Friday, February 12, 2021

ఆచార్యదేవోభవ! కర్లపాలెం హనుమంతరావు -ఈనాడు ప్రచుర్తితం

 



'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు,

గాయత్రి ఉపదేశించినవాడు,

వేదాధ్యయనం చేయించినవాడు,

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,

పురోగతి కోరేవాడు,

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,

మోక్షమార్గాన్ని చూపించేవాడు

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)

(ఈనాడు, o5-o9-2009)

కవితలో – చమత్కారం -కర్లపాలెం హనుమంతరావు

 



 

పరగు పంచాక్షరంబుల పక్షివరుడు

వాని తలదీయనొక కవివర్యుడగును

అతని తలద్రుంచ వణిజుల కవసరమగు

అసలు పదమును దెల్ప జోహారొనర్తు!

మొదటి పాదం పొడుపుకి విడుపు- కపోతరాజు. మిగతా పాదాలకు వరుసగా పోతరాజు, తరాజు, రాజు . ఇదో పద సంబంధమైన చమత్కార పద్యం.

పెండ్లియై పెనిమిటిపోయి వెతలొదవిన

పిదప గద "భరణంబు" గోరుదురు స్త్రీలు!

పెండ్లికాక మునుపె కడగండ్లు రాక

మునుపె "భరణంబు" గోరుదురు పురుషస్త్రీలు!

వెటకారం పాలు ఎక్కువైనా చమత్కారమూ ఆ పాలలో చక్కరలా కలగలసినందున ఈ పద్యం హృద్యమైంది.

కవిత్వాన్ని Sadness, madness and Gladness గా అభివర్ణించారు మహాకవి శ్రీశ్రీ. అం'దులోని గ్లాడ్ నెస్' నే గట్టిగా పట్టుకుని పుట్టిన ఇటువంటి చమక్కు పద్యాలు విశ్వసాహిత్యంలో పుట్టలు పుట్టలు. శబ్దార్థాలు రెండూ ప్రధానంగా ఉండి పండిన కొన్నితెలుగు పద్యాలను స్థాలీపులాకన్యాయంగా పరిశీలించడమే ఈ చిన్నవ్యాసం ఉద్దేశం.

'బావ మరదింగని ఆ-యావులలో నొకటి తెమ్మనగా నపుడే

'యా'వని యడిగిన- వాక్యముగా వలయున్ భాషలైదుగా నొకపదమునన్!'

ఆ అవులమందనుండి ఒకటి తెమ్మని బావ అడిగితే 'ఏ-ఆవ్-రా-బా-వా' అని మరది ఎదురు ప్రశ్న. 'ఏ-ఆవ్-రా-బా-వా' అనే ఆ పదబంధంలోనే ఉన్నాయి గదా 'రా!' అనే మన తెలుగు సంబోధనార్థక పదానికి సమానార్థకాలైన మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాష పదాలు వరుసగా!

చమత్కార గుణం ఓ చాయుంటే  చాలు తెలుగు 'కుందేలు'కి రెండు కొమ్ములున్నాయని అనైనా  వాదించి మరీ  ఒప్పించవచ్చు! కాకపోతే ఇవన్నీ కేవలం వినోదక్రీడలే సుమా!

తెలిసిన పదాలే! నిత్యం వినేవే! ప్రతిభావంతుల ముఖద్రోణిలో పడితే మెరుగుముత్యాలై మురిపిస్తాయి. 'పంచశరున్ విరాలి గొలుపంగల చేడెల వాడి చూడ్కులన్/గొంచెము విచ్చు జాజిపువు గుత్తుల నంటిన కమ్మ తెమ్మరల్/గాంచన గర్భురాణి కరకంజము నందలి చిల్క పల్కులున్/మించును గాదె వీరి కమనీయ మహీయ కవిత్వ సంపదల్!' అంటూ జయంతి రామయ్యపంతులుగారంతటి వాజ్ఞ్మయవేత్తలే కొప్పరపు సోదర కవుల గరుడ పవమాన పరిపాటి కవనధాటికి  కుచ్చు కిరీటులు తొడిగారు ఒకానొప్పుడు. కాకినాడలో ఆ సోదర కవులు కవితావధానం చేస్తూ కాళ్ళకూరి నారాయణరావుగారి కోరిక మీద కత్తెర మీద చెప్పిన పద్యం విన్నవారికి  వారి చమత్కార వైభోగం మీద అపారమైన గౌరవాబిమానాలు కలగక మానవు.

