పరగు
పంచాక్షరంబుల పక్షివరుడు
వాని
తలదీయనొక కవివర్యుడగును
అతని
తలద్రుంచ వణిజుల కవసరమగు
అసలు పదమును
దెల్ప జోహారొనర్తు!
మొదటి పాదం
పొడుపుకి విడుపు- కపోతరాజు. మిగతా పాదాలకు వరుసగా పోతరాజు, తరాజు, రాజు . ఇదో పద
సంబంధమైన చమత్కార పద్యం.
పెండ్లియై
పెనిమిటిపోయి వెతలొదవిన
పిదప గద
"భరణంబు" గోరుదురు స్త్రీలు!
పెండ్లికాక
మునుపె కడగండ్లు రాక
మునుపె
"భరణంబు" గోరుదురు పురుషస్త్రీలు!
వెటకారం పాలు
ఎక్కువైనా చమత్కారమూ ఆ పాలలో చక్కరలా కలగలసినందున ఈ పద్యం హృద్యమైంది.
కవిత్వాన్ని Sadness, madness and Gladness గా
అభివర్ణించారు మహాకవి శ్రీశ్రీ. అం'దులోని గ్లాడ్ నెస్' నే గట్టిగా పట్టుకుని పుట్టిన ఇటువంటి చమక్కు పద్యాలు విశ్వసాహిత్యంలో
పుట్టలు పుట్టలు. శబ్దార్థాలు రెండూ ప్రధానంగా ఉండి పండిన కొన్నితెలుగు పద్యాలను
స్థాలీపులాకన్యాయంగా పరిశీలించడమే ఈ చిన్నవ్యాసం ఉద్దేశం.
'బావ మరదింగని ఆ-యావులలో నొకటి తెమ్మనగా నపుడే
'యా'వని యడిగిన- వాక్యముగా వలయున్ భాషలైదుగా
నొకపదమునన్!'
ఆ
అవులమందనుండి ఒకటి తెమ్మని బావ అడిగితే 'ఏ-ఆవ్-రా-బా-వా' అని మరది ఎదురు ప్రశ్న. 'ఏ-ఆవ్-రా-బా-వా' అనే ఆ పదబంధంలోనే ఉన్నాయి గదా 'రా!' అనే మన తెలుగు సంబోధనార్థక పదానికి
సమానార్థకాలైన మరాఠీ, హిందీ, తెలుగు,
కన్నడ, తమిళ భాష పదాలు వరుసగా!
చమత్కార గుణం
ఓ చాయుంటే చాలు తెలుగు 'కుందేలు'కి రెండు
కొమ్ములున్నాయని అనైనా వాదించి మరీ ఒప్పించవచ్చు! కాకపోతే ఇవన్నీ కేవలం
వినోదక్రీడలే సుమా!
తెలిసిన
పదాలే! నిత్యం వినేవే! ప్రతిభావంతుల ముఖద్రోణిలో పడితే మెరుగుముత్యాలై
మురిపిస్తాయి. 'పంచశరున్ విరాలి గొలుపంగల చేడెల
వాడి చూడ్కులన్/గొంచెము విచ్చు జాజిపువు గుత్తుల నంటిన కమ్మ తెమ్మరల్/గాంచన
గర్భురాణి కరకంజము నందలి చిల్క పల్కులున్/మించును గాదె వీరి కమనీయ మహీయ కవిత్వ
సంపదల్!' అంటూ జయంతి రామయ్యపంతులుగారంతటి వాజ్ఞ్మయవేత్తలే
కొప్పరపు సోదర కవుల గరుడ పవమాన పరిపాటి కవనధాటికి
కుచ్చు కిరీటులు తొడిగారు ఒకానొప్పుడు. కాకినాడలో ఆ సోదర కవులు కవితావధానం
చేస్తూ కాళ్ళకూరి నారాయణరావుగారి కోరిక మీద కత్తెర మీద చెప్పిన పద్యం
విన్నవారికి వారి చమత్కార వైభోగం మీద
అపారమైన గౌరవాబిమానాలు కలగక మానవు.
