Sunday, December 12, 2021

వ్యాసం - గురించి ఓ వీసమెత్తు! - కర్లపాలెం హనుమంతరావు

 వ్యాసం - గురించి ఓ వీసమెత్తు!

- కర్లపాలెం హనుమంతరావు 

వ్యాసం అంటే శబ్దరత్నాకరం  ప్రకారం - విషయాన్ని విస్తారంగా రాయడం. ఆ రాసేది  ఏదో చరిత్రకు సంబంధించింది అయివుండాలని  ఆంధ్రవాచస్పతం చెబుతోంది. 

రాసే విషయం తెలిసి ఉండటమో, తెలియని పక్షంలో  ఓపికగా తెలుసుకుని ఉండటమో  అవసరం. ఆ పైన మాత్రమే అంశాల వారీగా  వాటిని వివరించడానికి పూనుకోవాలి. అప్పుడే ఇంగ్లీషు వాళ్లు ఎస్సే అన్నదాన్ని  మనం వ్యాసంగా చెప్పుకునే రచనకు  ఒక సక్రమమైన రూపం వస్తుందని  భా. స. వారి విజ్ఞానసర్వస్వం మరింత వివరణ ఇచ్చింది.  


మనకు వ్యాసం అంటే ఒకటే రూపం.. హిందీ, బెంగాలీ, ఒడియా వాళ్లకు మల్లే నిబంధ, ప్రబంధ.. లాంటి రకరకాల పేర్ల బాధ లేదు. 


ఈ ఎస్సే విషయంలో ఇంగ్లీషువాళ్లదీ తలో దారే. శామ్యూల్ జాన్సన్ ఇట్లా అన్నాడూ, ముర్రే అట్లా నిర్వచనం చేశాడూ .. అంటూ నిఘంటువులూ విజ్ఞాన సర్వస్వాలూ కోట్ చేసుకుంటూ  కూర్చుని దీన్నో బోర్ కొట్టే క్లాస్ పాఠంలాగా మార్చేస్తే చెప్పదలుచుకున్న పిసరంత విషయమూ పక్కదారి మళ్లేస్తుంది. అందుచేత చరిత్రలోకి తొంగి చూసే చిన్న  ప్రయత్నం చేసి చూద్దాం! 


16వ శతాబ్దంలో ఫ్రెంచ్ రచయిత ఎస్సే అంటూ ఓ కొత్తప్రకియ సాహిత్యంలో మొదలపెట్టేదాకా వ్యాసరూపం ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలీదు. బేకన్, కౌలే, డ్రైడొన్ లాంటి  ఇంగ్లీషు రైటర్స్  ఆ ప్రక్రియకు ఓ అందం, హంగు ఏర్పరిచినప్పటి బట్టే  గద్యం పద్యంలాగా, ప్రశంస విమర్మకు మల్లే సరికొత్త ప్రయోజనాలు సాధించి పెట్టే సాహిత్య ప్రకియగా వ్యాసం విశ్వవ్యాపితమయింది . 


18 వ శతాబ్దంలో స్టీల్ , టాట్లర్ అనే మిత్రులిద్దరు స్పెక్టేటర్ లాంటి పత్రికలు పెట్టి .. చమత్కారపూరితమైన  వ్యాసాలకు శ్రీకారం చుట్టారు. మన తెలుగులో పానుగంటివారి 'సాక్షి' వ్యాసాలకు ఆ ధోరణే ప్రేరణ. పత్రికలు లేకపోతే వ్యాసాన్ని పట్టించుకునే వాడుండడు. వ్యాసాలు మీ పత్రికలు మనుగడ సాగించలేవు.. అప్పటికీ ఇప్పటికీ అదే పరిస్థితి. 


గోల్డ్ స్మిత్ ' సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ ' ఆ చమత్కారానికి సమాజంలోని మంచి చెడ్డల సమీక్షనుకూడా జతచేసింది. లాంబ్ ' ఎస్సే ఆఫ్ ది ఇలియా' తో వ్యాస ప్రపంచంలో సృష్టించిన ప్రమాణాలే నేటికీ అనుసరణీయం. ఇలియా అతని కలం పేరు. చాలా మృదువుగా సాగే ఆయన వ్యాసాలను సంపుటాలుగా  తెస్తూ హిల్లూ, హాల్ వర్డూ   అనే విమర్మకులు వెలువరించిన పుస్తకం పీఠికలో. . ఇదిగో ఇప్పుడు మనం చేసే చర్చలాంటిదే చేశారు వ్యాస ప్రకియ మీద కూలంకషంగా. 

మెకాలే, ఆర్నాల్డూ, లాయీస్, స్టీవెన్‌సన్, హడ్సన్, ఎమర్మన్ లాంటి గొప్ప వ్యాసరచయితలను తీర్చిదిద్దిన ఇంగ్లీషు 'ఎస్సే ' చరిత్రను గురించి ఎంత చెప్పుకున్నా ఇంకొంత మిగిలే ఉంటుంది. కాబట్టి ముందుకు కదులుదాం! 


కవికి గద్యం ఎట్లాగో .. గద్యానికి వ్యాసం అట్లాంటిది - అన్నాడు ప్రముఖ హిందీ సాహిత్యవేత్త రామచంద్ర శుక్లా. వ్యాసమంటే  సంక్షిప్తంగా ఉండాలి. సరళంగా సాగాలి. నాలుగయిదు పుటల వరకు సాగదీసే 

' ఎస్సే ఆన్  'అండర్ స్టాండింగ్'  లాంటి వ్యాసాలు చూశాక  హిల్లూ, హాల్ వర్డూ  పెట్టిన షరతు ఇది. అయినా మన తెలుగు కలం వీరుల వ్యాస విజృంభణకు అడ్డంకి కాలేకపోయింది.  ప్రతిభ అనే మాసపత్రికలో వందపుటల ' ఆంధ్ర మహాభారత విమర్శనము '  అందుకో ఉదాహరణ! ఆ మధ్యా ' వ్వాస వాజ్ఞ్మయ మంజరి' లో నూటయాభై పేజీల వ్యాసమొకటి ప్రత్యక్షమవడం ఎవరం మర్చిపోలేని విచిత్రం.


విషయ ప్రధానంగా ఉంటుంది కాబట్టి వ్యాసం సంక్షిప్తంగా ఉంటే చదవ  బుద్ధవుతుంది. అంశం ఏదైనా కావచ్చు కానీ, కళావంతంగా, కమ్మని శైలిలో, చమత్కారం అద్దుతూ సమకాలీనత ప్రధానంగా సాగే వ్యాసాలకే ఆదరణ ఎక్కువ. రాసేవాడు తన భావాలను మన మీద బలవంతంగా రుద్దుతున్నాడన్న అనుమానం వచ్చిందో..   ఆ వ్యాసానికి నూకలు చెల్లినట్లే! సూటిగా, మనసుకు హత్తుకునే పద్ధతిలో రాసిన వ్యాసాలే కలకాలం సమాజాన్ని ప్రభావితం చేయగలిగేది! ' ది ట్రూ ఎస్సే ఈజ్ ఎస్సెన్షియల్లీ - అన్న హడ్సన్ సలహా గుర్తుంచుకుంటే చాలు.. ఆ ఆత్మాశ్రయ సాధన కోసం వ్యాసరచయితకు సృజనాత్మక ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి!  వ్యాసరచనకు ఏ యోగాసనాలూ లేవు. 


వ్యాసం ప్రధానంగా వచనంలో ఉండటమే రివాజు. పోప్ లాంటి మహాశయులు 'ఎస్సే  ఆన్ క్రిటిసిజమ్'  వ్యాసాలు పద్య రూపంలో   రాశారని .. మనమూ ఆ దుస్సాహసానికి పూనుకుంటే పోపు మాడిన పప్పు  తయారవడం ఖాయం. మనవాళ్లు గతంలో భూగోళం, గణితం కూడా పద్యాలల్లో రాసేవాళ్లు! వ్యాసం కూడా పద్యాల్లో రాసేసి మీసం మెలివేయలేదు. అక్కడికి అదృష్టమే! 



అచ్చుయంత్రాలు వచ్చి పత్రికల ప్రగతికి బాటలు పడే క్రమంలో తెలుగులోనూ వ్యాసాల అక్కర ఎక్కువయింది. ఎవరెంత ప్రాగల్భ్య ప్రకటనలు చేసినప్పటికి భరత ఖండంలోనూ తతిమ్మా  ఖండాల  మాదిరే  ..  అచ్చుయంత్రాల ఆగమనం .. పత్రికల ఆవిర్భావం.. వ్యాసప్రక్రియ ఆవిష్కరణ వికాసాలు ఒక వరసలో సాగినవే! మన ప్రాచీన  సాహిత్యంలోనే  నేటి వ్యాసానికి     బీజాలు ఉన్నాయన్న  వాదనలో పస లేనేలేదు. శాసనాలు, వ్యాఖ్యానాలు వ్యాసాలు కాలేవు. 


