Wednesday, February 22, 2017

స్టాకింగ్ హార్స్- రచన మాస పత్రిక కథ

కథ 
స్టాకింగ్ హార్స్ 
- కర్లపాలెం హనుమంతరావు 
(రచన మాసపత్రికలో ప్రచురితం)

మే నెల మధ్యాహ్నం. ఎండ మండిపోతోంది. 

చలువ చేసిన తెల్లటి వాయిల్ చీర.. మేచింగ్ బ్లౌజులో రాధమ్మ అచ్చంగా రాక్షసులకూ దేవతలకూ అమృతం పంచి పట్టేందుకు బయలు దేరిన జగన్మోహినిలా ఉంది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నది అమృత భాండం కాదు. చెప్పుల జత!

చెప్పుల అలికిడయితే చిన్నారి బైటకొచ్చి గడపకడ్డం పడుతుందని ఇట్లా చేత్తో పట్టుకుని బైటి గేటు దాటిన  తరువాత   అవి వేసుకొంది. రెండగల్లో రోడ్డు మీద కొచ్చి పడింది.

రోడ్డుమీద నర పురుగు లేదు. ఓ గోడ వారన నీడలో పడుకోనున్న రిక్షా అబ్బిని లేపి 'ఆణుమల్లిపేట కొస్తావా? అనడిగింది. 

వాడు నిశ్శబ్దంగా లేచి కూర్చుని 'పది  రూపాయలవుతుందమ్మా!' అన్నాడు.

'ఐదు చేసుకో!' అంది రాధమ్మ.

'ఏడు  ఇవ్వండి తల్లీ! ఉల్లి  కూడా రెండు పెట్టందే గడ్డ  రావడం లేదు' అన్నాడు.. అంటూ తలమీది గుడ్డ విప్పి మళ్ళీ కట్టుకుని . 

రిక్షా సీటు దులిపి 'ఎక్కండమ్మా!' అన్నాడు. రాధ ఎక్కి కూర్చోగానే బండి బయలుదేరింది.

రిక్షా పోలేరమ్మ గుడి దాటకుండానే నరసింహారావుగారు కనిపించారు. బండి దిగి బాడుగిచ్చి పంపించేసింది రాధమ్మ.

నరసింహారావుగారితో పాటే ఆయన ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చి వరండాలోని చెక్క బెంచీమీద చతికల బడింది ఉస్సులు తొక్కుకుంటూ.

 'ఇంత ఎండలో పడి వచ్చింది మా ఇంటికా?! కాస్త చల్లబడిం తరువాత రాకపోయావూ!' అన్నాడా నరసింహారావుగారు ఆశ్చర్యంగా.

నరసింహారావుగారు పల్లెపట్టువారి ధర్మసత్రం ధర్మకర్త. సుమారుగా అరవై, అరవై ఐడేళ్లుంటాయ్. నిదానస్తుడిగా ఊళ్లో మంచి పేరుంది. రాధమ్మ  పని చేసేది ఆయన కార్యనిర్వహణలో నడిచే హైస్కూలులోనే.

నట్టింటి గడప కవతల నిలబడి చోద్యం చూస్తున్నా ఆయన కూతురు కమలనడిగి ఓ గ్లాసెడు చల్లటి మంచినీళ్లు తెప్పించుకొని తాగి స్తిమిత పడిన తరువాత నెమ్మదిగా అంది రాధమ్మ 'బాబాయ్ గారూ! మన స్కూలుకి ఆడిటింగు కొచ్చారే.. ఆయన పేరూ..'

'పరశురామ్మూర్తి. ఆయన పేరెందుకూ ఇప్పుడూ?!'  
నరసింహారావుగారి ఆశ్చర్యం.

రాధమ్మ తన భుజం సంచీనుంచి ఒక నోట్ బుక్ తీసి చూపిస్తూ 'ఈ పాటల పుస్తకం ఆయనకోసారి చూపించి పోదామనీఁ' అంది రాధమ్మ.

'పాటల పుస్తకమాఁ! ఆయనేం చేసుకుంటాడూ దాన్నీ?!' మళ్ళా ఆశ్చర్యం నరసింహారావుగారికి.

'బాబాయిగారూ! పరశురామ్మూర్తిగారు మంచి సంగీత ప్రియులు. మంచి మంచి కీర్తనలు కూడా రాసారుట ఆయన'

'అవునా? నాకు తెలీదే! అయినా.. ఇప్పుడీ పుస్తకం ఆయన కివ్వడానికి ఇంత ఎండన బడి రావాలా?!'

రాధమ్మ అసలు విషయం బైట పెట్టేసింది. 'తప్పులేవైనా ఉంటే సరిదిద్ది పెడతారని వచ్చా బాబాయ్! మళ్లా సాయంత్ర మయితే ఆడిటింగ్ పనిలో పడతారు కదా! అప్పుడు అడిగితే బావుండదేమోననీ..'

'ఎవరండీ అదీ?' గదిలోనుంచి మాటలు వినిపించాయి. 
అది పరశురామ్మూర్తిగారి గొంతే! ఇక్కడి మాటలన్నీ చెవులో పడుతూనే ఉన్నాయన్న మాట.

డోర్ కర్టెన్ తొలగించి తల లోపలికి పెట్టి ఏం  చెప్పాడో కానీ  .. 'నిన్ను రమ్మంటున్నారమ్మా!' అంటూ అదో రకంగా ముఖం పెట్టుకొని తాను ఇంట్లోకి తప్పుకున్నాడు నరసింహారావుగారు. 

రాధమ్మ లోపలికి వెళ్లి 'నమస్కారమండీ!' అంది.

వంటిమీద ఒక్క బనీనే ఉండటం వల్ల కాస్త కంగారు పడుతూ లేచి నిలబడ్డాడాయన.

'ఇప్పుడే మొగం కడుక్కొని వస్తాను! అలా కూర్చోండి!' అంటూ చిలక్కొయ్యకు తగిలుంచున్న చొక్కాను తీసుకొని బైటికి వెళ్లి పోయారు 

పరశురామ్మూర్తిగారు. రాధమ్మ మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది. రెండో కుర్చీ లేదు. అతను వస్తే మంచంమీదే కూర్చోవాలి. తప్పదు.

రిఫ్రెషయి వచ్చిన రామ్మూర్తిగారి చేతికి పుస్తకం అందిస్తూ అడిగింది రాధమ్మ 'సార్! ఇది మా నాన్నగారు జీవించి ఉన్న రోజుల్లో ఆ ఏడుకొండలవాడి మీద రాసిన  కీర్తనలు. ఒకసారి వీలుచూసుకొని చూసి లోపాలు కనిపిస్తే పరిహరించి పెట్టాలి మీరు!'

'ఓహో! మీ నాన్నగారు కవా? సంతోషమండీ!' అంటూ ఆ పుస్తకం అందుకొని రెండు పేజీలు అటూ ఇటూ తిరగేసి చూసి ఆశ్చర్యంగా 'ఇందులోని సాహిత్యమంతా భావగాంభీర్యంతో తొణికిసలాడుతోంది. పదాల తూగు సంగీత లయకు అనుగుణంగా సాగే లక్షణం అన్ని సంకీర్తనలకు సర్వసామాన్య ధర్మమే. కానీ ఆ పదాల ఎంపిక ఎంత  సహజ సుందరంగా సాగిందో ఈ సంకీర్తనలనిండా! ఒక్క  లయజ్ఞానం పుష్కలంగా ఉన్నంత మాత్రానే సాధ్యం కాదు ఇంత ఒదుగుదల! మీ నాన్నగారి పేరు?'

'నడింపల్లి శ్రీనివాసాచారిగారు సార్!'

'మీరు శ్రీనివాసాచారిగారి కూతురా?!' రామ్మూర్తిగారి గొంతులో తేడా వచ్చేసింది అప్పుడే.  

పుస్తకాన్ని మరో రెండు మూడు సార్లు అటూ ఇటూ తిరగేసి 'ఇందులోని గుణదోషాలను ఎంచడం నా శక్తికి మించిన పని. ఆచారిగారి సంగీతం వింటూ .. పాడుకుంటూ ఎదిగిన వాళ్లం మేమంతా. ఆకాశవాణి ద్వారా వారు మాకు పరోక్ష గురువులు కూడా. మాష్టారుగారిలాగా అన్నమయ్య 'పరికరాలంకారాల'ను  సందర్భోచితంగా వాడే బుద్ధివైశాల్యత గలవారు అరుదు.. పేరెన్నికగన్న విద్వాంసుల్లో కూడా'

'పరికరాలంకారాలంటే?'

'సందర్భానికి తగ్గట్లు విశేషణాలను ఉపయోగించే విశిష్ట లక్షణం. మీ నాన్నగారు సంగీత మహోపాధ్యాయులు కదా! మీకూ కొంతయినా ప్రవేశం ఉండుండాలే?'

'ఏదో కొద్దిగా సార్! మరీ అంత లోతుల్లోకి వెళ్లే అవకాశం దొరకలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నది'

'జయ జయ రామా సమర విజయ రామా!' అన్న అన్నమాచార్యులవారి సంకీర్తనం మీకు గుర్తున్నదా?'

'ఆఁ! ఆఁ! 'జయహర నిజభక్తి పారణ రామా! జలధి బంధించిన సౌమిత్రి రామా!' అంటూ పాట ఎత్తుకున్న రాధమ్మని మొదటి చరణం దగ్గరే అడ్డుకొని వివరణకు దిగారు పరశురామ్మూర్తిగారు.

'ఆ 'పారీణ' అన్న పదమే పరికరాలంకారం. భక్తులను ఈ భవబంధ సాగరంనుండి ఒడ్డుకు చేర్చే వాడినే కదా 'పారీణ' అనాలి! 'పారీణ' అంటేనే దాటించేవాడని అర్థం. రెండో పాదంలో వచ్చిన 'సౌమిత్రి' పదం కూడా అలాంటిదే! సీతారక్షణ సందర్భంలో సముద్రుణ్ణి ప్రార్థించమని విభీషణుడు రాముడికి  సలహా ఇచ్చిన ఘట్టాన్ని గుర్తుకుతెచ్చుకోండి! అశాంత స్వరూపుడైన లక్ష్మణుడు అన్నగారు ఎవర్నీ ఎప్పుడూ ఏదీ అడగడం  ఇష్టంలేని వాడు. ఆ సోదరుడికి ఆనందం కలిగించే విధంగా 'సాగరుణ్ని ఎండగట్టాలి. ఏదీ నా ధనుర్భాణాలు అందుకో లక్ష్మణా!' అంటూ ఆ కరుణాపయోనిధి వీరంగాలు వేయడమే సౌమిత్రికి  నచ్చిన విషయం. అందుకే అన్నమయ్య ఆ సందర్భానికి తగ్గట్లు రాముణ్ని మామూలు రాముడిగా కాకుండా  'సౌమిత్రి రామా!' అని సంబోధించాడు. ఇదే పరికరాలంకారం. బై ది  బై .. ఇందాక మీరు పాడారే ఆ పాట అద్భుతంగా ఉంది. మీ గొంతులో మరీ బాగుంది'

'కమల ఒక కాఫీ కప్పుతో వచ్చి రామ్మూర్తిగారికి ఇచ్చింది. ఆమె చూస్తుండగానే ఆ కప్పు రాధమ్మకు అందించారు రామ్మూర్తిగారు. 
రెండు నిమిషాల్లో మరో కప్పుతో రావాల్సొచ్చింది కమలకు.

'వారం రోజులు ఈ ఆడిటింగ్ పని. ఇంత చిన్న ఊళ్లో కాలక్షేపం అవడమెలాగా అని బెంగపడ్డాను.. బైలు దేరి వచ్చేటప్పుడు. అనుకోకుండా సంగీతనిధి దొరికిందిక్కడ. మీకు అభ్యంతరం లేకపోతే ఈ నాలుగు రోజుల మనం ఇలాగే సాయంకాలాలు కలుసుకుంటుందాం. మీ నాన్నగారి మిగతా సాహిత్యం కూడా చదివే సౌభాగ్యం నాకు కల్పించండి'  అని లేచారు రామ్మూర్తిగారు.
రాధమ్మకు కావాల్సింది కూడా అదే!

'వీరి నాన్నగారే శ్రీనివాసాచారిగారని మీరు నాకెప్పుడూ చెప్పలేదే!' అన్నారు రామ్మూర్తి నరసింహారావుగారు లోపలికి వచ్చినప్పుడు రాధమ్మ ముందే!

ఆ గొంతులోని నిష్ఠురాన్ని పెద్దాయన గమనించక పోలేదు. పై అధికారుల ముందు ఏ మోతాదులో తమ ఇష్టాఇష్టాలను ప్రకటించాలో తెలీనంత అమాయకుడేం కాదాయన.

పెదాలమీదకు చిరునవ్వు తెచ్చిపెట్టుకుంటూ 'మా అమ్మాయికి సంగీతం పాఠాలు ఈమె తండ్రిగారే నేర్పించారండీ! ఆ విశ్వాసంతోనే కదా ఈమెకు మన స్కూల్లో ఉద్యోగం కల్పించిందీ' అన్నాడు.

