Saturday, December 4, 2021

ఈనాడు - సంపాదకీయం బతుకు విలువ రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 15 - 04 2012 న ప్రచురితం ) విలువ

ఈనాడు - సంపాదకీయం


బతుకు విలువ 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 15 - 04 2012   న  ప్రచురితం ) విలువ 


అ అధ్యయనం చేయాలేగాని జీవితాన్ని మించిన వేదం మరొకటి లేదు. 'కడలేని కాలవాహిని/సుడిగుండము లెన్ని గలవో చూచిన వాడున్/వడిదుడుకు లేక బ్రతుకుం/బడవ నడుపుకొనిన వాడు. వసుధం గలడే' అన్నారు కవి జాషువా. 'ఇక్కడి జీవితానందాలు మింట ఉండవు కనుక చచ్చి మళ్ళీ స్వర్గానికెళ్ళాలంటే ససేమిరా' అంటాడు జీవి' అన్నది ఆయన చమత్కారమే. సమస్యలంటారా? ఆంథోనీ రాబిన్స్ అనే ఆంగ్ల రచయిత భాషలో అవి, బతుకు పుస్త కంలోని అభ్యాస పాఠాలు. అనిబిసెంట్ ను  దివ్యజ్ఞాన సమాజ స్థాపనకు పురిగొల్పింది కుటుంబ జీవితంలోని ఇటువంటి ఆటుపోటు పాఠాలే! దుస్తుల దుకాణం గుమాస్తాగా జీవితంతో పట్టిన కుస్తీపట్లే బతుకు గోదాలో శ్రీనివాస రామానుజాన్ని కేంబ్రిడ్జి స్థాయి వస్తాదుగా నిలబెట్టాయి. 'జీవితం- భగవంతుడు మానవుడికిచ్చిన పరీక్షా పత్రం' అంటారు కవి కరుణశ్రీ.  'నీటికోసం వేళ్లతో భూమిని చీల్చిన చెట్టు/ నక్షత్రాలతో మాట్లాడటం కోసం నింగికెదిగిన చెట్టు/మనిషి ఎలా ఎదగాలో మనకి పాఠం చెప్పినట్టు'  విజయానికి ఆరోమెట్టు ఎలా ఉంటుందో చూపిస్తూ యండమూరి వీరేంద్రనాథ్ చెప్పే గొప్ప మాట అది. కథ అంటే కావాల్సినచోట ఆనందాన్ని కల్పించుకోవచ్చు. వద్దనుకున్న విషాదాన్ని విదిలించుకుని ముందుకు పోవచ్చు. జీవితం కథ కాదుగదా! ఎలాంటి జన్మ కావాలో కోరుకొమ్మని దేవుడుగాని దిగొచ్చి అడిగితే, ప్రత్యుత్తరంగా ఓ తత్వవేత్త ఇస్తానన్న సమాధానంలోనే ఉదాత్త జీవిత సారమంతా ఇమిడి ఉంది. 'మనసు దుర్బలమైనప్పుడు ఓపికగా విశ్లేషించుకునే సహనం, విహ్వలానికి గురైనప్పుడు కారణం తెలుసుకోగల కుతూహలం, ఓటమి ఎదురైనప్పు డు గర్వంగా ఒప్పుకొనే సాహసం, విజయం సాధించినప్పుడు వినయంగా తలొంచుకునే తత్వం' మరో జన్మలోనైనా వరాలుగా పొందా లనేది ఆయన సమాధాన సారం. మరు జన్మదాకా ఎందుకు? విలువైన బతుకు ఇవాళే మన ముందు ఉంది గదా!


