Wednesday, February 22, 2017

స్టాకింగ్ హార్స్- రచన మాస పత్రిక కథ

కథ 
స్టాకింగ్ హార్స్ 
- కర్లపాలెం హనుమంతరావు 
(రచన మాసపత్రికలో ప్రచురితం)

మే నెల మధ్యాహ్నం. ఎండ మండిపోతోంది. 

చలువ చేసిన తెల్లటి వాయిల్ చీర.. మేచింగ్ బ్లౌజులో రాధమ్మ అచ్చంగా రాక్షసులకూ దేవతలకూ అమృతం పంచి పట్టేందుకు బయలు దేరిన జగన్మోహినిలా ఉంది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నది అమృత భాండం కాదు. చెప్పుల జత!

చెప్పుల అలికిడయితే చిన్నారి బైటకొచ్చి గడపకడ్డం పడుతుందని ఇట్లా చేత్తో పట్టుకుని బైటి గేటు దాటిన  తరువాత   అవి వేసుకొంది. రెండగల్లో రోడ్డు మీద కొచ్చి పడింది.

రోడ్డుమీద నర పురుగు లేదు. ఓ గోడ వారన నీడలో పడుకోనున్న రిక్షా అబ్బిని లేపి 'ఆణుమల్లిపేట కొస్తావా? అనడిగింది. 

వాడు నిశ్శబ్దంగా లేచి కూర్చుని 'పది  రూపాయలవుతుందమ్మా!' అన్నాడు.

'ఐదు చేసుకో!' అంది రాధమ్మ.

'ఏడు  ఇవ్వండి తల్లీ! ఉల్లి  కూడా రెండు పెట్టందే గడ్డ  రావడం లేదు' అన్నాడు.. అంటూ తలమీది గుడ్డ విప్పి మళ్ళీ కట్టుకుని . 

రిక్షా సీటు దులిపి 'ఎక్కండమ్మా!' అన్నాడు. రాధ ఎక్కి కూర్చోగానే బండి బయలుదేరింది.

రిక్షా పోలేరమ్మ గుడి దాటకుండానే నరసింహారావుగారు కనిపించారు. బండి దిగి బాడుగిచ్చి పంపించేసింది రాధమ్మ.

నరసింహారావుగారితో పాటే ఆయన ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చి వరండాలోని చెక్క బెంచీమీద చతికల బడింది ఉస్సులు తొక్కుకుంటూ.

 'ఇంత ఎండలో పడి వచ్చింది మా ఇంటికా?! కాస్త చల్లబడిం తరువాత రాకపోయావూ!' అన్నాడా నరసింహారావుగారు ఆశ్చర్యంగా.

నరసింహారావుగారు పల్లెపట్టువారి ధర్మసత్రం ధర్మకర్త. సుమారుగా అరవై, అరవై ఐడేళ్లుంటాయ్. నిదానస్తుడిగా ఊళ్లో మంచి పేరుంది. రాధమ్మ  పని చేసేది ఆయన కార్యనిర్వహణలో నడిచే హైస్కూలులోనే.

నట్టింటి గడప కవతల నిలబడి చోద్యం చూస్తున్నా ఆయన కూతురు కమలనడిగి ఓ గ్లాసెడు చల్లటి మంచినీళ్లు తెప్పించుకొని తాగి స్తిమిత పడిన తరువాత నెమ్మదిగా అంది రాధమ్మ 'బాబాయ్ గారూ! మన స్కూలుకి ఆడిటింగు కొచ్చారే.. ఆయన పేరూ..'

'పరశురామ్మూర్తి. ఆయన పేరెందుకూ ఇప్పుడూ?!'  
నరసింహారావుగారి ఆశ్చర్యం.

రాధమ్మ తన భుజం సంచీనుంచి ఒక నోట్ బుక్ తీసి చూపిస్తూ 'ఈ పాటల పుస్తకం ఆయనకోసారి చూపించి పోదామనీఁ' అంది రాధమ్మ.

'పాటల పుస్తకమాఁ! ఆయనేం చేసుకుంటాడూ దాన్నీ?!' మళ్ళా ఆశ్చర్యం నరసింహారావుగారికి.