'మంచి పని చేసారు' అన్నారు రామ్మూర్తిగారు తృప్తిగా.

రాధమ్మ ఒక నమస్కారం చేసి వచ్చేసింది. 

వెళ్తూ వెళ్తూ చిన్నారికి ఐస్ క్రీమ్ కొనడం మాత్రం మర్చి పోలేదు.
***
రెండు రోజుల తరువాత రాధమ్మను ఇంటికి పిలిపించి మందలింపులకి దిగారు నరసింహారావుగారు.

'ఆయనేదో ఇన్స్పెక్షన్ పని మీదొస్తే.. నువ్వేంటమ్మాయ్.. పాటలూ.. పద్యాలూ అంటూ ఆయనెంట బడ్డావ్? నీ మూలకంగా వారం రోజుల్లో అయే ఇన్స్పెక్షన్ పది  రోజులయినా తెగేటట్లు లేదు.  పై ఆఫీసర్లను ఇంట్లో పెట్టుకుని వేగడం ఎంత కష్టమో నీకేం తెలుసు?'

'నేనేం చేసాను బాబాయ్ గారూ! ఆయనేగా కదా రోజూ సాయంకాలాలు కారు పంపిస్తున్నదీ! మీ డ్రైవర్ లేని రోజున మీరే వచ్చి తీసుకెళుతుంటిరి! నేను మొరాయిస్తే ఆ ప్రభావం  మీ మీద పడుతుందని  వస్తున్నా గానీ.. నిజం చెప్పాలంటే దీని మూలకంగా నాలుగు రోజుల్నుంచీ నా ట్యూషన్ క్లాసులు దెబ్బతింటున్నాయి.' అంది రాధమ్మ రోషంగా. 

నరసింహారావుగారింకేదో చెప్పబోయే లోపల ఫోన్ రింగయింది. రామ్మూర్తిగారి నుంచి కాల్!

'తలనొప్పిగా ఉంది. ఈ పూటకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మీరొక్కసారి ఆ రాధగారిని కాంటాక్ట్ చేయండి! ఒక్క గంటలో మీటవగలరేమో కనుక్కోండి' .. అదీ ఫోన్ కాల్ సారాంశం.

నరసింహారావుగారి మొహం జేవురించింది. 'అలాగేనండీ! తను ఇక్కడే ఉంది. ఒక్క గంట లోపే పంపిస్తాను' అంటూ ఫోన్ కట్ చేసాడు.

నరసింహారావుగారి కారులోనే ఆ సాయంత్రం ఊరిబైట  కాలువదాకా వెళ్ళారు రామ్మూర్తిగారు, రాధమ్మ.

కాలువ ఒడ్డున చల్లగా హాయిగా ఉంది. సముద్రతీరాలలో పగలంతా ఎంత చిత్తడి చిత్తడిగా ఉన్నా సాయకాలాలు చల్లగాలి తిరిగి ప్రాణాలు లేచొస్తుంటాయి సాధారణంగా.

పంచదార రాసులు పోసినట్లుండే ఆ తెల్ల ఇసుక దిబ్బలమీద చేరి పటమట కుంగే  నారింజ రంగు సూర్యుణ్ని చూస్తూ పనిపాటలు ముగించుకొని ఇళ్లకు మళ్లే కూలినాలి జనాల సందళ్లను చూస్తూ కాలం గడపడం సహజంగా భావుకులైన రామ్మూర్తిగారికి ఇష్టమైన కాలక్షేపంగా మారిందీ వారం  రోజుల్నుంచీ!

రాధమ్మ పుణ్యమా అని ఆ సత్కాలక్షేపానికి సాహిత్య వాసనల గుబాళింపూ తోడై మనసున మల్లెల మాలల ఊగుళ్లు మెల్లగా ఆరంభయిపోయాయి. ఇద్దరూ సంగీత సాహిత్యాలమీద చర్చించుకుంటూ కూర్చుంటే గంటలు  నిమిషాల్లాగా దొర్లినట్లనిపిస్తున్నాయి.

ఆ రోజు శనివారం. ఎప్పటి సాయంకాలాలకు మల్లేనే తూర్పుగాలి వ్యాహ్యాళికి వచ్చి రైలు బ్రిడ్జి కిటువైపు దిబ్బలమీద కూర్చున్నారిద్దరూ. 

మాటల మధ్యలో రామ్మూర్తిగారడిగారు 'మంచి కాలక్షేపం ఇచ్చారు మీరు. ఇంకో మూడు  రోజుల్లో ఆడిటింగ్ పని అయిపోతుంది. మీ గురించి మరింత తెలుసుకోవాలనుంది. మీకభ్యంతరం లేకపోతే చెప్పండి!'

'మా నాన్నగారిని గురించి మీకు తెలుసు. ఆయన  ధర్మసత్రంలో పద్దులు రాసేవారు. పొట్టకూటికి ఏదో ఒకటి చేయాలిగదా! నాకు ఒక అన్నయ్య. వాడి ఎదుగదలలో ఏదో ఒక చిన్న లోపం ఉంది. పెళ్లయితే చక్కబడుతుందని పెళ్ళి చేసారు. అప్పుడు కట్నంగా వచ్చిన సొమ్ములో ఓ  లక్ష  నాన్నగారు నరసింహారావు బాబాయిగారి దగ్గర దాచారు..  నా పెళ్లి ఖర్చులకోసం. దానిమీద వచ్చే వడ్డీ డబ్బుల్తోనే నేను టీచర్ ట్రయినింగ్  పూర్తి చేసాను. మా నాన్నగారి సంగీతం మీద అభిమానం ఉన్న ఒక పోస్టుమాష్టరుగారితో నా పెళ్ళి నిశ్చయమయింది . 'కట్నం వద్దు. పెళ్ళి మాత్రం ఘనంగా  చెయ్యండి' అని షరతు పెట్టారు వాళ్లు. 

అన్నయ సంగతి చెప్పానుగా. నాన్నగారికి డబ్బు  వ్యవహారాలు అంతగా పట్టవు. నరసింహారావు బాబాయిగారే పెళ్లిపెద్దలుగా వ్యవహరించారు. ఖర్చులకుంచమని నాన్నగారు తలుపూరులో ఉన్న  మాగాణి మూడెకరాలు అమ్మి రెండు  లక్షలు   బాబాయిగారి చేతిలో పోసారు పెళ్ళిఖర్చులకోసమని. 

తెల్లారి పెళ్లనంగా తరలి వస్తున్న పెళ్ళివారి బస్సును హైవే మీద ఎదురుగుండా వచ్చే లారీ గుద్దింది.  ఆ ప్రమాదంలో పోయింది ఒక్క పెళ్ళికొడుకే! పెళ్ళి రద్దయింది. 

ఎట్లా పుట్టిందో .. నేనొక  నష్ట జాతకురాలునన్న అపవాదు పుట్టింది. ఆ తరువాత పెళ్ళి సంబంధాలు రాలేదు. ఈ దిగుల్తో నాన్నగారు రెండేళ్ళ కిందట పోయారు. పోయినేడాది ఆడబిడ్డను కని వదిన చనిపోయింది. మిగిలింది నేనూ అమ్మా .. ఆ  పాప'

'మరి మీ అన్నయ్యా?'

'ఎటో వెళ్ళి పోయాడు అందిన కాడికి పెళ్లి డబ్బులు పుచ్చుకొని . ఏమయ్యాడో తెలీదు. పోయి ఏడాదిన్నర దాటింది.'

రాధమ్మ చెబుతోంటే రామ్మూర్తిగారు వింటూ కూర్చున్నారు. ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలీలేదు.

రాధమ్మను దిగబెట్టే నెపంతో ఇంటిదాకా వచ్చారు రామ్మూర్తిగారు. 

చీకట్లో తలుపు తెరవగానే 'నాన్నా!' అంటూ కాళ్లను చుట్టేసుకొంది చిన్నారి.

'సారీ సార్! దీనికి ఏ మగమనిషి  కనిపించినా నాన్నలాగే అనిపిస్తాడు. ఇంకా పసితనం వదలని వయసు'అంటూ మారాం చేసే చిన్నారిని తల్లికిచ్చి పంపించేసింది రాధమ్మ.
***

హైస్కూలు గ్రాంట్స్ విషయంలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని ఆకాశరామన్న ఉత్తరాలు వస్తోంటే పునర్విచారణకు వచ్చారు రామ్మూర్తిగారు. ఆయనకు తోడుగా మరో గుమాస్తా గుర్నాథం మాకాం గవర్నమెంటు గెస్టు హవుస్ లో.

మీడియా వాళ్లూ వాసన పట్టినట్లున్నారు. వేడి వేడి వార్తలేమైనా దొరుకుతాయేమోనని స్కూలుమీదే నిఘా వేసి ఉంచారు.

నరసింహారావుగారికి ముళ్ళమీద కూర్చున్నట్లుంది. ఎన్నడూ లేనిది  రామ్మూర్తిసారీ సారి సీరియస్సుగా ఉన్నారు. 

వచ్చి రెండు రోజులయినా ఇదివరకులా సాయంకాలాలు బైటికి రావడం లేదు! మూడో రోజు సాయంత్రం నరసింహారావుగారే చొరవ చేసుకొని 'రాధమ్మనొకసారి పిలిపించమంటారా? అని అడిగేసాడు.

'ఇప్పుడొద్దు!' అన్నారు రామ్మూర్తిగారు.

'వీలయితే నైటుకి గెస్టుహౌసుకి పంపించమంటున్నారు' అన్నాడు గుర్నాథం తరువాత రహస్యంగా.

నరసింహారావుగారి గుండెల్లో రాయి పడింది. పెళ్లికాని ఆడపిల్లని నైటుకి పంపించమంటాడేమిటీ? రాధమ్మ అలాంటిదో కాదో తనకెలా తెలుస్తుంది?

రాధమ్మ ఇంటికెళ్లి అడిగే ధైర్యం లేక ఆ రోజుకి అలాగే నిమ్మకుండి పోయాడు.

దాని ప్రభావం మర్నాడు పొద్దున్నే బైటపడింది.

'సార్! మీరు ప్రొడ్యూస్ చేసిన సిమెంటు.. స్టీలు బిల్లుల్లోని రేట్లు మార్కెట్ రేట్లకన్నా రెండింతలున్నాయి. రికవరీకి పెడితే చాలా రీపే చేయాల్సుంటుంది. అంతా ఏడెనిమిది లక్షలు దాకా తేలింది. ఇంకా ఫర్నిచర్.. ఫిక్చర్స్.. ఎకౌంట్ లోతుల్లోకెళితే ఇంకెంత తేలుతుందో! అసలీ కన్స్టక్షనుకి సర్టిఫై చేసిన  వయబిలిటీ రిపోర్టునే  సార్ సస్పెక్ట్ చేస్తున్నారు' చావు కబురు చల్లంగా బైటపెట్టాడు గుర్నాథం.

స్కూలు బిల్డింగుకని శాంక్షనయిన గ్రాంట్స్ లో సింహభాగం అల్లుడుగారికని నిర్మిస్తున్న డూప్లెక్సుకే డైవర్టయి పోయింది. 

పోయినసారొచ్చినప్పుడు చూసీ చూడకుండా పోయిన పెద్దమనిషి ఈ సారెందుకిలా పట్టి పట్టి  చూస్తున్నాడన్నీ?!'

'కమీషను కావాలంటే ఇంకో అరశాతం పెంచుదాం లేవఁయ్యా! సారు నొకసారి కదిపి చూడు గుర్నాథం!' అన్నాడు నరసింహారావుగారు.

గుర్నాథం అదో మాదిరిగా నవ్వాడు.

'ఈ సారి సారుగారి టేస్టు మారింది. భార్య పోయి ఏడాది దాటింది కదా పాపం.. గురువుగారి గాలి అటు తిరిగింది!'

'అంటే?!'

'అదే సార్! ముందా పంతులమ్మగారి మేటర్ సెటిల్ చేయండి! నిన్నే మీకు చెప్పాను కదా! తాత్సారం చేస్తే కోరి తెచ్చుకొన్నట్లుంది నష్టం' అని వెళ్ళిపోయాడు గుర్నాథం.

మర్నాడు కొర్రీలు మరీ ఎక్కువయ్యాయి. మనిషిని కదపడానికి లేదు. పరశురామ్మూర్తి అగ్గిరాముడై పోతున్నాడు.  దాదాపు రిపోర్టు తయారై పోయింది. సంతకం చేయడమొకటే మిగిలి పోయింది. ఆ రిపోర్టులో సగం నిజమని తేలినా నిండా మునగడం ఖాయం. 

డబ్బు సంగతలా ఉంచి ముందు కూతురు కాపురానికి నీళ్లొదులుకోవాల్సిందే! వయబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చింది స్వయానా అల్లుడుగారే!

ఇంట్లో కమల ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు కలగజేసుకొంది నరసింహారావుగారి భార్య వరలక్ష్మమ్మగారు. 

తానే స్వయంగా రాధమ్మ ఇంటికి బైలుదేరింది.

