Monday, December 2, 2019

'మరో గొలుసు కట్టు పథకం'- అంబల్ల జనార్దన్ కథానిక పై పరామర్శ



రచయితలకు రాత కష్టాల కన్నా మోత కష్టాలు జాస్తి.  ఇల్లాలు టీలు కాచి కాచి ఇస్తే.. తెల్లార్లూ నిద్ర కాచి  కళ్ళు వాచేటట్లు మరీ   తాను కన్న కలలన్నింటినీ  తెల్లటి  కాగితాలపైన కమ్మటి కథలుగా కనిపారేసే పని రచయితది. తెలుపును నలుపు చేయడం అంటే అదెంతో ఇష్టమైన వ్యాపకం; కాబట్టి కష్టం అనిపించదు. కానీ ఆ రాసేసిన ఆక్షర రాసులన్నిటి అంతిమ పరమార్థం చిత్తు కాగితాల తక్కెడ అయితేనే అనర్థం!  
ప్రతీ రచయిత బయోపిక్ లో రెండు హాఫ్స్ తప్పనిసరి. ఫస్ట్ హాఫ్ లో కలం అనే అంకుశంతో కాగితమనే రణక్షేత్రం మీద కాల్బంట్ల నుండి అశ్వ గజ పదాతి దళాలను మించి అమోఘమైన పాత్రలతో తోచిన వ్యూహాలు అల్లి మరీ  కదను తొక్కించే యోధుడు అతగాడు! సెకండ్ హాఫ్ నుండి  అంత లావు 'గాడూ' అంతూ పొంతూ లేని కడగండ్ల బారిన పడి కొట్టుకుపోతూ  తేరుకొనే దారి తెలియక భోరుమనే ఆర్థిక బాధితుడు. రాసి పడేసిన రాసులన్నింటినీ ఎట్లాగూ అన్ని పత్రికలు పడేసి ఆదరించవు. అచ్చుపడ్డ కథల మీదా ఇరుగు పొరుగు రచయితల పాపిష్టి దిష్టే తప్ప ఎంత మంది అసలు సిసలు పాఠకుల దృష్టి పడుతుందో తెలియదు! అక్షర రాసులతో లక్షలాది కాసులు  ఆశించే సీను ప్రస్తుతం తెలుగు రచయితకు ఎట్లాగూ సున్నా.  కలాల కరవాలాలతో చేసిన భీకర కవాతులకైనా ఓ గుప్పెడు  చప్పట్లు  రాలవు. వాటి కోసం దేబిరించడం.. ద్యావుడా.. ఎంతటి దైన్యం! వెనకటికి  పుస్తక ప్రచురణలో వాచిపోయిన  వాచీతో సహా సర్వం కోల్పోయిన ఓ రచయిత వాపోయినట్లు కాణీలు, అణాలు ఏరుకునేటందుకు మాత్రమే మిత్రమా రూపాయలు పైకి వెదజల్లే సాహసం రచయిత చేయాల్సిందీ కాలంలో! ఇవాళ్టి పరిస్థితిని బట్టి  చూస్తే పుస్తకాల ప్రచురణ నే యాగం రచయిత కోరి కొనితెచ్చుకొనే ఆగం మాత్రమే సుమా! గతం మాదిరి ఏ ప్రచురణ సంస్థా రచయిత సృజనకు ‘సుస్వాగతం!’ అనే చాదస్తపు రోజులు కావివి. అదృష్టవంతులు ఏ అతి కొద్దిమందికో మాత్రమే ఆ స్వాగతాలు.. సత్కారాలు! చిన్నా చితకా రచయితలంతా సొంత సొమ్ముతో ప్రచురణ క్రతువు ఆరంభించి ఆనక పూరా చితికిపోయినవారే! ఆరంభంలోనే ఈ పిచ్చి పుస్తకాలకు చితి ఎందుకు పేర్చలేదా అని చింతించినవారే! చ్చోసి వదిలేసినా అచ్చొచ్చే అదృష్టం అందరు రచయితలకూ పొసగదు.  ఖర్చు ఒక్కటే కాదు వయస్యా సమస్య ఇక్కడ! విచ్చు రూపాయలు  అచ్చుకొనేందుకు సిద్ధ పడ్డా రచయితలకు ప్రచురణ కర్తల కోడరికం తప్పించుకునే మార్గాలు లేవు.  ఓపినన్ని ప్రతులు వేసి ఏ పంపిణీ సంస్థకో ఓపెన్ గానే చచ్చు రేటుకు ఆఫర్ ఇచ్చినా ప్రతీ వంద రూప్యములకు ఒక పైసా గిట్టుట సందేహము! రచయిత సొంత ప్రచురణ మగవాడి సొంత వంటకు మించి రిస్క్! ఏజెన్సీలని బతిమాలి బామాలి ఒప్పించి తమ పుస్తకాలు షాపు బీరువాలలో సర్దించే సంతృప్తి తప్పించి ..  చిట్టెలుక వంటి రచయిత సింహం వంటి ప్రచురణ సంస్ఠ ముందు చిందులు వేయుట దుస్సాహసంబందురు లోక నైజం కాచి వడబోసిన వడబోసిన అనుభవజ్ఞులు.  రామాయణ భారత మహాభాగవతాల మాదిరి మన గ్రంథాలకూ ఓ ‘మూల’ గ్రంథాల హోదా దక్కిందన్న సంతృప్తి ఒక్కటే   రచయిత సృజనాత్మ పరిశ్రమకు అంతిమంగా దక్కుదల.  చ్చీ చెడి అచ్చేసుకున్న పుస్తకాలు ఇంటి అటక మీద దాచిపెట్టినా  ఆవకాయ జాడీలకు మల్లే అవేవీ  భద్రంగా ఉండేవి కావు! చదువరులకు చేరని అక్షరమంటే చెదపురుగులకు చచ్చే తీపి.  కొంప గుండమవుతోందంటూ  ఇంటామె గుండెలు బాదుకొనే చప్పుళ్లే తప్పించి బేవార్సుగా పుచ్చుకున్నందుకైనా మిత్రుల నుంచి మినిమం  చప్పట్లు వినిపించే రోజులూ కావివి. మొహమాటం కోసమైనా   నవ్వుతో ఒహ మంచి మాట నోట పలకని మొద్దురాచిప్పల కోసమా కాలి చిప్పలు అరిగేలా   ఇన్నేసి అచ్చుపాట్లు పడేది రచయిత?  పరువు  ప్రతిష్ఠల గ్రాఫు ఎటూ పైకి ఎగబాకేది లేదు! బాకీలు చేసి మరీ అచ్చొత్తించిన పుస్తకాల గాడిద బరువు చివరికి తీర్చే బాధ్యత  ‘గాడ్’  వంటి చెత్త కాగితాలు కొనుక్కునే వీధి   బేరగాడిదే! ఓ మై గాడ్! మంచి సాహిత్యం చివరి వినియోగదారుడు కాగితాల చెత్త కొనేవాడు కావడం.. సో సాడ్! పుస్తకాల పురుగులకే  రచయితలయ్యే అవకాశం ఎక్కువంటారు. ఆ రచయిత  పుస్తకాలే పురుగుల పాలవడం.. అంతకు మించిన విషాదం మరేముంటుంది? అందుకే గతంలో మాన్యులు కీ. శే.  శ్రీ పోతుకూచి సాంబశివరావు  రచయితలను ఆదుకునే పంపిణీ   పథకాలేవేవో పద్దస్తమానం ప్రయత్నించేవారు. అదే తరహాలో ఓ పుస్తక రచయితల బృందం తమ తమ పుస్తకాలు అమ్ముకునే గొలుసు కట్టు పథకం గురించి ప్రణాళికలు వేసుకునే అంశం చుట్టూతా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన  చక్కని కథానిక  శ్రీ అంబల్ల జనార్దన్ ‘మరో గొలుసు కట్టు పథకం’.

సాహిత్యంలో అభినివేశం ఉండీ తన తండ్రిగారు స్వంత ఖర్చుపై అచ్చేసుకున్న పుస్తకాలకు పట్టిన దుర్గతి చూసి చలించిపోయిన ఓ గుప్తాజీ  తన ఆధ్వర్యంలో విజయవంతంగా నడిచే సంస్థ తరుఫున  గొలుసు కట్టు పుస్తక ప్రచురణ ప్రణాళిక సిద్ధం చేసే దిశగా సాగుతుందీ కథానిక. తన తండ్రిలా తతిమ్మా రచయితలెవ్వరూ పుస్తకాల ప్రచురణకై అవసరమయే డబ్బు నిమిత్తం తబ్బిబ్బులు కారాదన్న  సదుద్దేశం ఆ పెద్దమనిషిది. అతను తనతో కలసి వచ్చిన మరికొంత మంది రచయితలతో ఏర్పాటుచేసుకొన్న సాహిత్య సంస్థ పేరే 'సాహితీ విశ్వవిపణి'.   శాస్త్రి, మూర్తి, చారి, జంగయ్య, యేసోబు, నదీం, రెడ్డిం సుందర్ వంటి రచయితలు సంస్థ క్రియాశీలక కార్యవర్గ కమిటీ సభ్యులు. ఈనాటి ప్రచురణ రంగంలో తెలుగు రచయిత ఎదుర్కొనే సాధకబాధకాలను గురించి సాధికార సమాచారం ఆధారంగా రచయిత అంబల్ల చర్చకు పెట్టడం తెలుగు కథల వరకు అరుదైన విధానమే. తెలుగు సాహిత్య సౌరభాలు నలుదిశలా  ప్రసరింపచేసే బాధ్యతలో భాగంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతం  కార్యక్రమాలు విస్తరింపచేసి,  సమర్థవంతంగా నిర్వహించడం, ప్రత్యేకంగా తెలుగు రచయితకు సముచిత గౌరవ సమ్మానాలు లభ్యమయే  రీతిలో ప్రణాళికల రూపొందించడం, మందకొండిగా సాగే తెలుగు భాషా వినియోగం  తిరిగి పుంజుకోవాలనే లక్ష్యంతో నిస్వార్థంగా సాహిత్య సేవ చేసే గుప్తాగారిని సంస్థ పంచమ వార్షికోత్సవ సందర్భంగా సన్మానించాలన్న తీర్మానంతో కథ మొదలవుతుంది.  బిరుదులు, పూదండలు. అభినందన పత్రాల మార్క్ సన్మాన సభల ఆర్భాటాన్ని నిర్ద్వందంగా కొట్టిపారేసి,  వ్యక్తిగత గుర్తింపులకు మించి భాషామతల్లికి దక్కవలసిన మన్ననలను గురించి గట్టి ప్రయాసేదైనా చేద్దామన్నది గుప్తాగారి సదాశయం.  భాషాసభల మిషతో అపారంగా నిధులు వెచ్చించి మరీ అంతూ పొంతూ లేని తంతులు సాగించే ఆర్భాటకులకు ఇది  చెంపపెట్టు. సాహిత్య సముద్ధరణ కోసం శక్తికి మించి కష్టాలకోర్చే నిస్వార్థ రచయితలను గుర్తించి ప్రోత్సహించే అవసరం సమావేశం మరోసారి గుర్తుచేసుకుంటుంది. రచయితల మంచి రచనలను  నలు దెసలా శ్రమదమాదులకు ఓర్చి మరీ  చేరవేసే మధ్యవర్తుల పాత్ర్రా తక్కువేమీ కాదు. వారి అనుభవాలను, ఆలోచనలను సైతం పరిగణనలోకి తీసుకునే అవసరం గుప్తాజీ సూచిస్తారు. సాహితీ సమావేశాలు  ఒక పూర్తి రోజు ఏర్పాటు చేయడం ద్వారా  ప్రచురణరంగ సంబంధీకులు అందరి మధ్యా అనుసంధానం సులభతరమవుతుందన్న ఆలోచనా ఆ సందర్భంగా తేటపడుతుంది.  
సొంత భాషకు చెందిన పుస్తకాలేవీ చదవకుండానే పరాయి భాషాశాస్త్రాల మిడి మిడి జ్ఞానం ఆధారంగా వచ్చే విమర్శలను ఈ కథ వంకతో రచయిత  ప్రశ్నించడం ప్రశంసనీయం. పరాయి భాషా అనువాదాలు తెలుగులోకి రావడమే తప్పించి.. తెలుగు నుంచి అనువాదాలు వేరే భాషలలోకి  పోకపోవడంలోని ఔచిత్యాన్నీ రచయిత ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం. అనువాద రంగంలోని అన్ని రుగ్మతలకూ  విరుగుడు మంత్రంగా ఒక ప్రత్యేక ‘అనువాద విభాగం’ ఆరంభం, అందులో అనుభవజ్ఞులైన రచయితలతో పాటు  సామాన్య పాఠకుల సమ భాగస్వామ్యం .. రచయిత చేసిన చక్కని సూచనలు.   తెలుగు సాహిత్య విస్తృతి సమస్యకు ఆంగ్ల, హిందీ భాషలలోకి అనువాదాలు పెంచడం తిరుగులేని పరిష్కారమే.. అనుమానం లేదు! కన్నడంలో మాదిరి జ్ఞానపీఠలు తెలుగులో రాకపోవడానికి కారణమెవరో, నోబెల్ పురస్కారాలను గూర్చి కలలో అయినా ఊహించలేనంత ఘోరంగా తెలుగు సాహిత్య వాతావరణం కలుషితమవడం ఎవరి పుణ్యమో!’ అంటూ  రచయిత అత్యవసరమైన అంశాలను చర్చకు పెట్టడంతో ఈ కథను చర్చాపరంగా ఒక  ఉన్నత స్థానానికి చేచినట్లయింది! సమకాలీన తెలుగు సాహిత్య రంగ స్థితిగతులను గురించి  నిర్మొహమాటంగా చర్చించే చొరవకు  అంబల్ల జనార్దన్ లా మరెంతో మంది  మేధో జీవులు ముందుకు రావాలసిన  తరుణమిదే.     
సమస్యలను లేవనెత్తడంతో మాత్రమే సరిపుచ్చుకునే నైజం కొన్ని కథలది. మరో అడుగు ముందుకు వేస్తో - ‘సాహితీ విశ్వవిపణి’ సంస్థ  'సాహిత్య విపంచి' అనే భారతి స్థాయి పత్రికను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు పరిష్కారం సైతం ఈ కథలో రచయిత సూచిస్తారు. సామాజిక ప్రయోజనపరంగా కథను  మరో మెట్టు ముందుకు నడిపించినందుకూ అంబల్ల అభినందనీయులు! ఈ కంప్యూటర్ యుగంలో కూడా లక్షలాది యువత ఆ మాదిరి సాహిత్య నిబద్ధ పత్రికలకు చందాలు కట్టడం హుందాతనానికి చిహ్నంగా భావిస్తున్నట్లు రచయిత ఊహించడం కలలో మాత్రమే సాధ్యమేమో!  ఆ మాదిరి అనుమానం ఓ వంక పీడిస్తూనే ఉన్నా మరో వంకన ఒక కమ్మని భావన మనసును ముప్పిరిగొనడం ఈ కథ సాధించిన వస్తుప్రయోజనం. మంచి కథకు అవసరమయిన ప్రసాద గుణానికి రచయిత కథలోని  ఏ పేరాలోనూ  కాస్తింత కూడా లోటు రానీయకపోవడం ఆహ్లాదకరమైన కొత్త దారి.   

