ఈనాడు - గల్పిక
రైలో .. రాకు .. రాకు !
( ఈనాడు దినపత్రిక - సంపాదకీయపుట - 11, సెప్టెంబర్, 2003 - ప్రచురితం )
' రైలుస్టేషన్ ఊరుకింత దూరంగా ఎందుక్క ట్టారనుకున్నారూ? '
' పట్టాలకు దగ్గరగా ఉండాలని'
' పట్టాలనే ఊళ్లో వెయ్యచ్చుగా? '
' హన్నా! ఉళ్ళో వాళ్ళ ప్రాణాలు ఉండాలనే! ' అన్నాడు ముకుందరావు ముక్కుమీద వేలేసుకుని హాశ్చర్యాభినయాన్ని పండిస్తూ .
నందిగామ - బందరు రూట్లో రైలు బండేదో గేటు దగ్గర నిలబడ్డ గవర్నమెంటు బస్సునొక దాన్నింత గీరుకుంటూ పోయిందని న్యూసుపేవర్సన్నీ తెగ న్వూసెన్సు చేసేస్తుంటే చివరాఖరికి రైల్వేవారిచేత ఏకసభ్య నిజనిర్థారణ కమీష నొకదాన్నేయించుకుని
చైర్మన్ హోదాలో విచారించి రిపోర్టుతో సహా రాజధానికిప్పుడు రిటనొస్తున్నాడుట ఆ ముకుందరావు .
ఎదురు సీట్లో నేనున్నాను. ఊరుకోవచ్చుగా !
' మొన్న బెంగుళూరెక్స్ ప్రెస్సూ, నిన్న మన్మాడెక్స్ ప్రెస్సూ, మధ్యలో తిరువణ్ణామలై టు గుంటూరెక్స్‌ప్రెస్సూ, నేరేడుమెట్ట దగ్గరేదో గూడ్సు బండీ .. ఇట్లా ఈ మధ్యలో మన దక్షిణ మధ్య రైల్వే చుట్టూతానే ప్రదక్షిణాలు చేస్తున్నాయెందుకంటార్గురూ గారూ! మన దక్షతా? ' అనడిగా .
' రైల్వే డిపార్ట్ మేమన్నా మనమిప్పుడు కూర్చుని పోయే కంపార్ట్ మెంటంత చిన్నదాండీ! ఉత్తరాన్నుంచి దక్షిణం దాకా , పటమట నుంచి తూర్ప దిక్కు వరకూ పరుచుకున్న మహా ప్రయాణ వ్యవస్థ కదండీ! ఎన్ని అవస్థలుంటాయీ! మీ ప్రెస్సువాళ్లకేంలే! .. ఒక్కక్స్ ప్రెస్ స్లైట్ గా ఇట్లా పట్టాల పక్కకు జరిగినా పట్టరానంత రాద్ధాంతం చేసేస్తారు ' అన్నాడతను మహా నిష్ఠురంగా .
'అయితే బోగీలేవో సర్దాకి పట్టాలు దూకితే మేమే యాగీలు చేస్తున్నామని మీ అభియోగమా ? '
'అనుమానమా! సర్దాకు ఏవో రెండింజన్లు ఇట్లా ముద్దెట్టుకోడమాలస్యం బాబూ .. అంతంత అచ్చక్షరాల్లో మీ డాబు చూపించాలా ? '
' ఏ మాట కా మాటే. మీ రైల్వే వాళ్ల రూటే వేరండీ! . ప్రమాదాలేవైనా సరే మీ రైల్వే బోగీల్లాగా ఒక దాని వెంట ఒకటి వరస తప్పకుండా జరిగేస్తుంటాయి సుమా! కానీ ఘడియ ఘడియకీ గాడి తప్పే మీ రేల్ గాడీ సవారీతో ప్రయాణీకులకే ఎంతా సఫరో మీకెలా అర్థమయేది? రైలు బండి ప్రయాణమంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయండీ ఈ మధ్య ! ఇహా రైలు కూపేలన్నీ నరకాని కెళ్లే కూపన్లనే తలపిస్తాయి స్వామీ! 'నీ వెక్కాల్సిన రైలు ఓ జీవితాకాలం లేటు ' అన్న కవిగారిప్పుడు లేటుకవిగారయిపోయారు గానీ, బతికే ఉండుంటే ఏమనుండేవారో తెలుసా అండీ? ' నీవెక్కేశావా రైలు బండి .. ఇక నీ జీవితమే అవుతుంది 'లేటు' సుమండీ ' - అని .
