Saturday, December 4, 2021

క్షీరామృతం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - నిజంగా గోమాతే! - పేరుతో నేను రాసిన సంపాదకీయం - 24-04-2011 ప్రచురితం

 


ఈనాడు - సంపాదకీయం 


క్షీరామృతం 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - నిజంగా గోమాతే! - పేరుతో నేను రాసిన సంపాదకీయం - 24-04-2011 ప్రచురితం ) 


ఒక రూపం అంటూ ఏర్పాటు కాకముందే బిడ్డ రాకకోసం ఈ లోకంలో పలవరిస్తూ ఎదురుచూసే వ్యక్తి అమ్మ. శిశువుకిచ్చే ఊపిరి తాయిలం కోసం ఆ పిచ్చితల్లి ఎన్ని మృత్యుద్వారాలు దాటి వస్తుందో! బిడ్డల మంచిచెడ్డలు బిడ్డులకు మించి  తెలిసేది కన్న తల్లికే. ' ఎక్కడ నడిచినా నా అరికాళ్ల కింద మా అమ్మ చేతులే ఉన్నట్లుంటాయి' అంటాడొక ఆధునిక కవి. పసికూనకు తల్లి చన్ను గుడిపే సన్నివేశానికి మించిన సౌందర్య దృశ్యం సృష్టిమొత్తంలో మరెక్కడైనా ఉంటుందా? ' మాతాశిశుల ఆ అమరకేళి ముందు అందుకే శిరసు వంచి నమస్కరిస్తున్నాను' - అంటారు. భావకవి కృష్ణశాస్త్రి.  అమ్మంటే రాయటానికి అసాధ్యమైన పద్యం. అయినా అమ్మకోసం దేన్నైనా పద్యంగా అల్లడానికి నేను సదా సిద్ధం- అన్నాడింకో అత్యాధునిక  కవి. అల్లసాని పెద్దనామాత్యుడు అయిదొం దల ఏళ్లకిందటే ఆ పని చేసి చూపించాడు. 'అంకము చేరి శైలి తన యాస్తన దుగ్ధము లానువేళ అవ్వలి చన్ గబళింపబోయిన ఆ గజాస్యుని బాల్యాంక విచేష్ట' ను  పది కాలాలపాటు తలచుకొని తన్మయత్వం చెందే హృద్యమైన పద్యంగా మనుచరిత్ర ఆరంభం లోనే రాసిపెట్టాడు. దేవతలకంటే అమృతం ఉంది. భూలోకవా సులకు అమ్మపాలే అమృతం. మాతృమూర్తి అనే దేవాలయం గర్భగుడిలో క్షణక్షణం ప్రవర్ధమానమయ్యే జీవుడికి తల్లిపాలను మించిన తీర్థప్రసాదాలు లేవు. దేవుడనేవాడు నారు పోశాడను కున్నా నీరుపోసి పోషించవలసింది మాత అనే భూలోక దేవతే. మొలక మొదటిదశ.  ఎదుగుదలలో తల్లిపాల పోషక పాత్రకు ప్రత్యామ్నాయమేదీ లేదనే అంటోంది శిశువైద్యశాస్త్రం. నిజమే.. ఎన్ని పాలపుంతలు వెదికినా తల్లికి మించిన మురిపాల ముంత బిడ్డకెక్కడ దొరుకుతుంది? !


బిడ్డ ఉద్గ్రంథంలోని ప్రతి పుటకీ తల్లిపాల సంతకం వాసన అంటి ఉంటుంది. పాలకడలి మీద తేలియాడే ఆ పరంధాముడూ బహుశా ఆ అమ్మపాల కమ్మని రుచి, సువాసనల కోసమేనేమో అవతారాల వంకతో నేలమీదకి దిగి వచ్చింది! 'యశోద భాగ్య' మిది/ శ్రీపతి తను శిశురూపములో నున్నది/ నిత్య నిర్మలుడికి నీళ్ళుపోసి/ ఎత్తుకుని తొడలపై చనుగుడుపే' అంటూ పురందరదా సువంటి పరమ విరాగి కూడా ఈసుపడ్డాడంటే అమ్మపాల లీలలకు మరో ధ్రువపత్రం అవసరమా? ప్రసవానంతరం బాలింత పాలిండ్లలో ఊరి వచ్చే పచ్చని క్షీరం ( కొలెస్ట్రమ్ ) శిశువు శత  వసంతాల పచ్చని బతుకుకు అవసరమయే సంపూర్ణ ఆహారం . కోర కుండానే ఆ అమృత ధారలతో గొంతు తడిపే జననులున్నంత కాలం ఏ జన్మభూమైనా స్వర్గానికన్నా మిన్నే. 'గుక్కపట్టిన గుండెను తెల్లనెత్తురులో తడిపి/ బొట్టు బొట్టుగా తల్లి పంపేది వట్టి పోషక పదార్థాలు, విటమిన్ల పాలే అనుకుంటే పొరపాటే. ఆయురారోగ్య అప్లైశ్వర్యాలతో వందేళ్ళు చల్లగా జీవించాలనే దీవె నలూ అందులో రంగరించి ఉంటాయి . ' జోకొట్టే అమ్మకూ జేజేలు పలుకూ పాలిచ్చే అమ్మకూ పాదాలు మొక్కూ' అంటూ నిరీశ్వర వాదులు సైతం తల్లిముందు ప్రణమిల్లేది అందుకే. కాళీయ  మర్దనం, గోవర్ధనోద్ధరణం వంటి ఈడుకు మించిన సాహసాలను చూపించిన  గోపాలబాలుడి ఆ అసాధారణ బలానికి కారణం యశోదమ్మ పయోదర ధారల మహిమేనంటే కాదని కొట్టిపారవేయబుద్ధి కాదు. ఆ దేవకీ సుతుడి బలుపైన పొట్టమీది పాలచారలను అన్నమాచార్యులవారు ఎన్నడో ఆనవాలు పట్టేశారు. కమ్మని వరసలతో అమ్మ మమకారాన్ని పాటగా కట్టేశారు. క్రీడలకు ముందు గాయా లపాలైనా 'శాఫ్ గేమ్స్' లో స్వదేశానికి మూడు స్వర్ణాలు సాధించిపెట్టింది శ్రీలంక పరుగుల రాణి సుశాంతిక జయసింఘే. 'అయిదేళ్లు వచ్చిందాకా అమ్మపాలమీద ఆధారపడటమే నా విజయం వెనకున్న రహస్యం' అని ఆ విజేత అన్న తరువాత- తల్లిపాల ఘనతకు వేరే ప్రమాణపత్రం అనవసరం.


తల్లిపాలకు నోచుకోనంత దురదృష్టం సృష్టిలో మరొకటుం డదు. 'ఎల్లనియోగంబు లెల్లబాంధవులు/ నెల్లవారలుగల నిట్లు భర్గునకు/ తల్లి లేకుండ దా విచిత్రంబు' అంటూ శంభు మాతృ రాహిత్యానికి అందుకే బెజ్జమహాదేవి అంతలా తల్లడిల్లింది. చన్నిచ్చి తల్లిలా అన్ని బాల్యోపచారాలూ చేసింది. తల్లిలేని బుజ్జా యిలందరికీ బెజ్జమహాదేవులు దొరుకుతారా?! పాలబుగ్గల పాపాయిలు తల్లిపాల బుగ్గలకు దూరంకావడం న్యాయమా? కొద్ది మంది మాతృమూర్తుల్లో దాతృత్వకాంక్షను రగిలించి వారి క్షీరధార లతో ఎన్ని సేవానిధులు నిర్వహించినా ఆ శిశువులకు జరిగే అన్యా యాన్ని సరిజేయగలమా? చెట్లకు నీరు, ఫణులకు ఉరగపాలు, మధుపాళికి మకరందం, పశువులకు పచ్చి గడ్డి సమృద్ధిగా అందే ఈ సృష్టిలో శిశువులందరికీ కడుపునిండా తల్లిపాలు దొరికినప్పుడే గదా సమన్యాయానికి సరైన అర్థం! ఆ పరమార్థంతోనే చైనా ఇంజినీరింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆగ్రో బయో సాంకేతికశాఖ శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు సాగిస్తున్నారు. జన్యుపరమైన మార్పుల ద్వారా కేంద్ర నాడీ మండలాభివృద్ధికి, రోగనిరోధక శక్తికి తల్లిపాలతో సమానంగా పనిచేయగల క్షీరసంపదను ఆవుల్లో వృద్ధి చేయవచ్చని ఇప్పుడు తేల్చారు. చైనా పత్రికల తాజా కధనాల ప్రకారం రుచికి, శుచికి, ఆరోగ్యానికి, పోషక నిధులకు అన్నివిధాలా అమ్మపాలకు సరిపోలికైన ఈ 'ఆవుపాలు' అందరికీ మరో రెండేళ్ల లోపే అందుబాటులోకి రావచ్చు.  తల్లిలేని బిడ్డలకు, బిడ్డలకు పాలివ్వలేని తల్లులకే కాదు- తల్లిపాల ప్రయోజనాలన్నింటినీ ఎల్లకాలం పొందాలనుకునే వారందరికీ ఇది నిజంగా ఉల్లాసకరమైన వార్తే!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - నిజంగా గోమాతే పేరుతో నేను రాసినసంపాదకీయం - 24-04-2011 ప్రచురితం ) 

ఈనాడు - సంపాదకీయం బతుకు విలువ రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 15 - 04 2012 న ప్రచురితం ) విలువ

ఈనాడు - సంపాదకీయం


బతుకు విలువ 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 15 - 04 2012   న  ప్రచురితం ) విలువ 


అ అధ్యయనం చేయాలేగాని జీవితాన్ని మించిన వేదం మరొకటి లేదు. 'కడలేని కాలవాహిని/సుడిగుండము లెన్ని గలవో చూచిన వాడున్/వడిదుడుకు లేక బ్రతుకుం/బడవ నడుపుకొనిన వాడు. వసుధం గలడే' అన్నారు కవి జాషువా. 'ఇక్కడి జీవితానందాలు మింట ఉండవు కనుక చచ్చి మళ్ళీ స్వర్గానికెళ్ళాలంటే ససేమిరా' అంటాడు జీవి' అన్నది ఆయన చమత్కారమే. సమస్యలంటారా? ఆంథోనీ రాబిన్స్ అనే ఆంగ్ల రచయిత భాషలో అవి, బతుకు పుస్త కంలోని అభ్యాస పాఠాలు. అనిబిసెంట్ ను  దివ్యజ్ఞాన సమాజ స్థాపనకు పురిగొల్పింది కుటుంబ జీవితంలోని ఇటువంటి ఆటుపోటు పాఠాలే! దుస్తుల దుకాణం గుమాస్తాగా జీవితంతో పట్టిన కుస్తీపట్లే బతుకు గోదాలో శ్రీనివాస రామానుజాన్ని కేంబ్రిడ్జి స్థాయి వస్తాదుగా నిలబెట్టాయి. 'జీవితం- భగవంతుడు మానవుడికిచ్చిన పరీక్షా పత్రం' అంటారు కవి కరుణశ్రీ.  'నీటికోసం వేళ్లతో భూమిని చీల్చిన చెట్టు/ నక్షత్రాలతో మాట్లాడటం కోసం నింగికెదిగిన చెట్టు/మనిషి ఎలా ఎదగాలో మనకి పాఠం చెప్పినట్టు'  విజయానికి ఆరోమెట్టు ఎలా ఉంటుందో చూపిస్తూ యండమూరి వీరేంద్రనాథ్ చెప్పే గొప్ప మాట అది. కథ అంటే కావాల్సినచోట ఆనందాన్ని కల్పించుకోవచ్చు. వద్దనుకున్న విషాదాన్ని విదిలించుకుని ముందుకు పోవచ్చు. జీవితం కథ కాదుగదా! ఎలాంటి జన్మ కావాలో కోరుకొమ్మని దేవుడుగాని దిగొచ్చి అడిగితే, ప్రత్యుత్తరంగా ఓ తత్వవేత్త ఇస్తానన్న సమాధానంలోనే ఉదాత్త జీవిత సారమంతా ఇమిడి ఉంది. 'మనసు దుర్బలమైనప్పుడు ఓపికగా విశ్లేషించుకునే సహనం, విహ్వలానికి గురైనప్పుడు కారణం తెలుసుకోగల కుతూహలం, ఓటమి ఎదురైనప్పు డు గర్వంగా ఒప్పుకొనే సాహసం, విజయం సాధించినప్పుడు వినయంగా తలొంచుకునే తత్వం' మరో జన్మలోనైనా వరాలుగా పొందా లనేది ఆయన సమాధాన సారం. మరు జన్మదాకా ఎందుకు? విలువైన బతుకు ఇవాళే మన ముందు ఉంది గదా!


కడగళ్లు లేని జీవితం కెరటాలు రాని కడలంత దుర్లభం. ముళ్లు లేని గులాబి లోకంలో ఉంటుందా? గెలుపు- ఎన్నో ఓట ముల సోపానాలు ఎక్కితేనేగాని అందని అందలం. ఆనందం అంటే ఎన్నో దుఃఖ సంద్రాలను ఈదుకుంటూ చేరే ఆవలితీరం. పులుసు నంజిన గాని భూమిలో మిక్కిలి తీపు/ తలపోయ నోటికిని తవు గానరాదు/ వావిరి లోకపు మాయ వలల జిక్కిన గాని/ వేవేగ వెడలి ముక్తి వెదకడు జీవుడు' అనిగదా అన్నమాచార్యులవారి ఆధ్యాత్మిక జీవవాదం! సమస్య వయస్సు ఎప్పుడూ జీవితంకన్నా చిన్నదే. పుట్టినప్పుడు లేదు. పుడకలదాకా ఉండబోదు. మరెందుకు భయం? మిఠాయి  కోసం తమ్ముడు చేసే ఆగం అన్నకు ఆగడంగా అనిపి స్తుంది. ఆ అన్న పరీక్షపోయి ఏడుస్తుంటే అక్కకు చికాకు పుట్టుకొ స్తుంది. సంబంధం తప్పిపోయి ఆ అక్క కుములుతుంటే తల్లి సముదాయిస్తుంది. ఆ తల్లే మొగుడి పాత ప్రేమపురాణం బయటపడి అల్లాడిపోతున్నప్పుడు, ఎప్పుడో జరిగిన తప్పునకు ఇప్పుడా ఏడుపు అని ఆమె తండ్రి మందలిస్తాడు. మనసు గతి, వయసు పరిణతిబట్టే సమస్య తీవ్రత. ఎగసి దూకే ఎంతపెద్ద కెరటమైనా వెనక్కి తగ్గక తప్పదు గదా! 'భయం ఎంత భీకరంగా తలుపులు మోదినా  ధైర్యంగా గడియ తీసి చూడండి... ఎదురుగా ఏమీ ఉండదు - అంటారు యండమూరి ఒక మనోవికాస పాఠంలో. మనిషికి ఉండా ల్సిన ముఖ్యమైన ఆస్తి ఆ ధీరగుణమే! మహాకవి శ్రీశ్రీ ఓ గీతంలో చెప్పినట్లు- ' ఏదీ తనంత తానై నీ దరికి రాదు. శోధించి సాధించాలి. అదియే ధీర గుణం' అన్న తెలివిడి కలగడమే పరిణతి. జీవితాన్ని గాలిపటంలా మలచుకుంటే చాలు... ఎదురుగాలి పెరిగే కొద్దీ అదే ఎత్తులెత్తులకు ఎగురుతుంది.