 'మనమిక్కడ కొంపలో కూర్చుని పాపం.. పుణ్యం అంటూ శతకాలు వల్లెవేస్తున్నాం కానీ.. గా మూడు  లక్షలు పారేస్తే ఆ పత్తిత్తు ఎక్కడికి పోవడానికయిన సిద్ధంగా ఉంది' అంది తిరిగొచ్చి.

'రెండు లక్షలా?! తనేవఁన్నా పెద్ద సినీతారనుకుంటుందా? వెయ్యి  పారేస్తే పేటనుంచి పదిమంది పరుగెత్తుకొస్తారు.' అంటూ లేచాట్ట ఫోనులో అమ్మాయి చెప్పిందంతా  విన్న ఇంజనీరల్లుడుగారు. 

కూతురొహటే పనిగా లబ్బుమంటుంటే కాలా చెయ్యి ఆడక  లేచెళ్లిపోయాడు నరసింహారావుగారు.

రాథమ్మ పథకం ఇప్పుడిప్పుడే మెల్లంగా అర్థమవడం మొదలు పెట్టింది నరసింహారావుగారికి.

బైటికేమీ తెలీనట్లుండే ఈ జాణ ఎంత పెద్ద వ్యూహం పన్నిందీ! ఈ ఉచ్చునుంచి  బైటపడాలంటే తానిప్పుడు మూడు  లక్షలు అచ్చుకోక తప్పదు. కావాలనే తాను ఆ కీచకుడి కంటబడింది. సంగీతం, సాహిత్యం అంటూ కావాలనే వాడిని ముగ్గులోకి దింపింది. దాని తండ్రి అప్పుడెప్పుడో తన దగ్గర దాచిన అప్పటి పెళ్లి డబ్బు రాబట్టడానికే ఇంత పెద్ద కథ నడిపిందీ! ఆయనిచ్చింది రెండు  లక్షలు  . ఇప్పుడిది మూడూ  లక్షలకు టెండరు పెట్టింది! ' 

'పోతే పోయింది వెధవ డబ్బు! ముందు పరువు నిలబడ్డం ముఖ్యం. కూతురు కాపురం నిలబడ్డం అంతకన్నా ప్రధానం.' అంటూ కట్టుకున్నది కూడా అడ్డం తిరిగేసరికి నరసింహారావుగారికీ ఇంకో దారి తోచింది కాదు . 

పెళ్ళాం చేతికి డబ్బిచ్చి పంపిస్తూ ఇంకో ముక్క కూడా రాధమ్మకు చెప్పమన్నాడు. 'ఇందులో ఉన్నది సగమే! రేప్పొద్దున ఆ రిపోర్టు బైటికొచ్చిన దాన్ని బట్టీ ఉంటుంది మిగతా సగం.'

రాధమ్మ రాత్రి రామ్మూర్తిగారుండే గెస్టు హౌసుకెళ్ళొచ్చిందని తెల్లారి గుర్నాథం వచ్చి  చల్లని కబురు చెప్పిందాకా నరసింహారావుగారింట్లో ఎవరికీ కంటిమీద కునుకు లేదు.

మర్నాడు ఫైనల్ రిపోర్టుమీద సంతకం చేస్తూ అన్నారు రామ్మూర్తిగారు 'నా ఇన్వెష్టిగేషన్లో చాలా తప్పులే బైటపడ్డాయి నరసింహారావుగారూ! చివరి ఛాస్నుగా లైట్ గానే రాసానీ సారికి. మళ్లా మూడు నెలలకి ఇంకో ఎన్క్వయిరీకి రావాల్సుంటుంది. ఈ  లోపలే 'ఇర్రెగ్యులారిటీస్' అన్నింటినీ సెట్ రైట్ చేసి పెట్టుకోండి!  ఆ రాధగారి ఇంటిల్లిపాదికీ దండం పెట్టుకోండి!'

రామ్మూర్తిగారు హింట్ చేసిన ' ఇర్రెగ్యులారిటీస్ ' ఏంటో  పసిగట్టలేనంత పసిబిడ్డ కాదుగా నరసింహారావుగారు! 

స్వయంగా తనే మిగతా డబ్బు తీసుకొని రాధమ్మ ఇంటికెళ్లాడు ఆ సాయంకాలమే!


వరండా అరుగుమీద ట్యూషను జరుగుతోంది.

" 'స్టాకింగ్ హార్స్' అంటే ఏంటి మేడమ్?" అని ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నది రాధమ్మ. 'మనిషంటే మిగతా జంతుజాలానికి అంతులేని భయం. వాడి నీడకయినా    చిక్కకుండా పారిపోతుంటాయందుకే! కానీ మనిషి జిత్తులకి జాకాల్ కదా! తాను మచ్చిక చేసుకున్న  ఓ గుర్రాన్ని ముందుకు నడిపిస్తూ దాని చాటున వేట జంతువును సమీపించి పట్టుకుంటాడు. అలా వేటలో మనిషికి ఉపయోగపడే గుర్రమే 'స్టాకింగ్ హార్స్'. తన ఉనికి తెలియకుండా వేరేవారి ద్వారా ఒడుపుగా పనులు చక్కబెట్టుకున్నప్పుడు అట్లా  ఉపయోగ పడిన గుర్రాన్నే 'స్టాకింగ్ హార్స్' అంటారు..'

'నన్ను పట్టుకునేందుకు పరశురామ్మూర్తిని నువ్వు స్టాకింగ్ హార్స్ గా ఉపయోగించుకున్నావన్న మాట!' అనుకున్నాడు నరసింహారావుగారు మనసులో!

పెద్దాయన్ను చూడంగానే ' నాన్నా '  అంటూ కాళ్లకు చుట్టుకుపోయింది చిన్నారి ఎప్పట్లానే!

'ఈయన నాన్నారు కాదు చిన్నారీ! తాతగారు. నిన్న రాత్రి నువ్వూ, నేనూ, అమ్మమ్మా కలసి వెళ్లామే .. బంగళాకి.. అక్కడున్నారు నీ నాన్నారు!' అంటు చిన్నారిని ఎత్తుకుంది రాధమ్మ.

నరసింహారావుగారికి అంతా అర్థమైపోయింది. నీతికి నిలువుటద్ధం శ్రీనివాసాచారిగారు. ఆయన కూతురు  తప్పు చేస్తుందనుకోడం తన తెలివితక్కువతనం. తల్లితో, పసిపిల్లతో వెళ్లిన రాధ అక్కడ ఇంకేదో చేసిందని ఊహించుకోవడం తన బుద్ధిహీనత. 

'థేంక్స్ బాబాయిగారూ! సమయానికి పెళ్లి ఖర్చులకందించారు.' అంది నరసింహారావుగారందించిన క్యాష్ బ్యాగ్ అందుకుంటూ రాధమ్మ.

'మీ నాన్నగారు నా దగ్గర దాచి పెట్టుకున్నది అందుకే కదమ్మా! వడ్డీ డబ్బులు పెళ్ళి నాటికి అందిస్తా!' అన్నారు ఇక చేసేదేమీ లేక.
***
(రచన మాసపత్రికలో ప్రచురితం)



Saturday, February 18, 2017

పాపినేని ‘పిరమిడ్’ కథ-నా పరామర్శ



ఈవారం ఆంధ్రజ్యోతి(05-02-2017) అనుబంధంలో పాపినేని శివశంకర్ 'పిరమిడ్’ కథ తెలుగుకథను  కొత్త ఎత్తులకి ఎక్కించింది.   
ఊపిరి తిరగని పనులు, ఉద్వేగం, తెరిపిలేని ఆలోచనలు తేనెటీగల్లా ముసిరి విసిగిస్తున్నా ముసి ముసి నవ్వుల గాంభీర్యం ఉదారంగా  ప్రసాదించే దర్పం   ఈనాటి     ధనిక ప్రపంచపు అధినేతల  ‘ది మోస్ట్ గ్లామరైజ్డ్’  గెశ్చరుగా ఉండటం తప్పని సరి! ఆ గ్లిట్టరింగ్ భంగిమల చాటున నీలివలయాల ఊబి ఎంతాకర్షణీయంగా   అల్లుకునుంటుందో  వివరించేందుకు పిరమిడ్ కథలో పాపినేని ఎన్నుకున్న సర్రియలిస్టిక్.. తాత్త్విక ధోరణలను ప్రశంసనీయం.
ఏ మమకారం లేకుండానే  ఊళ్లకు ఊళ్లు దత్తత తీసుకొనే శ్రీమంతులు దండిగా పెరిగుతున్న  ఈ కాలంబట్టీ చూస్తే కథాంశం ఎంత  పాతదైనా అంతే తాజాదనికూడా అనిపిస్తుంది.  ఏ అడ్డదారిలో  అయినా సరే ఎవరూ చేరుకోలేని ఎత్తులకు ఎగబాకాలన్న  మోహావేశం ఈ కథలోని ప్రధాన పాత్రది. మనందరిలోనూ.. మనుషులందరిలోనూ.. కొందరిలో బాహాటంగా.. ఇంకొందరిలో అంతశ్చేతనలో.. సదా.. బుసగొడుతుండే ఆవేశమే ఇది. అందుకే కథకీ సార్వజనీనత. తాజా ఆఘ్రాణత అమరింది.

అవధుల్లేని, శక్తికి మించిన అత్యాశను జయించడం అంత సులభంగా కాదెవరికీ. కాబట్టే.. అంతులేని అధికారం చేతుల్లో ఉండీ.. అక్రమార్జునలకు.. అడ్డదారి సుఖాలకు కక్కుర్తి పడి  కేసుల గాలాలకు చిక్కి  గిలగిలలాడే   పెద్దల కథలు.. పద్దాకా మనం.. వింటుండేది. ఆ వ్యథలు కళ్లారా చూస్తున్నప్పుడు.. ఆ కథలు  చెవులారా వింటున్నప్పుడు .. వేరే వారివి.. ఎవరివో.. చదువుతున్నామన్న భ్రమే కానీ.. నిజానికి ఆ ఆశోపహతుల పతాక సన్నివేశ హీనత్వం మన మోహావేశాల పతనాల పర్యవసానానిక్కూడా  చెందిందేనని తెలుసుకోలేం. అవకాశం దొరకని అదృష్టమేదో మనలోని చాలామందిని ఇంకా బుద్ధిమంతుల పద్దుకిందే మిగిల్చి ఉందన్నదే అసలైన చేదు నిజం.

ఒక కథ గొప్పగా కుదరాలంటే కుదరాల్సిన దినుసులేవీ? విమర్శక్కూర్చుంటే  ఎవరెవరివో ఏవేవో తర్కాలు.. వాదాలు ముందుకు వస్తాయి!  విమర్శ అంటేనే వైరుధ్యం.. వైవిధ్యం తప్పని వేదిక కదా! తప్పుకు పోవడం కుదరక పోవచ్చు. ఆ దారిలో తప్పి పోవాలన్న ఉద్దేశం ప్రస్తుతం లేదు.  ఈ నాలుగు ముక్కలూ..  ‘పిరమిడ్’ కథలో రచయిత పదును పెట్టిన పనిముట్లను గురించిన చిన్న ప్రశంస. అంతే!     

కచ్చితమైన కొలతల ప్రకారమే కుట్టిన అంగీ యథాలాపంగా తయారైన  జేబురుమాలుకన్నా అందంగా ఉండి తీరుతుందనీ ఘంటాపథంగా చెప్పలేం కదా ఎవరమైనా? కంటి నదురు నిర్మాణంలో ఎవరం నిర్వచించలేని ఏదో పదార్థం దాగుంది. అదే విధంగా  ఓ కథ  మనసుకి హత్తుకొనే తీరులోనూ ఇతమిత్థమని చెప్పలేని ప్రతిభా పాటవమేదో ఉండే ఉంటుంది.   పాపినేని 'పిరమిడ్' కథలో  వాటి పాళ్లు వందశాతం కుదిరాయనిపిస్తుంది. కాబట్టే  నా బోటి అభిరుచిగలవారి బుద్ధికి ఇంతలా పట్టిస్తోంది.. అనిపిస్తోంది.