అమీర్ ఖాన్ 'లగాన్ ' చిత్రం ఎంతో గొప్పదై ఉండీ ప్రచారలేమి కారణంగా ఆస్కార్ పురస్కారానికి అడుగు దూరంలో ఆగిపోవడం రచయిత సందర్భానికి తగ్గట్లు గుర్తు చేస్తూనే  ఆ తరహా దౌర్బల్యం  తెలుగు అనువాద సాహిత్యానికీ పట్టకుండా ఉండాలంటే ప్రముఖల చేత ప్రత్యేక సమీక్షలు  రాయించి అంతర్జాతీయ సంస్థల సహకారంతో వాటికి విశ్వవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని  సూచిస్తారు.  ఎంపిక చేసిన అనువాద సాహిత్యం ప్రచురణార్థమై ప్రత్యేకంగా ఆంగ్ల, హిందీ భాషలలో క్రమం తప్పకుండా పత్రిక ఒకటి తేవాలన్న ఆలోచన దాకా సమావేశంలోని సభ్యుల ఆవేశం చేరుకుంటుంది.  ముదావహం.
గతంలో ఒక పత్రికలో నవల ప్రచురణ సాగే మధ్యలోనే ప్రముఖ ప్రచురణ  సంస్థలు పోటీలు పడి మరీ  రచయితతో ఒప్పందాలు కుదుర్చుకొనే పరిస్థితి. అందుకు విరుద్ధంగా ప్రతిష్టాత్మకమైన  పత్రికలలో బహుమతులు సాధించిన నవలలూ నేడు పాఠకుల దాకా చేరడం గగన కుసుమంగా ఉంది! అంతర్జాలం ప్రభావాన అచ్చుపుస్తకాల మీద  సొమ్ము వెచ్చించడం వృథా అనే ధోరణి తెలుగు పాఠకలోకంలో నిజంగానే అంతకంతకూ పెరుగుతోందా?  ఏటేటా పుస్తక ప్రదర్శనల పట్ల పెరుగుతున్న ప్రజాదరణ మాటేమిటో మరి? గతంలోని భారతి, ఇప్పటి మిసిమి వంటి పత్రికల దారిలో లాభాలతో నిమిత్తం లేకుండా సత్సాహిత్య ప్రచురణ ఓ ధర్మయజ్ఞంలా భావించి  ఈ కథలోని గుప్తాగారి దారిలో మరింత మంది పెద్దలు ఔదార్య బుద్ధితో ముందుకు వస్తే మినహా  తెలుగు తల్లి పూర్వపు మానమర్యాదలతో  తిరిగి తలెత్తుకు నిలబడే పరిస్థితులు లేవేమో!
మళ్లీ కథ విషయానికి వస్తే..
కేవలం ఓ  వెయ్యి రూపాయల సభ్యత్వం కలిగి ఉంటే చాలు..  రెండు వేల రూపాయల ముఖ విలువ చేసే పుస్తకాలు దొరకడం, ఆనక  తాము చేర్పించిన ప్రతి సభ్యుడు నుంచీ నాలుగో వంతు రుసుము వెనక్కి తీసుకొనే అదనపు సౌకర్యం సాహితీ విశ్వవిపణి ఆలోచించినమరో గొలుసు కట్టు పథకం’ లోని ముఖ్యాకర్షణలు. పెట్టిన సొమ్ము తిరిగి గిట్టుబాటు అవడంతో ఆగక పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చే  లాభమూ ప్లస్!  ఆ ఉత్సాహంతోనే ఒక్కో సభ్యుడు పదేసి మంది కుటుంబ సభ్యులను  చేర్పించి మరీ సంస్థ నుంచి అందిన పుస్తకాలతో చిన్న చిన్న గ్రామాలలో సైతం ప్రయివేట్ గ్రంథాలయాలు  ఏర్పాటుకు ఉత్సాహం చూపించినట్లు సంస్థ ప్రధాన పోషకులు గుప్తాగారు పత్రికా విలేఖరులతో సంస్థ పుట్టుక నేపథ్యం గురించి చెప్పుకొచ్చే సందర్భంలో బైటపెట్టిన ముచ్చట్లు. రచయితలకు అమ్మకాల బెడద తప్పింది. తమ పేరు జనాలలోకి చొచ్చుకు వెళ్లే సులువు దారి దొరికింది. అన్నింటికీ మించి శారదా సంతతికి అంతో ఇంతో లక్ష్మీ ప్రసన్నం కూడా! ఇంకేమి కావాలి రచయితన్న జీవికి సంతృప్తి చెందడానికి!
తెలుగు భాష వ్యాప్తికై దోహదించే ఈ మాదిరి గొలుసు 'కట్టు' పథకాలు కట్టు కథలు కాబోవు కదా? తెలుగునాళ్లలో నిజంగానే ఇవి  సఫలమయేవేనా? లేక కేవలం కలల వరకేనా ఈ కమ్మని వరాలన్నీ పరిమితం?  చదువరిని అద్బుత రసంలో ముంచెత్తేందుకు కాదు గదా రచయిత పనిగట్టుకుని మరీ ఇన్నేసి  కమ్మని ఊహపోహలను కుమ్మరించే ఎత్తు వేసింది? ఇన్ని సందేహాలన్నీ ఒక వంక నుంచీ వెన్నాడుతూనే ఉంటాయి కథానిక చదువుతున్నంత సేపూ. ఆ అబ్బురం నుంచి పాఠక మహాశయుడు తేరుకునే లోగానే అసలు విషయం బైటపడుతుంది. విద్యార్థులు, యువత కంప్యూటర్లూ సెల్ ఫోనులూ పక్కనో మూలకు గిరాటేసి  అచ్చు పుస్తకాల విస్తరణను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లడం, అస్తమానం టి.వి లు,  టిక్-టాకులతో పొద్దు గడిపే ప్రమదాలోకం సైతం తిరిగి పాతకాలంలోకి మల్లే నవలా పఠనాలల్లో మునిగితేలడాలు, కిళ్లీ బంకుల్లో కూడా డిటెక్టివ్ సాహిత్యానికి పోటీగా తెలుగు కథాసంపుటాలు దర్శనమీయడాలు, తెలుగు భాష పైన పట్టు పెరగడం వల్ల యువతకు తెలుగు టైపింగ్ వంటి మునుపెన్నడూ పట్టించుకోని రంగాలపై ఆసక్తులు పెరిగి మాతృభాష కొత్త జవసత్వాలు పుంజుకోవడాలు, నిరుద్యోగి యువతకు ఆయాచిత వరంగా ఉద్యోగావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగిపోవడాలు! ఆ కారణంగా    అచ్చక్షర స్వర్ణయుగానికి హఠాత్తుగా ఏ ప్రభుత్వాల ప్రమేయంతో పని పడకుండానే ఆవిష్కరణలు జరిగిపోవడం! కలా? నిజమా?’ అని చదువరి గిల్లిచూసుకొనే లోగానే భార్యామణి వెన్ను చరుపుతో తటాల్మని లేచి కూర్చున్న సన్నకారు రచయిత మునిమాణిక్యం రాత్రంతా పడుకుని తీరిగ్గా తెల్లారుఝాము వరకు వివరంగా కన్న కమ్మని కలలు మాత్రమే సుమా ఇవన్నీ అని తేలిపోతుంది. పావుగంట పాటు మబ్బుల్లో తేలిన పాఠకుడి  మనసు నేలకు వాలిపోతుంది!
కానీ .. కలే కదా అని ఉసూరుమనే ఆశావహజీవికి సర్దిచెపుతూ రచయిత చెప్పిన రెండు మూడు ముచ్చట్లు అచ్చంగా ఇటీవలే మనందరి కళ్ల ముందే జరిగిన పరమాద్భుతాలు! చందమామ’ పత్రికలో చిన్నా పెద్దా ఏళ్ల తరబడి ఆబగా చదువుకొన్న కథలు, సీరియళ్లు రాసిన రచయిత మొన్నీ మధ్య వరకు అజ్ఞాతంలోనే ఉండిపోయిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం. ఆ సృజనశీలి ఇతర పత్రికలకని రాసిన మృత్యులోయ, అగ్నిమాల వంటి అద్భుతమైన నవలలు,  సాహితీ ప్రియులైన  'రచన' శాయిగారి పూనిక పుణ్యమా అని తెలుగు హారీ ప్యాట్టరా.. అనిపించే  స్థాయిలో ఒక్కో నవల అరలక్ష ప్రతులు  ఆవురావురామని చెల్లిపోయాయ్! ఆ శ్రీ 'శాయి' చేతి చలవ వల్లనే సామాన్యుడికి ఏ విధంగానూ  అందుబాటుకు వచ్చే అవకాశం లేని చిత్రకారుడు కమ్ చిత్ర దర్శకుడు శ్రీ బాపు శ్రీరామరాజ్యం స్టోరీ బోర్డ్ అచ్చుప్రతుల రూపంలో లక్షకు చేరువై హిస్టరీ సృష్టిస్తోంది.
రచయిత కన్నది తెల్లవారుఝాము కలా అని ఉసూరుమనే కన్నా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల మీద వత్తిడి పెంచి కేవలం ఒక్క జీ.వో గానీ జారీ చేయిస్తే చాలదా! మంచి రచనలు పుస్తక రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల గ్రంధాలయాల బీరువాల నిండా కొలువు తీరడానికి! విదేశాలకు భారీగా వలస వెళ్లే యువతకు తెలుగు సాహిత్యం పైన నేడు అపారమైన అభిమానం.  దేశీయంగా రచయితలు చొరవ చూపించడమే తరువాయి.. భారీ పెట్టుబడులతో ప్రచురణ రంగానికి ఇతోధిక సేవలు అందించేందుకు యువత సదా తయారు. రచయిత ప్రయివేట్ పంపిణీదార్ల దయాదాక్షిణ్యాల పైన బతుకీడ్చే రోజులు పోవాలంటే ముందు పాఠకలోకానికి అచ్చు పుస్తకం సాధ్యమైనంత చేరువ కావాలి. అచ్చక్షరం పైన పాఠకలోకం మక్కువ పెరగనంత కాలం ఈ గొలుసు ‘కట్టు’ కథలోని సన్నకారు రచయితకు మల్లేనే నిద్రలో మాత్రమే స్వర్ణయుగం ఊరించేది!
ఏ నాటకీయతపై వ్యామోహం పెంచుకోకుండా.. ఉన్న పరిస్థితులను పాఠకుని ముందు యధాతధంగా ఉంచేటందుకు రచయిత ఎన్నుకున్న (ప్రోటోగనిష్టిక్ ఏటిట్యూడ్) అనుకూల దృక్పథం ఈ కథకు వన్నె తెచ్చింది. ముక్తాయింపుగా రచయిత కల గురించి ప్రస్తావించే వరకు 'అబ్బ! ఈ విధంగా జరిగితే ఎంత బాగుణ్ణు!' అన్న ఫీల్ గుడ్ వాతావరణమే కథంతా పరుచుకుని ఉంటుంది. రచయితగా అది అంబల్లవారు ఎన్నుకుని మరీ మెప్పించిన సాహిత్య సర్కస్ ఫీట్!
వాస్తవానికి ఈ నాడు రచయిత ఎదుర్కొనే అడుగడుగు గండాలు అనేకానేకం.  గడగడా వాటిని ఓ ఛార్జిషీటులా ఏకరువు పెట్టేస్తే మొదటి పేరాలోనే పాఠకుడు గడగడా వణికిపోతాడు.   విసుగు పుట్టి చదవకుండానే పుటలు  తిప్పేస్తాడు! చిన్న రచయిత సొంత సొమ్ము పోసినా పుస్తకాల ప్రచురణలో ఎదుర్కోక తప్పని   ఇబ్బందులు ఎన్నింటినో సాహితీ విశ్వవిపణి,  సాహితీ విశ్వవిపంచి, అనువాదాలకంటూ ఓ ప్రత్యేక విభాగం అంటూ విన ఆకర్షణీయమైన ఎన్నో అనుకూల ప్రణాళికల ముసుగులో రచయిత అంబల్ల జనార్దన్ గడుసుగా పాఠకుడిని ఆలోచనలో పడవేసిన తంత్రం 'మరో గొలుసు కట్టు పథకం' కథను మంచి కథల కోవలోకి మళ్ళించింది. రోగి మందు తీపిగా ఉండాలన్న చికిత్సా చమత్కారం కథాప్రక్రియకూ ప్రతిభావంతంగా అన్వయించినందుకు సీనియర్ రచయిత అంబల్ల జనార్దన్ కు అభినందనలు!
(రచన విహంగ వీక్షణ రజతోత్సవ సంచిక - నాలుగో భాగం(పు.144౫1448 - ఏప్రిల్, 2016 రచన సంచిక లో ఈ కథానిక ప్రచురితం)

-కర్లపాలెం హనుమంతరావు
01 -12 -2019,
బోథెల్, U.S.A

అంబల్ల జనార్దన్ ప్రవాసాంధ్రులు. ప్రసిద్ధి చెందిన రచయిత. 1950, నవంబర్ 9వ తేదీన జననం. ముంబయి తెలుగు రత్న  బిరుదు గ్రహీతలు).