రాత్రీపగలూ ఒకేరీతిగా మోతలెత్తే ఈ కన్నీటి కడలిని కడదాకా ఈదుకొని రావాలంటే కావాల్సింది పిడికిలంత తెగువే. క్రీస్తు పుట్టు కకు ముందు కష్టాలు లేవా! సిద్ధార్థుడు బుద్ధదేవుడు కాకముందు బాధలకు కొదవా! అందరం ప్రవక్తలం కాలేకపోవచ్చుకానీ... అంది వచ్చిన అందాల జీవితాన్ని చేజేతులా చిందరవందర చేసుకునే తొందరపాటుతనం మాత్రం తెలివిమాలిన పని. 'మానవత వసించ వలసినచోట/దానవతను సహించలేను' అంటూ, తిరిగే భూగోళా న్నుంచి దిగేయాలనుకోవడం పిరికితనం. ప్రియురాలిచ్చిన జేబు రుమాలు విమానం నుంచి జారిపోయినప్పుడు దానికోసం దూకాలను కోవడం ప్రేమ. దూకలేక దుఃఖించడం వ్యాకులం. దూకడం సాహసం. దూకితే ప్రాణాలు పోతాయని తెలుసుకోవడం జ్ఞానం. ప్రాణాలు పోయినా ఫర్వాలేదనుకోవడం ఉద్వేగం. అయినా దూకేయడం ఉన్మాదం. 'చిరుత చీమ శిరసు చిదిమి క్రమ్మర దాని/ నదుకు బెట్ట శక్యమగునె? ' ఎన్ని జన్మల పుణ్యఫలమో మనిషి జన్మ! 'తరచి చూస్తే ప్రతి మనిషి జీవితం శ్రుతి తెలియని వింత పాటే. గతుకులలో గడ్డలలో కాలు సాగని చిక్కుబాటే. 'వ్రణాలకు, రణాలకు, తీరని రుణాలకు, మానహరణాలకు, స్వచ్ఛంద  మరణాలే శాశ్వత పరి ష్కారమా? ప్రజాకవి దాశరథి  ఘోషించినట్లు బతుకంటే- 'ఐదు రేకుల దీప కళిక. గుప్పుమని చేజేతులా ఆర్పుకోవడం అయినవాళ్ళకు చేసే నమ్మకద్రోహం. 'చావు' అగాధాలలోకి  స్వచ్ఛందంగా దూకే స్తున్న యువత శాతం పెరుగుతుండటం సమాజం మొత్తాన్నీ ఇవాళ కుదిపేస్తున్న విషాదం. ఆత్మహత్యలు వద్దన్న మేధావుల విజ్ఞప్తులు మాత్రమే చాలవు. చచ్చి సాధించేది శూన్యమన్న జ్ఞానాన్ని యువతలో తట్టిలేపే చిత్తశుద్ధి చర్యలు యుద్ధప్రాతిపదికన సత్వరం చేపట్ట కపోతే జాతి యువ సంపద వృథా కావడం ఖాయం. ఇది వ్యధ కలిగించే గుండెను పిండేసే నిష్ఠుర సత్యం. 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 15 - 04 2012   న  ప్రచురితం ) విలువ 

ఈనాడు - సంపాదకీయం కాల మర్మం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 05 -02-2014 న ప్రచురితం )

 



ఈనాడు - సంపాదకీయం


కాల మర్మం

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 05 -02-2014 న  ప్రచురితం )


' ఒక్కనాటి ప్రపంచము ఒక్కటి వలెకాదు. ఒక్క నిమిషము వలె నొకటిగాదు' ఆధ్యాత్మిక ఆచార్యులు అన్నమయ్య కాలభావన అది. భారతీయుల కాలనివేదన వేదకాలం నాటిది. బ్రహ్మప్రోక్తాలని ప్రతీతి కలిగిన వేదాలు సూర్యుడినీ  ఉషాకన్యానాథుడిగా ప్రస్తుతించాయి. (రుగ్వే 1 ము 75 రుక్క) బ్రాహ్మణాలైతే నక్షత్ర మండల ప్రస్తావనలూ తీసుకొచ్చాయి. కల్పం, బ్రహ్మకల్పం వంటి కాలాపేక్ష సిద్దాంతాలు పురాణేతిహాసాలనిండా బోలెడన్ని.  'ద్వంద్వాన్ని'  సమదృష్టితో చూడటమే కాలాన్ని జయించడం'గా భావించాడు ఆంగ్లరచయిత తత్వ వేత్త హక్స్  లీ.  మన శంకర భగవత్సాదులు ప్రబోధించిన 'మాయాకల్పిత  దేశకాల కలనా వైవిత్ర్య చిత్రీకృతం' సిద్ధాంతంలో ఇమిడిఉన్నది ఇదే రహస్యం.  ' అతీతాది వ్యవహార హేతు: ' అని కాలాన్ని యుగాల కిందటే నిర్వచించిన మహానుభావులు మన ప్రాచీన జ్ఞానులు.  కాల చింతనే మహా వింతైనది.  భూమి పుట్టుకనుంచీ బుద్ధిజీవులను వేధి స్తోంది. బమ్మెర పోతనామాత్యుడు భాగవతంలో ' ప్రారంభ సంపత్తి కాధారం బెయ్యది ? ' అని సందేహపడితే ' ఎందులోనుంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలం' అని ఆరుద్ర ' త్వమేవాహం'లో తర్కం లేవదీశాడు. ' మొదలూ చివరా తెలియని/ అనాది గర్భాన్ని చీల్చుకుని ఊపిరి పోసుకున్న క్షణాన /నాకు తెలియదు ఈ అనంత కాలవాహిని పొడవెంతో ' అనే మధన మనిషికి ఆకులు అలమలు మేస్తూ కారడవుల్లో తారాడే  నాటినుంచే వెంటాడుతోంది.


కాలం- పదార్ధం నాలుగో పరిమాణమమన్న  సాపేక్ష సిద్ధాంతం అర్ధం కానంతకాలు కంటిముందు కాలంచేసే గారడీ అంతా దేవలీలే. 'జనయిత్రి గర్భకోశమున బిండము జేసి యవయవంబుల దాన నల వరించి/ శిశురూపమున దానిక్షితి తలంబునద్రోయడం మొదలు కర్ర చేతను బట్టించి కదలలేని స్థితికి తెప్పించడం దాకా కాలమహత్తత్వంబు నిట్టిదనుచు వర్ణనము చేయటం వశం కాద' న్న  బ్రహ్మశ్రీ రాజలింగ కవి విస్తుబాటే ఇందుకు ఉదాహరణ.  కాలమర్మం అవగాహన కావాలంటే స్థల కాల పరస్పరాధారిత సిద్ధాంతం బోధపడాలి. రెండు సంఘటనల మధ్య ఉండే అంతరం 'కాలం' అని రెండు పదార్థాల మధ్య ఉండే దూరం 'స్థలం' అనుకునే సాధారణ భావజాలం నుంచి బైటపడాలి. ప్రకృతి గుణకల్పవల్లి చూపించే చిత్రాలన్నింటిని కాలపురుషుడు కల్పించే లీలావిలాసాదులుగా మనిషి భ్రమించేది ఆ నారికేళపాక సిద్ధాంతం తలకెక్కకే .  ' ఒక తరి సంతోషము. వే/ రొక  తరి దుఃఖంబు, మరియొక తరి సుఖ మిం/కొక తరి గష్టము ' కూర్చే తలతిక్క  కాలానిదని తూలనాడేది అందుకే.  మనిషి కంఠశోషే గాని  కాలాని కేమన్నా  కనికరం  ఉంటుందా? కుంటుతూ కులుకుతూ తూలుతూ గునుస్తూ  ఇలా సాగుతుందేమిటి చెప్పుమా కాలమా? ' అని బుగ్గలు నొక్కుకోవడానికి సమయమేమన్నా సౌందర్యస్పర్ధలో సుందరాంగుల అంగవిన్యాసమా ? కాలం ఒక క్షణం వెనక్కన్నా  చూడదు . ఏమి సాధించాలనో ఈ నిబద్ధత?  దువ్వూరివారు 'వనకుమారి ' లో  అన్నట్లు కష్టజీవి కన్నీటి కాల్వకైన  గాల చక్రము నిలవదు/ ధారుణీపాల పాలనా దండమునకు/ వెరచి యాగదు'  కాలం. బోసి పాపలని  నవ్వించడం , పగటికలలు కనే మగతరాయుళ్లను కవ్వించడం, చావుకబుర్లు వింటూ స్వగతంలో విలపించే వృద్దులను దీర్ఘ నిద్రకై  దీవించడం - కాలం ధర్మం.


అనంతమైనది భూతకాలం. అశేషమైనది భావికాలం.  నడిమధ్యలో కాసింతసేపు కాలు ఝాడించినంత మాత్రాన సర్వం తెలుసని అనుకోవడం అజ్ఞానం. ' దైవరూపంబు కాలంబు దానికెపుడు లోటు గలుగదు మన బుద్ధి లోపంబుగాని' అన్న పానుగంటివారి ' కల్యాణ రాఘవం' మాట నిజం. 'బాలు కంట తాబేలు వలెను/ వృద్దు కంట లేడిరీతి` పర్వెత్తు కాలం నిరూపించేదీ ఈ సత్యాన్నే. కాలాన్ని దేవతలైనా వంచించలేరు అనిగదా కౌటిల్యుడి సూక్తి! మానవమాత్రుల శక్తియుక్తులు ఇక దాని మహత్తు ముందెంత! భర్తృహరి వైరాగ్య శతకంలోని పది శ్లోకాలు చాలు- కాలం ఎంత బలీయమైనదో తెలియజెప్పేందుకు . 'భావినుంచి గతంలోకి వర్తమానం గుండా సాగే క్షణసముదాయాల నిరంతర ప్రవాహం'గా కాలాన్ని నిర్వచించారు అధునాతన కాలశాస్త్రవేత్తలు స్టీఫెన్ హాకింగ్, ఐన్ స్టీన్, లైబ్ నిజ్, కాంతివేగాన్ని మించి ప్రయాణిస్తే గతంలోకి తొంగి చూడటమూ సాధ్యమేనని హెచ్.జి.వెల్స్ ఊహ. అది వాస్తవమైతే ఎంత బాగుంటుందో ! రాయలవారి భువన విజయాన్ని పునర్దర్శనం చేసుకోవచ్చు. ఫెళ్ళుమనె  విల్లు- గంటలు ఘల్లుమనె-గు/ భిల్లుమనె గుండె నృపులకు- ఝల్లుమనియె జానకీ దేహమొక నిమేషమ్ము నందే-  అని కరుణశ్రీ వర్ణించిన 'శివధనుర్భంగ దృశ్యాన్ని కమనీయంగా పునర్వీ క్షణ చేసి పులకించిపోవచ్చు.  ఊహకు అవధులు లేకపోవచ్చు కాని దానిని  భావించే బుద్ధికి ఉన్నాయిగా  హద్దులు! కాలానికే గనుక నిజంగా కళ్లుంటే 'నాజూకుగా ఉండే మనుషులలో బూజు పట్టిన భావాలు చూసి/ కొత్తచివుళ్లు తొడిగిన పాత చెట్ల చాటున/ పువ్వుల మిషతో నవ్వుకుంటుందా? విసుగూ విరామం లేకుండా.. / అభి వృద్దీ, వినాశనం, క్షామం, క్షేమం విప్లవం... విశ్వశాంతి అని కలవరించే మనిషిని చూసి కలత పడుతుందా? ఎక్కడ బయలుదే రిందో, ముందుకే ఎందుకు కదులుతుందో, ఎప్పుడు ఆగుతుందో...ఏమీ తెలియదు. మనిషికి తెలిసిందల్లా కాలంతో కలిసి ప్రస్తుతంతో ప్రయాణించడమే. ఆ ప్రస్థానంలోని మలుపురాళ్ల గుర్తులే సంవత్స రాలు.  నడచివచ్చిన దారివంక మరోసారి వెనక్కి తిరిగి చూసుకో వడం, గడపవలసిన దూరాన్ని బుద్ధిమేరా ఒకసారి బేరీజు వేసుకుని... కాలూ చేయీ కూడదీసుకోవడం... ఏడాది మొదటివారం బుద్ధిమంతులందరూ చేసే పనులు..  చేయవలసిన విధులు . కాలాన్ని సద్వినియోగపరచుకునే ఘన సంకల్పమిది!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 05 -02-2014 న  ప్రచురితం )

ఈనాడు - సంపాదకీయం గెలుపు పిలుపు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 27 - 12 -2009 న ప్రచురితం )

 ఈనాడు - సంపాదకీయం


గెలుపు పిలుపు

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27 - 12 -2009 న  ప్రచురితం ) 


' గెలుపూ ఓటమికి మధ్య పోటీ పెడితే ఓటమే ముందు గెలు స్తుంది' అని చైనా సూక్తి. ప్రతి విజయానికీ వెనక ఓ ఓటమి ఉంటుంది. బావి తవ్వేవాడి చేతికి తొలుత మట్టే అంటుకుంటుంది. శరీరం తప్ప మరే ఆధారం లేని జీవజాలానికి పోరాడటం, ఎలాగైనా గెలవాలనే  ఆరాటం మినహా గెలుపూ ఓటములూ పట్టవు. కష్టపడి కట్టుకున్న గూడు చెదిరిందని సాలీడు ఏనాడైనా ఆత్మాహుతి చేసుకుందా? ఎండలు మండిపోతుంటే మళ్ళీ చినుకులు పడి చెరువులు నిండేదాకా కప్పలు బండల మధ్య రోజులు గడుపుతాయికానీ, గుండెలు పగిలి చావవు. శీతోష్ణాలూ, రాత్రింబవళ్ళు, చీకటి వెలుగులూ మాదిరే గెలుపూ ఓటములు. రాయిని రాతితో కొట్టి ఎవరూ నేర్పకుండానే నిప్పును పుట్టించినప్పటినుంచీ, చంద్రమండలం మీది నీటి జాడలు పట్టుకున్న దాకా అసలు ఓటమి అంటే తెలియకుండానే నెట్టుకొచ్చాడా మనిషి? అమ్మ కడుపులో పడిన క్షణంనుంచే మనిషికి పరీక్షలు మొదలవుతాయి. ఒలింపిక్స్  పరుగుపందెంలో మొదట వచ్చిన విజేత కూడా బుడిబుడి అడు గుల వయసులో ఎన్నోసార్లు తడబడి పడిపోయే ఉంటాడు. 'పరుగాపక పయనించవె తలపుల నావ/ కెరటాలకు తలవంచితె దొరకదు తోవ...' అని ఓ సినీకవి అన్నదీ- కష్టాల వారధి దాటినవాళ్లకే  అవరోధాల దీవిలోని 'ఆనంద నిధి' సొంతమవుతుందని చాటడానికే. మనిషి ఎన్ని శాస్త్రాలు చదివి పుణ్యకార్యాలు ఆచరించినా ప్రాణం ముందు అవన్నీ తృణప్రాయమేనన్నది మహర్షి యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన జీవనసూత్రం. ప్రాణం అంత తీపి కనకనే అమృతం కోసం దాయాది వైరాన్ని సైతం పక్కన పెట్టి క్షీరసాగరమధనానికి పూనుకున్నారు దేవదానవులు. సాక్షాత్ మృత్యుస్వరూపుడైన యమధర్మరాజే దండంతో ప్రాణాలు హరించటానికి వచ్చినా శివలింగాన్ని పట్టుకుని వదలలేదు మార్కండేయుడు!


