Saturday, December 4, 2021

చిల్లర మల్లర మంచితనం - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం )

 



హాస్యం - సూర్య దినపత్రిక 

చిల్లర మల్లర మంచితనం

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం ) 




ఏ రకంవో గానీ.. మొత్తానికి ఏవో రకం ఎన్నికలకు నగారా మోగేందుకు వాతావరణం సిద్ధమవుతుంది! మా పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో పై స్థాయి పెద్దలు పనుపున  వచ్చిన  చిన్నస్థాయి పెద్దలు  మా బుల్లిస్థాయి పెద్దలనందర్నీ హెచ్చరించడం కూడా అయిపోయింది. ఈ సారి 'ఏం చేసైనా సరే'.. పార్టీ అభ్యర్థుల్ని ఆయా ప్రాంతీయ బాధ్యులే  గెలిపించి తీరాలంట!

‘ఏం చేయించడానికైనా' మేం సిద్ధంగా ఉంటే సరా? ఏమైనా చేసేందుకు మా కార్యకర్తలూ  సిద్ధంగా ఉండాలి కదా! అసలు కార్యకర్తలు మిగిలుండాలి కదా? ఖర్మ!

అధికారంలో లేనప్పుడు జెండాలు భుజం దించకుండా.. సొంత సొమ్ము తగలేసుకొని మరీ ఊరేగినోళ్లను.. పార్టీ అధికారంలోకి వచ్చినాక.. పులుసులోని ముక్కల్లాగా పక్కన పెట్టింది. అలిగి పక్క పార్టీల్లోకి గెంతేసారంతా. ‘చుక్క.. ముక్క.. ఏర్పాట్లు ఆ పక్క పార్టీల కన్నా ఇంకాస్త  మెరుగ్గానే చూస్తాం. మాతృపక్షంలోకి రమ్మ’ని  హామీ ఇమ్మంటున్నారు మమ్మల్ని. హామీలు  నమ్మి గోదాట్లోకి దూకే రోజులన్నా ఇవి? అవతల పార్టీలు.. పాపం..  పదవుల్లో లేకపోయినా ఆప్పో సప్పో చేసి మమ్మల్నింతకాలం మేపుతున్నది ఈ ఎన్నికల కోసమే కదా!  మళ్లా వాళ్లకీ వెన్నుపోటంటే బాగుంటుందా?' అని సుద్దులు చెబుతున్నారు పాత కార్యకర్తలు. ఇహ వాళ్ల వైపు నుంచి ఇదివరకట్లా సభల్లో చెప్పులు, ప్రచారంలో సిరాలు, కేన్వాయీల కడ్డంగా పడుకోడాల్లాంటి  అల్లర్లు   కల్లో మాటే మా పార్టీ వరకు. 

ఈ మధ్య యోగాగురువులు, స్వాములార్లు, వ్యక్తిత్వ వికాస పాఠాలు మప్పి పోయేవాళ్ల సేవలు ముమ్మరించాయి అన్ని పార్టీల్లో. అల్లరి కార్యకర్తలకు ఎక్కళ్లేని కరువొచ్చింది అందుకే. చిల్లర పన్లేవీ చెయ్యకుండా ఎన్నికలు నెట్టుకొచ్చేందుకు  మనమింకా సంపూర్ణ రామరాజ్యంలోకి రాలేదు కదా! 

మేం ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఏ పెద్దమనిషి నుంచైనా మాటవరసకు    ఒక్క  మాట సాయం అందిదా? పార్టీ పోస్టర్లనుంచి.. ఎగస్పార్టీ అభ్యర్థుల ఊరేగింపుల మీద వేయించే రాళ్లూ రప్పా వరకు అన్ని తిప్పలూ మేమే పడ్డాం. ఎన్నికల సంఘం లెక్కలడిగినప్పుడు ఎన్ని యాతనలు పడ్డామో పరమాత్ముడికే తెలుసు. అప్పుడూ మాకే బిల్లు. ఇప్పుడూ మా పర్సులకే చిల్లు! 