19వ శతాబ్దం పూర్వార్థం నాటికిగాని తెలుగు సాహిత్యంలో ' వ్యాసం ' ప్రభవించలేదు. 1840-50 ల నాటి ముద్దు నరసింహంగారి నుంచి తెలుగులో  నిర్వచనానికి ఒదిగే వ్యాస రచన ప్రస్థానం  ప్రారంభమయింది అనుకోవాలి.  రచన, శైలి, భాషా ప్రయోగం లాంటి అంశాలలో నేటికీ తాజాదనపు సువాసనలు వెదజల్లే తొలి వ్యాస సంపుటి ముద్దు నరసింహంగారి హితసూచని. అభ్యుదయ భావాలతో కిక్కిరిసి  ఉండే ఆయన వ్యాసాలు అందుకే వీరేశలింగం పంతులుగారికి శిరోధార్యాలయ్యాయి. 

ఆర్ష విజ్ఞానం ప్రతిభావంతంగా ప్రదర్శించిన  వ్యాసరచయిత కీ. శే పరవస్తు వేంకట రంగాచార్యులు ( 1822 - 1900 ) , విలువైన కాలాతీత  వ్యాసపరంపర్  సృష్టికర్త కీ.శే.వీరేశలింగం పంతులుగారు, కొమర్రాజు వేంకట లక్ష్మీ నరసింహం, బండారు అచ్చమాంబ, పూండ్ల రామకృష్ణయ్య, వేదం వెంకటరాయి  శాస్త్రి,     కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, జయంతి రామయ్య, చిలుకూరు వీరభద్రరావు, చిలకమర్తి వేంకట లక్ష్మీనరసింహం పంతులుగారు, ముట్నూరు కృష్ణారావు, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఒంగోలు వెంకటరంగయ్య, ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనశర్మ, గిడుగు వెంకట రామ్మూర్తి, మారేపల్లి రామచంద్ర శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, వేటూరి ప్రభాకరశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, పురాణం సూర్యనారాయణతీర్థులు, గొబ్బూరు వెంకటానంద రాఘవరావు, చిలుకూరి  నారాయణరావు, కాశీనాధుని నాగేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పానుగంటి లక్ష్మీనరసింహరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేలూరి శివరామశాస్త్రి, శ్రీవాత్సవ, కొంపెల్ల జనార్దనరావు వంటి ఎందరో నిష్ణాతులు వ్యాసప్రక్రియ పుష్టికి మూలకారకులు. 


సాహిత్య వికాసానికి కాలనియమం ఉండదు. అభిరుచి, అభినివేశం ప్రధానం . అక్షర క్షేత్రంలో బీజమెత్తి మహావృక్షంగా పరిణమించిన అన్ని ప్రక్రియల దారిలోనే వ్యాసధారా నిరంతరాయంగా కొత్తపుంతలగుండా ఉరకలెత్తుతూనే ఉంది. రాళ్లపల్లి,  పింగళి, విశ్వనాథ, తల్లావజ్ఝల, తాపీ, దీపాల, నార్ల, వేదం, చల్లా, గిడుగు, శ్రీ శ్రీ, , నోరి, దివాకర్ల, ఆరుద్ర, సినారె, నిడదవోలు, దేవులపల్లి, వడ్లమూడి, వడలి, వావిలాల, నాయని, సినారె, నాయిని, తూమాటి, జి.వి.కె, రమణారెడ్డి, రామరాజు, రావూరి, గుంటూరు, కొత్త, విద్వాన్ విశ్వం, చిలుకూరి, పుట్టపర్తి, పిల్లలమర్రి, వసంతరావు, ఆండ్ర, నటరాజా, దిగవల్లి .. ఇట్లా  వ్యాసరథ చక్రాల నిరంతర గమనానికి ఎంతో మంది మహానుభావుల నిరంతరాయ కృషీవలత్వమే ప్రధాన ఇంధనం. 


ఇంగ్లీషు ' ఎస్సే ' చరిత్రకు నాలుగు శతాబ్దాల చరిత్ర. కాకలుదీరిన 'కలం  ' కారులు దీని వైభవానికి మూలకారణం, తెలుగు ' వ్యాసం 'ఒక్క శతాబ్దం అయినా నిండింది కాదు. వ్యాస కృషీవలుల నిత్య వ్యాసంగం వ్యాసరంగంలో  కొదవ లేమి కారణం కాకపోయినా, నవల, నాటకం కథ, కవిత్వాది క్షేత్రాల మాదిరి కావలసినంత పరిపుష్టంగా వికాసం జరగడం లేదనే సత్యం గ్రహించక తప్పదు . ఆ సదవగాహన కలిగినప్పుడే భావికార్యాచరణకు సరితూగే ప్రణాళికలు రూపొందించుకుని, ఆచరించడం ద్వారా ఆ లోపం పూడ్చుకునే ఆస్కారం. 

- కర్లపాలెం హనుమంతరావు 

( సోర్స్ : సారస్వత వ్యాసములు - రెండవ సంపుటి పురిపండా అప్పలస్వామి  తొలిపలుకులు) 

09-09.2021 

బోథెల్ ; యూ ఎస్.ఎ  




 

బామ్మ ఫిష్ -కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 బామ్మ ఫిష్ -కథానిక

-కర్లపాలెం హనుమంతరావు

 

 

'చేస్తావుగా?' అని అడిగాడతను. 

తలాడించా. గుండెలు గుబగుబా కొట్టుకుంటున్నాయి. 

లోపలకెళ్లొచ్చి నా చేతిలో డబ్బుల కట్టోటి పెట్టి అన్నాడు 'మూడు రోజుల్లో అయిపోవాలి పని. లెక్క చూసుకో! పాతిక వేలు. బ్యాలెన్స్..  పని సాఫీగా  అయింతర్వాత.' 

ఫోన్ కాలొచ్చిందింతలో అతగాడికి. 

 ఆటో స్టార్ట్ చేసుకుని నేనొచ్చేశా. మధ్యాహ్మం రెండు గంటలు కావస్తోందప్పటికే.. మోడల్ స్కూల్ పిల్లల పికప్ టైమ్. 

బండి నడుస్తోందే  కానీ, ఆలోచనలు అదుపులో లేవు. 

 

'యాభై వేలు. తక్కువ మొత్తమేం కాదు.. తనబోటోడికి. బ్యాంకప్పుతో నడుపుకునే ఆటో ఇది. కిస్తీలు  కట్టలేక తప్పించుకు తిరగడం  ఎక్కువైంది మరీ ఈ   మధ్యన. ఎన్ని రోజులట్లా? మొన్నటికి మొన్న  సెల్వరాజుకు రైలుస్టేషన్ సందులో దొరికిపోయాడు. 

 

సెల్వరాజు బ్యాంక్ రికవరీ ఏజెంట్. బండిని సీజ్ చేయించడం క్షణం సేపతనికి . ఎప్పట్లా మొరటుగా మాట్లాడలేదా  సారి. బండిలోకొచ్చి  కూర్చుని  కబుర్లకి దిగాడు. లోను బకాయిలు తీర్చకపోడానికి తన దగ్గరున్న రీజన్సేవో తాను చెప్పుకొస్తుంటే..

'ఈ సినిమా కష్టాలు అందరికీ ఉండేలేవే బయ్! బ్యాంకోళ్లు వింటార్రా! టయానికి వాయిదా కాతాలో పడాల. అదొక్కటే లెక్కాళ్లకి. ఆర్నెల బట్టీ నీ బాకీ మొండికి  తిరగబడె. నా ప్రాణం కొరకతావున్నార్రా నాయనా నిన్నట్టుకురమ్మని. నాదీ నీకులాగే పొట్ట తిప్పల చాకిరేనే కదా తమ్ముడూ! ఇప్పటికైనా దొరికావ్! పద! సార్ తోనే  కలిపిస్తా! అదేదో ఆడ్నే మొత్తుకో! పెద్ద సార్లు అవునంటే నాదేముంటది బ్రదర్! నాక్కూడా ఈ  తిప్పట  తప్పుద్ది గదా!'  అంటూ బ్యాంక్ సార్ సుబ్రహ్మణ్యంగారి దగ్గరకు నన్ను పట్టుకెళ్లాడు. 


ఆయన దగ్గరా అవే మొరలు. పూర్తిగా విననైనా విన్లేదా మహానుభావుడు. 'బకాయిలు కడతావా? బండిని పట్టేసుకోమంటావా? ఏదో ఓటి  తేల్చు!'  అని బిగుసుక్కూర్చున్నాడా  మొండి ముండా కొడుకు! మజ్జెలో ఈ సెల్వరాజన్నే కలగజేసుకుని నన్ను బైటికి లాక్కొచ్చాడు. 

 

అప్పుడు పెట్టిందే ఈ  ప్రొపోజల్. ‘సార్  నీ బాకీ  మాఫు చేయిస్తానంటున్నాడ్రా. నువ్వాయనకు ఓ చిన్న సాయం చేసిపెట్టాలంతే' అంటూ అసలు విషయం చల్లంగా బైటపెట్టాడు. 


