Saturday, December 4, 2021

నాలుక నివేదన- గల్పిక - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - దినపత్రిక ప్రచురితం )

 


హాయ్! నా పేరు నాలుక. పేరు పలకడం తేలిక. కానీ, నాతో పలికించే మాట నిలుపుకోవడమే కష్టం. గత్తర పడి నోరు జారి, ఆనక తత్తరపడి నన్ను కరుచుకున్న నేతలు చరిత్రలో కోకొల్లలు. 


నోటిలో  నేనే లేకపోతే నోటా లెక్కల్లో కూడా  ఎక్కలేని అర్భకులు నేతలంటూ ఆర్భాటం చేసే అస్తవ్యస్త ప్రజాస్వామ్యం  నాయనా నేడు  నడుస్తున్నది! ప్రజల బాగు ప్రణాళికలకు బదులు, జనాలపై    రువాబు చేసే నాలుకలకే నేటి రాజకీయం   మీఠా పాన్. మాట దూకుడు ఓ దశ దాకా   ‘అదుర్స్’ అంటూ కిక్కే ఇస్తుంది! ఆ దురుసుతనం  ముదిరితేనే ఇబ్బందేమిటో తెలుస్తుంది! నోట్లో నాలుక లేకపోతేనేమి, ఓటరు అసహనం పెచ్చు మీరితే వాచాల నేత పరిస్థితి వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ సామెతే!


నరం లేదనే కదా మా నాలుకలంటే చాలా మందికి అంత  చులకన!  పని చులాగ్గా అవుతుందని మహాశయా ప్రకృతి మాకిచ్చిందా వరం! ఈ మిడిమేళపు నేతలదే  కావరం!  మా బలాన్ని  బలహీనంగా మార్చేస్తున్నది ఈ దౌర్భాగ్య నేతాగణమే. బలహీనులను , అమాయకులను , నీతివంతులను, నిరపరాధులను, నిష్కల్మషులను, జంతుజాతిని, ఆడవారిని.. అందరినీ మాచేత అసందర్భంగా అల్లరి చేయించడమే! జనం  తలరాతలతోనే  ఈ తరహా నేతల  పిచ్చికూతల ప్రేలాపన! రోత! గతంలో వాతానికి విరుగుడుగా నాలుక పై వాతలేసేవారు! ప్రజావళే మళ్లీ ఆ తరహా మొరటు తరహా వైద్యానికి పూనుకోవాలి! నాలుక జాతి పక్షాన చెబుతున్నా! మాకు  నో ప్రాబ్లం! పజల బాగు కోసం బాధ ఎంతదైనా  భరించేందుకు సిద్ధం. దుష్టులతో జట్టు కట్టినందుకు  మాలోని కొన్ని నాలుకలు  ఆ మాత్రం శిక్ష అనుభవించక   తప్పదు ! 


నలుగురిలో మంచోడన్న గురి కుదరడానికైనా  నాలుక చేత  ఇష్టంగా పనిచేయించుకోవడం. . అదో కళ  నాయనా! నా పనితనం మీదనే నేతల పెత్తనం ఎంత కాలమో తేలేది. జనంలో చీలికలు తేచ్చే నీచత్వం నేతలదే!  ప్లీజ్.. మా నాలుకలకు మాత్రం ఆ పాపం అంటగట్టవద్దని ప్రార్థన! 


అడ్డమైన గడ్డీ గాదానికి అశపడేది ఈ నాయకుల  బానకడుపులు . అవి కుతి తీరా మెక్కి అరగనప్పుడు  అజీర్తిరోగం పట్టుకునేది  మాత్రం మా నాలుకలుకు . కక్కుర్తి నేతల అజీర్తి రోగానికి వైద్యుడి ముందు ముందుగా మేమే బైటపడాలి. అప్పుడు చచ్చే సిగ్గేస్తుంది. ఛీఁ! చిల్లర నేతగాడి నోట్లో నాలుకలా  పుట్టే కన్నా ఏ నల్లనాగు పడగలోనో చల్లంగా పడుంటడం మేలు!' అని నిట్టూర్పొస్తుంది. పుట్టించే నాథుడికే నన్ను  పట్టించుకునే దయ  లేదిప్పుడు. దుష్టనేత మీద ఘడియకో  ఫిర్యాదాయ ! ఎన్నని సరిచేయగలడు ఎంత దేవుడయితే  మాత్రం! పూరా డీలా పడిన ఆ దేవుడి దుస్థితి  చూస్తే ‘ఓ.. మై.. గాడ్!’ అని బావురమనకుండా ఉండలేడు ఎవడూ!


ఎక్కడ ఎందుకు ఎట్లా ఏ తీరున మెలగాలో... ఆ తరహా మాటా-మంతీ నడిపే శిక్షణ శిబిరాలేవీ మా నాలుకలకు ఎవరూ  ఏనాడూ నిర్వహించిన పాపాన పోలేదు ఎవరూ! అనుభవాన్ని బట్టి సమయజ్ఞత ప్రదర్శించే   నైపుణ్యం మాకు ప్రకృతి ప్రసాదించిన పుణ్య౦. చట్టాన్ని కూడా  తన పని తాను చేసుకుపోనీయని దుండగులు కొందరు దుష్ట నేతలు .. మా నాలుకలను మాత్రం మా మానాన ధర్మం మమ్మల్ని సక్రమంగా నిర్వహించుకోనిస్తారనేనా? కలలో మాట నాయనా!  అక్కడికీ ఫిర్యాదు చేద్దామనే ఉద్దేశంతో న్యాయదేవత వద్దకు  వెళ్లామా!  హక్కుల నేతల నోటి  నుంచి మా మొలర్ ఆలకించినా ఆ తల్లి మాత్రం ఏం చేయగలుగుతుంది? ఆమె నోటి నాలుక పరిస్థితి  అంతకు మించిన   దైన్య ౦! .. అంతా మా ఖర్మం!


ఒకరి నోటి నాలుకను ఒకడు తెగ్గోస్తామని ఎగురుడు! నోరు  మొత్తాన్నే ఏకంగా మూయిస్తామని  మరోడి మొరుగుడు! అన్ పార్లమెంటరీ భాషే ఇన్ పార్లమెంటును మించి  చట్టసభలు జరిగే రెణ్ణాళ్లూ ఇంటా బైటా చెవులను  దిమ్మెక్కిస్తుంటే..  తలెక్కడ పెట్టుకోవాలో తెలీనంత బాధ మా నాలుకలకు! 


ఎవరి నోట్లో ఉంటే ఏమిటిట! అందరి పుట్టిల్లూ ఒకే అమ్మ కడుపు కదా! పార్టీ కో  మాదిరి మాటలు  మార్చేస్తామని మా మీదనే మళ్లీ  అభియోగాలు! కుల మతాలు ఏమైతే ఏమి ? .. ఏ నాలుకకైనా చక్కని పలుకే అలంకారం.  తెగల పేరుతో నాలుకలు తెగ్గోసుకొనే దశ మనిషి  దాటి యుగాలయింది! అయినా లింగం, రంగు, నలుపు, తెలుపు అంటూ వీరంగాలా! ప్రతి   శాల్తీలో కనిపించేది ఒకే రంగు నాలుక కాదా! పిచ్చి కూతల బాపతు నేతలకు అందుకే నోటిలోని   నాలుక తెగ్గోసయినా ప్రజాస్వామ్యంరుచి చూపించాలి .    

'ఎన్ని సార్లని మా మొత్తుకోళ్లు!  ప్రాథమిక అవసరాలు మనుషలందరికీ ఒకేటేనుండీ ! జన్మ ఇచ్చిన అమ్మకు చెందినదే  స్త్రీ జాతి. కనడం, పెంచడం, సహోదరిగా ప్రేమను పంచడం, సహచరిగా జీవితాంతం బరువు బాధ్యతలు పంచుకోవడం.. సుదతి  ఎంత సహనంగా చేస్తో౦దో  సృష్టి ఆరంభం నుండీ!ఆడజాతిని అట్లా 'అమ్మనా.. ' బాషలో చెండుకుతినడం దుర్మార్గం! దుశ్శాసనులు, కీచకులు, దుర్యోధనులు చచ్చారన్న మాట నిజం కాదేమో ! ఇప్పటి దుస్థితి అట్లాగే అనుమానం వస్తుంది !  


మనిషి బల్లి కాదుగా ! నాలుకతో   పురుగులనేరుకు  తినడానికి! ప్రకృతి ప్రసాదించిన  వరం నాలుక!కేవలం తపాలా బిళ్లలు అంటించుకోవడం కోసమేనా ? ఇలాతలంపై జనాల కిచ్చిన స్వర్గ లోక  స్థాపన హామీ సైతం   నేరవేర్చడం నాలుక  బాధ్యత.   తెలివి మీరిన నేతల నోళ్లు మూత పడే వరకు ఓటరు మహాశయా  ఓపికగా నీ ప్రజాస్వామ్య  ధర్మం నిర్వర్తించు!  మనో వేదనతో మేం నాలుకలం చేసుకునే నివేదన ఆలకించు! 


- కర్లపాలెం హనుమంతరావు

23 -12 -2020

బోథెల్, యూ.ఎస్.ఎ


ఓం సహనావవతు - ఈనాడు ఆదివారం సపాదకీయం

 సాహిత్యం : 

ఓం సహనావవతు 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం) 


జీవవైవిధ్యం సృష్టి కళ. జీవనవైవిధ్యం మనిషి  సృజించుకొన్న కళ. సప్తవర్ణ సంశోభిత ఇంద్రచాపం మనిషి మాత్రమే ఆస్వాదించే సౌందర్యం. శృంగార హాస్య కరుణ శాంత రసాలతో మాత్రమే సంతృప్తి చెందలేదు మనిషి. వీర భయానక భీభత్స అద్భుత రౌద్ర రసాలనూ జత కలుపుకొని మరీ సంపూర్ణ భావోద్వేగానంద అనుభవాన్ని అందుకొంటున్నాడు. కట్టమంచివారి 'ముసలమ్మ మరణం' ఖండకావ్యారంభంలో మానవ భావవైవిధ్యాభిరుచిని అద్భుతంగా అద్దంపట్టే ప్రార్థన ఉంది. 'శ్రీల జైలంగు లోకముల సృష్టి యొనర్ప విరంచియై, తగం/ బాలన సేయ విష్ణువయి, వాని లయింపగ శూలపాణియై,/ లీల సరస్వతిన్ గలిమి లేమను భార్వతి గూడివెల్గు' దివ్యాలము శాంతతేజము మానవ మహార్తిని హరించే శక్తిగా కవి ప్రస్తుతించే మంచి రుచికరమైన పద్యం అది. 'అలుకనైన జెలిమినైన గ్రామంబునైన బాంధవముననైన భీతినైన దగిలి తలప నఖిలాత్ముడగు హరి జేరవచ్చు- వేరుసేయడతడు' అంటూ బమ్మెర పోతనామాత్యుడి ప్రహ్లాదుడు ప్రబోధించింది ఈ వైవిధ్యముక్తిలక్ష్య లక్షణాన్నే! త్రిమూర్తులలోని రుద్రుడిది రౌద్రముద్ర. 'కడిగి మూడవకంట కటిక నిప్పులు రాల/ గడు బేర్చి పెదవులపై గటిక నవ్వులు వ్రేల/ ధిమిధిమిధ్వని సరిద్దిరి గర్భములు తూగ/ నమిత సంరంభ హాహాకారములు రేగ' శివుడు ఆడి పాడిన శివతాండవఖేల రౌద్రరస పతాకస్థాయికి ప్రతీక. 'ఉగ్రరూపం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం / నృసింహం భీషణం భద్రం' అంటూ మృత్యువుకే

మృత్యుపై అవతరించిన నృసింహునిముందు శ్రీశంకరులు 'దాసోహం' అని తలొంచారు. అహంకారంతో, ప్రలోభంతో, భీకరాకృతితో మానసాలని పట్టి పీడించే భవబంధరాక్షసాలను వివేకమనే నఖాగ్రాలతో చీల్చి బాధోపశమనం ప్రసాదించడమే దాక్షిణ్యమూర్తి అవతార లక్ష్యం. ప్రహ్లాదుడికే ఆహ్లాదమందించిన ఆ వాత్సల్యరూపికి ఏ వివేకి అయినా దాసోహమవకుండా ఎలా ఉంటాడు? 



వివేకం మరో పేరే సంయమనం. తైత్తరీయోపనిషత్తు కాలంనుంచే మనిషి చెప్పుకుంటున్న బహుపరాక్కు 'ఓం సహనావవతు' వాక్కు. రాముడికి లక్ష్మణుడు తోడు. రావణాసురుడికి విభీషణుడు నీడ. అసహనం.. సంయమనం జతగా కలసి నడవవలసిన అగత్యం పురాణేతిహాసాలునిండా దండిగా ఉన్నవే. 'ఆసక్తే కాదు.. అసహనమూ అన్వేషణకు అవసరమైన దినుసే' అంటారు ఆస్కార్ వైల్డు. నిజమే. రుజాగ్రస్త దీనసమాజ హైన్యత్వం చూసి అశాంతి పాలయ్యాడు సిద్ధార్థుడు. ఆ తరువాతనే ముక్తిప్రస్థానంలో నడిచి తధాగతుడయింది. యుద్ధరంగంమధ్య విజయుడు విషాదయోగంలో పడ్డాడు. కనుకనే  బండినడిపేవాడి మిషతో భగవానుడు గీత బోధించింది! ధర్మానికి హాని కలగడం.. అధర్మం పెచ్చుమీరడం సహజమయితే కావచ్చు కానీ.. అదే అనివార్యమైన అంతిమ పరిణామచర్యగా మిగలడం ప్రమాదకరం. 'అభ్యుత్థాన మధర్మస్య సృజమామ్యహమ్'- అధర్మం పెట్రేగినప్పుడల్లా స్వీయసృజనతో ఆదుకొంటానని భగవంతుడంతటివాడు దిగివచ్చి మరీ భరోసా ఇచ్చిందీ బహుశా ధర్మసంస్థాపనోద్దేశంతోనే అయివుండవచ్చు. కాని పక్షంలో అలుగుటే యెరుంగని మహామహితాత్ముడు.. ఆ అజాతశత్రుడు  యలిగిననాడు సాగరాలన్నీ ఏకమైపోవా? దుష్టాత్ములు  పదివేవురు వచ్చినా చావరా! అందుకే అవాంతరాల సమయంలోనూ ప్రశాంత బుద్ధి ఎంతో అవసరం.  