'బాబాయిగారూ! పరశురామ్మూర్తిగారు మంచి సంగీత ప్రియులు. మంచి మంచి కీర్తనలు కూడా రాసారుట ఆయన'

'అవునా? నాకు తెలీదే! అయినా.. ఇప్పుడీ పుస్తకం ఆయన కివ్వడానికి ఇంత ఎండన బడి రావాలా?!'

రాధమ్మ అసలు విషయం బైట పెట్టేసింది. 'తప్పులేవైనా ఉంటే సరిదిద్ది పెడతారని వచ్చా బాబాయ్! మళ్లా సాయంత్ర మయితే ఆడిటింగ్ పనిలో పడతారు కదా! అప్పుడు అడిగితే బావుండదేమోననీ..'

'ఎవరండీ అదీ?' గదిలోనుంచి మాటలు వినిపించాయి. 
అది పరశురామ్మూర్తిగారి గొంతే! ఇక్కడి మాటలన్నీ చెవులో పడుతూనే ఉన్నాయన్న మాట.

డోర్ కర్టెన్ తొలగించి తల లోపలికి పెట్టి ఏం  చెప్పాడో కానీ  .. 'నిన్ను రమ్మంటున్నారమ్మా!' అంటూ అదో రకంగా ముఖం పెట్టుకొని తాను ఇంట్లోకి తప్పుకున్నాడు నరసింహారావుగారు. 

రాధమ్మ లోపలికి వెళ్లి 'నమస్కారమండీ!' అంది.

వంటిమీద ఒక్క బనీనే ఉండటం వల్ల కాస్త కంగారు పడుతూ లేచి నిలబడ్డాడాయన.

'ఇప్పుడే మొగం కడుక్కొని వస్తాను! అలా కూర్చోండి!' అంటూ చిలక్కొయ్యకు తగిలుంచున్న చొక్కాను తీసుకొని బైటికి వెళ్లి పోయారు 

పరశురామ్మూర్తిగారు. రాధమ్మ మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది. రెండో కుర్చీ లేదు. అతను వస్తే మంచంమీదే కూర్చోవాలి. తప్పదు.

రిఫ్రెషయి వచ్చిన రామ్మూర్తిగారి చేతికి పుస్తకం అందిస్తూ అడిగింది రాధమ్మ 'సార్! ఇది మా నాన్నగారు జీవించి ఉన్న రోజుల్లో ఆ ఏడుకొండలవాడి మీద రాసిన  కీర్తనలు. ఒకసారి వీలుచూసుకొని చూసి లోపాలు కనిపిస్తే పరిహరించి పెట్టాలి మీరు!'

'ఓహో! మీ నాన్నగారు కవా? సంతోషమండీ!' అంటూ ఆ పుస్తకం అందుకొని రెండు పేజీలు అటూ ఇటూ తిరగేసి చూసి ఆశ్చర్యంగా 'ఇందులోని సాహిత్యమంతా భావగాంభీర్యంతో తొణికిసలాడుతోంది. పదాల తూగు సంగీత లయకు అనుగుణంగా సాగే లక్షణం అన్ని సంకీర్తనలకు సర్వసామాన్య ధర్మమే. కానీ ఆ పదాల ఎంపిక ఎంత  సహజ సుందరంగా సాగిందో ఈ సంకీర్తనలనిండా! ఒక్క  లయజ్ఞానం పుష్కలంగా ఉన్నంత మాత్రానే సాధ్యం కాదు ఇంత ఒదుగుదల! మీ నాన్నగారి పేరు?'

'నడింపల్లి శ్రీనివాసాచారిగారు సార్!'

'మీరు శ్రీనివాసాచారిగారి కూతురా?!' రామ్మూర్తిగారి గొంతులో తేడా వచ్చేసింది అప్పుడే.  

పుస్తకాన్ని మరో రెండు మూడు సార్లు అటూ ఇటూ తిరగేసి 'ఇందులోని గుణదోషాలను ఎంచడం నా శక్తికి మించిన పని. ఆచారిగారి సంగీతం వింటూ .. పాడుకుంటూ ఎదిగిన వాళ్లం మేమంతా. ఆకాశవాణి ద్వారా వారు మాకు పరోక్ష గురువులు కూడా. మాష్టారుగారిలాగా అన్నమయ్య 'పరికరాలంకారాల'ను  సందర్భోచితంగా వాడే బుద్ధివైశాల్యత గలవారు అరుదు.. పేరెన్నికగన్న విద్వాంసుల్లో కూడా'

'పరికరాలంకారాలంటే?'