పెద్దలు 'జాతస్య మరణం ధ్రువమ్' అన్నారని చేతి గీతలను చేజేతులా చెరిపేసుకోవాలనుకోవడం పిరికితనమే. మన ప్రమేయంతో మనం పుట్టామా... మన ప్రమేయంతోనే పోవటా నికి? తల్లి తొమ్మిదినెలలు మోసి జన్మనిస్తే తండ్రి పందొమ్మిదేళ్లు కంట్లో పెట్టుకుని పెంచిన శరీరం ఇది. మన ఆటపాటలకు, ముద్దు ముచ్చట్లకు, సుఖసంతోషాలకు వాళ్ల జీవితాలను చాదితే చేవదేరిన దేహం ఇది. 'ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు భూతాలు. వాక్ పాణి పాద పాయూపస్థలం అనే  అయిదు కర్మేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత జిహ్వాఘ్రాణాలనే అయిదు జ్ఞానేం ద్రియాలు... మనోబుద్ధి చిత్తాహంకారాలనే అంతఃకరణ చతు ష్టయంతో కలిసి పందొమ్మిదిమంది దేవతల ఆవాసం మనిషి శరీరం' అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది. అది శాస్త్రోక్షమైనదా, కాదా అనే వాదనను పక్కన పెట్టినా నేటి సామాజిక జీవనరంగంలో ఏ వ్యక్తి జీవితమూ ఉలిపికట్టె మాదిరి ఒంటరిగా సాగేటందుకు వీలులేనిది. 'పుటక నీది, చావునీది, బతుకంతా దేశానిది' అంటూ లోక్ నాయక్  జయప్రకాశ్ నారాయణ్ కు  ప్రజాకవి కాళోజీ నివాళులర్పిం చారు. మన బతుకంతా దేశానిది. .  అనిపించుకునేలా  కాకపోయినా అది- కనీసం మన కన్నవారిది, మనం కన్నవారిది, మనల్ని నమ్ముకుని బతుకుతున్నవారిది అని అయినా ఒప్పుకొనితీరాలి! తిండికి బిడ్డ ఒక్కపూట పాలుమాలితే- పాలు కుడిపిన తల్లి రొమ్ము ఎలా తల్లడిల్లిపోతుందో తెలుసా! ఆకాశంలో అకాల చుక్క పొద్దవుతాడని కాదుగా కన్న తండ్రి కండల్ని చాది బిడ్డను చెట్టంతవాణ్ని చేసిందీ! 'నాతి చరామి' అని ఇచ్చిన హామీని నమ్మి ఓ బిడ్డకు తల్లిగా మారిన పిచ్చితల్లి 'అమ్మా! నాన్నేడే!' అని ఆ బిడ్డ అడిగితే బదులేమి చెబుతుంది?


పంట పొలాలు ఎండిపోయాయనో, ప్రేమించిన పిల్లకి వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయిందనో, ఉద్యోగం ఊడి బతుకూ పరువు బజారున  పడ్డాయనో, స్టాక్ మార్కెట్ కుప్పకూలి షేర్లు 'బేర్' మన్నాయనో, అభిమాన కథానాయకుడి సినిమా మొదటి ఆటకు టిక్కెట్లు దొరకలేదనో, మార్కులు నూటికి నూరు రాలేదనో, ఇష్టమైన ప్రజానాయకుడు హఠాత్తుగా పోయాడనో, క్రికెట్ ట్వంటీ20లో మనవాళ్ళు ఓడిపోయారనో, నిరాహారదీక్షలకు కూర్చున్న ప్రజాప్రతినిధులు నిమ్మరసం తాగారనో, తాగలేదనో ప్రాణాలు నిష్కారణంగా తీసుకునే ధోరణులు సమాజంలో క్రమక్ర మంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిరు డు 1.22 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 14,224 మంది బలవన్మరణం పాలయ్యారు. స్వహననమే సమస్యలకు పరిష్కారం కాదు. విసుగుకీ ఓటమికీ ఉసురు తీసుకోవటం విరుగుడు కానేకాదు. జీవన సమరాంగణంలో యోధులుగా మారి ప్రతి అడుగూ  ఓ దీక్షా శిబిరంలా మార్చుకోవాలి. వడుపుగా  మలుపు తీసుకోవడం మరువనంత కాలం  మన ప్రయాణాన్ని ఏ వంకర టింకర మలుపూ ఆపలేదని తెలుసుకోవాలి. 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది... ' అనే పాట అర్ధం ఒంటపట్టించుకొంటే మంచిది.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27 - 12 -2009 న  ప్రచురితం ) 




గాంధేయమే గాండీవం - ఈనాడు - సంపాదకీయం

ఈనాడు - సంపాదకీయం


గాంధేయమే గాండీవం 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 02 - 10 - 2011  న  ప్రచురితం )


హాయిగా బతకమని దేవుడు భూమ్మీదకు పంపిస్తే- మనిషికే మనిషి అరి, నరుడికే నరుడు ఉరిగా మారిన కత్తులమారి కాలం ప్రస్తుతం నడుస్తోంది. 'జరతో, రుజతో ఎలాగూ ముంచుకొచ్చే మరణాన్ని మనిషి హింసావేశపాశాలతో మరింత ముందుకు నెట్టుకొచ్చుకుంటు న్నాడే! నరుడే నరకాసురుడుగా మారుతున్నాడే' అని ప్రజాకవి దాశరథి  నొచ్చుకున్నప్పటి దారుణ పరిస్థితులే నేడూ ఉన్నాయి. కంటికి కన్ను, పంటికి పన్ను అన్న వాదమే- ప్రపంచమంతా ప్రజ్వరిల్లే అగ్నికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోంది. దాయాదులతో యుద్ధమా, సంధా అనే సమాలోచనలు పాండవుల మధ్య రగిల్చింది పెద్ద రాద్ధాంతాన్నే. ' త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తమ్మన్నముం బెట్టి, రే/ చేటున్ వాటిల కున్కి కష్టపడి కాశీయాత్ర కంపించి, ర/చ్చోటన్ కొంపకు నిప్పు పెట్టి, రడవుల్ చుట్టించిరి' కౌరవులు - అని  తొలుత పాండవులు రోష పడ్డారు. చివరికి అయిదూళ్లయినా చాలు అని సరిపెట్టుకోవడమే మేలన్న వారి తీర్మానం వెనక ఉన్న  మర్మం అహింసే పరమ ధర్మమన్న సృష్టి సూత్రాన్ని విస్మరించకపోవడం . హింసామయ జీవనులను ధర్మ శాస్త్రజ్ఞులు ప్రశంసించారు. రాయంచపై దేవదత్తుడు చూపించిన క్రౌర్యాన్ని బుద్ధుడు కాకముందే సిద్ధార్థుడు నిరసించాడు. క్రౌంచ జంటను నిష్కారణంగా కిరాతుడు హింసించాడనే గదా బోయదశలోని వాల్మీకి ఎదలో అంత ఆవేదన రగిలింది! హింసకు హింసే సమా ధానం కానవసరం లేదు. నవ నందుల దానవ ప్రవృత్తికి ఆచార్య చాణక్యుని ప్రతిస్పందన- మౌర్య సామ్రాజ్య సువర్ణ పాలన.  అహింసా లతామతల్లి రక్కసి మూకల వికృత చర్యల సెగ తగిలి వసివాడినప్పు డల్లా పాదులు తీసి దయారసాలు చల్లి తిరిగి చివురులు పూయించిన ప్రేమమూర్తుల జాబితా చిన్నదేమీ కాదు.


ఈ అత్యంత విశాల ప్రపంచ వైద్యాలయంలో హింసాబద్ధులైన రోగులను ఉద్ధరించే వైద్యం సత్యాహింస శాంతి కారుణ్యాలనే చికిత్సా విధానమే- అంటాడు ఖలీల్ జిబ్రాన్. చర్మ చక్షువులతో తేరిపార చూడలేని కర్మసాక్షి.  ఉనికి కిరణరశ్మి స్పరానుభవం ద్వారా తెలివిడికొ స్తుంది. విశ్వ వైద్యనారాయణుల చేతిచలువ జీవికి అనుభవంలోకి తెచ్చేది ఆ కారుణ్య చికిత్సలతోనే అని నమ్మి ప్రబోధించిన క్రైస్తవ సాధువు ఫ్రాన్సిస్ . మరణశయ్య మీద ఉండీ, జీవితాంతం సేవచేసిన గార్దభానికీ కృతజ్ఞతలు చెప్పటం మరవని కరుణామయుడాయన. తోటి జీవాలపట్ల సద్భావనతో మనిషి మెలగాల్సిన తీరును, అవసరాన్ని లోకానికి చాటిచెప్పిన సాధుపుంగవులు దేశ కాల మతాలకు అతీతంగా ఎందరో ఉన్నారు. 'ప్రపంచానికి నేను కొత్తగా చెప్పే పాఠం ఏముంది... సత్యాహింస శాంతి సూత్రాలు హిమాలయాలంత సనాత నమైనవి. గంగా జలమంత పునీతమైనవి' అని మహాత్మాగాంధీ చెప్పు కోవడంలోని అంతరార్థమూ ఇదే. 'ఇంటికి నిప్పంటించిన కంటకులకైనా సరే... కంట కన్నీరును కోరుకోరాదు' - అనేది అజాత శత్రుతత్వం. దానిని  ప్రబోధం వరకే పరిమితం చేయకుండా నిజజీవితంలో అనుక్షణం ఆచరించి చూపించినందుకే గాంధీజీని నేటికీ ప్రపంచం గౌర వించేది. 'విష పాత్రమెత్తి త్రావెడి మహాయోగి కన్నులలో  తాండ వించిన యహింస/ హృదయేశ్వరిని వీడి కదలు ప్రేమతపస్వి బరువు చూపుల పొంగిపొరలు కరుణ/ సిలువపై నిండు గుండెలు గ్రుమ్మరించు దయామూర్తి నుదుట పారాడు శాంతి/ శిరసు వంచక స్వేచ్ఛ

చూపులు పొంగిపొరలు కరుణ/ స్వేచ్చ కొరకు  పోరాడు వీరాగ్రణి హృదయాన నలరు దీక్ష' ఏకమై జాతిజనం పూర్వ పుణ్యసంపత్తి ఫలంగా పోరుబందరులో పుత్తలీబాయి పొత్తిళ్లలో ఒత్తిగిలి నేటికి నిండు నూటనలభై రెండేళ్లు.


స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతున్న సమర రూపాలకు రక్తపాత రహితమనే క్రొంగొత్త సహన సిద్ధాంతాన్ని అద్ది గెలుపు మలుపులో సత్యాహింస శాంతియోధులను నిత్యం కాపుగా ఉంచిన సాహసి మోహన్ దాస్  గాంధీ. అగ్నితో అగ్ని ఆరిపోదు. చల్లబడాలంటే జలం చల్లక తప్పదు. కరుణ లేనినాడు ధరణి లేదు. కరుణలేని నరుడు వట్టి గడ్డిబొమ్మ- ఇది బుద్ధుని అష్టాంగ మార్గం. అదే భూలోక స్వర్గ సృష్టికి దగ్గరి దారన్న సులభ సూత్రం కనిపెట్టిన కర్మయోగి గాంధీజీ. శాస్త్రవేత్త ఐన్ స్టీన్ విస్తుపోయినట్లు 'కంటితో చూసి ఉండకపోతే కల్ప నేమోనన్నంత వింత'  బాపూజీ సత్యాహింసల జీవిత ప్రస్థానమంతా. పల్లెనుంచి ఢిల్లీదాకా దేశంలో గాంధీజీ పేరుతో ఊరో, నగరమో, రాస్తానో, చౌరస్తానో, వాహ్యాళి స్థలమో, వాహనాల స్థావరమో... కాన రాని చోటు లేదు.. సంతోషం. జేబులో తప్పనిసరిగా ఉండే కరెన్సీ నోటుమీదా ఆ బోసినవ్వుల బాపూజీ ప్రత్యక్షం.. మరీ సంతోషం. మానవ జీవితంలో బాపూజీ రూపం కేవలం ఆరాధ్యభావనకే పరిమితమా?! తాను విడిచివెళ్లిన చేతికర్ర, చెప్పుల జత, గడియారాలకు ఇస్తున్నపాటి విలువ- సిలువలేని ఆ యేసు ప్రవచించిన మానవ విలువలకు మనం ఇస్తున్నామా? బంతివంటి భూగోళాన్ని పంచుకో వడానికి పసిపిల్లలకన్నా మిన్నగా ఎన్ని విధ్వంసాలు? పచ్చ కాగితాల కట్టలకోసం కొట్లాడుకోవడాలు! ... విషాలు చిమ్ముకోవడాలు! ... మాన వతకే తలవంపులు! బాంబులతో లేచిన గోడలు చివరికి సమాధులుగా చరిత్రలో మారనిదెన్నడు? బాపూజీ శుభ జన్మదిన సంద ర్భాన్ని ప్రపంచ శాంతి, సహన దినంగా ఐక్యరాజ్య సమితి పరిగణిం చడం మొదలు పెట్టి ఇది అయిదోఏడు. మనిషి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల పోరాటానికి, సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన మానమ ర్యాదలు పొందాలనే ఆరాటానికి బాపూజీ చూపించిన శాంతి అహింసలే తిరుగులేని ఆయుధాలని మరింతగా ప్రచారానికి రావాల్సి ఉంది. మరెంతగానో ఆచరణకు నోచుకోవాల్సి ఉంది. కవి కృష్ణశాస్త్రి భావిం చిన విధంగా  'తన కంఠమున దాచి హాలాహలం/ తలనుంచి కురిపించి గంగాజలం/ మనిషి శివుడవటమే గాంధీ వరం' . హింసతో శివాలెత్తుతున్న నేటి విశ్వం సర్వం శివమయం కావాలని- ఈ బాపూజీ జన్మదిన పర్వంనాడు కోరుకోవాలి మనమందరం!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 02 - 10 - 2011  న  ప్రచురితం )

