'ఇవాళా?!'
'అవును. మీ బాస్ ఫోన్ చేసాడు. నువ్వు
రిఫ్రెషింగ్ రూంలో ఉన్నావని నేనే లిఫ్ట్ చేసా.. సెల్'
'…'
'నీ కివాళ ఆఫ్ కదా?'
'అవును. అందుకే ఆంటీకి ఆర్థోపెడిక్
అప్పాయింట్ మెంట్ తీసుకుంది. ఇప్పుడు కాకపోతే.. మళ్లా మూణ్నెల్లగానీ డేట్ దొరకదు కృష్ణా!'
'మరేం చేద్దామనుకుంటున్నావ్! పోనీ మేటర్
ఇది అని మీ బాస్ కి చెప్పేసెయ్! ఏమన్నా ప్రాబ్లమా?'
'తనకేం ప్రాబ్లం! నాకే కదా ప్రాబ్లం!
రాక రాక వచ్చిన అవకాశం ఇది. లూజ్ చేసుకోకూడదని
మా గురూజీ గొడవ. రానంటే ఏమీ అనరు కానీ.. నాకే ఏదోలా ఉంది'
'నో ప్రాబ్లం రాణీ! పోనీ నేను వెళతాలే
అమ్మతో డాక్టరు దగ్గరికి. నువ్వెళ్ళి పో! అంతలా ఫీలవాల్సిన అవసరం లేదు. అవతల వచ్చే
పర్సన్ ఎంత ఇంపార్టెంటో.. అదీ చూసుకోవాలిగా.. ప్రొఫెషన్లో!'
'థేంక్యూ డార్లింగ్.. సిట్యుయేషన్ అర్థం
చేసుకొన్నావు.. గ్రేట్!'
***
'అందరు వచ్చినట్లేనా! వాటెబౌట్ రమా?'
'తన కివాళ పెళ్లి చూపులున్నాయి సార్!'
'హ్మఁ! బ్యాడ్ లక్ టు హర్! అతి కష్టం
మీద దొరికిందీ ఛాన్సు! మీకు తెలుసు. మళ్లీ రారు కనకనే ఇలాంటి వాళ్లు.. మిమ్మల్నందర్నీ
ఇంతలా అలర్ట్ చేస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే
మీరంతా చాలా లకీ గైస్! మా రోజుల్లో ఒక్కడంటే ఒక్కడైనా ఇలాంటి వ్యక్తి తగల్లేదు
మాకు. జస్ట్ ఎవరో చెబితే వినటమే! ఇంకెక్కడికో వెళ్లాలనుకున్న వ్యక్తి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని మన సంగతి తెలుసుకొని మరీ వెతుక్కుంటూ
ఇక్కడకు రావడం నిజంగా నాకైతె ఇప్పటికీ ఒక మిరకల్లాగానే అనిపిస్తుంది'
'సార్! ఆ మెరికల్ మీలోనూ ఉంది. ఆయనకా నమ్మకం కలిగించింది మీరు. మీ లాంటి వాళ్లు
దొరకడం ఆయనకూ.. మాకూ.. ఇద్దరికీ లకీనే!'
'ఓకే.. ఓకే.. గైస్! వచ్చిన వాళ్లంతా
పెంటనే ప్రిపేరయి పోండి! ఎక్కడా మన వైపునుంచి మిస్టేక్ ఉండ కూడదు. అమెరికా వెళ్లే మనిషి.
ఇక్కడికి తిరిగొచ్చింతరువాత మళ్లీ మనల్నే వెతుక్కుంటూ
రావాలి. అదే మీ అందరికి ఇప్పుడు అసలు టెస్టు. మూవాన్ గైస్! సెల్ రింగవుతుంది. అతనొచ్చేస్తున్నాడు.'
***
'మ్యాడమ్! నాకివాళ అప్పాయింట్మెంటుంది కదా! ఎందుకిలా అర్థాంతరంగా
కేన్సిల్ చేసారు?'
