కనిపించకపోవడానికి వాడేమన్నా నలకా? నల్లపూసా? ఏ బాత్
రూంలోనో, డాబాపైనో ..సెల్లో ఛాటింగులో ..ఉంటాడు చూడండహే!'
అంటూ పాంటు వేసుకుంటో
విసుక్కున్నాడు పాపారావు. ఉబ్బెత్తుగా ఉండాల్సిన పర్సు శివరాత్రినాటి ఉపవాసం భక్తుడిలా చప్పగా
అయిపోవడం చూసి ఉలిక్కిపడ్డాడు. 'అన్నట్లు.. ఇవాళ ఇంటరు రిజల్ట్సు వచ్చే రోజు కదూ! ఇంక ఇంట్లో ఎందుకుంటాడూ?!'
అంటో బిగ్గరగా అరిచాడు.
'ఎప్పుడు చూసినా వాడినాడిపోసుకుంటావు.. నువ్వసలు వాడి
కన్నతండివేనంట్రా?' అని గఁయ్యిమంది పాపారావు
తల్లి.
'ఆ ముక్క.. కన్నదాన్ని.. నీ కోడల్నడుగు! గాడిదకొడుకు నా కంటపడనీ! కాళ్ళు రెండూ విరిచి
పొయిలో పెట్టకపోతే నా పేరు.. పిడకల పాపారావే కాదు!' అంటూ సగం వేసుకున్న పాంటుతోనే పేరిణి నృత్యం ప్రారంభించాడు పాపారావు.
'పాపారావు అరుపులకి, ఆడంగుల ఏడుపులకి అప్పుడే సగం కాలనీ పోగయిపోయింది పాపారావు ఇంటిగుమ్మంలో. ఇరుగుపొరుగు ధర్మంగా
తలో రాయీ విసురుతున్నారు. 'పోలీసులేమైనా ఎత్తుకుపోయారేమో!
టీవీ పెట్టండి. ఏ ఏరియాలో ఎన్కౌంటరయిందో వివరంగా చూడచ్చు!'
అన్నారెవరో. ఘొల్లుమన్నారు ఆడంగులంతా కూడబలుక్కునట్లు ఒక్కసారే గొంతులెత్తి! ఆదిలక్ష్మి 'ఢా'మ్మని పడిపోయిందా సౌండుకి.
'ఎదురింటి కామాక్షికూడా ఇంట్లో ఉందో లేదో .. ముందా
సంగతి కనుక్కోండి!' గుంపులోనుంచి మరో గొంతు సన్నాయినొక్కులు. మళ్లా ఘొల్లుమని ఆడంగుల బృందగానం. ముసలమ్మ
పడిపోయిందీసారి సౌండుకి.
పాపారావు ఆలోచనలు మరోవైపుకి లాగుతున్నాయి. మొన్నదేదో
ఎత్తుభారం చానల్లో కొత్తసినిమాకు అంతా కొత్తముఖాలే కావాల'ని వారంరోజులు ఒహటే
వూదరగొట్టేసారు. కొంపదీసి ఈ చంటిగాడేమన్నా అటు చెక్కేసాడేమో?
పోలీసుస్టేషను నెంబరుకోసం ట్రై చేస్తుంటే సుబ్బలక్ష్మి
పరుగెత్తుకొచ్చింది 'డాడీ! అన్నయ్య బెడ్డుమీద ఈ
లెటరు పడేసుంది' అంటూ ఓ కాగితంముక్క చేత్తో ఊపుకొంటూ!
'పోలీసులకోసం ప్రయత్నిస్తే మీకే లాసు. మీ చంటాడు మా
కంట్రోల్లోనే ఉన్నాడు. మా తరువాత మెసేజీకోసం మీ సెల్ ఫోన్ హమేశా చార్జింగులో
ఉంచుకోడం మర్చిపోకండి.. మీకే మంచిది' అన్న హెచ్చరికుంది ఆ కాగితంలో.