Thursday, November 28, 2019

కుమతవాదం- వ్యాసం

మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి ప్రసరించుగాక .. అనే వేద సూక్తిని ఉద్బోధిస్తూనే వర్ణ వ్యవస్థ మిషతో సాటి మనిషిని అమానుషంగా అధిక సంఖ్యాక  మతవాదులు గతంలో హింసించిన మాట వాస్తవం కాదని ఎవరం చెప్పలేం.  భారతీయాన్ని .. హైందవాన్ని కలగాపులగం చేసి బుకాయించే ధోరణులను తార్కిక దృష్టితో నిలదీసిన ప్రతీ సందర్భంలోనూ మొదట తార్కిక దృక్పథాన్నే తప్పు పట్టడం .. కొంత దవ్వు సాగిన పిదప విచక్షణకు ఎదురు నిలబడే బలిమి సన్నగిల్లి పాశ్చాత్య ఆలోచనా ధోరణుల మూల అంశం అంటూ  హేళన చేయ బూనడం  .. అబ్బో.. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి సాగుతున్న మత తతంగమే ఇదంతా ! వర్ణ, కుల, విశ్వాసాలనే పొరలతో నిర్మితమైన సమాజం మీద ఆధిపత్యం  కోసం .. నిమ్న కులాలని హింసించిన వాస్తవం పక్కన పెట్టినా .. బ్రాహ్మణవాద విశ్వాసుల మధ్యనే (ఉదా: శైవులు .. వైష్ణవులు .. మళ్లా ఈ విశ్వాసుల మధ్యా  ముద్రాంకితాల మీద కక్షతో కూడిన అంతర్గత పోరులు!) శతాబ్దాల తరబడి విధ్వంస కాండలు సృష్టించిన వైనాల మీద విదేశీయులు తమ పర్యటనల సందర్భంగా ఎన్నో పర్యాయాలు వివిధ వ్యాఖ్యలు చేసినట్లు చరిత్ర చెబుతోనేవుంది.  వాటిపైనా ఏదో మిషతో బురద పులమడం .. ఎప్పుడూ కనిపించే ప్రహసనాలే! 
మనువు అనని మాటలను మనువుకు ఇప్పటి అర్థ సత్యవాదులు అంటగడుతున్నారన్నది కొద్దిమంది హిందూ బుద్ధిమంతుల బాధ. ఆ మాటా  నిజమే! అయితే మాత్రమేం? మను మహానుభావుడు అన్నట్ల్లుగా అధునాతన  హిందూవిశ్వాసులు  ఒప్పుకొనే సూక్తులు (?) చాలవా .. నిమ్న జాతులని పేరుతో కొన్నివృత్తుల వారిని  .. అటరానివారుగా  దూరంగా ఉంచారనడానికి  .. ఇంటి పనికి, వంటి పనికి అవసరమైనప్పుడు కరుచుకుని .. అక్కర తీరిన తరువాత దూరంగా జరగమని ఆడవారిని కరవడానికి! 
ముసల్మానుల వల్ల చెడు జరిగిన మాట కొట్టి పారేయలేం. కానీ వారి మధ్యప్రాచ్య  సంస్కృతి, సాహిత్యాలతో, శిల్ప,  భవన  నిర్మాణాదుల వైభవాలతో  మన భారతీయ సంస్కృతీ మరో విశిష్టమైన కళాకోణం సంతరించుకొన్న మాటా వాస్తవమే.  మంచిని మంచిగా , చెడును చెడుగా విశ్లేషించుకొనే వజ్ఞత  వివేకవంతులైనా ప్రదర్శిస్తుంటే ఇప్పుడు ఓ క్రమపద్ధతిలో పెచ్చరిల్లుతున్న 'సర్వం హిందూమయం' సిద్ధాతం అయోమయానికి. కొంతైనా తాత్విక చర్చ తోడయి ఉండేది . ఖండ ఖండాలుగా ఉండి నిత్యం హిందూ  రాజులు చేసుకొనే అంతర్గత యుద్ధాలతో జనసామాన్యం  శక్తియుక్తులు , జాతీయ వనరులు   వృథా అయే తరుణంలో మధ్యప్రాచ్య పాలకులు అప్రతిహతంగా సాగించిన వరుస విజయాలతో దేశానికి ఒక అఖండత్వం  సాధ్యమైంది.  ఆ విధంగానే ఆంగ్లేయ పాలకుల పెత్తనాల ప్రభావం వల్లా మన స్వాతంత్ర్య ప్రతిపత్తికి పెద్ద దెబ్బ తగలడం, జాతీయ వనరులు సముద్రాలు దాటి తరలిపోవడం వరకు వంద శాతం వాస్తవం. రెండో వాదన  లేదు.  కానీ అదే సయయంలో స్వేచ్ఛా ప్రవృత్తిని బాగా ఇష్టపడే ఆంగ్లేయ సమాజం నుంచి ఇంగ్లీషు భాష , తద్వారా సిద్ధించిన ఇంగితం ద్వారా మన భారతీయ  చింతనాపరులు ఎంతో మందిలో అప్పటి సమాజానికి అవసరమైన సంస్కరణలకు సంబంధించిన ఆలోచనా బీజాలూ పడిన మాటా వాస్తవమే. హిందూమతం మీద మాత్రమే ఏక పక్షంగా  అపేక్ష చూపించే మతతత్వవాదులు ఈ నిజం ఒప్పుకోకపోయినా 'ఓపెన్'  గా యోచించగల ఆలోచనాపరులైనా అంగీకరించవలసి ఉంది. మత విస్తరణ కోసమే ముసల్మానులు , క్రైస్తవులు బడుగు వర్గాలను చేరదీసారు కానీ ప్రత్యేకమైన అభిమానమేమీ కారిపోయికాదు అన్నది హిందూమతవిశ్వాసుల ఫిర్యాదు. నిజమే. కాదనం లేం. జైనులను, బౌద్ధులను .. శైవులు, వైష్ణవులు తన్ని తగలేసినప్పుడు ఆ ధర్మం అధర్మంగా ఎందుకు అనిపించింది కాదో? 
లక్ష్యం ఏదైతే ఏం .. మతం మార్చుకోవడం ద్వారా కొంత ఆత్మసమ్మానం సాధించుకోవడం.. అతిహైందవ బిశ్వాసుల అమానుషు దాడుల నుండి తమను తాము కొంత రక్షించుకోవడమయితే వాస్తవం. హిందూమతం నుంచి కొంతైనా  ఆదరణ లభించి కనక ఉండివుంటే కనీసం కొన్ని వర్గాలయినా ఈ పాటికి మూల మత విశ్వాసం వైపుకు మళ్లి ఉండేవే. ఇప్పటికీ గోమాంస భక్షకుల పేరున అన్నెం పున్నెం ఎరుగని పాత వృత్తులతో పొట్టపోసుకొనే బక్కజీవులను వెంటాడి వేధిస్తుంటిరి! ఇదేమని నిలదీసే మానవతావాదులను పాశ్చ్యాత్య  భావదాస్యులని కించపరుస్తుంటిరి?! 
సౌదీలో ఆడవారికి ఓటు హక్కు కల్పించిన సందర్భంగా ఈనాడు ఆదివారం సంపాదకీయం రాసాను నేను. ఆ టపాను  ఫేస్ బుక్ లో పెట్టినప్పుడు  వయసు సంగతి వదిలేయండి, వాదనలోని సారాంశానికయినా వీసమెత్తు విలువ ఇవ్వకుండా వ్యాఖ్యల పేటికలో అసభ్యమైన వ్యక్తిగత దూషణల పరంపర వెల్లువెత్తింది ఒకానొక సందర్భంలో! ఈ తరహా అతిమతతత్వవాదుల అసహనం గత ఎన్నికలలో  ప్రో-హిందువాదుల చేతికి అధికార పగ్గాలు అందినప్పటి నుంచి క్రమంగా పెచ్చు మీరుతున్నది. 
పెరుగుట విరుగుట కొరకే అన్న మన తెలుగు నానుడిని ఒక అత్యంత పురాతన జాతీయ స్థాయి పార్టీ ఎలాగూ తన వికృత చేష్టల ద్వారా రుజువు చేసుకొని ఉన్నది. చరిత్ర చెప్పే పాఠాలను పట్టించుకొనే అలవాటులేని మరో జాతీయ పార్టీ అదే బాటల్జొ ప్రస్తుతం  ఉరకలు వేస్తో పతనం వైపుకు అత్యుత్సాహంగా పరుగులు పెట్టేస్తున్నది! 
భశుమ్!