'సందర్భానికి తగ్గట్లు విశేషణాలను ఉపయోగించే విశిష్ట లక్షణం. మీ నాన్నగారు సంగీత మహోపాధ్యాయులు కదా! మీకూ కొంతయినా ప్రవేశం ఉండుండాలే?'

'ఏదో కొద్దిగా సార్! మరీ అంత లోతుల్లోకి వెళ్లే అవకాశం దొరకలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నది'

'జయ జయ రామా సమర విజయ రామా!' అన్న అన్నమాచార్యులవారి సంకీర్తనం మీకు గుర్తున్నదా?'

'ఆఁ! ఆఁ! 'జయహర నిజభక్తి పారణ రామా! జలధి బంధించిన సౌమిత్రి రామా!' అంటూ పాట ఎత్తుకున్న రాధమ్మని మొదటి చరణం దగ్గరే అడ్డుకొని వివరణకు దిగారు పరశురామ్మూర్తిగారు.

'ఆ 'పారీణ' అన్న పదమే పరికరాలంకారం. భక్తులను ఈ భవబంధ సాగరంనుండి ఒడ్డుకు చేర్చే వాడినే కదా 'పారీణ' అనాలి! 'పారీణ' అంటేనే దాటించేవాడని అర్థం. రెండో పాదంలో వచ్చిన 'సౌమిత్రి' పదం కూడా అలాంటిదే! సీతారక్షణ సందర్భంలో సముద్రుణ్ణి ప్రార్థించమని విభీషణుడు రాముడికి  సలహా ఇచ్చిన ఘట్టాన్ని గుర్తుకుతెచ్చుకోండి! అశాంత స్వరూపుడైన లక్ష్మణుడు అన్నగారు ఎవర్నీ ఎప్పుడూ ఏదీ అడగడం  ఇష్టంలేని వాడు. ఆ సోదరుడికి ఆనందం కలిగించే విధంగా 'సాగరుణ్ని ఎండగట్టాలి. ఏదీ నా ధనుర్భాణాలు అందుకో లక్ష్మణా!' అంటూ ఆ కరుణాపయోనిధి వీరంగాలు వేయడమే సౌమిత్రికి  నచ్చిన విషయం. అందుకే అన్నమయ్య ఆ సందర్భానికి తగ్గట్లు రాముణ్ని మామూలు రాముడిగా కాకుండా  'సౌమిత్రి రామా!' అని సంబోధించాడు. ఇదే పరికరాలంకారం. బై ది  బై .. ఇందాక మీరు పాడారే ఆ పాట అద్భుతంగా ఉంది. మీ గొంతులో మరీ బాగుంది'

'కమల ఒక కాఫీ కప్పుతో వచ్చి రామ్మూర్తిగారికి ఇచ్చింది. ఆమె చూస్తుండగానే ఆ కప్పు రాధమ్మకు అందించారు రామ్మూర్తిగారు. 
రెండు నిమిషాల్లో మరో కప్పుతో రావాల్సొచ్చింది కమలకు.

'వారం రోజులు ఈ ఆడిటింగ్ పని. ఇంత చిన్న ఊళ్లో కాలక్షేపం అవడమెలాగా అని బెంగపడ్డాను.. బైలు దేరి వచ్చేటప్పుడు. అనుకోకుండా సంగీతనిధి దొరికిందిక్కడ. మీకు అభ్యంతరం లేకపోతే ఈ నాలుగు రోజుల మనం ఇలాగే సాయంకాలాలు కలుసుకుంటుందాం. మీ నాన్నగారి మిగతా సాహిత్యం కూడా చదివే సౌభాగ్యం నాకు కల్పించండి'  అని లేచారు రామ్మూర్తిగారు.
రాధమ్మకు కావాల్సింది కూడా అదే!

'వీరి నాన్నగారే శ్రీనివాసాచారిగారని మీరు నాకెప్పుడూ చెప్పలేదే!' అన్నారు రామ్మూర్తి నరసింహారావుగారు లోపలికి వచ్చినప్పుడు రాధమ్మ ముందే!