చంటాడు కిడ్నాపయిన వార్త క్షణాల్లో కాలనీ అంతా పొక్కిపోయింది.
పాపారావు 'కోతి'మార్కు పళ్లపొడి కంపెనీలో సేల్సు
ఏజెంటు. పాలవాడు పేపరువాడుకూడా నెల మొదటిరోజు
తప్ప పట్టించుకోని పాపరు పాపారావు. 'ఈయనగారి కొడుకును
కొడితే కోట్లొస్తాయనుకున్నారేమిటో పిచ్చి నా కొడుకులు.. కిడ్నాపర్లు!'- అని పేట పేటంతా ఒహటే జోకులు. 'నీ కోతిమార్కు పళ్లపొడి పొట్లాలు ఓ పాతిక
వాళ్ల మొహాన కొట్టు పాపారావ్! తోముకోలేక వాళ్లే తోకముడిచేస్తారు!' అని మొహంమీదే జోకులేసాడు పక్కింటి మోహన్రావు.
పాపారావు కొడుక్కు అప్పుడే సంతాపం ప్రకటించే మూడ్ లోకి
వెళ్ళిపోయింది కాలనీ అంతా
'గోల్డులాంటి కుర్రాడు కదండీ! ఊళ్ళో కే
సినిమావచ్చినా మనవాడిదే సందడంతా! రిలీజుకి వారంరోజులముందునుంచే ఊరంతా తిరిగి వూదరగొట్టేవాడు,
పాపం. సందుచివరి న్యూస్ పేపర్ల దుకాణంముందు ఎప్పుడు చూసినా పిచ్చి
పిచ్చి సినిమాపత్రికలేవో ముందేసుక్కూర్చుని అదేదో హీరోకి అభిమానసంఘమంటూ ఆగమాగం
చేయడం వాడి హాబీ! అదేదో హీరో పరమ వీర బోరు చిత్రరాజం ‘తీసావే.. చచ్చావే!’
వారంరోజులవకముందే తీసేస్తున్నారని థియేటరుముందు ఆత్మాహుతికి ఒడిగట్టిన సన్నివేశం నిన్నగాక మొన్ననే జరిగినట్లుంది
కాలనీజనాలకి. అగ్గిపెట్టెలో పుల్లలు లేకపోబట్టిగానీ.. లేకపోతే పాపం పాపారావుకీపాటికే తలక్కొరివిపెట్టే కొడుకు
కరువై పోయుండేవాడు!’
'ఆ పాడుసినిమా ’నా ఆట- నా ఇష్టం’ ఆడియో కేసెట్లేవో బలవంతంగా
అంటగడుతున్నాడీ మధ్య. కాలనీ గేటుబైటే కాబూలీవాలాటైపు కాపువేసి మరీ వేపుకుతింటుంటే.. కడుపు మండిన
కోపిష్టెవడో వీడినిలా మాయంచేసుండొచ్చు' అంటూ ఎదురింటి అప్పారావు ఊహానందం.
'శుభం' అన్నట్లు
పాపారావు సెల్ మోగింది అదే సమయంలో మూడు
సార్లు. 'మీ చంటిని మళ్ళీ ప్రాణాలతో చూడాలనుకుంటే మీరీ రోజు 'సాయి' టాకీసులో 'కసాయి'
మొదటాట చూసితీరాలి! ఆరుకల్లా కాలనీ జనమంతా హాలులో హాజరవకపోతే మీ
వాడి ఆట రెండో ఆటలోపు మటాష్!'
ఫోన్ కట్టయింది. పాపారావుకు మతిపోయినంత పనయింది.
'వీళ్ళ డిమాండు మండా! ఇంట్లో వాళ్లమంటే ఎలాగో తట్టుకోవచ్చు.