వింటుంటేనే చెమటలు పట్టేసినయ్ రా  భగవంతుడా! ఇట్లాంటివి సినిమాల్లో, టీ.వీల్లో తప్ప  నేరుగా చూసిందిలే ఎప్పుడూ. ఇందులో నాదే ముఖ్య పాత్ర! 'బండి పోతే పాయ! ఇట్లాంటివి నా వల్ల కాదన్నా!' అంటూ అక్కడికక్కడే తోసిపారేశా అప్పటికైతే. 

 

బ్యాంక్ సారుకు 'ఒక చిన్న ఇల్లు' ఉందంట మారేడుపల్లిలో. ఆ అమ్మను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలని కుతి. మొదటామె  వూరుకుంటదా? అందుకని..  ఆమె అడ్డు తొలగించుకోవాలని సార్ ప్లాన్. 

 

సర్కారు ఉద్యోగం కనక సొయంగా  ఏం చేసినా కొలువుకు ఎసరంట. అందుకనీ ఈ తంటాలు!  తొలగించుకోడానికి హెల్ప్ చేస్తే యాభైవేలు ఇస్తానని సెల్వరాజు చేత కబురందించాడీ పెద్దమనిషి. 

 

పాపిష్టి డబ్బు కోసం ప్రాణాలు తీయడవా?! నా వల్ల కాని పని. ఇట్లాంటి అలోచన వినేందుకు ఛాన్సిచ్చినందుకే  నా మీద  నాకు కోవం  వచ్చింది. బక్కోడి కోపం ఎవడికి లెక్క! బండి పట్టుకుపోయాడా  సెల్వరాజు.  

 

ఇంట్లో కమల ఒహటే మొత్తుకోలు. విషయం దానికి తెలీదు. దాని దాకా రానీయకూడదనే అనుకున్నా. 

 

అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా జీవితంలో! ఎట్లా తెలిసిందో తెలిసింది! సెల్వరాజుగాడే కొంపకొచ్చి దాని చెవులూ  కొరికినట్లున్నాడు. ఇదేం చెప్పిందో ఏమో.. ఒక్క రోజులోనే బండి తాళం చెవులు ఇంట్లో అప్పగించిపోయాడు! వేరే దగ్గర తీసుకుని బాడుక్కి నడిపించుకున్న బండిని  ఓనరుకు అప్పగించి ఇంటికి రాంగానే.. ఇంటి ముందు మళ్లా బ్యాంకోళ్ళ బండి ప్రత్యక్షం!

 

ఆ రాత్రి కమల పీకిన క్లాసు ఇంకా చెవుల్లో గింగురుమంటానే  వుంది. 'పెద్దాళ్లు.. ఎట్లా చెబితే అట్లా వినుకోవాలి గదయ్యా! యాభై వేలు మొత్తం ఒకే సారి ఈ జనమలో  మనం కళ్లజూస్తామా! బండినీ తనే ఇడిపిస్తానంటున్నాడాయా  సారు!  ఈ మొత్తం బ్యాంకులో వేసుకుంటే రేపు పిల్లదాని చదువుకో, పెళ్లికో అక్కరకొచ్చును గదా!  పాడు పనులు.. మంచి పనులు అని లెక్కేందీ కలికాలంలో! ఏదీ  చేయంది ఎవడయ్యా సుద్ధంగా బతకతా ఉండాదీ..!’

  

'పాడ్డబ్బు కోసం పండంటి మనిషి ప్రాణాలు తియ్యమంటావేంటే!  ఏందే! నీక్కూడా ధన పిశాచం ఎక్కించి పోయినట్లున్నాడే ఆ సెల్వరాజుగాడు. చూస్తా చూస్తా  ప్రాణాలు తియ్యడం నా వల్లయే పని కాదులే. ఆ తల్లెవరో గాని.. ఆమె ఉసురుపొసుకోడం నేను కల్లో కూడా చెయ్యలేని నీచప్పని.. ' అంటూ  ఎగురుతుండే సరికి గమ్మునుండి పోయింది కమల. 


ప్రయత్నం చాలించుకుందనే అనుకున్నా. తను చాలా మొండిది. బాత్ రూమ్ కడిగే ఏసిడ్ తాగింది తెల్లారి. ఆసుపత్రిలో.. పోలీసోళ్లతో  పెద్ద రభసయింది. 

 

కేసు కూడా అయివుండేదే! సెల్వరాజన్న పూనుకున్న మీదట ఆ గండం తప్పింది. 'విరోచనాల మందు అనుకుని అధాట్న ఏసిడ్ తాగినట్లున్నా’ అని కమల చేత  చెప్పించుకుని..  రికార్డు చేసుకొని గప్ చిప్ అయిపోయారు పోలీసోళ్లు. 

 

'.. ఆళ్ల చేతుల్లో ఐదేలు పోస్తే కాని పనవలేదురా బచ్చాగా  .. తెలుస్తుందా నీకు లోకం తీరు? చట్టాన్ని రక్షించోల్సినోళ్లే  ఇట్లా అమ్ముడవుతావుంటే .. నీకే ఇంకా నీలుగుళ్ళు!' అంటూ దెప్పిపొడిచాడీ సెల్వరాజు ఆ మధ్యాహ్నప్పూటొచ్చి కూర్చుని. ఆడి టైమ్ మరి!

 

కష్టాన్నుంచి గట్టెక్కించినందుకు అతగాణ్ణేమీ గట్టిగా  అన్లేని పరిస్థితి. ఇట్లాంటి పిచ్చిపని చేసినందుకు కమల మీదే పీకల్దాకా మండుకొచ్చింది. చేసిం దానికి అదేమీ బాధపడ్డంలే. 'ఈసారి నిజంగానే ఛస్తా! పిల్లదాన్ని ఎట్లా సాక్కుంటావో సాక్కో  నువ్వొక్కడివే సచ్చినాడా!' అని బెదిరించింది పైపెచ్చు!

 

పిల్ల మాట వచ్చే సరికి నేనూ కాస్త చచ్చుపడ్డా. పెళ్లయిన పదేళ్లకు రెండు కాన్పులు పోయింతరువాత పుట్టిందీ పార్వతి. అమ్మ బతికుండగానే తన పేరు పెట్టించుకుంది  దానికి. అందుకే అదంటే నాకు ప్రాణం. పోయిన అమ్మను దాన్లోనే చూసుకుంటున్నా. దాని కళ్లు తడయినా నేను తట్టుకోలేను. దానికీ బామ్మంటే అట్లాగే  ప్రాణం. ఇద్దరూ స్నేహితురాళ్లకు మల్లె ఇంట్లో కలివిందం చేస్తుండేవాళ్ళు పద్దాకా. 

 

అమ్మ పోయినప్పుడు పార్వతిని సంబాళించడం చాలా కష్టమయింది. అన్నం నీళ్లూ మానేసి అదే పనిగా బామ్మా .. బామ్మా .. అని  ఏడుస్తుంటే ఏమవుతుందోనని చాలా బెంగపడ్డాం నేనూ, కమలా. 

 

పిల్లదాని ధ్యాస మళ్లించడానికని  అది ఎప్పట్నుంచో  కలవరిస్తున్న 'ఫిష్ ట్యాంక్'  ఓటి కొనిచ్చాను.  దాన్లోని మూడు  చేపలకూ మూడు పేర్లు పెట్టుకుని తెగ మురిసిపోయిందీ పార్వతి. బోండాంలా నల్లగా ఉండే చేప నేను. సన్నగా బులుగ్గా ఉండి చురుగ్గా కదిలే చేప దాని అమ్మంట. మధ్యస్తంగా గోధుమ రంగులో మందంగా కదిలే చేపకు తనకు ఇష్టమైన బామ్మకు గుర్తుగా  'బామ్మ ఫిష్' అని పేరు పెట్టుకుంది పిచ్చిది.  ఆ 'బామ్మ ఫిష్' పార్వతికి లైఫ్ లో  స్పెషల్!

 

పిల్లదాన్ని అడ్డమేసుకుని నన్ను లొంగదీసుకుంది కమల ఎట్లాగైతేనేం. బండి బకాయిలు కట్టుకోలేని అశక్తతా.. ఇప్పటి దాకా కట్టిన పెద్ద మొత్తం కూడా కారణమై ఉండొచ్చు! బండి సొంతమవుతుందని, కొంత సొమ్ము పిల్లదాని మంచి జీవితానికి   తోడవుతుందన్న ప్రలోభం కూడా నన్ను ఈ పాపం చేయడానికి పురికొల్పిందేమో.. తెలీదు! ఏమైతేనేం, సుబ్రహ్మణ్యంసారు మొదటి భార్యను మాయంచేసే ప్రణాళికలో నా వంతు పాత్రకు సిద్ధమయ్యా చివరికి. 

 

మూడు రోజులు  గడువుపెట్టాడు బ్యాంక్ సారు. ప్లానూ తనదే. చల్లంగా ఆచరించడం ఒక్కటే నా వంతు. 


