మేఘాల మొహంచాటు!
మేఘాలకు, నాయకులకు బోలెడడన్ని పోలికలు. గాలివాలునుబట్టి
కొట్టుకుపోవడం ఉమ్మడి లక్షణం. మేఘాలకైనా, నేతల
సిద్దాంతాలకైనా ఒక స్థిరమైన రూపమంటూ ఉండదు. ఉరిమే మేఘాలన్నీ కురవాలన్న నియమం ఏమీ
లేనట్లే.. గర్జించే నేతాశ్రీలంతా చేతల్లో ఆ సత్తా చూపిస్తారన్న హామీ లేదు.
సూర్యరశ్మి వేడికి నేలమీది నీరు ఆవిరిగా మారి పైన మేఘంలా
తయారవుతుందని కదా మనమందరం బడిపాఠాల్లో చదువుకొంది?! నాయకుడి తయారీకీ సరిగ్గా ఇదే సూత్రం! గల్లీల్లో తిరిగే ఏ చిల్లరగాడిమీదో పైవాడి చల్లనిచూపు పడితే చాలు.. ఆ
అదృష్టవంతుడు అలా.. అలా పైకిపోయి చివరికి ప్రజానాయకుడై నేరుగా మననెత్తిమీదకే దిగుతాడు.
మబ్బులు వాటంతటవే సాధారణంగా వానజల్లులు కురిపించవు. నేతలూ
వాళ్లంతటవాళ్ళే జనాలమీద వరాలవాన ఎప్పుడూ కురిపించరు. వాతావరణం చల్లబడాలి. లేదా కదిలేమేఘం
ఏ కొండకొమ్ముకో 'ఢీ'
కొట్టాలి. అప్పుడుగాని మబ్బులు గుప్పెడు తుప్పర్లు రాల్చవు. పైవాడు దగ్గరకు పిలిపించుకొని మందలించకపోతే, రాజకీయంగా ఉక్కపోత ఎక్కువ
కాకపోతే- ఏ ఒక్క నాయకమ్మన్యుడైనా జనాలకి పనులు చేసిపెడతాడా!
నేలమీదకు చేరే నాలుగు చినుకులూ కాలువల్లోకి పారి పంటపొలాలను
తడపాలన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎగువనున్న అదృష్టవంతులు
ఎవరైనా దారికాసి ఆ కాసిని నీళ్ళుగాని మళ్ళించుకుపోతే.. దిగువన్నున్న
దౌర్భాగ్యానికి మనకు చివరకు మిగిలేది పంట బీడుపడిందన్న దిగులే! నేతల చేతుల్లోని నిధులు జనందాకా ప్రవహించే
సందర్భానికీ సరిగ్గా ఇదే సూత్రం
వర్తిస్తుంది.
కురవకపోతే మానె.. కాసే ఎండలకూ అడ్డొచ్చి ఆరేసుకొన్న బట్టలనూ
ఆరకుండా చేస్తాయి కొన్ని మబ్బులు. జనం ఎన్నుకొన్న కొంతమంది నాయకులదీ అదే తంతు. జనాలకు పనికొచ్చే పనులేవీ చేయకపోగా.. పైనుంచి వచ్చే
నిధులకూ మోకాలడ్డే బకాసురులు ఎందరో ! మబ్బులకేమీ స్వలాభం ఉండకపోవచ్చు. డబ్బుపిచ్చి నేతలు మాత్రం అలాకాదు. సొంతలాభం రవంతయినా
కనిపించని పక్షంలో సైంధవపాత్ర పోషించడం
ఖాయం.
ఇంత కష్టపడి మబ్బులకు, నేతలకు మధ్య ఇన్నేసి పోలికలు ఇప్పుడు కనిపెట్టడం ఎందుకని కదా సందేహం?!
నైరుతి మొదలవబోతోంది. అయినా ఆకాశంలో రుతుపవనాల జాడ కానరావడం
లేదు. రైతన్నలు దుక్కిదున్నుకొని ఆకాశంవంక ఆశగా మోరెత్తి చూస్తున్నారు. ఎండిన
బీళ్ళు- పరదేశంనుంచి తరలివచ్చే బిడ్డకోసం
కలవరించే కన్నతల్లిలా వళ్లంతా కళ్ళు చేసుకొని ఎదురుచూస్తున్నాయి. గెలిచి రాజధానిచేరినాక చేరదీసిన జనం వంక తేరిపార చూడని
ప్రజాప్రతినిధికి మల్లే మబ్బులూ మొహం చాటేస్తున్నాయి!