ఈనాడు - సంపాదకీయం దాతలే విధాతలు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 11 - 10 - 2009 న ప్రచురితం )

 ఈనాడు - సంపాదకీయం

దాతలే విధాతలు

 

రచనకర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - 11 - 10 - 2009   ప్రచురితం ) 


ఈనాడు - సంపాదకీయం

దాతలే విధాతలు 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 11 - 10 - 2009 న  ప్రచురితం ) 




కల్పాంతంలో ప్రళయం సంభవించి సర్వం జలమయమైపోయి

ద్వాదశ సూర్యులు, కొత్త చంద్రులూ ఉదయించడాన్ని మత్యపురాణం మహాద్భుతంగా వర్ణించింది. యోగనిద్రనుంచి లేచిన పరబ్రహ్మ పునః సృష్టికోసం నీటిని మధించి రెండు బుడగలను సృష్టిస్తే అందులో ఒకటి ఆకాశం, రెండోది భూమి! ఎన్ని అవాంతరాలొచ్చిపడినా సృష్టి క్రమం ఆగదనే ఆశావాదం వరకు ఈ కథ నీతిసారాన్ని  తీసుకోవాలి. వేళకు వర్షాలు పడి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఏటా గోపా లురు ఇంద్రపూజ చేసేవారు. ఆ యేడు కృష్ణయ్య మాట విని గోవర్ధ నగిరిని కొలిచినందుకు దేవరాజు కోపించి వ్రేపల్లెపైన  విపరీతమైన వానలు కురిపించాడు. అప్పుడుకూడా ఇప్పుడు మొన్న మనరాష్ట్రంలోని అరుజిల్లాల జనం ' నిడు జడిదాకి యెందు జననేరక యాకట గ్రుస్సి' నట్లు అల్లాడారని ఎర్రన హరివంశంలో వర్ణిస్తాడు. 'యింతలోన జగ ముల్ పోజేసెనో, ధాతయెయ్యది, దిక్కెక్కడ, సొత్తు యెవ్విధమునం బ్రాణంబు రక్షించుకోలొదవున్... దైవమ!' అంటూ సర్వం కోల్పోయి నిర్వాసితులైన ఆబాలగోపాలాన్ని ఆ బాలగోపాలుడు గిరినెత్తి ఉద్ధరిం చినట్లు- ఇప్పుడూ మంచిగంధం వంటి మనసున్న మారాజులు అదు. కునేందుకు ముందుకు దూసుకొస్తున్నారు. ఆనందమే. అదికాదు ఇప్పటి అసలు సమస్య'- 'అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం, పావనం, శుభకరమ్' అని మనం కొలిచే గంగమ్మ ఇంతగా గంగవెర్రులెత్తిపోవటానికి వెనకున్న అసలు కారణా లేమిటనేదే సందేహం. అత్త ఏదో నింద వేసిందని అలిగి 'వనము లను దాటి/ వెన్నెల బయలుదాటి/ తోగులను దాటి/ దుర్గమాద్రులను దాటి/ పులుల యడుగుల నడుగుల కలుపుకొనుచు పథాంతరాల మీదికి వరదలుగా పారింద' ని  చెప్పుకు  సర్దుకుపోయేందుకు  ఇదేమీ విశ్వనాథవారి 'కిన్నెరసాని' కథ కాదు కదా!


వరద అంటే వారు వర్ష్యం చూసుకుని వచ్చి పలకరించి పోయే చుట్టంకాదు. కరకట్ట తెగిందంటే బడినీ, గుడినీ, పంచాయతీ కార్యాల యాన్నీ, గొడ్డునూ గోదనూ, గడ్డివాములనూ, గాదె కింద  దాచిన గింజనూ, బావినీళ్ళనూ, మంచాలనూ , కంచాలనూ,  ఏమరుపాటుతో ఉంటే చంటిపిల్లలనూ , మూడుకాళ్ళ ముదుసళ్లనూ  ముంచేసిపోతుంది. బందిపోటులాగా నీటిపోటు మనింటి కప్పమీదకే మనల్ని గెంటే స్తుంది. సొంతూరి పొలిమేరలనుంచే మనల్ని తరిమేస్తుంది. కంటి ముందే ఇంటిగోడలు నీటిలో పడి కరిగిపోతుంటే, ఒంటి రక్తాన్ని చెమ టగా మార్చి పెంచుకున్న పంటచేను ఏడడుగుల నీటి అడుగున ఎక్క డుందో జాడతెలియని దుర్భర దుస్థితి। ఓ ఆధునిక కవి ఆవేదన పడినట్లు 'చుట్టూతా ఉప్పు సముద్రం... మనస్సులోనూ దుఃఖసముద్రం.. జీవనాన్నే మింగేసే జీవనది . అక్కడెక్కడో ఆనకట్టలు పగిలాయో లేదోగానీ ముందిక్కడ మనిషి గుండె ముక్కలైంది'. నిజం. చంటి బిడ్డతో ఇంటి పైకప్పు మీదికెక్కి కూర్చున్న ఇంటిఇల్లాలు, మిట్టమీద కట్టు బట్టలతో నిలువు గుడ్లేసుకుని నిలబడ్డ సంసారి, నడిరేవులో తిరగబడ్డ  పడవ కొయ్యను పట్టుకు వేలాడే గంగపుత్రుడు , నిలువుదోపిడికి నిలువుటద్దంగా నిలబడిన ఆ వ్యధార్తుల అందరి గుండెల్లోనూ ఇప్పుడు అంతులేని విషాదం. ' ఈ సర్వనాశనానికి అసలైన కారణం ఒక్క టే. చెకోవ్ చెప్పినట్లు 'విచక్షణ, సృజన ఉండి కూడా మనిషి ప్రకృతిని వికృతం చేయపూనుకోవటమే' ! విపత్తు దాపురించాక కనీస మానవతా ధర్మంగా ఇప్పుడు ఔదార్యం వరదలెత్తాలి. లోకంలో మనుషులు రకరకాలు. రెండు చేతులతో దోచుకుని దాచుకునేవారున్నట్లే ..  దాచుకున్న దాన్ని రెండుచేతులా దోచిపెట్టేవారూ ఉన్నారు. అలాంటివారి అవసరమే ఇప్పుడెక్కువ.  


బాధిత హృదయాలకు దానం చేసేవాళ్లు అమరత్వాన్ని పొందుతారంటుంది రుగ్వేదం. దీర్ఘాయుష్షుకోసం మైకేల్ జాక్సన్ లాగా  ప్రత్యేకంగా ప్రాణవాయువు గది కట్టించుకోనక్కర్లేదు. బిల్ గేట్స్ మాదిరి బిలియన్సు పెట్టి బీదా బిక్కీ అందరికీ సేవచేసే స్తోమతు  అందరికీ ఉండదు. దిక్కు మొక్కూ లేని వాడికొక్క పూట డొక్కనిండా తిండిపెడితే చాలు- వాడి కడుపు నిండిన త్రేనుపే  మనకు దీర్ఘాయుష్మాన్ భవ' అనే దీవెన .  వంద ఉంటే పది, పది ఉంటే ఒక్క రూపాయి.. అదీ  లేకుంటే, ఆదరంగా ఒక చిరునవ్వు, అవసరమైనప్పుడు ఓ ఓదార్పు మనస్ఫూర్తిగా ఓ పలకరింపు... ఏదైనాసరే ఆ సమయానికి అవసరమనిపించే, మన తాహ తుకు మించని చేయూత ఇచ్చి చూడు.  ఇచ్చుటలో ఉన్న ఆ హాయి ఎంత వెచ్చంగా ఉంటుందో తెలిసి వస్తుంది.  ప్రేమ అనేది దేశ కాలా లకు అతీతంగా కాసే పండు. ఎవరైనా కోసుకోవచ్చు. ఎంతమందికైనా పంచవచ్చు. పంచేకొద్దీ పెరిగేది. పంచదారకన్నా మధురమైనది అవసరానికెవరికైనా ఆదుకోవాలనుకునే ఉదారభావన అంటారు మదర్ థెరెసా.  ఎవరికీ ఏమీ కాకుండా పెరిగి వెళ్లిపోవటానికి మించి  పెనువిషాదం మనిషి జీవితంలో మరేది ఉండదు. దానంవల్ల ఎవరూ. దరిద్రుడు కాడు,  పర్పు ఖాళీ అయినకొద్దీ మనసు ఆనందంతో నిండిపోతుంది. నీటిని దాచుకునే  సముద్రంకన్నా దానం చేసే మేఘాలే  ఎప్పుడూ ఎత్తులో ఉంటాయి. దానగుణంగల వృక్షం పండ్లు ఇవ్వలేని వేసవిలోనూ నీడనిచ్చి తృప్తిపడుతుంది. స్వయం ప్రకాశం లేకపోయినా సూర్యకిరణాలను వెన్నెల వలె పంచే చంద్రుడిని అందరూ ప్రేమగా చందమామా అని పిలుచుకుంటారు. అడవిలో, యుద్ధంలో, నిద్రలో, నీటిలో, నిప్పుమీద, ఒంటరితనంలో ఒంటిమీద స్పృహలేనప్పుడూ. పుణ్యమే మనల్ని రక్షిస్తుందని అధర్వణవేదం చెబుతుంది. పరోపకారానికి మించిన పుణ్యం లేదంటుంది పంచతంత్రం. ఈ చేత్తో సంపాదించి  ఆ చేత్తో ఇవ్వడానికేగా దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చింది? 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 11 - 10- 2009 న  ప్రచురితం ) 


ఈనాడు - సంపాదకీయం కళ్యాణమస్తు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 08 - 11 - 2009 న ప్రచురితం )

 


ఈనాడు - సంపాదకీయం


కళ్యాణమస్తు 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 08 - 11 - 2009 న  ప్రచురితం ) 


వివాహమనేది ప్రతి మనిషి జీవితంలో తప్పక జరగాల్సిన శుభకార్యం. వహ్ అంటే పొందటం- వివాహ్ అంటే విశిష్టంగా పొందటమని అర్థం. వధూవరులకు వంశాభివృద్ధి, పితృదేవతలకు రుణ విముక్తి, పిల్లనిచ్చినవారికి బ్రహ్మలోకప్రాప్తి ఏకకాలంలో సిద్ధింపజేసేదే కల్యాణం. 'బాటసారి, బ్రహ్మచారి, యోగి, గురువు, విద్యార్థి, పోషకుడు, ఏపనీలేని బిచ్చగాడనే ఏడు రకాల పక్షులకు గృహస్థుడనే మహా వృక్షమే జీవనాధారం. కనుక కల్యాణం లోకకల్యాణం కోసమనీ అను కోవాలి' అని చెబుతోంది మనుస్మృతి. లోకం ఎంతగా మారిపోతున్నా. దేశ కాలాలకు అతీతంగా సర్వమతాలు పెళ్ళిని ఒక ధర్మసూత్రంగా సమ్మతిస్తున్నాయంటే అసలు కారణం దీని వెనుకున్న క్రమశిక్షణే' అంటాడు వెస్టర్ మార్క్  అనే సామాజిక శాస్త్రవేత్త తన ' హిస్టరీ ఆఫ్ మ్యారేజ్' గ్రంథంలో.  మనువు కోసం ఓపికున్నంత వరకు ఓ కన్య కొట్టే కొరడా దెబ్బలను సహించే ఈజిప్టు దేశ పాతకాలపు ఆచారం నుంచి మగతోడు కోసం రాఖీసావంత్ వంటి  తారలు టీవీల సాక్షిగా స్వయంవరాలు నిర్వహించుకుంటున్న ఈకాలం దాకా పెళ్ళి కళ నానా టికీ పెరుగుతూనే ఉంది. పెళ్ళి వట్టి రెండక్షరాల పదం మాత్రమే కాదు... రెండు నిండు జీవితాలను ఒక పథాన నడిపించే అందమైన బంధం కూడా . సీతారాముల కల్యాణాన్ని ఏటేటా వైభోగంగా జరుపుకుని మనం మురిసిపోతున్నాం. తిరుమలేశుడి కల్యాణోత్సవాలు సరే సరి. ' భారతీయతకు కుటుంబం పునాది. కుటుంబానికి వివాహం నాంది' అని నాగరిక సమాజం నమ్ముతున్నది కనకనే మనిషి జీవితంలో పెళ్ళికి పెద్దపేట పడింది.


యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం వివాహాలు ఎనిమిది విధాలు. ఇప్పుడు మనం ఆచరిస్తున్న ప్రాజాపత్య సంప్రదాయంలోని 35 కాండలు కాలానుగుణంగా అవసరార్ధం పద్నాలుగుకు కుదించుకు పోయాయి. ఏడు రోజులు ఘనంగా జరిగే కల్యాణ మహోత్సవాలు క్రమంగా ఒక్కరోజులో ముగించే ముచ్చటగా మారిపోయాయి. ఒక్క పూటయినా, గంటయినా పెళ్ళంటే వెళ్ళే .. నూరేళ్ళపంటే! పరస్పరం వరించుకోవటం వరకే పిల్లల వంతు. నిశ్చితార్థం నుంచి అప్పగింతల దాకా నిర్వహించటం పెద్దల తంతు. ప్రాచీన ఆర్ష సంప్రదాయం ప్రకారం జరిగే వివాహపర్వంలోని ప్రతిఘట్టానికి ఓ ప్రత్యేక ప్రయో జనం ఉంది. కాశీయాత్రకని బయలుదేరిన బ్రహ్మచారిని కాబోయే బావమరిది సోదరినిచ్చి పెళ్ళిచేస్తామని వేదిక మీదకు తోడ్కొని రావటం, ఎదురుకోలు, వరాగమనం, మధుపర్కాలంటూ వీడియో వెలుగుజిలుగుల్లో హడావుడిగా సాగిపోయే ప్రతి తంతు వెనక ఉన్న అంతరార్ధం తీరికున్న వారు తరచి చూసుకుంటే అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. 'ధర్మేచ, అర్థేచ, కామేచ ఏషా నాతిచరామి' అంటూ ఆ వరుడు స్వయంగా ప్రమాణం చేయటమే కాకుండా సహచరి చేత కూడా సర్వదేవతల సాక్షిగా ప్రతిజ్ఞ చేయించడం హిందూ వివాహ పద్ధతి . శుభఘడియ వేళ వధూవరులిద్దరూ ముసిముసి నవ్వులతో తెరమరుగునుంచే ఒకరి శిరస్సుమీద ఒకరు జీలకర్ర-బెల్లం మిశ్రమాన్ని అద్దుకునే ఆ అపురూప దృశ్యం మరే ఇతర వివాహ పద్ధతుల్లోనూ లేదు. ' వధువు కాలివేళ్ళకు వరుడు వెండి మట్టెలు తొడిగి అగ్నిచుట్టూ ఏడు అడుగులు నడిపించుకుని పోయే సప్తపది' అత్యంత ప్రాధాన్యం గల ఘట్టం. నాతో ఏడడుగులు నడిచి నాకు స్నేహితురాలివయ్యావు. బాహ్యేంద్రియాల వినియోగంలోని అన్ని నియమాలను కలిసిమెలిసే ఆచరించుకుందాం' అనే ఈ పెళ్ళినాటి ప్రమాణాల్నే జీవితాంతం నిజాయతీతో ఆచరించటంలోని మన భారతీయుల నిబద్ధతే ప్రపంచజాతులలో మనల్ని గౌరవస్థానంలో నిలబెట్టింది.