కాలనీ కిష్కింధగుంపునంతా పోగేసుకొని పోవాలంటే.. మాటలా? మూటలతో పని. మూడు బస్సులమీద ఆరు
ఆటోలవుతాయి. తలకో వందేసుకున్నా.. టీ కాఫీ టిఫిన్లతో కలుపుకొని పదివేలకుపైగానే పోకెట్ కట్! మనీ సంగతలా ఉంచి.. ముందీ ముసలీ
ముతకా.. పిల్లా జెల్లా.. ఆడా మగాని కూడేసుకొని రావాలంటే ఏ పవర్ స్టారో.. ఏక్టింగు
లయనో ఎట్రాక్షనుగా ఉండాలి. పోనీ మానవతాకోణాన్ని వాళ్ళలో మేలుకొలిపైనా
తోలుకెళదామంటే.. మేలు, ఫిమేలు కలసి కూర్చుని చూసే సినిమాలేనా
ఇప్పుడొస్తున్నవి!’
‘ఈ
గొడవలన్నీ ఎందుగ్గానీ.. ఓ పదివేలిచ్చుకుంటా.. మా చచ్చుసన్నాసిని వదిలేయండి! కాదు
కూడదంటారా? పొడిచేసేయండి.. ఫర్వా నై! వాడిక్కడుండి పొడిచేసేదికూడా ఏం లేదు' అనేసాడు మళ్లీ ఫోన్ చేసా ఆగంతకులు
బెదిరించినప్పుడు పాపారావు.
'ష్! డోంటాక్ రబ్బిష్! నీ ముష్ఠి పదివేలెవడిక్కావాలి బే! మాక్కావాల్సింది మా అభిమాన హీరో మూవీకి సూపర్ పాజిటివ్ టాక్!' అంటూ లైన్ కట్ చేసారవతలనుంచి.
'పిల్లాడికన్నా సినిమా ఎక్కువటండీ?కాలనీవాళ్ల కాళ్ళు నే పటుకుంటా.. మిగతా
సంగతులన్నీ మీరు చూసుకోండి!' అంటూ కన్నీళ్ళు పెట్టుకొంటో
బైటికి పరిగెత్తింది ఆదిలక్ష్మి.
* * *
ఆరుకింకా ఐదునిమిషాలుందనంగానే ఆరు ట్రావెల్సు బస్సులు..
మూడు ఆటోలతో సహా సాయి టాకీసు గేటుముందుకొచ్చి ఆగాయి. అప్పటికే హౌస్ ఫుల్ బోర్డు!
హాలుముందుమాత్రం పురుగు లేదు!! 'ట్వంటీ..
ట్వంటీ! ట్వంటీ.. ట్వంటీ!' అనంటూ చెవిగోసిన మేకల్లాగా ఒహటే అరుపులు!
'థియేటరుకా.. స్టేడియానికా మనమొచ్చింది?! క్రికెట్టాటక్కూడా మనుషుల్లేరేంటి చెప్మా!'
ఓ చష్మావాలా సందేహం.
'పబ్లిక్కే లేదు. బ్లాకెందుకయ్యా?' అనడిగాడు పాపారావు ఓ బక్కకుర్రాడి రెక్క
పట్టుకొని బిక్కుబిక్కుమంటూ.
'ముందొచ్చినవాళ్ళంతా బ్లాకే కోయించుకోవాలి సార్! చివర్లో వచ్చేవాళ్ళ సౌకర్యంకోసం హాలువాళ్ళే
చేసారీ ఏర్పాట్లు!’ ఉరుమురిమి చూసాడా
పిల్ల బ్లాకటీరు.
వాడు చెప్పిన రేటుకు నోర్మూసుకొని టిక్కెట్లుకోయించుకొని
ఎట్లాగో హాల్లోకొచ్చిపడ్డారు కాలనీ జనమంతా పాపారావు సౌజన్యంతో.
చిత్రం మొదలవకముందే ఫోనుల్లో మెసేజీలు మొదలయ్యాయి.