'ఇరువురు గూడి యొనర్చునెడం బనులెప్పగిదిన్నెరవేరెడు నో/యిరువురు కాంతల
సందున గాంతుడెంత సుఖంబడజాలునొ యొ/క్కరునకు నొక్కరుడేగతి దోడ్పడ గావలెనో క్రియలందున
గ/త్తెర మన కత్తెరగెల్ల వివేకనిధీ!తగబోధ యొనర్చు జుమీ!' ఈ
కవిరాజవిరాజితంలోని ఆ 'కత్తెర మనకత్తెరగెల్ల .. తగబోధయొనర్చు'
ననే యమక పదప్రయోగానికి సరసుల హృదయం పులకరించకుండా ఉండగలదా? 'తడయరు ప్రశ్నంబడిగిన/ దడవరు పల్కులకు గాగ దడబడరెపుడున్/నొడువులు మిడుకరు
తోపక/వడివడి వచయింత్రుమున్ను వల్లించి నటుల్!' అదీ ఆశుకవితా
ప్రజ్ఞానిదుల శేముషీ దురంధరత్వం.
అవధానాలవంటి గత్తర సందర్భాల్లో
సైతం ఏ తత్తరపాటుకు పోకుండా ఇంతటి నిర్దుష్ట చమత్కార సృష్టి జరగాలంటే కవి కెంతటి
ప్రతిభా వ్యుత్పత్తులు ఉండాలి! శ్రీకారంనుంచి .. శుభమస్తు వరకు ప్రతి పలుకూ ఓ
రసగుళికగా మారే వరకూ చిలికి, రసహృదయాల పైన చిలకరించే ఆశుకవులకు
తెలుగుభాషలో కొదవ లేదు. ఇప్పటిలాగా సాంకేతికాభివృధ్ధి జరగని కాలం కనక
ఆశువుగా పొంగిన నాటి రసగంగా ప్రవాహాన్నంతా ఏ ఆడియో, వీడియో
బుంగలకూ పట్టుకోలేక పోయాం. ఆ నోటా ఈ నోటా బడి కాలానికి ఎదురీదుతూ మనదాకా వచ్చిన ఈ పదిశాతం ఆశుకవిత్వమే ఇంత
రసవత్తరంగా ఉన్నదే! మిగతా ఆ తొంభైశాతమూ దక్కించుకోగలిగి ఉంటే ఎంత బాగణ్ణో!
'అరసి విశుద్ధ శబ్దములు, వర్ణములున్, ధ్వని వైభవం, బలం/కరణము, రీతివృత్తులును
గల్పన, పాకము, శయ్యము, న్రస/ స్ఫురణము, దోషదూరత,
యచుంబిత భావములొప్ప, జిత్ర వి/ స్తర మధు రాశులీల గవితల్
రచియింపగ నేర్చె..' నంటూ తారాశశాంకంలో శేషం వేంకటపతి కవిత్వ
లక్షణాలను గురించి ఒక పద్యంలో విపులంగా చెప్పుకొచ్చాడు నాలుగువిధాలైనదిగా భావించే
కవిత్వంలో మధురం, చిత్రం,
విస్తారాలతో పాటు ఆశువూ ఒక ప్రథానమైన ప్రక్రియ. వార్తక రాఘవయ్య తన 'అక్షర దీపిక'లో ఆశుకవిత స్వరూప స్వభావాలను మరింత
లోతుగా నిర్వచించే ప్రయత్నం చేసాడు. ఏకపాద,
త్రిపాద, కఠిన ప్రాస, విషమ
సమస్యాపూర్తులు, వ్యస్తాక్షరీ సంఘటిత పద్యాలు, ఇష్టార్థ దేవతా వర ప్రతిపాదిత, నిషేధాక్షర రచనా
చమత్కృతులు, అష్టావధానాలు, ఘటికా శతగ్రంథ
కల్పన, ఆకాశపురాణాలు-
తత్కాలోచితంగా త్వరితగతిన రచించే ఏ కవితలైనా ఆశుకవితా విభాగం కిందకే వస్తాయన్నది ఆయన మతం.
ఇక మన ఆంధ్ర
సాహిత్య చరిత్రను గాని క్షుణ్ణంగా
పరిశీలిస్తే ప్రాచీన, ఆధునిక,
అత్యాధునిక యుగాల్లో సైతం అబ్బురపరిచే ఆశుకవితా దురంధరులకు లోటు లేదు. వేములవాడ భీమకవి రాజా కళింగుని
ఆశుకవితల్లోనే శపించాడు. ఘటికలో ఒక శతకం చెప్పగల ఘనాపాటి జక్కనతాత పెద్దయ.'ఈ క్షోణిన్ నిను బోలు సత్కవులేరీ నేటికాలంబునన్' అని
కీర్తిగడించిన యుగకర్త శ్రీనాథుడూ అసమాన ఆశుకవితా దురంధరుడే. ఆంధ్రకవితా పితామహుడు
అల్లసాని పెద్దన మొదలు..శతలేఖినీ పద్య సంధాన దౌరేయుడు రామరాజ భూషణుడి వరకు.. ఆశుకవితాజాలాలలో నిలువీత విన్యాసాలు జరిపిన గజ
ఈతగాళ్ళు ఎందరో! యాదవ రాఘవ పాండవీయ కర్త నెల్లూరి వీరరాఘవ కవి, పాండురంగ మాహాత్మ్య రచయిత తెనాలి
రామకృష్ణకవి, ఆశువులో మేటిగా గణుతికెక్కిన గణపవరపు వేంకటకవి..