విశ్వవిద్యాలయం మనస్తత్వ విభాగంలో పరిశోధనలు జరుగుతున్నాయి. పూర్వాశ్రమంలో అధికశాతం సంతృప్త జీవితం గడిపిన శాతం మధ్యతరగతి నడివయసు బృందంలో పొడసూపుతున్న కినుకలకు అధిక సామాజికాంశాలే కారణమవుతున్నట్లు తాజా పరిశోధనల సారాంశం. ప్రస్తుతజీవితంలోనూ అశాంతిపర్వమే నడుస్తున్నదని భావించే దిగువతరగతి యువబృందం సంఘర్షణలకు మాత్రం స్వల్ప వ్యక్తిగత సంఘటనలే ప్రేరణ అవుతున్నాయన్నది ఆ పరిశోధనల మరో కోణం. అలకలు, ఆందోళనలు ప్రపంచమంతటా ఏదో ఓ రూపంలో ప్రజ్వరిల్లుతున్న తరుణంలో ఈ పరిశోధనల ప్రాముఖ్యం పెరిగిందటున్నారు పరిశోధన బృందనాయకులు డాక్టర్ డేవిడ్ డి స్టెనో. దేశ ఆర్థిక వ్యవస్థమీదనే కాదు.. అంతర్జాతీయ సంబంధాలమీదా అసహన సంఘటనలు ప్రతికూల ప్రభావం ప్రబలంగా చూపిస్తున్నవని మన ప్రభుత్వ పెద్దలూ వాపోతున్నారు. మేధావులంతా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. 'ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీ చక్ర/ మిరుసు లేకుండగనే దిరుగుచుండు /.. ఏ ప్రేమ మహిమచే పృథివిపై బడకుండ/ కడలి రాయుడు కాళ్లు ముడుచుకొను'.. ‘ఆ మహాప్రేమ - శాశ్వతమైన ప్రేమ- అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ/ నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల' అన్నారు మన కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి! అసమ్మతి ప్రకటనకు మరెన్నో హూందామార్గాలు ఎదురుగా ఉండగా.. చిలిపి కారణాలేవో చూపి అలకపానుపు ఎక్కితే జనం దృష్టిలో చులకనయి పోరా ఎంత మేధావులు.. కవులు.. నటులు.. కళాకారులైనా! ఆలోచించవలసిన మంచి మాట!

***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం) 


డబ్బు కష్టాలు- సరదావ్యాసం


గడించడం కష్టం. ఖర్చు చేయడం కష్టం.. ఎవరెవరికో లెక్కలు చెప్పాలి. అట్లాగని దాచుకున్నా కుదరదు. దారాపుత్రులు ఊరుకోరు. ఎక్కడ దాచాలో  తోచదు. ఎవర్మని నమ్మాలి? ఎంత వరకు కుమ్మాలి? డబ్బు ఉంటేనే కాదు. డబ్బు అంటేనే కష్టంబాబూ!

అగచాట్లెందుకు.. అస్సలు డబ్బే వద్దన్నా దెబ్బై పోవడం ఖాయం! పూట గడవాలన్నా.. పూటుగా మందు కొట్టాలన్నా ముందుగా కావాల్సింది కరెన్సీనే కదన్నా?

పొరుగింటి మీనాక్షమ్మల్తో పోలిక పెట్టే ఆండాళ్లు ప్రతి ఇంటా ఉంటారు.ఓ ముత్యాల బేసరయినా ముక్కుకి తగిలించలేదని అలిగి కూర్చుంటారు. రేకెట్ నుంచి పాకెట్ దాకా అన్నింటికీ మనీతోనే పని. డబ్బు లేందే డుబ్బు క్కొరగాడన్న సామెతేమన్నా సర్దాకు పుట్టించారా అనుభవజ్ఞులు?

ఎన్నికల్లో టిక్కెట్ల ఇక్కట్ల సంగతట్లా ఉంచండి. చిన్నోడి ప్రీ-కాన్వెంటు సీటుకైనా పెద్ద నోట్ల కట్టలవసరమే కదప్పా! బ్లాక్ బస్టరని బోడి బిల్డప్పులిచ్చే ఓన్లీ వన్దే డే ఆడే చెత్త సినిమాకైనా బ్లాకులో తప్ప టిక్కెట్లు దొరికి చావని రోజుల్లో రొక్కాన్ని మరీ అరటి తొక్కలా తోసలవతల పారేస్తే పస్తులే!

పైసలుంటేనే పేరొచ్చేది .. మంచిదో.. చెడ్డదో! ఫోర్బ్స్ జాబితాలో కెక్కించేదీ.. ఫోర్ ట్వంటీ కేసుల్నుంచీ తప్పించేదీ మనీనే! మనీ మేక్స్ మెనీ ట్రిక్స్!

బ్యాంకప్పుల వంకతో పైసా వసూల్. తిరిక్కట్టమంటే ఇంటి పై కప్పుల వంక చూపులు! వీల్చూసుకొని విదేశాలకు చెక్కింగ్స్!మంచి స్కీమ్సే కావచ్చు కానీ.. విమాన టిక్కెట్లకు సరిపడా అయినా మనీ తప్పని సరే కాదా.. దటీజ్ డబ్బూస్ పవర్!

బిర్లా టాటాలకి ఏ పేరొచ్చినా, అదానీ అంబానీలకి ఏ 'కీ' రోలిచ్చినా కీలకమంతా పర్శులోని కాపర్సుదే! బిట్స్ పిలానీ టు.. బిట్ కాయిన్స్ వరకు అంతా కాసుల తిరకాసులే!కాదంటే కుదరదు సుమా!

కుదురుగా ఉండనీయదు డబ్బెవర్నీ! పెద్ద నోట్లనట్లా అర్థరాత్రి కల్లా హఠాత్తుగా రద్దు చేయిందా లేదా? పెద్దాయన పేరనట్లా ఊరూ వాడా మారుమోగించిందా.. లేదా? బ్యాంకులంటూ కొన్ని డబ్బుండేచోట్లు మన దేశంలో కూడా పనిచేస్తుంటాయని జనాలకు తెలిసింది. ఏటియంలంటే ఏంటోలే.. పెద్ద కొలువులు చేసుకొనే చదువుకున్నోళ్లు నోట్ల కోసం నొక్కుకునే యంత్రాలని మామూలు జనాలకు అవి ఖాళీ అయినప్పుడే తెలిసింది! అందీ డబ్బు దెబ్బ! ఉన్నా సంచలనమే.. లేకున్నా సంక్షోభమే!

డబ్బు లేందే అప్పులుండవు. అప్పులంటే వూరికే ఎగేసేందుకు తీసుకొనే సొమ్మా కాదు.. సర్కార్లు ఓట్ల కోసంమాఫీలు చేసేందుక్కూడా. ఏమైనా అంటే ఆర్బీఐ వూరికే ఫీలయిపోతుంది కానీ.. బాకీలు మాఫీలు లేందే ఏ రాజకీయ పార్టీ అయినా సాఫీగా హామీలిచ్చేదెట్లా? అధికారంలోకి ఎగబాకేది ఎట్లా?

ఒక్క ‘పవర్’తోనే కాదు డబ్బుకు పరువూ ప్రతిష్ఠల్తో కూడా లంకే! డాలరు డాబు చూసుకొనే అమెరికావాడి ఆ రువాబు. ప్రపంచం అమెరికా చుట్టూతా గిరిటీలుకొడుతున్నా.. అమెరికావాడు డాలరు చుట్టుతా గింగిరాలు కొడుతున్నా అంతా ఆ సొమ్ములో ఉన్న గమ్మత్తు వల్లే. ఆ డాలరు మీద దెబ్బేద్దామనే చైనావాడిప్పుడు సిల్కు రోడ్డుతో తయారవుతున్నాడు.సిల్క్ స్మిత నుంచి.. సిల్క్ రోడ్డు దాకా అందరికీ డబ్బుతోనే బాబు డాబు!

నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలేమన్నా పన్లేక సతాయిస్తారా? ఎప్పుడు ఏ రాయికి ఎంత విలువ పెరుగుతుందో దేవుడికే తెలియాలనుకుంటాం. ఆ సూక్ష్మం వంటబట్టకే దేవుడూ ఓ రాయిగా మారిపోయాడు. భక్తులు హుండీల్లో వేసే రాళ్లతో లోకతంత్రం నడిపిస్తున్నాడు!రూపాయిల నోట్ల మీద కనిపించక పోయుంటే పాపం గోచీపాతరాయుడు బాపుజీని అయినా పట్టించుకొనుండేదా ఈ డబ్బు పిచ్చి లోకం?

గౌరవనీయమైన పదవుల కోసం ఘోరంగా కొట్లాడుకుంటుంటారు నిస్వార్థ ప్రజాసేవకులు. గౌరవంగా ఓ రూపాయి వచ్చినా మనీ మార్కెట్లో దాని మార్పిడి విలువ ఎన్ని కోట్లుంటుందో?

డబ్బు మీదే ప్రజానేతకీ నిజానికి బొత్తిగామమకారముండదు. కానీ ఎన్నికల తంతుకు కావాల్సిందే డబ్బు మూటలు కదా! అభిమానసందోహం ఆనందంగా కోట్లు ధారపోస్తామన్నా ఎన్నికల సంఘం నిమ్మళంగా ఉండనీయదు. అందుకే ఎన్నికలకు ముందు నెల్లాళ్లు నేతలు ఎన్నడూ ఎరగని కాయా కష్టానికి తయారయేది. పలుగూ పారా పట్టినా, మట్టి మూటలు నెత్తికెత్తినా, రోడ్దు పక్క టీ కాచినా, రొప్పొచ్చేటట్లు రిక్షా తొక్కినా.. కూలి కింద గంటకు ఓ ఐదారు లక్షలు తగ్గకుండా గడించేది.

డబ్బుంటేనే కోర్టుల్లో ఏ పిల్ అయినా వేయగలిగేది.. ఏ జింఖానా కోర్టుల్లో అయినా ఐపిఎల్ ఆడగలిగేది! డబ్బుంటేనే అబ్బా.. చర్లపల్లి జైలైనా చల్లపల్లి రాజావారి బంగళాలా చల్లంగా ఉండేది.

డబ్బున్న వాడికి నేరాలతో నిమిత్తం లేదు. బేళ్ల కొద్దీ నోట్లు మనవి కాదనుకుంటే చాలు.. బెయిళ్లైనా దానంతటవే నడుచుకొచ్చేస్తాయ్! మరో అప్పీలుక్కూడా ఆస్కారం ఉండదు.

రూకల్లేకుంటే లోకానికి లోకువ. డబ్బున్న మారాజుకే మొక్కే బుద్ధి దానిది. ఈ కలియుగమాహాత్మ్యం వడపోసిన మహానుభావుడు కాబట్టే అంతెత్తున ఏడుకొండల మీద కొలువై ఉన్నప్పటికీ హుండీలు నిండుగా భక్తుల నుండి డబ్బులు దండుకొంటున్నాడు వడ్దికాసులవాడు.కళ్యాణ కట్టలో ఉచిత క్షౌరం చేసే చోట కూడా.. కాస్త చెయ్యి తడపందే కత్తెర మెత్తగా పడదు. పర్సు ఖాళీగా ఉన్నవాడంటే దేవుడుక్కూడా పడదు.

నోట్ల విలువ తెలియాలంటే సర్కారు కచేరీలే సలీసైన చోట్లు. అక్కడి కార్యాలయాల్లో అన్నేసి బల్లలు ఎందుకున్నాయో ముందా సూక్ష్మం తెలుసుకోవాలి తెలివున్న వాడెవడైనా. చాయ్ పానీకనిఎంతో కొంత పడితే గానీ స్ప్రింగు డోరును బార్లా తెరవనివ్వడుబిళ్ల బంట్రోతు. దఫ్తర్లో ఏ పనికయినా అంకురార్పణ జరిగేది ముందు మేజాబల్ల మీద కాదయ్యా.. బల్ల కింద! గుడ్దిగవ్వంతయినా విలువ లేకుంటే ఎందుకంతలా కిందా మీదా పడి ప్రజాసేవకులు కక్కుర్తి పడేది? ధన మూలం ఇదం జగత్! ఏ మూల చూసినా డబ్బు గమ్మత్తులే దుమ్ము లేపేస్తున్నప్పుడు .. నిప్పులాంటిబతుకని డప్పేసుకు తిరిగే అమాయకుడికి కూట్లోకి పప్పే కాదు ఉప్పు కూడ దొరకదు.

అన్నదాతలకు నేరుగా అంతంత సొమ్ము సర్కార్లు ధారపోస్తున్నాయ్ ఉదారంగా! ఉద్ధరించేందుకా? డబ్బు దెబ్బ తెలుసు కాబట్టే ఎన్ని డబుల్ బెడ్రూంలు కట్టించినా పోలింగు రోజు ఓటరు చేతికి చీటీకింతని ముట్ట చెపుతున్నాయ్అన్ని పార్టీలూ!