చప్పట్లు కొట్టాడు ముకుందరావు.
'నిజవే! రైలు బండి నడవక పోయినా లేటే. నడిచినా లేటే. వాస్తవానికి చావటానికి పట్టాలపై తలపెట్టి పడుకోడం చాలా పాత పద్ధతి. రైలెక్కి కూర్చుని ఇంచక్కా పైలోకాలకు చెక్కేయడం లేటెస్ట్ పద్ధతి. సూయిసైడ్ కు లైటర్ సైడీ మా రైలు జర్నీ నే.. ఒప్పు కుంటాన్లే స్వామీ i అన్నాడాయనే రెండు చేతులా జోడించేసి .
ముకుందరావు మాటలతో ఓ కథ గుర్తుకొచ్చింది.
ట్రైన్ జర్నీలో ఇట్లాగే ప్రయాణాలు పోగొట్టుకున్న చాలా మందినోకేసారి విచారించి శిక్షలు ఖరారు చేస్తున్నాడట ఓసారి యమధర్మరాజుగారు . హరిదాసుగారి వంతొచ్చింది. 'నరకానికే' అని గదమాయించారా నరకలోక స్వామి . కానీ వెనకమాలే ఉన్న రైలింజను డ్రయివరుకు మాత్రం స్వర్గం శాంక్షనయింది! 'నిత్యమూ హరినామ స్మరణతో భక్తులకు ముక్తిమార్గం బోధించే నాకు నరకమూనూ .. వేలాది మంది ప్రయాణీకుల ప్రాణాలకు భూలోకంలోనే యమలోకం చూపించే ఈ రైలింజను డ్రయివరుకు మాత్రం స్వర్గమూనా? తొండి ' అంటూ ఆ హరిదాసుగారు అరిగస్పీలు చేస్తే ' నీవు చెప్పే చిడతలకథ తీరుకు భక్తజనులంతా నిద్దర్లకు పడి భగవంతుణ్ణి సైతం మర్చిపోతున్నారయ్యా హరిదాసూ ! కానీ, ఈ డ్రైవరు రైలుబండి నడిపే జోరుకు ప్యాసింజర్లంతా నిద్దర్లు మరచి మరీ భగవంతుణ్ణి మాత్రమే మరి పార్థిస్తున్నారయ్యా సామీ! నీ నరకం .. అతగాడి స్వర్గం ఎంట్రీలకు అదే అసలు రీజన్ ' అని తేల్చేశాడుట ఆ సమవర్తి.
ముకుందరావు ఠక్కున పేపరేదో తీసి గిలుకుతున్నాడు! 'జపాన్లో బోడి బుల్లెట్‌రైలు పట్టాలకు బెత్తెడెత్తున పరుగెడితేనే ఆహా.. ఓహో అంటూ హారతులు పడతాం కదా! అదే మరి మన రైళ్లు అసలు పట్టాలే లేకుండా పరిగెత్తినా ఎవరూ పట్టించుకోరేమండీ ? ! ' అన్నాడు ముకుందరావు ముక్కెగబీలుస్తూ .
'నిజమే! మనట్రయిన్లీ మధ్యసలు పట్టాలనే పట్టించుకోడం మానేశాయ్! గూడ్సు బండి క్కూడా నడిచే ట్రాకంటే మహా నామోషీగా తయారైంది వ్యవహారం . ప్యాసింజరు బళ్లయితే ఏకంగా ఊళ్ల మీదకే వచ్చేస్తున్నాయి సుమా.. చికుబుకు చికుబుకు రైలే .. అదిరెను దీని స్టయిలే! ' అనేసుకుంటూ .'
' మరే! అవే ప్రగతి పరుగులు బాబూ! ప్రగతి ప్రకారమే ప్రమాదాలు కూడా! ప్రమాదాలే ప్రగతికి నేటి ప్రమాణాలు కూడా . యాక్సిడెంట్లేవీ జరక్కపోతే లూప్ హోల్స్ తెలిసేదెలాగండీ ? '
లూప్ లైన్లో నుంచి చల్లంగా జారిపోవాలని చూస్తున్నాడీ ముకుందరావ్ మాష్టారు .