Thursday, October 24, 2019

తెలుగుకి ఢోకా లేదు! -కర్లపాలెం హనుమంతరావు






మన మాతృభాష తెలుగా? అబద్దం. మన మాతృదేవతలు పలికేది తెలుగేనా?!
అచ్చు తెలుగులో 'అమ్మా!' అంటే ఏ తల్లయినా  ఇస్తోందా బదులు? పుచ్చు ఆంగ్లంలో 'ఆంటీ!' అంటేనే ‘యాఁ’ అంటూ ఏ ముసలమ్మైనా కదులు! ‘అంకుల్’ అనకుంటే ఎంతటి క్లోజ్ చిన్నానైనా నెత్తికి పోస్తాడు కుంకుడు పులుసు!
సజీవ భాష అనగా నేమి?
నట్టింట్లో పద్దాకా తెగ వాగే టీ.వీ, అనుక్షణం చెవిలో మార్మోగే సెల్ జోరీగ, కంటిని ఝిగేల్మని మెరిపించే వెండితెర బొమ్మ.. బారిన పడి ఏ భాష  నలుగుచుండునో  అదియే  సజీవ భాష నాబరగు. ఐతే ఆ లెక్కన అచ్చు తెలుగు ఏనాడో చచ్చినట్లు లెక్కేనా? అమంగళము ప్రతిహతమగు గాక. మరి తెలుగు మృతభాషయినచో అమృతభాష యేది గురువా? ఆంగ్లాంధ్రములు కలిపి పిసికిన  సంకర బంకరా శిష్యా!  తలకట్టు  ఒక్క మన తెలుగుకి మాత్రమే సొంతమైనట్టు  ఆ నిక్కులు, నీలుగులు చాలించరా ఇంక!   తెలుగుతల్లి తలకు 'కట్టు'మాత్రమే మిగిలిందని తెలుసుకుంటే మేలురా కుంకా! 
పూజా పునస్కారం ఆంగ్లాంధ్రమునకు! బడితె పూజా, తుస్కారం అగ్లీ ఆంధ్రమునకు! గుళ్లల్లో  సుప్రభాతానికి బదులుగా  'గుడ్ మాణింగ్' అంటేనేగా  ఆ గాడ్  గారి ‘గుడ్ లుక్సు’లో భక్తుడు బుక్కయ్యేది సర్వదా! 
వచ్చినా వచ్చకున్నా ఆంగ్లంలో వాగితేనేనయా.. దండాలు.. దస్కాలు. సన్మానాలు.. సత్కారాలు! 'అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ..ఊ' లంటూ గుణుస్తూ కూర్చుంటే  అర దండాలు.. కాళ్లూ చేతులకు అరదండాలు..ఛీఁ.. ఛీఁ  అంటూ చీత్కారాలు! తెలుగుపంతుళ్ళకే తెలుగులో సంతకాలంటే వాంతులయే వింతకాలంలో బాబూ ప్రస్తుతానికి మన  తెలుగుతల్లి బతుకీడుస్తున్నది!  ఉద్యోగం, ఉపాధి సంగతులు ఆనకరా ఢింబకా!  మనసు పడ్డ పాపను పడేసేందుకైనా నువ్ ప్రేమలేఖ ఆంగ్లమునే గిలకవలె మొలకా!  ఇంకేం చూసి  తెలుగు మీద మోజు పడాలిరా బళ్లకెళ్లే భడవాయలు అంతా? దొంగవెధవలకు మల్లే మెడల్లో పలకలు గంగడోళ్ళలా  వేలాడేసైనా సరే  బిడ్డలని లార్డు మెకాలే వారసులుగా మార్చేసెయ్యమనే కదా   మన టెలుగు మా.డా(మామ్.. డాడీ)ల సొద! పులులు, పిచ్చుకలు, దున్నపోతులూ అంతరించిపోతున్నంత చింతైనా లేదంటారా తెలుగు అంతర్ధానమైపోతున్న స్పీడుకు! దటీజ్ కాల్డ్ తెలుగు దుందుడుకు!
కాపాడే కంటి రెప్ప గొప్పతనం కన్ను గుర్తుపడుతుందా? ఆదరించే అమ్మభాషకు  అంతకు మించిన మహర్దశ సాధ్యపడుతుందా?
క్రియ తెలుగు వాక్యంలో చివరకు  రావడమే అన్ని లోకువలకు అసలు కారణం. అదే మరి  ఆంగ్లములో అయితేనో? కర్తా కర్మల మధ్యలోకైనా సరే వచ్చి కూర్చునే దొరతనం.. యూ నో! 'పని' అంటే వెనక్కు నక్కే తెలుగు తోడుగా ఉంటే   నీ జోడవుతుందన్న వెరీ బ్యాడ్  వెర్రి సెంటిమెంటబ్బా   తెలుగబ్బికి!  ఎంత పద, లిపి సంపద తెలుగు నాలుక చివర  పలుకుతుంటేనేమి? ఆంగ్లంతో  కలిపి కొట్టకపోతే ఉలిపికట్టెతో పోలికొస్తుందని ఉలుకు తెలుగు బోడికి.
గురజాడవారి గిరీశానికి ఈనాటికీ తెలుగ్గడ్డ మీదింత గ్లామరుందంటే కారణం?  పూనా ఢక్కన్ కాలేజీలో మూడు ఘంటల పాటు ఏక బిగిన బట్లరింగ్లీషులో  బాదేయగల గట్టిపిండం కాబట్టే! 'చాట్'లతో ఫట్ ఫట్ లాడించే లేటెస్ట్ సెంచరీ కదా ఇది! శ్రీనాథుడి చాటువులతో వేపుకు తిందామంటే  చెవులకు చేటలు కట్టెస్తారయ్యా కనక లింగం! బమ్మెర పోతనగారే..  ఆ అతి కమ్మదనం భ్రమల్లొ పడిపోయేసి అమ్మభాషలో భాగవతం  రాసి భగవంతుడికి అన్యాయం చేసేసాడు! వెరీ సాడ్! అదే ఆ ఆంధ్ర మహాభాగవతాన్ని    ఆంధ్రాంగ్లంలోనైనా కుమ్ముంటే  భాగవతం ఈపాటికి లాటిన్ బైబిల్ తో గిన్నీస్ కు పోటీకొచ్చుండేది! 
వాడుక భాషంటే ఏమన్నా వేడుక భాషనా? వ్యవహార భాష.  ఇంద్రాసూయైనా సరే..   ఆంధ్రంలోనే యవ్వారం అని ఆనాడు చంద్రబాబు గాని   మొండికివేసుంటే   అన్ని కోట్ల పెప్సీప్లాంట్ల కేసు  పురిట్లోనే  సంధి కొట్టేసేది!  కేసీఆర్ సార్ తెలంగాణా భాషలో ఎంత మీసాలు తిప్పగల  మొనగాడవనీయి గాక ఒక్క తెలంగాణా యాసతోనే గావు గావు మంటే కెసి కెనాలు పనులు ఆగిపోయేవా?
ఆదికవి నన్నయ ఆ సోది తెలుగుకు అంతలా అంకితమయిపోబట్టే  ఒక్క రాజమండ్రి బోర్డర్ భాష వరకే ట్రెండయిపోయాడు. అరసున్నాలు, బండిరాలు, కాసిని సంధులు వదిలేసాడు  శ్రీరంగం శ్రీనివాసరావు. అందుకే   యుగకవిగా ఆయనకా గౌరవం .. సరే! కాసుల మాటేమిటి! ఆ గాసట బీసట తెలుగు ఘోషలు నమ్ముకోకుండా.. గామా, బీటాల్లాంటి కామన్ మ్యాన్ బుర్రకు కు బొత్తిగా ఎక్కని ఏ ల్యాటినాంగ్లంలోనో కూసుంటే! కాసులకసలు కరువుండేదా?   
అక్షరాలు, హల్లులు, వత్తులు, సంధులని  తేడా పాడా లేకుండా ఏక మొత్తంగా వర్ణమాలను మొత్తం ఆంగ్లంతో కలిపి  రుబ్బి ప్రేక్షకుల మొహాన పేడకళ్లులా కొట్టేసే మన టీవీ యాంకరమ్మలకు, రేడియో జాకీ కుంకలకు, సినిమా రైటర్ బంకలకు నిండు మనసుతో గౌరవాభివందనములు! వైద్యం చేసే నారాయణులు, న్యాయం చెప్పే ధర్మ దేవతలు, బీదా బిక్కీలను సేవించుకునే సర్కారు బంట్లకు గొప్ప గౌరవం ఇవ్వక తప్పదు! డిస్సెంటు పత్రం సమర్పించిన గురజాడ అప్పారావుగారు గొప్పా? న్డీసెంటుగా ఉంటుందని అసలు తెలుగు వర్ణమాలకే  ఏక మొత్తంగా ఓ మూల  గోడ కుర్చీ వేయించిన  ప్రయివేటు బళ్ళు గొప్పా? బళ్ళ కెళ్ళే మన పిడుగుల తెలుగు తొక్కు పలుకుల ముందు..  గిడుగు రామ్మూర్తి పంతులుగారి  ప్రజ్ఞాపాటవాలు లెందుకు?  నేటి బుడుగుల  బడబడ ఇంగ్లీషు వాగుళ్ల వాగులో పడితే ఎంతటి భాషాగజీతగాడు విశ్వనాథవారైనా బుడుంగుమని మునిగాల్సిందే!
కర్ణాటక సంగీతం ఆంగ్లంలో లేదు. కాబట్టే చెవి కంతల కంత  కర్ణకఠోరం!  ఆంగ్లవాసన సోకనందుకే నాట ఓ శోకరసం! అన్నమయ్య సంకీర్తనలంటే తెలుగు నా! బడేగులాం సాబ్ హీందీకి గులామైతే..  ఆంగ్లభాషకు మన తెలుగులందరం బడే బడే గులాములం. ఫ్రెంచివాళ్ళు కనక బాలమురళి గానానికి ఫిదా అయి కనక గండపెండేరం కాలికి తొడిగారు! ఈలపాటైనా సరే ఈ నేలమీద ఇంగ్లీషై ఉంటేనే తెలుగులో ఒన్సుమోర్లు మార్మోగేది!
తుమ్ము. దగ్గులదాకా ఎందుకు? ఆవలింతలైనా  ఆంగ్లయాసలో ఉంటేనే ఇంగ్లీషు డాక్టర్లు మందులు రాసేదిక్కడ.
ఆర్ద్రత, సరళత తెలుగుభాష సొంతమవడమే అసలు చిక్కంతా! కాటికెళ్లే శవాలు కూడా 'క్యాచ్ మీ ఇఫ్ యూ కేన్' అంటూ లేటెస్టు ట్యూనులు కోరుకంటుంటే తెలుగు మృతభాషగానైనా  పనికివస్తుందా అన్నది పెద్ద ప్రశ్న!
పొట్టకోసినా తెలుగక్షరం ముక్క ఒక్కటైనా  కనపించనోడే తెలుగువాడికి ఇవాళ  తలమానికం! పచ్చడి లేకుండా ఎన్నిడ్లీలైనా లాగించచ్చేమో గానీ ఆంగ్లం  లేకుండా  తెలుగుముక్కంటే చచ్చే చావే తెలుగువాడికి!  తెలుగిది కేవలం ప్రాచీన హాదానే. ఆంగ్లానిది అధునాతన  హోదా!
ఒకే భాషవాళ్లంతా ఎన్ని దేశాల్లో ఉన్నా.. సొంతపనులన్నీ తల్లిభాషలో సాగిస్తే చాలు.. అంతర్జాతీయస్థాయికి అదే మంచి మందని క్లేర్ మోరనే స్పానిష్ పెద్దాయాన సిద్దాంతం. తెలుగువాడు తెలివిగలవాడు.  అంత కష్టం కూడా పడడానికి ఇష్టపడడు.  సొంతగడ్డమీద ఉంటూనే మాతృభాషని ఆంగ్లంలా మాట్లాడేసి ఆటోమేటిగ్గా  అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోగలడు.. సొంత కలల్లో!
తెలుగు  పుచ్చిపోయిందనో.. చచ్చిపోతుందనో కన్నీళ్ళు పెట్టుకునే తిక్కన్న వారసులకు చివరగా ఒక మాట! తిట్లున్నంత కాలం తెలుగుంటుంది. ప్రజాస్వామ్యమున్నంత కాలం తిట్లూ ఉంటాయి. తెలుగు చల్లగా పదికాలాలపాటీ తెలుగ్గడ్డల మీద వర్ధిల్లాలని  ప్రార్థిస్తామంటారా! సరే మీ ఇష్టం! సదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకోండి. తెలుగూ దానితో పాటే దివ్యంగా వెలుగుతూనే ఉంటుంది చట్టసభల్లో కనీసం తిట్ల రూపంలోనైనా!
-కర్లపాలెం హనుమంతరావు
25 -09 -2019
***
(సూర్య దినపత్రికలో ప్రచురితం)

ఎర్ర ముక్కు జింక- కొత్తపల్లి పత్రిక సౌజన్యంతో



అనగా అనగా ఒక ధృవపు జింక ఉండేదట. దాని పేరు రుడాల్ఫు. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండేది, ఎర్రగా మెరుస్తూ. సాధారణంగా ధృవపు జింకలకు పొడవాటి ముక్కులు ఉండవు. ఉన్నా అవి అట్లా ఎర్రగా మెరవవు. అందుకని అందరూ రుడాల్ఫును 'ఎర్రముక్కు జింక' అని పిలిచి, ఏడిపించేవాళ్ళు. రుడాల్ఫు తన ఎర్ర ముక్కును చూసుకొని నిజంగా కుమిలిపోయేవాడు. మిగిలిన జింకలన్నీ అతన్ని ఎగతాళి చేస్తుండేవి. రుడాల్ఫు తల్లిదండ్రులు గాని, తోడబుట్టినవాళ్ళు గాని అతనివైపుకు చూడకుండా నేలబారున చూస్తూ మాట్లాడేవాళ్లు. అతన్ని తలచుకొని సిగ్గుపడేవాళ్ళు. "తనేం నేరం చేశాడని భగవంతుడు ఇట్లా శిక్షిస్తున్నాడు?" అని రుడాల్ఫు అనుక్షణం బాధపడేవాడు.

డిసెంబరు నెల. క్రిస్మస్ రానున్నది. క్రిస్మస్ తాత ప్రపంచంలోని పిల్లలందరికోసం బహుమతులు తీసుకొని, ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామూలుగా తన బండిని లాగే ధృవపుజింకలు-డాషర్, డ్యాన్సర్, ప్రాన్సర్, విక్సన్ లను సిద్ధం కమ్మన్నాడు. వాళ్లు లాగే ఆ బండిని ఎక్కి, తాత బయలుదేరగానే, ధృవపుజింకలన్నీ అంతటి గౌరవానికి నోచుకున్న తమ జాతి హీరోలను కీర్తిస్తూ హర్షధ్వానాలు చేశాయి. కానీ ఏం లాభం? ఆ సాయంత్రం భూమిని ఒక భయంకరమైన పొగమంచు కప్పేసింది. దారి ఏమాత్రం కనబడటంలేదు. క్రిస్మస్ తాత పిల్లలకు బహుమతులిచ్చేందుకు వచ్చేది ఇళ్ల పొగ గొట్టాల్లోంచే కదా! ఆ మంచుపొర ఎంత దట్టంగా ఉందంటే, తాతకు, పాపం ఒక్క పొగగొట్టం కూడా కనబడలేదు! ఆ పొగమంచులోంచి దారి కనుక్కోవాలని తాత తన చేతిలో ఉన్న లాంతరును ఎంత ఊపినా ప్రయోజనం లేకపోయింది.
ఏం చేయాలో పాలుపోక, క్రిస్మస్ తాత కంగారు పడుతున్న ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు రుడాల్ఫు. అతని ముక్కు రోజూకంటే ఎర్రగా మెరిసిపోతూ వెలుగులు చిమ్ముతున్నది. తాత సాంతాక్లజ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది- రుడాల్ఫుకు బండి సారధ్యం లభించింది! క్రిస్మస్ తాత రుడాల్ఫును బండిలో అన్ని జింకలకంటే ముందు నిలిపి, కళ్లెం వేసి, తను బండినెక్కాడు. మరుక్షణంలో‌బండి ముందుకు దూసుకుపోయింది. రుడాల్ఫు క్రిస్మస్ తాతను ఆరోజు ప్రతి ఇంటి పొగగొట్టానికీ చేర్చాడు- భద్రంగానూ, వేగంగానూ. వాన, పొగమంచు, మంచు, వడగళ్ళు- ఇవేవీ ఆపలేకపోయాయి రుడాల్ఫును. ఎర్రగా మెరిసే అతని ముక్కు, అంత దట్టమైన పొగమంచునూ చీల్చుకొని ముందుకు పోయింది!

