ఈవారం ఆంధ్రజ్యోతి(05-02-2017)
అనుబంధంలో పాపినేని శివశంకర్ 'పిరమిడ్’ కథ తెలుగుకథను కొత్త ఎత్తులకి ఎక్కించింది.
ఊపిరి తిరగని
పనులు, ఉద్వేగం, తెరిపిలేని ఆలోచనలు తేనెటీగల్లా ముసిరి విసిగిస్తున్నా ముసి ముసి నవ్వుల
గాంభీర్యం ఉదారంగా ప్రసాదించే దర్పం ఈనాటి ధనిక ప్రపంచపు అధినేతల ‘ది మోస్ట్ గ్లామరైజ్డ్’ గెశ్చరుగా ఉండటం తప్పని సరి! ఆ గ్లిట్టరింగ్ భంగిమల
చాటున నీలివలయాల ఊబి ఎంతాకర్షణీయంగా అల్లుకునుంటుందో
వివరించేందుకు పిరమిడ్ కథలో పాపినేని ఎన్నుకున్న
సర్రియలిస్టిక్.. తాత్త్విక ధోరణలను ప్రశంసనీయం.
ఏ మమకారం లేకుండానే
ఊళ్లకు ఊళ్లు దత్తత తీసుకొనే శ్రీమంతులు దండిగా
పెరిగుతున్న ఈ కాలంబట్టీ చూస్తే కథాంశం ఎంత
పాతదైనా అంతే తాజాదనికూడా అనిపిస్తుంది. ఏ అడ్డదారిలో అయినా సరే ఎవరూ చేరుకోలేని ఎత్తులకు ఎగబాకాలన్న మోహావేశం ఈ కథలోని ప్రధాన పాత్రది. మనందరిలోనూ..
మనుషులందరిలోనూ.. కొందరిలో బాహాటంగా.. ఇంకొందరిలో అంతశ్చేతనలో.. సదా.. బుసగొడుతుండే
ఆవేశమే ఇది. అందుకే కథకీ సార్వజనీనత. తాజా ఆఘ్రాణత అమరింది.
అవధుల్లేని,
శక్తికి మించిన అత్యాశను జయించడం అంత సులభంగా కాదెవరికీ. కాబట్టే.. అంతులేని అధికారం
చేతుల్లో ఉండీ.. అక్రమార్జునలకు.. అడ్డదారి సుఖాలకు కక్కుర్తి పడి కేసుల గాలాలకు చిక్కి గిలగిలలాడే
పెద్దల కథలు.. పద్దాకా మనం.. వింటుండేది. ఆ వ్యథలు కళ్లారా చూస్తున్నప్పుడు..
ఆ కథలు చెవులారా వింటున్నప్పుడు .. వేరే వారివి..
ఎవరివో.. చదువుతున్నామన్న భ్రమే కానీ.. నిజానికి ఆ ఆశోపహతుల పతాక సన్నివేశ హీనత్వం
మన మోహావేశాల పతనాల పర్యవసానానిక్కూడా చెందిందేనని
తెలుసుకోలేం. అవకాశం దొరకని అదృష్టమేదో మనలోని చాలామందిని ఇంకా బుద్ధిమంతుల పద్దుకిందే
మిగిల్చి ఉందన్నదే అసలైన చేదు నిజం.
ఒక కథ గొప్పగా
కుదరాలంటే కుదరాల్సిన దినుసులేవీ? విమర్శక్కూర్చుంటే ఎవరెవరివో ఏవేవో తర్కాలు.. వాదాలు ముందుకు వస్తాయి!
విమర్శ అంటేనే వైరుధ్యం.. వైవిధ్యం తప్పని
వేదిక కదా! తప్పుకు పోవడం కుదరక పోవచ్చు. ఆ దారిలో తప్పి పోవాలన్న ఉద్దేశం ప్రస్తుతం
లేదు. ఈ నాలుగు ముక్కలూ.. ‘పిరమిడ్’ కథలో రచయిత పదును పెట్టిన పనిముట్లను గురించిన
చిన్న ప్రశంస. అంతే!
కచ్చితమైన
కొలతల ప్రకారమే కుట్టిన అంగీ యథాలాపంగా తయారైన జేబురుమాలుకన్నా అందంగా ఉండి తీరుతుందనీ ఘంటాపథంగా
చెప్పలేం కదా ఎవరమైనా? కంటి నదురు నిర్మాణంలో ఎవరం నిర్వచించలేని ఏదో పదార్థం దాగుంది.
అదే విధంగా ఓ కథ మనసుకి హత్తుకొనే తీరులోనూ ఇతమిత్థమని చెప్పలేని
ప్రతిభా పాటవమేదో ఉండే ఉంటుంది. పాపినేని
'పిరమిడ్' కథలో వాటి పాళ్లు వందశాతం కుదిరాయనిపిస్తుంది.