పల్టీలు కొట్టే బోగీలకు మల్లే మాటల్తో పల్టీలు కొట్టించాలని చూస్తారీ ముకుందరావంటి రైల్వే రకాలు . ట్రయినేక్సిడెంట్ల వెనకున్న రీజన్స్ కనుక్కోడం కర్ణుడి చావుకేవి కారణాలో కనుక్కోడం కన్నా కష్టం. . ' అన్నాడాయనే చివరకు నాకు నచ్చచెబుతున్నట్లు.
నిజమే! బెంగుళూరెక్స్ ప్రెస్ యాక్సిడెంటు మీద ఇప్పటి వరకూ ఠింగూ ఠికాణా లేదు.
యాక్సిడెంటుకు కారణాలు యక్స్ .. వై. . జడ్ ఏవైతేనేం.. పోయే ప్రాణాలు మాత్రం మా పేసింజర్సువేగా ! రైలు బోగీల కిందపడి రోజూ ఎన్ని బతుకులు చితుకుతున్నాయో! గణాంకాల కందని విషాదపర్వమది. ఉత్తరాది ఖన్నా గారినందుకే సెక్యూరిటీస్ లోని కన్నాలు కనిపెట్టమని ఈ దక్షిణాదికి తరిమికొట్టిందీ రైల్వేడిపార్ట్మెంట్. ఖాన్నాగారెన్ని రిపోర్టుల్లో ఖన్నుడైనా కనీసం పోర్టరన్నా పట్టించుకోనప్పుడు వాటి వల్ల ప్రయోజనమేంటి.. సున్నా . చిత్తశుద్ధి లేని ఉత్తుత్తి ఉత్తర్వుల్తో మత్తులో జోగే యంత్రాంగం తోలొల్చే మరమ్మత్తు సాధ్యమనే!
' మన జనాలక్కూడా రైళ్లంటే మహా అలుసులేండీ! . ఊళ్లో ఏ గొడవలు జరిగినా ఊరి బైట కొచ్చి పట్టాలు పీకేస్తారు. గోద్రావిద్రోహులకైనా ,నకిరేకల్లు నక్సలైట్లుకైనా, స్టూవర్ట్ పురం గొలుసు బేచికైనా , వార్ వారికైనా, ఎవరి వారుకైనా రాళ్లేసుకోడానికి రైళ్లే కావాలా ? '
'ట్రూ! బళ్ళాపడానికి చైన్లు లాగడాల్లాంటి చాదస్తాలిప్పుడెవరికీ లేవులేండీ! . పట్టాలు పీకేస్తే సరి. బండన్నా ఆగుతుంది. లేదా చచ్చినట్లు పడిపోతుంది. ' అంటూండగానే..
నిజంగానే మాబండి ఒక్క కుదుపుతో అదుపు తప్పినట్లెగిరి పడి ఆగి పోయింది! పట్టాలు పీకి పారేశారా ఏం కొంపదీసి ? నిర్ధారణ కోసం బైటికి తొంగి చూస్తే. . ఊళ్లలో నుంచి జనం పరుగులెత్తుకొంటో వస్తున్నారిటేపే !
పక్క కూపేలో ఎవరో మంత్రి గారున్నార్ట . కొత్త రూటు కావాలని అడగడానికనుకుంటా!
'ఇప్పుడే వస్తా! అందాకా చూస్తుండండి ' అంటూ ఓ కాగితాల కట్ట నా మొహాన కొట్టి మాయమైపోయాడీ ముకుందరావు చిటికెలో!
నందిగామ - బందరు రూటు యాక్సిడెంటు తాలూకు రిపోర్టది. మంచి హ్యూమరస్ గా ఉంది.
హ్యూమన్ లాస్ లో కూడా హాస్యం ఏమిటి ? అంటారా! ఏడ్చే విషయాలైనా సరే.. నవ్విస్తూ చెబితేనే జనం చెవ్విస్తున్నదీ కాలంలో.
పెళ్లాం ప్లేట్ నిండా ఫిష్ కర్రీ వడ్డించలేదని వళ్లు మండి గేట్ మ్యానే ట్రాక్ ఫిష్ ప్లేటు క్రాక్ లా తొలగించాడని తేలిగ్గా తేల్చేసిందీ కమిటీ రిపోర్ట్ .
ఏ మాటకామాటే. మా బందర్ సైడు ఫిష్ మహ భేషైన టేస్ట్ . ఆ రుచి మరిగే ఈ ముకుందరావీ రిపోర్టు ఇంత ' ఫిషీ ' గా తమార్చెయ్యలేదు గదా!