కడగళ్లు లేని జీవితం కెరటాలు రాని కడలంత దుర్లభం. ముళ్లు లేని గులాబి లోకంలో ఉంటుందా? గెలుపు- ఎన్నో ఓట ముల సోపానాలు ఎక్కితేనేగాని అందని అందలం. ఆనందం అంటే ఎన్నో దుఃఖ సంద్రాలను ఈదుకుంటూ చేరే ఆవలితీరం. పులుసు నంజిన గాని భూమిలో మిక్కిలి తీపు/ తలపోయ నోటికిని తవు గానరాదు/ వావిరి లోకపు మాయ వలల జిక్కిన గాని/ వేవేగ వెడలి ముక్తి వెదకడు జీవుడు' అనిగదా అన్నమాచార్యులవారి ఆధ్యాత్మిక జీవవాదం! సమస్య వయస్సు ఎప్పుడూ జీవితంకన్నా చిన్నదే. పుట్టినప్పుడు లేదు. పుడకలదాకా ఉండబోదు. మరెందుకు భయం? మిఠాయి  కోసం తమ్ముడు చేసే ఆగం అన్నకు ఆగడంగా అనిపి స్తుంది. ఆ అన్న పరీక్షపోయి ఏడుస్తుంటే అక్కకు చికాకు పుట్టుకొ స్తుంది. సంబంధం తప్పిపోయి ఆ అక్క కుములుతుంటే తల్లి సముదాయిస్తుంది. ఆ తల్లే మొగుడి పాత ప్రేమపురాణం బయటపడి అల్లాడిపోతున్నప్పుడు, ఎప్పుడో జరిగిన తప్పునకు ఇప్పుడా ఏడుపు అని ఆమె తండ్రి మందలిస్తాడు. మనసు గతి, వయసు పరిణతిబట్టే సమస్య తీవ్రత. ఎగసి దూకే ఎంతపెద్ద కెరటమైనా వెనక్కి తగ్గక తప్పదు గదా! 'భయం ఎంత భీకరంగా తలుపులు మోదినా  ధైర్యంగా గడియ తీసి చూడండి... ఎదురుగా ఏమీ ఉండదు - అంటారు యండమూరి ఒక మనోవికాస పాఠంలో. మనిషికి ఉండా ల్సిన ముఖ్యమైన ఆస్తి ఆ ధీరగుణమే! మహాకవి శ్రీశ్రీ ఓ గీతంలో చెప్పినట్లు- ' ఏదీ తనంత తానై నీ దరికి రాదు. శోధించి సాధించాలి. అదియే ధీర గుణం' అన్న తెలివిడి కలగడమే పరిణతి. జీవితాన్ని గాలిపటంలా మలచుకుంటే చాలు... ఎదురుగాలి పెరిగే కొద్దీ అదే ఎత్తులెత్తులకు ఎగురుతుంది.


రాత్రీపగలూ ఒకేరీతిగా మోతలెత్తే ఈ కన్నీటి కడలిని కడదాకా ఈదుకొని రావాలంటే కావాల్సింది పిడికిలంత తెగువే. క్రీస్తు పుట్టు కకు ముందు కష్టాలు లేవా! సిద్ధార్థుడు బుద్ధదేవుడు కాకముందు బాధలకు కొదవా! అందరం ప్రవక్తలం కాలేకపోవచ్చుకానీ... అంది వచ్చిన అందాల జీవితాన్ని చేజేతులా చిందరవందర చేసుకునే తొందరపాటుతనం మాత్రం తెలివిమాలిన పని. 'మానవత వసించ వలసినచోట/దానవతను సహించలేను' అంటూ, తిరిగే భూగోళా న్నుంచి దిగేయాలనుకోవడం పిరికితనం. ప్రియురాలిచ్చిన జేబు రుమాలు విమానం నుంచి జారిపోయినప్పుడు దానికోసం దూకాలను కోవడం ప్రేమ. దూకలేక దుఃఖించడం వ్యాకులం. దూకడం సాహసం. దూకితే ప్రాణాలు పోతాయని తెలుసుకోవడం జ్ఞానం. ప్రాణాలు పోయినా ఫర్వాలేదనుకోవడం ఉద్వేగం. అయినా దూకేయడం ఉన్మాదం. 'చిరుత చీమ శిరసు చిదిమి క్రమ్మర దాని/ నదుకు బెట్ట శక్యమగునె? ' ఎన్ని జన్మల పుణ్యఫలమో మనిషి జన్మ! 'తరచి చూస్తే ప్రతి మనిషి జీవితం శ్రుతి తెలియని వింత పాటే. గతుకులలో గడ్డలలో కాలు సాగని చిక్కుబాటే. 'వ్రణాలకు, రణాలకు, తీరని రుణాలకు, మానహరణాలకు, స్వచ్ఛంద  మరణాలే శాశ్వత పరి ష్కారమా? ప్రజాకవి దాశరథి  ఘోషించినట్లు బతుకంటే- 'ఐదు రేకుల దీప కళిక. గుప్పుమని చేజేతులా ఆర్పుకోవడం అయినవాళ్ళకు చేసే నమ్మకద్రోహం. 'చావు' అగాధాలలోకి  స్వచ్ఛందంగా దూకే స్తున్న యువత శాతం పెరుగుతుండటం సమాజం మొత్తాన్నీ ఇవాళ కుదిపేస్తున్న విషాదం. ఆత్మహత్యలు వద్దన్న మేధావుల విజ్ఞప్తులు మాత్రమే చాలవు. చచ్చి సాధించేది శూన్యమన్న జ్ఞానాన్ని యువతలో తట్టిలేపే చిత్తశుద్ధి చర్యలు యుద్ధప్రాతిపదికన సత్వరం చేపట్ట కపోతే జాతి యువ సంపద వృథా కావడం ఖాయం. ఇది వ్యధ కలిగించే గుండెను పిండేసే నిష్ఠుర సత్యం. 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 15 - 04 2012   న  ప్రచురితం ) విలువ 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...