Tuesday, September 15, 2015

మైండ్ బ్లాక్- ఓ సరదా గల్పిక

"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో.. వాడే పండుగాడు" అని 'పోకిరీ' చిత్రంలో మహేష్ బాబు డైలాగ్. డైలాగునుబట్టి మైండు బ్లాకుకి మహేష్ బాబే ఆద్యుడని ఆయన అభిమానసందోహం కేరింతలు  కొడుతుండవచ్చు గాక .. వాస్తవానికి 'మైండు బ్లాకు'కీ అన్నింటిలోలాగానే ఆ  బ్రహ్మదేవుడే ఆద్యుడు. బ్రహ్మాండ పురాణం నిండా దీనికి బోలెడన్ని   ప్రమాణాలున్నాయి కూడానూ.
వేద వేదాంగాలను సృష్టించిన అలసటలో బ్రహ్మదేవుడు  కాస్త మాగన్నుగా కన్ను మూసిన వేళ తాళపత్ర గ్రంధాలన్నీ ప్రళయ జలాల్లో జారిపడిన కథ సారి గుర్తు చేసుకుంటే మైండు బ్లాకు ఆది మూలాలు బైట పడతాయి. నీటి పాలైన వేద సాహిత్యాన్ని హిరణ్యాక్షుడు నోట కరచుకుపోయాడన్న విషయం బోధపడగానే ముందుగా బ్రహ్మాజీలో కలిగిన మానసిక వికారం 'మైండు బ్లాక్'. బిడ్డ అచేతునడై అవస్థలు పడుతోంటే తండ్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండి పోగలడు! మత్సావతారం ఎత్తడం.. ఆనక  హిరణ్యాక్షుని  సంహరణ.. వేదాల ఉద్ధరణ..  ప్రస్తుతానికి  మనకవన్నీ అప్రస్తుతాంశాలే గానీ.. మైండు బ్లాకు వరకు ప్రస్తావనార్హమే!

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే పనిగా పెట్టుకున్న భగవంతుడూ మత్సావతారం నుంచి కూర్మావతారం, వరహావతారం,  నరసింహావతారాల మీదుగా రామద్వయావతారాలు, కృష్ణావతారాది మిగతా అవతారాలు వెరసి మొత్తం దశ అవతారాలు ఎత్తినా .. చివరికి ప్రస్తుతం నడుస్తున్న కలియుగం నాలుగో పాదంలో ధర్మదేవత   కుంటికాలితో కాదు సరిగదా.. కనీసం కాలి మునివేళ్ల మీదైనా నడిచే యోగం కనిపించడంలేదు. ఇప్పుడు   అవతారమెత్తి ధర్మోద్ధరణచేయాలో అంతుబట్టకే భగవంతుడు గుళ్ళోబెల్లం కొట్టినరాయిలా పడివున్నాడని దేవుడంటే పడని  నాస్తికుల వాదన. భగవంతుడంతటి వాడికే తప్పని ఈ మైండుబ్లాకు మానవచరిత్రను ఇంకెంతగా ప్రభావితం చేసిందో చర్చించడమే ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

క్షీరసాగరమధన ఫలితంగా  పుట్టిన హాలాహలం సేవించడంతో పరమ శివుడికి మైండు బ్లాకయితే.. అమృతం పంపకాల ప్రహసనంలో జగన్మోహిని సమ్మోహనాస్త్రంతో రాక్షసాధముల మైండ్లు బ్లాకయ్యాయి. ఒంటికి వెలిబూది పట్టించి,  మంచుకొండలమీద   పులిచర్మం కప్పుకుని యుగాలబట్టీ యోగముద్రలో మునిగివున్నాకాలరుద్రుడి మెదడుకి ఏమీ కాలేదు. కానీ గిరిపుత్రిక పార్వతీదేవి
సపర్యల  నెపంతో స్వామిసన్నిధానంలోచేరి  సమయంచూసి విరిచూపులు విరజాజుల్లో కలిపి చేసిన మన్మధప్రయోగానికి మాత్రం మహేశ్వరుడికి మైండు బ్లాకయింది. కాబట్టే వంక గిరిజాకుమారి పాణిగ్రహణం చేస్తూనే  మరోవంకనుంచి
సృష్టి ప్రేరకుడైన మన్మధుడిమీద.. పాపం.. ఆగ్రహజ్వాలలు కురిపించింది! పార్వతమ్మ కలగ చేసుకుని పరిస్థితులను చక్కబెట్టబట్టి సరిపోయింది కానీ లేకపోతే రుద్రమూర్తి గారి  మైండు బ్లాకు నిర్వాకం మూలకంగా సృష్టిమొత్తం సహారా ఎడారి మాదిరి ఎండిపోయుండేది కాదూ!

