Monday, February 6, 2017

గాంధీజీ గాండీవం- సత్యం.. అహింస- ఈనాడు ఆదివారం సంపాదకీయం


హాయిగా బతకమని దేవుడు భూమ్మీదకు పంపిస్తే- మనిషికే మనిషి అరి, నరుడికే నరుడు ఉరిగా మారిన కత్తులమారికాలం ప్రస్తుతం నడుస్తోంది. 'జరతో, రుజతో ఎలాగూ ముంచుకొచ్చే మరణాన్ని మనిషి హింసావేశపాశాలతో మరింత ముందుకు నెట్టుకొచ్చుకుంటున్నాడే! నరుడే నరకాసురుడుగా మారుతున్నాడే' అని ప్రజాకవి దాశరథి నొచ్చుకున్నప్పటి దారుణ పరిస్థితులే నేడూ ఉన్నాయి. కంటికి కన్ను, పంటికి పన్ను అన్న వాదమే- ప్రపంచమంతా ప్రజ్వరిల్లే అగ్నికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోన్నది. దాయాదులతో యుద్ధమా?.. సంధా? అనే సమాలోచనలు పాండవుల మధ్య పెద్ద రాద్ధాంతాన్నే రగిల్చింది. 'త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తమ్మన్నముం బెట్టి, రే/ చేటున్ వాటిల కున్కి కష్టపడి కాశీయాత్ర కంపించి, ర/చ్చోటన్ కొంపకు నిప్పుపెట్టి, రడవుల్ చుట్టించిరి' కౌరవులని మొదట పాండవులు రోషపడ్డారు. చివరికి ‘అయిదూళ్లయినను చాలు’ అని సరిపెట్టుకోవడమే మేలన్న వారి తీర్మానం వెనుక ఉన్న మర్మం ‘అహింస మాత్రమే పరమ ధర్మం’ అన్న సృష్టి సూత్రాన్ని విస్మరించకపోవడమే. హింసామయ జీవితాన్ని ధర్మశాస్త్రజ్ఞులు ప్రశంసించరు. రాయంచపై దేవదత్తుడు చూపించిన క్రౌర్యాన్ని బుద్ధుడు కాకముందే సిద్ధార్థుడు నిరసించాడు! క్రౌంచ పక్షుల జంటను నిష్కారణంగా కిరాతుడు హింసించాడనే గదా బోయదశలో ఉన్నా వాల్మీకి ఎదలో అంత ఆవేదన రగిలింది! హింసకు హింసే సమాధానం కానవసరం లేదు. నవనందుల దానవ ప్రవృత్తికి ఆచార్య చాణక్యుని ప్రతిస్పందన- మౌర్య సామ్రాజ్య సువర్ణ పాలన. అహింసాలతలు రక్కసి మూకల వికృత చర్యల సెగ తగిలి వసివాడినప్పుడల్లా పాదులుతీసి దయారసాలు చల్లి తిరిగి చివురులు పూయించిన ప్రేమమూర్తుల జాబితా చిన్నదేమీ కాదు.

ఈ  విశాల ప్రపంచ వైద్యాలయంలో హింసాబద్ధులైన రోగులను ఉద్ధరించే వైద్యం- సత్యం, అహింస, శాంతి, కారుణ్యాలనే  చికిత్సా విధానాలే- అంటాడు ఖలీల్ జిబ్రాన్. చర్మ చక్షువులతో తేరిపార చూడలేని కర్మసాక్షి ఉనికి కిరణరశ్మి స్పర్శానుభవంద్వారా తెలివిడికొస్తుంది. విశ్వ వైద్యనారాయణుల చేతిచలువ జీవికి అనుభవంలోకి తెచ్చేది ఆ కారుణ్య చికిత్సలతోనే అని నమ్మి ప్రబోధించిన క్రైస్తవ సాధువు- ఫ్రాన్సిస్. మరణశయ్యమీద ఉండీ, జీవితాంతం సేవచేసిన గార్దభానికీ కృతజ్ఞతలు చెప్పటం మరవని కరుణామయుడు ఆయన. తోటి జీవాలతోటి సద్భావనతో మనిషి మెలగవలసిన తీరును, అవసరాన్ని లోకానికి చాటిచెప్పిన సాధుశ్రేష్ఠుల జాబితా దేశ కాల మతాలకు అతీతంగా  లెక్కకు మిక్కిలిగా ఉంది. 'ప్రపంచానికి నేను కొత్తగా చెప్పే పాఠం ఏముంది?  సత్యం అహింస శాంతి  హిమాలయాలంత సనాతనమైనవి. గంగా జలమంత పునీతమైనవి' అని మహాత్మాగాంధీ చెప్పుకోవడంలోని అంతరార్థమూ ఇదే. ఇంటికి నిప్పంటించిన కంటకునైనా సరే... కంట కన్నీరు కోరుకోరాదు- అనేది అజాతశత్రువు తత్వం.  ప్రబోధం వరకే పరిమితమవకుండా నిత్యజీవితంలో సైతం అనుక్షణం ఆచరించి చూపించినందువల్లే గాంధీజీని నేటికీ ప్రపంచం మహాత్మునిగా గౌరవించుకుంటున్నది. 'విష పాత్రమెత్తి త్రావెడి మహాయోగి కన్‌గొనలలో తాండవించిన యహింస/ హృదయేశ్వరిని వీడి కదలు ప్రేమతపస్వి బరువు చూపుల పొంగిపొరలు కరుణ/ సిలువపై నిండు గుండెలు గ్రుమ్మరించు దయామూర్తి నుదుట పారాడు శాంతి/ శిరసు వంచక స్వేచ్ఛ కొఱకు పోరాడు వీరాగ్రణి హృదయాన నలరు దీక్ష'- ఏకమై జాతి  పూర్వపుణ్యసంపత్తి ఫలంగా పోరుబందరులో పుత్లీబాయి పొత్తిళ్లలో ఒత్తిగిలి నేటికి నిండు నూటనలభై రెండేళ్లు.