ఆరు మూరలుగా తీర్చి దిద్దిన ఈ హారంలోని ప్రతీ దృశ్యమూ ముందేం జరగబోతుందో  మనమూహించలేనంత గొప్ప సస్పెన్సుతో అయితే ఏమీ నిండి ఉండదు. మొదటి దృశ్యంలోనే ముఖ్య పాత్రల మనస్తత్వాల మధ్యుండే తారతమ్యాన్ని సింబాలిక్ గా రచయిత  ఉప్పందించడంతో   ఆరో దృశ్యంలో ప్రధాన పాత్రకు ఏ అథోగతి పట్టపోతుందో కథాక్రమంలో మనం ముందే తేలిగ్గా  ఊహించేసుకోవచ్చు. అందునా రచయిత ప్రవేశపెట్టిన పాత్రల్లో ఏదీ  కొత్త తరహాది కాదు. అన్నీ పాత సినిమా రొటీన్ యావరేజ్ కథలో మాదిరివే. ఒక అత్యాశ,  ఆ దుర్గుణంతో సర్దుకువస్తున్న  బాల్యస్నేహం, కంటిముందే  కానవస్తున్నా కన్నూ మిన్నూ కానకుండా  ఆ ఉపద్రవాన్నుంచి తన్ను తప్పుకోగలనన్న ధీమా ఇచ్చిన   అత్యుత్సాహంతో ఎత్తులెత్తుల కెగబాకే దుస్సాహసం,  ఆ దుష్టసాహసంబెల్లం చూట్టూ చేరే సూడోప్రేమఈగలరొద, ఆ రొదను భరించలేక తెగించి వదిలి వెళ్లిపోయే రక్తబంధం, అలా తెగించలేక.. అలాగని  తెగింపుతో సర్దుకుపోలేక సతమతమయ్యే సతీధర్మం.. చివరాఖరికి రొటీన్ తెలుగు సినిమా పతాకసన్నివేశం టైపు ప్రతినాయకనిర్వాకం పశ్చాత్తాపం! అందంగా నిర్మించుకున్న భూగృహాంతరాల్లో  పేర్చుకున్న కుబేరత్వం పొరల మధ్య నిజాయితీ కంటికి స్పష్టంగా కనిపించే   'నీలి వలయాలని' నిర్లక్ష్యం చేసినందుగ్గాను  పడే పశ్చాత్తాపం అది!  పిరమిడ్ అట్టడుగున ఏముంటుందో తెలిసీ పిరమిడ్ కట్టేందుకే మోహపడే మోజుకు చివరికి పట్టే గతి ఎలాగుండబోతుందో హెచ్చరించేందుకే  రచయిత  ఈ కథ చెప్పాడా? ..  'ఎదుగుదలని స్కేళ్లతో, చెక్కుల్తో, లాభాల్తో కొలిచే   అత్యాశా భౌతికవాదానికి ‘పిరమిడ్’ కథ  నిజంగా ఒక చెంప పెట్టు'  అని ఓ సారి పొగిడి పుస్తకమవతల పారేస్తే. ఓ పనై పోతుంది.   ఎంతోమంది రచయితలు కొట్టారు అలాంటి  చెంపదెబ్బలు గతంలొ.  ఎన్ని  వినుంటామో మనం! మరి ఇందులో మాత్రం ప్రత్యేకంగా విశేషం ఏముంది?!
ఉంది. కనకనే ఈ ముచ్చట.
పాపినేని చెప్పినట్లు 'పై పైకి పోయే కొద్దీ పతనభయం పెరుగుతోందన్నది’ సాధారణ సూత్రమే. ఎవరికి తెలియని రహస్యమది? యథాతథంగా చెబితే మహా విసుగ్గా అనిపించే ఇలాంటి ఇంకెన్నో సూత్రాల చుట్టూతా కథను అల్లే సమయంలో  రచయిత ఏ ఎత్తులు వేసాడో..  ఆ  ఎత్తుల్లోని ఉత్తమ ప్రతిభనొకసారి భుజం తట్టాలన్న ఉబలాటంతో రాసిందీ  ప్రశంస.

కథను పాయలు పాయలుగా చీల్చి చెప్పడం మరీ అంత కొత్త ఎత్తుగడేం కాదు. గతంలో రావిశాస్త్రిలాంటి ప్రతిభావంతులు ఎందరో పరిచిన దారే అది. కథనంలోనే కనిపించింది  పాపినేని తనదైన  ప్రతిభంతా.   దాదాపు  ప్రతీ వాక్యాన్ని ఒక అధివాస్తవిక ప్రతీక ధోరణిలో.. కొండొకచో కొన్ని పదాలను అంతకు మించిన  తాత్విక 'స్పృహతో..చెక్కుకుంటూ పోయాడీ రచయిత. ఎక్కడా ధారా ఉధృతి మందగించకుండా ప్రవహించడం అంత సులభమైన విద్యేం కాదు. పాపినేనిని ప్రశంసించకుండా ఉండలేం ఈ అవిఛ్చిన్న ధారాశుద్ధికి.     అందమైన ‘పిరమిడ్’ను చలవరాతి పొరలుగా పైకి పైకి పేర్చుకుంటో పోయే తీరులో.. కథ   కట్టడంలో రచయిత కనబరిచిన   మేస్త్రీ పనితనం ‘పిరమిడ్’ కథకు శాశ్వతమైన అందాలు చేకూర్చి పెట్టింది కచ్చితంగా.
ఇటలీనుంచి దిగిన పాలరాళ్లతో, బెల్జియం అద్దాలతో, వెనీషియన్ షాండ్లియర్సుతో, ఫ్రెంచి కళాకౌశల్యాన్ని తలపించే అత్యంత ఖరీదైన ప్రాసాదాన్ని గొప్పకోసం ప్రధాన నాయకుడు చూపించినప్పుడు.. 'నీ అష్టాంగాలు విడివిడిగా ఒక్కో గదిలో పడుకొన్నా ఇంకా చాలా మిగిలి పోతాయి' అంటాడా బాల్యస్నేహితుడు సరదాగా.  అతగాడిని అమాయకుణ్ణి చూసినట్లు చూస్తాడా ముఖ్య నాయకుడా సందర్భంలో.  స్నేహితుడు సరదాగా అన్నది సరదాగా కాదు. అసలైన అమాయకత స్నేహితుడిది కాదు. ఎత్తులకెగబాకాలని పాకులాడే ఆ ప్రధాన పాత్రదే అని ఫలితాంశంగా చెప్పేందుకు పాపినేని శివశంకర్  ఉపయోగించిన పనిముట్లకు జిందాబాద్!
ఆరో దృశ్యంలో.. కటకటాల్లో ఉన్న ప్రతినాయకుడి చేత 'How much land does a man need?' పుస్తకం చదివించాలనుకుంటుంది రచయిత పాత్ర. మంచిదే!  ఊచల వెనుక చేరగిలున్నప్పుడు తాత్కాలిక  కుంగుబాటుకు మందుగానో.. ఉబుసుపోకకో  ఆ  పుస్తకం చదవితే చదవవచ్చు. నచ్చినా నచ్చుండవచ్చేమో ఆ క్షణానికి.  కానీ.. కాలం కలసివచ్చి భోగం చెరనుంచి బైట పడినప్పుడు  మళ్లీ మరో పిరమిడ్ నిర్మాణానికి  సిద్దపడని పరిణతి సాధించినప్పుడు కదా కథకు సార్థకతంటూ ఏర్పడేది? అంటారా?

‘చెప్పడమే నా ధర్మం.. వినకపోతే నీ ఖర్మం’ అంటాడు నారాయణుడు నరుడితో భగవద్గీతలో.కథకు సంబంధించినంత వరకు రచయితది కేవలం పర్మాత్ముడి పాత్రే.  పాత్రల పరివర్తనకు రాతగాడెంతమాత్రం జవాబుదారీ కానేరడు.
కథలోని అంతిమ నైతిక నీతిసూత్రం కాదు  పాపినేని  ‘పిరమిడ్’ కథను గొప్పకథల సరసన చేర్చింది. పాతదే అయినా కథను సరికొత్త పంథాలో  నడిపించిన రచయిత  ప్రతిభ. 
రాన్రానూ.. రక రకాల సోయగాలతో  నునుపు తేలుతున్న  తెలుగు కథాసుందరికి మరో సౌందర్య హారం అమర్చి పెట్టిన పాపినేని శివశంకర్ కు  అభినందనలు. పాఠకుల తరుఫున ధన్యవాదాలు.
-కర్లపాలెం హనుమంతరావు
ఫోన్ నెంః  8142283676

ఫ్లాట్ నెం# 404, శ్యామ్ కామధేను అపార్ట్ మెంట్.
మోతీ నగర్,  హైదరాబాద్- 50001
https://onedrive.live.com/?cid=4B36C8046FCB7142&id=4B36C8046FCB7142%21227353&parId=root&o=OneUp



Saturday, February 11, 2017

కౌగిలింతల దినం- ఫిబ్రవరి 12


కౌగలింత  ప్రేమకు సంకేతం. కౌగిలిలో ఒదిగిన వారికి అంతులేని స్వాంతన లభిస్తుంది.  మంచి ఆరోగ్యానికి అది సంకెతం కూడా. బిగి కౌగిలి బిడియాన్ని సడలిస్తుంది. దూరమైన మనసుల్ని దగ్గరకు చేరుస్తుంది. దగ్గరి మనుషులకి మరిన్ని ఆత్మీయభావనలు పంచుతుందీ. హృదయంతో తప్ప .. అక్షరంతో.. స్వరంతో అక్కరపడని   పలకరింత 'పరిష్వంగం'. ప్రతీ సంవత్సరం ఈ కౌగిలిని స్మరంచుకుంటూ 'పరిష్వంగ దినం'
జరుపుకోవడం పడమటి దిక్కున ఒక అలవాటుగా మారింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మనమూ కౌగిలింతల వలన కలిగే లాభాలు ఏమిటో ఒక సారి విచారిస్తే దోషమేముంది?!

రోజుకు కనీసం 8సార్లు కౌగిలించుకోవాలని విజ్ఞాన శాస్త్రం బోధిస్తుంది. అందుకు అది చెప్పే 10 కారణాలు.

1. మానసికమైన వత్తిడికి కౌగిలింత కానీ ఖర్చులేని మంచి యోగాసనం.  కుంగుబాటులో ఉన్నవారికి కౌగిలిని మించిన మంచి నెచ్చలి లేదు, వెచ్చని కౌగిలి శరరంలోని ఆక్సిటోన్ స్థాయిని పెంచుతుంది. తద్వారా భావోద్వాగాలనుంచి తొందరగా మనిషిని బైటపడేస్తుంది.
2.               సుదీర్ఘమైన కౌగిలింత శరరంలోని సెరొటోనిన్ స్థాయినీ పెంచుతుందని.. ఆ  కారణంగా అకారణ  భావోద్రేకాలనుంచి బైటపడటం తేలికవుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
3.               సాంఘికంగా ఆందోళనలో ఉన్నవారికి దగ్గరివారినుంచి కౌగిలింతలు లభిస్తే సమూహంలో తొందరగా కలిసిపోయేందుకు సహాయకారిగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు తెలియ చేస్తున్నారు.
4.               మనుషుల మధ్య మాటలతో సంబంధం లేకుండానే భావాలను పంచుకొనే వారధిగా పనిచేస్తుంది కౌగిలింత. ఇద్దరు వ్యక్తుల మద్య చెడిన సంబంధాన్ని మాటా పలుకు అవసరం లేని కౌగిలింత తొందరగా చేరువ చేస్తుందని మానసిక తత్వవేతల అభిప్రాయంగా ఉంది.
5.               బాల్యంలో తల్లి కౌగిలింతలు.. తండ్రి మురిపింతలు .. తోబుట్టువుల,  స్నేహితుల మధ్య తరచు సంభవించే కౌగిలింతల అనుభవాలు  సుషుప్తావస్థలో మధుర భావనులుగా స్థిరబడిపోయుండంవల్ల.. మనిషి  ఎదిగిన తరువాతా ఆ విధమైన కౌగిలింతల అనుభవానికి లోనయినప్పుడు బాల్యంనాటి ఆ సుమధుర  భావనాస్మృతులు మరింత  భద్రతా భావనలను  పెంచుతాయంటున్నారు  మానసిక శాస్త్రవేత్తలు.
6.               గాయమైన సందర్భంలో శరీరానికి అందే ఆక్సిటోసిన్  వల్ల ఆ బాధ తొందరగా మాయమవుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే ఆక్సిటోసిన్ ఉత్పత్తి    ఉత్పత్తి కౌగిలింతల్లో కూడా పెరుగుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
7.               హృద్రోగ సంబధమైన రుగ్మతలకు, అధిక రక్త పీడితులకు సన్నిహుతలనుంచి తరచు లభించే కౌగిలింతలు సత్వర ఫలితాలిచ్చే  ఔషధాల్లా పనిచేస్తాయని   ఆరోగ్యనిపుణులూ నిర్ధారిస్తున్నారు.
8.               తెల్లరక్త కణాల ఉత్పత్తికి కారణమయిన థైమస్ గ్లాండ్ ని కౌగిలింతలు ఉత్తేజపరుస్తాయని.. ఆ కారణంగా తరచు పరిష్వంగ సౌభాగ్యం లభించే అదృష్టవంతులకు దీర్ఘాయుష్షు అయాచిత వరంగా లభిస్తుందన్నది వైద్యనిపుణుల అభిప్రాయం కూడా.
9.               క్రోధాన్ని కట్టడి చేసేందుకు కౌగిలింతలకు మించిన మందు మరోటి లేదని మనస్తత్వ  శాస్త్రవేత్తలు నొక్కి చెపుతున్నారు.  తరచూ ఆందోళనకు గురయ్యే లక్షణాలున్న వారిని వీలయినంత తొందరగా శాంతింప చేసేందుకు కౌగిలింతలే మంచి చిట్కా.
10.           ఆఖరుదే అయినా అత్యంత ముఖ్యమైనది. దగ్గరి వారిని కోల్పోయినప్పుడు,  ప్రేమవంటి వ్యవహారాల్లో విఫలమైనప్పుడు నోటితో చెప్పలేని బాధ గుండెల్ని పిండేస్తుంటుంది. ఆ సందర్భంలో అనునయించేందుకు  దగ్గరికి చేరిన వారికైనా ఏం మాట్లాడాలో తెలియనంత ఇబ్బందికర స్థితి. సరిగ్గా అల్లాంటి సందర్భాలకోసమే మనిషికి ఆయాచితంగా దక్కిన గొప్ప వరం కౌగిలింత.

ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లోనూ ఈ కౌగిలింతల పర్వం  ఏదో ఒక రూపంలో బహిరంగ ప్రదర్శనగానే సాగుతో వస్తోన్నది.   భారతీయ సంస్కృతిలో  సైతం   ప్రేమ జంటలు ఆంతరంగికంగా సాగించే శృంగార  పరిష్వంగాలను  మినహాయించి.. తల్లీ బిడ్డల,  ఆత్మీయుల,  స్నేహితుల మధ్య సందర్భాన్ని బట్టి సాగే కౌగిలింతల్లో ఎబ్బెట్టుతనం ఏమీ ఉండదు.

ఏదో ఒక మిషతో రోజుకు కనీసం 8 సార్లకు తగ్గకుండా  కౌగిలింతలకు లోనైతే  మరో ఖరీదైన జౌషధంతో పనిలేకుండా మనిషి ఆరోగ్యంగా పనిచేసుకు పోగలడన్నది వైద్య శాస్త్రం  సలహా.    కౌగిలింతల కారణంగా  మానవ జాతికి వనగూడే ప్రయోజనాలను ఏడాదికి ఓసారైనా  గుర్తు చేయాలన్న సదుద్దేశంతో  ఉద్దేశంతో ప్రతీ ఏడాదీ.. ఫిబ్రవరి 12ని కౌగిలింతల దినంగా ప్రకటించాయి ప్రభుత్వాలు.

ఆరోగ్యమే మహాభాగ్యమైతే.. అందులో కౌగిలింతలు.. అందమైన  ఆనందకరమైన  మహద్భాగ్యమైన మందులు.
-కర్లపాలెం హనుమంతరావు


Wednesday, February 8, 2017

అతనొస్తున్నాడు!- కౌముదిలోని- మరీ చిన్న కథ



'అతనొస్తున్నాడంట ఇవాళ!'
'ఇవాళా?!'
'అవును. మీ బాస్ ఫోన్ చేసాడు. నువ్వు రిఫ్రెషింగ్ రూంలో ఉన్నావని నేనే లిఫ్ట్ చేసా.. సెల్'
'…'
'నీ కివాళ ఆఫ్ కదా?'
'అవును. అందుకే ఆంటీకి ఆర్థోపెడిక్ అప్పాయింట్ మెంట్ తీసుకుంది. ఇప్పుడు కాకపోతే.. మళ్లా మూణ్నెల్లగానీ డేట్ దొరకదు కృష్ణా!'
'మరేం చేద్దామనుకుంటున్నావ్! పోనీ మేటర్ ఇది అని మీ బాస్ కి చెప్పేసెయ్! ఏమన్నా ప్రాబ్లమా?'
'తనకేం ప్రాబ్లం! నాకే కదా ప్రాబ్లం! రాక రాక వచ్చిన అవకాశం  ఇది. లూజ్ చేసుకోకూడదని మా గురూజీ గొడవ. రానంటే ఏమీ అనరు కానీ.. నాకే ఏదోలా ఉంది'
'నో ప్రాబ్లం రాణీ! పోనీ నేను వెళతాలే అమ్మతో డాక్టరు దగ్గరికి. నువ్వెళ్ళి పో! అంతలా ఫీలవాల్సిన అవసరం లేదు. అవతల వచ్చే పర్సన్ ఎంత ఇంపార్టెంటో.. అదీ చూసుకోవాలిగా.. ప్రొఫెషన్లో!'
'థేంక్యూ డార్లింగ్.. సిట్యుయేషన్ అర్థం చేసుకొన్నావు..  గ్రేట్!'
***
'అందరు వచ్చినట్లేనా! వాటెబౌట్ రమా?'
'తన కివాళ పెళ్లి చూపులున్నాయి సార్!'
'హ్మఁ! బ్యాడ్ లక్ టు హర్! అతి కష్టం మీద దొరికిందీ ఛాన్సు! మీకు తెలుసు. మళ్లీ రారు కనకనే ఇలాంటి వాళ్లు.. మిమ్మల్నందర్నీ ఇంతలా అలర్ట్ చేస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే  మీరంతా చాలా లకీ గైస్! మా రోజుల్లో ఒక్కడంటే ఒక్కడైనా ఇలాంటి వ్యక్తి తగల్లేదు మాకు. జస్ట్ ఎవరో చెబితే వినటమే! ఇంకెక్కడికో వెళ్లాలనుకున్న వ్యక్తి ఆఖరి  నిమిషంలో మనసు మార్చుకొని మన సంగతి తెలుసుకొని మరీ  వెతుక్కుంటూ  ఇక్కడకు రావడం నిజంగా నాకైతె ఇప్పటికీ ఒక మిరకల్లాగానే అనిపిస్తుంది'
'సార్! ఆ మెరికల్ మీలోనూ ఉంది.  ఆయనకా నమ్మకం కలిగించింది మీరు. మీ లాంటి వాళ్లు దొరకడం ఆయనకూ.. మాకూ.. ఇద్దరికీ లకీనే!'
'ఓకే.. ఓకే.. గైస్! వచ్చిన వాళ్లంతా పెంటనే ప్రిపేరయి పోండి! ఎక్కడా మన వైపునుంచి మిస్టేక్ ఉండ కూడదు. అమెరికా వెళ్లే మనిషి. ఇక్కడికి తిరిగొచ్చింతరువాత మళ్లీ మనల్నే  వెతుక్కుంటూ రావాలి. అదే మీ అందరికి ఇప్పుడు అసలు టెస్టు. మూవాన్ గైస్! సెల్ రింగవుతుంది. అతనొచ్చేస్తున్నాడు.'
***
'మ్యాడమ్!  నాకివాళ అప్పాయింట్మెంటుంది కదా! ఎందుకిలా అర్థాంతరంగా కేన్సిల్ చేసారు?'
'సారీ సార్! అనవాయిడబుల్ సర్కమస్టెన్సస్! అర్థం చేసుకోండి'
'ఏమర్థం చేసుకోవాలమ్మా! అవతల ఇంకెవరో పెద్దమనిషి వస్తున్నాడని.. ఎప్పడో ఇచ్చిన మా డేటుని సడెన్ గా ఇలా కేన్సిల్ చేస్తారా! ఇదేమన్నా బావుందా?'
'చెప్పాంగా! తప్పనప్పుడే కదా ఇలా చేస్తాం.  మిమ్మల్ని డిజ్ రెస్పేక్ట్ చెయ్యాలని మాకెందుకుంటుంది? అవతల వచ్చే వ్యక్తికి ఇబ్బంది ఉండకూడదనే మా కన్సర్న్.. మళ్లీ మరో డేటు తీసుకోండి. మరేం ఫరవాలేదు, ఇవన్నీ నిదానంగా చూసినా ప్రమాద ముండదు అని చెప్పమన్నారండి మిమ్మ్లని చూసే డాక్టరుగార్.'
ఫోన్ కట్ అయింది.
***
'ఎవరితోనే అంతలా గొడవ పడుతున్నావ్? ఇచ్చిన అప్పాయింట్ మెంటును కూడా కాదని.. హఠాత్తుగా వస్తున్న మనిషికి అంత ఇంపార్టెన్సిస్తున్నారు! ఎప్పుడూ లేంది.. ఈ చిన్నడాక్టర్లంతా ఇవాళ ఒకేసారి కనబడుతున్నారు ,,, అసుపత్రిలో! వచ్చే పేషేంట్ మరీ అంత ఇంపార్టెంటా?'
'వెరీ ఇంపార్టెంట్ తల్లీ! అందుకే కదా పొద్దుట్నుంచీ ఇంతలా హంగామా! ఆయన ఆ వాసన్   ఆసుపత్రి పేషెంటంట.. చాలా కాలం బట్టీ. కొత్తగా హెల్త్ కార్డు స్కీములొచ్చాయి కదా! అక్కడ ఉచితంగా వైద్యం దొరకదని తెలిసి మన దగ్గరుందని తెలిసి  వచ్చాడు. ఈ పేషెంటుది ఎడ్వాన్స్డ్ కేసు గ్లాకోమియా.
'అంటే చూపు మెల్ల మెల్లంగా తగ్గిపోతుందీ.. కొంత కాలాని కసలు చూపే పోతుందీ.. ఎన్నటికీ నయంకాని జబ్బు!అదేనా?'
'అవును.ఇప్పటికే ఎడం కన్ను పూర్తిగా పాడయిందతగాడికి. కుడి కంటిక్కూడా అంటుకుంది జబ్బు. ఇలాంటి కేసులు లక్షల్లో ఒకటి కానీ ఉండవంట. దొరక్క దొరక్క దొరికింది కదా! ఈ రేర్ కేసును  మన చిన్న డాక్టర్లందరికి పత్యక్షంగా   చూపించి ట్రీట్మెంటు ప్రాక్టీస్ చేయించాలని మన పెద్ద డాక్టరుగారి హడావుడి.' అంది రిసెప్షన్ కౌంటర్లో కూర్చున్న పిల్ల ఈ మధ్యనే  డ్యూటీలో చేరిన మరో పిల్లతో.
ఆ అమ్మాయి ఇంకా ఏదో అడగబోతుంటే వరండాలో సందడి మొదలయింది.
'నీ సందేహాలన్నీ ఆనక. ముందీ పేష్ంట్ కేస్ షీటు దగ్గర్రడీగా ఉంచుకో.. అతనొస్తున్నాడు' అని లేచింది రిసెప్షనిష్టు.
***

-కర్లపాలెం హనుమంతరావు

(కౌముది- అంతర్జాల మాసపత్రికలో ప్రచురితం)-

Monday, February 6, 2017

గాంధీజీ గాండీవం- సత్యం.. అహింస- ఈనాడు ఆదివారం సంపాదకీయం


హాయిగా బతకమని దేవుడు భూమ్మీదకు పంపిస్తే- మనిషికే మనిషి అరి, నరుడికే నరుడు ఉరిగా మారిన కత్తులమారికాలం ప్రస్తుతం నడుస్తోంది. 'జరతో, రుజతో ఎలాగూ ముంచుకొచ్చే మరణాన్ని మనిషి హింసావేశపాశాలతో మరింత ముందుకు నెట్టుకొచ్చుకుంటున్నాడే! నరుడే నరకాసురుడుగా మారుతున్నాడే' అని ప్రజాకవి దాశరథి నొచ్చుకున్నప్పటి దారుణ పరిస్థితులే నేడూ ఉన్నాయి. కంటికి కన్ను, పంటికి పన్ను అన్న వాదమే- ప్రపంచమంతా ప్రజ్వరిల్లే అగ్నికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోన్నది. దాయాదులతో యుద్ధమా?.. సంధా? అనే సమాలోచనలు పాండవుల మధ్య పెద్ద రాద్ధాంతాన్నే రగిల్చింది. 'త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తమ్మన్నముం బెట్టి, రే/ చేటున్ వాటిల కున్కి కష్టపడి కాశీయాత్ర కంపించి, ర/చ్చోటన్ కొంపకు నిప్పుపెట్టి, రడవుల్ చుట్టించిరి' కౌరవులని మొదట పాండవులు రోషపడ్డారు. చివరికి ‘అయిదూళ్లయినను చాలు’ అని సరిపెట్టుకోవడమే మేలన్న వారి తీర్మానం వెనుక ఉన్న మర్మం ‘అహింస మాత్రమే పరమ ధర్మం’ అన్న సృష్టి సూత్రాన్ని విస్మరించకపోవడమే. హింసామయ జీవితాన్ని ధర్మశాస్త్రజ్ఞులు ప్రశంసించరు. రాయంచపై దేవదత్తుడు చూపించిన క్రౌర్యాన్ని బుద్ధుడు కాకముందే సిద్ధార్థుడు నిరసించాడు! క్రౌంచ పక్షుల జంటను నిష్కారణంగా కిరాతుడు హింసించాడనే గదా బోయదశలో ఉన్నా వాల్మీకి ఎదలో అంత ఆవేదన రగిలింది! హింసకు హింసే సమాధానం కానవసరం లేదు. నవనందుల దానవ ప్రవృత్తికి ఆచార్య చాణక్యుని ప్రతిస్పందన- మౌర్య సామ్రాజ్య సువర్ణ పాలన. అహింసాలతలు రక్కసి మూకల వికృత చర్యల సెగ తగిలి వసివాడినప్పుడల్లా పాదులుతీసి దయారసాలు చల్లి తిరిగి చివురులు పూయించిన ప్రేమమూర్తుల జాబితా చిన్నదేమీ కాదు.