‘ఇప్పుడే హీరో ఎంట్రీ! నాలికబలం కొద్దీ ఈల వేయండి!'
'ఈలెయ్యడం మొగాళ్ళందరకీ
రాదుకదయ్యా మగడా?' ఆదిలక్ష్మి సందేహం.
''ఫర్వానై! చప్పట్లైనా కొట్టొచ్చు! ముందు ముందు చప్పట్లు
కొట్టాల్సిన బిల్డప్పు సీన్లు బోలెడొస్తాయి. అప్పుడు నొప్పులంటే కుదరదు మరి. చంటాడి
లైఫుకే రిస్కు! ఆలోచించుకోండి!' అవతల ఆగంతకుడి
గొంతు.
ఒక్క చప్పట్లతో సరిపుచ్చితే లేనిదేముంది? మధ్యలో ఒకసారి.. టిక్కెట్లు చింపి పోగుల్ని గాల్లోకి వెదజల్లాలని హుకూములు! మరోసారి
హీరో హీరోయిన్ని పాటవంకతో పచ్చడి పచ్చడి చేసేటప్పుడు తెరమీదకు పూలు జల్లమని
ఆదేశాలు! 'హఠాత్తుగా పూలంటే.. ఎక్కణ్ణుంచొస్తాయయ్యా!' అనడిగితే
'వట్టి ఫూల్సులాగున్నారే మీ కాలనీ జనమంతా! మా హీరో సినిమాకు
వట్టి చేతుల్తోనా వస్త! మీ ఆడాళ్లకు తలలు లేవా? ఆ తలలకు పూల్లేవా? విసరండయ్యా వాటిని పీకీ!'
అంటో గద్దింపులు!
పడకసీన్లొచ్చినప్పుడు పసిపిల్లలచేత కుర్చీలెక్కించి
డ్యాన్సులు చేయించారు. మందుకొట్టి విలన్లను హీరో చితక్కొడుతున్నప్పుడు ఆడంగులచేత
కొంగులు బిగించి మరీ చిందులేయించారు! గ్రాఫిక్సులో ముసలి హీరో చేసే మెలికలపాము
డ్యాన్సులకు ముసలిప్రేక్షకులచేత నడుములూపే
స్టెప్పులేయించారు మరీ అన్యాయంగా!
'మేమంతా ఓ మూల నక్కి మీ రియాక్షన్లన్నీ గమనిస్తూనే ఉన్నాం.
మొహాలు అలా వికారంగా పెటుక్కూర్చుంటే కుదరదిక్కడ. మీ వంశోద్ధారకుడు క్షేమంగా
విడుదలవ్వాలంటే మూతులు వెడల్పుగా పెట్టుకు తీరాలి. నీళ్ళురాకున్నా కళ్ళు మధ్య మధ్యలో తుడుచుకుంటుండాల్సిందే.
అడపా దడపా వేడి వేడి నిట్టూర్పులు, ఉండుండి పొట్ట చేత్తో గట్టిగా పట్టుకుని పొర్లుగింతలు గట్రా పెడుతూ బిగ్గరగా నవ్వడాలెలాగూ తవ్వపు. అమీర్ఖాన్ ‘పీకే’ మూవీ చూస్తూ ప్రేక్షకులేవిధంగా స్పందిస్తారో..
దానికిమించి మీరంతా అబినయించకపోతే మీ చంటాడి ప్రాణాలకింక నీళ్ళు వదులుకోవాల్సిందే' అని వార్నింగు ఇచ్చేశారా దుర్మార్గులు!