సారు  భార్య ఫొటో చూపించాడు సెల్వరాజు. ఆమెకు ప్రతీ శుక్రవారం మారేడుపల్లిలోని సంతోషీమాత గుడికెళ్లి  అమ్మవారి దర్శనం చేసుకోవడం అలవాటంట. దర్శనం అయిందాకా మంచినీళ్లు మినహా  మరేదీ ముట్టుకోరంట.. తల్లి. ఆ యమ్మను  గుడికి తీసుకెళ్లే  ఆటోవాలాలా తనను ఏర్పాటు చేస్తాడంట  సారు! వెళ్లి తిరిగొచ్చే లోపు .. అమ్మ  కూడా తెచ్చుకునే మంచినీళ్ల సీసాలో సార్ సప్లై చేసే 'మందు' నేగ్గా కలపడం..! అదొక్కటే  తన వంతు  భాగం. 

 

‘మందు’ అంటే  అది మామూలు మందు కాదు. కంటికి తాగే నీళ్లలానే కనిపించినా బొట్టు గొంతులో దిగితే చాలంట.. అయిదారు నిమిషాల్లోనే ప్రాణం తీసే రకం! ఎక్కణ్ణుంచి అట్టుకొస్తారో ఇట్లాంటి దరిద్రాన్నంతా! ఆ తల్లి నీళ్ళు తాగి పై మీద స్పృహ తప్పితే.. ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలో  కూడా ముందే ఏర్పాట్లవీ అన్నీ పక్కాగా చేసి పెట్టాడు బ్యాంకాయన! చూసే డాక్టర్లు, నర్సులు.. కేసు రాసుకుపోయే పోలీసులు.. అందరూ .. అన్నీ ముందే పకడ్బందీగా  ఏర్పాటయినట్లు చెప్పి  ఇంటికొచ్చి మరీ భరోసా ఇచ్చిపోయాడు సెల్వరాజు. కమలకు నమ్మకం కలిగించడం పెద్ద కష్టం కాలే. నా నమ్మకాలతో ఎవరికీ పనే లే. పనులన్నీ చకచకా జరిగిపోయాయి. 

 

ఆ ఏర్పాట్లలో భాగమే ఇప్పుడిట్లా  సుబ్రహ్మణ్యం సార్ ఇంటికొచ్చి సగం పైకం అడ్వాన్సుగా పుచ్చుకోడం. ఇవాళ బుధవారం. గురువారం దాటుకుని.. శుక్రవారం నాటికి పని పూర్తయితే  పూర్తి సొమ్ము చేతికందుతుంది. 

... 

సెల్ అదే పనిగా మోగుతుంటే ఈ లోకంలోకొచ్చిపడ్డా. కమల గొంతు. కంగారుగా అరుస్తావుంది. 'ఫిష్ ట్యాంకులోని బ్రౌన్ చేప చచ్చిపోయిందయ్యా! పిల్లది ఇంటి కొస్తే మళ్లా పెద్ద సీనవుద్ది. ఉన్నపళంగా ఇంటికి రా! వచ్చే దారిలో అచ్చంగా అట్లాంటిదే కాలీషా షాపులో ఉంటది.. తీసుకురా! పిల్ల రావడానికి ఇంక గంటే టైముంది!' అని గోల. 

బ్రౌన్ ఫిష్ అంటే పార్వతి దృష్టిలో 'బామ్మ ఫిష్'. దానికేదైనా అయితే నిజంగా పసిది తల్లడిల్లడం ఖాయం. పిల్ల బడి నుంచి ఇంటి కొచ్చేలోపే తను చేపతో ఇంటికెళ్లాలి. వెళ్లి తీరాలి. 

 

స్టేషన్ దగ్గరున్న కాలీషా ఆక్వేరియం దుకాణానికి వెళ్లా. అదృష్టం బావుండి.. బ్రౌన్ కలర్ చేప పిల్ల దొరికింది. ఇంటికొచ్చి దాన్ని ఫిష్ ట్యాంకులోకి వదిలిందాకా  ప్రాణం పింజం పింజం అంటానే  ఉండింది. 

 

పార్వతి అవడానికి అయిదేళ్ల పిల్లే అయినా, దాని గ్రహణశక్తి అమోఘం. భామ్మ  ఫిష్ కనపడలేదంటే అది చేసే యుద్ధం అంతా ఇంతా కాదు. 

పిల్లలకూ, పశుపక్ష్యాదులకూ ఎందుకో అంత లంకె!

 

బడి నుంచి రాగానే పార్వతి ముందు  ఫిష్ ట్యాంక్ దగ్గరకు పరుగెత్తుకెళుతుంది. మూడు చేపలతో కాస్సేపు ముచ్చట్లు పెట్టుకుంటే గాని.. వాళ్లమ్మను నోట్లో ముద్ద పెట్టనివ్వదు. ఎప్పట్లానే ఆ రోజూ అది ఆక్వేరియం దగ్గర చేరి కబుర్లు మొదలెట్టింది. బ్రౌన్ చేపలోని తేడాని తను గుర్తుపట్టకపోవడంతో నేనూ, కమలా ఊపిరి పీల్చుకున్నాం. 

 

సెల్వరాజు ఇంటికొచ్చి ప్లాన్ గురించి ఇంకో సారి  హెచ్చరించిపోయాడు. సుబ్రహ్మణ్యంగారి భార్య తాగాల్సిన మందు ఇచ్చెళ్లడానికని వచ్చాడు చచ్చినాడు .. అదీ అసలు విషయం. 

ఎందుకైనా మంచిదని పిల్లదానికి అందుబాటులో లేకుండా బాత్ రూమ్ లో ఎత్తున దాచిపెట్టింది కమల. 

 

మనసు బా లేక కాస్త పుచ్చుకుని మంచం మీద పొర్లుతున్నా నేను. పిల్లదాని ఏడుపులకు హఠాత్తుగా మెలుకొవొచ్చేసింది. దొడ్లో నుంచి ఆ ఏడుపులు! కమల సముదాయించేందుకు నానా హైరానాపడుతోంది. 

 

బడికి వెళ్ళడానికి మారాం చేస్తుందో ఏమో! బడంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అట్లా చేయదే!  దొడ్లోకి పరుగెత్తా కంగారుగా. 

 

పెరట్లో  బావి గట్టు మీద చిందులేస్తూ  కనిపించింది పిల్ల. వంటి మీద ఒక్క నిక్కరే ఉంది. కమల చెప్పిన మాట విని షాకయ్యాను. 

బావి గట్టు మీద 'బామ్మ ఫిష్'  పడుంది. చీమలు దట్టంగా పట్టున్న ఆ బ్రౌన్ ఫిష్ ను చూసే పార్వతి ఏడుపు!  విషయం గ్రహించినట్లుంది. ఆ ఏడుపుకు, గోలకు అంతంటూ లేదు. 'బామ్మ ఫిష్ ఇక్కడెందుకుందీ? చీమలు కుడుతున్నాయి.. నొప్పిగా ఉంటుంది.. ముందు తొట్లో పడేయండి!' అంటూ ఒహటే గోల! 

నిన్న కమల బైటపారేసిన బ్రౌన్ ఫిష్ ను కాకులు ఎత్తుకొచ్చి మళ్లా బావి గట్టు మీద పడేసినట్లున్నాయ్! ఇది మేం ఊహించని పరిణామం. ఇప్పుడేం చెయ్యడం? పార్వతి తెలివిగల పిల్ల. దానికి నచ్చచెప్పటం అంత సులువైన పని  కాదు. 

 

ఏడ్చే పార్వతిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చా. ఫిష్ ట్యాంకులోని బ్రౌన్ ఫిష్ ను చూపించి 'బామ్మ ఫిష్' ఇక్కడుందమ్మా! అదేదో పిచ్చి చేప’ అని సర్దిచెప్పాలని నా తంటాలు.


'ఏం కాదు. ఇదే పిచ్చి ఫిష్! బావి దగ్గరున్నదే బామ్మ ఫిష్.  నాకు  తెలుసు బామ్మ..  ఫిష్ మీద మూడు బ్లాక్ గీతలుంటాయ్! దీనికి ఒక్కటి కూడా లేదు. నాకు నా బామ్మఫిష్షే కావాలి' అంటు కాళ్లూ చేతులు కొట్టుకుని  ఏడుస్తుంటే .. దాని సూక్ష్మ పరిశీలనాశక్తికి అబ్బురపడాలో.. రెండంటించాలో అర్థం కాని స్థితి ఆ క్షణంలో!

 

ఎంత సముదాయించినా మొండితనం మానకపోయేసరికి కమలే చివరికి రెండు తగిలించింది. 

 

పార్వతిని ఇంట్లో ఇంత వరకు మేమెవరం కొట్టి ఎరగం. మొదటి సారి పడిన దెబ్బలకు బిత్తరపోయింది పసిది. సముదాయించడానికి దగ్గర కెళితే వాళ్లమ్మని దగ్గరకే రానీయలేదు. ఆ పూటకు ఇక బడి లేనట్లే!