'సారీ సార్! అనవాయిడబుల్ సర్కమస్టెన్సస్!
అర్థం చేసుకోండి'
'ఏమర్థం చేసుకోవాలమ్మా! అవతల ఇంకెవరో
పెద్దమనిషి వస్తున్నాడని.. ఎప్పడో ఇచ్చిన మా డేటుని సడెన్ గా ఇలా కేన్సిల్ చేస్తారా!
ఇదేమన్నా బావుందా?'
'చెప్పాంగా! తప్పనప్పుడే కదా ఇలా చేస్తాం. మిమ్మల్ని డిజ్ రెస్పేక్ట్ చెయ్యాలని మాకెందుకుంటుంది?
అవతల వచ్చే వ్యక్తికి ఇబ్బంది ఉండకూడదనే మా కన్సర్న్.. మళ్లీ మరో డేటు తీసుకోండి. మరేం
ఫరవాలేదు, ఇవన్నీ నిదానంగా చూసినా ప్రమాద ముండదు అని చెప్పమన్నారండి మిమ్మ్లని చూసే
డాక్టరుగార్.'
ఫోన్ కట్ అయింది.
***
'ఎవరితోనే అంతలా గొడవ పడుతున్నావ్?
ఇచ్చిన అప్పాయింట్ మెంటును కూడా కాదని.. హఠాత్తుగా వస్తున్న మనిషికి అంత ఇంపార్టెన్సిస్తున్నారు!
ఎప్పుడూ లేంది.. ఈ చిన్నడాక్టర్లంతా ఇవాళ ఒకేసారి కనబడుతున్నారు ,,, అసుపత్రిలో! వచ్చే పేషేంట్ మరీ అంత ఇంపార్టెంటా?'
'వెరీ ఇంపార్టెంట్ తల్లీ! అందుకే కదా
పొద్దుట్నుంచీ ఇంతలా హంగామా! ఆయన ఆ వాసన్
ఆసుపత్రి పేషెంటంట.. చాలా కాలం బట్టీ. కొత్తగా హెల్త్ కార్డు స్కీములొచ్చాయి
కదా! అక్కడ ఉచితంగా వైద్యం దొరకదని తెలిసి మన దగ్గరుందని తెలిసి వచ్చాడు. ఈ పేషెంటుది ఎడ్వాన్స్డ్ కేసు గ్లాకోమియా.
'అంటే చూపు మెల్ల మెల్లంగా తగ్గిపోతుందీ..
కొంత కాలాని కసలు చూపే పోతుందీ.. ఎన్నటికీ నయంకాని జబ్బు!అదేనా?'
'అవును.ఇప్పటికే ఎడం కన్ను పూర్తిగా
పాడయిందతగాడికి. కుడి కంటిక్కూడా అంటుకుంది జబ్బు. ఇలాంటి కేసులు లక్షల్లో ఒకటి కానీ
ఉండవంట. దొరక్క దొరక్క దొరికింది కదా! ఈ రేర్ కేసును మన చిన్న డాక్టర్లందరికి పత్యక్షంగా చూపించి ట్రీట్మెంటు ప్రాక్టీస్ చేయించాలని మన
పెద్ద డాక్టరుగారి హడావుడి.' అంది రిసెప్షన్ కౌంటర్లో కూర్చున్న పిల్ల ఈ మధ్యనే డ్యూటీలో చేరిన మరో పిల్లతో.
ఆ అమ్మాయి ఇంకా ఏదో అడగబోతుంటే వరండాలో
సందడి మొదలయింది.
'నీ సందేహాలన్నీ ఆనక. ముందీ పేష్ంట్
కేస్ షీటు దగ్గర్రడీగా ఉంచుకో.. అతనొస్తున్నాడు' అని లేచింది రిసెప్షనిష్టు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల మాసపత్రికలో ప్రచురితం)-
No comments:
Post a Comment