'ఇరువురు గూడి యొనర్చునెడం బనులెప్పగిదిన్నెరవేరెడు నో/యిరువురు కాంతల సందున గాంతుడెంత సుఖంబడజాలునొ యొ/క్కరునకు నొక్కరుడేగతి దోడ్పడ గావలెనో క్రియలందున గ/త్తెర మన కత్తెరగెల్ల వివేకనిధీ!తగబోధ యొనర్చు జుమీ!' ఈ కవిరాజవిరాజితంలోని ఆ 'కత్తెర మనకత్తెరగెల్ల .. తగబోధయొనర్చు' ననే యమక పదప్రయోగానికి సరసుల హృదయం పులకరించకుండా ఉండగలదా? 'తడయరు ప్రశ్నంబడిగిన/ దడవరు పల్కులకు గాగ దడబడరెపుడున్/నొడువులు మిడుకరు తోపక/వడివడి వచయింత్రుమున్ను వల్లించి నటుల్!' అదీ ఆశుకవితా ప్రజ్ఞానిదుల శేముషీ దురంధరత్వం.  అవధానాలవంటి  గత్తర సందర్భాల్లో సైతం  ఏ తత్తరపాటుకు పోకుండా ఇంతటి  నిర్దుష్ట చమత్కార సృష్టి జరగాలంటే కవి కెంతటి ప్రతిభా వ్యుత్పత్తులు ఉండాలి! శ్రీకారంనుంచి .. శుభమస్తు వరకు ప్రతి పలుకూ ఓ రసగుళికగా మారే వరకూ చిలికి,  రసహృదయాల పైన చిలకరించే   ఆశుకవులకు  తెలుగుభాషలో కొదవ లేదు. ఇప్పటిలాగా సాంకేతికాభివృధ్ధి జరగని కాలం కనక ఆశువుగా పొంగిన నాటి రసగంగా ప్రవాహాన్నంతా ఏ ఆడియో, వీడియో బుంగలకూ పట్టుకోలేక పోయాం. ఆ నోటా ఈ నోటా బడి కాలానికి ఎదురీదుతూ  మనదాకా వచ్చిన ఈ పదిశాతం ఆశుకవిత్వమే ఇంత రసవత్తరంగా ఉన్నదే! మిగతా ఆ తొంభైశాతమూ దక్కించుకోగలిగి ఉంటే ఎంత బాగణ్ణో!

'అరసి విశుద్ధ శబ్దములు, వర్ణములున్, ధ్వని వైభవం, బలం/కరణము, రీతివృత్తులును గల్పన, పాకము, శయ్యము, న్రస/ స్ఫురణము, దోషదూరత, యచుంబిత భావములొప్ప, జిత్ర వి/ స్తర మధు రాశులీల గవితల్ రచియింపగ నేర్చె..' నంటూ తారాశశాంకంలో శేషం వేంకటపతి కవిత్వ లక్షణాలను గురించి ఒక పద్యంలో విపులంగా చెప్పుకొచ్చాడు నాలుగువిధాలైనదిగా భావించే కవిత్వంలో   మధురం, చిత్రం, విస్తారాలతో పాటు ఆశువూ ఒక ప్రథానమైన  ప్రక్రియ. వార్తక రాఘవయ్య తన 'అక్షర దీపిక'లో ఆశుకవిత స్వరూప స్వభావాలను మరింత లోతుగా నిర్వచించే ప్రయత్నం చేసాడు.  ఏకపాద, త్రిపాద, కఠిన ప్రాస, విషమ సమస్యాపూర్తులు, వ్యస్తాక్షరీ సంఘటిత పద్యాలు, ఇష్టార్థ దేవతా వర ప్రతిపాదిత, నిషేధాక్షర రచనా చమత్కృతులు, అష్టావధానాలు, ఘటికా శతగ్రంథ కల్పన, ఆకాశపురాణాలు-  తత్కాలోచితంగా త్వరితగతిన రచించే ఏ కవితలైనా  ఆశుకవితా విభాగం కిందకే  వస్తాయన్నది ఆయన మతం.

ఇక మన ఆంధ్ర సాహిత్య చరిత్రను గాని క్షుణ్ణంగా  పరిశీలిస్తే ప్రాచీన, ఆధునిక, అత్యాధునిక యుగాల్లో సైతం అబ్బురపరిచే ఆశుకవితా దురంధరులకు  లోటు లేదు. వేములవాడ భీమకవి రాజా కళింగుని ఆశుకవితల్లోనే శపించాడు. ఘటికలో ఒక శతకం చెప్పగల ఘనాపాటి జక్కనతాత పెద్దయ.'ఈ క్షోణిన్ నిను బోలు సత్కవులేరీ నేటికాలంబునన్' అని కీర్తిగడించిన యుగకర్త శ్రీనాథుడూ అసమాన ఆశుకవితా దురంధరుడే. ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన మొదలు..శతలేఖినీ పద్య సంధాన దౌరేయుడు రామరాజ భూషణుడి వరకు..  ఆశుకవితాజాలాలలో నిలువీత విన్యాసాలు జరిపిన గజ ఈతగాళ్ళు ఎందరో! యాదవ రాఘవ పాండవీయ కర్త నెల్లూరి వీరరాఘవ కవి, పాండురంగ మాహాత్మ్య రచయిత  తెనాలి రామకృష్ణకవి, ఆశువులో మేటిగా గణుతికెక్కిన గణపవరపు వేంకటకవి.. ఉత్తర రామ చరిత్ర సృష్టికర్త కంకటి పాపరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి వాలంలా అంతులేకుండా  సాగేదీ   ఆశుకవుల జాబితా.  రెండు జాముల్లో పారిజాతాపహరణాన్ని ఆశువుగా చెప్పిన ఘనత రఘునాథ రాయలువారిది. ఘటికార్థ నిర్మిత శతశ్లోకి విదుషీమణి మధురవాణి. గడియకు నూరు పద్యాలు గంటం లేకుండానే రచిస్తా'నని పంతంపట్టి మరీ నెగ్గిన ప్రతిభాశాలి అడిదం సూరకవి. పద్యాలైనా, సమస్యలైనా ఆశువుగా పూరించగలనని యాచమ నాయకుని సందర్శించిన సందర్భంలో చెప్పుకున్న కవి మోచర్ల వెంకన మాత్రం ఏమంత తక్కువ ప్రతిభావంతుడా ! రావణ దమ్మీయం రాసిన పిండిప్రోలు లక్ష్మణ కవి, అభివవ భట్టుమూర్తి శ్లిష్టా కృష్ణమూర్తి శాస్త్రి .. చెప్పుకుంటూ పోతే మంగళగిరి చేంతాండంత అవుతుందీ ఆశుకవుల జాబితా.