కాబట్టే నా బోటి అభిరుచిగలవారి బుద్ధికి ఇంతలా
పట్టిస్తోంది.. అనిపిస్తోంది.
ఆరు మూరలుగా
తీర్చి దిద్దిన ఈ హారంలోని ప్రతీ దృశ్యమూ ముందేం జరగబోతుందో మనమూహించలేనంత గొప్ప సస్పెన్సుతో అయితే ఏమీ నిండి
ఉండదు. మొదటి దృశ్యంలోనే ముఖ్య పాత్రల మనస్తత్వాల మధ్యుండే తారతమ్యాన్ని సింబాలిక్
గా రచయిత ఉప్పందించడంతో ఆరో దృశ్యంలో
ప్రధాన పాత్రకు ఏ అథోగతి పట్టపోతుందో కథాక్రమంలో మనం ముందే తేలిగ్గా ఊహించేసుకోవచ్చు. అందునా రచయిత ప్రవేశపెట్టిన పాత్రల్లో
ఏదీ కొత్త తరహాది కాదు. అన్నీ పాత సినిమా రొటీన్
యావరేజ్ కథలో మాదిరివే. ఒక అత్యాశ, ఆ దుర్గుణంతో
సర్దుకువస్తున్న బాల్యస్నేహం, కంటిముందే కానవస్తున్నా కన్నూ మిన్నూ కానకుండా ఆ ఉపద్రవాన్నుంచి తన్ను తప్పుకోగలనన్న ధీమా ఇచ్చిన అత్యుత్సాహంతో ఎత్తులెత్తుల కెగబాకే దుస్సాహసం, ఆ దుష్టసాహసంబెల్లం చూట్టూ చేరే సూడోప్రేమఈగలరొద,
ఆ రొదను భరించలేక తెగించి వదిలి వెళ్లిపోయే రక్తబంధం, అలా తెగించలేక.. అలాగని తెగింపుతో సర్దుకుపోలేక సతమతమయ్యే సతీధర్మం.. చివరాఖరికి
రొటీన్ తెలుగు సినిమా పతాకసన్నివేశం టైపు ప్రతినాయకనిర్వాకం పశ్చాత్తాపం! అందంగా నిర్మించుకున్న
భూగృహాంతరాల్లో పేర్చుకున్న కుబేరత్వం పొరల
మధ్య నిజాయితీ కంటికి స్పష్టంగా కనిపించే
'నీలి వలయాలని' నిర్లక్ష్యం చేసినందుగ్గాను పడే పశ్చాత్తాపం అది! పిరమిడ్ అట్టడుగున ఏముంటుందో తెలిసీ పిరమిడ్ కట్టేందుకే
మోహపడే మోజుకు చివరికి పట్టే గతి ఎలాగుండబోతుందో హెచ్చరించేందుకే రచయిత ఈ
కథ చెప్పాడా? .. 'ఎదుగుదలని స్కేళ్లతో, చెక్కుల్తో,
లాభాల్తో కొలిచే అత్యాశా భౌతికవాదానికి ‘పిరమిడ్’
కథ నిజంగా ఒక చెంప పెట్టు' అని ఓ సారి పొగిడి పుస్తకమవతల పారేస్తే. ఓ పనై పోతుంది.
ఎంతోమంది రచయితలు కొట్టారు అలాంటి చెంపదెబ్బలు గతంలొ. ఎన్ని వినుంటామో
మనం! మరి ఇందులో మాత్రం ప్రత్యేకంగా విశేషం ఏముంది?!
ఉంది. కనకనే
ఈ ముచ్చట.
పాపినేని చెప్పినట్లు
'పై పైకి పోయే కొద్దీ పతనభయం పెరుగుతోందన్నది’ సాధారణ సూత్రమే. ఎవరికి తెలియని రహస్యమది?
యథాతథంగా చెబితే మహా విసుగ్గా అనిపించే ఇలాంటి ఇంకెన్నో సూత్రాల చుట్టూతా కథను అల్లే
సమయంలో రచయిత ఏ ఎత్తులు వేసాడో.. ఆ ఎత్తుల్లోని
ఉత్తమ ప్రతిభనొకసారి భుజం తట్టాలన్న ఉబలాటంతో రాసిందీ ప్రశంస.
కథను పాయలు
పాయలుగా చీల్చి చెప్పడం మరీ అంత కొత్త ఎత్తుగడేం కాదు. గతంలో రావిశాస్త్రిలాంటి ప్రతిభావంతులు
ఎందరో పరిచిన దారే అది. కథనంలోనే కనిపించింది పాపినేని తనదైన ప్రతిభంతా.