ఈ  విశాల ప్రపంచ వైద్యాలయంలో హింసాబద్ధులైన రోగులను ఉద్ధరించే వైద్యం- సత్యం, అహింస, శాంతి, కారుణ్యాలనే  చికిత్సా విధానాలే- అంటాడు ఖలీల్ జిబ్రాన్. చర్మ చక్షువులతో తేరిపార చూడలేని కర్మసాక్షి ఉనికి కిరణరశ్మి స్పర్శానుభవంద్వారా తెలివిడికొస్తుంది. విశ్వ వైద్యనారాయణుల చేతిచలువ జీవికి అనుభవంలోకి తెచ్చేది ఆ కారుణ్య చికిత్సలతోనే అని నమ్మి ప్రబోధించిన క్రైస్తవ సాధువు- ఫ్రాన్సిస్. మరణశయ్యమీద ఉండీ, జీవితాంతం సేవచేసిన గార్దభానికీ కృతజ్ఞతలు చెప్పటం మరవని కరుణామయుడు ఆయన. తోటి జీవాలతోటి సద్భావనతో మనిషి మెలగవలసిన తీరును, అవసరాన్ని లోకానికి చాటిచెప్పిన సాధుశ్రేష్ఠుల జాబితా దేశ కాల మతాలకు అతీతంగా  లెక్కకు మిక్కిలిగా ఉంది. 'ప్రపంచానికి నేను కొత్తగా చెప్పే పాఠం ఏముంది?  సత్యం అహింస శాంతి  హిమాలయాలంత సనాతనమైనవి. గంగా జలమంత పునీతమైనవి' అని మహాత్మాగాంధీ చెప్పుకోవడంలోని అంతరార్థమూ ఇదే. ఇంటికి నిప్పంటించిన కంటకునైనా సరే... కంట కన్నీరు కోరుకోరాదు- అనేది అజాతశత్రువు తత్వం.  ప్రబోధం వరకే పరిమితమవకుండా నిత్యజీవితంలో సైతం అనుక్షణం ఆచరించి చూపించినందువల్లే గాంధీజీని నేటికీ ప్రపంచం మహాత్మునిగా గౌరవించుకుంటున్నది. 'విష పాత్రమెత్తి త్రావెడి మహాయోగి కన్‌గొనలలో తాండవించిన యహింస/ హృదయేశ్వరిని వీడి కదలు ప్రేమతపస్వి బరువు చూపుల పొంగిపొరలు కరుణ/ సిలువపై నిండు గుండెలు గ్రుమ్మరించు దయామూర్తి నుదుట పారాడు శాంతి/ శిరసు వంచక స్వేచ్ఛ కొఱకు పోరాడు వీరాగ్రణి హృదయాన నలరు దీక్ష'- ఏకమై జాతి  పూర్వపుణ్యసంపత్తి ఫలంగా పోరుబందరులో పుత్లీబాయి పొత్తిళ్లలో ఒత్తిగిలి నేటికి నిండు నూటనలభై రెండేళ్లు.

స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతున్న సమర రూపాలకు రక్తపాత రహితమనే కొంగొత్త సహన సిద్ధాంతాన్ని అద్ది గెలుపు మలుపులో సత్య అహింస శాంతి అనే యోధులను నిత్యం కాపుగా ఉంచిన సాహసి మోహన్ దాస్  గాంధీ. అగ్నితో అగ్ని ఆరదు. చల్లబడాలంటే నీరు చల్లక తప్పదు. కరుణలేనినాడు ధరణి లేదు. కరుణలేని నరుడు వట్టి గడ్డిబొమ్మ- ఇదీ బుద్ధుని అష్టాంగమార్గం. భూలోక స్వర్గసృష్టికి అదే సులభమార్గమన్న  సూత్రం కనిపెట్టిన కర్మయోగి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. శాస్త్రవేత్త ఐన్‌స్టీనే విస్తుపోయినట్లు 'కంటితో చూసి ఉండకపోతే కల్పనేమో అన్నంత వింత' బాపూజీ  సత్యాహింసల జీవనప్రస్థానమంతా! పల్లెనుంచి ఢిల్లీదాకా దేశంలో బాపూ పేరుతో ఊరో, నగరమో, రాస్తానో, చౌరస్తానో, వాహ్యాళి స్థలమో, వాహనాల స్థావరమో.. కానరాని చోటు లేదు భారత దేశంలో. సంతోషం. జేబులో తప్పనిసరిగా ఉండే కరెన్సీ నోటుమీదా ఆ బోసినవ్వుల బాపూజీ ప్రత్యక్షం. మరీ సంతోషం. బాపూజీ రూపం కేవలం ఆరాధ్యభావన వరకే  పరిమితమా?! ఆ కర్మయోగి విడిచివెళ్లిన చేతికర్ర, చెప్పులజత, బొడ్డుగడియారాలకు ఇస్తున్నపాటి విలువైనా- సిలువలేని ఆ యేసుప్రభువు ప్రవచించిన మానవీయ విలువలకు మనం ఇస్తున్నామా? బంతివంటి భూగోళాన్ని పంచుకొనేందుకు పసిపిల్లలకన్నా మిన్నగా ఎన్ని విధ్వంసాలు? విషాన్ని మించిన విద్వేషం పరస్పరం చిమ్ముకోడం.. మానవత్వానికే మాయని  మచ్చ! విరోధంతో లేపిన గోడలు చివరికి సమాధులుగా చరిత్రలో మారనిదెన్నడు? బాపూజీ జన్మదిన  శుభసందర్భం ప్రపంచ శాంతి, సహన దినంగా ఐక్యరాజ్య సమితి పరిగణించడం ప్రారంభించి ఇది అయిదోఏడు. మనిషి స్వేచ్ఛా స్వాతంత్య్రాల పోరాటానికి, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానమైన  మానమర్యాదలు సాధించి తీరాలని  ఆరాటపడే అణగారిన వర్గాలవారికి  బాపూజీ చూపించిన శాంతి, అహింసలు మాత్రమే  తిరుగులేని పాశుపతాస్త్రాలని  మరింతగా ప్రచారానికి తేవాల్సిన సందర్భమిదే. సత్యాహింసల అగత్యం ఇంకింత స్మరణకు నోచుకొనే తరుణమూ నిశ్చయంగా ఇదే. కవి కృష్ణశాస్త్రి భావించినట్లు 'తన కంఠమున దాచి హాలాహలం/ తలనుంచి కురిపించి గంగాజలం/ మనిషి శివుడవటమే గాంధీ వరం'. అసహనంతో శివమెత్తిపోతున్న నేటి విశ్వం సర్వస్వం ఆ శివతత్వం అలవర్చుకోవాలని ఈ బాపూ జన్మదిన పర్వం( అక్టోబర్,౨)  నాడు కోరుకొందాం మనమందరం!
***
(ఈనాడు సంపాదకీయం, 02-10-2011)


_________________________

Sunday, February 5, 2017

పెరటి మందు- చతుర కథ




నాలుగు రోజులుగా ఒంట్లో బాగుండటం లేదు. టెంపరేచర్ చూస్తే నార్మల్ గానే ఉంది. కానీ ఆకలి మందగించింది. దాంతోపాటే చురుకుదనమూ తగ్గింది బాగా. ఇదివరకు ఇలాగే సుస్తీ చేసినప్పుడు డాక్టర్ రామనాథంగారి దగ్గర కెళ్లాను. 'అన్నీ వితిన్ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం తొందర్లోనే మెజారిటీలో కలసిపోతారు' అన్నాడాయన.

'మెజారిటీ అంటే?'

'మన దేశంలో నలభై ఏళ్ళు దాటినోళ్ళందరికీ బి.పిలు, షుగర్లు తగులుకుంటున్నాయి. ఆ మెజారిటీ' అంటూ నవ్వి టానిక్కులూ అవీ రాసిచ్చి క్రమం తప్పకుండా వాడమన్నాడు. మళ్లా నెలరోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు.
డాక్టరుగారిచ్చిన మందులే కాదు, ఇంకా చాలా మందులు అదనంగా వాడుతున్నాను చాలా కాలం నుంచి. ఆ డాక్టర్నే కాదు.. ఇంతకుముందు ఇంకా చాలా మందిని కల్సిన కారణంగా.. తగ్గినట్లే తగ్గి మళ్లా సుస్తీ ఎందుకు తిరగ బెట్టేస్తుందో అర్థం కావడంలేదు. అందుకే ఈ అవస్తలన్నీ!

ఒంట్లో ఓపికుండంగానే వాలంటరీ రిటైర్మెంటు తీసుకొన్నాను. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలలో చేరిపోయారు. ఆవిడ ప్రభుత్వోద్యోగి. 'బ్యాంకు ఉద్యోగం. ఎంతొచ్చినా అవసరానికి మించేం చేసుకుంటాం. బదిలీల మీద ప్రదక్షిణాలు చేయడం  తప్ప' అన్న వేడాంతంతో పదేళ్లు ముందే చేసిన అస్త్రసన్యాసం అది. పనీపాటా లేకపోవడం మొదట్లో సర్దాగానే ఉన్నా.. రాన్రానూ.. సమయం గడవక మహా విసుగు మొదలయింది.
ఎంతసేపు టీవీ చూస్తే కాలక్షేపం అయ్యేను! ఎన్ని పత్రికలు తిరగేసే పొద్దు పోయేను!

ఈ మధ్య కంటి చెకప్పుకని వెళ్లినప్పుడు ఆ డాక్టరూ చావు కబురు చల్లంగా చెప్పేసారు 'మీ ఎడమ కంటికి గ్లాకోమా ఎఫెక్టయింది' అని.

'గ్లాకోమా అంటే?'

'కంటి నరాలకి సంబంధించిన వత్తిడండీ! వంటికి బి.పి లాంటిదే అనుకోండి. చూపులో మెల్లంగా తేడా వస్తుంది. అలిగి పుట్టింటికి పోయిన పెళ్లామయితే మనసు మార్చుకొని తిరిగొస్తుందేమో గానీ.. దీందుంప తెగ!  పోయిన చూపుకు ఆ మాత్రం కూడా దయ ఉండదు. ఎన్ని మందులు వాడినా  చస్తే తిరిగి  రాదు. మానవ సంబంధాలను సరిదిద్దేందుకు ఏమైనా మందులు కనిపెట్టారేమో తెలీదు కానీ.. గ్లాకోమా కారణంగా నష్టపోయిన దృష్టిని తిరిగి తెప్పించడంలో  మాత్రం ఇంత వరకు  ఎవరూ సఫలం కాలేదు.

'డాక్టరుగారి సెన్సాఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేసే స్థితిలో లేను నేను. 'మరిప్పుడెలా డాక్టర్ గారూ?' అనడిగాను ఆందోళనగా.

'డోంట్ వరీ టూ మచ్ మిష్టర్ రావ్! అందువల్ల ఒరిగేదేమీ కూడా లేదు. కొన్ని మందులు రాసిస్తాను. క్రమంగా తప్పకుండా వాడాలి. విజన్ లాస్ కట్టడి చేయడం కుదరక పోయినా.. ఆ స్పీడును కాస్త కంట్రోలు చేసుకోవచ్చు. కావాల్సింది పేషెంట్ లో మనో నిబ్బరం.. క్రమ శిక్షణ. భోజనం ఓ పూట మానేసినా సమస్య లేదు. కానీ ఈ మందులు మింగడం మాత్రం మానేయకూడదు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ!' అంటూ ప్రిస్కిప్షన్ రాసిచ్చి తగిన జాగ్రత్తలు చెప్పి పంపించాడా కళ్ల డాక్టర్.

కాస్త ఖరీదైన మందులే అయినా క్రమం తప్పకుండా వాడుతున్నాను. అయినా మధ్య మధ్యలో ఈ సుస్తీ పరామర్శలేవిఁటో! నా ఆందోళన చూసి మా పక్కింటి రమణమూర్తిచ్చిన సలహామీద ఇదిగో.. ఈ  పంజగుట్టలో ఉన్న డాక్టర్ సహాయ్ గారిని కలవడానికని వచ్చాను.

'రమణ మూర్తి చెప్పాడు' అంటూ ఆయన క్యాజువల్ గా పరీక్షించి  మళ్లా రెండు రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు. రెంద్రోజులయ్యాక వెళ్లినప్పుడు మళ్లా జస్ట్ క్యాజువల్ గా పరీక్షించి మరో మూడ్రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు! ఆయన చెప్పిన టైముకే వెళ్లాను మూద్రోజుల తర్వాత..  పడుతూ లేస్తూ! యధాలాపంగా  ఏదో చిన్న  పరీక్షలాంటిది  చేసి ..   ఇంకో వారం రోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు! వెళ్ళిన ప్రతీ సారీ ఇదే తంతు!  ఏదో చెక్ చేస్తాడు. బరువు చూస్తాడు. ఆకలిని గురించి అడుగుతాడు. ఆహారం అలవాట్లను గురించి అడిగిందే అడుగుతాడు. నాకు ఎందుకో కాస్త అసహజంగా అనిపిస్తుంది. అసహనంగా కూడా ఉంది.  కొంతమంది డాక్టర్లకు పేషెంట్లను ఇలా వూరికే తిప్పుకోడం సరదా అనుకుంటా. సాడిజమా?'డబ్బు కోసవాఁ ఈ తిప్పలన్నీ! అనుకోవడానికీ లేదు ఈయన కేసులో. మొదటిసారి వెళ్ళినప్పుడు ఛార్జ్ చేసిందే! తరువాత ఇన్ని సార్లు వెళ్లినా పైసా అడగడం లేదు. మరెందుకు ఇన్నేసి సార్లు తిప్పించుకుంటున్నట్లు?!