రామాయణం రాయకముందు వాల్మీకులవారు సాధారణ కిరాతకుడే! క్రౌంచపక్షుల జంట మిథునభంగం కంటబడ్డాకే మైండుకి 'మా నిషాద' శ్లోకంతట్టి  అనుష్టుప్ చందస్సులో అమర కావ్యం సృష్టి జరిగింది! పిట్టల పుణ్యమాఅని   ఒక మహనీయుడు  మైండు బ్లాకు గండం నుండి బైటబడి మనకో మర్యాదాపురుషోత్తముడి కథను సంస్కృతీ సాంప్రదాయాల వరవడికింద  అందించాడు!

ఆ రామాయణం మాత్రం?! ఆరు కాండల ఉద్గ్రంథ రాజమే కావచ్చు కానీ ఏకమొత్తంగా  చూస్తే బోలెడన్ని మైండు బ్లాకుల కథా గుచ్చం! విశ్వామిత్రులవారు వచ్చారన్న ఆనందం క్షణకాలం నిలవలేదు పాపం దశరథ మహారాజులవారికి. నూనూగు మీసాలైనా రాని పెద్దబిడ్డ రామచంద్రుణ్ని యజ్ఞయాగాదుల సంరక్షణార్థం  పంపించమని ముని కోరిన  ఉత్తరక్షణంలో మహారాజుగారికి కలిగిన చిత్తసంక్షోభం పేరు ఇవాళ్టి ఇంగ్లీషుభాషలో మైండు బ్లాకే! వశిష్టుల వారు కలగజేసుకుని పరిస్థితులని చక్కబెట్టకపోయుంటే కైకమ్మకథ వరకూ దశరథుడివ్యథ అసలు కొనసాగేదే కాదు! 'ఎవరు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి మైండు బ్లాంకవుద్దో ఆవిడ పేరే కైకమ్మ' అని నిజానికి చిన్నరాణిగారు చెప్పుకోవాల్సిన రామాయణం కోట్ 'పోకిరీ'లో మహేష్ బాబు కొట్టేసాడనిపిస్తోంది.

కాలి బొటనవేలుకు కాస్త ఎదుర్రాయి తగిలితేనే చాలు ప్రాణం పోయినట్లుంటుంది. మరి
ఏకమొత్తంగా  ఏడు తాడిచెట్లను ఒకేవేటుతో కూల్చిన రాంబాణం తగిలితే! ఎన్ని తలకాయలు ఉంటేనేమి..  మైండు బ్లాకవడం ఖాయం.  రావణాసురుడికి చావుకుముందు కలిగిన అనుభవం ఇలాంటిదే! ఆ రోజుల్లో ఇప్పట్లోలాగా.. పోస్టుమార్టమ్స్  గట్రా గొడవల్లేవు.  ఉండుంటే బాణంమొన బొటనవేలుకి తగిలినందుకు కాదు.. 'ప్రాణం  అక్కడే ఉందని రాముడికి ఎలా తెలిసిందబ్బా?' అన్న సందేహంవల్లే రావణాసురుడి మరణం సంభవించిందని తేలుండేది.

కృష్ణ పరమాత్ముడి కథ అంతకన్నా విచిత్రంరేపల్లె తాలూకు గొల్లభామల్నుంచి..
మధురానగరి కంసమహారాజులవారివరకూ ఎందరి మైండ్లనో దిమ్మతిరిగే రేంజిలో దెబ్బకొట్టిన లీలావినోది శ్రీ కృష్ణ పరమాత్ముడు మామూలు వేటగాడి పుల్లబాణం దెబ్బకే ఉత్తిపుణ్యానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు! భక్తిభావం తగ్గించుకుని కాస్త ఓపిగ్గా మరింత లోతుల్లోకెళ్ళిగాని వెదగ్గలిగితే..  చావు పుట్టుకలకు అతీతమైన ఆ భగవదంశ అంతటితో పరిసమాప్తమవడానికి ముఖ్యకారణం అంతకుముందు యాదవకులంలో పుట్టిన ముసలమూ.. అది సృష్టించిన కలకలమూ.. దానికారణంగా కృష్ణయ్య మెదడు బొత్తిగా స్థంభించడంగా అర్థమవుతుంది!
ఐ మీన్ దిసీజ్ ఆల్ బికాజాఫ్  మైండ్ బ్లాక్!