ఆధునికకాలంలో అభినవ పండిత రాయలు నూజివీడు సంస్థాన విద్వాంసులు విద్వాన్ మాడభూషి వేంకటాచార్యులు, కాశీ కృష్ణమాచార్యులు, అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి, పిసుపాటు చిదంబర శాస్త్రి, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి, పోకూరి కాశీపతి, సి.వి.సుబన్న, ప్రసాదరాయ కులపతి..

అత్యాధునికంగా డా॥ మేడసాని  మోహన్, డా॥ మాడుగుల ఫణిభూషణ శర్మ, ప్రస్తుతం ప్రవచన  కర్త పాత్రలో జీవించే డా॥ గరికపాటి నరసింహారావు, కీ.శే డా॥ రాళ్లబండి కవితా ప్రసాద్.. స్థలాభావం వల్లగాని చెప్పలేక పోవడం..  తెలుగు సాహిత్యమాతకు ఊడిగం చేసిన,  చేస్తున్న ఆశుకవితా శేముషీ దురంధరుల జాబితా అశేషం!!

కొప్పరపు సోదర కవులైతే సుమారు మూడు లక్షల పైచిలుకు ఆశుకవితలు చిలకరించారని ఓ అనధికార అంచనా.

'ఎవ్వరిని మెచ్చువాడ గా నెపుడు నేను/ మెచ్చితి  మిమ్మె జగములు మెచ్చినట్లు' అంటో వేదం వేంకటరాయ శాస్త్రి గారంతటి గాఢపండితుల నోటి నుండి సైతం ఆశీర్వచన మాలలు అందుకున్న  ఆశుకవితలో ఉన్న   ఆ విశేషాలేమిటో? ఒక సారి స్థాలీపులాకన్యాయ రీతిగానైనా తిరుపతి వేంకట కవుల వంటి దిగ్గజాల చమత్కారాలను చవి చూడనిదే వీడనిదీ సందేహం. ఇతర దేశాల్లో జన్మించడం కన్నా ఆంధ్రదేశంలో జన్మించడం ఎందువలన పుణ్యకార్యమో ఓ అవధాన సందర్భంలో తిరుపతి వేంకట కవులు బహు చమత్కారంగా చెప్పుకొచ్చారు.

'ఇతర దేశములను జనియించుటకంటె నాంధ్రదేశమున జనియించుటార్య హితము 'వశి వశి' నటంచు పిలుతురు వారు భార్య నదియు 'శివ! శివ!' యై తుద కఘము లడంచు'

అమావాస్యను పున్నమిగా చిత్రించడం ఒక మాదిరి విన్యాసం . పున్నమినే అమావాస్యగా సమన్వయించమంటే? అదీ ఆశువుగా అప్పటికప్పుటే సమర్థవంతంగా ఒప్పించాలి.. ఛందస్సుల బంధాలు ఎలాగూ తప్పని సరి. కొప్పరపు సోదర కవులు ఈ గడ్డు సమస్యను పరిష్కరించిన తీరే పరమాద్భుతం.

'వెన్నెల వెదజల్లుచు దివి/ వెన్నవలె దోచు చంద్రబింబమునెల్లన్/ గ్రన్నన రాహువు మ్రింగగ/ బున్నమ యమవస యనంగ బెల్పొందె భువిన్!'

ఆంధ్రదేశంలో ఈ అవధానాల పుట్టుక క్రీ.13వ శతాబ్దం నాటిదని చరిత్ర. దీనికి కొన్ని స్వరూప స్వభావాలను సమన్వయించి సాహిత్య గౌరవం కల్పించింది మాత్రం శ్రీమాన్ మాడభూషి వేంకటాచార్యులవారు. ఈ ఆవధాన విద్యను వాడవాడలా వైభవోపేతంగా ఊరేగించినవారు తిరుపతి వేంకట కవులు. అవధానాలు చేయనిదే కవికి పాండితీ జీవన సాఫల్యం సిద్ధించదన్నంతగా సాగింది  ఇటీవలే ముగిసిన శతాబ్దం వరకు.

అవధానం అంటేనే ఏకాగ్రత. అవ (పూర్వక ధాఙ్- ధారణ పోషకయోః) అను ధాతువునుండి పుట్టిన మాట. అలంకారశాస్త్రవేత్త వామనాచార్యుడు కావ్యాలంకార సూత్ర వృత్తి'లో కావ్యాంగాలను వివరించే సందర్భంలో అవదానాన్నీ ఓ కవిత్వబీజంగా సమర్థించాడు. లోకం, విద్య, ప్రకీర్ణం అనేవి మూడు కావ్యాంగాలని, వీటిలో మూలభూతమైనది అవధానమేనని, ప్రతిభ లేనిదే కావ్యం ఎలా రాణించదో.. అవధానం లేనిదే 'అర్థం దర్శనం'  అలా సాధ్యం కాదని చిత్తైకాగ్ర్య మవధానమ్' అన్న సూత్రంలో ఆయన నొక్కి చెప్పాడు.