పనిలో పని . ముకుందరావీ నివేదికలో చైర్మన్ హోదా లో చేసిన సవాలక్ష సూచనల్నుంచి మచ్చుక్కి కొన్ని పదనిసలు .. చదువరుల కోసం :
1. ప్రతి టిక్కెట్టు మీదా ' రైలు ప్రయాణం మీ ప్రాణానికి ప్రమాదం | అంటూ చట్టబద్ధమైన హెచ్చరిక చెయ్యడం తప్పనిసరి .
2 . కూపేలన్నింటిలో హరినామస్మరణ ప్లేట్ల సంఖ్య బాగా పెంచాల్సి న అవసరం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
3. సిబ్బందికి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణ క్రమంగా అలవడే శిక్షణ ఈ క్షణం నుంచే ప్రారంభించాలి . ప్రమాదాలు జరిగినప్పుడు విచారణ సందర్భంలో అవాస్తవాలైనా సరే.. సాక్ష్యాలు ఇచ్చే వేళ తడబాటు లేకుండా అందరూ ఒకే ట్రాకుపై బండి నడిపించే లక్ష్యమే శిక్షణగా నేర్పించాలి .
4. ప్రమాదాలు ఆశించిన మోతాదు మించుతున్న సందర్భంలో .. మొహమాటం లేకుండా బండ్ల సంఖ్యలో భారీ కోత విధించుకోవచ్చు . ఛార్జీలనూ , సర్ ఛార్జీలనూ దారుణంగా పెంచడం ద్వారా మరణాల రేటునూ నిరుత్సాహపరచవచ్చు.
5. గ్యాంగ్ మెన్లు ట్రాకుల జోలికి, స్టేషను మాష్టర్లు ఊళ్ల బయటకు, గార్డులు ఇంజన్ ఛాంబర్లలలోకి పోకుండా తాగు చర్యలు తీసుకుంటే ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఎక్కువ.
6. యాక్సిడెంటయిన తరువాత సస్పెండయిన డ్రయివర్లను బలంపిక్ ఈవెంట్స్ కు కోచ్ లుగా నియమించుకోవచ్చు.
ఇంకా.. ఇలాంటివే సవాలక్ష .
ఇంతలో ముకుందరావుగారు పొట్టచేత్తో పట్టుకుని పరుగెత్తుకుంటో బోగీలోకి వచ్చిపడ్డారు!
వచ్చే రొప్పు బైఫోర్స్ ఆపుకుంటూ అన్నారూ ' ఆ మహజరుందే.. మహా మజాగా ఉంది సారూ! ఆ మొత్తుకోళ్లు కొత్తరూటు కోసం కాదు . ఉన్న రూటు మొత్తం పీకి పారెయ్యాలని. పిచ్చికుక్కల్నంటే తరిమిగొట్టగలం గానీ .. పిచ్చెత్తినట్లు ఊళ్ల మీద కొచ్చిపడే రైళ్లనెలా ఆపగలం? దేవుడిచ్చిన కాళ్లలో సత్తువున్నంత కాలం మా తిప్పలేవో మేం పడతాం గానీ, మీ పాడు రైళ్లు మాత్రం మా ఊళ్ల మీదుగా వెళ్లద్దు. పాడు పట్టాలు వెంటనే పీకేయండె మహాప్రభో! ఎన్నికల్లోగా ఏ యాక్షనూ లేకుంటే ఆ పీకుడేదో మేమే చేసుకోక తప్పదు! .. ఇది గురూ గారూ! ఆ మహాజరు సారాంశం '
' అంటే .. అర్ధం. రైల్ రోకో నేగా ?'
' కాదు.. కాదు.. రైలో. . రైలో రాకో .. రాకు! ' అనసలు అర్థం.
ఫెడీ ఫెడీ మంటూ నవ్వే ముకుందరావు గారు నవ్వాపుకోలేక ధడాల్మని బెర్తు మీదలా పడిపోయారు .. అచ్చు నిన్ననే బెజవాడ బ్రిడ్జి మీంచి కృష్ణలో పడ్డ గోల్కొండ ఎక్స్ ప్రెస్ లా !
- కర్లపాలెం హనుమంతరావు రాకు
( ఈనాడు దినపత్రిక - సంపాదకీయపుట - 11, సెప్టెంబర్, 2003 - ప్రచురితం )
No comments:
Post a Comment