Saturday, December 4, 2021

క్షీరామృతం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - నిజంగా గోమాతే! - పేరుతో నేను రాసిన సంపాదకీయం - 24-04-2011 ప్రచురితం

 


ఈనాడు - సంపాదకీయం 


క్షీరామృతం 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - నిజంగా గోమాతే! - పేరుతో నేను రాసిన సంపాదకీయం - 24-04-2011 ప్రచురితం ) 


ఒక రూపం అంటూ ఏర్పాటు కాకముందే బిడ్డ రాకకోసం ఈ లోకంలో పలవరిస్తూ ఎదురుచూసే వ్యక్తి అమ్మ. శిశువుకిచ్చే ఊపిరి తాయిలం కోసం ఆ పిచ్చితల్లి ఎన్ని మృత్యుద్వారాలు దాటి వస్తుందో! బిడ్డల మంచిచెడ్డలు బిడ్డులకు మించి  తెలిసేది కన్న తల్లికే. ' ఎక్కడ నడిచినా నా అరికాళ్ల కింద మా అమ్మ చేతులే ఉన్నట్లుంటాయి' అంటాడొక ఆధునిక కవి. పసికూనకు తల్లి చన్ను గుడిపే సన్నివేశానికి మించిన సౌందర్య దృశ్యం సృష్టిమొత్తంలో మరెక్కడైనా ఉంటుందా? ' మాతాశిశుల ఆ అమరకేళి ముందు అందుకే శిరసు వంచి నమస్కరిస్తున్నాను' - అంటారు. భావకవి కృష్ణశాస్త్రి.  అమ్మంటే రాయటానికి అసాధ్యమైన పద్యం. అయినా అమ్మకోసం దేన్నైనా పద్యంగా అల్లడానికి నేను సదా సిద్ధం- అన్నాడింకో అత్యాధునిక  కవి. అల్లసాని పెద్దనామాత్యుడు అయిదొం దల ఏళ్లకిందటే ఆ పని చేసి చూపించాడు. 'అంకము చేరి శైలి తన యాస్తన దుగ్ధము లానువేళ అవ్వలి చన్ గబళింపబోయిన ఆ గజాస్యుని బాల్యాంక విచేష్ట' ను  పది కాలాలపాటు తలచుకొని తన్మయత్వం చెందే హృద్యమైన పద్యంగా మనుచరిత్ర ఆరంభం లోనే రాసిపెట్టాడు. దేవతలకంటే అమృతం ఉంది. భూలోకవా సులకు అమ్మపాలే అమృతం. మాతృమూర్తి అనే దేవాలయం గర్భగుడిలో క్షణక్షణం ప్రవర్ధమానమయ్యే జీవుడికి తల్లిపాలను మించిన తీర్థప్రసాదాలు లేవు. దేవుడనేవాడు నారు పోశాడను కున్నా నీరుపోసి పోషించవలసింది మాత అనే భూలోక దేవతే. మొలక మొదటిదశ.  ఎదుగుదలలో తల్లిపాల పోషక పాత్రకు ప్రత్యామ్నాయమేదీ లేదనే అంటోంది శిశువైద్యశాస్త్రం. నిజమే.. ఎన్ని పాలపుంతలు వెదికినా తల్లికి మించిన మురిపాల ముంత బిడ్డకెక్కడ దొరుకుతుంది? !