వేదంలోనూ అవధానాలు ఉన్నాయి. జట, క్రమ, మాలా, శిఖా, ధ్వజ, దండ, రధ, ఘన-అనే అష్టసూత్ర బద్ధం వేదపఠనం. శబ్దప్రధానాలు, ప్రభుసమ్మితాలయి స్వరబద్ధంగా పఠించాల్సిన వేదాలలోనూ స్వరావధానాలు, అక్షరావధానాలు కొందరు క్రీడాస్ఫూర్తితో  ప్రదర్శిస్తుంటారు. కాలగమనంలో ఇవే రూపాంతరం చెంది తెలుగు సాహిత్యంలోకీ ప్రవేశించాయనుకోవచ్చు. తప్పు లేదు.

ఏకాగ్రత అనే అర్థంలో నన్నయగారి కాలంనుంచి ప్రయోగంలో ఉన్నా.. ఒక ప్రక్రియగా ప్రదర్శించిన కవులలో ఆద్యుడు కొలమచెలమ మల్లినాథ సూరి. కాళిదాస కృతులకు వ్యాఖ్యానాలు వెలయించిన ప్రతిభావంతుడు ఇతనే.

సెల్ఫీల పిచ్చి రోజురోజుకీ ముదిరిపోతోంది. సెల్ ముందు తలకాయలు మోటించుకుని ఫొటోలకు దిగుతున్నారే కాని.. ఒకరి తల నుంచి మరొకరి తలకు ప్రయాణిస్తున్న పేలను గురించి.. దానిమూలకంగా వచ్చే చుండ్రును గురించి చింతించే వాళ్లే కనిపించడం  లేదు. ఈ ఉపద్రవం ఏ అత్యాధునిక  ఆశుకవి కంటపడితేనో.. ఆశువుగా ఓ రసవత్తరమైన పేలు పద్యం ఊడిపడదూ!

స్వస్తి!

 

-కర్లపాలెం హనుమంతరావు

13 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

 

బాలల ఆటపాటలు - కర్లపాలెం హనుమంతరావు

              


బాల్యం అంటే అభివృద్ధి ఆగిపోయిన వృద్ధాప్యం కాదు. నిత్యోత్సాహానికి అది నిలువుటద్దం. పసిమనసు ఎంత సున్నితమో.. అంత సునిశితం. చూపు ఎంత విశాలమో.. తృష్ణ అంత ఉత్కృష్టం. ఎదిగిన మనుషులకుండే రసవికారాలకు బాలల మనసు బహుదూరం. స్వేఛ్ఛ బాలల శక్తి. ఆసక్తి వారి తరగని ఆస్తి. అనుకరణ వారి మాధ్యమం. పరిశీలన పాఠ్యప్రణాళిక. చిన్నవయస్సులో వంటబట్టిన జ్ఞానం.. ఆట పాటలతో తీర్చిదిద్దిన నడత కడదాకా తోడొచ్చే మంచి మిత్రులు.

పిల్లల దృష్టి చదువు నుంచి పక్కకు చెదురుతుందన్న బెదురుతో వారిని పెద్దలు ఆట పాటలకు ఆమడ దూరంలో ఉంచుతున్నారు. అది సరి కాదు. పశ్చిమదేశాల్లో రూసో కాలంనుంచి చదువు సంధ్యల్లో ఆటపాటల పాత్ర పెరిగే దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయి.  కుసుమ కోమలంగా ఉండే పసిమనసును కఠిన పరీక్షలకు గురిచేయడం మానుషం అనిపించుకోదు. మనోగత అభిప్రాయాలని సానబెట్టే ఐచ్ఛిక విద్యావిధానం మాత్రమే పసివారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది.

విద్య పరమావధి మనోవికాసమే అన్న సిద్ధాంతం ఇప్పుడు సర్వే సర్వత్రా అందరం  సమ్మతిస్తున్న వాదం. సంపూర్ణ వ్యక్తిత్వం సాధించడానికి విద్య ఒక ముఖ్యమైన సోపానంగా భావించి సమర్థిస్తున్నాం. ఆటపాటల ద్వారా అత్యంత సహజంగా బాలబాలికలకు విద్యాబోధన చేయవచ్చ'ని గాఢంగా విశ్వసించిన విద్యావేత్త ఫ్రీబెల్(Free Bell). ప్లే సాంగ్స్ఆటవస్తువుల ద్వారా చదువుసాములు సాగించే 'కిండర్ గార్టన్'(Kinder Garten) విధానం ఫ్రీబెల్ రూపొందించిందే!