ఉత్తర రామ చరిత్ర సృష్టికర్త కంకటి పాపరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి
వాలంలా అంతులేకుండా సాగేదీ ఆశుకవుల జాబితా. రెండు జాముల్లో పారిజాతాపహరణాన్ని ఆశువుగా
చెప్పిన ఘనత రఘునాథ రాయలువారిది. ఘటికార్థ నిర్మిత శతశ్లోకి విదుషీమణి మధురవాణి.
గడియకు నూరు పద్యాలు గంటం లేకుండానే రచిస్తా'నని పంతంపట్టి
మరీ నెగ్గిన ప్రతిభాశాలి అడిదం సూరకవి. పద్యాలైనా, సమస్యలైనా
ఆశువుగా పూరించగలనని యాచమ నాయకుని సందర్శించిన సందర్భంలో చెప్పుకున్న కవి మోచర్ల
వెంకన మాత్రం ఏమంత తక్కువ ప్రతిభావంతుడా ! రావణ దమ్మీయం
రాసిన పిండిప్రోలు లక్ష్మణ కవి, అభివవ భట్టుమూర్తి శ్లిష్టా
కృష్ణమూర్తి శాస్త్రి .. చెప్పుకుంటూ పోతే మంగళగిరి
చేంతాండంత అవుతుందీ ఆశుకవుల జాబితా.
ఆధునికకాలంలో
అభినవ పండిత రాయలు నూజివీడు సంస్థాన విద్వాంసులు విద్వాన్ మాడభూషి వేంకటాచార్యులు, కాశీ కృష్ణమాచార్యులు, అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి, పిసుపాటు చిదంబర
శాస్త్రి, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి, పోకూరి కాశీపతి, సి.వి.సుబన్న, ప్రసాదరాయ కులపతి..
అత్యాధునికంగా
డా॥ మేడసాని మోహన్, డా॥ మాడుగుల ఫణిభూషణ శర్మ, ప్రస్తుతం ప్రవచన కర్త పాత్రలో
జీవించే డా॥ గరికపాటి నరసింహారావు, కీ.శే
డా॥ రాళ్లబండి కవితా ప్రసాద్.. స్థలాభావం వల్లగాని చెప్పలేక
పోవడం.. తెలుగు
సాహిత్యమాతకు ఊడిగం చేసిన,
చేస్తున్న ఆశుకవితా శేముషీ దురంధరుల జాబితా అశేషం!!
కొప్పరపు
సోదర కవులైతే సుమారు మూడు లక్షల పైచిలుకు ఆశుకవితలు చిలకరించారని ఓ అనధికార అంచనా.
'ఎవ్వరిని మెచ్చువాడ గా నెపుడు నేను/ మెచ్చితి మిమ్మె జగములు మెచ్చినట్లు' అంటో వేదం వేంకటరాయ శాస్త్రి గారంతటి గాఢపండితుల నోటి నుండి సైతం ఆశీర్వచన
మాలలు అందుకున్న ఆశుకవితలో ఉన్న ఆ విశేషాలేమిటో? ఒక సారి
స్థాలీపులాకన్యాయ రీతిగానైనా తిరుపతి వేంకట కవుల వంటి దిగ్గజాల చమత్కారాలను చవి
చూడనిదే వీడనిదీ సందేహం. ఇతర దేశాల్లో జన్మించడం కన్నా ఆంధ్రదేశంలో జన్మించడం
ఎందువలన పుణ్యకార్యమో ఓ అవధాన సందర్భంలో తిరుపతి వేంకట కవులు బహు చమత్కారంగా
చెప్పుకొచ్చారు.