 

బాడుగలు పోతాయని నేను బండి తీసుకుని రోడ్డెక్కాను. పనిలో ఉన్నానే కాని మనసు మనసులో లేదు. ఆటోలో ఎక్కిన  స్కూల్ పిల్లల్ని..  వాళ్ల కేరింతల్ని చూస్తుంటే ఇంట్లో ఉన్న పార్వతే కంట్లో మెదిలింది. 


మధ్యాహ్నం ఇంటికి వచ్చేశాను మనసు ఉండబట్టలేక. ఇంటికి తాళం వేసుంది. పక్కింటి ముసిలాయన తాపీగా చెప్పాడు 'నీ పెళ్లాం పిల్లదాన్ని  తీసుకొని ఆసుపత్రికెళ్ళిందిరా! ఒకటే వాంతులు. నీ సెల్ ఏమయింది? ఎత్తడం లేదంట?'

 

సెల్వరాజుగాడు పదే పదే కాల్స్ చేస్తుంటే.. విసుగొచ్చి సెల్ ఆఫ్ చేసుకునున్నా. పెద్దాయనతో సహా ఆసుపత్రికి పరుగెత్తాను. 

 

'పాప దేనికో బాగా కలతపడింది. కంగారు పడకండి. మందులిచ్చాం. సర్దుకుంటుంది. ఈ పూటకి ఆసుపత్రిలోనే ఉండనివ్వండి. బాగుంటే రేపు డిశ్చార్చ్ సంగతి చూసుకోవచ్చు!' అన్నది డాక్టర్. 

 

ఆ రాత్రి నాకూ, కమలకు కాళరాత్రే! ఉండుండి పార్వతి మగత నిద్రలోనే 'బామ్మ  ఫిష్.. బామ్మ ఫిష్ కావాలి' అంటూ ఒకటే కలవరింతలు. 

'చిన్న చేప మీద పిల్ల ఎంతలా అనుబంధం పెంచుకుందీ!' అంది కమల దిగులు మొహంతో. 

'చిన్నదా.. పెద్దదా అని కాదు. ప్రాణం ప్రాణమే! ఆ తేడాలు పెద్దాళ్లం మనకు తెలీవు కానీ,  పిల్లలు అన్నిటినీ, అందరినీ సమానంగా ప్రేమిస్తారు. అందుకే వాళ్లలో దేవుడు ఉంటాడనేది' అంది అక్కడే ఉన్న  నైట్ డ్యూటీ నర్స్. 

 

ఏ ఉద్దేశంతో అందో కాని, నా మనసు మూలిగింది. 'సిస్టర్ అన్న మాటలో నిజం ఉంది. ఒక ప్రాణాన్ని తియ్యడం తేలికే! దాన్ని తయారు చెయ్యడం మనిషి వల్ల అవుతుందా? ఏంటేంటో సాధించామని చంకలు గుద్దుకుంటాం. చెట్టు నుంచి తెంపిన  పువ్వును తిరిగి  చెట్టుకు అతికించగలమా మనం!  ఒక్క పువ్వుతో సరిపెట్టుకోదు పూల మొక్క. రకరకాల పూలు పూస్తుంది. ఏ పువ్వూ మరో పువ్వును పోలి ఉండదు. విచిత్రం! ఒక పూవుకు  బదులు మరోటి ఆ పూల మొక్క కూడా మళ్ళీ తయారుచెయ్యలేదు. నిర్మించడం రానప్పుడు నిర్మూలించే హక్కు వడలాక్కోడం  ఎంత వరకు న్యాయం?' 

 

సెల్వరాజు చూపించిన సుబ్రహ్మణ్యంగారి పెద్ద భార్య ఫొటో గుర్తుకొచ్చింది నాకు.. మొహాన కాసంత బొట్టుతో! నాన్న పోకముందున్న అమ్మ అచ్చంగా అట్లాగే ఉండేది.  ఆకారం  ప్రత్యక్షంగా చూడలేదు కానీ, కనిపిస్తే రెండు చేతులూ ఎత్తి నమస్కరించ బుద్ధయేంత కళ ఆ తల్లి మొహంలో! కానీ.. నేను.. చేయబోతున్న  పనేంటి..? లీటరు నీళ్లల్లో ఒకట్రొండ  బొట్లు విషం కలిపి చంపెయ్యబోతున్నాడు!   ఒక పూల చెట్టును  సమూలంగా కూల్చబోతున్నాడు! 

 

నిజానికి నా కంత అవసరం కూడా లేదు. బండి ‘సీజ్’ చేస్తే బాడుగకు వేరే బండి నడుపుకునే శక్తి ఉంది  ఇంకా బాడీలో! ఒక తల్లి ప్రాణం పీల్చేసి  పోగేసుకున్న  సొమ్ముతో బిడ్డను పెంచి ప్రయోజకురాలును  చెయ్యాలన్న ఊహే భయానకంగా ఉంది! కమల కంటె ఇంగితం లేదు. మరి అమ్మ జీవితమంతా తీర్చిదిద్దిన  తన  సంస్కారం ఏ గంగలో కల్సినట్లు!' .. రకరకాల ఆలోచనలతో ఎట్లాగో  తెల్లారింది. 

 

పిల్ల కాస్త సర్దుకోడం ఊరట కలిగించే విషయం.  మందులవీ రాసిచ్చి భద్రంగా చూసుకోమని హితవు చెప్పి పిల్లని డిశ్చార్జ్ చేసింది డాక్టరమ్మ. 

 

పార్వతి దొడ్లోకి పోయినప్పుడు కలత పడకుండా బావి గట్టును శుభ్రంచేసింది కమల. మొహం కడుక్కునే వేళ పిల్ల మౌనంగానే ఉంది. ముభావంగా అయితేనేం.. పుస్తకాలు భుజాన వేసుకుని బడికి తయారయింది. పిల్ల తొందరగానే సర్దుకుందని తేలికపడ్డాం నేనూ కమలా!

 

బండి  బైటికి తీస్తుంటే సెల్వరాజు నుంచి కాల్.. ‘శుక్రవారం' అని గుర్తు చేయడానికనంట! 

కమల ఇచ్చిన సెల్వరాజ్ గాడి  మందు బాటిల్ అందుకొని  నిశ్శబ్దంగా ఆటో స్టార్ట్ చేశా.  


ముందు అనుకున్న విధంగానే సార్ ఇంటి ముందు వెయిటింగ్! సార్ పిలిచాడు నన్ను చూసి రోడ్డు మీద కొచ్చి. అమ్మ తాగే నీళ్ల సీసా ఆయన్దగ్గరే ఉండిందిప్పుడు! ప్లాన్ మార్చినట్లున్నాడు. తన కళ్లెదుటే 'మందు'  నీళ్లలో కలిపించాడు. చేతిరుమాలుతో సీసాను  తుడిచి  సీట్లో పెడుతుండంగా ఆ తల్లి ఇంట్లో నుంచి బైటకొస్తూ  కనిపించింది. 


కంచి పట్టుచీరె, పసుపు చందనాలు అలదిన ముఖం, కాసంత ఎరుపు రంగు బొట్టు.. హారతి పళ్లెంలో పూజా సామాగ్రితో  గుమ్మం మెట్లు దిగి  వచ్చే ఆ  ఇల్లాలు ముఖ వర్ఛస్సు .. అచ్చంగా  మంగళ గౌరీ వ్రతం చేసుకునే రోజుల్లోని మా అమ్మనే  గుర్తుకు తెచ్చింది.   చిరునవ్వులు చిందిస్తూ వచ్చి ఆటోలు సర్దుక్కూర్చునే ఆ  తల్లి వెనకనే  స్కూలు యూనీఫారంలో ఓ  ఐదేళ్ల పాప.. పార్వతి వయసుదే! 


బండిలో కుదురుకున్న తరువాత కూతురితో ఆ  తల్లి  వాత్సల్యం ఉట్టిపడే స్వరంతో అనునయంగా అంటున్నది 'సాయంకాలం  స్కూల్ నుంచి వచ్చేసరికల్లా  నీకిష్టమైన జిలేబీలు  చేసుంచుతారా కన్నా! అన్నీ నీకూ.. ఒక్కటి  నాకు!  డాడీకి  ఆ  ఒక్కటి కూడా   ఇవ్వొద్దు. ఓకేనా!  ఇక మా ఇంచక్కని పాప అమ్మకు  టాటా చెప్పేస్తుందటా!'  అంటూండగా  ముద్దులు మూట గట్టే ఆ పాప గలగలా  నవ్వుతో తల్లికి టాటా చెప్పేసింది. 


అక్కడే నిలబడ్డ  సార్ నా వంక చూసి  సైగ చేసాడు ఇహ  'కదల' మన్నట్లు.  ఆటో ముందుకు ఉరికించక తప్పింది కాదు నాకు. 


ఆటో సగం దూరం పోయి బస్టాండ్ మలుపు తిరుగుతుండగా ఆ తల్లి  తాగడానికి సీట్లో పడున్న  నీళ్ల బాటిల్ మూత తీసింది. 