మన ఆచారవ్యవహారాలైన నోములువ్రతాలు వంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలు తరచి చూసినా అడుగడునా కంటబడేదీ అంతర్లీనంగా సాగే విద్యావిధానమే! ఫ్రీబెల్ ఆటపాటల్ని (ప్లే సాంగ్సు) ఏడాది నుంచి పదేళ్ళ   వయసున్న బాలలకోసం  రాసారు. బిడ్డల్ని సరైన దిశలోకి మలిపే  ప్రాథమిక దిశ ఇదే కావచ్చన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. సరిగ్గా ఆ అభిప్రాయంతోనే మన ప్రాచీనులు  సైతం పసిమనసులకు సులభంగా పట్టుబడే బాలగీతాలను ఆటలతో మేళవించి మప్పే ప్రయత్నం చేసారు.

ఉదాహరణకు 'చందమామపాటనే తీసుకుందాం!

'చందమామ రావే! జాబిల్లి రావే! కొండెక్కి రావే! గోగుపూలు తేవే!

భమిడిగిన్నెలో పాలు పోసుకొని.. వెండిగిన్నెలో పెరుగు పోసుకొని

ఒలిచిన పండు ఒళ్ళో వేసుకుని.. ఒలవని పండు చేత్తో పట్టుకొని

అట్లా వచ్చి అట్లా వచ్చి అమ్మాయి నోట్లో వేయవే!'

అని పాడుతూ తల్లి బిడ్డకి బువ్వ తినిపిస్తుంది. ఈ పాట మూలకంగా బిడ్డ దృష్టి సౌందర్యంమీదకు మళ్ళుతుంది. ఊహాశక్తి ఊపందుకుంటుంది. ఆకాశజీవులమీద ఆసక్తి పెరుగుతుంది. ఫ్రీ బెల్ ఉద్దేశంకూడా సరిగ్గా ఇదే కదా!

బిడ్డకు రెండేళ్ళు వచ్చి కూర్చోవడం వచ్చిన దశలో 'కాళ్ళా గజ్జాఆట ఆడిస్తారు మన తల్లులు.

'కాళ్ళా గజ్జా కంకాళమ్మా! వేగు చుక్కా వెలగా మొగ్గా!

మొగ్గా కాదు మోతీ నీరు/ నీరూ కాదు- నిమ్మల వాయ/

వాయా కాదు- వావిలి కూర/ కూరా కాదు- గుమ్మడి మీసం/

ఇలాగా సాగి.. సాగి చివరకు

'శెట్టీ కాదు- శ్యామల మన్ను/ మన్నూ కాదు- మంచిగంధం చెక్కఅని ముగుస్తుంది పాట.

ఒక్కో మాటకు  ఒక్కోకాలు తడుతూ 'మంచిగంధంవంతు వచ్చిన కాలును పండినట్లు ముడిచి  పక్కన పెట్టడం పాటలోని ఆట. బిడ్డకు పద పరిజ్ఞానం పెంచడం వైజ్ఞానిక ప్రయోజనమైతే.. కాళ్లు ముడవడం.. తెరవడం వంటి మంచివ్యాయామం అందించడం దైహిక ప్రయోజనం. వైద్య రహస్యాలు కూడా ఈ పాటలో ఇమిడి ఉన్నాయి మరింత సునిశితంగా గమనించగలిగితే!

'కొండమీదవెండిగిన్నె/ కొక్కిరాయి- కాలు విరిగె/ విరిగి విరిగి మూడాయె/ దానికేమి మందు?'  అని అడిగి 'వేపాకు చేదు/వెల్లుల్లి గడ్డ/నూనెమ్మ బొటు/ నూటొక్క ధారఅని గోసాయి చిట్కాలు నేర్పించే పాట ఇంకోటి.

ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టే ' నీ చేతులేమైనాయి?/ పిల్లెత్తుకు పోయింది/ పిల్లేమి చేసింది?/ కుమ్మరివాడికిచ్చిందిలాంటి పాటలింకో రకం.

'ఆడపిల్లలు ఆడుకునే 'చింతపిక్కలుఆటలో గణిత విజ్ఞానం దాగుంది. 'ఒక్క ఓలియ/ రెండు జోకళ్ళు/ మూడు ముచ్చిలక/ నాలుగు నందన/ ఐదు బేడీలు/ ఆరు చిట్టి గొలుసులాంటివి అలవోకగా బాలలకు ఒంట్లు వంటబట్టే పాటలు.  ఐదారుగురు గుప్పిళ్ళు ముడిచి ఆడుతూ పాడుకునే 'గుడు గుడు గుంచంపాట పసివాళ్ళకు పరిమాణ స్వరూపాన్ని పరిచయం చేసే పాట. 'కత్తి పదును.. బద్ద పదునువేన్నీళ్ళ వేడిచన్నీళ్ళ చలితెలియచేసే పాట. 'పప్పూ పెట్టి/ కూర వేసి/పిండివంటలు వేసి/ అత్తారింటికి దారేదంటే/ ఇట్లా.. ఇట్లా..అంటూ తల్లి చేతివేళ్ళతో బిడ్డకి చక్కలిగింతలు పెట్టి  మరీ నవ్వించడం.. కేవలం నవ్వులతోనే కాలక్షేపం చేయడానికి కాదు. ఆచారవ్యవహారాలమీద బాలలకు ఒక ఆనందకరమైన అనుభూతిని అలవాటు చేయడానికే! ఇలా ఎన్నైనా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోవచ్చు.