ఆకాశమంత పందిర్లేసి.. భూలోకమంతవేదికల మీద ఎన్నొందల సార్లు రిలే ఆమరణ దీక్షలకైనా కుర్చమనండి.. ఆ ఎన్నికల ఆఖర్రోజున ఎవరెక్కువ పాడుకుంటారో వాడికే ఓటు పడేది! దటిజ్ నోట్ పవర్!

డబ్బు మత్తు డ్రగ్సు కన్నా చెడ్డది. డ్రగ్సు కేసుల్నైనా అది గమ్మత్తుగా గాయబ్ చేసేస్తుంది. నలుపో తెలుపో .. డబ్బున్న వాడి ముందు సర్కార్లైనా చేతులు నలుపుకుంటూ నిలబడక తప్పదు. వాడి గల్లాపెట్టె మీద దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం ఎంత ల్యాంద్ సైడువిజేతకయినా బ్యాండ్ భజాయింపు తప్పదు.

కనక.. కేసులు సంగతి ఆనక చూసుకోవచ్చు మహాశయులారా! ముందుసూట్ కేసుల సంగతి పట్టించుకోండి! బ్యాంకులు వట్టి పోతే ఓటుబ్యాంకుకు గట్టి ముప్పు. ఇంకూ.. పేపరూ లేదని మంకు పట్లు వద్దు. ఎమ్టీ ఏటీఎమ్ములు ఎంతలావు వస్తాదుల్నైనా పల్టీ కొట్టించేస్తాయి!

సిబిఐ సంగతి ఆనక.. ముందు ఆర్బీఐ సంగతి చూడండి బాబులూ!

-కర్లపాలెం హనుమంతరావు


రైలో రాకు రాకు - ఈనాడు - గల్పిక

 



ఈనాడు - గల్పిక 

రైలో .. రాకు .. రాకు ! 



( ఈనాడు దినపత్రిక - సంపాదకీయపుట - 11, సెప్టెంబర్, 2003 - ప్రచురితం ) 



' రైలుస్టేషన్ ఊరుకింత దూరంగా ఎందుక్క ట్టారనుకున్నారూ? ' 


' పట్టాలకు దగ్గరగా ఉండాలని'  


' పట్టాలనే ఊళ్లో వెయ్యచ్చుగా? ' 


' హన్నా!  ఉళ్ళో వాళ్ళ ప్రాణాలు ఉండాలనే! ' అన్నాడు ముకుందరావు ముక్కుమీద వేలేసుకుని హాశ్చర్యాభినయాన్ని పండిస్తూ . 


నందిగామ  - బందరు రూట్లో రైలు బండేదో గేటు దగ్గర నిలబడ్డ గవర్నమెంటు బస్సునొక దాన్నింత  గీరుకుంటూ పోయిందని న్యూసుపేవర్సన్నీ తెగ న్వూసెన్సు చేసేస్తుంటే  చివరాఖరికి   రైల్వేవారిచేత  ఏకసభ్య నిజనిర్థారణ కమీష నొకదాన్నేయించుకుని  

చైర్మన్ హోదాలో  విచారించి రిపోర్టుతో సహా రాజధానికిప్పుడు రిటనొస్తున్నాడుట ఆ  ముకుందరావు . 


ఎదురు సీట్లో నేనున్నాను. ఊరుకోవచ్చుగా ! 


' మొన్న బెంగుళూరెక్స్ ప్రెస్సూ, నిన్న మన్మాడెక్స్ ప్రెస్సూ, మధ్యలో తిరువణ్ణామలై  టు గుంటూరెక్స్‌ప్రెస్సూ, నేరేడుమెట్ట దగ్గరేదో గూడ్సు బండీ .. ఇట్లా ఈ మధ్యలో మన దక్షిణ మధ్య రైల్వే చుట్టూతానే  ప్రదక్షిణాలు చేస్తున్నాయెందుకంటార్గురూ గారూ! మన దక్షతా? ' అనడిగా . 


' రైల్వే డిపార్ట్ మేమన్నా మనమిప్పుడు కూర్చుని పోయే కంపార్ట్ మెంటంత చిన్నదాండీ! ఉత్తరాన్నుంచి  దక్షిణం దాకా , పటమట నుంచి తూర్ప దిక్కు వరకూ పరుచుకున్న మహా ప్రయాణ వ్యవస్థ కదండీ! ఎన్ని అవస్థలుంటాయీ! మీ ప్రెస్సువాళ్లకేంలే!  .. ఒక్కక్స్ ప్రెస్ స్లైట్ గా ఇట్లా పట్టాల పక్కకు జరిగినా  పట్టరానంత రాద్ధాంతం చేసేస్తారు ' అన్నాడతను మహా  నిష్ఠురంగా . 


'అయితే బోగీలేవో  సర్దాకి  పట్టాలు దూకితే మేమే యాగీలు  చేస్తున్నామని మీ  అభియోగమా ? ' 


'అనుమానమా! సర్దాకు  ఏవో రెండింజన్లు ఇట్లా ముద్దెట్టుకోడమాలస్యం బాబూ .. అంతంత అచ్చక్షరాల్లో  మీ డాబు చూపించాలా ? '


' ఏ మాట కా మాటే.  మీ రైల్వే వాళ్ల రూటే వేరండీ! . ప్రమాదాలేవైనా సరే మీ రైల్వే బోగీల్లాగా ఒక దాని  వెంట ఒకటి వరస తప్పకుండా జరిగేస్తుంటాయి  సుమా! కానీ ఘడియ ఘడియకీ గాడి తప్పే మీ రేల్ గాడీ సవారీతో ప్రయాణీకులకే ఎంతా  సఫరో మీకెలా అర్థమయేది? రైలు బండి ప్రయాణమంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయండీ ఈ మధ్య ! ఇహా రైలు కూపేలన్నీ నరకాని కెళ్లే కూపన్లనే  తలపిస్తాయి  స్వామీ! 'నీ వెక్కాల్సిన రైలు ఓ జీవితాకాలం లేటు ' అన్న కవిగారిప్పుడు లేటుకవిగారయిపోయారు గానీ, బతికే ఉండుంటే ఏమనుండేవారో తెలుసా అండీ? ' నీవెక్కేశావా రైలు బండి .. ఇక నీ జీవితమే అవుతుంది 'లేటు' సుమండీ ' - అని . 


చప్పట్లు కొట్టాడు ముకుందరావు. 


'నిజవే! రైలు బండి నడవక పోయినా లేటే. నడిచినా లేటే. వాస్తవానికి చావటానికి పట్టాలపై తలపెట్టి పడుకోడం చాలా పాత పద్ధతి. రైలెక్కి కూర్చుని ఇంచక్కా పైలోకాలకు చెక్కేయడం లేటెస్ట్ పద్ధతి.  సూయిసైడ్ కు లైటర్ సైడీ  మా రైలు జర్నీ నే.. ఒప్పు కుంటాన్లే స్వామీ i అన్నాడాయనే  రెండు చేతులా జోడించేసి  . 


ముకుందరావు మాటలతో ఓ కథ గుర్తుకొచ్చింది. 

ట్రైన్ జర్నీలో ఇట్లాగే ప్రయాణాలు పోగొట్టుకున్న చాలా  మందినోకేసారి విచారించి శిక్షలు ఖరారు చేస్తున్నాడట ఓసారి యమధర్మరాజుగారు  . హరిదాసుగారి వంతొచ్చింది. 'నరకానికే' అని గదమాయించారా నరకలోక స్వామి .  కానీ వెనకమాలే ఉన్న  రైలింజను డ్రయివరుకు మాత్రం స్వర్గం  శాంక్షనయింది! 'నిత్యమూ హరినామ స్మరణతో భక్తులకు ముక్తిమార్గం బోధించే నాకు నరకమూనూ .. వేలాది మంది ప్రయాణీకుల ప్రాణాలకు  భూలోకంలోనే యమలోకం చూపించే  ఈ రైలింజను డ్రయివరుకు మాత్రం స్వర్గమూనా? తొండి ' అంటూ ఆ హరిదాసుగారు అరిగస్పీలు చేస్తే   ' నీవు చెప్పే  చిడతలకథ  తీరుకు భక్తజనులంతా  నిద్దర్లకు పడి భగవంతుణ్ణి సైతం మర్చిపోతున్నారయ్యా  హరిదాసూ ! కానీ, ఈ డ్రైవరు రైలుబండి  నడిపే జోరుకు ప్యాసింజర్లంతా నిద్దర్లు మరచి మరీ  భగవంతుణ్ణి మాత్రమే మరి పార్థిస్తున్నారయ్యా  సామీ!  నీ నరకం  .. అతగాడి స్వర్గం ఎంట్రీలకు అదే అసలు రీజన్  ' అని తేల్చేశాడుట ఆ సమవర్తి. 


ముకుందరావు ఠక్కున పేపరేదో తీసి గిలుకుతున్నాడు! 'జపాన్లో బోడి బుల్లెట్‌రైలు  పట్టాలకు బెత్తెడెత్తున పరుగెడితేనే  ఆహా.. ఓహో అంటూ హారతులు పడతాం కదా!  అదే మరి మన రైళ్లు అసలు పట్టాలే లేకుండా పరిగెత్తినా ఎవరూ పట్టించుకోరేమండీ  ? ! ' అన్నాడు ముకుందరావు ముక్కెగబీలుస్తూ  . 


'నిజమే! మనట్రయిన్లీ మధ్యసలు పట్టాలనే   పట్టించుకోడం మానేశాయ్! గూడ్సు  బండి క్కూడా నడిచే ట్రాకంటే మహా నామోషీగా తయారైంది వ్యవహారం . ప్యాసింజరు బళ్లయితే ఏకంగా ఊళ్ల మీదకే వచ్చేస్తున్నాయి సుమా.. చికుబుకు చికుబుకు రైలే .. అదిరెను దీని స్టయిలే! ' అనేసుకుంటూ .' 

 

' మరే! అవే ప్రగతి పరుగులు బాబూ! ప్రగతి ప్రకారమే ప్రమాదాలు కూడా! ప్రమాదాలే ప్రగతికి నేటి  ప్రమాణాలు కూడా  . యాక్సిడెంట్లేవీ జరక్కపోతే లూప్ హోల్స్ తెలిసేదెలాగండీ ? ' 


లూప్ లైన్లో నుంచి చల్లంగా జారిపోవాలని చూస్తున్నాడీ ముకుందరావ్ మాష్టారు . 


పల్టీలు కొట్టే బోగీలకు మల్లే  మాటల్తో పల్టీలు కొట్టించాలని చూస్తారీ ముకుందరావంటి రైల్వే రకాలు .  ట్రయినేక్సిడెంట్ల  వెనకున్న రీజన్స్ కనుక్కోడం కర్ణుడి చావుకేవి కారణాలో  కనుక్కోడం కన్నా కష్టం. . ' అన్నాడాయనే  చివరకు నాకు  నచ్చచెబుతున్నట్లు. 


నిజమే! బెంగుళూరెక్స్ ప్రెస్ యాక్సిడెంటు మీద ఇప్పటి వరకూ ఠింగూ ఠికాణా లేదు. 

యాక్సిడెంటుకు కారణాలు యక్స్ .. వై. . జడ్ ఏవైతేనేం.. పోయే ప్రాణాలు మాత్రం మా పేసింజర్సువేగా !  రైలు బోగీల కిందపడి రోజూ ఎన్ని  బతుకులు  చితుకుతున్నాయో! గణాంకాల కందని విషాదపర్వమది. ఉత్తరాది ఖన్నా గారినందుకే సెక్యూరిటీస్ లోని కన్నాలు కనిపెట్టమని ఈ దక్షిణాదికి తరిమికొట్టిందీ రైల్వేడిపార్ట్మెంట్. ఖాన్నాగారెన్ని రిపోర్టుల్లో ఖన్నుడైనా కనీసం పోర్టరన్నా  పట్టించుకోనప్పుడు  వాటి వల్ల ప్రయోజనమేంటి..  సున్నా . చిత్తశుద్ధి లేని  ఉత్తుత్తి ఉత్తర్వుల్తో మత్తులో జోగే యంత్రాంగం తోలొల్చే  మరమ్మత్తు సాధ్యమనే!  


' మన జనాలక్కూడా  రైళ్లంటే మహా అలుసులేండీ! .  ఊళ్లో ఏ గొడవలు జరిగినా ఊరి బైట కొచ్చి పట్టాలు పీకేస్తారు. గోద్రావిద్రోహులకైనా ,నకిరేకల్లు నక్సలైట్లుకైనా,  స్టూవర్ట్ పురం గొలుసు బేచికైనా , వార్ వారికైనా, ఎవరి వారుకైనా రాళ్లేసుకోడానికి రైళ్లే కావాలా ? ' 


'ట్రూ! బళ్ళాపడానికి చైన్లు లాగడాల్లాంటి చాదస్తాలిప్పుడెవరికీ లేవులేండీ! . పట్టాలు పీకేస్తే సరి. బండన్నా ఆగుతుంది. లేదా చచ్చినట్లు పడిపోతుంది. '  అంటూండగానే..  


నిజంగానే మాబండి ఒక్క కుదుపుతో అదుపు తప్పినట్లెగిరి పడి ఆగి పోయింది! పట్టాలు పీకి పారేశారా ఏం కొంపదీసి ? నిర్ధారణ కోసం బైటికి తొంగి చూస్తే. .  ఊళ్లలో  నుంచి జనం పరుగులెత్తుకొంటో  వస్తున్నారిటేపే ! 


పక్క కూపేలో  ఎవరో మంత్రి గారున్నార్ట . కొత్త రూటు కావాలని అడగడానికనుకుంటా! 