'ఇతర దేశములను జనియించుటకంటె నాంధ్రదేశమున జనియించుటార్య హితము 'వశి వశి' నటంచు పిలుతురు వారు భార్య నదియు 'శివ! శివ!' యై తుద కఘము లడంచు'
అమావాస్యను
పున్నమిగా చిత్రించడం ఒక మాదిరి విన్యాసం . పున్నమినే అమావాస్యగా సమన్వయించమంటే? అదీ ఆశువుగా అప్పటికప్పుటే సమర్థవంతంగా
ఒప్పించాలి.. ఛందస్సుల బంధాలు ఎలాగూ తప్పని సరి. కొప్పరపు సోదర కవులు ఈ గడ్డు
సమస్యను పరిష్కరించిన తీరే పరమాద్భుతం.
'వెన్నెల వెదజల్లుచు దివి/ వెన్నవలె దోచు
చంద్రబింబమునెల్లన్/ గ్రన్నన రాహువు మ్రింగగ/ బున్నమ యమవస యనంగ బెల్పొందె భువిన్!'
ఆంధ్రదేశంలో
ఈ అవధానాల పుట్టుక క్రీ.శ 13వ
శతాబ్దం నాటిదని చరిత్ర. దీనికి కొన్ని స్వరూప స్వభావాలను
సమన్వయించి సాహిత్య గౌరవం కల్పించింది మాత్రం శ్రీమాన్ మాడభూషి వేంకటాచార్యులవారు.
ఈ ఆవధాన విద్యను వాడవాడలా వైభవోపేతంగా ఊరేగించినవారు తిరుపతి వేంకట
కవులు. అవధానాలు చేయనిదే కవికి పాండితీ జీవన సాఫల్యం
సిద్ధించదన్నంతగా సాగింది ఇటీవలే ముగిసిన
శతాబ్దం వరకు.
అవధానం
అంటేనే ఏకాగ్రత. అవ (పూర్వక ధాఙ్- ధారణ పోషకయోః) అను ధాతువునుండి పుట్టిన మాట.
అలంకారశాస్త్రవేత్త వామనాచార్యుడు కావ్యాలంకార సూత్ర వృత్తి'లో కావ్యాంగాలను వివరించే సందర్భంలో
అవదానాన్నీ ఓ కవిత్వబీజంగా సమర్థించాడు. లోకం, విద్య,
ప్రకీర్ణం అనేవి మూడు కావ్యాంగాలని, వీటిలో
మూలభూతమైనది అవధానమేనని, ప్రతిభ లేనిదే కావ్యం ఎలా
రాణించదో.. అవధానం లేనిదే 'అర్థం దర్శనం' అలా సాధ్యం
కాదని చిత్తైకాగ్ర్య మవధానమ్' అన్న సూత్రంలో ఆయన నొక్కి
చెప్పాడు.
వేదంలోనూ
అవధానాలు ఉన్నాయి. జట, క్రమ,
మాలా, శిఖా, ధ్వజ,
దండ, రధ, ఘన-అనే అష్టసూత్ర బద్ధం వేదపఠనం. శబ్దప్రధానాలు,
ప్రభుసమ్మితాలయి స్వరబద్ధంగా పఠించాల్సిన వేదాలలోనూ స్వరావధానాలు,
అక్షరావధానాలు కొందరు క్రీడాస్ఫూర్తితో ప్రదర్శిస్తుంటారు. కాలగమనంలో
ఇవే రూపాంతరం చెంది తెలుగు సాహిత్యంలోకీ ప్రవేశించాయనుకోవచ్చు. తప్పు లేదు.
ఏకాగ్రత అనే
అర్థంలో నన్నయగారి కాలంనుంచి ప్రయోగంలో ఉన్నా.. ఒక ప్రక్రియగా ప్రదర్శించిన కవులలో ఆద్యుడు కొలమచెలమ మల్లినాథ సూరి.
కాళిదాస కృతులకు వ్యాఖ్యానాలు వెలయించిన ప్రతిభావంతుడు ఇతనే.
సెల్ఫీల
పిచ్చి రోజురోజుకీ ముదిరిపోతోంది. సెల్ ముందు తలకాయలు మోటించుకుని ఫొటోలకు
దిగుతున్నారే కాని.. ఒకరి తల నుంచి మరొకరి తలకు ప్రయాణిస్తున్న పేలను గురించి..
దానిమూలకంగా వచ్చే చుండ్రును గురించి చింతించే వాళ్లే కనిపించడం లేదు. ఈ ఉపద్రవం ఏ అత్యాధునిక ఆశుకవి కంటపడితేనో.. ఆశువుగా ఓ రసవత్తరమైన పేలు పద్యం ఊడిపడదూ!
స్వస్తి!
-కర్లపాలెం
హనుమంతరావు
13 -02 -2021
బోథెల్, యూఎస్ఎ
No comments:
Post a Comment