బాలసాహిత్యం ఏనాటిదో చెప్పలేం. ఈ పాటలు ఎవరు కట్టినవో  కనుక్కోవడం కష్టం. బిడ్డల మనసెరిగిన ఏ తల్లి తలలో మెదిలిన భావ తరంగాలో  వాత్సల్య రూపంలో వెలికి వచ్చుండవచ్చు. 'బాలవాజ్ఞ్మయానికి తల్లి మనసే ధర్మకర్తృత్వం వహించేదిఅంటారు చింతా దీక్షితులు.

ఆదికావ్యానికి నాంది విషాదం ఐతే.. బాలసాహిత్యానికి నాంది తల్లి ప్రేమ. ప్రపంచంలో ఏ దేశ వాజ్ఞ్మయాన్ని పరిశీలించినా ఇలాంటి బాలసాహిత్యమే చిట్టి చిట్టి సెలయేళ్లలా సందడి చేస్తూ కనిపించేది.బిడ్డల ఆలనా పాలనా ఆట పాటలతో మిళాయించడం వట్టి పాశ్చాత్య విద్యావేత్తల బుర్రల్లో    మాత్రమే పుట్టి పెరిగిన ఆలోచన కాదు. మన  ఆచార వ్యవహారాలలో       ఏనాటినుంచో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న విద్యావిధానం అని చెప్పడమే ఈ చిరు వ్యాసం ఉద్దేశం.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

***

 

 

సారస్వతం ఓ మహాసముద్రం రచన : కర్లపాలెం హనుమంతరావు -

 


సారస్వతం ఒక మహా సముద్రం. అట్టడుగుదాకా వెళ్ళి  మంచిముత్యాలనేరి తెచ్చేవాడొకడు.  పై పైని ఈదులాటలతో తృప్తిచెందే వాడింకొకడు.  ఉప్పునొదిలేసి మంచినీటిని ఆవిరిరూపంలో గ్రహించి మొయిళ్ళద్వారా లోకానికి చల్లని వాన చినుకులు పంచే సూర్యకిరణంలాంటి ఘనుడు  మూడోవాడు. సాహిత్యంలోని విశేషార్థాన్ని స్వయంగా ఆకళించుకుని ప్రపంచానికి ప్రచుర పరిచే అతగాడే ఉత్తముడు.

 

సారస్వతం మహాసముద్రం అనాది ప్రసిద్ధం. అనంత శోభావిలసితం. కవిగణాలు నదీనదాల్లాగా విచ్చలవిడిగా దానికి పోషణ కల్పిస్తుంటారు. తత్సాంగత్య,  సాన్నిహిత్యాలతో తామూ పునీతు లవుతుంటారు. మహాసముద్రాన్నుంచి  ఉపసముద్రాలు బయలుదేరి  ప్రత్యేక నామాలతో శాఖో పశాఖలుగా ఎలా వర్థిల్లుతున్నాయో.. సారస్వతంనుంచి ఆంధ్రసారస్వతమని, సంస్కృత సారస్వతమని, ఆంగ్లసారస్వతమని విభేదాలు అలాగే వర్ధిల్లుతున్నాయి.

 

విపులమైన అనుభవం, విచిత్రమైన రసజ్ఞత, విమల భావనాశక్తి, విశేషమైన ఆశయోన్నతి, రహస్యస్ఫురణ మనిషి ప్రత్యేక లక్షణాలు.  అన్నిటికి మించి పలుకుబడి వల్ల కదా తతిమ్మా జంతుసంతుపైన అంతులేని ఆధిక్యత!  అనుభవానికి ఉద్రేకం, రసానికి ఉద్దీపన, భావానికి చైతన్యం, సంభవించినప్పుడు తన పలుకుబడితో తత్సమ్మేళనానికిగాని,   తరువాతి కాలంలో తదానందస్ఫురణకిగాని ఓ   బాహ్యప్రకటన కల్పించే ప్రయత్నంలో ఉప్పతిల్లేదే సారస్వతం.

 

అనుభవోద్రేకం పంచేంద్రియ సబంధి. చుట్టూతాగల  జడ అజడ రూపాత్మకమైన ప్రపంచంలో మనుష్యులు  అన్యోన్య సుప్రతిష్ఠులయ్యేదీ దీని వల్లే. సంకల్పం వల్ల  ప్రబలేది ఈ అనుభవం. ఈ అనుభవం నిసర్గమని, విరుద్ధమని రెండు రకాలు. నిసర్గానుభవం లోకికం. విరుధ్ధానుభవం అలౌకికం. మనుచరిత్ర నుంచే ఉదాహరణలివ్వవచ్చు రెండింటికి. ప్రవరాఖ్యుడి హిమాలయ సందర్శనం, అచ్చో రమ్యకాంతారవీధిన నారీదర్శనాదులన్నీ నిసర్గానుభవాలు. అకలంకౌషధ సత్త్వం, మరున్నారీరత్నం స్వాహావధూవల్లభుని సన్నిహితత్వంల్లాంటివన్నీ విరుద్ధానుభవాలకు ఉదాహరణలు.