'ఇప్పుడే వస్తా! అందాకా చూస్తుండండి ' అంటూ ఓ కాగితాల కట్ట నా మొహాన కొట్టి మాయమైపోయాడీ  ముకుందరావు చిటికెలో! 


నందిగామ - బందరు రూటు యాక్సిడెంటు తాలూకు రిపోర్టది. మంచి హ్యూమరస్ గా ఉంది. 


హ్యూమన్ లాస్ లో కూడా హాస్యం ఏమిటి ? అంటారా!  ఏడ్చే విషయాలైనా సరే..  నవ్విస్తూ చెబితేనే జనం చెవ్విస్తున్నదీ కాలంలో. 


పెళ్లాం ప్లేట్ నిండా ఫిష్ కర్రీ వడ్డించలేదని వళ్లు మండి గేట్ మ్యానే  ట్రాక్ ఫిష్ ప్లేటు క్రాక్ లా తొలగించాడని తేలిగ్గా తేల్చేసిందీ కమిటీ రిపోర్ట్ . 


ఏ మాటకామాటే. మా బందర్ సైడు ఫిష్ మహ భేషైన టేస్ట్ . ఆ రుచి మరిగే ఈ ముకుందరావీ   రిపోర్టు ఇంత ' ఫిషీ ' గా తమార్చెయ్యలేదు గదా! 


పనిలో పని . ముకుందరావీ నివేదికలో చైర్మన్ హోదా లో చేసిన  సవాలక్ష సూచనల్నుంచి  మచ్చుక్కి కొన్ని పదనిసలు .. చదువరుల కోసం : 


1. ప్రతి టిక్కెట్టు మీదా ' రైలు ప్రయాణం మీ ప్రాణానికి ప్రమాదం | అంటూ చట్టబద్ధమైన హెచ్చరిక చెయ్యడం  తప్పనిసరి . 


2 . కూపేలన్నింటిలో హరినామస్మరణ ప్లేట్ల సంఖ్య బాగా పెంచాల్సి న అవసరం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 


3. సిబ్బందికి ఇబ్బంది లేకుండా  క్రమశిక్షణ క్రమంగా అలవడే  శిక్షణ ఈ క్షణం నుంచే ప్రారంభించాలి  . ప్రమాదాలు జరిగినప్పుడు విచారణ సందర్భంలో  అవాస్తవాలైనా  సరే.. సాక్ష్యాలు ఇచ్చే వేళ  తడబాటు లేకుండా అందరూ ఒకే ట్రాకుపై బండి నడిపించే   లక్ష్యమే శిక్షణగా నేర్పించాలి  . 


4. ప్రమాదాలు ఆశించిన మోతాదు మించుతున్న సందర్భంలో .. మొహమాటం లేకుండా బండ్ల సంఖ్యలో భారీ కోత విధించుకోవచ్చు .  ఛార్జీలనూ , సర్ ఛార్జీలనూ దారుణంగా పెంచడం ద్వారా మరణాల రేటునూ  నిరుత్సాహపరచవచ్చు. 


5. గ్యాంగ్ మెన్లు ట్రాకుల జోలికి, స్టేషను మాష్టర్లు ఊళ్ల  బయటకు, గార్డులు ఇంజన్ ఛాంబర్లలలోకి పోకుండా తాగు  చర్యలు తీసుకుంటే ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఎక్కువ. 


6. యాక్సిడెంటయిన తరువాత సస్పెండయిన డ్రయివర్లను బలంపిక్ ఈవెంట్స్ కు కోచ్ లుగా నియమించుకోవచ్చు. 


ఇంకా.. ఇలాంటివే సవాలక్ష . 


ఇంతలో ముకుందరావుగారు  పొట్టచేత్తో పట్టుకుని పరుగెత్తుకుంటో బోగీలోకి వచ్చిపడ్డారు! 


వచ్చే రొప్పు  బైఫోర్స్ ఆపుకుంటూ అన్నారూ ' ఆ మహజరుందే.. మహా మజాగా ఉంది సారూ! ఆ మొత్తుకోళ్లు కొత్తరూటు కోసం కాదు . ఉన్న రూటు మొత్తం పీకి పారెయ్యాలని.  పిచ్చికుక్కల్నంటే తరిమిగొట్టగలం గానీ .. పిచ్చెత్తినట్లు ఊళ్ల  మీద కొచ్చిపడే  రైళ్లనెలా ఆపగలం? దేవుడిచ్చిన కాళ్లలో సత్తువున్నంత కాలం మా తిప్పలేవో మేం పడతాం గానీ, మీ పాడు రైళ్లు మాత్రం మా ఊళ్ల  మీదుగా వెళ్లద్దు. పాడు పట్టాలు వెంటనే పీకేయండె  మహాప్రభో! ఎన్నికల్లోగా ఏ యాక్షనూ లేకుంటే  ఆ పీకుడేదో మేమే చేసుకోక తప్పదు! .. ఇది గురూ గారూ! ఆ మహాజరు సారాంశం ' 

' అంటే .. అర్ధం. రైల్ రోకో నేగా ?' 

' కాదు.. కాదు.. రైలో. . రైలో రాకో .. రాకు!  ' అనసలు అర్థం. 

ఫెడీ ఫెడీ మంటూ నవ్వే ముకుందరావు గారు నవ్వాపుకోలేక ధడాల్మని బెర్తు మీదలా పడిపోయారు .. అచ్చు నిన్ననే బెజవాడ బ్రిడ్జి మీంచి కృష్ణలో పడ్డ గోల్కొండ ఎక్స్ ప్రెస్ లా ! 


- కర్లపాలెం హనుమంతరావు రాకు

( ఈనాడు దినపత్రిక - సంపాదకీయపుట - 11, సెప్టెంబర్, 2003 - ప్రచురితం ) 





చిల్లర మల్లర మంచితనం - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం )

 



హాస్యం - సూర్య దినపత్రిక 

చిల్లర మల్లర మంచితనం

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం ) 




ఏ రకంవో గానీ.. మొత్తానికి ఏవో రకం ఎన్నికలకు నగారా మోగేందుకు వాతావరణం సిద్ధమవుతుంది! మా పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో పై స్థాయి పెద్దలు పనుపున  వచ్చిన  చిన్నస్థాయి పెద్దలు  మా బుల్లిస్థాయి పెద్దలనందర్నీ హెచ్చరించడం కూడా అయిపోయింది. ఈ సారి 'ఏం చేసైనా సరే'.. పార్టీ అభ్యర్థుల్ని ఆయా ప్రాంతీయ బాధ్యులే  గెలిపించి తీరాలంట!

‘ఏం చేయించడానికైనా' మేం సిద్ధంగా ఉంటే సరా? ఏమైనా చేసేందుకు మా కార్యకర్తలూ  సిద్ధంగా ఉండాలి కదా! అసలు కార్యకర్తలు మిగిలుండాలి కదా? ఖర్మ!

అధికారంలో లేనప్పుడు జెండాలు భుజం దించకుండా.. సొంత సొమ్ము తగలేసుకొని మరీ ఊరేగినోళ్లను.. పార్టీ అధికారంలోకి వచ్చినాక.. పులుసులోని ముక్కల్లాగా పక్కన పెట్టింది. అలిగి పక్క పార్టీల్లోకి గెంతేసారంతా. ‘చుక్క.. ముక్క.. ఏర్పాట్లు ఆ పక్క పార్టీల కన్నా ఇంకాస్త  మెరుగ్గానే చూస్తాం. మాతృపక్షంలోకి రమ్మ’ని  హామీ ఇమ్మంటున్నారు మమ్మల్ని. హామీలు  నమ్మి గోదాట్లోకి దూకే రోజులన్నా ఇవి? అవతల పార్టీలు.. పాపం..  పదవుల్లో లేకపోయినా ఆప్పో సప్పో చేసి మమ్మల్నింతకాలం మేపుతున్నది ఈ ఎన్నికల కోసమే కదా!  మళ్లా వాళ్లకీ వెన్నుపోటంటే బాగుంటుందా?' అని సుద్దులు చెబుతున్నారు పాత కార్యకర్తలు. ఇహ వాళ్ల వైపు నుంచి ఇదివరకట్లా సభల్లో చెప్పులు, ప్రచారంలో సిరాలు, కేన్వాయీల కడ్డంగా పడుకోడాల్లాంటి  అల్లర్లు   కల్లో మాటే మా పార్టీ వరకు. 

ఈ మధ్య యోగాగురువులు, స్వాములార్లు, వ్యక్తిత్వ వికాస పాఠాలు మప్పి పోయేవాళ్ల సేవలు ముమ్మరించాయి అన్ని పార్టీల్లో. అల్లరి కార్యకర్తలకు ఎక్కళ్లేని కరువొచ్చింది అందుకే. చిల్లర పన్లేవీ చెయ్యకుండా ఎన్నికలు నెట్టుకొచ్చేందుకు  మనమింకా సంపూర్ణ రామరాజ్యంలోకి రాలేదు కదా! 

మేం ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఏ పెద్దమనిషి నుంచైనా మాటవరసకు    ఒక్క  మాట సాయం అందిదా? పార్టీ పోస్టర్లనుంచి.. ఎగస్పార్టీ అభ్యర్థుల ఊరేగింపుల మీద వేయించే రాళ్లూ రప్పా వరకు అన్ని తిప్పలూ మేమే పడ్డాం. ఎన్నికల సంఘం లెక్కలడిగినప్పుడు ఎన్ని యాతనలు పడ్డామో పరమాత్ముడికే తెలుసు. అప్పుడూ మాకే బిల్లు. ఇప్పుడూ మా పర్సులకే చిల్లు! 


గతం గుర్తుచేసుకుని కుళ్ళుతూ కూర్చుంటే  భవిష్యత్తుండని పాపిష్టిది ఈ  పొలిటికల్ ఫీల్డు.

 రాహుల్ బాబును చూసి గుండె నిబ్బరం చేసుకోవడమేగానీ.. నిజానికి ఇంట్లో కూడా చెప్పకుండా సెలవు చీటీ పారేసి ఇంచక్కా ఏ స్విండ్జర్లాండుకో చెక్కాలనిపిస్తుందప్పా! 

నిలబెట్టిన వాడ్ని గెలిపించే బాధ్యత అడక్కుండానే అంటగడుతున్నాయి. సరేనయ్యా.. అది అధిష్ఠానాల హక్కు! లోకల్ ఎన్నికలప్పుడు  సిగ్గిడిచి కాళ్ళూ గడ్డాలు పుచ్చుకున్నా  కోరుకున్న కొడుకూ అల్లుళ్లకు టిక్కెట్లేమన్నా దక్కాయా?   ఎక్కడెక్కణ్నుంచో గాలించి మరీ  నిజాయితీలో నిఖార్సులంటూ  నిలబెడతారంట ఇక్కడ!  గెలిపించి తీరాల్సిన పూచీ  మా నెత్తికి చుట్టేట్లున్నారు!   

అతి నిజాయితీ,  నీతికి ప్రాణమిచ్చే పిచ్చిబుద్ధి.. ఏం చేసుకోనబ్బా ఈ పుచ్చు రాజకీయాల్లో? ఓటరుకే మాత్రం  సంబంధం లేని   మేధావుల గుంపును  గెలిపించే పూచీ మా నెత్తికి  రుద్దితే.. గట్టెక్కించడం అంత తేలికా?

అవతల పార్టీల్నుంచి కాలు దువ్వేది  గుత్తేదార్లు, పారిశ్రామికవేత్తలు, కొలువుల్లో ఉన్నప్పుడు  చేయరానివి, చెప్పకూడనివి ఎన్నో చేసి  మీడియా  పుణ్యమా అని ప్రజాసేవకుల జాబితాలో దూరేసిన దొరలు.  నీతివంతుడన్న చెడ్డ పేరు వచ్చి పడ్డాక ఎంత పెద్దమనిషినైనా    ఎన్నికల గుండం నుంచి బైటపడేయడం ఎంత కష్టం?

మూడొంతులు పైగా  వేలి ముద్దరగాళ్లే గట్టి బలగంగా గల మా  ఇలాకాలో విదేశాల్లో చదువుకొన్న  విద్యావేత్తను గట్టెక్కించడం కంటే  వరద పొంగులో నిండు గోదారికి ఎదురీదుకొంటూ వెళ్ళి కొట్టుకు పోయే గాడిదను గట్టుకు ఈడ్చడం సులువు.  గట్టెక్కడానికి  సొంతంగానే గజీత రానక్కర్లేదు. చిల్లర మోతగాళ్లున్నా చాలని మా పార్టీ పెద్దల ఉద్బోధ. నిజమే కానీ మోసే చిల్లరగాళ్లకే ఎక్కళ్ళేని కరవొచ్చి పడిందిక్కడ మా పార్టీలో. ఆ ఉపద్రవం  పసిగట్టినట్లు లేదు పార్టీ పెద్దలు.