ఆ గొంతులోని నిష్ఠురాన్ని పెద్దాయన గమనించక పోలేదు. పై అధికారుల ముందు ఏ మోతాదులో తమ ఇష్టాఇష్టాలను ప్రకటించాలో తెలీనంత అమాయకుడేం కాదాయన.

పెదాలమీదకు చిరునవ్వు తెచ్చిపెట్టుకుంటూ 'మా అమ్మాయికి సంగీతం పాఠాలు ఈమె తండ్రిగారే నేర్పించారండీ! ఆ విశ్వాసంతోనే కదా ఈమెకు మన స్కూల్లో ఉద్యోగం కల్పించిందీ' అన్నాడు.

'మంచి పని చేసారు' అన్నారు రామ్మూర్తిగారు తృప్తిగా.

రాధమ్మ ఒక నమస్కారం చేసి వచ్చేసింది. 

వెళ్తూ వెళ్తూ చిన్నారికి ఐస్ క్రీమ్ కొనడం మాత్రం మర్చి పోలేదు.
***
రెండు రోజుల తరువాత రాధమ్మను ఇంటికి పిలిపించి మందలింపులకి దిగారు నరసింహారావుగారు.

'ఆయనేదో ఇన్స్పెక్షన్ పని మీదొస్తే.. నువ్వేంటమ్మాయ్.. పాటలూ.. పద్యాలూ అంటూ ఆయనెంట బడ్డావ్? నీ మూలకంగా వారం రోజుల్లో అయే ఇన్స్పెక్షన్ పది  రోజులయినా తెగేటట్లు లేదు.  పై ఆఫీసర్లను ఇంట్లో పెట్టుకుని వేగడం ఎంత కష్టమో నీకేం తెలుసు?'

'నేనేం చేసాను బాబాయ్ గారూ! ఆయనేగా కదా రోజూ సాయంకాలాలు కారు పంపిస్తున్నదీ! మీ డ్రైవర్ లేని రోజున మీరే వచ్చి తీసుకెళుతుంటిరి! నేను మొరాయిస్తే ఆ ప్రభావం  మీ మీద పడుతుందని  వస్తున్నా గానీ.. నిజం చెప్పాలంటే దీని మూలకంగా నాలుగు రోజుల్నుంచీ నా ట్యూషన్ క్లాసులు దెబ్బతింటున్నాయి.' అంది రాధమ్మ రోషంగా. 

నరసింహారావుగారింకేదో చెప్పబోయే లోపల ఫోన్ రింగయింది. రామ్మూర్తిగారి నుంచి కాల్!

'తలనొప్పిగా ఉంది. ఈ పూటకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మీరొక్కసారి ఆ రాధగారిని కాంటాక్ట్ చేయండి! ఒక్క గంటలో మీటవగలరేమో కనుక్కోండి' .. అదీ ఫోన్ కాల్ సారాంశం.

నరసింహారావుగారి మొహం జేవురించింది. 'అలాగేనండీ! తను ఇక్కడే ఉంది. ఒక్క గంట లోపే పంపిస్తాను' అంటూ ఫోన్ కట్ చేసాడు.

నరసింహారావుగారి కారులోనే ఆ సాయంత్రం ఊరిబైట  కాలువదాకా వెళ్ళారు రామ్మూర్తిగారు, రాధమ్మ.

కాలువ ఒడ్డున చల్లగా హాయిగా ఉంది. సముద్రతీరాలలో పగలంతా ఎంత చిత్తడి చిత్తడిగా ఉన్నా సాయకాలాలు చల్లగాలి తిరిగి ప్రాణాలు లేచొస్తుంటాయి సాధారణంగా.

పంచదార రాసులు పోసినట్లుండే ఆ తెల్ల ఇసుక దిబ్బలమీద చేరి పటమట కుంగే  నారింజ రంగు సూర్యుణ్ని చూస్తూ పనిపాటలు ముగించుకొని ఇళ్లకు మళ్లే కూలినాలి జనాల సందళ్లను చూస్తూ కాలం గడపడం సహజంగా భావుకులైన రామ్మూర్తిగారికి ఇష్టమైన కాలక్షేపంగా మారిందీ వారం  రోజుల్నుంచీ!