ఆ తర్వాత క్రిస్మస్ తాత అందరికీ చెప్పాడు, సంతోషపడుతూ- "రుడాల్ఫు గనక లేకపోతే ఆరోజున నేను ఎక్కడికీ కదలలేకపోయేవాడిని" అని. ఇప్పుడు అందరూ రుడాల్ఫునూ, అతని బలాన్నీ, అతని ఎర్రముక్కునూ కొనియాడటం మొదలుపెట్టారు! ఒకనాడు అతను సిగ్గుపడి, దాచలేక- దాచలేక- దాచుకున్న ఎర్రముక్కే, ఈనాడు ప్రతి ధృవపుజింకకూ కలల వెలుగైంది. అన్ని జింకలూ ఇప్పుడు అలాంటి ముక్కుకోసం తపించటం మొదలుపెట్టాయి! శక్తికీ, మంచితనానికీ మారుపేరైన రుడాల్ఫు క్రమంగా అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. లోపాలను తలచుకొని కుమిలిపోయే వాళ్లెవరైనాసరే- తన కథను విని స్ఫూర్తి తెచ్చుకునేంతగా ఎదిగాడు.
సేకరణ: కర్లపాలెం హనుమంతరావు
-కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మూడు ముక్కులు...ఆరు చెవులు! - సేకరణ





 రామాయణ మహాభారతాల్లో ఒక్కొక్క పాత్రకు తమది మాత్రమే అయిన ఒక్కొక్క శైలి ఉంటుంది. అది ఆహారంలో కానీ, వ్యవహారంలో కానీ! కదనరంగంలో కానీ, మదన రంగంలో కానీ! మహాభారతంలో భీముడిదో శైలి. ప్రత్యేకించి యుద్ధంలో. అది కూడా ఒక్కడితోనే పోరాడే సమయంలో (ద్వంద్వ యుద్ధంలో). అదేంటంటే యుద్ధం చేసినంతసేపూ చేసి, ఇక ఆ తర్వాత ప్రత్యర్థితో ఆడుకోవడం మొదలుపెడతాడు. ఒక చెయ్యి మెడ మీద, మరో చెయ్యి నడుమ్మీద వేసి పైకెత్తి గిరగిరా తిప్పడం- నేలకేసి కొట్టడం... ఇలా అన్న మాట! హిడింబాసురుడు, బకాసురుడు, కిమ్మీరుడు, జీమూతమల్లుడు, కీచకుడు, దుశ్శాసనుడు ఇలా అందర్నీ దాదాపు ఇదే శైలిలో చంపాడు.
ఇలాగే, వ్యవహారంలో శ్రీరామచంద్రుడిదో శైలి. వాల్మీకి మహర్షి దాని గురించి చెబుతూ ‘‘స్మిత పూర్వభాక్‌’’ అంటాడు. అంటే ఎవరైనా తనను కలవడానికి వస్తే రాముడే ముందుగా పలకరిస్తాడట, అదీ చిరునవ్వుతో!
ఇక లక్ష్మణస్వామి విషయానికి వస్తే, శిక్షించే విషయంలో ప్రత్యేకించి దుష్ట స్వభావం కలిగిన స్త్రీలను శిక్షించే విషయంలో ఈయనది ప్రపంచంలో ఎవరికీ లేని ఓ ప్రత్యేక శైలి. అదేంటంటే ఎదుటివాళ్ల ముక్కూచెవులు కోసెయ్యడం. ఈ రకంగా శూర్పణఖకు తగినశాస్తి చేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ రామాయణం మొత్తంలో లక్ష్మణుడు ఇలా ముగ్గురికి ముక్కూచెవులు కోశాడు. అది కూడా పన్నెండేళ్ల వయసులో ప్రారంభించి ముప్పై ఎనిమిదేళ్ల వయసు వరకు. ఆ రకంగా లక్ష్మణ కర్ణనాసికాఖండన ప్రస్థానం ప్రారంభమైంది తాటకతో. వివరాల్లోకి వెళ్తే...!
బాలకాండలో విశ్వామిత్ర మహర్షి యాగసంరక్షణార్థం రామలక్ష్మణుల్ని తనతోపాటు తీసుకెళ్లాడు. యాగానికి ఆటంకం కలిగిస్తున్న తాటకను చంపమని ఆ అన్నదమ్ముల్ని ఆదేశించాడు. కానీ స్త్రీని చంపడానికి రామలక్ష్మణులు సందేహించారు. దుష్టస్వభావం కలిగిన వారు స్త్రీలైనా సరే చంపడం ధర్మవిరుద్ధం కాదు, కాబట్టి చంపెయ్యమని విశ్వామిత్రమహర్షి మళ్లీ చెప్పాడు. అప్పుడు రాముడు జాగ్రత్తగా తాటకను పరిశీలించి ‘‘సౌమిత్రిరకరో క్రోథాత్‌ హృత కర్ణాగ్రనా సికా’’ అని లక్ష్మణుడికి చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు తాటక ముక్కూచెవులు కోసేశాడు. ఇక్కడో సందేహం రావచ్చు.. ముక్కూచెవులే ఎందుకు కోశాడని? వాస్తవానికి ఈ సందర్భం రామలక్ష్మణుల, ప్రత్యేకించి శ్రీరాముడి పరిశీలనా దృష్టికి, కారుణ్య భావనకు నిదర్శనం.
తాటకని బాగా పరిశీలించాడు రాముడు. సహజంగా రాక్షస స్త్రీ కాకపోయినా, శాపకారణంగానే రాక్షసత్వాన్ని పొందినా తాటక చర్మం బాగా మొద్దుబారిపోయి ఉంది. ఆ చర్మం మీద వెంట్రుకలు తుమ్మముళ్లలాగా నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఆ చర్మానికి స్పర్శజ్ఞానం ఉన్నట్లు కనిపించలేదు. ఇక కళ్లు చూస్తే నిరంతరం మద్యాన్ని తాగీ తాగీ బాగా ఎరుపెక్కిపోయి తను ఎటు చూస్తుందో, ఏం చూస్తుందో తనకే తెలియని స్థితిలో ఉన్నాయి. అంతేకాక పలురకాలైన పచ్చిమాంసాన్ని తినీతినీ నాలుక తాటిపట్టలా తయారైంది. ఈ విషయాలను గ్రహించాడు రాముడు.
 పంచేంద్రియాల్లో చర్మం, కళ్లు, నాలుక ఈ మూడు తాటక అధీనంలో లేవు. ఇక మిగిలింది రెండు. ‘‘నరవాసన నరవాసన’’ అంటూ ముక్కుతో వాసన పసిగడుతుంది. కళ్లు మత్తెక్కి సరిగా కనిపించకపోయినా, వీరి మాటల శబ్దాన్ని బట్టి వీళ్ల వైపు వచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎంతైనా స్త్రీ కదా! చంపటం ఎందుకని, తాటకలో మిగిలి ఉన్న రెండు జ్ఞానేంద్రియాలైన ముక్కూ చెవుల్ని కోసెయ్యమన్నాడు రాముడు. లక్ష్మణుడు అలాగే చేశాడు. అయినప్పటికీ తాటక తన ఆగడాలు మానకుండా గుడ్డిగా కర్మేంద్రియాల్ని ఉపయోగిస్తూ యాగానికి ఆటంకం కలిగిస్తూ, యాగరక్షణ చేస్తున్న రామలక్ష్మణుల్ని చంపే ప్రయత్నం చేసింది. తప్పని పరిస్థితుల్లో రామలక్ష్మణులు తాటకను సంహరించాల్సి వచ్చింది.
* * *

పితృవాక్య పరిపాలన కోసం రాముడు, అతనితోపాటు సీతా, వీరిద్దరితో పాటు లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నారు. పదమూడు సంవత్సరాల రెండు నెలలు హాయిగానే గడచిపోయాయి. అప్పుడు జరిగింది వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పే ఘటన శూర్పణఖ రూపంలో.
ఆశ్రమ ప్రాంతంలో సీతారామలక్ష్మణుల్ని చూసిన శూర్పణఖ, తన తొలిచూపులోనే రామచంద్రుణ్ని మోహించింది. రాముణ్ని వివరాలడిగి తన వివరాలూ చెప్పింది. ఆ వెంటనే తన ప్రేమను వ్యక్తం చేసింది. దానికి రాముడు తనకు వివాహమైందనీ, పక్కన ఉన్న ఈ సీతే తన భార్య అనీ, కావాలంటే లక్ష్మణుడి వద్దకు వెళ్లమని చెప్పాడు.
శూర్పణఖ వెంటనే లక్ష్మణుడి దగ్గరకు వచ్చింది. తన మీద ప్రేమను వ్యక్తం చేస్తున్న శూర్పణఖతో లక్ష్మణుడు ‘సరే అలాగే! అరణ్యానికి వచ్చేటప్పుడు నా భార్యను వెంట తీసుకురాలేకపొయ్యానని అప్పుడప్పుడు నాకూ చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజూ అడవిలో తిరిగి అలసిపోయిన మా అన్నగారి పాదాల్ని ఒత్తుతూ సేవ చేస్తాన్నేను, అదే నా భార్య కూడా అరణ్యానికి వచ్చి ఉంటే మా వదినగారి పాదాలకు సేవచేసేది కదా అని! నువ్వే నా సమస్యకు పరిష్కారం. అయితే, నేను మా అన్నగారి దాసుణ్ని. నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నువ్వు కూడా దాసివవుతావు’’ (కథం దాసస్య మే భ్రాతుః దాసీ భవతుమర్హసి) అన్నాడు. దాంతో వెంటనే లక్ష్మణస్వామిని వదిలేసి మళ్లీ రాముడి దగ్గరకు వచ్చింది శూర్పణఖ. వచ్చీరాగానే సీతను చూస్తూ ‘‘ఈమె ఉండటంతోనే కదా నన్ను తిరస్కరిస్తున్నావు! ఈమెను చంపి తినేస్తాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకో!’’ అంటూ సీత మీదకు వెళ్లబోయింది.
  ఇక్కడొక చిన్న సందేహాన్ని తీర్చుకుని ముందుకు వెళ్దాలి! మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు శూర్పణఖ కోరికను మన్నించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అలాకాకుండా లక్ష్మణస్వామి దగ్గరికి పంపడమేంటి? అని. దీనికి సమాధానం ఇలా చెప్పుకోవచ్చు. రాముడు శూర్పణఖను లక్ష్మణుడి దగ్గరకు వెళ్లమన్నప్పుడు ఆమె ‘‘లేదు! నేను నిన్నే ప్రేమించాను. నిన్నే వివాహమాడతాను’’ అని అనుంటే రాముడు ఏం సమాధానం చెప్పేవాడో, ఎలా అనుగ్రహించేవాడో వేరే విషయం. ఎందుకంటే పురుష మోహనరూపుడైన రాముణ్ని స్త్రీలే కాదు, పురుషులూ మోహించారు. అలాంటి ఇలాంటి సాదాసీదా పురుషులు కాదు, సర్వసంగ పరిత్యాగులై జీవిత చరమాంకంలో ఉన్న శరభంగమహర్షి (అంటే మన్మథ శరాల్ని భంగం చేసినవాడని అర్థం) లాంటి వారూ మోహించారు. రాముడు తనను మోహించిన ఎందరినో కృష్ణావతారంలో అనుగ్రహించాడు.
 ఇక ప్రస్తుత విషయానికి వద్దాం! శూర్పణఖ రాముడు తనను లక్ష్మణుడి దగ్గరకు వెళ్లమనగానే వెళ్లిపోయింది. అలాగే, లక్ష్మణుడు ‘‘నేను దాసుణ్ని, నన్ను చేసుకుంటే నువ్వు కూడా దాసీదానివవుతావు’’ అనగానే మళ్లీ రాముడి దగ్గరకు వచ్చింది. అంటే శూర్పణఖకు రామలక్ష్మణుల పట్ల ఉన్నది కాముక భావనే కానీ ప్రేమ కాదు. ఈ విషయం నిర్ధరించుకోడానికే రాముడు శూర్పణఖను లక్ష్మణుడి దగ్గరకు పంపించాడు. ప్రేమ అంగీకారామే కానీ కాముకత కాదు. రామలక్ష్మణులు ఇద్దరూ తనను కాదనేసరికి, తన రాక్షస ప్రవృత్తిని బయటపెడుతూ సీతను మింగబోయింది శూర్పణఖ. అప్పుడు రాముడు ఇక ఈమెను ఉపేక్షించకూడదని ‘‘లక్ష్మణా! ఊఁ!’’ అన్నాడు. అంతే! లక్ష్మణస్వామి అక్కడున్న కత్తి తీసి శూర్పణఖ ముక్కూ చెవులు కోసేశాడు.
 ఇక్కడ శూర్పణఖ ముక్కూచెవులు కొయ్యడంలో ఆంతర్యం ఏంటి? అంటే ఆమె సీతారామలక్ష్మణుల దగ్గరికి రాక్షసరూపంతో కాకుండా సుందరి వేషంలో వచ్చింది. అంటే తన సౌందర్యంతో ఎదుటివాళ్లను వశపర్చుకోవాలని అనుకుందన్న మాట. అందువల్ల అలాంటి మోసం మరొకరి దగ్గర చెయ్యకుండా సౌందర్యానికి మూలమైన ముఖంలోని ముక్కూచెవుల్ని కోసేశాడు లక్ష్మణుడు.
 * * *
 ఇదే అరణ్యకాండ చివర్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. కొన ఊపిరితో ఉన్న జటాయువు నుంచి ‘‘సీతను రావణుడు ఎత్తుకుపోయా’’డన్న వార్త విన్నారు రామలక్ష్మణులు. దుఃఖమగ్నులై ఉండి కూడా అసువులు బాసిన జటాయువుకు కృతజ్ఞతతో అంత్యక్రియలు జరిపించి క్రౌంచారణ్యంలో ప్రవేశించారు.
 విపరీతమైన దుఃఖంతో తిరుగుతున్న రామలక్ష్మణుల దగ్గరికి అయోముఖి అనే రాక్షసి వచ్చింది. లక్ష్మణుణ్ని చూసి మోహపరవశ అయ్యింది. వికృతమైన చర్మం, ఎర్రనైన కళ్లు, వేలాడే పెద్ద పొట్టతో మోహాంధకారంతో నిండిన . అసలే బాధలో ఉన్న లక్ష్మణుడు విపరీతమైన కోపంతో అయోముఖిని విదిలించుకుని, తన ఒరలో ఉన్న కత్తి తీసి ముక్కూచెవులతో పాటు మరికొన్ని శరీర భాగాల్ని కోసేశాడు. ఆ బాధ భరించలేక అయోముఖి కొండగుహల్లోకి పారిపోయింది.
ముక్కూచెవులు కొయ్యాలన్న లక్ష్మణుడి ఆలోచన కార్యరూపం దాల్చింది పన్నెండేళ్ల వయసులోనే అయినా ఆలోచన మాత్రం జన్మజాతం. యోగనిద్రలో, ధ్యానముద్రలో ఉండే నారాయణుడు లోకసంరక్షణార్థం పరివారంతో సహా భూలోకంలో అవతరించాల్సి వచ్చింది. అధికారిక విధుల మీద వచ్చిన ప్రభుత్వోద్యోగి తొందరగా పని ముగించుకొని ఇల్లు చేరాలనుకున్నట్లు నారాయణ పరివారం కూడా పని ముగించుకుని వైకుంఠం చేరాలన్న తపనతో, పుట్టిననాటి నుంచే అవతార పరమార్థం అమలు చేసే పనిలో పడ్డారట! ఈ విషయాన్ని కవిసమ్రాట్‌ విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షం’లో తనదైన శైలిలో చమత్కరించారు.
 రామచంద్రుండు మూర్ధంబులొత్తిచూచు
పురుషులెవరేనియును తన నెత్తికొనిన
సౌమిత్రియును ముక్కు చెవులు నొత్తి చూచు
ఎవ్వరే నంగనల్‌ తననెత్తికొనిన