కురుక్షేత్రం రణక్షేత్రం మధ్యలో బంధుమిత్రులందరినీ చూసిన పాండవమధ్యముడికీ కలిగింది మైండు బ్లాకే! వేళకి భగవంతుడు  రథసారథి అవతారంలో దగ్గరుండి కర్తవ్యబోధ
చేసుండకపోతే అర్జునుడి బుద్ధిస్థబ్దతవల్ల పాండవులు ఆరంభించకముందే  ఆ యుద్ద్జం ఓడి ఉండేవాళ్లు!

జూదమంటేనే ఓ బుద్ధితక్కువ వ్యసనం కదా! ధర్మరాజుది మహాజూద వ్యసనబుద్ధి. శకునితో పాచికలాటకని కూర్చున్నతరువాత  ఓటమిమీద ఓటమికారణంగా పెద్ద అన్నగారి   బుద్ధి పూర్తిగా మందగించింది.  ఆ చిత్తస్థంభనంలోనే రాజ్యాన్ని, అన్నదమ్ముల్ని, చివరికి కట్టుకున్న భార్యనిసైతం ఫణంగాపెట్టి చిక్కుల్లోపడింది. మైండు బ్లాకు కాకపోతే  ఆడకూతుర్నెవరన్నా మరీ  అంత నీచంగా ఆటల్లో ఫణంగా పెడతారా!

పూరీ జగన్నాథస్వామి విగ్రహాన్ని చెక్కిన మహాశిల్పి ఎవరో కానీ.. ఆ మహానుభావుడికీ ఈ మైండు బ్లాకు జబ్బే దండిగా ఉన్నట్లు లెక్క. అంత అత్యద్భుతమైన కళాఖండాలని  మలిచే శిల్పికి  ఏ మైండు ఫ్రీజ్  వ్యాధో లేకపోతే అలా అర్థాంతరంగా వదిలేసి పోడుగదా!

బమ్మెర పోతనామాత్యుడు భాగవతం రాసుకుంటూ పద్యంమధ్యలో  సరైనపదం  తట్టక తన్నుకులాడినట్లు పుక్కిటపురాణాలు చెబుతున్నాయి. మైండు బ్లాకుని వదిలించుకోవడానికి ఆయనా వేళకాని వేళ  నదీస్నానానికని వెళ్ళడం..   సందులో 
భగవంతుడే  స్వయంగా  పోతనగారి వేషంలోనే దిగొచ్చి  తనపద్యం తానే పూరించుకుని పోవడం మనందరికీ తెల్సిన కథే. దివిలోని దేవుణ్నీ భువికి దింపించిన  మైండు బ్లాకుని అందుకే  మనమంత చులకనగా  చూడ రాదనేది.

