ఎన్ని రికార్డులో !
కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు సంపాదకీయ పుట - 20-12-2009 )
ముంబయిలో మొన్న సోమవారం నాడు ఒకేసారి పజ్జెనిమిదివందల మంది సామూహికంగా క్షవరాలు చేయించుకున్నార్ట! షేవింగులో ఇదే ఇదే ప్రపంచ రికార్డు అంటున్నారు.
రికార్డులు సృష్టించడంలో రికార్డు ముందునుంచీ మనలేరా అబ్బాయ్ ! అందులోనూ 'షేషింగ్' అంటే మనవాళ్ళు ముందు వరసలో ఉండి తీరాల్సిందే . 'షేన్ ఇండియా' అని పేరు పెట్టి ప్రత్యే కంగా మూకుమ్మడి కార్యక్రమాలు పెట్టుకోవాల్చిన పనేముందిరా" వృథాగా టైమ్ షేవింగ్ తప్ప! నిత్యం బళ్ళలో, దుకాణాల్లో పెట్రోలు బంకుల్లో, రైళ్లల్లో, బస్సుల్లో జరిగే కళ్యాణ కట్ట కార్యక్రమాలు ఇవే కదరా? దీని కింత ' కటింగ్ ' ఎందుకూ ?
వెటకారమా!
వెటకారం కాదూ, ఉప్పు కారం కాదు. పది రూపాయలు పోసి కొన్న టెంకాయ గుళ్ళో దేవుడికి కొడితే శఠగోపమూ, ఇంత చిన్ని ముక్క తప్ప ప్రసాదంగా కనీసం కొబ్బరి పీచు కూడా దక్కడం లేదురా! మన కొబ్బరి చిప్పతో చేసిన చట్నీకే మనం హోటల్లో బిల్లు చెల్లిస్తుంటాం. ఇది క్షవరంగాక మరేమిటి నాయనా?
ఓస్.. ఇంతేనా? మనం గుడికెళ్లేది కొబ్బరి ప్రసాదం కోసమూ కాదు.. హాటల్ కెళ్లేది కొబ్బరి చట్న కోసమూ కాదు. . క్షపరమంటే నువ్వింకా ఏదో మన ఓబులాపురం గునుల్లాంటి గొప్ప గొప్ప గంభీర నిజాలను వెలికితీయబోతున్నావు అమకున్నానే!
అరేయ్ ! మనం తాగిపడేసిన ప్లాస్టిక్ బాటిల్లోనే ఏకంపు నీళ్లో పట్టి సీసా ఏ పదో .. పన్నెండో అంటే కళ్లు మూసుక్కొని ఆ గరళం గుటకేస్తున్నామే! ఆ గనుల్లో పడి విలువైన ఇనప ఖనిజాలను ఎవరెవరో అలా తవ్వుకుపొతున్నారు. అంతా క్షవరమైపోతుందని నిజంగానే నాలాంటి వాడేఏదైనా గొడవకు దిగుతున్నా .. వాడు నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాడని నీకు కడుపుమంట అని నామీదే ఎదురుదాడికి దిగుతున్నారు కానీ నిలువుదోపిడీ అయిపోతున్నామనే దిగులు ఎవరికైనా ఉందా? అందుకే అంతలేసి గంభీరమైన క్షురకర్మల జోలికి పోకుండా తేలికగా అర్థమవుతుందనీ ...
నిజమే కానీ బాబాయ్! జానాబెత్తెడులో తేల్చి పారేయాల్సిన మేటన్ని నువ్విలా అమాత్యుల బాణీలో ఎంతకీ తెమల్చకుండా నానుస్తుంటే ఎంతలావు తెలివితేటలున్నవాడిక్కూడా తెలిసినవీ తెలీకుండా పోయే ప్రమాదం ఉంది. తూకాల్లో మోసాలు, మందుల్లో కల్తీలు, బియ్యంలో రాళ్ళు, బాల దేవుళ్ళు. బాబాలు, అదృష్టాన్నిచ్చే ఉంగరం రాళ్ళు, ఆసుపత్రుల్లో వైద్యాలు.. ఇల్లాంటివి కాకుండా రికార్డుల్లో కటింగుల్లాంటి వేమన్నా ఉంటే చెప్పు వింటా! లేకుంటే వృథాగా నీ టైమూ, నా టైమూ కూడా కటింగ్!
జనాభా కన్నా ఓటర్లు ఎక్కువుండే మన ప్రజాస్వామ్య దేశంలో రికార్టులకేం కొదవ బాబూ! పట్టించుకోంగానీ మొన్నీమధ్యనే బైటపడ్డ స్పేక్రమ్ కుంభకోణాన్ని మించిన మెగా కటింగ్ భూమండలం మీద ఇంకెక్కడుంటుంది చెప్పు! రాత్రికి రాత్రే యల్లంపల్లి అంచనాలను కోట్లకు పెంచేసి ఖజానాకు భారీ కటింగిచ్చినా చీమ గిచ్చినట్లయినా లేదు. చివరికి మొన్నొచ్చిన వరదల్లో సారాయి గిడ్డంగుల్లోకి వరదనీరు చేరి సరుకు పాడయిపోయిందని సర్కారువారు ' తాగబోయించే శాఖ ' వారికి పన్నుల్లో పాపం.. రెండు కోట్ల దాకా మినహాయింపిచ్చేశారు.