 చిన్నప్పుడు రాముణ్ని ఎవరైనా స్త్రీలు ఎత్తుకుంటే బుద్ధిగా ఉండేవాడట! అదే పురుషులెత్తుకుంటే తల తడుముతూ ఉండేవాడట! అలానే లక్ష్మణుడు పురుషులెత్తుకుంటే బుద్ధిగా ఉండేవాడట! అదే స్త్రీలు ఎత్తుకుంటే మాత్రం ముక్కూచెవులు తడుముతూ ఉండేవాడట! ఎందుకంటే ఆ పదితలలవాడు దొరికితే వచ్చిన పని ముగించుకొని వైకుంఠానికి పోదామని రాముడు, తనను ఎత్తుకుంది శూర్పణఖ అయితే ముక్కూచెవులు కోసేసి అవతార పరమార్థాన్ని వేగవంతం చేద్దామని లక్ష్మణుడు ప్రవర్తించేవారని విశ్వనాథ కల్పన. వాస్తవానికి అవి బాల్యచేష్టలే అయినా చిన్నప్పటి నుంచే అవతార పరమార్థాన్ని గుర్తెరిగి ప్రవర్తించారు రామలక్ష్మణులు అని చెప్పడం విశ్వనాథవారి అంతరార్థం.
 ఇలా లక్ష్మణస్వామి వల్ల ముక్కూ చెవులు పోగొట్టుకున్న ముగ్గురు రాక్షస స్త్రీల్లో మొదటిదైన తాటక, అంతటితో బుద్ధి తెచ్చుకోక తన ఆగడాల్ని కొనసాగిస్తూ ముందుకు వచ్చి తన ప్రాణాల్ని కోల్పోయింది. లక్ష్మణుడి ఆవేశానికి భయపడ్డ అయోముఖి కొండగుహల్లోకి పారిపోయింది. కామంతోపాటు ప్రతీకార వాంఛ కూడా కలిగిన శూర్పణఖ పారిపోయి తన వారిని రెచ్చగొట్టి ఇంత రామాయణ కథకూ మూలమైంది.
-సేకరణ 
 By కర్లపాలెం హనుమంతరావు
(మూలం రాసుకోలేదు.. క్షమించాలి)


Thursday, July 11, 2019

ఆంధ్రౌన్నత్యం -



1
వెల్లబోయెదెవేల విశ్వేశ్వరుని గాంచి హంపీవిరూపాక్షు నరయరాదె
డంబువీడెదవేల టాజుమహల్ గాంచి యమరావతీస్తూప మరయరాదె
భ్రాంతిచెందెద వేల వారనాసిని గాంచి దక్షవాటిక గాంచి తనియరాదె
కళలువీడెద వేల కాళి ఘట్టము గాంచి వైశాఖపురి గాంచి పరగరాదె
గాంగజలముల గనుగొని కలగదేల-గౌతమీ గంగ కనులార గాంచరాదె
యఖిల సౌభాగ్యములు నీకు నమరియుండ-దెలివిమాలెద వేమోయి తెలుగుబిడ్డ!
2
ఆలించినావెందు ద్యాగరాట్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
నాలకించితివెందు నాధ్యాత్మ కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
రహివింటి వెచ్చోట రామదాస్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
మొగివింటి వెయ్యెడ బొబ్బిలిపాటల నాంధ్రభూమినిగాక యన్యభూమి
వింటి వెచ్చోట పల్నాటివీరచరిత- మాంధ్రభూమిని గాకున్న యన్యభూమి
నాంధ్రపదమెంత మధురమో యాంధ్రతనయ-తెలిసికొని, నేటికేనియు గులుకవోయి!

3
చిట్టివడాలను చేర్చిన పోపుతో గమనైన పనసకూర
అల్లముకరివేపయాకుతో దాలింపుగా నొప్పు లంకవంకాయకూర
ఘ్రాణేంద్రియముతో రసనేంద్రియము దన్ను పసమీఱు విఱిచిన పాలకూర
గరమసాలాలతో గమగమవలచెడు వసలేని లే జీడిపప్పుకూర
బుఱగుం జూచబియ్యము పూతచుట్ట- లాదిగాగల దివ్య పదార్థవితతి
యాంధ్రులకెకాని మఱియేరికైన గలదె-సేతుశీతాద్రిమధ్య విశేషభూమి!

4
కాలుసేతులును వంకరలువోవగజేసి వణకించు పెనుచలిబాధ లేక
బండఱాళులు గూడ మెండుగా బీటలు వాఱించు వాతపబాధ లేక
ఏరుళూలుగూడ  నేకమై ప్రవహించు వర్రోడుతతవర్ష బాధ లేక
బండుగనాడైన బట్టెడన్నము లేక రొట్టెలే తినియుండు రోత లేక
చూచితూచినయట్టుగా దోచుచుండు-సీతు నెండయు వానయు బూతమైన
యమలరాజాన్నమునుగల్గునాంధ్రభూమి- దలచికొనిపొంగుమెటనున్న దెలుగుబిడ్డ!