యథావాక్కుల అన్నమయ్య అని మరో మహానుభావుడు ఉన్నాడు. సర్వేశ్వరునిమీద  శతకం రాస్తూ స్వీయప్రజ్ఞ మీదున్న అపారమైన  విశ్వాసంతో  ఓ విచిత్రమైన పంతం పట్టాడు. రాసిన పద్యంలో ఎక్కడైనా దోషంగాని ఉన్నట్లు  రుజువైతే తరువాతి  పద్యరచనకు పునుకోడుట సరిగదా.. గండకత్తెరతో అక్కడికక్కడే తల నరుక్కుని చస్తాడుట! దోషపరీక్షకు అతగాడు ఎన్నుకున్న విధానం  మరీ విచిత్రం! పద్యం పూర్తయిన వెంటనే దాన్ని ఏటివాలుకు వదిలేస్తాడు. ఏటికి ఎదురీది తిరిగి ఆ తాటాకు తనదగ్గరికి  వస్తేనే.. తదనంతర పద్యం రచన ప్రారంభమయేది. విచిత్రం ఏమిటంటే ఏట్లోవేసిన పద్యాలతాటాకులన్నీ అలాగే తల్లిని వెత్తుకుంటూ వచ్చే పిల్లల్లాగా బుద్ధిగా కవిగారిని   క్రమం తప్పకుండా చేరుకోవడం! ఓ పోకిరీ పద్యంమాత్రం వరస తప్పించి తిరిగి రాకపోయే సరికి కవిగారు గండ కత్తెర బైటికి తీసారు. కవీ.. కావ్యమూ రెండూ అర్థాంతరంగా అలా అన్యాయంగా ఖతమయిపోతాయనుకున్న ఆఖరిక్షణంలో ఓ  పిల్లవాడు ఆ పద్యమున్న  తాటాకుతో పరుగెత్తుకుంటూ  వచ్చి   కవిగారినిశతకాన్ని రక్షించాడుఆ వచ్చింది  సాక్షాత్తూ సర్వేశ్వరుడేననీ.. యథావాక్కులవారి తాత్కాలిక మేథో బంధనం వల్ల ఏర్పడ్డ గండాన్ని స్వయంగా అలా నివారించి తన వంతు  సాహిత్యసేవ చేసాడని మరో కథనం.
ఎంత యథావాక్కులవారి మేథస్సుకైనా మైండ్ బ్లాకు గండం ఎదురవక తప్పదు. మధ్య  మధ్యలో ఏ అదృశ్య శక్తుల లీలావిలాసాల వల్లనో కథలిలా ముందుకు కదులుతుంటాయి..  అలా కదలాలనిగాని రాసి పెట్టుంటే!

తెనాలి రామకృష్ణుని 'పాండురంగ మాహాత్మ్యం'లో ఓ కవిగారు ఏకంగా భగవంతుడి బుద్ధిమాంద్యం ఎత్తిచూపే   కష్టాలపాలయ్యాడు. రాజుగారు మంచిపద్యాలకి అగ్రహారాలు పురస్కారంగా ఇస్తున్నారని తెలిసి ఓ శివభక్తుడికి  ఆశ పుట్టింది. 'ఇన్నాళ్ళుగా  నిత్య ధూపదీప నైవేద్యాలతో నీకు  కంచిగరుడ సేవ చేస్తున్నానే!  నాకీ ఆగర్భదారిద్ర్యం వదలనే వదలదా?' అంటూ నిత్యం కొలిచే పరమేశ్వరుడితో పోట్లాటపెట్టుకుని  దేశంవదిలి పోబోతుంటే .. భక్తుడి విశ్వాసాన్ని పోగొట్టుకోవడం ఇష్టంలేక రాజుగారికి వినిపించి మంచిపురస్కారం  అందుకోమని  ఒక పద్యం చెప్పాడు పరమశివుడు. తీరా అదికాస్తా రాజుగారి సమక్షంలో పెనువివాదానికి దారి తీసింది. రాజాశ్రయంలోని  నత్కీరుడనే ఓ  కవిగారు  పద్యంలోని దోషాన్ని ఎత్తి చూపించడం వల్ల.. కుష్టవ్యాధికి గురికావాల్సి వచ్చింది. పార్వతీదేవి కేశపాశపరిమళ  వర్ణనల్లోని దోషాన్ని గురించి ఆ రచ్చంతా!  భగవంతుడికీ కొన్ని సందర్భాల్లో మైండు బ్లాకయే అవకాశం ఉందని ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం.

రామచంద్రునిమీద కీర్తనలుకట్టే కంచర్ల గోపన్నకీ   ఈ మైండు బ్లాకు గండం తప్పినట్లు
లేదు.  మంది సొమ్ముతో మందిరం నిర్మించినందుకు తానీషా ప్రభువు గోల్కొండ చెరలో బంధించాడు గోపన్నను. అప్పట్నుంచే గోపన్నకి బుధ్ధి స్థబ్దత బాధలు  ఏర్పడ్డట్లనిపిస్తోంది.   ఏ కవికైనా  మైండు బ్లాకుకి మించిన చెర మరేముంటుంది? గోల్కొండచెర  కన్నా భావస్తబ్దత చెర రామదాసుని అధికంగా బాధించినట్లుంది. ఆ కష్టంనుంచి  విముక్తికే ఆ  రామదాసుడు ఎక్కువగా పెనుగులాడినట్లు స్పష్టం. 'ఇక్ష్వాకు కుల తిలక.. యికనైన పలుకవె రామచంద్రా! నన్నురక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా!' అంటూ ఆ దాసుగారు వేడుకున్నది బహుశా బుద్ధిబాధలనుంచీ విముక్తి కోసమే అయుండాలి. మధ్య మధ్యలో  'సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా/ ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా!'అని లెక్కలూ గట్రా తీయడం, 'ఏటికి చల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా! నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా' అంటూ శోకన్నాలు పెట్టడం.. వగైరా చెష్టలన్నీ  బుద్ధిమాంద్యం నుంచీ బైటపడేందుకు చేసిన విఫల యత్నాలుగానే భావించాలి.