దాదాపు ప్రతీ వాక్యాన్ని ఒక అధివాస్తవిక ప్రతీక ధోరణిలో..
కొండొకచో కొన్ని పదాలను అంతకు మించిన తాత్విక
'స్పృహతో..చెక్కుకుంటూ పోయాడీ రచయిత. ఎక్కడా ధారా ఉధృతి మందగించకుండా ప్రవహించడం అంత
సులభమైన విద్యేం కాదు. పాపినేనిని ప్రశంసించకుండా ఉండలేం ఈ అవిఛ్చిన్న ధారాశుద్ధికి. అందమైన ‘పిరమిడ్’ను చలవరాతి పొరలుగా పైకి పైకి పేర్చుకుంటో
పోయే తీరులో.. కథ కట్టడంలో రచయిత కనబరిచిన
మేస్త్రీ పనితనం ‘పిరమిడ్’ కథకు శాశ్వతమైన
అందాలు చేకూర్చి పెట్టింది కచ్చితంగా.
ఇటలీనుంచి
దిగిన పాలరాళ్లతో, బెల్జియం అద్దాలతో, వెనీషియన్ షాండ్లియర్సుతో, ఫ్రెంచి కళాకౌశల్యాన్ని
తలపించే అత్యంత ఖరీదైన ప్రాసాదాన్ని గొప్పకోసం ప్రధాన నాయకుడు చూపించినప్పుడు.. 'నీ
అష్టాంగాలు విడివిడిగా ఒక్కో గదిలో పడుకొన్నా ఇంకా చాలా మిగిలి పోతాయి' అంటాడా బాల్యస్నేహితుడు
సరదాగా. అతగాడిని అమాయకుణ్ణి చూసినట్లు చూస్తాడా
ముఖ్య నాయకుడా సందర్భంలో. స్నేహితుడు సరదాగా
అన్నది సరదాగా కాదు. అసలైన అమాయకత స్నేహితుడిది కాదు. ఎత్తులకెగబాకాలని పాకులాడే ఆ
ప్రధాన పాత్రదే అని ఫలితాంశంగా చెప్పేందుకు పాపినేని శివశంకర్ ఉపయోగించిన పనిముట్లకు జిందాబాద్!
ఆరో దృశ్యంలో..
కటకటాల్లో ఉన్న ప్రతినాయకుడి చేత 'How much land does a man need?' పుస్తకం చదివించాలనుకుంటుంది
రచయిత పాత్ర. మంచిదే! ఊచల వెనుక చేరగిలున్నప్పుడు
తాత్కాలిక కుంగుబాటుకు మందుగానో.. ఉబుసుపోకకో
ఆ
పుస్తకం చదవితే చదవవచ్చు. నచ్చినా నచ్చుండవచ్చేమో ఆ క్షణానికి. కానీ.. కాలం కలసివచ్చి భోగం చెరనుంచి బైట పడినప్పుడు
మళ్లీ మరో పిరమిడ్ నిర్మాణానికి సిద్దపడని పరిణతి సాధించినప్పుడు కదా కథకు సార్థకతంటూ
ఏర్పడేది? అంటారా?
‘చెప్పడమే
నా ధర్మం.. వినకపోతే నీ ఖర్మం’ అంటాడు నారాయణుడు నరుడితో భగవద్గీతలో.కథకు సంబంధించినంత
వరకు రచయితది కేవలం పర్మాత్ముడి పాత్రే. పాత్రల
పరివర్తనకు రాతగాడెంతమాత్రం జవాబుదారీ కానేరడు.
కథలోని అంతిమ
నైతిక నీతిసూత్రం కాదు పాపినేని ‘పిరమిడ్’ కథను గొప్పకథల సరసన చేర్చింది. పాతదే అయినా
కథను సరికొత్త పంథాలో నడిపించిన రచయిత ప్రతిభ.
రాన్రానూ..
రక రకాల సోయగాలతో నునుపు తేలుతున్న తెలుగు కథాసుందరికి మరో సౌందర్య హారం అమర్చి పెట్టిన
పాపినేని శివశంకర్ కు అభినందనలు. పాఠకుల తరుఫున
ధన్యవాదాలు.
-కర్లపాలెం హనుమంతరావు
ఫోన్ నెంః 8142283676
ఫ్లాట్ నెం# 404, శ్యామ్ కామధేను అపార్ట్ మెంట్.
మోతీ నగర్, హైదరాబాద్- 50001
https://onedrive.live.com/?cid=4B36C8046FCB7142&id=4B36C8046FCB7142%21227353&parId=root&o=OneUp
https://onedrive.live.com/?cid=4B36C8046FCB7142&id=4B36C8046FCB7142%21227353&parId=root&o=OneUp
No comments:
Post a Comment