మహాకవి కాళిదాసంతటివాడు కూడా ఆదిదంపతులను ప్రార్థించే వేళ 'వాక్కు , అర్ధంలాగా కలిసి ఉన్న పార్వతీ పరమేశ్వరులకు ప్రమాణం' అన్నాడు. పెళ్ళిలో మగవాడికి బేచిలర్ డిగ్రీపోయిందా... స్త్రీకి  మాస్టర్ డిగ్రీ వచ్చిందా .. అనే వాదన వినోదం వరకు పరిమితం చేసుకుని- ఇంటా బైటా జంట కవులవలె అంటుకు తిరుగుతూ కంటి పాపలుగ చంటి పాపలను కని మంచి పౌరులుగా పెంచితేనే ఆ జంట జీవితం పండేది! 


మాతృస్వామ్యంలోనైనా, పితృస్వామ్యంలోనైనా, ప్రజాస్వామ్యంలోనైనా చల్లని సంసారానికి కావలసింది భార్యాభర్తల సమభాగస్వామ్యమే అనే ప్రధానమైన విషయం విస్మరిస్తే  విశ్వకవి ఠాగూర్ ఓ సందర్భంలో చెప్పినట్లు సంసారం నిజంగానే ' కనపడని ఇనుముతో చేసిన పంజరంలాగా మారిపోతుంది 'నీ ఆ హృదయం నాది .. నా ఈ హృదయం నీది కావాలి' అని వరుడు వివాహసందర్భంలో  వధువు  ఎదురు ఎదమీద చేయి పెట్టి ఓ ఘట్టంలో పలికే మంత్రం అంతరార్ధం మనసుకు పట్టించుకుంటే ఆ సంసారం పూల రథంలాగా సాగిపోతుంది. ' పెళ్ళిళ్లు స్వర్గంలోనే జరిగినా భూమ్మీద బ్రహ్మాండంగా విజయవంతమవుతాయి' అని చాటాలంటే ' మేడ్ ఫర్ ఈచ్ ఆదర్' లాగా లోకానికి ఆదర్శంగా మెలగాలి. అలాంటి కల్యాణమే మస్తు అలాంటి జంటలకే కల్యాణమస్తు.  దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అయినట్లు అలాంటి వారందరి పెళ్ళికి తానే పెద్దగా మారి ఈ మధ్య ఏడుకొండలవాడు సామూహికంగా చేయించిన వందలాది కల్యాణాలకు శుభమస్తు,


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 08 - 11 - 2009 న  ప్రచురితం ) 

ఈనాడు - సంపాదకీయం ఆటపాటల చదువు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 27 - 11 - 2011 న ప్రచురితం )

ఈనాడు - సంపాదకీయం 

ఆటపాటల చదువు 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 27 - 11 - 2011 న ప్రచురితం ) 



బాల్యమంటే స్వేచ్చగా గాలికెగిరే పతంగం. జేబునిండా గోలీలు, చేతిలో గోటీబిళ్లలు, మోకాలిచిప్పల దోకుళ్లు.. ఇవేమీ లేకుండా గడిచి పోతే కౌమారం వృథా అయినట్లే. బాలగోపాలుడి క్రీడావిలాసాన్ని భాగవతంలో పోతన మహాద్భుతంగా వర్ణించారు. చిరుమూరి గంగ 'రాజు 'కుశలవోపాఖ్యానం'లో శ్లాఘించినట్లు 'మణిమయంబైన మాయా కురంగంబు గడగి జంపిన' లాఘవం రాఘవుడికి అబ్బింది బాల్యద శలో ఆడిపాడిన ఆటల పాటవంతోనే ! చదువు అంటే తాళపత్ర గ్రంథాలు  ముందేసుకుని కూర్చోవడమొక్కటే కాదు. తరిగొప్పుల మల్లన 'చంద్ర భాను చరిత్ర'  ప్రకారం శ్రీకృష్ణుడంతటి ఆచార్యుడే కుమారులకు నార దులవారిచే నిరుపమాన విపంచిక రాగ సాధనలో శిక్షణ ఇప్పించాడు. శాతవాహనుల కాలంనుంచీ భారతీయులు క్రీడల్లో పారంగతులే. గాథా సప్తశతే దీనికి ప్రబలమైన సాక్ష్యం. చాళుక్య సోమేశ్వరుడి 'మానసోల్లాసం'లో ఏనుగులకు మదమెక్కించి కయ్యానికి కాలు దువ్వించే 'గజవినోదం' ఓ రాచవిద్య.  పులులను కోలతో కొట్టి కవ్వించడం, బుసకొట్టే విషనాగులను కాలరాయడం, సివంగుల జూలును ఊడలుగా చేసి ఉయ్యాలలూగడం- భారతంలో ఎర్రన వర్ణించిన ఆటవిడుపు రాచక్రీ డలు. సహస్రాబ్ది కిందట చదరంగం భారతీయుల విద్యావిధానంలో ఒక భాగం. ఆడబిడ్డను అత్తవారింటికి సాగనంపే సందర్భంలో 'జాల వల్లికలు, పలు మానికముల చదరంగంబులు' సారెతో సర్దిపెట్టి పంపించే సదాచారాన్ని సంకుసాల నరసయ్య ఓ కావ్యంలో చక్కగా వివరించాడు. చిన్ననాట పట్టుబడ్డ చదరంగ ప్రజ్ఞే బొడ్డుచర్ల తిమ్మనకు రాయలవారినుంచి కొప్పోలు అగ్రహారం సాధించిపెట్టిందని  చరిత్ర చెబుతోంది. మనిషి సాంఘిక జీవనంలో ఆటపాటల పాత్ర ముఖ్యమై నది. మరీ కీలకం- మెదడు, మనసు చురుగ్గా ఎదగాల్సిన పసిదశలో. దేశకాల పరిస్థితులను విపరీతంగా ప్రభావితం చేసే వారసత్వ క్రీడాసంపదను కాదని కాలదన్నుకోవడం జాతికి కీడు వాటిల్లజేసేదే!  


వాఙ్మయం లాగే క్రీడలూ జాతి జీవితపు సాంస్కృతిక ప్రతిబిం బాలు. 'వాఙ్మయం  వాగ్రూప ప్రకటన విశేషమైతే, ఆటలు వాటి బాహ్య ప్రతిక్రియా రూపాలు' అంటారు బాలసాహిత్యంలో పరిశోధ నలు సాగించిన డాక్టర్ తిమ్మావజ్ఝల కోదండ రామయ్య. కామ 'సూత్రం' వంటి కావ్యశాస్త్రంలో సైతం వాత్సాయనుడు సందర్భం చూసుకొని మరీ కోడిపందేలు, పొట్టేళ్ల పందేల ప్రస్తావన తీసుకొస్తాడు. నన్నె చోడుడు కుమారసంభవంలో బాలికలచేత బొమ్మల పెళ్ళి ఆట  అంగ రంగ వైభోగంగా జరిపించాడు. పాతకాలపు వీధిబళ్లలో పిల్లలు ఆడుకునేందుకు  ప్రత్యేకంగా కొంత సమయమంటూ కేటాయించే ఆటవి డుపు విధానం ఉండేది. పాల్కురికి సోమనాథుడు ఆ నాటికి ప్రచా రంలో ఉన్న పొందంగ రాగుంజ పోగుంజలాట, కుందెన గుడిగుడి గుంచంబులాట, అప్పల విందుల యాట, చిట్లపొట్లాట, గోరెంతలాట, దాగుడుమూతలాట' లంటూ ఆటపాటలను ఎన్నింటినో ఏకరువు పెట్టాడు . తెలుగునాట వెలసిన బౌద్ధ హిందూ క్షేత్రాలలో  సైతం శిల్పాల మీద అచ్చనగుంటలు, ఆరింకి, అందలాలు, ఈలకూతలు, ఉప్పెనప ట్టెలు, ఓమన గుంటలవంటి ఇంటిపట్టున ఉండి ఆడుకునే ఆటలు అత్యంత మనోహరంగా చిత్రితమయ్యాయి. సంప్రదాయానికి ఆటపట్టుగా  భావించే పల్లెపట్టునా పట్టుమని ఆనాటి ఒక్క ఆటా నిలిచి ఉండకపోవడమే నేటి విద్యావిధానంలోని ప్రధాన విషాదం. నేటి తరానికి పరమ మొరటు అయిపోయాయి నాటి చెడుగుడులు, దాగుడు మూతలు వంటి పిల్లలాడుకునే ఆటలు!


'ఆటలు కూడు పెట్టవు' అని పెద్దల తిరస్కారం . గిల్లిదండ ఆడితే చిల్లిగవ్వకు కొరగారా? బాల్యంలో ఆ ఆట ఇష్టంగా ఆడిన ' పి. వి '  ఇంత పెద్ద దేశానికి ప్రధాని అయ్యారే! ఈదుబావిలో ఆడితే అక్షరమ్ముక్క అంటుకోదా? అదే నిజమైతే చలనచిత్ర దర్శకులు 'రే' కు  ఆస్కార్ వచ్చే ఆస్కారమే లేకుండా పోయేది! చదువులో ఆటలూ అంతర్భాగమే. ' కోతికొమ్మచ్చులో కోటగోడల కెగ/ బ్రాకి లంఘించు చంక్రమణ  మెరిగి తెలుగులంతపై యవి నేర్చుకొన్నా'రని 'వేంగీక్షేత్రము'లో విశ్వనాథ అంతటివారి వాదన. ఆటపాటల్లోనే చదువు సంధ్యలు ఇమిడి ఉంటాయి. 'రూకల నిచ్చెద మేకలు కాయి/ బెబ్బులి వస్తే బెదరవుగా' అంటూ కంటిమీద గుప్పుమని ఊదడం- బిడ్డను హఠాత్తుగా వచ్చిపడే ప్రమాదానికి అప్రమత్తం చేసే తర్ఫీదు. ' చెన్నాపట్నం చెరుకు ముక్కా/ నీకో ముక్కా నాకోముక్కా/ భీమునిపట్నం బిందెలజోడు/ నీకోబిందె నాకోబిందె' అంటూ పాపలు ఆడిపాడుతున్నారంటే- అందుబాటులో ఉన్నదంతా అందరితో ఆనందంగా పంచుకోవడం నేర్చుకుంటున్నారనే అర్థం. 'ఒక్కాయ ఒక్క రెక్కాయరెట్టి ముక్కాయ మువ్వ నక్కాయ నంది' అంటూ బుడతడు గోళీలు గురిపెడుతున్నప్పుడే అంకెలు గుక్క పెడుతున్నట్లు లెక్క.  'ఉగ్గుబాలతో రంగరించి బొడ్డుకోయని కూనకే తెలుగు తల్లులు మున్ను' అఆఇఈలతోపాటు ఆటపాటలు నేర్పిన పెద్ద క్రీడాస్థలి మనది. 'చదువుల పరమపద సోపాన పటంలో పంటగడి అంటే- ఏ అమెరికాకో ఎగిరిపోవడమే' అన్నట్లు, నడవడమే ప్రస్తుతం విద్యావిధానంలోని పెద్ద లోపం. ఆటపాటల ఊసేలేని  పాఠశాలలు పసిమనసుల పాలిట చెరసాలలు, పరీక్షలు, మార్కుల పోటీలు తప్ప మరో ధ్యాసే లేని చదువులు- చిన్నారులకు పెద్ద బాల'శిక్ష'లు . పోటీ ప్రపంచంలోని ఆటుపోటులను తట్టుకోవాలంటే ఆటపాటలు అత్యవ సరం. క్రీడలే లేనిచోట క్రీడాస్పూర్తి అలవడేది ఎలా? గెలుపు ఓటములను సరిసమానంగా స్వీకరించగల మనస్తత్వాన్ని సానబెట్టే సాధనా క్షేత్రాలు  ఆట స్థలాలే. అక్షరం నేర్పజాలని చొరవ, చురుకుదనం బాలలకు దొరికేవి ఈ బహిరంగ పాఠశాలలలోనే.  పాఠ్య ప్రణాళికలో ఆటలను సైతు అంతర్భాగం చేయాలన్న సద్బుద్ధి ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికైనా కలగడం బాలల అదృష్టం.


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 27 - 11 - 2011 న ప్రచురితం ) 


ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - హాస్యం వైద్యో నారాయణో హరిః - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం - 25-09-2002 )

 



ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - హాస్యం 

వైద్యో నారాయణో హరిః 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం - 25-09-2002 ) 


' సుగుణసుందరి కథ ' అనే సినిమాలో రాజ వైద్యుడు ' కంగారుపడకండి మహారాజా! కాలు చల్లంగానే కోసేస్తాగా' అంటూ దర్జాగా మెడికల్ కామెడీ చేస్తాడు. చావు కబురయినా అలాగా చల్లంగానే చెప్పాలన్న రూలీ రోజుల్లో చాలామంది వైద్యులకు పాటించే పాటి ఓపికా , తీరికా రెండూ లేవు. కాబట్టే  పేషెంటుని చూడంగానే పేషెన్సు పోయి, గర్భసంచీకి బదులు మూత్రసంచిని కుట్టేస్తుంటారు ఈమధ్య  తాండూరు మండలాసుపత్రిలో జరిగిన చోద్యంలాగా. 