ప్రజాస్వామ్య విలువలతో పోటీపడుతూ రుతుపవనాలూ రోజురోజుకూ బలహీనమవుతున్నాయి!
తీవ్రమైన వత్తిడివస్తే తప్ప నమ్ముకున్న జనాలకేమీ స్వచ్చందంగా చేయని నేతప్పల్లాగా..
అల్పపీడనానికి, అధికపీడనానికి మినహా స్పందించడమే లేదు కారుమేఘాలు! ప్రత్యేకహోదామీద మోదీసర్కారు తీరుతో
పోటీకి దిగుతున్నాయా నైరుతి పవనాలు?!
కోరుకొన్న పక్షమే అధికారంలో కొచ్చినా.. కోరుకొన్న రీతిలో
పనితీరు చూపనట్లు.. వేళకే కేరళ తీరాన్ని
తాకినా,, తెలుగునేలమీదకొచ్చేసరికి
సరిపడా సహకరించడం లేదు రుతుపవనాలు!
జనంలో తిరిగేందుకు జంకే నేతలకు మల్లే తెలుగు రాష్ట్రాల్లో
వ్యాపించేందుకు ఎందుకా సంకోచం?! మన ఓట్లతో గెలిచి పొరుగుసేవలకోసం
పరుగులుతీసే నేతలకు నైరుతీ పవనాలేమన్నా తాతలా? తెలుగు రాష్ట్రాకాశాలమీద పరుచుకొనే మేఘమాలకు ఎప్పుడూ ఎక్కడో పశ్చిమంమీద ఎందుకో ఆ పక్కచూపు? ఉత్తరాన ఉరమడాని ఆ ఆగమేఘాలమీద ఆ ఉరుకులెందుకో?
తెలుగునేతల వత్తిడి మోదీసర్కారుమీద
పనిచేయనట్లే .. మన సముద్రాల్లోని అల్పపీడనాలు స్వల్పంగానైనా రుతుపవనాలమీద ప్రభావం
చుపించడం లేదే! మేఘాలకు, నేతలకు మధ్య ఇప్పుడీ సాపత్యాలెందుకయ్యా అని మీరు
గయ్యిమంటారని తెలుసు.
ముఖ్యమంత్రుల సమావేశాలకు ముఖ్యమైన మంత్రులే మొహాలు చాటేస్తున్నారు.
ఉపాధి పథకాలు, ఉద్యోగాల కల్పనలు, ఉపకారవేతనాలు, ఉద్యోగుల బకాయిలు- ఊసెత్తితేనే చాలు సర్కారు పెద్దలు మొహాలు పక్కకు తిప్పుకొంటున్నారు’. పార్టీ వ్హిప్పుల్నే
పట్టించుకోకుందా ఎన్నికల్లో అభ్యర్థులు మొహాలు చాటు చేసుకొంటుంటే.. మా
మొహాలుమాత్రమే చాటలుగా మార్చి కుంభవృష్టి కురిపించాలా?’ అని
నిగ్గదీస్తున్నాయి విరగ్గాసే ఎండలు మాటున చేరి వెండిమబ్బులు!
సరే! ఎవరికి వాళ్ళు సమయం దొరికింది కదా అని మొహాలు
చాటుచేసుకొంటో జనాలతో ఆటాడుకొంటున్నారుగదా! మళ్లీ ఎన్నికలంటూ రావా? ఓట్లడుక్కుంటూ నేతలు గుమ్మాలముందుకొచ్చి నిలబడరా! అప్పుడూ ఇలాగే నైరుతీ రుతుపవనాల
మోడల్లో ఓటర్లూ మొహాలు చాటేస్తే! అసలు
పోలింగుబూతులకే పోకుండా పొరుగూరు కొత్తసినిమా చూడ్డానికి చెక్కేస్తే!
-కర్లపాలెం హనుమంతరావు
***
(28-06-2011
- ఈనాడు - సంపాదక పుట గల్పిక)
No comments:
Post a Comment