మహానుభావుడు అన్నమాచార్యులుమాత్రం? శ్రీ వేంకటేశుని మీద ముప్పైరెండువేల కీర్తనలు ఎలా గట్టాడో! మధ్య మధ్యలో ఎన్ని విధాలుగా ఈ మైండు బ్లాకు గండంనుంచి  గట్టెక్కగలిగాడో ఆ ఏడుకొండల వాడికొక్కడికే ఎరుక!

త్యాగరాజయ్యరుస్వామివారికి  మానసికస్థభ్దతా కాస్త అధిక మోతాదులోనే ఉండేదంటారు చరిత్ర కారులు. ఆయన  అదోవిధమైన ట్రాన్సులోకి వెళ్లిన మూడ్ చూసి మరీ  చుట్టూ మూగేవారుట  శిష్యపరమాణువులు!  ఆ క్షణంలో ఆ వాగ్గేయకారుని నోటినుంచి రాలే ముత్యాలను పత్రాలమీదకు ఏరి పోగేసుకోవడమే వారిపని.  అలా ఏరి దాచిన ముత్యాలకోపుల్లోనివే  పంచరత్నమాలవంటి పంచదార  కోవాబిళ్ళలు.  పారవశ్వంనుంచి బైటికొచ్చిన ఉత్తరక్షణంనుంచి  త్యాగరాజయ్యరుకి.. ఉడిపి కాఫీహోటలు అయ్యరికీ మధ్య ఆట్టే తేడా ఉండేది కాదనేవారూ కొందరున్నారు. మామూలుగా కవులందర్నీ వేధించే మానసిక స్తబ్దత త్యాగయ్యనీ వదిలింది కాదనడానికి  'మరుగేలరా ఓ రాఘవ.. మరుగేల చరాచర రూప పరా-త్పర సూర్య సుధాకర లోచన' అన్న ఒక్క కీర్తనే మచ్చుక్కి చాలు.  మరుగయిందని అంతగా  ఆ సంగీత మూర్తి ఆర్తిచెందింది చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనుణ్ణి గురించా?  పరాకు చిత్తగించి చిరాకెత్తించే బుద్ధిసూక్ష్మతను గురించా? ఆలోచించాలి విజ్ఞులు!

పౌరాణిక పద్యాలను వూరికే చేంతాళ్ళకు మల్లే చెడలాగి   పాడుచేస్తుంటారని  షణ్ముఖి.. పీసపాటిలాంటి  పద్యనాటక కళాకారుల మీద బోలెడన్ని అభాండాలున్నాయి ఆ రోజుల్లోఎన్నో చిత్రాల్లో ఘంటసాలవంటి గాయకులు ఆ రాగాలహోరును తగ్గించి పాడారు. చిత్రాలు కాబట్టి ఆ గాయకులకి మేథోస్తంభన ఇబ్బంది తక్కువ. నాలుగురకాలుగా పాడించి
మంచిముక్కల్నన్నింటినీ ఏరి జతచేసుకొంటే వినసొంపుగానే ఉంటుంది 'జండాపై కపిరాజు' పద్యమైనా. నేరుగా వేదికలమీద సంభాషణల రూపంలో పద్యాలు  పాడాల్సిన అగత్యం స్టేజీనాటక కళాకారులది. ఎక్కడ తప్పుదొర్లినా  వెంటనే ప్రేక్షకులు చెప్పులకు పని చెప్పేవాళ్ళు.   భయంకరమైన ప్రతిస్పందన వచ్చిపడే  ప్రమాధం అనుక్షణం అలా  నాటక కళాకారులను వెంటాడుతుంటుంది కనకనే..  తరువాతి సంగతి బుర్రలో మెదిలేదాక బుర్రా సుబ్రహ్మణ్యం లాంటి  అత్యుత్తమ కళాకారులుసైతం  అంతలా గొంతుచించుకుంటూ  పద్యాలు సాగదీసి మరీ ఆలపించించేవాళ్లేమో! మతిస్తబ్దత  మాయరోగానికి నాటకాలవాళ్ళు కనిపెట్టిన గోసాయిచిట్కా   ఆరున్నొక్క రాగంలోకూడా శృతిని తెగకండా  లాగడం!