గతం గుర్తుచేసుకుని కుళ్ళుతూ కూర్చుంటే  భవిష్యత్తుండని పాపిష్టిది ఈ  పొలిటికల్ ఫీల్డు.

 రాహుల్ బాబును చూసి గుండె నిబ్బరం చేసుకోవడమేగానీ.. నిజానికి ఇంట్లో కూడా చెప్పకుండా సెలవు చీటీ పారేసి ఇంచక్కా ఏ స్విండ్జర్లాండుకో చెక్కాలనిపిస్తుందప్పా! 

నిలబెట్టిన వాడ్ని గెలిపించే బాధ్యత అడక్కుండానే అంటగడుతున్నాయి. సరేనయ్యా.. అది అధిష్ఠానాల హక్కు! లోకల్ ఎన్నికలప్పుడు  సిగ్గిడిచి కాళ్ళూ గడ్డాలు పుచ్చుకున్నా  కోరుకున్న కొడుకూ అల్లుళ్లకు టిక్కెట్లేమన్నా దక్కాయా?   ఎక్కడెక్కణ్నుంచో గాలించి మరీ  నిజాయితీలో నిఖార్సులంటూ  నిలబెడతారంట ఇక్కడ!  గెలిపించి తీరాల్సిన పూచీ  మా నెత్తికి చుట్టేట్లున్నారు!   

అతి నిజాయితీ,  నీతికి ప్రాణమిచ్చే పిచ్చిబుద్ధి.. ఏం చేసుకోనబ్బా ఈ పుచ్చు రాజకీయాల్లో? ఓటరుకే మాత్రం  సంబంధం లేని   మేధావుల గుంపును  గెలిపించే పూచీ మా నెత్తికి  రుద్దితే.. గట్టెక్కించడం అంత తేలికా?

అవతల పార్టీల్నుంచి కాలు దువ్వేది  గుత్తేదార్లు, పారిశ్రామికవేత్తలు, కొలువుల్లో ఉన్నప్పుడు  చేయరానివి, చెప్పకూడనివి ఎన్నో చేసి  మీడియా  పుణ్యమా అని ప్రజాసేవకుల జాబితాలో దూరేసిన దొరలు.  నీతివంతుడన్న చెడ్డ పేరు వచ్చి పడ్డాక ఎంత పెద్దమనిషినైనా    ఎన్నికల గుండం నుంచి బైటపడేయడం ఎంత కష్టం?

మూడొంతులు పైగా  వేలి ముద్దరగాళ్లే గట్టి బలగంగా గల మా  ఇలాకాలో విదేశాల్లో చదువుకొన్న  విద్యావేత్తను గట్టెక్కించడం కంటే  వరద పొంగులో నిండు గోదారికి ఎదురీదుకొంటూ వెళ్ళి కొట్టుకు పోయే గాడిదను గట్టుకు ఈడ్చడం సులువు.  గట్టెక్కడానికి  సొంతంగానే గజీత రానక్కర్లేదు. చిల్లర మోతగాళ్లున్నా చాలని మా పార్టీ పెద్దల ఉద్బోధ. నిజమే కానీ మోసే చిల్లరగాళ్లకే ఎక్కళ్ళేని కరవొచ్చి పడిందిక్కడ మా పార్టీలో. ఆ ఉపద్రవం  పసిగట్టినట్లు లేదు పార్టీ పెద్దలు.