 

రసోద్దీపనమూ హృదయసంబంధే. సామరస్యం దీని అంతిమ ఫలం. ఉత్కంఠవల్ల ఇది ఉత్ప్రేరితం. సభ్య, అసభ్యాలని రెండు రకాలు. పింగళి సూరనార్యుని ప్రభావతీప్రద్యుమ్నం లోని "కలకల నవ్వినట్ల తెలిగన్నుల నిక్కరు చూచినట్ల తో/బలుక గడంగినట్ల కడు భావగభీరత అబ్బినట్ల పెం/పొలయ రచించి జీవకళ యుట్టిపడన్ శివ వ్రాసినట్టి యా/చెలువున శాభిముఖ్యము భజింప దలంకెను దాను బోటియున్" లాంటి కమ్మని రసాలూరు పద్యం సభ్యరసానికి ఉదాహరణ.

ఆ కవిదే కళాపూర్ణోదయంలోని సీస పద్యం అసభ్యరసానికి ఉదాహరణ.

"బెరుకెరుగని గాఢ పరిరంభమున నల్లి/బిల్లి గొంచు బెనంగు పెనకువలను/బెరిగెడి పేరాస పేర్మి ననర్గళ/లీల బర్వెడు కుచాస్ఫాలనముల/నడ్డమాకలు లేక  యబ్బినయ ట్లెల్ల/నమరించు నఖర రేఖాంకములను/గొదగొన్న లొదగొన్న తమి గొంకు కొసరు లే కొనరించు/ వివిధ దంతక్షత విభ్రమములు/మన్మథావేశవిలసనమహిమ నెఱపు/తపసి గని సాదు రేగిన దల పొలాన/నిలువ దను మాట నిజమయ్యె నే డటంచు/మగువ నవ్వుచు జేతకు మాఱు నేనె" దృశ్యరసం అసభ్యం.

భావోదయం మానసికం. ఐకమత్యం దాని అంతిమఫలం. ఉద్బోధాప్రేరితం. పాఠ్యం, స్మర్యం అని రెండు విధాలు. చదివేటప్పుడు మాత్రమే మేల్కొని ఉండేది పాఠ్యం. మనసును విడిచిపెట్టకుండా మళ్లీమళ్ళీ స్మృతిలోకki వస్తుండేది స్మర్యం. "మాయమ్మా నను నీవే/రాయలవై కావ రావరావే జేజే/మాయాతుమ లానినయది/పాయక సంతోష మున్నఫల మిల సామీ" పాఠ్యరసానికి ఉధాహరణ అయితే "కొందల మందె డెందము శకుంతల తా నిపు డేగు నం చయో!/క్రందుగ బాష్పరోధమున గంఠమునుం జెడె బుద్ధిమాంద్యమున్/బొందె; నొకింత తపోనిధులే యిటు గుంద, నెంతగా/గుందుదురో తమంత గను కూతుల బాయు గృహస్థు లక్కటా!" లోని భావం ప్రపంచహృదయ సంస్తవనీయమై స్మృతిగొల్పుతున్నది. ఇదీ స్మర్యం. మొదటిది కళాపుర్ణోదయనుంచి.. రెండోది అభిజ్ఞాన శాకుంతలం నుంచి.

 

ఆశయోద్ధరణం సంశయాత్మక సంబంధమైనది. సాఫల్యం దీని అంతిమ ఫలం.లౌకికం, ప్రాకృతం, పారమార్హికం- అని మూడు రకాలు. పోతనామాత్యుని భాగవతంనుంచే మూడింటికి ఉదాహరణలు ఇవ్వవచ్చు. "ఘను డా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో/విని కృష్ణుం డది తప్పుగా దలచెనో విచ్చేసెనో యీశ్వరుం/డనుకూలింప దలంచునో తలపడో యార్యామహాదేవియున్/నను రక్షింప నెఱుగునో నెఱుగదో నా భాగ్య మెట్లున్నదో?"- లౌకికం.

'ఎండన్ మ్రగ్గితి రాకటం బడితి రీ రేలా బిలంబింప గా/రం డో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్కడీ/దండన్ లేగలు నీరు ద్రావి యిరుపొంతన్ బచ్చిక ల్మేయుచున్/దండంబై విహరించు చుండగ నమందప్రీతి బోనేతమే"- ఆశయం ప్రాకృతం. కనక ప్రాకృతరసానికి ఉదాహరణ. "కల డందురు దీనుల యెడ/గల డందురు పరమయోగిగణముల్ పాలన్/గల డందు రన్ని దిశలను/గలడు కలం డనెడువాడు కలడో లేడో?"- ఈ పద్యంలోని ఆశయం పారమార్హికం.

 

పలుకుబడి భాషాసంబంధమైనది. అర్థజ్ఞత అంతిమ ఫలం. కృషి ప్రబలితం. స్వతస్సిద్ధం,   అనుశ్రుతం అని రెండు రకాలు. చిలవలు పలవలుగా విస్తరించేది అనుశ్రుతం. ఆ లక్షణం లేకపోతే స్వతస్సిధ్ధం. నందితిమ్మన పారిజాతాపహరణం ప్రథమాశ్వాసం స్వతస్సిధ్ధమైన పలుకుబడికి తార్కాణం. "కనకపంజర కారికలకు జక్కెర వెట్టి/చదివింప రెలొకో సరియ లిపుడు?కరతాళముల మందిరమయూరంబుల/నాడింప లేరకో యతివ లిపుడు?/క్రోవ్వాడిగోళ్ళదంత్రులు మీటి  వీణియ/లవలికింప రేలకో భా లిపుడు?/ఇన్ని దినముల వలె నుండదేమి నేడు/ చిన్న వోయిన దీ మేడ చెన్ను దఱిగి/పద్మముఖితోడ నెవ్వరే బారిజాత/పుశ్పవృత్తాంత మెఱిగింప బోలునొక్కొ?"