'పదండి ముందుకు.. పదండి ముందుకు.. పోదాం పోదాం పై పైకి' అంటో కవులందరినీ తెగ హైరానాపెట్టే శ్రీ శ్రీ నీ ముందుకు కదలనీయకుండా బ్రేకులేసింది  మైండు బ్లాకే. చలాన్ని అరుణాచలానికి తరిమిందీ ఈ మైండు బ్లాకే. ఆరుద్రను సినిమాలకు దూరం చేసినా, ఆదుర్తిని కడదాకా సాగనీయక దెబ్బతీసినా ఆ పాపమంతా  ఈ మైండు బ్లాకు సైంధవుడిదేనంటాయి  తెలిసీ తెలియని అభిజ్ఞానవర్గాలు! ఆత్రేయలాంటి ఎందరో మహానుభావులు  పచ్చనోటు కళ్ళ జూడందే మైండు బ్లాకు నుంచి ససేమిరా  బైటకొచ్చేవాళ్ళు కాదంటాయి మరికొన్ని జ్ఞానవర్గాలు. ఈ జబ్బుబారినపడి డబ్బు వృథా కావద్దనే .. నిర్మాతలు ఒక్కరచయిత మైండుమీదే   ఎప్పుడూ ఆధారపడేవారు కాదు.  ఆఫీసుబాయ్ దగ్గర్నుంచి.. ఫైనాన్సియర్  తాలుకు ఫియాన్సీదాకా ఎవరైనా ఏ దశలోనైనా నిరభ్యంతరంగా కథానిర్మాణంలో వేళ్లూ కాళ్లూ పెట్టే వెసులుబాటు చిత్రసీమలో గగ్గయ్యగారికాలం నుంచీ అనూచానంగా వస్తున్నదీ అందుకే.

విక్రమార్కుడికి కథలుచెప్పే బేతాళుడికి ఈ మైండు బ్లాక్ ప్రాబ్లం లేదు. భోజరాజుకి
కథలు చెప్పే సాలభంజికలకూ ఈ మైండు బ్లాకు జబ్బు అంటలేదు. మొగుళ్ళు ఇంటలేనప్పుడు రాజుగారి పడగ్గదికని  బైలుదేరిన ఇల్లాళ్ళను 'సప్తశతి'లో చిలక ..' హంస వింశతి'లో హంస రకరకాల  కథలు.. కబుర్లు  చెప్పి పాపకూపంలో పడకుండా  కాపాడాయి. మనుషులకుమల్లే  పశు పక్ష్యాదులకు  మైండు బ్లాకు జబ్బు లేకపోవడం ఆ విధంగా అదృష్టం.

విశ్వనాథ వారికీ  ఈ బుద్ధిసంకోచ రుగ్మత ఆట్టే  తగులుకొన్నట్లు లేదు.  వేయి పడగలు నుంచి.. రామాయణ కల్ప వృక్షంవరకూ ఆ మొండిమనిషి సృష్టించిన బౌండు సైజుసాహిత్యం చాలు..  మైండు బ్లాకుకి ఆయన బెండయ్యే టైపు కానేకాదని తెలుసుకోడానికి.     

గురజాడవారి గిరీశంతరహా పాత్రల్ని చూడండి. ఎలాంటి ఉపద్రవాన్నుంచైనా  అప్పటికప్పుడు ఏవేవో తడికలల్లి తప్పించుకునే ప్రజ్ఞ పుష్కలంగా ఉంటుంది.. ఖర్మ.   మధురవాణివంటి నీతిమంతులు సమయానికి ప్రవేశించకుంటే ఒక్కబుచ్చమ్మ అనేముంది.. సౌజన్యారావు పంతులుగారు సైతం చివర్లో 'డ్యామిట్ .. కథ అడ్డం తిరిగింది' అని ఘొల్లుమనాల్సొచ్చేది.