అభ్యర్థి వ్యక్తిగత జీవితం మరీ  అంత విశుద్ధంగా ఉంటే అదో పెద్ద ప్రారబ్దం. రేపు ఎన్నికై ఇలాకా మొత్తానికి మొదటి పెద్దమనిషి అయింతరువాత.. ఏ ప్రభుత్వ భూమీ  ఆక్రమించుకోడానికి ఒప్పుకోకుంటే! వివాదాలని ఏ విధంగా కూడా సెటిల్  చేయడానికి ‘నో’ అని మొండికి తిరిగితే! కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చి పడే నిధుల్ని అచ్చంగా ఆయా పథకాలకే వెచ్చించాలని  పట్టుబడితే! ఎప్పట్నుంచో అనుభవిస్తున్న భోగాలు.. విద్యుత్ బిల్లులు.. నీళ్ల బిల్లులు, ఆస్తి పన్నులు.. వృత్తి పన్నుల ఎగ వేత.. వంటివన్నీ  తిరగదోడి తిరిగి కట్టించేదాకా కోర్టుల్లో పోరాటాలకు దిగిపోతానంటే! పార్కులు.. పాదచారుల  దారులు..  స్థలాల ఆక్రమణల కోసం అడ్డొస్తే.. చెట్టూ చేమనైనా  కొట్టేయక తప్పదు. నేర శిక్షాస్మృతిలో ఉన్న ప్రతీ సెక్షన్నూ తు. చ తప్పకుండా పాటించాల్సిందేనని పంతం పట్టుక్కూర్చుంటే!  ఆట స్థలాల్లేని పాఠశాలల.. రక్షణ వ్యవస్థలు పటిష్టంగా లేని  కార్యాలయాల.. నిబంధనల ప్రకారం వినియోగదారుల వాహనాలు నిలుకొనేందుకు జాగాలు   చూపించని వ్యాపార సంస్థల గుర్తింపు రద్దయేదాకా నిద్ర పోనంత చండశాసనుడైతే! శిరస్త్రాణాలు.. సీటు బెల్టులు.. పరిమితికి లోబడి మాత్రమే బండ్లు నడపమని హూంకరించడాలు.. మైనర్లకస్సలు వాహనాలు ఇవ్వద్దంటూ సుద్దులు రుద్దేయడాలు.. నిబంధనలకు మించి కాలుష్యాలు వెదజల్లే కార్ఖానాలు, వాహనాలు..  గట్రాలన్నింటికీ  లాకౌట్ తప్పదంటూ లాస్ట్ వార్నింగైనా లేకుండా  హుకూంలూ జారీ చేయిస్తే!   ఇష్టమొచ్చిన చోట మలమూత్ర విసర్జనలు.. బహిరంగ ధూమపానాలు.. బస్సుల్లో.. ఆఫీసుల్లో ఆడపాపలను వేపుకుతింటాలు.. కళాశాల ఆవరణల్లో రేగింగులు చేయడాలు.. పసిబిడ్డల చేత  నిబంధనలకు మించి మితిమీరి  పనులుచేయిచడాలు.. కట్టుకున్న దానిని, కన్న తల్లిదండ్రులను ఇంటా బయటా అమానుషంగా కొట్టి, కోసి హింసించడాలు, దొంగతనాలు, దొరబాబుల్లా కనిపించి మోసగించడాలు, రోడ్డు పక్కన మెగా సైజు అశ్లీషమైన పోస్టర్లు.. ప్రార్థనాలయాల్లో.. నిబంధనలు మించిన శబ్దాలతో ఆర్భాటలు  చెయ్యడాలు, ధర్మాసుపత్రి సిబ్బందులు  పెట్టే ఇబ్బందులు, సినిమా ధియేటర్లు, బస్టాండులు, రైల్వే స్టేషన్లలాంటి జనం సంచార ప్రదేశాలల్లో  బహిరంగంగా చేసే విశృంఖల  శృంగార వ్యాపారాలు,  దుకాణాల నుంచి అమ్ముడయిపోయే  తినుబండారాలలో మధ్యన మూడో కంటికి తెలీని డ్రగ్గు డోసులు, రైతు బజార్ల వంకతో జరిగే నిలువు దోపిడీలు.. పచ్చి పిందెలు ముందే  మగ్గాలని  కృత్రిమ  రసాయనాలు పిచ్చిగా వాడేయడాలు,  చట్టం అనుమతించిన పరిమితుల్లోనే ప్రజాజీవనం  ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకొనే అభ్యర్థికి పాలనా పగ్గాలు ఒప్పగించేటంత అమాయక ఓటర్లు ఎక్కడుంటారండీ ఈ  కలికాలంలో! ఫేసు బుక్కుల్లో ఉబుసుపోక  రాసుకునే    చాదస్తపు రాతల్లో తప్ప! 

అందునా ఎదుటి పక్షం నుంచి తొడ చరుస్తున్న వస్తాదు..  ఎన్నో తరాల బట్టి ఇక్కడి ఎన్నికల గోదాలో నిలబడి ఎదురు లేకుండా గెలుపు సాధిస్తున్న వంశం నుంచి వచ్చిన గండరగండడు.  నియోజకవర్గం ఓటర్లలో అధిక శాతంగా   ఉన్న కులంనుంచే వచ్చిన అభ్యర్థిని ఏ కారణంతో కులం.. మతం.. దేవుడు.. దయ్యం.. లాంటి సెంటిమెంట్లేవీఁలేని అభ్యర్థికోసం నిరాకరిస్తారంట?

ఎన్నికలంటే ఓ నెలరోజులు మించి సాగని సంబడాలు. ఆ తరువాత? మంచికైనా.. చెడ్డకైనా  ఆదుకొనేదైనా.. అడ్డుకొనేదైనా ఎవరని కదా చూసుకొనేది జనం? అసాంఘిక శక్తుల ఆరాధ్య దైవాన్ని కాదని ఓ నిజాయితీ పరుడైన విదేశీ మేథస్సుగల స్వచ్ఛంద సేవా తత్పరుణ్ణి  ఏం భరోసా కల్పించి  గెలిపించడం నా బోటి బుల్లి పెద్ద?!

మా పార్టీ తరుఫున నిలబడ్డ మహా మేధావి ధరావతుకూడా గల్లంతయింది. 

ఓటమికి బాధ్యత వహిస్తూ నన్ను రాజీనామా చెయ్యమని  అధిష్ఠానం ఆదేశం.  

ఎన్నో లక్షలు పోసి, ఎంతో  శ్రమదమాదులకోర్చి గెల్చుకున్న ఎమ్మెల్యే సీటు.  

వదిలేసుకు పోవడం అంత తేలికా?  ఎదుటి పార్టీలోకి దూకేస్తే పస్తుతానికి  నా ప్రజా ప్రతినిధి సీటునైనా కాపాడుకోవచ్చు. 

రాజీ బేరాలు మొదలయ్యాయి. . చర్చలు చివరి అంచె దగ్గర కొచ్చి స్తంభించాయి. నా బేరానికి మరో అభ్యర్థి ఆడ్డురావడమే కారణం. 

ఆ అభ్యర్థి వేరెవరో అయితే ఈ కథే చెప్పక పోదును. ఎవరి మూలకంగా అయితే నేను రాజీనామా చేయాల్సొచ్చిందో.. ఆ స్వచ్ఛంద సేవా సంస్థల అధిపతి!

'మీ పార్టీ నన్ను ఎలాగూ గెలిపించలేక పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ పార్టీద్వారా నిలబడతాను. నా సంస్థల్ని కాపాడుకోడానికి ఈ 'వాల్ జంప్' తప్పడం లేదు. సారీ' అనేశాడు స్వం. సం. పెద్దమనిషి!

రాజకీయాల్లో ఏదైనా సంభవమే!  బిజెపిని గెలిపించినంత మాత్రాన ప్రశాంత కిశోర్ అచ్చంగా భాజపాకే ఎన్నికల సలహాదారుడిగా  మిగిలి పోయాడా? రాహుల్ గాంధీని కూడా గిలిపించేందుకు ఇటువైపుకు దూకాడా లేదా? మంచాల పథకంతో సంచలనాలు సృష్టించడం లా?! రాజకీయంగా  సలహాలిచ్చి   క్లెయింటుని గెలిపించే కన్సల్టెంటు ఉద్యోగం అతగాడిది. వృత్తిధర్మానికి ద్రోహం చేసే చిల్లర మనిషి కాదు. చిల్లర రాజకీయాలకు ఇలా   కాలం చెల్లిపోతుంటే.. ఇహ మా బోటి నిబద్దమైన అరాజకీయవాదులకు ఉపాధి దొరికేది ఎట్లా?!

 



- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం ) 


జగదానంద కారకం - ఈనాడు - సంపాదకీయం - కర్లపాలెం హనుమంతరావు

 




సంపాదకీయం : 

జగదానంద కారకం

కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - ( 25 -01 - 2012 )  


నాదాధీనం  జగత్ సర్వమని సామవేద వాదం.  బ్రహ్మ సామవేద గానాసక్తుడు . వాణి  వీణాపాణి.  శంకరుడు నాదప్రియుడు.  అనంతుడు సంగీత స్వరాధీనుడు. మతంగ, భరత, శుక, శౌనక, నారద, తుంబుర, ఆంజనేయాది రుషిసత్తములందరూ మోక్ష సామ్రాజ్యాన్ని సాధించింది నాద బ్రహ్మోపాసనా మార్గంలోనే అన్నది శ్రుతి స్మృతి పురాణేతిహాసాదుల మాట.  


సామవేదం ప్రకారం- చేతనా చేతనాలైన సమస్త భూతకాలాన్ని ఆకర్షించే  ఐహికాముష్కి  కాలైన  చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే శక్తి ఒక్క సంగీత విద్యకే సొంతం. 


' సరిగమపదని' సప్త స్వరాల పునాదులపై నిర్మించిన భారతీయ మహా సంగీత హార్మ్యం  ఎంతో పురాతనమైనది. ప్రారంభంలో ఒకే లక్ష్య లక్షణ సంప్రదాయంతో విరాజిల్లినప్పటికీ  విజాతీయుల పాలనా  ప్రభావం ఉత్తర దక్షిణాలు అనే  అంతరాన్ని ఏర్పరచింది. 


ఆంధ్ర కవితా పితామహుడని ఖ్యాతి  పొందిన నన్నయకు చాలాముందునుంచే ఏలపాటలు, తుమ్మెదపాటల వంటి జానపద గేయాది వాజ్ఞ్మయ కుసుమాలు గుబాళిస్తుండేవి. అన్నమాచా ర్యులు, పురందరదాసు, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారులు ప్రచారం చేసిన జనసాహిత్యమూ అపారమే! 


సంగీతమంటే 'తంజావూరు పాటే'  అన్నంతగా స్థిరపడిన నాయకరాజుల పాలనలో తెలుగునేల నుంచి గుర్తింపుకోసం తరలిపోయిన సంగీత విద్వాంసులు ఎందరో? వలసపో యిన అటువంటి  కాకర్లవారి వంశంలో సుస్వర జనసంగీత పునరుద్ధరణార్థం  భువికి దిగివచ్చిన అపర పరమేశ్వరుడిలాగా 'శ్రీరామ తారక' మహా మంత్రోపాసన మహిమతో అసంఖ్యాకమైన భగవత్ సంకీర్తనా సాహిత్యాన్ని సృజించిన సంగీత వైతాళికుడు- త్యాగరాజు.  పద్దెనిమిదో శతాబ్ది పూర్వార్ధంలో తంజావూరు క్షేత్ర సంగీత సాహిత్య వృక్షాల అంటుగా వెలసిన త్యాగరాజమనే కొమ్మ చల్లిన ఫల పుష్ప బీజాలే నేటికీ నేల నాలుగు చెరగులా పరిమళాలు వెదజల్లుతున్నాయి. 


సరిగమలతో పరిచయం లేని సామాన్యుని  సైతం సమ్మోహ పరచే ఆ సంగీతమాయా వినోద మూలాలు- రాగంలో అంతర్లీనంగా ఒదిగే పదాల పొదుగులోనే ఉన్నది  . పండితుల బొడ్డు  సొమ్ముగా భావించే సంగీత సాహిత్యాలు రెండింటినీ తన అజరామరమైన సృజన శక్తితో జనసామాన్యపరం చేసిన రాగబ్రహ్మ- త్యాగయ్య.  ప్రాచీనాంధ్ర సాహిత్య లోకంలో ముగ్గురే కవిబ్రహ్మలు' అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ.  తిక్కన, పోతన. . వారిద్దరి తేటతనం, భక్త్యావేశాన్ని వాగ్గేయ రూపంలో శుద్ధిపరచిన త్యాగరాజు. 


త్యాగయ్య పల్లవులు, చరణాల నిండా కండగల కలకండ తెలుగు పలుకులే . నిత్య వ్యవహారం నుంచి పక్కకు తప్పుకొన్న అచ్చతెలుగు దారిలోనే పునర్జీవం  ప్రసాదించిన త్యాగయ్యది భాషాశాస్త్రవేత్తల దృష్టిలో వైతాళిక పాత్ర . 


సానుభూతి అనే అర్ధంలో సాధారణంగా మనం వాడే 'జూలి ' - త్యాగయ్య నగు మోము కనలేని' అనే కీర్తనలోని 'నా జాలి తెలిసి నను బ్రోవగ రాద'  చరణంలో 'నిస్సహాయత'గా మారిపోయింది. 


పాటక జనం నిత్య వ్యవ హారంలో దగ్గరివారిని చనువుతో పిలుచుకొన్నట్లు రాముడిని ' రారా .. మా ఇంటిదాకా' అంటూ మనసారా ఆహ్వానించడం వెనుక ఉన్న  మర్మం  రాముడిని ఎప్పుడూ  త్యాగయ్య మానవాతీతుడిగా భావించకపోవడమే. 


తెలుగు వాజ్ఞ్మయంలోని  గేయ సంప్రదాయాన్ని స్వీకరించి, ఉత్తమోత్తమమైన సంగీత సాహిత్యాలను సమపాళ్లలో ప్రజాబాహుళ్య ప్రయోజనార్థమై   మేళవించిన జన వాగ్గేయకారుడు త్యాగయ్య.   

అంతకుమించి వైదేశిక రాటుపోట్లతో అగ్గలమైపోయిన తెలుగు వాణిని సముద్ధరించిన శుద్ధ భాషా సేవకుడు. 