ఈ నెలరోజుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా ఏవీఁ లేవే?! ఎప్పటిలాగే ఈ డాక్టర్ను కూడా మార్చేయడం ఒక్కటే మంచి మందు.' అని నిశ్చయానికొచ్చేసాను. మార్చేసే ముందు కడుపులో ఉన్న ఆలోచనను  ఆయన ముందు పెట్టడం మంచిదనిపించింది. ఆయన చెప్పిన టైముకి వెళ్లి కలిసాను.

ఎప్పట్లానే బి.పి, బరువు, ఆకలిఆహారం అలవాట్లు.. అన్నీ అడిగాడు. అనుకున్నట్లుగానే మరో మూడు రోజులాగి రమ్మన్నాడు మందూ మాకూ ఏవీ ఇవ్వకుండానే! ఇహ ఉండబట్టలేక గట్టిగానే అడిగేశాను మనసులో ఇంతకాలం బట్టీ రొళ్లుతున్న ఆ  సందేహం!

ఆయన కోపం తెచ్చుకోలేదు. సరికదా.. నవ్వుతూ అన్నాడు 'చూడండి రావుగారూ! మీరు మోతీనగర్లో ఆంజనేయస్వామివారి టెంపుల్దగ్గర కదా ఉంటారు? మా ఇల్లూ ఆ టెంపుల్కి ఆ రెండో వైపే ఉంది. నేను రోజూ అయిదు గంటల ప్రాంతంలో ఆ గుడి పక్క పార్కులో జాగింగ్ చేస్తుంటాను. నేను మిమ్మల్ని అక్కడ చూస్తుంటాను.'

'నన్నా! పార్కులోనా! ఇంపాజిబుల్ సార్! నేనసలెప్పుడూ ఆ జాగింగులూ.. గట్రా కోసం పార్కులకు  రానేఁ!

''జాగింగుకి రారు. కానీ పాల ప్యాకెట్లు పికప్ చేసుకోడానికైతే వస్తుంటారు కదా? నిజానికి మీరా పాకెట్ల వంకతో అయినా మీ ఇంటి నుంచి  నడుచుకుంటూ రావాలి ఈ వయసులో! కానీ స్కూటీ మీద వస్తుంటారు. పార్కు గేటు ముందు స్కూటీ ఆపి పార్కు అడ్డ దారి గుండా అటువైపున్న డాబ్బా నుంచి పేకట్లు తీసుకుని మళ్లా స్కూటీ మీద వెళ్లి పోతుంటారు. నడక మీకు పడదని నాకప్పుడే అర్థమైపోయింది. మీ కేస్ షీట్ చూసాను. ఈ రెండేళ్ళల్లో నలుగురు డాక్టర్లని మార్చేసారు. ఇప్పుడు నన్ను కూడా మార్చేయబోతున్నారేమో! నిజానికి మీరు మార్చాల్సింది డాక్టర్లను కాదు రావుగారూ! మీ అలవాట్లను. లైఫ్ స్టైల్ ని. ఉద్యోగం మానేశారు. అది మీ పర్సనల్. కానీ ఆరోగ్యం కోసం ఆ స్థానంలో మరేదైనా చేయాలి కదా! ముఖ్యంగా శరీరానికి అలవాటైన శ్రమనుంచి వంట్లో ఓపికున్నప్పుట్నుంచే అనవసరంగా విరామమిచ్చేస్తే.. ఇదిగో పరిణామాలిలాగే ఉంటాయి.

నేనేదో సంజాయిషీలాంటిది ఇవ్వబోతుంటే వారించి ఆయనే కొనసాగించాడు 'మీ గురించి మీ నైబర్ రమణ మూర్తి అంతా చెప్పారు. కనీసం అపార్టుమెంటు వెల్ఫేర్  పనుల్లో అయినా బిజీగా గడపేయచ్చు మీ లాంటి ఎర్లీ రిటైరీస్! ఏదో ఓ రూపంలో బాడీకి ఎక్సర్సైజెస్ చాలా అవసరమండీ ఈ రోజుల్లో! సారీ! ఇలా అన్నానని ఏమీ అనుకోకండీ.. ఔట్ పుట్ లేకుండా.. ఒన్లీ ఇన్ పుట్ మీదే ధ్యాస పెట్టేస్తే ఇదిగో.. ఇలాంటి అనారోగ్య సమస్యలే దాడి చేస్తాయ్ శరీరంమీద.  బాడీ బరువెక్కడం.. ఆకలి మందగించడం..ఆసక్తి సన్నగిల్లడం.. ప్రతికూలమైన ఆలోచనలు పెరిగిపోవడం.. ఇవన్నీ సోమరితనం వల్లనే సంభవించేవని వందేళ్ల కిందటే పరిశోధనల్లో తేలాయి. మందులు.. చికిత్సల పేరుతో నేనూ ఇంతకు ముందు మీరు చూపించుకున్న డాక్టర్ల మాదిరిగానే ఎంతైనా గుంజుకోవచ్చు. మీక్కూడా ఏదో ట్రీట్ మెంటు జరుగుతోందన్న తృప్తీ ఉండేది. ప్రిస్కిప్షన్ పేపరి వంక మీరొక్క సారైనా చూసారా?'

'చూడ్డానికి మీరసలు మందులేవైనా రాసిస్తేగదా డాక్టర్!' ఛాన్సొచ్చిందని నిష్ఠురానికి దిగబోయాను.

'మందులు రాయడం లేదా?.. ఏదీ చూపించండి?' అని ఫైల్ తెరిచి ప్రిస్కిప్షన్ పేపరు నా ముందు పరిచారు.

'రోజూ  ఉదయం..  సాయంత్రం ఏదైనా కడుపులోకి తీసుకొన్న తరువాత.. కనీసం ఓ గంటపాటు నడవాలి' అని రాసుంది.. ఇంగ్లీషులో!

నేనా సలహా చూడకపోలేదు. నడవమని సలహా ఇవ్వడం మందులు రాసినట్లెట్లా అవుతుందని నా ఆలోచన. అందులోనూ నాకు మొదట్నుంచి నడకంటే మహా చిరాక్కూడా!

ప్రిస్కిష్పన్నలా వదిలేయండి రావుగారూ! మోరొచ్చిన ప్రతీసారీ నేను నడక ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూనే ఉన్నాను. నా దగ్గర 'ఊఁ' గొడుతూ పోయారే కానీ.. కనీసం మీ ఇంటి దగ్గర పాలడబ్బాకి వెళ్లేటప్పుడైనా పార్కు అడ్డదారిని ఎంచుకోడం మానేయలేకపోయారు! మీరు పార్కు చుట్టూ కాలినడకన వెళ్లి పని ముగించుకోడం మొదలు పెట్టేవరకైనా నేను ట్రీట్ మెంటు మొదలు పెట్టకూడదనుకున్నాను. మొదల పెట్టీ ప్రయోజనం ఉండదు. ఇదివరకటి డాక్టర్లకు మల్లే మీ చేత వందలొందలు ఖర్చు పెట్టించడం.. ఆనక చేతకాని డాక్టర్నని తిట్టించుకోడం తప్ప. పెరటి చెట్టును కదా.. అందుకు చులకనయానేమో మరి.. మీకే తెలియాలి' అని నవ్వుతూ లేచాడు డాక్టర్ సహాయ్!

అప్పుడర్థమయింది.. ఇంటిముందు బంగారంలాంటి పార్కు పెట్టుకొనీ.. జాగింగ్ చేసేందుకు బద్ధకించి రోగలు కొని తెచ్చుకొన్న  నా పొరపాటు. మందులకోసం వేలకు వేలు పోసాను. పదుల కొద్దీ డాక్టర్లను తెగ మార్చేసాను.. లోపం నాలో ఉంచుకొని.

మర్నాడు పాలపాకెట్టుకు బైటకు వెళ్లేటప్పుడు స్కూటీ తీయ లేదు. ఎప్పటి కన్నా ఓ గంట ముందే లేచి బైటకు వెళ్లే నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం నేను గమనించక పోలేదు.

పార్కులో జాగింగ్ చేస్తున్న డాక్టర్ సహాయ్ నన్ను చూసి గుర్తు పట్టి 'హాయ్' అంటూ చేతులూపాడు కూడా! నెక్స్ట్ విజిట్ కి వెళ్లినప్పుడు 'పార్కు చుట్టూతా అలా నెమ్మదిగా కాకుండా ఇంకాస్త వేగంగా పరిగెడితే.. నెనిప్పుడు రాసిస్తున్న మందులు మరీ ఎక్కువ కాలం వాడాల్సిన పనుండదు' అని భుజం తట్టాడు డాక్టరు సహాయ్ గారు!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్,యూఎస్ఎ

 

(చతుర- ఆగష్టు, 2012 నెల సంచిక ప్రచిరతం)

 