 చరకుడికి కూడా కొరుకుడు పడని ఈ తాండూరు తరహా వైద్యాలు పట్టా పుచ్చుకున్న  డాక్టరే కాదు. పట్టాకత్తి పుచ్చుకున్న ప్రతివాడూ చేస్తున్నాడు.  కాబట్టే గవర్నమెంటాస్పటళ్ళు మెంటలాసుపత్రులకన్నా గజీ'బిజీ' గా ఉంటున్నాయంటున్నారందరూ! 


'గవర్నమెంటు జీతాలూ బిజీ ప్రాక్టీసు. . రెండూ వుంటాయి కనక అలాగే గజీబిజీగా ఉండుంటాయిలే అని సర్దుకోక తప్పదు . 


 ఒక జీవి ప్రాణం పోయి సరాసరి స్వరానికి చేరిందట.  గేటు కాపలా వాడు చిట్టా చూసుకుని - ఠాఠ్‌! నీ పేరు ఇందులో లేదు. పొమ్మన్నాట్ట. నరకంలోనూ అదే వరస.  ' అటు స్వర్గానికి పోలేక ..  ఇటు నరకానికి రానీయకపోతే  ఎలా చావాలిరా దేవుడా! ' అని ఆ జీవి బావురుమంటుంటే జాలేసి  చిత్రగుప్తులవారే స్వయంగా చిట్టా అటూఇటూ తిరగేసి ' అదీ  సంగతి. ఈ జీవింకా పదేళ్ళు బతకాల్సివుంది.  తాండూరుటైపు ధర్మాసుపత్రి నైఫుకు బలయిపోయాడులాగుంది . వైద్యులు  తొందరపడి ముందే పైకి పంపించేశారు ' అని తేల్చేశారుట. 


సర్కారీ దవాఖానాలకు  బందిఖానాలకు తేడా  వుండవు  కనకనే, ప్రజాకవి ఒకాయన ' అమ్మా !  నేపోనే సర్కారు దవాఖానకు' అంటూ మొత్తుకున్నాడు. పెద్దవాళ్ళకు సత్కారాలు. పేదవాడికి ఛీత్కారాలు దొరికే చోటు గవర్నమెంటాస్పతాలు. 


నిర్లక్ష్యం, అశ్రద్ధ, అవినీతి ఆజ్ఞానం మూర్తీభవించిన ప్రభుత్వాసుపత్రులు ముందు స్వయంచికిత్సకు మందులు తామే వాడితే మంచిది. ధర్మాసుపత్రుల్లోని యమధర్మరాజు తమ్ముళ్ళకు భయపడబట్టే  బతకా లనుకొనే ప్రతివాడూ అప్పో చేసైనా అప్పోలో తరహా ఆసుపత్రులకు వెళుతున్నాడు. 


అక్కడా వైద్యం శుభ్రంగా వుంటుందనుకానాటం  భ్రమే సుమా!  తాటాకు కట్టలు చంకలో పెట్టుకుని మాత్రలకు బదులు మాటలమ్ముకొనే పాతకాలం భిషక్కుల భేషజమే తప్ప వైద్యం ఒక సేవనే ప్రాథమిక సూత్రాన్నే కన్వీనియంటుగా  మరిచిపోయారక్కడ.  రొంటిలో  రొక్కముంటేనే వంటిమీద వేలేసే 'ధన్వం ' తురులు దండిగా వుండే చోటిది. పల్స్ ను  బట్టి కాక పర్స్ ను  బట్టి వుంటుంది ట్రీట్ మెంట్ . మందులకోసం రోగాలు పుడతాయి క్కడ.  డయాగ్నిస్టిక్ సెంటర్లూ, మందుల షాపులూ, క్లినిక్కులూ కలిసాడే చెమ్మా చెక్కాటలో ముక్కలు చెక్కలయ్యేది సామా న్యుడి హెల్తూ, వెల్తూనే! 


 కరెంటు మీటర్ రీడింగ్  కోసం వచ్చేవాడెంటరైనా  వదిలిపెట్ట కుండా కాలుక్కట్టుకట్టి కూర్చోబెట్టే కక్కుర్తిగా ళ్ళనుండి..  జలుబుకు మందులేదని జబ్బును నిమోనియాదాకా ముదరబెట్టి డబ్బులు గుంజే డాబురాయుళ్ళదాకా దర్జాగా టక్కులూ, టైలా  కట్టుకుని హైటెక్కు లెవల్లో టెక్కులు పోతుంటారిక్కడ . 


 'గుండె ఆపరేషన్ చేయించుకుంటే గుండిగలకొద్దీ బంగారం... కిడ్నీలు రెండు కోయించుకుంటే సిడ్నీదాకా టూరుచితం' అంటూ ఊదరగొట్టే వైద్యకోవిదులకిక్కడ కొదవే ఉండదు. 


నిజమే సుమా నాకామధ్య వంట్లో నల తగా వుంటే మందులు కొందామని మెడి కల్ షాపుకెళ్ళాను. ప్రిస్క్రిప్షన్ చూసి షాపు వాడిచ్చిన మందులు వాడిన వారం తరువాతగానీ నా తప్పు తెలిసింది కాదు. షాపులో నేను చూపించింది ప్రిస్క్రిప్షనే కాదు.  మా డాటర్  లెటర్ పేడ్  మీద  మా ఆవిడ రాసుకున్న చాకలి పద్దు.  డాటరు డాక్టరు కావడం కాదు  చిత్రం . చీటీ చూసి మెడికల్ షాపు వాడిచ్చిన  మందులకి కడుపునొప్పి  తగ్గడమే  విచిత్రం. 


కంటినొప్పికి మందేస్తే తుంటినొప్పి తగ్గిందంటారు అందుకే. 

లక్ష్మణస్వామి కోమాలోకి పోయినప్పుడు హనుమంతులవారినలా అనవసరంగా అంత దూరం సంజీవని  కోసం పంపించారు. కానీ, ఏ మెడికల్ షాపు వాడినడిగినా మెరికల్లాంటి జెనరిక్ లిచ్చుండే  వాడు కదా ! 


అమెరికాని  మించిన మిరకల్ వైద్యం చేసే మెరికలు  ఇక్కడ   ఉన్నారు. కానీ , రోగులెక్కడ వినియోగుల ఫోరాలకు పోతారోనని చిన్నాపరేషన్ చెయ్యటానికైనా పాపం.. పరేషానైపోతున్నారీమధ్య.  


పట్టపగలే పట్టపగ్గాల్లేకుండా ప్రాణాలతో చెలగాటాలాడే  వైద్య పట్టభద్రులకు  ఎవరూ పగ్గాలెయ్యకనే  రోగులపాలిటి వీరభద్రులై పోతున్నారు. 


అందరూ అలాగే ఉంటారని కాదు. స్వయంగా వికలాంగుడై ఉండీ పేదలకు చవగ్గా ప్లాస్టిక్ సర్జరీలు చేసే జోషీగారి లాంటి వైద్యనారాయణులూ  వుంటారు. 


పైసలకోసంకాకుండా  ఉదారంగా వైద్యంచేసే ఉదాత్తులు ఊరికింకా ఇద్దరో, ముగ్గురో  మిగిలున్నారు .. ముదావహం . ప్రాణదాతలను  సమాజం దైవదూతలుగా భావించి గౌరవించడానికి వీరే కారణం. 


' వైద్యోనారాయణోహరిః' అంటే వైద్యుడు నారాయణుడని  ! హరీమని పించగలవాడని కాదు అర్ధం!  'స్రవంతి' అనే మెడికోకి వైద్య ఖర్చులకోసం ప్రజాస్రవంతి  స్పందించిన తీరు ఆపూర్వం.  ప్రాణదాతకు  ప్రాణదానం చేసిన ప్రజలను వైద్యులు వ్యాపారంలో  పావులుగా మార్చడమే విషాదం!


సీత బాధలు సీతవి. పీత బాధలు పీతవి . లక్షలు ఖర్చుపెట్టి లక్షణంగా సంపాదించుకున్న పట్టాలను పట్టించుకోక. . ఆలోపతి హోమియోపతి నేచురోపతి అంటేనే తెలియనివాళ్ళను పరపతి వుంది గదా అని వైద్యశాఖలకధిపతులుగా చేస్తే పరిస్థితులు ఇలాగే  వికటిస్తుంటాయని మేధావుల  వేదన. 


 సినిమా థియేటర్లు తప్ప ఆపరేషన్ థియేటర్లు జీవితంలో ఒక్కసారైనా  చూడని వాడిని వైద్యులకు పైవాడిగా వేస్తే ప్రయోజనమేముంటుంది? 

చాలీచాలని సిబ్బంది, అరకొరా పరికరాలు,  పాతకాలపు పద్ధతులు, కింద నుండి వేధింపులు, పైనుండి కక్ష సాధింపులు , పోటీ ఒత్తిడి .. వీటిమధ్య నిజాయతీగల ఏ వైద్యుడికయినా  నిఖార్సయిన వైద్యం చేయటమసాధ్యమన్న వైద్యుల వాదనలో నూరు శాతం నిజముంది. 


నిజమే. గవర్నమెంటంటే గడియకో జి.వోను  ప్రకటించటమే కాదు. బక్క జీవులను పట్టించుకోవటం కూడా . ఉత్తమ ఉపాధ్యాయుల తరహాలో ఉత్తమ వైద్యులకూ  పతకాలిచ్చి గౌరవించడం సబబు . 


'అలాంటి పతకమేదన్నా పెట్టే పథక ముంటే చెప్పు, అందుకోవాల్సిన వాళ్ళల్లో అందరికన్నా ముందు  ఉండదగిన కలకత్తా పిల్లలాసుపత్రి సూపరింటెండెంటుగారికి కబురు చేద్దాం!


ఆయనంత సూపర్ గా  ఏ ప్రజాసేవ చేశాఉంటావా ? ఇంతింత మంది  పిల్లలెందుకు చని పోతున్నారయ్యా?  అనడిగితే ' పిల్లలాసుప త్రిలో పిల్లలుగాక పెద్దవాల్లు  పోతారా?' అని అమాయకంగా  అడిగినందుకు! 

' అందరూ వైద్యం అందకే చనిపో యారా? ' అనడిగితే 'ఆబద్ధం అందరూ  వైద్యం అందినందుకే చనిపోయార' ని నిజం నిప్పులాంటిదని తెలిసీ నిజాయితీగా చెప్పినందుకు . 

' అందుకా ఉత్తమ వైద్యుడి పతకం? ' అని సందేహం మీకొస్తుందని తెలుసు. 

ఉద్యోగం ఊడిందండీ ఆ వైద్య నారాయణుడికీ!  ఆ విధంగా ఆ నారయణుడు  ఎంత మంది పసిపిల్లల ప్రాణాలు హరీ మనకుండా కాపాడాడో! అందుకూ .. ఉత్తమ వైద్యుడి పతకం!  


' హరి .. హరీ! నారాయణ;  .. నారాయణ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం - 25-09-2002 ) 


దేవుని లీల - బంగారు కొండలు - చిన్న కథ - సాహితీ ప్రస్థానం - సూర్య


 సూర్య ; హాస్యం : కథానిక : 

దేవుడి లీలలు 

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక - సంపాదకీయ పుట- 12 - 05- 2019- ప్రచురితం) 


మాకొలీగ్ సుబ్బారావు వంట్లో బావోలేదంటే ఆసుపత్రికి తోడు వెళ్ళా. 


 బైట బోలెడంత మంది జనం. తొడతొక్కిడి! ఆఫీసు టైం మించిపోతోందని నా కంగారు. 


దైవ ఘటన! కారిడార్లలో గుర్నాథం కనిపించాడు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు. 


గుర్నాథం నా హైస్కూల్ క్లాస్ మేట్. నేను వచ్చిన పని విచారించి తనే చనువుగా 'ఇక్కడి పద్ధతులన్నీ నాకు కొట్టిన పిండేరా! నువ్వెళ్ళి పో నిశ్చింతగా! మీ ఫ్రెండు పని నేను చూసుకుంటాగా!' అన్నాడు. 


చిన్నప్పటిలానే చాలా చురుకుగా ఉండేవాడు ఇలాగే!  కాలం కొంత మందిని ఎంత కాలానికైనా మార్చలేదు. ఆ సాయంకాలం సుబ్బారావు గుర్నాధం  గురించి ఒహటే పొగడ్డం అందుకు నిదర్శనం. ' చకప్పులూ అవీ చకచకా తనే దగ్గరుండి చేయించేసాడు స్మీ! ' అని సుబ్బారావు సంబరం.


గుర్నాథం  స్కూలు రోజుల్లో చదువుల్లో యావరేజి. ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ గట్రాల్లో ఇట్లాగే మహా చురుకు! రకరకాల గమ్మత్తుల్తో ఎంత కొత్తవాళ్లనైనా ఇట్టే ఆకట్టుకోడం వాడి బలం. పాడయిపోయిన పెన్నులు రిపేరు చేసే విద్యలో గుర్నాథం ఘటికుడు. వాడి సంచీలో పుస్తకాలు ఉన్నా లేకపోయినా.. రకరకాల పేనాలు.. వాటి తాలూకు కేవులు, పాళీలు, నిబ్బులు, సిరాబుడ్డి, చెత్తగుడ్డ పీలికల్లాంటి సరంజామా మాత్రం దండిగా ఉండేది. బాల్ పాయింట్ పెన్నులు ఇంకా బాగా వుంజుకోని ఆ కాలంలో వాడి సిరా పెన్నుల రిపేరు వ్యాపారం మూడు పెన్నులు.. ఆరు కేవులతో యమ రేంజిలో సాగేది. 


అప్పటివింకా చిల్లర పైసలతోనే పెద్ద పెద్ద పన్లు చక్కబడే సీజన్లు! మూడు పైసలకో కేవు, రెండు పైసలకైతే నిబ్బు! మనీని బట్టి అన్ని రకాల పాళీలూ వాడి దగ్గర ఎవరడీగా దొరికేవి.  కలాలని అణాలు, పైసల రూపంలో మినహా చూడలేని ఫక్తు బేహారీ గుర్నాథం. అట్లాంటి సరుక్కి  కాలం చెల్లిపోయిన ఈ కాలంలో మరేం వ్యాపారం చేస్తున్నట్లో! 


అదే అడిగితే పొట్ట నిమురుకొని చేతులు గాలికి విసిరి భక్తి అభినయించాడు తప్పించి నోటితో ఏ ముక్కా బైటపెట్టిందిలేదు! 


పదో తరగతి పరీక్షలు రాసే రోజుల్లో ఒకళ్ళ సమాధాన పత్రాలు ఇంకొకళ్ళకు తారుమారు చేయబోతూపట్టుబడి  డిబారు అవడం వరకే వాడి కథ నాకు తెలుసు. ఆ తరువాత.. ఇదిగో ఇప్పుడే.. మళ్ళీ దివ్యదర్శనం! 