రాధమ్మ పుణ్యమా అని ఆ సత్కాలక్షేపానికి సాహిత్య వాసనల గుబాళింపూ తోడై మనసున మల్లెల మాలల ఊగుళ్లు మెల్లగా ఆరంభయిపోయాయి. ఇద్దరూ సంగీత సాహిత్యాలమీద చర్చించుకుంటూ కూర్చుంటే గంటలు  నిమిషాల్లాగా దొర్లినట్లనిపిస్తున్నాయి.

ఆ రోజు శనివారం. ఎప్పటి సాయంకాలాలకు మల్లేనే తూర్పుగాలి వ్యాహ్యాళికి వచ్చి రైలు బ్రిడ్జి కిటువైపు దిబ్బలమీద కూర్చున్నారిద్దరూ. 

మాటల మధ్యలో రామ్మూర్తిగారడిగారు 'మంచి కాలక్షేపం ఇచ్చారు మీరు. ఇంకో మూడు  రోజుల్లో ఆడిటింగ్ పని అయిపోతుంది. మీ గురించి మరింత తెలుసుకోవాలనుంది. మీకభ్యంతరం లేకపోతే చెప్పండి!'

'మా నాన్నగారిని గురించి మీకు తెలుసు. ఆయన  ధర్మసత్రంలో పద్దులు రాసేవారు. పొట్టకూటికి ఏదో ఒకటి చేయాలిగదా! నాకు ఒక అన్నయ్య. వాడి ఎదుగదలలో ఏదో ఒక చిన్న లోపం ఉంది. పెళ్లయితే చక్కబడుతుందని పెళ్ళి చేసారు. అప్పుడు కట్నంగా వచ్చిన సొమ్ములో ఓ  లక్ష  నాన్నగారు నరసింహారావు బాబాయిగారి దగ్గర దాచారు..  నా పెళ్లి ఖర్చులకోసం. దానిమీద వచ్చే వడ్డీ డబ్బుల్తోనే నేను టీచర్ ట్రయినింగ్  పూర్తి చేసాను. మా నాన్నగారి సంగీతం మీద అభిమానం ఉన్న ఒక పోస్టుమాష్టరుగారితో నా పెళ్ళి నిశ్చయమయింది . 'కట్నం వద్దు. పెళ్ళి మాత్రం ఘనంగా  చెయ్యండి' అని షరతు పెట్టారు వాళ్లు. 

అన్నయ సంగతి చెప్పానుగా. నాన్నగారికి డబ్బు  వ్యవహారాలు అంతగా పట్టవు. నరసింహారావు బాబాయిగారే పెళ్లిపెద్దలుగా వ్యవహరించారు. ఖర్చులకుంచమని నాన్నగారు తలుపూరులో ఉన్న  మాగాణి మూడెకరాలు అమ్మి రెండు  లక్షలు   బాబాయిగారి చేతిలో పోసారు పెళ్ళిఖర్చులకోసమని. 

తెల్లారి పెళ్లనంగా తరలి వస్తున్న పెళ్ళివారి బస్సును హైవే మీద ఎదురుగుండా వచ్చే లారీ గుద్దింది.  ఆ ప్రమాదంలో పోయింది ఒక్క పెళ్ళికొడుకే! పెళ్ళి రద్దయింది. 

ఎట్లా పుట్టిందో .. నేనొక  నష్ట జాతకురాలునన్న అపవాదు పుట్టింది. ఆ తరువాత పెళ్ళి సంబంధాలు రాలేదు. ఈ దిగుల్తో నాన్నగారు రెండేళ్ళ కిందట పోయారు. పోయినేడాది ఆడబిడ్డను కని వదిన చనిపోయింది. మిగిలింది నేనూ అమ్మా .. ఆ  పాప'

'మరి మీ అన్నయ్యా?'

'ఎటో వెళ్ళి పోయాడు అందిన కాడికి పెళ్లి డబ్బులు పుచ్చుకొని . ఏమయ్యాడో తెలీదు. పోయి ఏడాదిన్నర దాటింది.'

రాధమ్మ చెబుతోంటే రామ్మూర్తిగారు వింటూ కూర్చున్నారు. ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలీలేదు.

రాధమ్మను దిగబెట్టే నెపంతో ఇంటిదాకా వచ్చారు రామ్మూర్తిగారు. 