వరద నష్టాన్ని లోటునూ మరింత పూటుగా తాగించి పూడ్చుకోవచ్చని ఎక్సైజు శాఖవారికి ఎవరో వచ్చి చెప్పే పనిలేదు.
దేవదాసుల జేబులకు ఎంత కోత వేసినా తప్పు లేదులే బాబాయ్ !
దేవదాసులకే కాదు.. దేవాదేవుళ్లకూ కటింగులు తప్పడం లేదులేరా అబ్బాయ్! కొండకొచ్చేవాళ్లకు గుండుకొట్టించే ఆ ఏడుకొండలవాడి హుండీకే కటింగులు ఎక్కువవుతున్నాయని ఈ మ భక్తులు గగ్గోలు పెడుతున్నారు. వినడం లేదా ? రికార్డులకు ఎక్కడం లేదు గానీ, నామాల వాడి సొత్తుకు పడే కటింగులకు లెక్కలు తీస్తే రికార్డు బ్రేకయే కటింగులు బైటపడిపోతా యిరా నాయనా!
ఉద్యోగాల్లో కోత,ఉద్యోగుల జీతాల్లో ఆదాయప్పన్ననీ, వృత్తిపన్ననీ.. G ఈ పన్ననీ , ఈ పన్ననీ ఉన్న కోతలన్నింటినీ కూడుకుంటూ పోతే సగటు వేతనజీవి జీవితమే క్షవరమయం. నెలనెలా నువ్వు చెల్లించే ఫోను బిల్లు నెప్పుడైనా సరిగ్గా చూసుకున్నావురా? సేవా సుంకం పేరుతో పదిశాతం అదనంగా కట్టే సొమ్ములో విద్య సెస్-రెండు శాతం , ఉన్నత విద్యసెస్ అని ఒక శాతం కత్తిరిస్తుంటారు.
నిజమా! నేనెప్పుడూ చూసుకోలేదు బాబాయ్ ! కొత్తగా ఉందే!
అదే మరి నేననేది. విషయం కొత్తగా అనిపించినా.. కత్తిరింపు పాతదే! సోవు కూడా లేకుండా మెత్తగా చేసే ఈ క్షపరాన్ని రికార్డులోకి తీసుకుంటే, మొదట్లో నువ్వన్నావే ఆ ముంబయిలో ఏదో పద్దెనిమిది వందల మంది సామూహికంగా కూర్చుని ఒకేసారి గొరిగించుకుని రికార్డు సృష్టించారని.. అంతకు మించిన రికార్డుగా లెక్కల్లోకి ఎక్కాలిరా బాబూ!
రికార్డుల్లోనే ఎక్కాలని మరీ అంత మోజుగా ఉంటే ఇలా ఎటూ వృథాగా పోయే జుత్తును కూడా త్యాగం చేయడమెందుకురా అబ్బాయ్ ? ప్రపంచం మొత్తంలో ఎవరూ సాధించలేని వేరే వేరే రికార్డులెన్నైన్నా ఇక్కడ మనదగ్గర రోజూ నమోదవుతూనే ఉన్నాయి గదరా: పసిబిడ్డలు తాగే పాలతో విగ్రహాలకు అభిషేకాలు చేసేది మనమే. ఒక్కరోజులో ఏ సంబంధం లేకపోయినా పథ్నాలుగు బస్పుల్ని తగలబెట్టి మూడొందల పద్దెనిమిది బస్సుల్ని నాశనం చేసిన రికార్డు కూడా మనదే ! దిష్టిబొమ్మలు ఇక్కడ రోజూ రికార్డు స్థాయిలో తగలబడతాయి. శవయాత్రల రికార్డూ గొప్పదే! ద్రవ్యోల్బణాన్ని మైనస్సుల్లోకి దింపి రికార్డు సృష్టించిందీ మనమే! ప్రభుత్వ కార్యాలయాల సెలవులూ మనకున్నన్ని ప్రపంచంలో మరెక్కడా లేవు. బళ్ళు వరసగా మూడు వారాలు నిష్కారణంగా మూసేసినా బాధపడే నాథుడు లేని రుషితుల్యులు రికార్డు స్థాయిలో గల భూమీ మనదే. ప్రపంచంలోకెల్లా అతి పిన్న వయసున్న బాం దేవతగల నేల ఇది నాయనా ! ఇక్కడి పోలీసులు ఒక్కడినే రోజుకు రెండుసార్లు అరెస్టు చేసే నిబద్ధత కలవారు. ఇక్కడి మంత్రులు అధికారులను కొట్టి ఫైళ్లు లాక్కెళ్లగలరు. ఇక్కడి అధికారులు అర్ధరాత్రిళ్ళు వందల మందల జీవోలు విడుదల చేయకలరు. బరు హ్యాడ్లీలాంటి ఎంతలావు ఉగ్రవాదికైనా ఇక్కడ తాజ్ లాంటి ఫైవ్ స్టార్ హోటల్లో విఐపి స్థాయి ఆశ్రయం లభిస్తుంది. జాతిపితకు రేషన్ కార్డు జారీచేయగల ఘనత మన అధికారులది. ఇక్కడ కంది వంద బియ్యం యాభై. ఇలాంటి రికా..
ఇంకొద్దు బాబాయ్| ఈ రికార్డులు గుక్కతిప్పు కోకుండా వల్లెవేయడంలో నువ్వు ముందు రికార్డు సృష్టించేటట్లున్నావు బాబోయ్!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు సంపాదకీయ పుట - 20-12-2009 )
No comments:
Post a Comment