అప్పటి దాకా  జారి పోయే గుండెను చిక్క పట్టుకోడానికి చాలా  ట్రయ్ చేశా. నా వల్ల కావడంలా! పార్వతి ప్లేసులో ఆ పాప .. ఆ పాప ఫేసులో పార్వతి! 

'తల్లీ ! ఒన్‌ మినిట్' అంటూ     నేను నెమ్మదిగా తల వెనక్కు తిప్పి  చెప్పడం మొదలు పెట్టా..  మొదట్నుంచీ సుబ్రహ్మణ్యం సారు సెల్వరాజు ద్వారా వేసుకొచ్చిన  ప్రణాళికను గురించి  పూసగుచ్చినట్లు!

ఆలకిస్తున్నది ఆ తల్లి! మొహంలో ఏ భావమూ   లేదు! ఏమి జరిగినా ఫలితం అనుభవించేందుకు   సిద్ధపడే పెద్దవాళ్ల  కుటుంబ  వ్యవహారంలో  తలదూర్చింది. పార్వతికి బామ్మఫిష్ ఎట్లాగో సారుగారి పాపకు ఈ తల్లి అట్లాగా! ముందు ముందు ఏం జరగనున్నదో.. నాకు   తెలీదు.. ఆ క్షణంలో! 

--- 

కమల అందించిన మందు  సీసాలో అసలు 'మందే'  లేదని ఊహించనే  లేదు! బైల్దేరేముందు ఆ దరిద్రాన్ని  మురిగ్గుంటలో పారపోసి సీసా  కుళాయి నీళ్లతో నింపిచ్చిందని ఇంటికొచ్చిం తరువాత ఆ పిచ్చిది చెబితేనే తెలిసింది. 'నీ వాలకం నాకు తెల్దా! ' ముందు నుంచీ నీ మీద నాకు  డౌటేనయ్యా! మీయమ్మ నిన్ను బాగా చెడగొడ్డేసినాది. నీకు చెడ్డ పనులు చెయ్యటం చస్తే చేత రాదు. ఎటొచ్చీ  నేనే దెయ్యాన్ని' అంది కమం నీళ్లు నిండిన కళ్లతో. 

తరువాతో రోజు బస్టాండు దగ్గర సెల్వరాజు కల్సినప్పుడు 'మంచి  దావతియాల్రా  బయ్ నువ్వు!  కిస్తీలు సారే  కట్టుకుంటానన్నాడు ఏం మాయ చేసినవో ఏందో కానీ! బేఫికర్ నువ్ బండి నడుపుకో ఇంక! లోన్‌ క్లియర్ కాంగానే పేపర్లు నేనే తెచ్చిస్తా!' అన్నాడు నవ్వుతూ. 

కర్లపాలెం హనుమంతరావు

07 - 04-2021

దేవుళ్ల మీదా నిందలేనా? -కర్లపాలెం హనుమంతరావు- సరదా వ్యాసం


ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/

తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/

అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!/.. 

అక్కటా! అందరందరు అందరే.. అడుగనేల కామదాసులు కారే నీ కరుణ వలన-

ఇది శ్రీరామ కథ సినిమాలో దేవుళ్ల బుద్ధిచాపల్యం మీద పెట్టిన చాకిరేవు.

 ‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/

విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ / కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?- అని కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది.. ఏదో సరదా కన్నాడు లెమ్మని  అర్జునుడేమన్నా కిమ్మనకుండా ఉండిపోయాడా?

'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/

ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ ఎదురుపెట్టాడు.  కృష్ణార్జున యుద్ధంలోని ఈ మాదిరి దెప్పుళ్లు గతంలో ప్రతీ చలనచిత్రంలో  వినిపించేవి. తగవులు వచ్చినప్పుడు భగవంతుళ్లు, భగవదంశ ఉన్నవాళ్ళు కూడా కోపతాపాలకు వశమైపోవడం విచిత్రమే.  భక్తులకు ఆదర్శమన్న స్పృహ లేకుండా దేవుళ్లు తమలో తాము తిట్టుకుంటుంటే, వారి వారి భక్త కోటి తన్మయత్మలో మునిగితేలడం ఏ తరహా సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందో   ఆయా సాంప్రదాయవాదులే సెలవియ్యాలి మరి.

రెండు ముక్కలు గట్టిగా తిట్టుకుంటే చాలు, ఆ పైన పదాలు తట్టక  మీద మన్ను పోసుకుంటున్నారు ఇప్పటి తరాలు.  ఆక్స్ ఫర్డ్ వర్డ్స్ విద్యాధికులూ ఈ  షష్టాకాలకేం తక్కువ కాదు. కానీ వాటి మూలార్థాలు   వంకాయలు, బీరుకాయలు అమ్ముకునే బస్తీజీవి బుద్ధికెక్కవు.  వ్రతం చెడీ ఫలం దక్కకపోతే ఎట్లా అని కాబోలు లేటెస్టుగా ఫారిన్ రిటర్న్సే కాదు.. ఫారిన్ కంట్రీసులో సెటిలయిన  మనవాళ్లు కూడా మన బస్తీ లాంగ్వేజీలోనే సామాజిక మాధ్యమాల ద్వారా కుస్తీ పట్లకు దిగిపోతున్నారు! అంతర్జాలం అభివృద్ధి ఫలాలలో అవాచ్యాలు విశ్వవ్యాప్తంగా విస్తరించడం ఒక కోణం.

 గతంలో మన తెలుగు ప్రాంతాలలో తిట్ల కవులుగా చాలా మంది చరిత్రలో ప్రసిద్ధమయారు. బడబానలం భట్టారకుడు అనే మహానుభావుడు ఉన్నాడు. చెరువులో నిలబడి సూర్యనమస్కారాలు చేస్తుంటే చేతివేలి ఉంగరం కాస్తా నీళ్లల్లో జారిపడింది. కొత్తది కొనుక్కోవచ్చు. కుదరకుంటే ఆశ వదులుకోవచ్చు. ఊరంతా తాగే నీళ్లను ఎండబెట్టి ఉంగరం దొరకబుచ్చుకొన్నాడాయన. చెరువుని అట్లా ఎండమని బెదరగొట్టడానికి ఆ పండితుడు వాడింది ఇప్పటి ప్రమాణాల ప్రకారం పచ్చి అన్ పార్లమెంటరీ లాంగ్వేజీ! ఆ  తిట్ల కవులకు కాపీ క్యాట్లే  ఈ కాలం నాటి మన  నాయకమ్మన్యులు!


క్రౌంచ పక్షుల మిథున భంగానికి అలిగి వాల్మీకి అల్లిన మహాకావ్యం రామాయణం. అలగడమే తెలీనంత ధర్మరాజు వారసులేమీ కాదు దైవభక్తులు కూడా. 'దొరతనములన్నియును దొరసినందాకా''అన్నాడు కదా అన్నమయ్య.  'కోపము పుట్టిన నెంతటి/ భూపాలుండైన చెడు' అంటాడు సానందోపాఖ్యానంలో శివరామకవి. లా మేకర్సూ వాళ్లే.. లా ఫస్ట్ బ్రేకర్సు వాళ్లే అన్న సిద్ధాంతం కలియుగం ముందు నుంచే మొదలయిందనడానికి వందలాది ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ స్థలాభావం.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాజశేఖర్ 'అంకురం' అప్పట్లో సూపర్ హిట్!అందులోని ఓ మంత్రిగారి కాన్వాయ్ సీనులో కారు మీద జాతీయజెండా తలకిందులుగా వేలాడ్డం చూసి ఓ సుకుమార దేశభక్తుడు కోర్టులో ప్రజావ్యాజ్య వేసి మరీ తన ఆగ్రహం ప్రకటించాడు. ఆ అవమానకర సన్నివేశం తొలగింపుకు ఓ ప్రేక్షకుడి ధర్మాగ్రహం కారణం. ఇప్పుడా తరహా ధర్మాగ్రహాల కన్నా నచ్చని తీర్పులు చెప్పే ధర్మస్థానాల మీదనే ఏకంగా ఆగ్రహంతో బురద జల్లే కొత్త సంప్రదాయం మొదలయిపోయింది.  

 ఇప్పటి చిత్ర కథానాయకులే వెండి తెర మీదా, బైటా నేరుగా 'బొంగు, బొక్క, తొక్క' అంటూ నోళ్ళు యధేచ్ఛగా పారేసుకుంటున్నారు. ‘అరిచే కుక్కలు కరవ్వు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది. కరవడం సంగతి ఎట్లా ఉన్నా ముందు అరవడం  రాజకీయనేతలకు, రాజకీయాలలో నిలబడుండాలనుకొనే ఆశావాహులకు ముందుండాల్సిన అర్హతగా మారిపోయింది. 