-పండిత సత్యనారాయణరాజు
రచనాకాలం:1934

Monday, July 1, 2019

గౌతమీ గంగ కాశీచయనుల మహాలక్ష్మి


గౌతమీ గంగ
 కాశీచయనుల మహాలక్ష్మి
 01/03/2013
కవ్వపుతాడును నేర్పుగా త్రిప్పుతుంటే కవ్వం పైకి, క్రిందకూ ఎగురుతూ కవ్వపు బిళ్ల చేసే మధనానికి కడవలో పెరుగులోని వెన్న పూసలు పూసలుగా పైకి తేలుతుంది. శీతాకాలం చలి వలన వెన్న తొందరగా పైకి తేలదు. అప్పుడు గృహిణి నేర్పుగా కొంచెం వేడినీటిని కడవలో పోస్తుంది. గోరువెచ్చగా అయిన చల్లలోని వెన్న కాస్సేపటికి పైకి తేలుతుంది. ఈ విధంగా చల్ల చిలికి వెన్న తీయడం ఇల్లాలి నేర్పుకి నిదర్శనం. వెన్న  ఓ చట్టిలో పెట్టి నాలుగు రోజులకోమారు నెయ్యికాస్తారు. చల్ల వేరొక కడవలోనికి మార్చేక ఈ పాలకడవలో గోరువెచ్చని నీటిని పోసి ఆల్చిప్ప అనే పరికరంతో గోకి ఎండుగడ్డితో శుభ్రంగా తోముతారు. పెద్ద సైజు నత్తగుల్లను అడుగుభాగాన రాతిపై అరగదీస్తే కొంతపదును వస్తుంది. దీనిని మట్టి పాత్రలు తోమడానికీ, మామిడికాయలపై పెచ్చు తీయడానికి నాటి స్త్రీలు ఉపయోగించేవారు. కొందరు వీటిని ఉగ్గు గిన్నెల్లా పసి పిల్లలకు, ఉగ్గు, మందులు పోయడానికి కూడా వాడేవారు. ఇల్లాలు వాడే ఈ చిప్పలు ఆల్చిప్పలు అయ్యాయి. భూదేవమ్మ గారు చల్ల చేయడం అయే వేళకు పాలేర్లు పశువుల దొడ్డి నుండి పాల బిందెలు తెచ్చి వాకిట్లో వుంచేవారు.పసిబిడ్డా`పాలకుండా’ అని సామెత. పసిపాపను సాకినంత ఓర్పుగా, నేర్పుగా పాడి పనులు నిర్వహించాలని దీని అర్థం.
                       చిన్న పాలేరు పళ్లికతో పిడకలు తెచ్చి పాల గది వద్ద వుంచుతాడు. భూదేవమ్మ గారు పాలదాలిలో పిడకలు పేర్చి, నిప్పురాజేస్తారు. ఈ పిడకలు పేర్చడానికి నేర్పుకావాలి. సెగ ఎక్కువ అయితే పాలు పొంగి నిప్పుల్లో పడిపోతాయి. సెగ తక్కువ అయితే పాలు కాగవు. పాలు కడవలో పోసి దాలిపై పెట్టి కొద్దిగా తెరచి వుండేలా మూత అమర్చి ఈవలకు వచ్చేవారామె. ఆ వేళకు పాలగది వద్ద తారాడే పిల్లలకు నిమ్మకాయంత వెన్నముద్ద అందరి చేతుల్లోనూ పెట్టేవారు. అప్పటికి ఊరిలోని పాడి ఏర్పాటు చేసుకోలేని సామాన్య గృహిణులు సత్తు తప్పాల చేత పట్టుకొని వారిల్లు చేరేవారు. సారవంంతమైన పచ్చగడ్డి, తవుడు, తెలకపిండి, ఉడకబెట్టిన ఉలవలు మేసిన పశువుల పాలు మట్టి పాత్రలలో, పిడక దాలిపై కాగిన ఆ చల్ల మంచి రుచిగా వుండేది. ఊరి వారు మాత్రం ఆ రుచి భూదేవమ్మ గారి అరచేతిలో వుంది అనుకునేవారు. వారందర్ని ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేస్తూ వారి పాత్రల్లో చల్ల పోసి ఇచ్చేవారామే. ఒక రోజు ఆ వేళకు ఆమె ఆడబిడ్డ వచ్చి ఆ పాత్రలలో నిన్నటి పుల్లచల్ల పోసి ఇచ్చేవారు. ఇంటి నిండా పాడి వుండగా ఇదేం పని అని మనసులో అనుకునేవారు కాని పైకి అనలేకపోయేవారు భూదేవమ్మ గారు. చంటి పిల్లలకు, అనారోగ్య వంతులకు ప్రత్యేకంగా ఆవుపాలు ఇచ్చేవారామె.  
                       మేన అల్లుళ్లు, మేన కోడళ్లూ చల్దన్నాలు తింటూ వుంటే భూదేవమ్మ గారి ఆడబిడ్డ వారి వద్దనే కూర్చొనేవారు. కమ్మని కందిపొడిలో అప్పుడే కాచిన నెయ్యి వేసి పెట్టాక, పాలగదిలో ప్రత్యేకంగా దుత్తలో వుంచిన పెరుగు వారికి వడ్డించేవారు. రోజు కొంత మీగడ వారికి కేటాయించవలసిందే. మధ్యాహ్న భోజనాల్లో మగవారికి వెన్న చిలికిన మజ్జిగ పోసినా పిల్లలకు మాత్రం మూడుపూటలా పెరుగే. రాత్రి మగ వారి భోజనాలు ముగిసాక పెరుగు తప్పాల లోపల పెట్టి పుల్ల మజ్జిగ గిన్నె ఆడవారి వద్ద పెట్టేవారు కామమ్మ గారు. అలా పెడ్తూ ఆడ రంఢలకి పెరుగెందుకు అనేవారు తన చర్యను ఎవరూ ప్రశ్నించక పోయినా.  
                 భూదేవమ్మ గారు నాలుగడుగుల పొడవుతో, చామన చాయతో, బక్కపలచగా వుండేవారు. ఆమె ముఖంలో లక్ష్మీకళ తాండవిస్తూ వుంటుంది. అంచేత ఆ ఇల్లు సిరి సంపదలతో వర్థిల్లుతోంది అనుకునేవారు ఊరి వారు. ఆమె నిత్య సంతోషి. నిగర్వి, గృహకృత్యాలను నెరవేరుస్తూనే నిరంతరం భగవత్‌ సంకీర్తన చేసుకుంటూ వుండేది ఆ ఇల్లాలు. భర్తకు వేద గోష్ఠి, అధ్యాపన, వ్యవసాయ పర్యవేక్షణ, ఊరి తీర్పరితనంతో ఇంటి విషయాలు పట్టించుకునే తీరిక వుండేది కాదు. భర్త ఎదుట పడి ఇది అవసరం అని చెప్పే ధైర్యం, అవకాశం ఆ గృహిణికి లేదు. ఏ సరుకు కొనాలన్నా కొట్టులో కొబ్బరికాయ ఒకటి ఇచ్చి కొనడమే. నాటి రోజుల్లో కోనసీమలో కొబ్బరికాయ ఖరీదు కాణి (రూపాయలో 64వ వంతు) పిల్లలకు బెల్లం, మిఠాయి కావలసినా( ఆ రోజుల్లో పంచదార మిఠాయి, నేటి స్వీట్లు వీరు ఎరుగరు) ఆడ పిల్లలకు కాటుక కాయకాని, అగులు (బియ్యం మాడ్చి అందులో నీరు కలిపి ఉడికించి చేసే పేస్టు ఆరోజుల్లో కన్య పిల్లలు, కొందరు  మగవారు ఆ ఆగులునే బొట్టుగా ధరించేవారు. దువ్వెన, అద్దం, జడ చివర కట్టే ఊలుతాడు ఏది కావాలసి వచ్చినా కొట్టులోంచి తలో కొబ్బరికాయ తీసి తెచ్చుకోవడమే. అమ్మాయిలకు పరికిణీ గుడ్డలు కావాలంటే వర్తకుడు బట్టల మూట భుజాన పెట్టుకొని పెరటిగుమ్మాన ఇంటిలోనికి వచ్చేవాడు. భూదేవమ్మగారు తమకు కావలసిన బట్టలు కొని వారికి పాలేర్ల చేత గాదెలోని ధాన్యం కొలిపించేవారు. నాలుగు గుడ్డలు తీసుకొని వచ్చిన అతడు బరువైన ధాన్యం మూటతో వంగి వెళ్లేవాడు. భూదేవమ్మ గారు దాల్చేవి ఏడాదికి మూడు నేత చీరలే. అవి సాలెవాడు నేసి తెచ్చేవాడు. ఆమె కాళ్లకు వెండి కడియాలు, గొలుసులు, అందెలు వుండేవి. కాలి వేళ్లకు బోటనవేలు వదిలి మిగతా నాలుగు వేళ్లకు మట్టెలు, పిల్లేళ్లూ అనే వెండి నగలు ధరించేవారు. చేతులకు వెడల్పు పాటి గట్టి మురుగులు ఒక్క జతే, మెడలో మంగళసూత్రాలు నేటి వలే బంగారు గొలుసుతో ధరించడం ఆ రోజుల్లో లేదు. పచ్చని పసుపుతాడుకు గుచ్చిన మంగళసూత్రాలు ధరించి రోజూ స్నానం చేసేటప్పుడు దానికి పసుపు పూస్తూ పచ్చగా వుంచుకునేవారు. నల్లపూసలు కూడా పసుపు దారాన్ని గుచ్చి కుత్తిగంటు అని మెడను చుట్టి కొంచెం బిగుతుగా వుండేటట్లుగా ధరించేవారు.
వివాహ వేళ వధువు కంఠాన ఈ నల్లపూసలు కడుతూ నీలకంఠుడైన శివుడు హాలాహలాన్ని కంఠంలో వుంచుకున్నట్లుగా సంసారంలోని కష్టాలు, బాధలనీ వెలికి చెప్పి వెలితి పడకుండా, కడుపులోనే పెట్టుకొని కృంగిపోకుండా ఇక్కడే అదిమి వుంచు అనే అర్థం వచ్చే మంత్రాన్ని వరుడు చదువుతాడు కదా. నల్లని పట్టుదారాన్ని గూర్చిన అరకాసుల దండ, పెద్ద సైజు పగడాల తావళం ఆవిడ మెడలో ఆభరణాలు. రెండు ముక్కులకు బంగారుకాడలు, ముక్కు కొసన ఎర్రని పొడిగల అడ్డబాస ధరిస్తారామె. చెవులకు ఎర్రని పొళ్లు గల కాణీ సైజు దుద్దులు, చెవుల చుట్టూ మరి మూడు కుట్లకు బావిలీలు, చెవి పోగులూ అనే స్వర్ణ ఆభరణాలు వుంటాయి.   
శాస్త్రి గారికి పొలాలు కొనడం, డబ్బు కూడపెట్టి ఊరి వారి అవసరాలకు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వడం తప్పించి డబ్బు వలన మరో ప్రయోజనం లేదు. స్త్రీల అలంకారాలూ, అవసరాలు అనే ఉహే వారికి కలిగేది కాదు. శిష్యులకు ఎంత విద్యాప్రదానం చేసినా అది ఆర్థికంగా ఖర్చు లేనిదే. వారి ఇంట ఎందరు భుజించినా కొదువ లేదు. ఇంట్లో పాడిపంట తరుగనిది, ఎర్రని ఏగాణీ ఖర్చు లేదు.  కొంత సేపు  చూసి భోజనాల వేళ అయిపోతుంటే మరదలు రోటి ముందు కూర్చున్నాక ‘ఇదేమిటే నేను రుబ్బుతాను కదా అంతలోనే తొందరా’’ అన్నా అమెకు జవాబు చెప్పరాదు.  వీటన్నిటి వల్లా కామమ్మ గారికి మరదలు అంటే ఇష్టం లేదు అనుకుంటే అది పొరపాటే. మనసులో మరదలి పట్ల ఆమెకు ఎంతో ఆపేక్ష. ఆ పిల్లల తల్లికి అన్ని విధాల అండ ఆడబిడ్డ. బిడ్డల సంరక్షణా బాధ్యత పూర్తిగా ఆమెదే. అత్తవారి నుండి సాలీన వచ్చే మనోవర్తి డబ్బు పాతిక రూపాయలూ మేనళ్లుడూ, మేన కోడళ్ళ కొరకే ఖర్చు పెడతారు ఆమె. వాళ్లకు తలలు దువ్వడం, స్నానాలు చేయించడం ఆమె బాధ్యత. రాత్రి పూట ప్రక్కలో వేసుకొని పాడ్యమి సంవత్సరాది పాడ్యమి, విదియ భాను విదియ అంటూ తిథుల పేర్లు, చైత్రము, వైశాఖమూ అంటూ పన్నెండు నెలల పేర్లు, ప్రభవ, విభవ అంటూ అరవై సంవత్సరాల పేర్లు వారికి నేర్పుతూ వుంటారు ఆమె. ఆంధ్రదేశంలో అప్పటికి వ్యాప్తిలో వుండి ఆ తరువాత కొంత కాలానికి మధిర సుబ్బన్న దీక్షితులు అనేవారిచే గ్రంధస్థం చేయబడ్డవి కాశీ మజిలీ కథలు.
ఈ జానపద కథల్లో ఒక గురువు కాశీ యాత్రకు పయనమయ్యాడు. అతడికి పరిచర్య చేయడానికి 12 సంవత్సరాల బాలుడు వెంట వెళ్తాడు. అక్కడ దేవాలయ కుడ్యాలపైనా, సత్రపు గోడలపైన వున్న శాసనాలూ, ఊళ్లో వార్తలు సేకరించుకొని వచ్చి వాటి వివరాలు గురువుని అడుగుతాడు శిష్యుడు. గురువు సావకాశంగా భోజనాలు ముగించి వాటి వివరాలు శిష్యునికి చెప్తాడు. ఈ కథలు కొంత అద్భుత రస ప్రధానంగా వుంటాయి. ఒక్కో కథకు పరిష్కారం సూచించబడుతుంది.  కొన్నిటి పరిష్కారం శ్రోతలకే విడవబడుతుంది. ఇందులో రాజకుమారుల సాహసగాథలు, చతురులైన వారి నేర్పరితనం, యుక్తులు, స్త్రీల పాతివ్రత్యం, నాటి సంఘంలో నెలకొని వున్న వేశ్యల నెఱజాణతనం చిత్రింపబడి వుంటాయి. ఈ కథలలో బ్రహ్మాండమైన సస్పెన్స్‌ వుంటుంది. భట్టి విక్రమార్కుల కథలు అన్న పేరుతో భారత వర్షాన్ని ఏలిన విక్కమార్క చక్రవర్తి కథలుగా కొన్ని అద్భుత, సాహసగాధలు కూడా ప్రచారంలో వుండేవి. ఈ కథలను మేనత్త చెప్తుంటే వింటూ మహదానందంతో కేరింతలు కొడుతూ ఆమె చుట్టూ చేరిన పిల్లలు నిద్రపోయేవారు. పాలేర్లు వేసిన ప్రక్కలపై వారు పడుకుంటే వారి సమీపంగా ముక్కాలి పీట మీద కూర్చొని వున్న ఆమె వద్దకు మగవారి భోజనాలు ముగిసాక భూదేవమ్మ గారువచ్చి వదినగారు వేడి నీళ్లు పెట్టాను మీరు స్నానం చేస్తే ఫలహారం చేద్దురు గాని అంటారు. అప్పటికి రాత్రి మొదట జాము పూర్తి అవబోతూ వుంటుంది. ఆమెకు ఒక విస్తరిలో కొయ్య రోట్లో మినప రొట్టో వడ్డించి పచ్చళ్లు వేసి మజ్జిగ, మంచినీళ్ల చెంబు ప్రక్కన పెట్టి ఆమె భోజనం ముగుస్తుంటే భూదేవమ్మగారు వడ్డించుకుంటారు. ఫలహారం ముగించిన కామమ్మ గారు తిరిగి పిల్లల వద్దకు వచ్చి వార్ని నిద్ర లేపి తలో మినప సున్ని వుండో, ఆరిసో, చక్కిలమో పెట్టి ఇన్ని మంచినీళ్లు ఇచ్చి ఆవగింజంత నల్లమందు మాత్ర వేస్తారు. ఆ విధంగా వేస్తే పిల్లలకు కలత లేని నిద్ర పడుతుందని, ప్రక్క తడపరనీ ఆవిడ నమ్మకం. పిల్లల మధ్యలో ఒరిగి భగవన్నామ స్మరణ చేస్తూ నిద్రపోతారామె..