గీరీశం .. ఆషాఢభూతుల్లాంటి 'బ్లాక్ మైండెడ్‌' ఫెలోస్ కి మైండ్ బ్లాక్  రోగం రాకపోవడం  ఒక రకం దురదృష్టమైతే .. ఎన్నిదఫాలుగా దగాపడ్డా.. రాజకీయచదరంగంలో పెద్ద పాము నోట పడకుండా  తప్పించుకోడం రాని ఆమ్ ఆద్మీ పెనుబుద్ధిమాంద్యం మరో పెద్దదురదృష్టం.    

రావిశాస్త్రిలాగానో.. కారాగారిలాగానో  రాయడం రాకపోతేనేమి!   రాజకీయ నేతాశ్రీల ప్రాప్తకాలజ్ఞత  చూడండి!  ఏ మైండు బ్లాకులూ ఈ  'నక్క' మార్కు రాయనిభాస్కరుల  బెండు తీయలేకుండా ఉన్నాయి! అదొక్కటే బాధాకరం ఈ మైండ్ బ్లాక్ ఎపిసోడ్ మొత్తానికీ! ఏమంటారో తమరు? ఏమైనా అనటానికి బుద్ధి పనిచేయడం లేదంటారా! దటీజ్ 'మైండ్ బ్లాక్'!

-కర్లపాలెం హనుమంతరావు
(డిసెంబరు 2014 నాటి వాకిలి- అంతర్జాల పత్రికలో ప్రచురితం)




Sunday, September 13, 2015

వాహనవిలాపం- ఎర్రబస్సు ఏడుపు- ఓ సరదా గల్పిక


అనగనగా ఓ బంద్ రోజు..
బైట తిరిగే పనిలేనందున రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ వాహనాలన్నీ ప్రాంగణంలో సభతీరాయి. సభ ప్రారంభమయింది.
'బందులూ, ధర్మాలూ, రాస్తారోకోలు, హర్తాళ్ళూ,- రాష్ట్రంలో ఎక్కడ ఆందోళన జరిగినా ముందు ఎర్రబస్సులమీదే కన్నెర్రచేస్తున్నారు. దారిన పోయే దానయ్య సైతం సందుచూసుకొని మరీ రెండు రాళ్ళేసి సరదా తీర్చుకుంటున్నాడు!'
'మరే! చిన్న దెబ్బతగిలితేనే పెడబొబ్బలుపెట్టే ఈ అబ్బాయిలు..  అద్దాలు బద్దలయితే మనకూ అంత బాధే ఉంటుందని ఎందుకనుకోరో! ఎక్కడ ఎవరు ఏ పూట ఏ బందుకు పిలుపు ఇస్తారో..  మనమీదకొచ్చిపడి ఎవరు ఏ రాళ్లు విసురుతారోనని.. నిత్యం గుండెలు ఠారుమంటున్నాయిక్కడ!'
'బాగా చెప్పావు. అర్థరాత్రి ఆడదెప్పుడు నడిరోడ్డుమీద నిర్భయంగా తిరుగుతుందో.. అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యమొచ్చినట్లని అప్పుడెప్పుడే బాపూజీ అన్నట్లు గుర్తు. ఇప్పుడైతే పట్టపగలు రోడ్డుమీద బస్సులు సురక్షితంగా తిరిగినప్పుడే అసలైన స్వతంత్రమొచ్చినట్ల’ని అంటాడేమో మహాత్ముడు. ఆ  మహాత్ముడు మళ్ళీ భూమ్మీదకొచ్చిపోతే బాగుణ్ణు!'
'ఎన్నికలముందు ఈ నేతలంతా బస్సుయాత్రలని ఎన్నేసి పోకడలు