శృంగారనైషధంనుండిఅనుశ్రుత రసానికి ఉదాహరణ "జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన/రతిమన్మథుల విండ్లు రమణి బొమలు/కాంతినిర్ఝర మీదు కామయౌవనముల/ కుంభప్లవము లింతి కుచయుగంబు/నడు మింత యని కేల దొడికి పట్టిన ధాత/యంగుళిరేఖ లబ్జాస్యవళులు/యువమనో మృగ రాజి దవిలింప దీర్చిన/మదనవాగుర లిందువదన కురులు/వాల్య తారుణ్య సీమావిభాగమునకు/నజుడు వ్రాసిన రేఖ తన్వంగియారు/భానువరమున బడాసిన పంకజముల/యపరజన్మంబు పూబోది యడుగు లధిప."

స్థాయీస్ఫురణ తన్మాత్ర సంబంధమైనది. తన్మయత్వం అంతిమ ఫలం. అవ్యక్తస్థాయిలో ఆనందం, వ్యక్తిస్థాయిలో విజ్ఞానం లాభాలు. అవ్యక్తస్థాయీసంబంధాలలో నాలుగు రకాల ఆనంద స్ఫురణలు. సౌందర్య వికారాలు, సంయోగ వియోగాలు, విచార సంతోషాలు, విషాద వినోదాలు. వ్యక్తిస్థాయీ సంబంధమైన విజ్ఞానస్ఫురణలూ నాలుగు రకాలు. నిర్దేశం, నియుక్తం, నిరూఢం, నిబద్ధం.

'జగన్మోహినీవేషం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణగొల్పే సౌందర్యం. బాహుకరూపం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ వికారం. అశోకవృక్షం కింద సోకించే సీతావియోగం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ వియోగం. మాయరంభ, మాయనలకూబరుల సంయోగమ వ్యక్తస్థాయి ఆనందస్ఫురణగొల్పు సంయోగం. వ్రేపల్లెలొ శ్రీకృష్ణుడు గోపబాలకులతో గడిపిన ఘట్టాలు అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ గొల్పే వినోదాలు. అజ్ఞానవాసంలో పాండవుల ఇడుములు అవ్యక్తస్థాయి అనందస్ఫురణ విషాదానికి ఉదాహరణ. వ్యక్తిస్థాయిని నిర్దేశించేవి ప్రకృతిశాస్త్రాలు, నిరూఢాలు, నియుక్తాలు,  సంగీత శాస్త్రాదులు. వేమన పద్యాల్లాంటివి నిరూఢాలు. వేదాంతాదులులు నిబద్దాలు.

సారస్వతంలో అనుభవం రూపంలాంటిది. రసం కళవంటిది. భావం జీవాత్మ. ఆశయం పరమాత్మ. పలుకబడి జీవం. స్థాయీస్ఫురణం జీవపదార్థం. సారస్వత విభేదాలు రెండు రకాలు. సాధ్య సారస్వతం. సిద్ధ సారస్వతం. అనుభవ రస భావ ఆశయాలలో ఒకటి రెండు కొరవడి.. పలుకుబడి సాయంతో వ్యక్తిస్థాయికి విజ్ఞానస్ఫురణ  కలిగించేది సిద్ధ సారస్వతం. మనం సర్వసాధారణంగా సారస్వతం అనేది ఇలాంటి సిద్ధ సారస్వతాన్నే.

కేవలం అనుభవాన్ని మాత్రమే బోధించే ప్రకృతి శాస్త్రాలు, కేవలం రసాన్ని మాత్రమే బోధించే సంగీతాది శాస్త్రాలు, కేవలం బావ బోధకాలైన నీతిశాస్త్రాలు, మతగ్రంథాలు, రసాన్ని, ఆశయాన్ని మాత్రమే బోధించే భజన కీర్తనాదులు సాధ్య సారస్వతాలు.

అనుభవ రస భావ ఆశయాలు  నాలుగు సమ్మిశ్రితమై వాటి వాటి ప్రాముఖ్యాన్ని బట్టి ఉచితానుచితాలను వహించే ప్రబంధాలు, శతకాలు, నాటకాలు, నవలలు కొన్ని సిద్ధ సారస్వతాల కిందకే వస్తాయి.

చివరగా ఓ విన్నపం!

సాహిత్యాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేస్తేనే గానీ సాహిత్య సృజన సాధ్యం కాదని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. సాహిత్యాన్ని లోతుగా పరిశీలన చేయవలసిన విశ్లేషకులకు ఓ చిరు కరదీపికగానైనా  ఉపయోగ పడాలనే సదుద్దేశంతో చేసిన సమాచార సేకరణ ప్రయత్నంగా అర్థం చేసుకోమని మనవి. మాన్యులు కీర్తి శేషులు కవికొండల వెంకటరావువంటి వారినుంచి పొందిన ప్రేరణగా ఈ ప్రయత్నాన్ని చూడమని వినయపూర్వకమైన వినతి*

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

14 -02 -2021

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...