బిడ్డ ఉద్గ్రంథంలోని ప్రతి పుటకీ తల్లిపాల సంతకం వాసన అంటి ఉంటుంది. పాలకడలి మీద తేలియాడే ఆ పరంధాముడూ బహుశా ఆ అమ్మపాల కమ్మని రుచి, సువాసనల కోసమేనేమో అవతారాల వంకతో నేలమీదకి దిగి వచ్చింది! 'యశోద భాగ్య' మిది/ శ్రీపతి తను శిశురూపములో నున్నది/ నిత్య నిర్మలుడికి నీళ్ళుపోసి/ ఎత్తుకుని తొడలపై చనుగుడుపే' అంటూ పురందరదా సువంటి పరమ విరాగి కూడా ఈసుపడ్డాడంటే అమ్మపాల లీలలకు మరో ధ్రువపత్రం అవసరమా? ప్రసవానంతరం బాలింత పాలిండ్లలో ఊరి వచ్చే పచ్చని క్షీరం ( కొలెస్ట్రమ్ ) శిశువు శత  వసంతాల పచ్చని బతుకుకు అవసరమయే సంపూర్ణ ఆహారం . కోర కుండానే ఆ అమృత ధారలతో గొంతు తడిపే జననులున్నంత కాలం ఏ జన్మభూమైనా స్వర్గానికన్నా మిన్నే. 'గుక్కపట్టిన గుండెను తెల్లనెత్తురులో తడిపి/ బొట్టు బొట్టుగా తల్లి పంపేది వట్టి పోషక పదార్థాలు, విటమిన్ల పాలే అనుకుంటే పొరపాటే. ఆయురారోగ్య అప్లైశ్వర్యాలతో వందేళ్ళు చల్లగా జీవించాలనే దీవె నలూ అందులో రంగరించి ఉంటాయి . ' జోకొట్టే అమ్మకూ జేజేలు పలుకూ పాలిచ్చే అమ్మకూ పాదాలు మొక్కూ' అంటూ నిరీశ్వర వాదులు సైతం తల్లిముందు ప్రణమిల్లేది అందుకే. కాళీయ  మర్దనం, గోవర్ధనోద్ధరణం వంటి ఈడుకు మించిన సాహసాలను చూపించిన  గోపాలబాలుడి ఆ అసాధారణ బలానికి కారణం యశోదమ్మ పయోదర ధారల మహిమేనంటే కాదని కొట్టిపారవేయబుద్ధి కాదు. ఆ దేవకీ సుతుడి బలుపైన పొట్టమీది పాలచారలను అన్నమాచార్యులవారు ఎన్నడో ఆనవాలు పట్టేశారు. కమ్మని వరసలతో అమ్మ మమకారాన్ని పాటగా కట్టేశారు. క్రీడలకు ముందు గాయా లపాలైనా 'శాఫ్ గేమ్స్' లో స్వదేశానికి మూడు స్వర్ణాలు సాధించిపెట్టింది శ్రీలంక పరుగుల రాణి సుశాంతిక జయసింఘే. 'అయిదేళ్లు వచ్చిందాకా అమ్మపాలమీద ఆధారపడటమే నా విజయం వెనకున్న రహస్యం' అని ఆ విజేత అన్న తరువాత- తల్లిపాల ఘనతకు వేరే ప్రమాణపత్రం అనవసరం.


తల్లిపాలకు నోచుకోనంత దురదృష్టం సృష్టిలో మరొకటుం డదు. 'ఎల్లనియోగంబు లెల్లబాంధవులు/ నెల్లవారలుగల నిట్లు భర్గునకు/ తల్లి లేకుండ దా విచిత్రంబు' అంటూ శంభు మాతృ రాహిత్యానికి అందుకే బెజ్జమహాదేవి అంతలా తల్లడిల్లింది. చన్నిచ్చి తల్లిలా అన్ని బాల్యోపచారాలూ చేసింది. తల్లిలేని బుజ్జా యిలందరికీ బెజ్జమహాదేవులు దొరుకుతారా?! పాలబుగ్గల పాపాయిలు తల్లిపాల బుగ్గలకు దూరంకావడం న్యాయమా? కొద్ది మంది మాతృమూర్తుల్లో దాతృత్వకాంక్షను రగిలించి వారి క్షీరధార లతో ఎన్ని సేవానిధులు నిర్వహించినా ఆ శిశువులకు జరిగే అన్యా యాన్ని సరిజేయగలమా? చెట్లకు నీరు, ఫణులకు ఉరగపాలు, మధుపాళికి మకరందం, పశువులకు పచ్చి గడ్డి సమృద్ధిగా అందే ఈ సృష్టిలో శిశువులందరికీ కడుపునిండా తల్లిపాలు దొరికినప్పుడే గదా సమన్యాయానికి సరైన అర్థం! ఆ పరమార్థంతోనే చైనా ఇంజినీరింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆగ్రో బయో సాంకేతికశాఖ శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు సాగిస్తున్నారు. జన్యుపరమైన మార్పుల ద్వారా కేంద్ర నాడీ మండలాభివృద్ధికి, రోగనిరోధక శక్తికి తల్లిపాలతో సమానంగా పనిచేయగల క్షీరసంపదను ఆవుల్లో వృద్ధి చేయవచ్చని ఇప్పుడు తేల్చారు. చైనా పత్రికల తాజా కధనాల ప్రకారం రుచికి, శుచికి, ఆరోగ్యానికి, పోషక నిధులకు అన్నివిధాలా అమ్మపాలకు సరిపోలికైన ఈ 'ఆవుపాలు' అందరికీ మరో రెండేళ్ల లోపే అందుబాటులోకి రావచ్చు.  తల్లిలేని బిడ్డలకు, బిడ్డలకు పాలివ్వలేని తల్లులకే కాదు- తల్లిపాల ప్రయోజనాలన్నింటినీ ఎల్లకాలం పొందాలనుకునే వారందరికీ ఇది నిజంగా ఉల్లాసకరమైన వార్తే!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - నిజంగా గోమాతే పేరుతో నేను రాసినసంపాదకీయం - 24-04-2011 ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...