అభ్యర్థి వ్యక్తిగత జీవితం మరీ  అంత విశుద్ధంగా ఉంటే అదో పెద్ద ప్రారబ్దం. రేపు ఎన్నికై ఇలాకా మొత్తానికి మొదటి పెద్దమనిషి అయింతరువాత.. ఏ ప్రభుత్వ భూమీ  ఆక్రమించుకోడానికి ఒప్పుకోకుంటే! వివాదాలని ఏ విధంగా కూడా సెటిల్  చేయడానికి ‘నో’ అని మొండికి తిరిగితే! కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చి పడే నిధుల్ని అచ్చంగా ఆయా పథకాలకే వెచ్చించాలని  పట్టుబడితే! ఎప్పట్నుంచో అనుభవిస్తున్న భోగాలు.. విద్యుత్ బిల్లులు.. నీళ్ల బిల్లులు, ఆస్తి పన్నులు.. వృత్తి పన్నుల ఎగ వేత.. వంటివన్నీ  తిరగదోడి తిరిగి కట్టించేదాకా కోర్టుల్లో పోరాటాలకు దిగిపోతానంటే! పార్కులు.. పాదచారుల  దారులు..  స్థలాల ఆక్రమణల కోసం అడ్డొస్తే.. చెట్టూ చేమనైనా  కొట్టేయక తప్పదు. నేర శిక్షాస్మృతిలో ఉన్న ప్రతీ సెక్షన్నూ తు. చ తప్పకుండా పాటించాల్సిందేనని పంతం పట్టుక్కూర్చుంటే!  ఆట స్థలాల్లేని పాఠశాలల.. రక్షణ వ్యవస్థలు పటిష్టంగా లేని  కార్యాలయాల.. నిబంధనల ప్రకారం వినియోగదారుల వాహనాలు నిలుకొనేందుకు జాగాలు   చూపించని వ్యాపార సంస్థల గుర్తింపు రద్దయేదాకా నిద్ర పోనంత చండశాసనుడైతే! శిరస్త్రాణాలు.. సీటు బెల్టులు.. పరిమితికి లోబడి మాత్రమే బండ్లు నడపమని హూంకరించడాలు.. మైనర్లకస్సలు వాహనాలు ఇవ్వద్దంటూ సుద్దులు రుద్దేయడాలు.. నిబంధనలకు మించి కాలుష్యాలు వెదజల్లే కార్ఖానాలు, వాహనాలు..  గట్రాలన్నింటికీ  లాకౌట్ తప్పదంటూ లాస్ట్ వార్నింగైనా లేకుండా  హుకూంలూ జారీ చేయిస్తే!   ఇష్టమొచ్చిన చోట మలమూత్ర విసర్జనలు.. బహిరంగ ధూమపానాలు.. బస్సుల్లో.. ఆఫీసుల్లో ఆడపాపలను వేపుకుతింటాలు.. కళాశాల ఆవరణల్లో రేగింగులు చేయడాలు.. పసిబిడ్డల చేత  నిబంధనలకు మించి మితిమీరి  పనులుచేయిచడాలు.. కట్టుకున్న దానిని, కన్న తల్లిదండ్రులను ఇంటా బయటా అమానుషంగా కొట్టి, కోసి హింసించడాలు, దొంగతనాలు, దొరబాబుల్లా కనిపించి మోసగించడాలు, రోడ్డు పక్కన మెగా సైజు అశ్లీషమైన పోస్టర్లు.. ప్రార్థనాలయాల్లో.. నిబంధనలు మించిన శబ్దాలతో ఆర్భాటలు  చెయ్యడాలు, ధర్మాసుపత్రి సిబ్బందులు  పెట్టే ఇబ్బందులు, సినిమా ధియేటర్లు, బస్టాండులు, రైల్వే స్టేషన్లలాంటి జనం సంచార ప్రదేశాలల్లో  బహిరంగంగా చేసే విశృంఖల  శృంగార వ్యాపారాలు,  దుకాణాల నుంచి అమ్ముడయిపోయే  తినుబండారాలలో మధ్యన మూడో కంటికి తెలీని డ్రగ్గు డోసులు, రైతు బజార్ల వంకతో జరిగే నిలువు దోపిడీలు.. పచ్చి పిందెలు ముందే  మగ్గాలని  కృత్రిమ  రసాయనాలు పిచ్చిగా వాడేయడాలు,  చట్టం అనుమతించిన పరిమితుల్లోనే ప్రజాజీవనం  ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకొనే అభ్యర్థికి పాలనా పగ్గాలు ఒప్పగించేటంత అమాయక ఓటర్లు ఎక్కడుంటారండీ ఈ  కలికాలంలో! ఫేసు బుక్కుల్లో ఉబుసుపోక  రాసుకునే    చాదస్తపు రాతల్లో తప్ప! 