ఉపనిషత్తుల ప్రకారం అన్నం, ప్రాణం , మనసు, విజ్ఞానం, ఆనందం - అనే ఐదు అంచెల  సోపాన మార్గం ద్వారానే ఈశ్వరతత్వం సాధ్యం. తాగరాజ స్వామి ఘనరాగ పంచరత్నమాల అంతస్సూత్రమూ  అదే. ఈశ్వరాత్మతో  తాదాత్మ్య తార్థం   సాధించవలసిన  బ్రహ్మానందం కొరకు  ఆలపించే  జగదానందకారక కీర్తనాలాపనకు మిగిలిన నాలుగు ఘనరాగరత్నాలను  సోపానాలుగా రాగయోగి మలచిన తీరు నిరుపమానం.  ఆనందమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల శుద్ధిని ఉద్దేశించి సృజించినవే ఘనరాగ పంచరత్నాలని యోగ శాస్త్రజ్ఞులే  నిర్ధారిస్తున్నారిప్పుడు.  


రామకృష్ణుడు ప్రవచించిన సర్వమత సూత్రాన్ని తన సంకీర్తనలు, ప్రవర్తన ద్వారా ఎలుగెత్తి చాటిన సంఘసంస్కర్త త్యాగయ్య.  


రాగ కళకు రాగద్వేషాలతో నిమిత్తమే లేదని త్యాగయ్య శిష్యులలోని  తమిళులు చాటిచెబుతున్నారు. 


జయదేవుని కడ క్రోధమైన రాధ చరణాలు- ముద్దుల మౌళిపై మోసి మోసి/ అన్నమాచార్యుల సమక్షమందు ఏడు  కొండల- నొంటిగా కాపురముండి యుండి/ క్షేత్రయ్య రసమయ్య క్షేత్రాన పలునాయి- కలబిగి కౌగిళ్ల నలిగి నలిగి / విసిగిపోయి సుంత విశ్రాంతికోసమై- సీత తోడ అనుగు భ్రాతతోడ/  విశ్వమయుడు ప్రభువు వేంచేసియున్నాడు- రాముండగుచు త్యాగరాజునింట' అంటారు కవి కరుణశ్రీ.  నిజానికి ఆ రామ చంద్రుడు- లౌకికమయన  చీకాకులకు అలసి రవ్వంత సాంత్వనను ఆశించే మనలోని ఆత్మారాముడికి ప్రతీక 


' ఇంద్రియ జ్ఞానానికీ ఆత్మానందానికీ మధ్య స్థానాన్ని సంగీతం ఆక్రమిస్తుంది' అన్నది  ప్రముఖ ఆంగ్లకవి బ్రౌనింగ్ భావన.  ఎంతో అదృష్టం ఉన్నప్పపుడే  నిజమైన ఆ 'లో - చెవి' కలిగిన సంగీత సాహిత్యవేత్త కాగలిగేది.  త్యాగరాజస్వామి అంతటి అదృష్టవంతుడు. ఆ స్వామి తెలుగువాడు కావడం మనందరి అంతులేని అదృష్టం.  


స్వామి తన్మయ సమాధి స్థితినుంచి తన్నుకొచ్చిన సంగీత ఝరిని దోసిళ్లుపట్టి శిష్యులు స్వరసాహిత్యంగా పదిలపరచకపోయి ఉంటే జాతికి ఈ మాత్రమైనా సుస్వరగంగ సేదకు మిగిలి ఉండేదా?  


ఏళ్లాదిగా  అఖండంగా వెలిగిన ఆ త్యాగరాగ జ్యోతి ఓ బహుళ పంచమినాటికి 'నచ పునారావర్తి' పదవిని అలంకరించి సంగీతప్రియులు  ఏటా జరుపుకొనే త్యాగరాజ ఆరాధనోత్సవాలను  స్వరసాహిత్య మహోత్సవాల కింద మలచి ధన్యత సాధించింది. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - ( 25 -01 - 2012 )  

సన్ మానధనులు -కర్లపాలె హనుమంతరావు - ఈనాడు ప్రచురితం

 'కామేశ్వర్రావుకు కమ్యూనిటీ హాల్లో ఘనంగా సన్మానం చేస్తున్నార్టగా?' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కామాక్షి.

'సన్మానమేగా! కాలనీ-మేటు. సంతోషపడాలి.. కన్నీళ్ళెందుకూ!' కన్ ఫ్యూజయ్యా

'ఇవి కన్నీళ్లు కాదు. ఆనందబాష్పలు' అన్లేదు అర్థాంగి.

పై పెచ్చు గొంతు హెచ్చించింది 'మీరూ ఉన్నారెందుకూ! పద్దస్తమానం ఆ లావుపాటి ‘లా’ పుస్తకాలు ముందేసుక్కూర్చోడమొక్కటే తెలుసు! అట్లా గేటు దాటి బైటికెళ్లడం.. నలుగుర్తో భేటీ- గీటీకంటూ క్కూర్చుంటేగా ఏదైనా.. జరిగేదీ' ముక్కు చీదింది మళ్లీ.

'ఏం జరగాలీ? సన్మానమా? నేనేం ఒరగబెట్టాననీ సన్మానాలకీ.. సత్కారాలకీ?'

'ఆ చేయించుకునేవాళ్లంతా ఏం ఒరగబెడుతున్నట్లో!' మూతి మూడు తిప్పుళ్ళు తిప్పిందీ సారి.

 

మా కామేశ్వర్రావ్ మేటర్లో కామాక్షి ఎందుకో కంప్లీటుగా అపోహపడినట్లుంది. ఆయన ఆ మధ్య ఓ ప్రజాపత్రికలో రెండు దఫాలుగా సామాజిక స్పృహ గల  ‘సఫా’కవితలు అచ్చేయించుకుని ఉన్నాడు.. దిగ్విజయంగా. అదీ గాక ఆయనకా ఆదాయప్పన్నుల శాఖలో అదనపు ఛార్జి కూడా దక్కివుంది ఇటీవలనే!

 

మళ్లీ సాయంత్రం గుడ్ల నీరు కక్కుకుంటూ వచ్చి గుర్తుచేసింది 'ఆయనగారి పెళ్ళాంగారొచ్చి బొట్టు పెట్టి మరీ పిలిచెళ్లింది కూడానూ; లేవండిహ! వెళ్లక పోతే మాట దక్కదు' అంటూ ముక్కింది.

 

కామేశ్వర్రావుది మా ఫ్లాట్స్ లోనే నెత్తి మీదంతస్తులో కాపురం. ఎంత తప్పించుకున్నా లిఫ్టులో కలవక తప్పదు. అదీ గాక,  పైనా కిందా అన్న తరువాత చెయ్యి సాయం చేసుకోపోతే ఎట్లా?

అసలే తెలుగువాళ్లకు ఒహళ్లంటే ఒహళ్లకు సరిపడదు మంటన్న అపప్రథ కూడా ఉండె.

 

ఆటోలో సన్మానసభకు  పోతున్నంత సేపూ ఆవిడగారి గొణుకుళ్లే.. 'నలభై రూపాయలు క్షవర'మంటూ. పెద్ద మార్కేట్ మీంచి పోతున్నప్పుడు ఓ చిన్న దండయినా తీసుకుందామని ట్రై చెశా. పడనీయలా .. 'దండగం'టూ.  ఓ చిన్న రోజా పూవు కొని పది రూపాయలు ఆదాచేశామని ఆవిడ మురుసుకుంటుంటే.. హాలు ముందు ఆటోవాడు మీటరు మీద పదన్నా ఇవ్వాల్సిందేనని పేచీపెట్టుక్కూర్చుని ఆ సంబడానికి గండికొట్టేశాడు.. అరగంటలో.

 

హాలు ముందు కామేశ్వర్రావు వచ్చినవాళ్లను హూందాగా రిసీవ్ చేసుకుంటున్నాడు.  వాళ్లావిడ ముహంలో వెలుగు. మా ఆవిడ ముహంలో ఎంత దాచినా దాగని దిగులు.

 

కామేశ్వర్రావు నా రెక్క పుచ్చుకుని పక్కకు ఈడ్చుకెళ్లి స్తేజీ మీద  తెర పక్కన ఇంచక్కా పేర్చున్న వెండి షీల్డు, నాలుగో అయిదో మెమెంటోలు, ఐదారు చెమ్కీపూల దందలూ, ఫ్రేమ్ కట్టించుంచిన పంచరత్నమాల ముందుగానే ప్రదర్శిచేశాడు.

'పంచరత్నాలన్నీ నేనే రాసుకొన్నా! వినిపించమంటారా?' అనంటుంగానే ఆర్గనైజర్ రంగారావొచ్చి రక్షించాడు మమ్మల్ని.

 

రంగారావు ఈ తరహా సన్మానాలు చేయించడంలో చెయి తిరిగిన మొనగాడని పేరీ ఏరియాలో! 'కౌస్తుభం' అని బిరుదివ్వాలని అనుకుంటున్నాం మాష్టారూ ఈనగారికి. ఎట్లాగుంటుంది?' అని నన్నడిగాదు. 'కవి కౌస్తుభం' అన్న బిరుదు ఒక ప్రసిద్ధ కవిగారికి గతంలోనే దఖలు పడున్నట్లు గుర్తు. ఆ మాటే అన్నా. మా కామేశ్వర్రావు నా వంక కాస్తంత అనుమానంగా చూశాడు 'జెలసీ' కొద్దీ కుట్రచేయడం లేదు కదా' అన్నట్లు.

 

'మొత్తం పదివేలయింది మిత్రమా! పర్శుకింకో పదివేలు' అనేవో లెక్కలు చెప్పే పనిలోగా ఉండగా ఎక్కణ్ణుంచో ఆయన కోసమో కేక పినివించింది.

 

ఆరింటికి జ్యోతి ప్రజ్వలనమని ఆహ్వానం కార్డులో ప్రింటయివున్నా ఏడు గంటలక్కూడా ఎక్కడా చడీచప్పుడూ లేదు! 'పరశురామన్ గారొస్తే ఏ తతంగమైనా మొదలయేది.’అన్నాడు నా పక్కన కూర్చున్న మరో  ప్రేక్షకుడు.

'ఆయనెవరూ?'

'బోర్దర్ స్టేట్లో పాడి పరిశ్రమాభివృద్ధి స్టేట్ ర్యాంక్ మినిష్టరని చెప్పుకుంటున్నారు' అన్నాడా పెద్దమనిషి గుంభనగా.

చి

న్ని చిన్ని పిల్లలేవో పెడ్ద పెద్ద డ్యాన్సులేశారు కాస్సేపు.. వాళ్ల వాళ్ల అమ్మానాన్నల ఆనందం కోసం. 'కామేశ్వర్రావ్ బాగానే ఏర్పాట్లు చెసుకున్నాడూ' అని గునుస్తూనే ఉంది పక్కన కూర్చున్న  మా అర్థాంగి.

 

హఠాత్తుగా హాల్లో కోలాహలం! వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలూ, విరజిమ్మే వీడియోల వెలుగుల్లో.. కెమేరా ఫ్లాషుల మధ్య మందంగా కదిలివస్తోన్న శాల్తీని చూసి 'అప్పుడే మన కామేశ్వర్రావ్ ఖద్దర్ డ్రస్సులోకి మారిపోయాడండీ' అని విస్తుపోయింది మా ఆవిడ.

'ఆయన మీ కామేశ్వర్రావు కాదమ్మా! బార్ అండ్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్స్  అసోసియేషన్ ప్రెసిడెంట్ పానకాల్రావు. మీ కామేశ్వర్రావిడిగో!' అన్నాడు ఇందాకటి పక్కమనిషి, స్టేజీ మీద కుర్చీలు సర్దుతోన్న శాల్తీని చూపిస్తో.

 

మంత్రిగారొచ్చి మీటింగ్ మొదలయ్యే సరికి ఎనిమిద్దాటింది. హాల్లో యాభై తలలైనా లేవప్పటికి.. అందులో మూడొంతులు మా కాలనీవే.

 

అందరి చేతుల్లోనూ గిఫ్ట్ ప్యాకెట్లు. ఏదో పెళ్లికొచ్చినట్లు వచ్చారంతా. గిఫ్టుల సప్లై బాధ్యతా తనే మోశాడు పాపం.. కామేశ్వర్రావ్’ అంది జాలిగా మా కామాక్షి. కామాక్షికిచ్చిన గిఫ్టుకు కాళ్లొచ్చినట్లుంది.. ఓ రోజా పువ్వుతో సరిపెట్టే ఆలొచనలో ఉంది.

 

ప్రార్థన, జ్యోతి ప్రజ్వలన, పరిచయాలు, కార్యదర్శి నివేదిక.. గట్రా గట్రాలయింతరువాత పంచరత్నాల పఠన నిమిత్తం ఎవర్నో తయారుచేసుకున్నట్లున్నాడు మా కామేశ్వర్రావ్.. పంచె పైగెగ్గటి మైకు ముందుకురుకుతుందో  చందనం బొట్టు బ్రండ్ శాల్తీ!  ఆర్గనైజర్ రంగారావు సందివ్వడంలేదు.

 

మంత్రిగారికి అర్జంటుగా  హస్తినకెళ్లాల్సిన గత్తరేదో గుర్తుకొచ్చిందట అర్థాంతరంగా ఆయన అభిభాషణ ఆరంభమయిపోయింది. ఆయన జాతీయ అంతర్జాతీయ విషయాలను అన్నింటినీ లోతుగా చర్చించేసి..  'అంచేత మా బోర్డర్ ప్రభుత్వం  స్థిరంగా పాలన చేయాలంటే ఇక్కడి ప్రజలంతా కూడా మరన్ని త్యాగాలు చేసేందుకు ఉత్సాహం చూపించాల'ని పిలుపిచ్చేరు.  టైము తొమ్మిద్దాటిందని బాదే వంతు వెంతనే  వెంటనే బార్ అండ్ రెస్టారెంట్స్ పానకాల్రావు బలవంతాన లాగేసుకున్నాడు. ఆయనింకీ అరగంట బాది మధ్యం పాలసీలో తేవాల్సిన సంస్కరణల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని తక్షణావశ్యకతను గూర్చి ఎక్కడి మంత్రిగారి ద్వారానో  ఇక్కడి ముఖ్యమంత్రికి మొరపెట్టేసుకోడంతో .. జ్ఞాపికల ప్రదాన ప్రకటనలు కార్యక్రం ఆరంభమయిపోయింది హడావుడిగా.