చీకట్లో తలుపు తెరవగానే 'నాన్నా!' అంటూ కాళ్లను చుట్టేసుకొంది చిన్నారి.

'సారీ సార్! దీనికి ఏ మగమనిషి  కనిపించినా నాన్నలాగే అనిపిస్తాడు. ఇంకా పసితనం వదలని వయసు'అంటూ మారాం చేసే చిన్నారిని తల్లికిచ్చి పంపించేసింది రాధమ్మ.
***

హైస్కూలు గ్రాంట్స్ విషయంలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని ఆకాశరామన్న ఉత్తరాలు వస్తోంటే పునర్విచారణకు వచ్చారు రామ్మూర్తిగారు. ఆయనకు తోడుగా మరో గుమాస్తా గుర్నాథం మాకాం గవర్నమెంటు గెస్టు హవుస్ లో.

మీడియా వాళ్లూ వాసన పట్టినట్లున్నారు. వేడి వేడి వార్తలేమైనా దొరుకుతాయేమోనని స్కూలుమీదే నిఘా వేసి ఉంచారు.

నరసింహారావుగారికి ముళ్ళమీద కూర్చున్నట్లుంది. ఎన్నడూ లేనిది  రామ్మూర్తిసారీ సారి సీరియస్సుగా ఉన్నారు. 

వచ్చి రెండు రోజులయినా ఇదివరకులా సాయంకాలాలు బైటికి రావడం లేదు! మూడో రోజు సాయంత్రం నరసింహారావుగారే చొరవ చేసుకొని 'రాధమ్మనొకసారి పిలిపించమంటారా? అని అడిగేసాడు.

'ఇప్పుడొద్దు!' అన్నారు రామ్మూర్తిగారు.

'వీలయితే నైటుకి గెస్టుహౌసుకి పంపించమంటున్నారు' అన్నాడు గుర్నాథం తరువాత రహస్యంగా.

నరసింహారావుగారి గుండెల్లో రాయి పడింది. పెళ్లికాని ఆడపిల్లని నైటుకి పంపించమంటాడేమిటీ? రాధమ్మ అలాంటిదో కాదో తనకెలా తెలుస్తుంది?

రాధమ్మ ఇంటికెళ్లి అడిగే ధైర్యం లేక ఆ రోజుకి అలాగే నిమ్మకుండి పోయాడు.

దాని ప్రభావం మర్నాడు పొద్దున్నే బైటపడింది.

'సార్! మీరు ప్రొడ్యూస్ చేసిన సిమెంటు.. స్టీలు బిల్లుల్లోని రేట్లు మార్కెట్ రేట్లకన్నా రెండింతలున్నాయి. రికవరీకి పెడితే చాలా రీపే చేయాల్సుంటుంది. అంతా ఏడెనిమిది లక్షలు దాకా తేలింది. ఇంకా ఫర్నిచర్.. ఫిక్చర్స్.. ఎకౌంట్ లోతుల్లోకెళితే ఇంకెంత తేలుతుందో! అసలీ కన్స్టక్షనుకి సర్టిఫై చేసిన  వయబిలిటీ రిపోర్టునే  సార్ సస్పెక్ట్ చేస్తున్నారు' చావు కబురు చల్లంగా బైటపెట్టాడు గుర్నాథం.

స్కూలు బిల్డింగుకని శాంక్షనయిన గ్రాంట్స్ లో సింహభాగం అల్లుడుగారికని నిర్మిస్తున్న డూప్లెక్సుకే డైవర్టయి పోయింది. 

పోయినసారొచ్చినప్పుడు చూసీ చూడకుండా పోయిన పెద్దమనిషి ఈ సారెందుకిలా పట్టి పట్టి  చూస్తున్నాడన్నీ?!'

'కమీషను కావాలంటే ఇంకో అరశాతం పెంచుదాం లేవఁయ్యా! సారు నొకసారి కదిపి చూడు గుర్నాథం!' అన్నాడు నరసింహారావుగారు.

గుర్నాథం అదో మాదిరిగా నవ్వాడు.

'ఈ సారి సారుగారి టేస్టు మారింది. భార్య పోయి ఏడాది దాటింది కదా పాపం.. గురువుగారి గాలి అటు తిరిగింది!'