బాప్పా। (బాబుకు అప్ప) అంటూ పిల్లలంతా ఆమెకు ప్రాణం పెడతారు. మడీ తడితో పిల్లల్ని పట్టించుకోవడానికి కుదరని తల్లికి ఆమె పెద్ద అండ. శాస్త్రి గారికి పెద్ద దిక్కు ఆమె. ఆయన ఏ పని చేసినా ఆమె అనుమతి తీసుకోనిదే చేయరు. ఆస్తి పాస్తుల వ్యవహారాల నుండి పెళ్లి సంబంధాల వరకూ అన్నిటా ఆమె తన విశేషానుభవంతో తమ్మునికి సలహా ఇస్తూ వుంటారు.    
గ్రామ స్త్త్రీలు పొరుగూర్లకు వెళ్లాలంటే సామాన్యులకు కాలినడకే శరణ్యం. శాస్త్రిగారి ఇంట వారి అప్పగారు, కుమార్తెలు ప్రయాణం అయితే పొలం నుంచి రెండెడ్లు పూన్చిన గూడు బండి వస్తుంది. భూదేవమ్మ గారు పయనమైతే పెరట్లో శాలలో పైన వేలాడకట్టిన మేనా క్రిందకు దింపుతారు. ఇది చెక్కలతో పెట్టి ఆకారంగా తయారు చేయబడి వుంటుంది. దీనికి తలుపులు వుంటాయి. లోన మెత్తలు పరచి చలువ దుప్పటి పరుస్తారు. నలుగురు చాకలులు ఒహొం ఒహోం అని లయబద్ధంగా ధ్వని చేస్తూ భుజాలపై మోసుకొని వెడతారు దీన్ని. శాస్త్రిగారు పయనం చేయాలంటే అందలం అనే ఒక రకం పల్లకీవస్తుంది. క్షత్రియ సంప్రదాయాలు పాటించే ఆ ఊరిలో సంపన్న క్షత్రియులు ప్రయాణించే ప్రయాణ సాధనాలు ఇవి. రాచ వారితో సరితూగే శాస్త్రిగారు, భార్య మాత్రమే వాటిని వాడుతారు.
భూదేవమ్మ గారికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. ఆ ప్రాంతాల మహిమ గల తల్లిగా పేరు పొందిన మరిడే మహాలక్ష్మమ్మకు మ్రొక్కుకున్నాక ఆమె కడుపు పండి బాలిక కలిగింది. పచ్చన పసిమి చాయతో బొద్దుగా తండ్రి పోలికతో వున్న ఆ బాలిక అందరికీ అపురూపమే శాస్త్రిగారు బాలిక జాతకాన్ని పరిశీలించారు. ఆమెకు కీర్తవంతుడైన భర్త, ప్రయోజకులైన కొడుకులూ కలుగుతారు. ఆర్థిక పరిస్థితే ఒడిదుడుకుగా కనపడుతున్నాయి. తాను వుండగా దానికి లోటెలా వుంటుంది అనుకున్నారాయన. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆడపిల్ల జాతకాన్ని బట్టి పుట్టినింట, అత్తింట సౌభాగ్యం వుంటుంది. ఇంట్లో ఆ అమ్మాయిది ప్రథమ స్థానం. చిన్న పిల్ల అయినా పండుగ, పబ్బం ఏదయినా ఆమె చేతుల మీదుగానే జరగాలి. ఆమె తరువాత క్రమంగా నలుగురు ఆడపిల్లలు కలిగారు వారికి. శాస్త్రిగారికి అప్పగారికి ఈ పిల్లలందరూ ప్రేమపాత్రులే. భూదేవమ్మ గారికి గృహకృత్య నిర్వహణలో తలమునకలౌతూ వీర్ని పట్టించుకోనే తీరిక వుండదు. చాలా కాలానికి ఆమె మళ్ళీ గర్భం దాల్చారు. ఈ సారయిన మగ పిల్లవాడు కలిగితే బాగుంటుందని శాస్త్రిగారితో సహా అందరూ అనుకుంటున్నారు. ఆమె సవతి కొడుక్కి మాత్రం కంగారు బయలుదేరింది. ఇంతవరకూ వున్న వాళ్లు ఆడపిల్లలు గనుక ఏ విధంగా వారికి పెళ్ళిళ్ళు చేస్తే వారి దారిన వారు పోతారు. ఈ సారిగాని మగపిల్ల వాడు కలిగాడా, తండ్రి ఆస్తిలో సగభాగం పంచుకొని పోతాడు. అతడు తన సవతి తల్లికి మగపిల్లవాడు కలుగకుండా వుంటే గ్రామ దేవతకు మేకపిల్లని బలి ఇస్తానని మ్రొక్కుకున్నాడనుకుంటుంటే విన్నామని చుట్టు ప్రక్కల పొలాల్లో పని చేసుకొనే  రైతులు అంటూ వుంటారు.
మహాలక్ష్మమ్మ పెళ్ళి గురించి శాస్త్రిగారు ఆలోచించసాగారు. వారి ఎరికలో కొన్ని సంబంధాలు వున్నాయి. వారు ఆస్థి పరులేకాని వరులకు విద్యాగంధం లేదు. పెద్ద కుమారుడు తన పేరు నిలిపేవాడు కావాలని ఆయన ఎంతగానో ఆశించారు. అతడికి చదువు అబ్బలేదు. ‘‘పండిత పుత్రః పరమ శుంఠః’’ అన్నట్లుగా వుంది అతడి పని. ‘‘యస్య జ్ఞాన దయా సింధోః। అగాధ స్యాన ఘాః గుణాః।’’ అన్న అమరకోశపు ప్రార్థనా శ్లోకానికి ‘‘సత్యజ్ఞాన దయాసింధోః। గోడ దూకితే అదే సందు’’ అనీ అధ ప్రజానామపః ప్రభాతే॥ అన్న రఘువంశపు రెండవ సర్గలోని మొదటి శ్లోకానికి ‘‘అధప్రజానామీది కంది పప్పు।’’ అని పరిహాసంగా విపరీతార్థలు చెప్తూ సాహిత్యం పట్ల అతడు ఎగతాళి బుద్ధి కలిగి వున్నాడు. ఇంట్లో వున్న అశేష బంధు బలగాన్ని చూస్తే అతడికి ఒళ్ళు మండిపోయేది. ఇంటిలోన తండులంబు నసంతి। నేడు పొండు రేపు రండు’’ అనీ ‘‘ఇంటిలోన తండ్రులంబులు నసంతి। తిండికైతే పది మంది వసంతి’’ అని పరిహసించేవాడు. చిన్నవాడు ఏదో అంటున్నాడు అని కొందరు సరిపెట్టుకొనేవారు. కొందరైతే అది హేళనగా తలచేవారు. ఇటువంటి విషయాలు శాస్త్రిగారి చెవి వరకు  రావడానికి కొంతకాలం పట్టింది. విన్నాక వారు కొడుకును మందలించాలని చూచారు గాని అతడు సరకు చేయలేదు. తనకన్నా 3 ఏళ్లు మాత్రమే పెద్ద అయిన సవతి తల్లిపై అతడికి మాతృ గౌరవం కలగటం లేదు. తన ఆస్తి తేరగా తినడానికి వచ్చిన దానిలా తోస్తుంది.
    కొడుక్కు ఎటూ చదువు అబ్బడం లేదు. విద్వాంసుడూ, బుద్ధిమంతుడూ అయిన పిల్లవానిని అల్లుడుగా తెచ్చుకొని ఈ లోటు కొంతయినా భర్తీ చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. చాలా వాకబులు చేసాక గోదావరి ఆవల ఆత్రేయపురం గ్రామంలో వేద పండితుడూ, యజ్ఞ నిర్వహణాదక్షుడు అయిన యువకుడు వున్నట్లుగా తెలిసింది. తండ్రి గతించాడు. తాత మహా పండితుడు, వంశ వృద్ధుడు, ఆస్థిపాస్తులు పెద్దగా   ఏం లేవు. శాస్త్రి గారు తమ కుమార్తెను ఈ వరునకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.   
స్వయంగా ఆత్రేయపురం వెళ్లి ముసలి కృష్ణ సోమయాజులు గారి దర్శనం చేసారు. ఆ యజ్ఞ పురుషుని చూడగానే శాస్త్రి గారికి భక్తి ప్రతివర్తులు కలిగాయి. శాస్త్రిగారు తమ అభిప్రాయం చెప్పగానే ఆయన బాబు నీవు అభిమానంగా ఇంత దూరం వచ్చావు సంతోషం ‘‘వివాహశ్చ వివాదశ్చ సమయోరేమశోభతే’’ అని కదా పెద్దలు చెప్తారు. విద్యలో సంప్రదాయములో మనకు పొత్తు కుదురుతుంది. కాని నీవు లక్ష్మీ పుత్రుడివి. రాచ మర్యాదలతో మెలుగుతున్న వాడివి. ఈ ఇల్లు చూచావు కదా. ఇక్కడ బ్రహ్మ దేవుడూ ఆయన ఇల్లాలూ కొలువై వున్నారు కాని ఆమె అత్తగారు మాత్రం ఈ వంక కన్నెత్తి కూడా చూడదు. ఈ ఇంట అంతా కోడలిదే పెత్తనం అన్నారు లక్ష్మీ సరస్వతుల్ని వుద్ధేశించి, శాస్త్రిగారూ మామగారు మహా పురుషుడైన  శ్రీ కృష్ణుడు అష్ట ఐశ్వర్యాలు వున్నాక కౌరవుల్ని కాదని తన చెల్లెల్ని అర్జునునికి ఎందుకు ఇచ్చాడంటారు ? మీరు మరీ అడ్డు చెప్పకుండా నా సంకల్పాన్ని మన్నించి నన్ను దీవించండి. మీ అనుజ్ఞతో నేను కన్యాదానం చేసుకొని ధన్యుణ్ణి కానీయండి అని కృష్ణ సోమయాజులు  గారికి నమస్కరించారు. వంటింటి గడప దగ్గకు వెళ్లి ‘‘ అప్పా! పెళ్ళీడు వచ్చిన పిల్లను ఎన్నాళ్ళు ఇంట వుంచుకుంటావమ్మా! నీ కోడల్ని చేసుకొని సొమ్ము నువ్వు తెచ్చుకో’’ అన్నారు. నాటి రోజుల్లో పెళ్ళి బేరాలు లేవు. ఇంతటి సంపన్నులతో నేను ఎలా తూగగలను అని సోమయాజులు మధన పడుతుండగానే నడవపల్లి గ్రామం నుంచి పెళ్ళి సంబరాలన్ని బండ్ల మీద వచ్చాయి. ఆ రోజుల్లో గోదావరిలో నీరు లేని వేసవి రోజుల్లో రెండెడ్ల బండ్లను గోదావరిలో దింపి మొలబంటి నీళ్లతో ఎడ్లను తోలుతూ బండి నడిపి గోదావరి దాటేవారు. ఆ విధంగానే పెండ్లి వారు రెండెడ్ల బండ్లపై పెళ్ళికి తరలి వెళ్లారు.  
                           జమిందారీ స్తాయితో మెలగుతున్న శాస్త్రి గారు తమ గారాబు కుమార్తెకు ఎంతటి సంబంధం తెస్తారో అని ఊరి జనం, అశేష బంధుమిత్రులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ పెండ్లి వార్ని చూస్తూనే వారంతా పెదవి విరిచారు. వరపంచకం అన్నట్లుగా పెండ్లి వారి తరపున వచ్చిన వారే పదిమంది. శాస్త్రిగారు పంపిన  10 బండ్లలో 8 బండ్లు ఖాళీగానే తిరిగి వచ్చాయి. శాస్త్రిగారు ఏర్పాటు చేసిన భజంత్రీలు విడిది పందిట్లో మేళం చేసాక పెండ్లి వారు పందిరిలో విడిసారు. శాస్త్రిగారు ముసలి కృష్ణ సోమయాలుగారికి అగ్గగ్గలాడిపోతున్నారు. వారి సోదరుని కుమారులు, బావమరదులూ నలుగురు ముత్తయిదువులు మాత్రమే వచ్చిన పెళ్ళివారు వితంతువులు వివాహాది శుభకార్యాలకు వెళ్లడం  నాటి ఆచారం కాదు  కనుక సోమయాజులు గారి మరదలు, కోడలూ, కుమార్తెలూ కూడా రాలేదు. ఆడ పెళ్ళివారు ఎవరికి మర్యాదలు చేయాలో  తెలియక ముఖాముఖాలుచూసుకొని వచ్చిన బంధువుల్లో వృద్ధ ముత్తయిదువును కూర్చోబెట్టి వియ్యపు వారి మర్యాదలూ, ఆడపడుచు లాంచనాలు అన్నీ ఆమెకే జరిపారు. మహాలక్ష్మి దబ్బ పండు చాయ పండిన మామిడి పండులా మిస మిసలాడే నేవళీకం వరుడు నల్లని నలుపు, జమిలి ఎముకతో దృఢమైన శరీరం, పళ్ళు ఎత్తు కన్యావరయతే రూపం, మాతావిత్తం, పితాశృతం, భాంధవాః కులచ్చమృష్టాన్న మితరేజన్నాః। అని కదా అర్యోక్తి ఇక్కడ లోకం ఎరుగని అమాయకపు బాల మహాలక్ష్మికి వరుని అంద చందాల్ని ఎంచుకొనే ఊహ ఇంకా రాలేదు. భూదేవమ్మ గారు వరుని సిరి సంపదల్ని గణింపగల వ్యవహర్త కాదు. శాస్త్రిగారు కోరే పాండిత్యం వరునిలో సమృద్ధిగా వుంది. కులమంటే జటావల్లభుల వారంటే ఆ చుట్ట పట్ల పాండిత్యంలో సదృత్తంలో ప్రఖ్యాతి పొందిన వారు. ఊరి జనం కోరే మృష్టాన్న విందులు శాస్త్రిగారింట ప్రతినిత్యం జరుగుతూ వుంటాయి. ఇక నేడు చేప్పేదేముంది ఆ చుట్టు ప్రక్కల ఏ ఇంట్లోనూ 10 రోజుల పాటు పొయ్యి రాజేసింది లేదు. బట్రాజుల బిరుదు పఠనం వారాంగనా నృత్యాలూ, డోలు సన్నాయి మేళాలు మొదలైన  లాంఛనాలన్నీ పెళ్ళి ఐదు రోజులూ జరిగాయి. ఇంటి ఆడవారు మాత్రం గడపదాటి బైటకు వచ్చేవారు కారు. ఎంత పెద్ద ఆవరణ వున్నా కన్యా ప్రదానం ఇంటి పెద్ద సావిడిలోనే జరిగింది. స్త్రీలు తమ వేడుకలన్నియు ఇంటిలోపలే జరుపుకొన్నారు.
కాశీచయనుల వెంకటమహాలక్ష్మి
విహంగ మాసపత్రిక సౌజన్యంతో

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...