మంత్రిగారికి వెండి షీల్డు బారాయన ప్రదానం చేస్తే, బారాయనకు మెమెంటో ఇచ్చి మంత్రిగారు బదలా తీర్చుకున్నారు. మిగిలిన వక్తలందరి కోరిక మేరా మంత్రిగారి చేతుల మీదుగా మిగిలున్న మెమెంటోలు మహా గ్రాండ్ గా ఇప్పించేశాడు కార్యక్రమ నిర్వాహకుడు రంగారావు ఆహ్వానితులైన ప్రముఖులందరికీ.

 

'మరిహ ఈ పూటకు మా కామేశ్వర్రావుకి సన్మానం, సత్కారం లేనట్లేనా!' అంది ముఖం చింకి చేటంత చేసుకుని మా ఇంటావిడ. అప్పటికే సమయం పద్దాట్టం వల్ల ఆమెలో ఆ మాత్రం ఆశ చివురించడం సహజమే గదా!

 

'వందన సమర్పణ అయిందాకా ఏ సంగతీ ఖాయంగా తేల్చలేం తల్లీ!' అన్నాడిందాకటి పక్క పెద్ద మనిషి టీజింగ్ ధోరణిలో.

 

ఒక్కయిదు నిమిషాలల్లో వేదిక మొత్తం ఖాళీ అయిపోయింది తమాషాగా! యుద్ధ భూమిలో వళ్లంతా గాయాలయినా తట్టుకొని నిలబడ్డ వీర జవానుకు మల్లే గట్టిగా నిలబడున్నది మాత్రం  మా కామేశ్వర్రావొక్కడే!

 

ఒక దిక్కున వందన సమర్పణ.. మరో దిక్కు నుంచి మూసుకొస్తున్న తెర.. !

 

ఆర్గనైజర్ రంగారావు కంగారుగా మూసుకుపోయే తెర ముందుకు ఉరికి ఆఖరి అనౌన్స్ మెంట్ చేసేశాడు 'నిజానికిది కామేశ్వర్రావుగారి సన్మాన సభ. సమయాభావం వల్ల కార్యక్రమం కుదించడం జరిగింది. క్షంతవ్యులం. వాస్తవానికి కామేశ్వర్రావుగారి వంటి మహా ఉద్దండ సంగీత పండితులకు ఏమిచ్చినా తక్కువే! ఏదో ఉడతా భక్తిగా, చంద్రునికో నూలు పోగన్నట్లు మా సంస్కార కళా సంస్థ తరుఫున ఈ చిన్ని పర్సు కానుకగా సమర్పించుకుంటున్నాం. దీంతో పాటు వీరి ప్రతిభకు దర్పణంగా  మా కళా సంస్థ తరుఫు నుంచే 'వృష భం' అనే బిరుదిచ్చి సత్కరించుకుంటున్నాం.’

సభలో ఆగకుండా కరతాళ ధ్వని.

ఆ శబ్దమొచ్చిన దిక్కు కేసి చూస్తే పాపం ఒక్కతే బిక్కు బిక్కు మంటూ చప్పట్లు కొట్టుకుంటూ కనిపించింది. కామేశ్వర్రావు ధర్మపత్ని..శ్రీమతి రమామణి.

 

కామేశ్వర్రావు పంచరత్నాలతో తనే తెరముందుకు దూకే ప్రయత్మంలాటిదేదో జరగబోతుండంగా  అదృశ్య హస్తమేదో ఆయన మెడ పట్టుకుని వెనక్కి గుంజేసి వేదిక మీద తెర పూర్తిగా లాగేసింది. లైట్లార్పేసింది.

హాలు క్షణాల్లో ఖాళీ అయిపోయిందని వేరే  చెప్పాలా!.

---

రెండ్రోజుల దాకా కాలనీలో ఎవరికీ కామేశ్వర్రావ్ దర్శనాల్లేవు.

మూడో రోజు కొంత మందికి ఎదురైనా తలతిప్పుకు పోతున్నాడన్న వదంతులు వ్యాపించాయి. .

 

'చెక్ బౌన్సయితే క్రిమినల్ కేస్ అవుతుంది కదండీ!' అనడిగింది మా ఆవిడ  ఓ రోజున తన లాయర్ పెళ్లాం తెలివితేటలన్నీ ఉపయోగించి.

'అందుకు సందేహమేముంది? కానీ ఎందుకు కలిగిందో శ్రీమతిగారికి ఆ సందేహం?' అనడిగా అబ్బురపడిపోయి.

'కామేశ్వర్రావుకు ఆ కళా సంస్థ వాళ్లిచ్చిన చెక్ బ్యాంకులో వేస్తే బౌన్స్ అయిందంట. రమామణి.. పాపం.. ఒహటే గగ్గోళ్లు’ అంది కులాసాగా కన్నీళ్లు పెట్టుకుంటూ.

'మరి ఇంత ఖాయిలా తినీ  ఇంకా కామేశ్వర్రావు ఇంటి తలుపులకు ఆ 'వృషభం' చెక్కపేడు ఎందుకో!?'

'ఎదో ఓ  చెక్కపేడు తలుపుకు వేలాడాలని కదా మా రమామణి ఇన్నాళ్ల బట్టి మోజూ. ఇరవై వేలొదిలాయండీ మొత్తం. అంత తొందరగా  పీకనిస్తుందా.. పేడు! మొగుడి పీక కోసేయదూ!' అంది  కామాక్షి ఆనందంతో వెక్కిళ్ళు పెట్టేస్తో   





 

 

 

 

ఎన్ని రికార్డులో ! కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయ పుట - 20-12-2009 )

 




ఎన్ని రికార్డులో ! 

కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు సంపాదకీయ పుట - 20-12-2009 ) 


ముంబయిలో మొన్న సోమవారం నాడు ఒకేసారి పజ్జెనిమిదివందల మంది సామూహికంగా క్షవరాలు చేయించుకున్నార్ట! షేవింగులో ఇదే  ఇదే ప్రపంచ రికార్డు అంటున్నారు.


రికార్డులు సృష్టించడంలో రికార్డు ముందునుంచీ మనలేరా  అబ్బాయ్ ! అందులోనూ 'షేషింగ్'   అంటే మనవాళ్ళు ముందు వరసలో ఉండి తీరాల్సిందే . 'షేన్ ఇండియా' అని పేరు పెట్టి ప్రత్యే కంగా మూకుమ్మడి కార్యక్రమాలు పెట్టుకోవాల్చిన పనేముందిరా" వృథాగా  టైమ్ షేవింగ్ తప్ప! నిత్యం బళ్ళలో, దుకాణాల్లో పెట్రోలు బంకుల్లో, రైళ్లల్లో, బస్సుల్లో జరిగే కళ్యాణ కట్ట కార్యక్రమాలు ఇవే కదరా?  దీని కింత ' కటింగ్ ' ఎందుకూ ? 


వెటకారమా! 


వెటకారం కాదూ, ఉప్పు కారం  కాదు. పది రూపాయలు పోసి కొన్న టెంకాయ గుళ్ళో దేవుడికి కొడితే  శఠగోపమూ, ఇంత చిన్ని ముక్క తప్ప ప్రసాదంగా  కనీసం కొబ్బరి పీచు కూడా దక్కడం లేదురా! మన కొబ్బరి చిప్పతో చేసిన చట్నీకే మనం హోటల్లో బిల్లు చెల్లిస్తుంటాం. ఇది క్షవరంగాక మరేమిటి నాయనా? 


ఓస్.. ఇంతేనా? మనం గుడికెళ్లేది  కొబ్బరి ప్రసాదం కోసమూ కాదు.. హాటల్ కెళ్లేది కొబ్బరి చట్న కోసమూ కాదు. . క్షపరమంటే నువ్వింకా ఏదో మన ఓబులాపురం గునుల్లాంటి  గొప్ప గొప్ప గంభీర నిజాలను వెలికితీయబోతున్నావు అమకున్నానే! 


అరేయ్ ! మనం తాగిపడేసిన ప్లాస్టిక్ బాటిల్లోనే ఏకంపు నీళ్లో పట్టి సీసా ఏ పదో .. పన్నెండో అంటే కళ్లు  మూసుక్కొని ఆ గరళం గుటకేస్తున్నామే!   ఆ గనుల్లో పడి విలువైన ఇనప ఖనిజాలను ఎవరెవరో అలా తవ్వుకుపొతున్నారు. అంతా క్షవరమైపోతుందని నిజంగానే నాలాంటి వాడేఏదైనా గొడవకు దిగుతున్నా ..   వాడు నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాడని  నీకు కడుపుమంట అని నామీదే  ఎదురుదాడికి దిగుతున్నారు  కానీ నిలువుదోపిడీ  అయిపోతున్నామనే దిగులు ఎవరికైనా ఉందా? అందుకే అంతలేసి  గంభీరమైన క్షురకర్మల జోలికి  పోకుండా   తేలికగా అర్థమవుతుందనీ ... 


నిజమే కానీ బాబాయ్!  జానాబెత్తెడులో తేల్చి పారేయాల్సిన  మేటన్ని నువ్విలా  అమాత్యుల బాణీలో ఎంతకీ తెమల్చకుండా  నానుస్తుంటే ఎంతలావు తెలివితేటలున్నవాడిక్కూడా తెలిసినవీ  తెలీకుండా పోయే ప్రమాదం ఉంది. తూకాల్లో  మోసాలు, మందుల్లో కల్తీలు, బియ్యంలో రాళ్ళు,  బాల దేవుళ్ళు. బాబాలు, అదృష్టాన్నిచ్చే ఉంగరం  రాళ్ళు, ఆసుపత్రుల్లో వైద్యాలు.. ఇల్లాంటివి కాకుండా రికార్డుల్లో కటింగుల్లాంటి వేమన్నా ఉంటే చెప్పు వింటా!  లేకుంటే వృథాగా నీ టైమూ, నా టైమూ కూడా కటింగ్!  


జనాభా కన్నా ఓటర్లు ఎక్కువుండే మన ప్రజాస్వామ్య దేశంలో  రికార్టులకేం కొదవ బాబూ! పట్టించుకోంగానీ  మొన్నీమధ్యనే బైటపడ్డ  స్పేక్రమ్  కుంభకోణాన్ని మించిన మెగా కటింగ్  భూమండలం మీద ఇంకెక్కడుంటుంది చెప్పు! రాత్రికి రాత్రే యల్లంపల్లి అంచనాలను కోట్లకు పెంచేసి ఖజానాకు భారీ కటింగిచ్చినా చీమ గిచ్చినట్లయినా లేదు. చివరికి మొన్నొచ్చిన వరదల్లో సారాయి గిడ్డంగుల్లోకి వరదనీరు చేరి సరుకు పాడయిపోయిందని సర్కారువారు ' తాగబోయించే శాఖ ' వారికి పన్నుల్లో పాపం.. రెండు కోట్ల దాకా మినహాయింపిచ్చేశారు. 



వరద నష్టాన్ని లోటునూ  మరింత పూటుగా తాగించి పూడ్చుకోవచ్చని ఎక్సైజు  శాఖవారికి ఎవరో వచ్చి చెప్పే పనిలేదు.


దేవదాసుల జేబులకు ఎంత కోత వేసినా తప్పు లేదులే బాబాయ్ ! 


దేవదాసులకే కాదు.. దేవాదేవుళ్లకూ కటింగులు తప్పడం లేదులేరా అబ్బాయ్! కొండకొచ్చేవాళ్లకు గుండుకొట్టించే ఆ ఏడుకొండలవాడి హుండీకే కటింగులు ఎక్కువవుతున్నాయని ఈ మ భక్తులు గగ్గోలు పెడుతున్నారు. వినడం లేదా ?  రికార్డులకు  ఎక్కడం లేదు గానీ, నామాల వాడి సొత్తుకు పడే కటింగులకు  లెక్కలు తీస్తే రికార్డు బ్రేకయే కటింగులు బైటపడిపోతా యిరా నాయనా! 


ఉద్యోగాల్లో కోత,ఉద్యోగుల జీతాల్లో ఆదాయప్పన్ననీ,  వృత్తిపన్ననీ..  G ఈ పన్ననీ , ఈ పన్ననీ  ఉన్న కోతలన్నింటినీ కూడుకుంటూ పోతే  సగటు వేతనజీవి జీవితమే  క్షవరమయం. నెలనెలా నువ్వు చెల్లించే ఫోను  బిల్లు  నెప్పుడైనా సరిగ్గా చూసుకున్నావురా? సేవా సుంకం పేరుతో పదిశాతం అదనంగా కట్టే సొమ్ములో విద్య సెస్-రెండు శాతం , ఉన్నత విద్యసెస్ అని ఒక శాతం కత్తిరిస్తుంటారు. 


నిజమా!  నేనెప్పుడూ చూసుకోలేదు బాబాయ్ ! కొత్తగా ఉందే! 


 అదే మరి నేననేది. విషయం కొత్తగా అనిపించినా.. కత్తిరింపు పాతదే! సోవు కూడా లేకుండా మెత్తగా చేసే ఈ క్షపరాన్ని రికార్డులోకి తీసుకుంటే, మొదట్లో నువ్వన్నావే  ఆ ముంబయిలో ఏదో పద్దెనిమిది వందల మంది సామూహికంగా కూర్చుని ఒకేసారి గొరిగించుకుని రికార్డు సృష్టించారని.. అంతకు మించిన రికార్డుగా లెక్కల్లోకి ఎక్కాలిరా బాబూ! 