స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతున్న సమర రూపాలకు రక్తపాత రహితమనే కొంగొత్త సహన సిద్ధాంతాన్ని అద్ది గెలుపు మలుపులో సత్య అహింస శాంతి అనే యోధులను నిత్యం కాపుగా ఉంచిన సాహసి మోహన్ దాస్  గాంధీ. అగ్నితో అగ్ని ఆరదు. చల్లబడాలంటే నీరు చల్లక తప్పదు. కరుణలేనినాడు ధరణి లేదు. కరుణలేని నరుడు వట్టి గడ్డిబొమ్మ- ఇదీ బుద్ధుని అష్టాంగమార్గం. భూలోక స్వర్గసృష్టికి అదే సులభమార్గమన్న  సూత్రం కనిపెట్టిన కర్మయోగి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. శాస్త్రవేత్త ఐన్‌స్టీనే విస్తుపోయినట్లు 'కంటితో చూసి ఉండకపోతే కల్పనేమో అన్నంత వింత' బాపూజీ  సత్యాహింసల జీవనప్రస్థానమంతా! పల్లెనుంచి ఢిల్లీదాకా దేశంలో బాపూ పేరుతో ఊరో, నగరమో, రాస్తానో, చౌరస్తానో, వాహ్యాళి స్థలమో, వాహనాల స్థావరమో.. కానరాని చోటు లేదు భారత దేశంలో. సంతోషం. జేబులో తప్పనిసరిగా ఉండే కరెన్సీ నోటుమీదా ఆ బోసినవ్వుల బాపూజీ ప్రత్యక్షం. మరీ సంతోషం. బాపూజీ రూపం కేవలం ఆరాధ్యభావన వరకే  పరిమితమా?! ఆ కర్మయోగి విడిచివెళ్లిన చేతికర్ర, చెప్పులజత, బొడ్డుగడియారాలకు ఇస్తున్నపాటి విలువైనా- సిలువలేని ఆ యేసుప్రభువు ప్రవచించిన మానవీయ విలువలకు మనం ఇస్తున్నామా? బంతివంటి భూగోళాన్ని పంచుకొనేందుకు పసిపిల్లలకన్నా మిన్నగా ఎన్ని విధ్వంసాలు? విషాన్ని మించిన విద్వేషం పరస్పరం చిమ్ముకోడం.. మానవత్వానికే మాయని  మచ్చ! విరోధంతో లేపిన గోడలు చివరికి సమాధులుగా చరిత్రలో మారనిదెన్నడు? బాపూజీ జన్మదిన  శుభసందర్భం ప్రపంచ శాంతి, సహన దినంగా ఐక్యరాజ్య సమితి పరిగణించడం ప్రారంభించి ఇది అయిదోఏడు. మనిషి స్వేచ్ఛా స్వాతంత్య్రాల పోరాటానికి, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానమైన  మానమర్యాదలు సాధించి తీరాలని  ఆరాటపడే అణగారిన వర్గాలవారికి  బాపూజీ చూపించిన శాంతి, అహింసలు మాత్రమే  తిరుగులేని పాశుపతాస్త్రాలని  మరింతగా ప్రచారానికి తేవాల్సిన సందర్భమిదే. సత్యాహింసల అగత్యం ఇంకింత స్మరణకు నోచుకొనే తరుణమూ నిశ్చయంగా ఇదే. కవి కృష్ణశాస్త్రి భావించినట్లు 'తన కంఠమున దాచి హాలాహలం/ తలనుంచి కురిపించి గంగాజలం/ మనిషి శివుడవటమే గాంధీ వరం'. అసహనంతో శివమెత్తిపోతున్న నేటి విశ్వం సర్వస్వం ఆ శివతత్వం అలవర్చుకోవాలని ఈ బాపూ జన్మదిన పర్వం( అక్టోబర్,౨)  నాడు కోరుకొందాం మనమందరం!
***
(ఈనాడు సంపాదకీయం, 02-10-2011)


_________________________

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...