'పోయారో గుర్తుందా బయ్! ఇప్పుడొక్కడికీ మన డొక్కుబతుకుల్ని  గురించి ఆలోచించేపాటి ఓపికే లేకుండా పోయింది!'
'బాగా చెప్పావు. నా దేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నా మండలమంటూ గిల్లికజ్జాలు శృతిమించుతున్న ఈ కాలంలో అన్నివర్గాలను ఒకే దారిలో నడిపించే మార్గదర్శకులు ఎవరైనా ఉన్నారా అంటే ముందు చెప్పుకోవాల్సింది మనపేరే!  అడిగినా పెట్టడానికి అమ్మయినా   పదిసార్లు తటపటాస్తున్న  ఈ పాడుకరువు కాలంలో.. చెయ్యూపీ ఊపంగానే రయ్యిమని పోతున్నాసరే..   ఠపీమని ఆగిపోయి  లిఫ్టిస్తున్నామే మనం! అయినా  మనకెందుకో ఇన్ని అష్టకష్టాలు?'



'పక్కమనిషి బాగుపడుతుంటే చూసి ఓర్వలేక  రెక్కుచ్చుకొని వెనక్కీడ్చే కొక్కిరాయిసజ్జు రోజురోజుకీ ఎక్కువవుతున్న రోజుల్లో .. ఏ లాభాపేక్షా లేకండా  బస్సెక్కిన ప్రతిమనిషినీ 'పదండి ముందుకు.. పదండి ముందు'కంటూ తొందరపెట్టే మంచిజాతి మన బస్సులు మినహా ప్రపంచంలో మరెక్కడుందో చెప్పమనండి! అయినా మనకే ఎందుకో ఈ శిక్ష?'
'ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా ఆడదానికి రాజకీయాల్లో రిజర్వేషన్లగానే   నేతాశ్రీలేసే వేషాలన్నీ ఇన్నీ కావు. ఆ ఆకాశంలో సగానికి మనమేనాడో  బస్సుల్లో ప్రత్యేకావకాశాలెన్నో ఇచ్చేసామే! 'రైట్ రైట్' అనడం తప్పించి  మన కండక్టర్ల నోట మరో తప్పుడు మాటెప్పుడూ రానే రాదే! తెలుగు జనాలెప్పుడో మరిచిపోయిన తెలుగంకెల్ని భుజానేసుకొని మరీ తిరిగే మాతృభాషాభిమానులం! మనమీదే ఎందుకు అందరికీ ఇంత వివక్ష! పదండి! వెళ్ళి ఆ దేవుణ్నే  ఈ పక్షపాతమెందుకో అడిగేద్దాం!’
'ఎంత నాస్తికుడైనా మన ఎర్ర బస్సు ఎక్కాడంటే ప్రతిక్షణం ఆ నారాయణ్నే స్మరించుకుంటూ ప్రయాణం సాగిస్తాడు! ఆ పుణ్యానికైనా  దేవుడు  మనమీదింత కారుణ్యం చూపించొద్దా!   కడుగేద్దాం.. పదండి!.. పదండి!'
'అడిగేద్దాం.. కడుగేద్దాం.. సరే! మీకేం కావాలని ఆ దేవదేవుడే ఎదురడిగేస్తే  మరి బదులేం చెప్పాలో మనమిక్కడే ఒకమాటనుకొని అడుగేస్తే ఉత్తమం. ఒట్టి నల్లజెండాలూపుకోంటూ పోతే సరా! ఎజెండా పకడ్బందీగా ఉండద్దా!’
'ఆ మాటా నిజమే భాయ్!  రేపెటూ ఢిల్లీలో  గణతంత దినోత్సవం పండుగలు  మాబ్రహ్మాండంగా జరగబోతున్నాయి! ఎలాగూ మన తెలుగుశకటాలకు  ఏ పురస్కారయోగాలు ఉండనే ఉండవు.  అద్దాలు పగిలి రేకులూడిన గాడీలు, కాలిబూడిదైపోయిన మన బాడీలనైనా ఆ  పెద్దలందరిముందు కవాతుకు అనుమతించమని వేడుకొందాం! మన ఏడుపు అప్పుడైనా ప్రపంచానికి వినపడుతుందేమో చూద్దాం!'
అంగీకార సూచకంగా అన్ని డొక్కుబస్సులూ ఒక్కసారే 'బాఁయ్.. బాఁయ్' మంటూ హారన్లు మోగించేసాయ్!
-కర్లపాలెం హనుమంతరావు
(ఫిబ్రవరి 1 నాటి ఈనాడు సంపాదకీయ పుటలో 'వాహనవిలాపం' పేరుతో ప్రచురితం)




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...