రికార్డుల్లోనే ఎక్కాలని మరీ అంత మోజుగా ఉంటే ఇలా ఎటూ వృథాగా పోయే   జుత్తును కూడా త్యాగం చేయడమెందుకురా అబ్బాయ్ ? ప్రపంచం మొత్తంలో ఎవరూ సాధించలేని వేరే వేరే రికార్డులెన్నైన్నా ఇక్కడ మనదగ్గర రోజూ నమోదవుతూనే ఉన్నాయి గదరా: పసిబిడ్డలు తాగే పాలతో విగ్రహాలకు అభిషేకాలు చేసేది మనమే. ఒక్కరోజులో ఏ సంబంధం లేకపోయినా పథ్నాలుగు బస్పుల్ని తగలబెట్టి మూడొందల పద్దెనిమిది బస్సుల్ని నాశనం చేసిన రికార్డు కూడా  మనదే ! దిష్టిబొమ్మలు ఇక్కడ రోజూ రికార్డు స్థాయిలో తగలబడతాయి. శవయాత్రల రికార్డూ గొప్పదే!  ద్రవ్యోల్బణాన్ని మైనస్సుల్లోకి  దింపి రికార్డు సృష్టించిందీ మనమే!  ప్రభుత్వ కార్యాలయాల సెలవులూ మనకున్నన్ని ప్రపంచంలో మరెక్కడా లేవు. బళ్ళు వరసగా మూడు వారాలు నిష్కారణంగా మూసేసినా బాధపడే నాథుడు లేని రుషితుల్యులు రికార్డు స్థాయిలో గల  భూమీ మనదే.  ప్రపంచంలోకెల్లా అతి పిన్న వయసున్న బాం దేవతగల నేల ఇది  నాయనా ! ఇక్కడి  పోలీసులు ఒక్కడినే రోజుకు రెండుసార్లు అరెస్టు చేసే నిబద్ధత కలవారు. ఇక్కడి మంత్రులు అధికారులను కొట్టి ఫైళ్లు లాక్కెళ్లగలరు. ఇక్కడి అధికారులు అర్ధరాత్రిళ్ళు వందల మందల జీవోలు విడుదల చేయకలరు. బరు హ్యాడ్లీలాంటి ఎంతలావు ఉగ్రవాదికైనా  ఇక్కడ తాజ్ లాంటి ఫైవ్ స్టార్ హోటల్లో విఐపి స్థాయి ఆశ్రయం లభిస్తుంది. జాతిపితకు రేషన్ కార్డు జారీచేయగల ఘనత మన అధికారులది. ఇక్కడ కంది వంద  బియ్యం యాభై. ఇలాంటి రికా.. 


ఇంకొద్దు బాబాయ్| ఈ రికార్డులు గుక్కతిప్పు కోకుండా  వల్లెవేయడంలో నువ్వు ముందు రికార్డు సృష్టించేటట్లున్నావు బాబోయ్!  


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు సంపాదకీయ పుట - 20-12-2009 ) 


ముద్దూ ముచ్చట -కర్లపాలెం హనుమంతరావు - ఈనాడు సంపాదకీయం

ముద్దూ ముచ్చట- ఈనాడు సంపాదకీయం 

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం- ఆ సందర్బానికి అనువుగా ఓ గల్పిక

 

ముద్దూ ముచ్చట

-కర్లపాలెం హనుమంతరావు

 

'ప్రకృతి వరం- జీవితం. జీవితం వరం- ప్రేమ .  ప్రేమ వరం- ముద్దు' అంటాడు ఉమర్ ఖయాం. 'గంభీరవారాశి కల్లోలమండలం, బంభోజవైరి ముద్దాడుచుండె,/ అత్యున్నతంబైన యవనీధ రానీక, మంబోధ పటలి ముద్దాడుచుండె..' అంటో ముద్దుకు అచేతనాలే మురుసి పోతుంటే మనిషి చిత్త వృత్తిని గురించి మరిక చెప్పేది ఏముంది?'  అవును.. ఒక పార్శీ కవి అన్నట్లు కండచక్కెర, కలకండ పటిక, కదళీ ఫలం, ఖర్జూర మిశ్రమం, గోక్షీరసారం, ద్రాక్షారసం, దివ్యామృతం, అలరుతేనెల ధార, చెరుకు రసాల చవులు దేనిలోనూ లేనిదీ ముద్దు లోపలి తీపి. వట్టి రుచేనా.. మనసు ముడతలను సరి చేసేదీ ఈ పెదాల ముడి తడే. పెదవి పెదవి కలిసాయంటే సగం సంగమం శుభప్రదమయినట్లే. 'సపది మద నానలో దహతి మమ మానసం, దేహి ముఖ కమల మధుపానం' అంటూ ప్రియనాయిక మధురాధరాల  కోసం వూరికే  ఆరాటపడతాడా జయదేవుడి అష్టపది నాయకుడు! 'అన్యులెవరు చూడకుండ గొల్లభామా! ఒక్క/ చిన్ని ముద్దు బెట్టిపోవే గొల్లభామా!' అని నల్లనయ్యనే గొల్లభామ వెంట పరుగులెత్తించి అల్లరి పెట్టింది ఈ అధర వల్లరి.  'కన్నుల కపూర్వమైన చీకటులు గవియు, గాఢముగ మేనికి వింత మైకమ్ము గ్రమ్ము/ చిత్తమున కేదో యున్మాద మత్తమిల్లు, చెక్కిళ్ళు ముద్దిడు నవసరమున.' అదీ మధురాధర సంగమావస్థ మదనావస్థ. మదన తాపానికి  ప్రథమ చికత్స   ప్రియముఖ కమల మధువు ఆస్వాదనమే. ఆ ఔషధ సేవనం  'సురగణాధీశ దుర్లభసుఖ మొసంగు, అగణితాత్మ వ్యథా భార మణచివేయు/ భీష్మసదయ ప్రతాపంబు ప్రిదుల సేయు'. తొలిరేయి తొలిముద్దును గురించి కలవరించని వారు అసలు యవ్వనులే కారు. 

నిజానికి తొలిముద్దు దొరికేది తల్లినుంచే. అమ్మవరం ఇచ్చిన పాపదైవానికి భక్తతల్లి సంతృప్తితో చెల్లించే ముడుపు- ముద్దు. 'నిండుమోమున పండు వెన్నెల హసింప/ చిల్క పల్కులు ముద్దులు గుల్కుచుండ/నల్లనల్లన గజ్జియల్ ఘల్లుమనగ/చిరునడతల దరిజేరే చిట్టితల్లి'ని ఏ తల్లి నిజానికి ముద్దాడకుండా ఉండ గలదు? గోరుముద్దలే కాదు..అమ్మ నాన్నలు ఆప్యాయంగా పంచి ఇచ్చేగోరువెచ్చని మురిపాల ముద్దులూ ఎదిగే బిడ్డలకు బలవర్థక ఔషధాలే. యవ్వనంలో మనసు కోరే, మనసును కోఱే ఆ  'ఛీ పాడు' ముద్దుతోనే అసలు పేచీ.  తలుపు చాటునో, పెరటిచెట్టు చాటునో, పొలం గడ్డిమేట చాటునో.. పెదవి పై పడే మొదటి ఎంగిలి ముద్రే జీవితాంతం మనసు పుస్తకంలో భద్రంగా మిగిలే నెమలీక. 'తల్లిదండ్రియు దక్కు బాంధవులు జ్ఞప్తి, దొలగిపోదురు వలచిన పొలతిమిన్న/నిద్దపుంజెక్కిలిని ముద్దు దిద్దువేళ' అన్నారు కవి దాశరథి. వెనక వచ్చిన ఆ కొమ్ముల విసురు మగాడికైతే అతిశయ బాహాటమే కానీ మగువకు మాత్రం మనసుతో సైతం  పంచుకో సంశయించే అనుభవం. ఆ ముద్దుల్లో మళ్లీ ఎన్ని రకాలు! 'కార్యార్థియై యధికారిబిడ్డల చేరి, బుడిబుడి నద్దించు ముద్దు వేరు,/వెలయిచ్చి కూడెడు వెలయాలి చెక్కిళ్ళ, మురువుమై పొరలించు ముద్దు  వేరు/చిన్నారిపొన్నారి చిరుత పాపల పాల, బుగ్గల గీలించు ముద్దు వేరు/నవమాసాగమమందు గవగూడు ప్రియురాలి, ముద్దు చెక్కిలిబెట్టు ముద్దు వేరు/ స్వప్నమున దాను వలచిన సారసాక్షి, నిద్దపుం జెక్కిలిబెట్టు ముద్దు వేరు'. అధరాలు  అవే. ఎవరివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదానప్రదాలు చేస్తున్నాయన్నదే ప్రధానం. చేతి వేళ్ళ మీద అద్దే ముద్దు అభిమాన సూచకం. నుదుటి మీద దిద్దే ముద్దు భరోసాకు చిహ్నం.  చుబుకం మీద సాగే చుంబనం సంసిద్దతకు అద్దం. పెదాలపైని ముద్దుదైతే పతాకస్థాయే.  చెవుల దొప్పలు, ముక్కు చివరలు కంటిరెప్పల వంటి ఏ ఇతర వంటిభాగాలైనా ముద్దుసీతాకోకచిలుక రాక కోసం ఎదురు చూసే పద్మపుష్పాలే. 

 

మనిషి పెదాలు మాత్రమే  ముద్దుకు అనువుగా సృషించినట్లుంటాయి. స్పర్శ నాడుల చివరలకన్నీ చివుళ్ళ చివరనే ముడి. మనసు లోపలి ఉద్వేగాలవడి ముందుగా బైట పడేదీ  అధర ముఖద్వారాలనుంచే. సిగ్గు, బిడియం, కామన, సంశయం, భయం, అసహ్యం.. ఏది ముంచుకొచ్చినా చివురుటాకుల్లా ముందు వణికేవి  పెదవి చివరి భాగాలే.  ముద్దులాడుకునే వేళ 'డోపమిన్' అనే రసాయనం మోతదుకి మించి విడుదలై ఆకలి మందగించడం, నిద్రకు దూరమవడం సహజం. 'ఆక్సిటోసిన్' అనే మరో ప్రేరకం అధికంగా విడుదలై శృంగారవాంఛ రెట్టింపు అవుతుంది. 'న్యూరోట్రాన్స్ మీటర్స్'  మెదడులోఉత్పన్నమై  గుండె లబ్ డబ్ ల వేగం పెరిగిపోతుంది. మనిషి జీవితంలో ముద్దు పద్దు సరాసరి 20,160 నిమిషాలు. నిముషం ముద్దుకు 20  కేలరీలు ఖర్చు. ముద్దుకో  శాస్త్రమూ కద్దు. పేరు 'ఫైల్మేతాలజీ'. మమకార ప్రకటనకి ముప్పై నాలుగు కండరాల సహకారం అవసరం. వ్యాధుల సంక్రమణంలోనూ ముద్దుదే ముఖ్య పాత్ర .'నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా?' అంటో 'టాం టాం' కొట్టే పెదవులు నంటే ఉంటాయంటున్నారు  అంటువ్యాధి కారక క్రిములు. అయినా ముద్దంటే చేదెవరికి? చంటిబిడ్డలనైనా అందుకే ఓ హద్దు దాటి ముద్దాడ వద్దని ఆరోగ్యశాస్త్రం హెచ్చరిస్తోంది. మన్మధ సామ్రాజ్య విహారయాత్రలో ముద్దు ఒక 'టోల్ గేట్'. మధువుకూ, ధూమానికి ఆమడ దూరం మధురాధరాల ఆదరం.   నమిలిన తిండిని బిడ్డకు అందించడంతో ప్రేమగా పెదవులు కలపడం మొదలయిందని ఓ ఊహ. ముద్దు ఆలోచన  ముందు రోమనులదే అని ఒక వాదం. భారతీయులకూ బోలెడంత చుంబన సాహిత్యం ఉంది. 'శతపథ బ్రాహ్మణ'మే ఉదాహరణ.   ముద్దు సమయ సందర్భాలమీద పెద్దలకే పెద్ద అవగాహన లేదంటున్నారు శృంగార శాస్త్రవేత్తలు. వారానికి సగటున 11 సార్లేనుట దంపతుల మధ్య ముద్దాయణం.  అదీ కంటిరెప్ప పడి లేచే లోపలే చప్పున చల్లారిపోతోందని, పెళ్లయిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరు ముద్దుకు దూరమవుతున్నారని 'డెయిలీ ఎక్స్‌వూపెస్'  బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్'సంయుక్తంగా  నిర్వహించిన తాజా సర్వే సారాంశం. సంపాదనే లక్ష్యంగా సాగుతున్న సంసారాల్లో ముద్దు ముచ్చట్లు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే. 'ప్రణయకోపము పంచబంగాళమైపోవు, నీసడింపులవెల్ల బాసిపోవు/మనసు బింకబెల్ల మటుమాయమైపోవు, నాత్మగౌరవమెల్ల నడగిపోవు/ కోటి రూకలును గవ్వకు సాటి రాకుండు, త్యాజంబుగా తోచు రాజ్యమైన/అవధి చెప్పగ రానియానంద మెసలారు, స్వాంతంబు తన్మయత్వంబు జెందు/' .అదీ ముద్దు మహిమ మరి. వద్దనుకుంటే ఎలా?

 

కర్లపాలెం హనుమంతరావు,



 

 

 

 

 

 

 

 

 

 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...