గుర్నాథం తెచ్చిన రిపోర్టుల బొత్తి చూసి గుండె బేజారయింది సుబ్బారావు అండ్ ఫ్యామిలీకి. కాళ్ల నుంచి మోకాళ్ల వరకు బాడీలోని ఏ పార్టూ సవ్యంగా పనిచేయడం లేదని రిపోర్టు! 


మిగతా రోగాలన్నీ ఏ మందూ మాకుల్తోనో ప్రస్తుతానికి నిదానించినా కిడ్నీతోనే పెద్ద ప్రాబ్లమ్. 'ట్రాన్స్ ప్లాంటేషన్ తక్షణం అవసరం అంటున్నారండీ స్పెషలిస్టులంతా కూడబలుక్కొని!' అన్నాడీ  గుర్నాథం.


' గాడ్! కిడ్నీ మార్పిడా! దానికి ముందూ వెనకా చచ్చేటంత తతంగం ఉంటుంది కదా! ' 


'యస్సెస్! డయాలసిస్ కంటిన్యువటీ దెబ్బతినకూడదు. ఆపరేషనంటే లక్షల్లో ఖర్చు. డోనర్ దొరకడమే దుర్లభం. కిడ్నీదాత రోగికి దగ్గరి బంధువు కాకుంటే ఆథరైజేషన్ కమిటీ అప్రూవల్ చట్టబద్ధంగా తప్పనిసరి. అదేమంత తేలికా ఏమిటి? హస్తవాసి ఘాటుగా ఉండే డాక్టర్ల చేత కత్తెర్లు పట్టించడమంటే మాటలు కాదు . మొన్నటి సింహపురి.. నిన్నటి విశాఖ నగరి గగ్గోళ్ళ తరువాత గోళ్లు గిల్లుకుంటూనే కాలం వెళ్లబుచ్చేందుకు స్టారు ఆసుపత్రుల్సు  కూడా  తీర్మానించాయి! 1 


'మరిప్పుడేంటి దారి అన్నాయ్? ' గావుమంది సుబ్బారావు అర్థాంగి సులభమ్మ  గుండె గొంతులోకి జారి . 


' అన్నాయ్ అన్నావ్! ..తప్పుతుందా నాకు చెప్పు చెల్లమ్మా! ఎన్ని రిస్కులైనా రానీయ్.. ఇహ పైన ఈ అన్నాయ్ మీదకే వదిలేయ్ అన్నీ! చెక్కిళ్ళు తుడుచుకో చెల్లీ! ఆ వెక్కిళ్లు ఆపేయ్ తల్లీ! ఒక్క మనీ మేటర్ మాత్రం మా బావగారి పీకెల మీద కేసెయ్!' అంటూ మహాభారతం మార్క్ కృష్ణ పరమాత్ముడి పోజులో అభయమిచ్చే గుర్నాథం గెస్చర్స్ చూస్తే .. నిజం చెప్పద్దూ. నాకా చిన్నప్పటి పెన్నుల రిపేరు మెకానిజమే మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదలాడింది. 


' కిడ్నీ ఆపరేషనుకుంటే ఎంతవుతుందేమిటీ? ' సుబ్బారావు గొంతులో వణుకు!


'ముష్టి పాతిక లక్షలకైతే మాత్రం ప్రస్తుతానికి ఓ రూపాయి బిళ్లు తగ్గదు' 


' ఓ. . మైఁ గాడ్! ఓ మైనింగ్ కంపెనీ ఓనరుకు మాత్రమే సరితూగే మహాకార్యం మాష్టారూ!' సుబ్బారావు గుండెలు బాదుకొన్నాడు.


'బాగా హర్టవుతారేమో గానీ నిజానికి బావగారూ! మీ  హార్ట్ కండిషన్ కూడా మరీ  ఏమంత బావో లేదు. ఊరికే అలా గుండెలు బాదేసుకోకండి.. ఊడి చేతిలో పడితే కొత్తవి కొనుక్కోడానికి ఇంకొన్ని కోటలు కొల్లగొట్టాలి.  మీరింకా మహా భాగ్యవంతులు బావగారూ! రెండు కిడ్నీల వరకే  మీ వంట్లో వర్కు చేయని పార్టులు !  ఇదే జబ్బు ఏ లివరుకు తగులుకుంటేనో! ఏడు కోట్లు తెచ్చి ఎదుట కుప్ప పోస్తానన్నా ఆ నుదురునామాల వాడైనా కుదరదు.. పో.. పొమ్మనుండేవాడు. లంగ్సు ఆపరేషన్లయితే ఖర్చు అంతకు రెట్టింపు. కంటిగుడ్డుకు వాడే కార్నియానే కోటి మీద అయిదు లక్షలన్నా మరో ఐదు అదనంగా పోస్తా మంటూ రివ్వునొచ్చి ఎగరేసుకు పోయే డబ్బు భేఫర్వా రోజుల్సార్ ఇవీ! రైతుబజారులో కూరగాయల ధరవరల మాదిరి గుర్నాథమలా బాడీ పార్ట్స్ రేట్లను గురించి హరికథకి మించిన స్పీడులో  ఏకరువు పెట్టేస్తుంటే గుడ్లు మిటకరిస్తూ వినడం మాకో కొత్త అనుభవం!


 'చూస్తూ చూస్తూ వంట్లోని భాగాలను ఏ వెర్రి కుంకరా అట్లా అమ్ముకొంటాడూ? పెన్నుల్లో పాళీలా బొందిలోని భాగాలూ?! అని అక్కడికీ నేను గట్టిగానే నిలదీసా! '


' మాధవుడే కాదు.. మానవుడనేవాడు ఒకడున్నాడు నాయనా మన మధ్యలోన ఈసురోమంటూ రోజులీడుస్తో! పేదరికం మనిషి చేత ఎంతెంత వింత చేష్టలు చేయనిస్తుందో నీకేం తెలుసు? నెల నెలా ఠంచన్ గా ఠంగ్ మని బెల్లు కొట్టినట్లు బ్యాంకు ఖాతాలోకి వేతనాలొచ్చి పడుతుంటే లోకమంతా ఇదే సిస్టమ్ లో సాగిపోతుందునుకొనే బావికప్పలు బాపతురా మీరంతా! దేవుడు మనలా రాయి కాదు. పరమ దయాళువు. కాబట్టే మెదడు చచ్చిపోయినా గుండె కొట్టుకొంటుంటే చాలు.. వంట్లోని చాలా అవయవాలని తీసి అవసరానికి అమ్ముకొనే వీలు కల్పించి మరీ భూమ్మీదకు పంపించింది. చాదస్తాలకు పోయి మనమే ఆ విలువైన వస్తువులన్నింటినీ ప్రాణాలు పోతే సరి అన్నీ పోయినట్లేనన్న భ్రమలో తగలేసుకుంటున్నాం. ఫూలిష్ గా పూడ్చిపెట్టుకుంటున్నాం. బాడీ షాపింగులే తెలుసునురా నీ లాంటి చదుకొనే దొరబాబులకు. బాడీ పార్టుల  షాపింగు అంటూ మరో బిజినెస్సూ మహా జోరుగా మార్కెట్లో అంతకన్నా ఊవుగా ఎప్పట్నుంచో సాగుతోన్నది మహాశయా! 


ప్రజాప్రతినిధుల అమ్మకాలు కొనుగోళ్లొక్కటే కాదబ్బీ ప్రపంచంలో ఉన్నది, పేపర్లలో అచై వచ్చేవే నిజాలు నీ లాంటి పిచ్చి సన్నాసులకు! వాటికి సమాంతరంగా అంతకు మించిన స్పీడుతో గిరగిరా తిరిగే మార్కెట్ ప్రపంచయంత్రం మరోటుంది మిత్రమా!' అన్నాడు గుర్నాథం. 


' ఎంత అన్యాయం!' గుండెలు బాదుకొన్నాడు సుబ్బారావీ సారి అవి కిందపడనంత సున్నితంగానే!!


న్యాయంగా చూస్తే అన్యాయమనే పదార్థం లేనిదెక్కడ బావాజీ? ఇంద్రుడు వజ్రాయుధం కోసం దధీచి పక్కటెముకలు నొక్కేసాడా లేదా ? కవచకుండలాలని కూడా చూసుకోకుండా దానం చేసిన కర్ణుడి కథేంటిట చెప్పండి మరి! మనీ కవర్ అందితే చాలండీ.. లివర్లయినా ఫ్లవర్లలో పెట్టి మరీ సమర్పిచే గుణం సార్ పూర్ పీవుల్సుదీ ఈ కాలంలో! గుండెకాయలు బెండకాయల్లా, కంటిగుడ్లు కోడిగుడ్డుల్లా మనిషి బాడీ పార్ట్ప మహా ఈజీగా బాడీ టు బాడీ మారిపోతున్నాయి మేష్టారూ ప్రపంచమంతటా!. యూరప్ లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీసులో అయితే ఏకంగా 'యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గాన్స్ సేల్' అనే భారీ నెట్ వర్కే పబ్లిగ్గా నడుస్తోంది బ్రహ్మాండంగా ఇప్పుడు.


'చట్టం చూస్తూ వూరుకొంటుందా?! '


' ఊరుకోక ఉరేసుకుంటుందా? తన పని తన మానాన తాను చూసుకుంటుంది. అయినా! ఏ ఉద్ధరిస్తారన్న అర్థం పర్థంలేని ఆత్రంలో అర్థరాత్రిళ్లు దాకా కాళ్లు గుంజుతున్నా క్యూలల్లో నిలబడి మరీ మీరు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటిరి గానీ.. ఏమయింది చివరికి? ఏవేవో కుంటి సాకులు కూసి జెండాలు మార్చుకుంటుంటరి గదా! ఏ చట్టమైనా వాళ్ళను గట్టిగా మందలించిందా? సారీ! ఎవడి అవసరాలు వాడివి సార్ ఈ లౌకిక లోకంలో! ఒకళ్ల పనిలో ఇంకోళ్లు కాళ్లూ వేళ్లూ దూర్చకుండా కాచుకోడానికి కాకుంటే ఎవడైనా ఇంత గడించేది ఇంకెందుకంట! గడియేసుకుని గదిలో మూటలు లెక్కేసుకుంటూ కూర్చుంటే లోకతంత్రం గడిచేదింకెట్లానంట! ? మీరూ మీరు తర్కించుకోండి! తొందరేముంది? మీ ప్రాణాలు మీ గుప్పిట్లోనే కదా ఉన్నాయిప్పటి వరకూ! వర్కవుట్ అయేదుంటే కాల్ చేయకండి.. ఇదిగో మా మిత్రుడి చేత కబుర్చేయించండి  బావాజీ ! సులభమమ్మ తల్లీ! దీర్ఘ సుమంగళీ భవ!' అంటూ వెళ్ళిపోయాడు గుర్నాథం. 


వీడి నాటక పక్కీ కూల్! కూల్‌గా ఉండే సుబ్బారావు గారింట్లో ఆ క్షణం నుంచీ ఒహటే మల్లగుల్లాలు. 


తల తాకట్టు పెట్టయినా సరే.. ఆపరేషన్ జరగాలన్నదే సులభమ్మ పట్టు. 


' ఉన్నంతలోనే ఇవ్వండి తల్లీ! సర్దుబాట్లకు ఈ అన్నాయున్నాడని నమ్మి దిగండి చాలు! ' అన్న గుర్నాథం హామీతో కిడ్నీ దాతను చూపించమన్నాడు సుబ్బారావు. 


అన్నంరాజును కలవమని అదేదో అనాథ శరణాలయం చిరునామా ఇచ్చాడు గుర్నాథం. 


గుర్నాథం తాలూకు కస్టమర్లని నమ్మకం కుదిరాక అందుబాటులో ఉండే రేటుకే బేరం కుదురుస్తానన్న ఉత్సాహం కూడా చూపించాడా అన్నంరాజు. 


' దానం గుప్తంగా ఉండాలండీ ! లోకం బొత్తిగా బావోలేదు. అందుకే లోపాయికారీగా ఈ వ్యవహారం! ఏళ్ల బట్టి ఈ రూట్లోనే నా నలుగుళ్లు! నలుగురికీ చెప్పి చేసేందుకు ఇదేమైనా ఇంటి శుభకార్యమా? ' అన్నాక ఇహ అన్నంరాజును మాత్రమే నమ్మక తప్పింది కాదు మా సుబ్బారావుకు. 


బేరంలోని సగం పైకం ముందే గుంజుకొన్నాడు అన్నంరాజు. డాక్టర్లంతా ఈ కత్తెర పన్లు చేయరు. ఒప్పుకున్న డాక్టర్ ఆపరేషన్ డేట్ ఇచ్చిందాకా కిడ్నీకి మంత్లీకి ఇంతని రెంట్ కట్టాలి మనం. మరో మంచి ఆఫర్ వచ్చినా దాత అటు తూలిపోకుండా! ఆపరేషన్ డేట్ కి దాత కిడ్నీ అప్ టు డేట్ ఫిట్ నెస్ ఉండాలంటే ఈ మాత్రం అచ్చుకోడాలు తప్పవండీ ఈ ఫీల్డులో! ఆష్ట్రాల్ ! ఆ ఆపరేషన్ అయిన పిదప ఆ కిడ్నీ కూడా మనదే కదా మాష్టారూ! ' అంటూ ఆ పెద్దమనిషి ఎన్ని పాయింట్లు ఏకరవు పెట్టుకుంటూ పోయినా..  ఇంటూ మార్క్ పెట్టలేం కదా ఓ సారి కౌంట్ డౌన్ అంటూ మొదలయినాక!


మరో మూడు నెలలకు గాని ఆపరేషన్ డేట్ ముడిపడింది కాదు. అక్రమ ఆపరేషన్ అయినా క్రమం తప్పకుండా డయాలసిస్  తప్పటంలేదు పాపం సుబ్బారావుకు! ఆ ఖర్చుల దెబ్బకు మరీ ఖాయిలా పడ్డ సుబ్బారావీ మధ్య విచిత్రంగా మాట్లాడటం మొదలెట్టాడు 'ప్రతీ మనిషికీ కనీసం నాలుగు కిడ్నీలైనా ఉండితీరాలి. అట్లాగే చేతులు, పది పన్నెండు జోళ్ళు కాళ్ళు, ఆరేడు జోడు చెవులు,  వీలైనన్ని కళ్ళు, గాలి కోసరం ఒకటి.. తప్పు చేస్తే నేల కేసి రాసుకొ నేందుకు మరోటి వేరే వేరేగా ముక్కులు, వందలాది నాలుకలా గట్రా ఉండేలా దేవుళ్లకు మల్లే శరీర నిర్మాణం మనకు సుమకూరిస్తేనే సమన్యాయంగా ఉంటుంది'  అంటూ సాగుతోంది సుబ్బారావు ధోరణి . 


