఖ్యస్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ కీలకస్థానానికి కూతవేటు దూరంలో కొత్త రాజధాని నిర్మాణం జరుగడంఆంధ్రుల అదృష్టం!
కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలో ప్రతిపాదనలో ఉన్న కేంద్ర  రాకెట్ లాంచింగ్ కేంద్రం, నెల్లూరు జిల్లా వాకాడు దగ్గర రూపుదిద్దుకొంటున్న  'నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ' శిక్షణా సంస్థలూ  కేంద్రం విదేశీవిధానంలోని మారుతున్న ప్రాధాన్యతలకు అద్దం పడుతున్నాయి.  రాష్ట్రస్థాయి హోంశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సముద్రతీర నిఘా విభాగం చాలు.. రాష్ట్ర తూర్పుతీప్రాంతం భద్రతాపరంగా  ఎంతటి ప్రాధాన్యత సంతరించుకొంటున్నదో అర్థం చేసుకునేందుకు!  తరుముకొచ్చే స్పర్థలకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచపటంమీద ఎంత 'స్ట్రాటజిక్’ పొజిషన్లో ఉందో అర్థమైతే అభివృద్ధికి సోపానంగా దాన్ని ఎలా మలుచుకోవచ్చో అవగతమవుతుంది.
సింగపూర్, మలేసియా, ఇండొనేసియా, మయన్మార్ వంటి  ఆగ్నేయాసియా దేశాలతో ఆంధ్రులకు గల సత్సంబంధాలు చాలా పురాతనమైనవి. ప్రముఖమైనవి. వారసత్వంగా వస్తున్నవి. సహజసిద్ధమైన జలరవాణా వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమయింది. శతాబ్దాల తరబడి కొనసాగే రవాణావ్యవస్థలు  రెండు కొసలనూ అనివార్యంగా ముడివేస్తాయి. ఆగ్నేయాసియా, ఆంధ్రదేశాల సంబంధాలు ఆ కారణంచేతే సహజబంధుత్వాలస్థాయికి ఎన్నడో చేరుకున్నాయి. కొత్తరాజధాని కూతవేటు దూరంలో సాకారమవుతున్న ప్రస్తుత తరుణంలో  దక్షిణాసియా దేశాల కదలికలు, నీడలు నవ్యాంధ్రలో అధికమవడాన్ని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. అభివృద్ధికాముకతతో ఆహ్వానించాలి. ముఖ్యరేవుపట్టణాలకు అందుబాటులోగల అమరావతిలో నూతన రాజధాని  సాకారమవడం నవీన   అభివృధ్ధి నమూనాకు శ్రీకారం చుట్టే చర్యగానే ఆంధ్రులం భావించాలి!
భారతదేశ తొలి తెలుగుప్రధాని పి.వి. ప్రతిపాదించిన 'Look to East' అప్పట్లో ఒక భావనాత్మకమైన ప్రతిపాదన మాత్రమే. కాలక్రమేణా ప్రపంచంమొత్తం తూర్పు వైపుకు చూపు మళ్లించుకోక తప్పని అంతర్జాతీయ పరిణామాలు రూపుదిద్దుకొంటున్న తరుణంలో..  నవ్యాంధ్రప్రదేశ్ తొలిముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నింగిలో ఎగిరే ఆ గాలిపటం దారాన్ని అమరావతికి ముడివేసారు. భారతీయుల ‘తూర్పు  చూపు’ భావనకు ఒక బౌతిక వేదిక నిర్మించే బాధ్యత  ఆ విధంగా ఆంధ్రులకు సమకూరినట్లు!   నూతన రాజధాని ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న పాత అమరావతికి కనుచూపుదూరంలోనే అన్నిహంగులతో రూపుదిద్దుకొనే శుభసందర్భంలో ఆంధ్రులందరికీ అభినందనలు. 
వేలాది ఎకరాల పచ్చని పొలాల గట్లు తెంపుకొని ఏకఖండ క్రీడారంగంగా  ఆటకు సిద్దవవుతున్న వేళ ఆంధ్రులూ అదే క్రీడాస్ఫూర్తితో ప్రగతి గోదాలోకి దూకాల్సిన తరుణం ఆసననమైనట్లే! శుభకామనలు!
***




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...