నవ్వాల్సిన చోట
నవ్వురాకపోగా కడుపులో తిప్పినట్లై రెండుమూడుసార్లు వాంతులు చేసుకున్నాడు పాపం అప్పారావు. ఇంటర్వెల్ గంటకొట్టలేదని చంటిపిల్లలంతా ఒహటే
గగ్గోళ్ళు. విరామసమయంలో క్యాంటీనుమీద దాడిచేసి వీలైనంత ఇంధనం వేసుకుంటేగాని
కాలనీజనాల కండుపుమంటలు కాస్తంతైనా
చల్లారలేదు. కాకపోతే ఆ ఇంధనం పాపం పాపారావుకి పెట్రోలుకన్నా ఎక్కువ మంటపుట్టించింది..నెలంతా
గడప గడపా తిరిగి అమ్మిన కచ్చిక పొళ్ళ తాలుకు సొమ్మది మరి!
పాపారావు
వంశోద్ధారకుడి పాడుప్రాణాలకోసం ‘చిత్ర’హింసకుమించిన చిత్రహింసలను సైతం సహించడానికి సిద్దపడ్డారు
పాపం కాలనీవాసులంతా! 'శుభం'కార్డు పడంగానే గభాలున లేచి తొడతొక్కిడిగా తోసుకంటూ బైటకొచ్చిపడ్డా ఆ వైనమే చెబుతోంది కాలనీవాసులు పడ్డ 'చిత్ర'
హింసల క్షోభ!
'ఇహనైనా మనవాడిని విడిచిపెడతారేమో కనుక్కోండి' అంది ఆదిలక్ష్మి గుడ్లనీరు కుక్కుకుంటో.
పాపారావు సెల్లోకి చివరి సందేశం వచ్చింది 'గేటుబైట టీవీలవారి కెమేరాలన్నీ మీ
స్పందనకోసమే ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. మా హీరోగురించి ఎంత సూపర్ గా చెబితే మీ వంశోద్ధారకుడికంత మేలు!’
'సినిమా ఎలా ఉంది?' ఒక మైకేశ్వరి ప్రశ్న ' పరమఛండాలంగా ఉంది. హీరోది నీచ నికృష్ట
నటన. కథ జీరో సైజు. కథనం అయోమయం. దశాదిశాలేని దర్శకత్వం. నీరసమైన సంగీతం. అలుక్కుపోయిన గ్రాఫిక్సు. పాటలు పచ్చి బూతు. మాటలు పరమ
మొరటు. ఫస్టుహాఫు పెద్దరంపం. సెకండు హాఫు పెనుగునపం. కామెడీ ఏడిపించింది.
కరుణరసం నవ్వించింది..' అంటో రెచ్చిపోతోన్న అప్పారావు నోరు నొక్కేసి పక్కకీడ్చేసి ' హీరో సూపర్.. హీరో యాక్టింగ్ అదుర్స్!.. హీరో
డ్యాన్సింగ్ చిరుగ్స్. హీరో ఫైటింగు
ఇరుగ్స్. హీరో వంచిలు కేక! హండ్రెడ్
డేస్ గ్యారంటీ! రికార్దు బ్రేకులు పక్కా' అంటో పాపారావు
రెండేళ్లూ గాల్లో ఊపుకుంటూ బస్సులోకొచ్చి కూలపడ్డాడు.
'నిజంగా సినిమా నీకంత బావుందా.. డాడీ?' కళ్ళు పెద్దవిచేసి అడిగింది డాటరు
సుబ్బలక్ష్మి.
'బాగా.. నా బొందా! కడుపులో తిప్పుతోందిక్కడ.
ఎప్పుడింటికెళ్ళి పడదామా అని తొందర!' అని పొట్టనొక్కుకున్నాడు పాపం పాపారావు.
బస్సులు బైలుదేరే వేళకి చంటోడు ఊడిపడ్డాడు రొప్పుకొంటో.
కళ్లంతా వాచి ఉన్నాయి. 'బాగా కొట్టారేందిరా పిచ్చి
సన్నాసిని చేసి' అంటూ బావురమంది బామ్మగారు మనవణ్ణి గాట్టిగా
కావిలించేసుకొంటో.