కోపతాపాల ప్రకటనకు నిన్న మొన్నటి వరకు కొద్దో గొప్పో ముసుగులూ గట్రా ఉండడం కద్దు! కొంపలో కొప్పట్టుకు చితక్కొట్టే కిరాతకుడూ  ఫేస్ బుక్  పోస్టుల దగ్గర కొచ్చేసరికి పురుషోత్తముడి అవతారానికి తగ్గకుండా సూక్తులు వల్లించేవాడు.  అందరూ అందరి మీదా అన్ని వేళలా అన్నిరకాల ఆగ్రహావేశాలు ప్రకటించడం వల్లవని వ్యవస్థలో  మనమున్నది.. అనుకునే వాళ్లం నిన్నటి వరకు.  ఏ కులం పేరుతోనో, మతం పెరుతోనో, లైగింగ దృష్టితోనో దూషించినట్లు ఫిర్యాదు వచ్చిన ఉత్తరక్షణంలో కనీసం ప్రాథమిక సమాచార నివేదిక సెక్షన్ల కిందయినా కొన్ని కేసులు పోలీస్టేషన్లలో బుక్కవుతుండేవి.  ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులే పూనిక వహించి ప్రత్యక్షంగా ఈ సరిహద్దులు చెరిపేసే బ్రహ్మప్రయత్నాలు చేస్తున్నారు. సభను తీరుగా నడిపించే బాధ్యత రాజ్యాంగబద్ధంగా స్వీకరించిన బుద్ధిమంతులే స్వయంగా  సాక్షాత్తూ చట్టసభల్లో జిహ్వపదును ప్రదర్శన స్పర్థల్లో ముందుంటున్నారు. కోపతాపాల బాహాట ప్రకటన కోసంగానూ స్థిరబడ్డ  వ్యవస్థ  దిష్టిబొమ్మల దగ్ధం, పాత పాదరక్షల, కలం సిరాల ప్రయోగ విధానాలు గట్రా!  వాటి మార్కెటు పుంజుకునే  కన్నా ముందే నానారకాల నోటి దూలలను రేటింగ్ రూపంలో లేటెస్టుగా టి.వి ఛానెల్స్ సొమ్ముచేసుకోవడం ఒక విపరిమాణం.  

'ఎక్కడయ్యా నీ అహింస/ఏడ నీ కరుణా రిరంస/చూడు దేశం ద్వేష భుగ్నం/క్షురత్ జిహ్వానల విభుగ్నం' అని మహాకవి మొత్తుకుని ఇప్పటికి సుమారు వందేళ్లు.  పందెంకోళ్లాటను మించి నడుస్తోంది దేశం బరిలో నేతల కారుకూతల పర్వం!

 

'ధారణిరాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రం/భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు/ర్వార మదీయబాహుపరివర్తితచండగదాభిఘాత భ/గ్నోరుతరోరు జేసెద సుయోధను నుగ్రరణాంతరంబునన్' అంటూ  'కురు గురు వృద్ధ బాంధవులు అనేకుల చూస్తుంండగానే నిండు సభ సాక్షిగా మదోద్ధురుడైన సుయోధనుడి సోదరుడు దుశ్శాసనుడు  పాంచాలిని పరాభవించి భీమసేనుణ్ని రెచ్చగొట్టిన మహాభారతం ఘటన మనందరికీ తెలిసిందే! అంత పట్టరాని ఆగ్రహంలో కూడా  ఆ పాండవ ద్వితీయుడు 'లోకభీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝరమును’ ఆస్వాదిస్తాననే భీకర ప్రతిజ్ఞ వరకే పరిమితమయాడు తప్పించి 'ఖలుడు'   అన్న ఒక్క ముక్కకు మించి ఆ దుష్ట దుశ్శాసనుణ్ణి దుర్భాషలాడనేలేదు.  అంతటి ఆగ్రహంలోనూ ఆ మాదిరి నిగ్రహం కాకతాళీయమా అంటే?  కాదనేందుకు మరో ఉదాహరణ చెప్పాలి.   విరాటుడు కొలువు కూటమిలో ఉన్నప్పుడు అక్కడికి భీత హరిణి 'కోపవేగమున కన్నుల నిప్పులు రాల నంగము/ల్గనలగ సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితాంతదంతపీ/డన రట దాస్యరంగ వికటభ్రుకుటీచటుల ప్రవృత్త న/ర్తన ఘటనా ప్రకార భయదస్ఫురణా పరిణద్ధమూర్తి' గా మారాడే తప్పించి నోటితో ఒక్క ‘ఛీ’త్కార శబ్దం కూడా చేసిందిలేదు. 'నేలయు నింగియు దాళముల్ గా జేసి యేపున రేగి వాయించి యాడ,/గులపర్వతంబులు గూల్చి యొండొంటితో దాకంగ వీకమై దన్ని యాడ,/నేడు సాగరములు నిక్కడక్కడ బెట్టి పలుచని రొంపి మై నలదికొనగ,/దిక్కులు నాలుగు నొక్కచోటికి దెచ్చి పిసికి పిండలి సేసి పిడుచగొనగ,

 మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల వ్రేయ/నప్పళించుచు/ బ్రళయకాలానలమున/ గండరించిన రూపంబు కరణి భీముడు భయంకరాకారత నతిశయిల్లాడినట్లు తిక్కన మాత్రమే చెప్పుకొచ్చాడు. భారతదేశ రాజకీయ సంస్కృతి, ముఖ్యంగా తెలుగురాష్ట్రాలలో మనం నేడు చూస్తున్న రాజకీయ వాతావరణం తిక్కన భారతం  మార్క్ ‘బండబూతుల’ స్థాయికి అప్డేట్ అవడం ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులందరినీ విపరితంగా కలచివేస్తున్న తాజా దురవస్థ. 

సాక్షాత్తూ మంచి చెడులు అన్ని కోణాల నుంచి తరచి చూసి , సాక్ష్యాల ఆధారంగా, రాజ్యాంగ పరిథిలో నిరపేక్షతో కూడిన తీర్పులిచ్చే న్యాయవ్యవస్థ ‘న్యాయదేవత’కు ప్రతినిధిగా మనం భావిస్తూ వస్తున్నాం. న్యాయదేవత కూడా ఇప్పుడు  ఈ  వాచాలత నిందల దాడులను ఎదుర్కొంటోంది. దేవుళ్ల మీదా నిందలేనా? అంటూ నివ్వెరపోయే దుస్థితుల నుంచైనా సామాన్య పౌరుడిని బైటపడవేసే అత్యయిక పరిస్థితి వచ్చిపడింది

తగు సమయంలో ఈ తరహా దుష్టాతి దుష్ట సంస్కృతులకు అడ్డుకట్ట పడని పక్షంలో పేరుకు మాత్రమే మనది మెజారిటీ ఓటర్లు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడిపే స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన పాలన అని చెప్పుకోవాలి


పెద్దలకూ పరీక్షే! -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సంపాదకీయం - 17:03:2013

 

పెద్దలకూ పరీక్షే!

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయం - 17:03:2013

విద్య ధనం. అక్షయం.  ఓ దీపం. మనిషికి అదే ప్రకాశం, వికాసం అందించే ఉత్తమ సాధనం.  విద్యార్థిని వినయం, యోగ్యం, ధర్మం, సుఖం వరిస్తాయి కాబట్టే అందుకు కారణభూతమైన విద్య అతి ప్రధానం, విశ్వవర్ధనంగా కూడా గురుస్థానం పొందింది. 'శ్రుతుల తత్వార్థ సంహితలెల్ల బఠియించి/ స్మృతుల నానార్థ సంగతులు చదివి' ప్రజ్ఞతో సర్వజ్ఞత సంతరించుకున్నాడు బాలగౌతముడు. నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని, అఖిలాస్త్ర శస్త్ర రహస్యాల్ని సొంతం చేసుకున్న ఆ రాజనందనుడు 'సిద్ధార్థ' 'తంత్రవాదనముల యంతస్సారమూహించి/ మంత్రవాదమ్ముల మర్మమరసి' సమస్త విద్యాఫలాల మధురిమనీ ఆస్వాదించినవాడుగా తయారయాడు. సూచక, వాచక, బోధక మార్గాలతో పాటు అలలూ గాలులూ శిలలూ వూయలలూ, లేళ్లూ సెలయేళ్లూ ఎన్నో గురువులై పాఠాలు నేర్పాయా బాలకుడికి! అంతకుముందు ప్రహ్లాద కుమారుడూ 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ' అంటూ కుశాగ్రబుద్ధిని చాటుకున్న ఘటన గుర్తుకొస్తుంది విద్య ఘనతను గురించి తలిచినప్పుడల్లా. అకార ఉకార మకారాలతో రూపుదిద్దుకున్న బీజాక్షరం 'ఓం'తో మొదలైన అక్షరాభ్యాసం కూసువిద్యగా మారడమే కాలక్రమ పరిణామం. శ్రవణం, మననం, జ్ఞానం, ధ్యానం తదితరాలన్నీ అందులోని భాగాలే. 'చదివిన సదసద్వివేక చతురత గలుగున్' అని ప్రస్ఫుటపరచిన పోతనకవి చదువుల తల్లిని స్తుతించిన వైనం కూడా హృదయానందం కలిగిస్తుంది భావించుకున్న ప్రతీ సందర్భంలోనూ. 'శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార' అంటూ రసవాహినిలా కొనసాగిన ఆ అక్షరధారామృతంతో సరస్వతమ్మకు అభిషేకం  చేసి పునీతుడయాడు పోతన. పుస్తక ధారిణిగా విజ్ఞాన ధనాన్ని, వీణాపాణిగా లలితకళా వికాసాన్ని మానుష జాతికి ప్రసాదించిందా చైతన్య స్వరూపిణి. ధారాప్రవాహానికి, కాంతి కిరణ ప్రసరణానికి ఆది దేవతగా నిలిచిన ఆమే విద్యాధరీ వాగీశ్వరీ సకల సంపత్తులకీ అధినేత్రి కూడాను!