'అంటే?!'

'అదే సార్! ముందా పంతులమ్మగారి మేటర్ సెటిల్ చేయండి! నిన్నే మీకు చెప్పాను కదా! తాత్సారం చేస్తే కోరి తెచ్చుకొన్నట్లుంది నష్టం' అని వెళ్ళిపోయాడు గుర్నాథం.

మర్నాడు కొర్రీలు మరీ ఎక్కువయ్యాయి. మనిషిని కదపడానికి లేదు. పరశురామ్మూర్తి అగ్గిరాముడై పోతున్నాడు.  దాదాపు రిపోర్టు తయారై పోయింది. సంతకం చేయడమొకటే మిగిలి పోయింది. ఆ రిపోర్టులో సగం నిజమని తేలినా నిండా మునగడం ఖాయం. 

డబ్బు సంగతలా ఉంచి ముందు కూతురు కాపురానికి నీళ్లొదులుకోవాల్సిందే! వయబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చింది స్వయానా అల్లుడుగారే!

ఇంట్లో కమల ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు కలగజేసుకొంది నరసింహారావుగారి భార్య వరలక్ష్మమ్మగారు. 

తానే స్వయంగా రాధమ్మ ఇంటికి బైలుదేరింది.

 'మనమిక్కడ కొంపలో కూర్చుని పాపం.. పుణ్యం అంటూ శతకాలు వల్లెవేస్తున్నాం కానీ.. గా మూడు  లక్షలు పారేస్తే ఆ పత్తిత్తు ఎక్కడికి పోవడానికయిన సిద్ధంగా ఉంది' అంది తిరిగొచ్చి.

'రెండు లక్షలా?! తనేవఁన్నా పెద్ద సినీతారనుకుంటుందా? వెయ్యి  పారేస్తే పేటనుంచి పదిమంది పరుగెత్తుకొస్తారు.' అంటూ లేచాట్ట ఫోనులో అమ్మాయి చెప్పిందంతా  విన్న ఇంజనీరల్లుడుగారు. 

కూతురొహటే పనిగా లబ్బుమంటుంటే కాలా చెయ్యి ఆడక  లేచెళ్లిపోయాడు నరసింహారావుగారు.

రాథమ్మ పథకం ఇప్పుడిప్పుడే మెల్లంగా అర్థమవడం మొదలు పెట్టింది నరసింహారావుగారికి.

బైటికేమీ తెలీనట్లుండే ఈ జాణ ఎంత పెద్ద వ్యూహం పన్నిందీ! ఈ ఉచ్చునుంచి  బైటపడాలంటే తానిప్పుడు మూడు  లక్షలు అచ్చుకోక తప్పదు. కావాలనే తాను ఆ కీచకుడి కంటబడింది. సంగీతం, సాహిత్యం అంటూ కావాలనే వాడిని ముగ్గులోకి దింపింది. దాని తండ్రి అప్పుడెప్పుడో తన దగ్గర దాచిన అప్పటి పెళ్లి డబ్బు రాబట్టడానికే ఇంత పెద్ద కథ నడిపిందీ! ఆయనిచ్చింది రెండు  లక్షలు  . ఇప్పుడిది మూడూ  లక్షలకు టెండరు పెట్టింది! ' 

'పోతే పోయింది వెధవ డబ్బు! ముందు పరువు నిలబడ్డం ముఖ్యం. కూతురు కాపురం నిలబడ్డం అంతకన్నా ప్రధానం.' అంటూ కట్టుకున్నది కూడా అడ్డం తిరిగేసరికి నరసింహారావుగారికీ ఇంకో దారి తోచింది కాదు . 

పెళ్ళాం చేతికి డబ్బిచ్చి పంపిస్తూ ఇంకో ముక్క కూడా రాధమ్మకు చెప్పమన్నాడు. 'ఇందులో ఉన్నది సగమే! రేప్పొద్దున ఆ రిపోర్టు బైటికొచ్చిన దాన్ని బట్టీ ఉంటుంది మిగతా సగం.'

రాధమ్మ రాత్రి రామ్మూర్తిగారుండే గెస్టు హౌసుకెళ్ళొచ్చిందని తెల్లారి గుర్నాథం వచ్చి  చల్లని కబురు చెప్పిందాకా నరసింహారావుగారింట్లో ఎవరికీ కంటిమీద కునుకు లేదు.