రెండు చేతులుంటేనే మనిషి చేసే ఆగడానికి అంతూ పొంత  లేకుండా ఉందీ లోకంలో! పదులూ యాభైలూ మొలుచుకొచ్చేస్తే జరిగే ఆగడాలని  ఇవా ఊహించ తరమా ? 


మొగుడు వాగుడు విని విని విసుగెత్తినట్లుంది పాపం సులభమ్మ తల్లికి 'ఒక్కటుంటేనే తల ఇంతలా గిరగిరా తిరుగుతున్నదే మీకు,  పది పదేసి బుర్రలు పొడుచుకొస్తే ఇహ ఆ వెర్రికి తట్టుకోడం మా తరం కాదు కానీ.. రెండు నిద్ర మాత్రలు మింగో పక్కన ముంగిలా హాయిగా  మూతలేసుకు పడుకోండి! తిక్క తిక్క మాటలిహనైనా కట్టి పెట్టండి! '  అంటూ కన్నీళ్లు పెట్టుకొంది. 


'ఇందులో తిక్కేముందే పిచ్చిదానా?  శివుడికి మూడు కళ్ళు లేవా! విష్ణుమూర్తికి నాలుగు చేతులు, బ్రహ్మ దేవుడికి నాలుగు ముఖాలు, రావణాసురుడికి పది భీకరమైన హెడ్స్, కార్తవీర్యుడో.. ఎవడో.. వాడికి అటూ ఇటూ  కూడా కలిపి వన్ థౌంజండ్ హ్యాండ్స్! కుళ్లుబోతు దేవేంద్రుడికయితే  వల్లంతా కళ్లే! దేవుళ్లందరికీ అన్నేసి అవయవాలుండగా లేంది  మానవులం. . అందులో మినిమం సగమైనా ఉండాలని కోరుకోడం తిక్కా?!' ఒకటి రిపేరుకొచ్చినా స్పేరుంటే వెంటనే ఏ తంటాలూ లేకుండా పని అయిపోతుందని కామోసును..  పాపం సుబ్బారావు అత్యాశ. 


' ఈసారి గానీ దేముడు ప్రత్యక్షమయితే మాత్రం రకానికో జత అదనంగా ఇవ్వాలని వెంటబడ్డం ఖాయం. ' అంటూ ఆ  మానవుడలా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఒక్క కట్టుకున్నదానికేనా.. ఎవరికైనా కన్నీళ్లు ధార కట్టక మానవు! 


ఎలాగైతేనేం.. సుబ్బారావు అయిపోయింది. 


మూడో రోజు నుంచే గుర్నాథం పేరు మారుమోగడం మొదలయిపోయింది! 


ఈ గోల్ మాల్ మొత్తంలో ఓ ప్రధాన గుర్నాథానిదే ప్రధానపాత్ర 


అన్నంరాజు అనాథ శరణాలయం మీద జరిగిన ఆకస్మిక దాడిలో విస్తు గొలిపించే వింతలు ఎన్నెన్నో! రెడీ ఫర్ సేల్ ఆఫర్లకని సిద్ధంగా ఉన్న శరీరావయవాల జాబితా వింటే మతిపోక తప్పని పరిస్థితి! 


కిడీ కళ్ళు.. వంట్లో అమ్ముకోవడానికి వీలున్న ఏ అవయవాన్నైనా సరే  చెట్టు నుంచి కాయలు కోసిచ్చినట్లు కోసిచ్చేందుకు జరిగే ఆ పక్కా  ప్రణాళిక వింటుంటూనే అవాక్కయిపోయారంట అంత లావు గుండె దిటముండే  నేరపరిశోధక బృందంలోని వాళ్లంద రూ! 


అవయవాల మార్పిడికి అనువుగా పెరిగే శరణాలయ అనాధలను  చూసిన మా సుబ్బారావు నోట మాట మళ్లీ రాలేదు, 


కూరగాయలే తాజా ఓ పట్టాన దొరకని ఈ కరువు రోజుల్లో అంతంత మంది అనాథబాలల్ని  సేకరించడం ఒక ఎత్తైతే కూరగాయలకు మల్లే నిత్యం అందర్నీ అంత తాజాగా ఉంచడం మరో ఎత్తు! 


పెద్ద ఎత్తున సొమ్ము, పెద్దలతో సంబంధాలుంటే తప్ప ఇన్నేళ్ల బట్టి ఈ బాడీ పార్టుల  వ్యాపారం ఇంత గుట్టుగా ప్రవర్థమానమయ్యే అవకాశమే లేదు. 


 ఏదో పనిలేని ఛానెల్ తాలూకు ప్రతినిధి అడిగితే ఆసుపత్రిలో శేషతల్పశాయిని మించిన ఫోజులో విలాసంగా శయనించి ఉన్న గుర్నాథం నిశ్చింగా   చెప్పినా సమాధానం " అంతా ఆ దైవ లీల! .. అంతకు మించిన వివరణకు..  కోడు అనుమతించదు!" 



- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక - సంపాదకీయ పుట- 12 - 05- 2019- ప్రచురితం) 

తొండపు స్వామీ .. దండము నీకు! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 24 - 08 - 2017 నాటి సంపాదకీ పుట ప్రచురితం )

 



ఈనాడు: హాస్యం : 

తొండపు స్వామీ .. దండము నీకు! 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 24 - 08 - 2017 నాటి సంపాదకీ పుట ప్రచురితం ) 


గణాధిపతి హాస్య రసానికి అధిపతి.  చందమామయ్యే పాపం ఎందుకో అలా నీలా పనిందలపాలయ్యాడు. కానీ, ఆ బొజ్జ  దేవుణ్ని చూస్తే నవ్వు రానిదెవరికి? హాయిగా చవితి పండుగ ముందునాడు, వినాయకుడి ముచ్చట్లు చెప్పుకొందాం. అదే పుణ్యం పురుషార్ధం కూడానూ!


జాజి, జవ్వాజి అంటూ పత్రులు ఇరవయ్యొక్క రకాలతో  ఆ గజాననుడికి  పూజా పునస్కారాలా ? అన్నేసి రకాల ఆకులు ఈ కరపు రోజుల్లో దొరుకుతాయనే! కరి వేపాకు రెబ్బ కూడా కాడ పది కాడ నిలబడి కిందికి దిగిరానంటుందబ్బా రైతు బజారులో . జనాలేవన్నా ఆ ఆదానీ, అంబానీలకు దగ్గరి చుట్టాలా పక్కలా? బీదా బిక్కి ఒక్కపూట బొక్కేందుకే ఇంత బలుసాకు రెక్క దొరక్క బిక్కచచ్చి బతకతా ఉంటే మహానుభావా! ఇదేం విపరీతమయ్యా? 


గారెలు, బూరెలు, వడపప్పు, పాయసాలంటూ చేంతాడంత పట్టీలు పట్టుకు చందాలకని ఇల్లిల్లూ తిరిగి వేపడం, ఉండ్రాళ్ల మీదకు దండు గొలుపమంటూ బొజ్జ గణపయ్యను ఊరికే రెచ్చగొట్టద్దు  బాబోయ్! దినం గడవడమే గండంగా ఉంది ఇక్కడ మహాశయా!


దినుసుమీద ఎంత జీఎస్టీ వాతో... కొన్న తరువాత కానీ తేలడం లేదు..  రాత! ఏదో విధాయకం కనక భాద్రపద చవితికి సరదాగా వినాయకుణ్ని ఓసారి వచ్చి పొమ్మనడమే కాని చూసీ చూడనట్లు సర్దుకుపోవాలని ఆ లంబోదరుడికి మాత్రం తెలియదా ?


సరే, ఎలాగూ  ఆ ఎలుక వాహనుడు వాలిపోతు న్నాడు కాబట్టి, కొన్ని హెచ్చరికలు ముందస్తుగా మనమూ చెప్పక తప్పదు. శ్రీ గజాననా... శ్రద్ధగా విను నాయనా! 


గుళ్లల్లోని దేవుళ్లే నేరుగా భక్తుల ఇళ్లకు వెళ్లొచ్చే కొత్త రోజులు వచ్చి పడ్డాయిప్పుడు. కుడుముల మీద మరీ అంత యావ  కుదరదిపు . ఏ భక్తుడి బీరువాలోనే లటుక్కుమని ఇరుక్కునే ప్రమాదం కద్దు. జర భద్రం జగన్నాయకా!


పోయిన ఏడాది మాదిరే పూజలో వెయ్యి నోట్లు విసిరితే ఉబ్బి తబ్బిబ్బు కావద్దే! ఆ చెల్లని నోట్లతో నిన్ను బోల్తా కొట్టించేసి, నీ నుంచి వరాలు దండుకొనే పథ కాలు దండిగా తయారవుతున్నాయ్ నీ పూజా పందిళ్ల వెనక వినాయకా! అమాయకంగా ఎవరి మాయలోనూ పడిపోవద్దు! ఆనక ఏ ఈడీ కేసులోనో ఇరుక్కుంటే మీ 'డాడీ' విడిపించేందుకు వచ్చి  ఫలితం సున్నా!


స్వరాజ్యం నుంచి సురాజ్యానికి పరుగులెట్టేస్తోందట ఈ మధ్య మరీ శరవేగంతో మా దేశ ప్రగతి రథం. అయినా మునుపటి మాదిరే ఈసారీ మా ముసలీ ముతకా నేతాశ్రీలు తమ వారసులకో దగ్గరి నీరసులకో పదవులిచ్చి తీరాలని పట్టుపట్టక మానరు. దగ్గరి వారిని కూడా దూరం పెట్టే రాజకీయం జోరుగా సాగే వేళ, ఎప్పటి మాదిరిగా తొందరపడి 'తథాస్తు'' అన్నావో- ఇహ మా రాజకీయ సుడిగుండంలోకి నువ్వే వచ్చి చిక్కడ్డట్లే గజాననా! ఆనక తమరి  చిత్తం  లంబోదరా! 


'కోరిన విద్యలకెల్ల ఒజ్జ'వని బుజ్జగించి మరీ ఏ చచ్చు  బడులకో  అనుమతులు రాబట్టేయవచ్చు  విద్యా వ్యాపారుల దండు. ఆ అడ్డా సరకుతో జర భద్రంగా ఉండాలి జగన్మాతా ప్రియా ! 


అత్యున్నత న్యాయస్థానాలలోనే  నిదానంగా పోయే విధానాలు ఉంటే, నీకు మరీ అంత అత్యుత్సాహం తగదు। ఆనక జరిగే  పార్టీల జగడాలకు జగన్నాయకా .. బలి కావద్దు!


పుట్టిమునిగినాట్లు పుట్టిన రోజు వేడుకలకని మహా  ఉల్లాసంగా దయచేస్తున్నావు. మంచిదే కానీ,  దయామయా .. ఎన్నికల వేడి తమరి కన్నా  ముందస్తుగానే వచ్చి పడిందిప్పుడు వాడవాడలా! పాడు నేతలు నీ అభయ హస్తాన్ని ఎంతలా వాడుకుంటారోనన్నదే మా భయం. 


ఎచ్చులకుపోయి ఎవరి ఉచ్చుల్లోనూ  ఇరుక్కో కుండా  ఉండేందుకే 

ముందస్తుగా ఇన్ని హెచ్చరికలు!


మాదక ద్రవ్యాల వినియోగం మహజోరుగా సాగే  సీజన్లోనే వచ్చి పడాలా నీ చవితి పండుగ సంబురాలు శంభు తనయా! పూజా పత్రిలో రవ్వంత గంజాయి ఆకు దొరికినా చాలు- కైలాసగిరికి నువ్వు తిరిగి వెళ్లే మాట కల్ల! జర భద్రం జగన్నాయకా!


పుస్తకాల సంచి బరువు బాధల నుంచి బడి పిల్లలనిలో  కాపాడాలా అని  తెలుగు  ప్రభుత్వాలు రెండు  తెగ తంటాలు పడిపోతున్నాయి.  నీది భారీ కాయమాయె! ఆకతాయితనానికి  ఏ పసిబిడ్డ  భుజం పైకెక్కుతావనో అని    నా భయం! అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతూ చెడ తిరిగే దున్నపోతులకి ఈ దేశం గొడ్డుపోలేదు. వాటి మీద ఎక్కి వాళ్ల వంకర బుద్ధులనైనా  తిన్నగా   చెయ్యి స్వామీ: నీ చవితి పండుగ అప్పుడే చరితార్థ మైనట్లు చదువుల స్వామీ! 


అన్నట్లు. . ఆఖరున  నిమజ్జన దృశ్యం ఒకటుంటుంది  . ఎప్పటిలా  ట్యాంకుబండ్ మీదే అది తప్పనిసరా స్వామీ! బోలెడంత జనం సొమ్ము ధారపోస్తేగాని ఆ మాత్రమైనా పరిశుద్ధమైంది కాదీ సాగరు జలాలు! మళ్ళీ మురికిచెయ్యడ మంటే ఎవరి ముల్లెకో లాభం చేకూర్చడమన్న మాటే! నీ భక్తులకు నీవే  నచ్చజెప్పాలి. కోర్టులిచ్చే  తీర్పుల పట్ల భయభక్తులు చూపించే బుద్ధి  నీ  భక్తులకు నీవే నేర్పించాలి   సిద్ధివినాయకా!   


నీ మూషిక వాహనమే నయం .. దానిని  నమ్ముకుని మాత్రమే  రావయ్యా గణనాయకా!  నామోషీ పడవద్దులే ! కాకుంటే మా కొత్త 'పాయింట్ల' పద్ధతికి  నీ కొంటె మూషికం కాస్తింత అలవాటు పడటం అవసరం. ఏనుగు చెవులు నీవని  ఏమంత బడాయిలొద్దు ఏకదంతా! ఎన్నికల మధ్యలో కదా  నీ చవితి పండుగ వచ్చి పడింది: మా 'బూత్'  రాజకీయాలకి ఓ బేలు దూదుండలు  తప్పనిసరి. . గుర్తుంచుకో ! చాలినన్ని వెంట ఉంటేనే .. పండుగ రోజుల సౌండు గండం ను తమరు గట్టెక్కడం !  


ఉచిత ఫోను సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయిప్పుడు . కాబట్టే  ఇంత వివరంగా  నీతో ముచ్చటించడమయింది . చివరగా చిన్న విన్నపం చిదానందా! తమ వెంట  సిద్ధిని, బుద్ధిని కూడా తోడు తెచ్చుకోండి! ౮ అమ్మలిద్దరే   ఇప్పడు మా పెద్దమ నుషులందరికీ తగిన బుద్ధులు మప్పగలిగేదని  మెజారిటీ ఆపన్నుల వినయపూర్వక విన్నపాలు   మమ్ము కాపాడే గుజ్జు గణాధిపా! 

***

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 24 - 08 - 2017 నాటి సంపాదకీ పుట ప్రచురితం )






మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...