Wednesday, February 1, 2017

ఫొటో ఆల్బమ్- విపులలో నా కథ



ఆ రోజు వర్కింగ్ డే. ఇంట్లో ఎవరూ లేరు. ఆయనా, పిల్లాడూ డ్యూటీల కెళ్లారు. పనమ్మాయి పని ముగించుకొని వెళ్ళేసరికి పదకొండు గంటలు దాటింది. స్నానం చేసి రిలాక్సుడ్ గా టి.వి చూస్తూ కూర్చోనున్నాను. బైట గేటు తీసిన అలికిడి. ఒక పెద్దాయన.. సుమారు అరవై.. అరవై ఐదేళ్లుంటాయేమో.. గేటు తీసుకుని లోపలికి వచ్చి పద్ధతిగా చెప్పులు ఓ మూల విడిచి వరండాలో ఉన్న పేము కుర్చీలో కూలబడి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొంటున్నాడు.
ఎప్పుడూ చూసిన మొహంలా లేదు. 'ఎవరు కావాలండీ?' అనడిగాను బైటికొచ్చి.
'రామ్మోహనరావుగారు ఉన్నారామ్మా?' అనడిగాయన చేతిసంచీ ఓ పక్కకు పెట్టుకొంటూ. ఆ పేరుగల వాళ్లెవ్వరూ మా ఇంట్లోనే కాదు.. మా చుట్టుపక్కలకూడా  లేరు. ఆ మాటే చెప్పాను.
'అయ్యో! ఇది మోహనరావుగారిల్లన్నారే!' అని గొణుక్కుంటూ లేచి నిలబడ్డారాయన. 'పాపం' అనిపించింది. మా నాన్న వయసుంటుంది ఆయనకు.
చెప్పులు వేసుకుంటూ అడక్కుండానే చెప్పుకొచ్చాడాయన. 'రామ్మోహనరావంటే మా అల్లుడేనమ్మా! ఇక్కడే ఎక్కడో ఆంధ్రాబ్యాంకులో చేస్తున్నాడాయన. బ్రాంచి పేరు గుర్తుకు రావడం లేదు. ఎప్పుడూ ఒక్కడినే రాలేదు. ఎప్పుడు వచ్చినా అమ్మాయి పక్కనే ఉండేది. నారాయణాద్రికి వస్తున్నానని చెప్పానమ్మా! అల్లుడుగారిని పంపిస్తానంది. ఎందుకు రాలేదో?' అనుకుంటూ బైలుదేరాడాయన.
'పక్క బజారులో ఆంధ్రాబ్యాంకుంది బాబాయిగారూ! అదేమో చూడండి!' అన్నాను గేటుదాకా బైటికి వచ్చి దారి చూపిస్తూ. ఆయన వీధి మలుపు తిరిగిందాకా చూసి లోపలికొచ్చేసాను. పెము కుర్చీ పక్కన పెట్టిన చేతిసంచీ అలాగే ఉంది, 'అయ్యో' అనుకుంటూ సంచీ తీసుకొని మళ్లా వీధిలోకి పరుగెత్తాను. కానీ అప్పటికే పెద్దాయన వీధి దాటినట్లున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.
ఇక చేసేదేం లేక ఆ సంచీని లోపలికే తెచ్చి ఓ మూల పెట్టేసాను.. మళ్లా వస్తే ఇవ్వచ్చులే అని.
ఆ పూటకి ఎవరూ రాలేదు.
మావారు సంచీని చూసి అడిగితే వివరంగా అంతా చెప్పాను. 'ఎవర్ని బడితే వాళ్లని అలా లోపలికి రానిచ్చేయడవేఁనా? అసలే రోజులు బాగో లేవు. ముందా సంచీ తీసవతల పారేయ్!' అని కూకలేసారు. ప్రద్దానికీ క్లాసు పీకటం ఆయనకో అలవాటు.
మా అబ్బాయయితే ఒహటే ఆట పట్టించడం.. 'తాతగారిచ్చిన గిఫ్టులు చెరి సహం షేర్ చేసుకొందాం మమ్మీ!' అంటూ.
రెండో రోజూ బ్యాగుకోసం ఎవరూ రాకపోయేసరికి నాకూ అనుమానం మొదలయింది. 'ఇదంతా కావాలని ఎవరో చేస్తున్న అల్లరి కాదు గదా!' అనిపించింది. వీధి చివరిదాకా వెళ్లి ఆంధ్రాబ్యాంకులో అడుగుదామని వెళ్ళాను ఆ మర్నాడు. ఇదివరకు బ్యాంకు ఉండేచోట ఇప్పుడేదో కన్ స్ట్రక్షన్ నడుస్తోంది. 'బ్యాంకు క్రాస్ రోడ్డుమీదకు షిఫ్ట్ చేశారు కదమ్మా!' అన్నాడు అక్కడే ఉన్న మేస్త్రీ. ఇంటికొచ్చి అనుమాన నివృత్తికోసం అసలు బ్యాగులో ఏముందో చూద్దామని బైటికి తీసాను.
ముసలివాళ్ల బ్యాగుల్లో ఏవుంటాయి? రెండు పంచలు.. లాల్చీలు.. కళ్లజోడు.. మందుల డబ్బా.. ప్లాస్టిక్ రేపర్లో చుట్టున పేస్టూ.. బ్రష్షూ.. సోపు.  భగవద్గీత పుస్తకం. పుస్తకం మధ్యలో ఏదో పెళ్ళి ఫొటో. కొత్త దంపతులాల్గున్నారు, చూడముచ్చటగా ఉంది జంట. ముసలాయన కూతురు.. అల్లుడు కాబోలు!
స్కూలు పిల్లల సైన్సు రికార్డు సైజులో ఒక పెళ్లి ఫొటో ఆల్బమ్ కూడా ఉంది. పెళ్లి కూతురు ఫొటోలోని అమ్మాయే కానీ.. పెళ్లికొడుకు పొటోలోని అబ్బాయి కాదు!
న్యూస్ పేపర్తో చూట్టి రబ్బరు బ్యేండ్లేసిన ఇంకో కట్టకూడా కనిపించింది. ఎందుకులే మనకీ పాడు గోల అనిపించింది. ఎక్కడి వస్తువులు అక్కడ యథాతధంగా సర్దేసి బ్యాగును స్టోర్రూం అటకమీద పెట్టించేసాను.. ఎవరన్నా వచ్చి అడిగితే ఇవ్వచ్చులే అని ఆలోచన,
ఆ రోజు ఆదివారం, మా వారికి చికెన్ కంపల్సరీగా ఉండాల్సిందే. నిద్ర లేవంగానే మహా సంబరంగా బజారుకు బైలుదేరారు.
ఆయన చెప్పులేసుకుంటుంటే.. మటన్ షాప్ పక్కనే ఉన్న ఆంధ్రాబ్యాంకు గుర్తుకొచ్చింది. 'వీలయితే ముసలాయన్ను బేగు తీసుకు వెళ్లమని చెప్పి రండి' అని హెచ్చరించానీయన్ని.
ధుమధుమలాడుతూ వెళ్లిన మనిషి తీరిగ్గా తిరిగొచ్చి 'బ్యాంకు మూసుంది. నెంబర్ తెచ్చాను చూసుకో!' అంటూ సెల్లో స్టోర్ చేసుకొచ్చిన నెంబరొకటి నా మొహాన కొట్టారు. అదీ సెల్ నెంబరే!
మధ్యాహ్నం ఆ నెంబరుకి కాల్ చేస్తే 'హలో!' అంది ఓ మగ గొంతు. 'సార్! మీరు ఆంధ్రా బ్యాంకు రామ్మోహనరావుగారేనా?' అనడిగాను.
'యెస్! వ్హాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?'
'విషయం వివరించడానికి చాలా తంటాలు పడాల్సొచ్చింది. అంతా విని చివర్లో 'మీరేమంటున్నారో నాకర్థం కావడంలేదు మ్యాడమ్! మా మామగారు పోయి రెండేళ్లయిందే!' అన్నారు. లైన్ కట్ అయింది. మళ్లో కాల్ చేసినా రెస్పాన్ లేదెంత సేపటికీ. ఇంకీ విషయం ఇంతటితో 'ది ఎండ్' అయిందని అర్థమయి పోయింది నాకు.
మూడు రోజుల తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటల పాంతంలో లాండు లైనుకి ఓ ఆడమనిషి కాల్ చేసింది. 'ఆదివారం మధ్యాహ్నం మావారి సెల్ కి ఈ నెంబర్నించీ కాల్ వచ్చింది. ఎవరో తెలుసుకోవచ్చా?' వినయంగానే ఉందా గొంతు.
'ముందు మీరెవరో చెప్పండి!' అనడిగాను నేను.
'ఆంధ్రాబ్యాంక్ రామ్మోహనరావుగారి వైఫ్ నండీ! మీతో కాస్త మాట్లాడ వచ్చా మేడమ్?'
'మాట్లాడండీ!'
'ఇలా ఫోన్లో కాదు. మీకు అభ్యంతరం లేదంటే ఒకసారి మీ ఇంటికి వస్తాను'
'రండి!' అంటూ ఇంటి అడ్రసు చెప్పాను.
అరగంటలో ఆటోలో వచ్చింది. గేటు తీసుకొని లోపలికి వస్తుంటేనే గుర్తు పట్టాను.. ఆమె ఆ ఫొటోలోని అమ్మాయే! కాకపోతే కాస్త వయసు పెరిగి వళ్లు చేసింది. కూర్చోమన్నాను.
బిడియంగా కూర్చుంది. 'ఇంట్లో ఎవరూ లేరా?' అని అడిగింది చుట్టూ చూస్తూ.
'లేరు' అన్నాను.
రిలీఫ్ ఫీలయింది. స్తిమితంగా 'మీరు మావారితో మాట్లాడిందంతా విన్నాను మేడమ్! బ్యాగు ఇంకా ఇక్కడే ఉందా?' అనడిగింది.
'సంచీ తెచ్చిచ్చి 'అన్నీ  ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి!' అన్నాను. బ్యాగందుకుంది కానీ.. లోపలేమున్నాయో చూసుకోలేదు. 'చాలా థేంక్సండీ!' అంటూ బైలుదేరింది హడావుడిగా.
'మంచిదమ్మా! నాన్నగారు బాగున్నారు కదా?'అనడిగాను చెప్పులేసుకుంటున్న ఆమెను చూసి.
'ఆయన మా నాన్నగారు కాదు మ్యాడమ్. మా ఊరాయన. ఈ ఆల్బమూ, డబ్బూ ఇచ్చి వెళదామని వచ్చాడు. రావాలంటే మా ఇంటికే రావచ్చు. కావాలనే ఇవి మీ ఇంట్లో వదిలేసినట్లున్నాడు'
'అదేందీ?!'  అనరిచాను ఒక్కసారి షాకయినట్లు.  ఆ సంచీలో కేషున్నట్లు నాకిప్పటిదాకా తెలీనే తెలీదు!
వెళ్లే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వచ్చింది. 'ఇదంతా మీకు చెప్పకూడదో.. లేదో.. నాకు తెలీదు. మా అమ్మలాగా ఉన్నారు. చెప్పకబోతే బావుండదు. ఆయన మా ఊరి పెద్దబ్బాయిగారు. పెద్ద ఫొటో స్టూడియో ఉండేది వాళ్లకు. మా ఊళ్లో ఎక్కడ ఏ ఫంక్షను జరిగినా వీళ్లే ఫొటోలు.. వీడియోలు తీసేవాళ్లు. వీళ్లబ్బాయి ఇంటర్లో నా క్లాస్ మేట్. మంచివాడు కాదు. నా వెంటబడి వేధించేవాడు. ఒకసారి క్లాక్ టవర్ దగ్గర చెప్పుతో కొట్టాను కూడా. అది కడుపులో పెట్టుకున్నాడు. మా ఫ్రెండు పెళ్లికి వీళ్లే ఫొటోలు.. వీడియోలు తీసారు. దాని ప్లేసులో నా బొమ్మలు పెట్టి సి.డి.లు తయారు చేసాడు. రెండు లక్షలివ్వకపోతే బైటపెడతానని అల్లరి పెట్టేవాడు. మా నాన్నగారు మామూలు బడిపంతులు. నా పెళ్లికే నాలుగు లక్షలుదాకా ఖర్చయిందా రోజుల్లో. ఇంకో ఇద్దరు చెల్లెళ్లున్నారు. ఆ దిగులుతోనే హార్టెటాకొచ్చి పోయారు' అని ఎడుస్తోందా అమ్మాయి.
ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. పాపం.. ఎంతకాలంనుంచీ కడుపులో దాచుకుందో!
తనే తమాయించుకొని వెళ్లడానికి లేస్తూ అంది 'అప్పట్లో మా నాన్నగారి పెన్షష్ నుంచీ ఒక లక్ష ఇచ్చి సి.డి తీసుకున్నాం ఆంటీ! కానీ ఇలాంటిదే ఇంకో ఆల్బంకూడా తయారు చేసాడని తెలీదు. తరువాత ఆ అబ్బాయి ఇలాంటివే ఏవో గొడవల్లో ఇరుక్కుని చచ్చిపోయాడు. పాపం.. పెద్దబ్బాయిగారికి ఇతనొక్కడే కొడుకు. పెద్దాయన బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. స్టూడియో వేరే వాళ్లకి అమ్మేశాడు. కొన్నాయనకు స్టాకు అప్పగించే టైంలో ఈ ఆల్బం బైటపడిందట. కొడుకు చేసిన నిర్వాకం అప్పటిదాకా ఆయనకూ తెలీదు. తెలిసి చాలా బాధపడ్డాడుట. ఈ ఫోటోలు.. ఇవీ ఇంకెవరైనా చూస్తే ప్రమాదమని నేరుగా నాకే ఇచ్చేద్దామని వచ్చాడు. ఇంటికొస్తే రెండు మూడు సార్లు మావారే కనిపించారుట. ఆయనకివ్వలేక మీ ఇంట్లో వదిలేసి పోయాడీ సారి'
'మధ్యలో మా ఇల్లు పిక్చర్లోకెలా వచ్చిందీ?! మా ఇంట్లో ఇవ్వాలని ఎందుకనిపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా.
'అంకుల్ ఏవో కథలూ అవీ పత్రికలు రాస్తారుట కదా! పోయిన నెల్లో మీ ఇంటి అడ్రసు ఏదో పత్రికలో చూసారుట! మా ఇంటికి మీ ఇల్లు దగ్గరనే కావాలని ఈ బ్యేగు మీ ఇంట్లో వదిలేసి పోయాడాయన.'
'పెద్దబ్బాయిగారి భార్య నిన్న కాల్ చేసి  ఈ ఫొటోలు.. డబ్బూ ఇలా మీ ఇంట్లో ఉన్నాయి. తెచ్చుకొని ఫొటోలు కాల్చేయమ్మా!' అని చెప్పింది మేడమ్! ఈ లక్ష అప్పట్లో మేము వాళ్లబ్బాయికి ఇచ్చింది. మధ్యలో మీకు ట్రబులిచ్చాం. సారీ!' అని లేచిందామె.
'ఫర్వాలేదులేమ్మా! నా కూతురులాంటి దానివి. ఇందులో మేం చేసింది మాత్రం ఏముంది? పెద్దదాన్ని కనుక ఒక సలహా చెబుతాను. ఈ ఫొటోలను ఇక్కడే తగలేసి పోతే నీకు మంచిది' అన్నాను.
ఆ అల్బం మా ఇంట్లోనే బూడిద చేసి డబ్బుతీసుకొని పోయే ఆమెని ఇంకో ధర్మసందేహం అడిగాను. 'ఇంతకీ ఆ పెద్దాయన ఇప్పుడెలా ఉన్నాడో! ఆయన్ని చూస్తుంటే మా నాన్నగారే గుర్తుకొచ్చారు.. పాపం'
'ఇక్కడికొచ్చిన మర్నాడే ఆయన మంచం పట్టి మూడ్రోజుల కిందటే పోయాడు ఆంటీ! ఆల్రెడీ కేన్సర్ పేషెంట్. ఈ తిరుగుడికీ దానికీ జాండీస్ వచ్చిందన్నారు.' అని వెళ్లిపోయిందా అమ్మాయి. పెద్దాయన సంచీని మాత్రం ఇక్కడే వదిలేసింది.
ఆ బ్యేగుని పారెయబుద్ధి కాలేదు నాకు. అటకమీద పెట్టేసాను. ఆ సంచీని చూసినప్పుడల్లా ఫొటోలు.. డబ్బే కాదు.. ఒక మంచిమనిషి మనస్తత్వం గుర్తుకొస్తుంటాయి.

-కర్లపాలెం హనుమంతరావు

(విపుల- ఏప్రియల్- 2010 సంచికలో ప్రచురితం)






మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...