మర్నాడు ఫైనల్ రిపోర్టుమీద సంతకం చేస్తూ అన్నారు రామ్మూర్తిగారు 'నా ఇన్వెష్టిగేషన్లో చాలా తప్పులే బైటపడ్డాయి నరసింహారావుగారూ! చివరి ఛాస్నుగా లైట్ గానే రాసానీ సారికి. మళ్లా మూడు నెలలకి ఇంకో ఎన్క్వయిరీకి రావాల్సుంటుంది. ఈ  లోపలే 'ఇర్రెగ్యులారిటీస్' అన్నింటినీ సెట్ రైట్ చేసి పెట్టుకోండి!  ఆ రాధగారి ఇంటిల్లిపాదికీ దండం పెట్టుకోండి!'

రామ్మూర్తిగారు హింట్ చేసిన ' ఇర్రెగ్యులారిటీస్ ' ఏంటో  పసిగట్టలేనంత పసిబిడ్డ కాదుగా నరసింహారావుగారు! 

స్వయంగా తనే మిగతా డబ్బు తీసుకొని రాధమ్మ ఇంటికెళ్లాడు ఆ సాయంకాలమే!


వరండా అరుగుమీద ట్యూషను జరుగుతోంది.

" 'స్టాకింగ్ హార్స్' అంటే ఏంటి మేడమ్?" అని ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నది రాధమ్మ. 'మనిషంటే మిగతా జంతుజాలానికి అంతులేని భయం. వాడి నీడకయినా    చిక్కకుండా పారిపోతుంటాయందుకే! కానీ మనిషి జిత్తులకి జాకాల్ కదా! తాను మచ్చిక చేసుకున్న  ఓ గుర్రాన్ని ముందుకు నడిపిస్తూ దాని చాటున వేట జంతువును సమీపించి పట్టుకుంటాడు. అలా వేటలో మనిషికి ఉపయోగపడే గుర్రమే 'స్టాకింగ్ హార్స్'. తన ఉనికి తెలియకుండా వేరేవారి ద్వారా ఒడుపుగా పనులు చక్కబెట్టుకున్నప్పుడు అట్లా  ఉపయోగ పడిన గుర్రాన్నే 'స్టాకింగ్ హార్స్' అంటారు..'

'నన్ను పట్టుకునేందుకు పరశురామ్మూర్తిని నువ్వు స్టాకింగ్ హార్స్ గా ఉపయోగించుకున్నావన్న మాట!' అనుకున్నాడు నరసింహారావుగారు మనసులో!

పెద్దాయన్ను చూడంగానే ' నాన్నా '  అంటూ కాళ్లకు చుట్టుకుపోయింది చిన్నారి ఎప్పట్లానే!

'ఈయన నాన్నారు కాదు చిన్నారీ! తాతగారు. నిన్న రాత్రి నువ్వూ, నేనూ, అమ్మమ్మా కలసి వెళ్లామే .. బంగళాకి.. అక్కడున్నారు నీ నాన్నారు!' అంటు చిన్నారిని ఎత్తుకుంది రాధమ్మ.

నరసింహారావుగారికి అంతా అర్థమైపోయింది. నీతికి నిలువుటద్ధం శ్రీనివాసాచారిగారు. ఆయన కూతురు  తప్పు చేస్తుందనుకోడం తన తెలివితక్కువతనం. తల్లితో, పసిపిల్లతో వెళ్లిన రాధ అక్కడ ఇంకేదో చేసిందని ఊహించుకోవడం తన బుద్ధిహీనత. 

'థేంక్స్ బాబాయిగారూ! సమయానికి పెళ్లి ఖర్చులకందించారు.' అంది నరసింహారావుగారందించిన క్యాష్ బ్యాగ్ అందుకుంటూ రాధమ్మ.

'మీ నాన్నగారు నా దగ్గర దాచి పెట్టుకున్నది అందుకే కదమ్మా! వడ్డీ డబ్బులు పెళ్ళి నాటికి అందిస్తా!' అన్నారు ఇక చేసేదేమీ లేక.
***
(రచన మాసపత్రికలో ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...