'అదేం కాదులేవే! రికార్డు బ్రేక్కింకో రెండు బస్సులజనం
తక్కువయ్యారని ఏడుపు. రెండో ఆటకైనా ఇంకో రెండు కాలనీలు కవరు కాకపోతే మా హీరో పరువు గంగలో కలవడం ఖాయం.
డాడీదగ్గర్నుంచీ ఇంకో ఏడువేలైనా వల్చుకు పోకబోతే
మా అభిమాన సంఘంవాళ్ళు నన్ను
చంపిపాతరేస్తారే మమ్మీ!' అంటూ తల్లి చీరకొంగు పట్టుకొని
లాగడం మొదలుపెట్టాడు చంటిగాడు గారాబంగా. ఆదిలక్ష్మి కంగారు పడింది.
కదిలే బస్సునుంచి పర్సును కసిగా బైటికి విసిరేస్తూ అన్నాడు
పాపారావు. 'ఏడువేలు కాదుగదా.. ఏడు
పైసలుకూడా నా దగ్గర్నుంచీ ఇంక వసూలు కావురా
గాడిదకొడకా! నిన్ను కిడ్నాపుచేసిన వెధవలు
మీ ఎద్దుహీరో అభిమానసంఘం మొద్దులా?! నెలంతా అమ్మి దాచిన కోతిమార్కు కచ్చికపొడి సొమ్మురా అదీ! కంపెనీకి కట్టాల్సింది. అయ్యో! మీ ఎదాన పోసానే! ఎవడిది నాయనా ఈ దిక్కుమాలిన
బేవార్సు ఆలోచన?'
'మనదే డాడీ! ఐడియా మనది. యాక్టింగ్
బ్రదర్ది'అంటో పడీపడీ నవ్వడం మొదలుపెటింది కూతురు సుబ్బలక్ష్మి. పిచ్చిచూపులు పడ్డాయి పాపం
పాపారావుకి. పిచ్చిమాటలు మొదలయ్యాయి ఆదిలక్ష్మికి.
'మన పిల్లలు నిజంగా మహాగ్రేటండీ! ఓ సినీహీరో పరువు నిలబట్టంకోసం
సొంత కొంపకైనా నిప్పెట్టటానికి రడీ
అయిపోయారు! ఆహా! ఎంతమంది కనగలరండీ ఇంత రౌడీసంతానాన్ని?! మీరూ ఉన్నారెందుకు? పాతికేళ్లబట్టీ
ఆ కోతిమార్కు పళ్ళపొడి పొట్లాలమ్ముకొంటున్నారు. టార్గెట్టు రీచవలేదని పైవాళ్లచేత ఎప్పుడూ దెప్పుళ్ళే! ఏ కిడ్నాపో..
బ్లాకుమెయిలో.. కనీసం
బాంబుబ్లాస్టింగుకైనా చేసి సేల్సుపెంచుకోవాలనిగాని, శభాషనిపించుకోవాలనిగాని, ప్రమోషన్లు సాధించుకోవాలనిగాని ఐడియాలు రాకపాయా!
ఛీ!.. ఛీ!.. ఛీ!‘
పాపారావిప్పుడు పెళ్ళాం ఛీదరింపులు వినే మూడ్ లో లేడు. చంటాడి కిడ్నాపు
డ్రామాకి తనర్పించిన కోతిమార్కు సొమ్మును రికవర్ చేసుకోడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. తాజాగా చూసొచ్చిన సినిమాలోని ట్రిక్కులతో ఏ ఏ కాలనీలను కవరు చెయ్యాలా?’ అన్న ఆలోచనల్లో
కొట్టుమిట్టాడుతున్నాడు.
ఎవరన్నారండీ..
సమాజంమీద సినిమాల ప్రభావం ఉండదనీ?!
-రచనః కర్లపాలెం హనుమంతరావు
***