అందునా ఎదుటి పక్షం నుంచి తొడ చరుస్తున్న వస్తాదు..  ఎన్నో తరాల బట్టి ఇక్కడి ఎన్నికల గోదాలో నిలబడి ఎదురు లేకుండా గెలుపు సాధిస్తున్న వంశం నుంచి వచ్చిన గండరగండడు.  నియోజకవర్గం ఓటర్లలో అధిక శాతంగా   ఉన్న కులంనుంచే వచ్చిన అభ్యర్థిని ఏ కారణంతో కులం.. మతం.. దేవుడు.. దయ్యం.. లాంటి సెంటిమెంట్లేవీఁలేని అభ్యర్థికోసం నిరాకరిస్తారంట?

ఎన్నికలంటే ఓ నెలరోజులు మించి సాగని సంబడాలు. ఆ తరువాత? మంచికైనా.. చెడ్డకైనా  ఆదుకొనేదైనా.. అడ్డుకొనేదైనా ఎవరని కదా చూసుకొనేది జనం? అసాంఘిక శక్తుల ఆరాధ్య దైవాన్ని కాదని ఓ నిజాయితీ పరుడైన విదేశీ మేథస్సుగల స్వచ్ఛంద సేవా తత్పరుణ్ణి  ఏం భరోసా కల్పించి  గెలిపించడం నా బోటి బుల్లి పెద్ద?!

మా పార్టీ తరుఫున నిలబడ్డ మహా మేధావి ధరావతుకూడా గల్లంతయింది. 

ఓటమికి బాధ్యత వహిస్తూ నన్ను రాజీనామా చెయ్యమని  అధిష్ఠానం ఆదేశం.  

ఎన్నో లక్షలు పోసి, ఎంతో  శ్రమదమాదులకోర్చి గెల్చుకున్న ఎమ్మెల్యే సీటు.  

వదిలేసుకు పోవడం అంత తేలికా?  ఎదుటి పార్టీలోకి దూకేస్తే పస్తుతానికి  నా ప్రజా ప్రతినిధి సీటునైనా కాపాడుకోవచ్చు. 

రాజీ బేరాలు మొదలయ్యాయి. . చర్చలు చివరి అంచె దగ్గర కొచ్చి స్తంభించాయి. నా బేరానికి మరో అభ్యర్థి ఆడ్డురావడమే కారణం. 

ఆ అభ్యర్థి వేరెవరో అయితే ఈ కథే చెప్పక పోదును. ఎవరి మూలకంగా అయితే నేను రాజీనామా చేయాల్సొచ్చిందో.. ఆ స్వచ్ఛంద సేవా సంస్థల అధిపతి!

'మీ పార్టీ నన్ను ఎలాగూ గెలిపించలేక పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ పార్టీద్వారా నిలబడతాను. నా సంస్థల్ని కాపాడుకోడానికి ఈ 'వాల్ జంప్' తప్పడం లేదు. సారీ' అనేశాడు స్వం. సం. పెద్దమనిషి!

రాజకీయాల్లో ఏదైనా సంభవమే!  బిజెపిని గెలిపించినంత మాత్రాన ప్రశాంత కిశోర్ అచ్చంగా భాజపాకే ఎన్నికల సలహాదారుడిగా  మిగిలి పోయాడా? రాహుల్ గాంధీని కూడా గిలిపించేందుకు ఇటువైపుకు దూకాడా లేదా? మంచాల పథకంతో సంచలనాలు సృష్టించడం లా?! రాజకీయంగా  సలహాలిచ్చి   క్లెయింటుని గెలిపించే కన్సల్టెంటు ఉద్యోగం అతగాడిది. వృత్తిధర్మానికి ద్రోహం చేసే చిల్లర మనిషి కాదు. చిల్లర రాజకీయాలకు ఇలా   కాలం చెల్లిపోతుంటే.. ఇహ మా బోటి నిబద్దమైన అరాజకీయవాదులకు ఉపాధి దొరికేది ఎట్లా?!

 



- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక - సంపాదకీయ పుట ప్రచురితం ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...