 

'తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్' అనడంతోనే, మన మనోమందిరమంతటా ఆ విద్యామయి నిండురూపమే నిండుతుంది. అక్షరలక్షల భావ సంపదను ప్రసాదించే అంతటి శక్తిసంపన్న సుస్థిర స్థానం కవిగాయక వైతాళిక హృదయపీఠిక మీదనే. సారస్వతపుర సామ్రాజ్యమైనా, సంగీతామృత సాగరమైనా ఆ దేవేరి కనుసన్నలలోనే తొణికిసలాడేది. అగణిత పదయుతగ,  అద్భుత పదనుతగ వెలుగొందే ఆమే వాణీ గీర్వాణీ వివేక మూలకారిణీ. 'చతురాశ్రమములు నీ జీవనసూత్రం/చతుర్వేదములు నీ పావనగాత్రం/చతుర్థామముల హృది వీధిని వినిపించినది నీ సమతానాదం' అని కవిగళం చతురమతి ప్రస్తుతి చేసింది కూడా అందుకే. సత్యమే సాహిత్యం, సౌభ్రాత్రమే మిత్రం, సౌశీల్యమే జీవం, స్వాతంత్య్రమే దైవం అయినప్పుడు జీవితమంతా జయమూ శుభమే సహజంగా. ఎప్పుడైనా ఎక్కడైనా సారవంతమైన మనోభూముల్లోనే కదా చదువు సేద్యం సుభిక్షమయేది! శ్రమరక్షణ, క్రమశిక్షణ, సమవీక్షణలే గురుదక్షిణలైన వేళలో దాశరథిలా 'తల్లీ భారతి వందనం/ నీ ఇల్లే మా నందనం/ మేమంతా నీ పిల్లలం/ నీ చల్లని ఒడిలో మల్లెలం' అని ప్రతి ఒక్కరి మదీ పరవశించి పాడదా మరి! భవంతి ఎంత మహోన్నతంగా ఉన్నా, దాని ఉనికికి పునాదే ఆధారం. ఆ రీతిలోనే, జీవితంలో సమున్నత స్థాయికి చేరేందుకు ప్రధానం- చదువూ, అది అందించే ఉపాధీ. చదువుసంధ్యలు మనిషికి మూడో నేత్రం, జీవనానికి గౌరవపాత్రం. మనిషి పుట్టేది మంచిని పెంచేందుకే అయితే చదువు నేర్చేది ఉత్తమత్వాన్ని పెంపొందించుకునేందుకే. ఆ ఉన్నత ఉత్తమత్వమే ఉదాత్తతకు రహదారవుతుంది. కానీ 'రసజ్ఞతా స్థితిన్ పొందగలేని విద్య పరిపూర్ణత నిచ్చునె, శాంతి నించునే' అన్న గరికిపాటి ప్రశ్నకు సమాధానమేదీ? 'అందరికీ అందడం లేదు సరే, అందినవారలకైనగాని ఏ/మందినదందులోని పరమార్థ విశేషము?' అని ఆ కవే సంధించిన మరో ప్రశ్నాస్త్రానికీ బదులు రావాలి ముందు. చదువుల సుమపరిమళాలు అన్నిటా అంతటా గుబాళిస్తేనే, ఆ ఆస్వాదనలో మానవాళి పులకిస్తేనే కృతార్థత, సార్థకత. చదివినంతసేపూ ఆసక్తి ఉన్నప్పుడు, చదివింది పరీక్షల్లో రాసేంత శక్తి నిండినప్పుడు భావిపౌరులైన ఏనాటి బాలలైనా రేపటి చీకటి రాసే నవకాంతుల శుభోదయాలే అవుతారు మరి! విద్య అన్నది ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే పడి ఉండిపోయే జడపదార్థమేమీ కాదు. అదో సత్తా, సత్తువ, శోధన, సాధన. వాటిని ఫలప్రదం చేసేందుకే శిక్షణలూ.. పరీక్షలూ.

ప్రకృతి ఒడే అందరికీ బడి కావాలి.  లిఖితమైనా, మౌఖికమైనా, మరోటైనా అక్కడి ప్రతీ పరీక్షా మరో పరీక్షకు పునాదే అవాలి. ఆశాభావమంటూ ఉండాలే కానీ, ప్రతి అవకాశం ఒక్కొక్క సదవకాశమయి తీరక మానదు. ఓ ఆధునిక కవిగళం పలికినట్టు 'గడిచిన గతాల గోతులు తవ్వి/ నీతులు వెతికి కోతలు అతికి/ చరిత్రకు పూతలు గతికి/ అచ్చేసిన కాగితాలు బతుకుల్ని ఉద్ధరించవు!'. పిల్లల మనసులన్నీ అప్పుడే సాగుకు సిద్ధంచేసిన ఏరువాక భూముల్లాంటివి. ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి మొక్కలే అక్కడ మొలకెత్తేది. అందుకే అక్కడంతా విజ్ఞాన బీజాలతో వికాస ఉద్దీపన దుక్కిదున్నుడులా చేపట్టాలి. . ఎవరికి వారుగా నిలవాల్సిందే, ఎప్పటికప్పుడు గెలవాల్సిందే ఈ జ్ఞానరణ క్షేత్రం. 'పూటపూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పిచే మేను తల్లడిల్ల/ బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారు మైదీవ క్రుంగిపోవ/ తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధ నరయలేరె' అన్న నరసింహ కవి ఆక్రోశాన్నీ తలచుకున్న మరుక్షణాన పెద్దల మదిలో ముందుగా మెదిలేదేమిటి? ఒత్తిడిని చిత్తుచేసే, 'తులాభారాల'ను దూరంచేసే చదువనే చదువు. అతి సవాలు కాని, అసలు సమస్యే ఉండని, కత్తిమీద సాము కానే కాని పరీక్షే నిజమైన పరీక్ష. నేటి పరీక్షలూ వాటిలో ఉత్తీర్ణతలూ పిల్లలకా, పెద్దలకా అన్న పోటీ ప్రశ్న ఉదయించని శుభక్షణం కోసమే ఆలోచనాపరులందరి నిరీక్షణ!

(ఈనాడు , సంపాదకీయం ,17:03:2013)

_____________________________________


భోజనోత్సవం- ఈనాడు సంపాదకీయం – కర్లపాలెం హనుమంతరావు

ఆహారం జీవులకు ప్రాణావసరం. దాన్ని ఒక భోగకళగా మలచుకోవడం మనిషి ప్రత్యేకత. ఆత్మకు ఇంపైన భోజనాన్ని సత్కృతులకందే ప్రేరణగా అల్లసాని పెద్దన భావించాడు. దేవదారు వనంలో యాయవారానికని బయలుదేరిన శివబైరాగి భిక్షాపాత్రలో రంభ, ఊర్వశి లాంటి అందగత్తెల చేతులమీదుగా నేతి వంటకాలు వడ్డించిన భోజన ప్రియుడు శ్రీనాధ కవిసార్వభౌముడు! విందుభోజనాదులకు సందర్భశుద్ధి కూడా చూసుకోడన్న విమర్శా ఉంది. హర విలాసంలో ముక్కంటి మూడోకంటి మంటకు ఎర అయిన మన్మథునితోపాటు రతీదేవి సతీ సహగమనం చేసే సందర్భం ఒకటుంది. తామరపూల తేనెలతో ధర్మోదకాలు, తియ్యమామిడి పండ్లతో పిండప్రదానాలు చేయాల్సిందిగా అంత పతీవియోగ దుఃఖంలోనూ పరివారానికి రతీదేవి పురమాయించడం, ఆ మహాకవి ఆహార ప్రియత్వానికి నిదర్శనం. ప్రజాబాహుళ్యం అభిలాషలు, ఆరాటాలు, విలువలకు సంస్కృతి ఒక ప్రతిబింబమైతే- ముందు తరాలకు దాన్ని అందించే బాధ్యత సాహిత్యానిదే. ఏనాటి సమాజ స్వరూప స్వభావమైనా సమ్యక్ దర్శనా భాగ్యానికి నోచుకోవాలంటే... ఆనాటి వివాహ కుటుంబాది సంబంధ బాంధవ్యాలు, ఆచార వ్యవహారాలతోపాటు ఆహార పద్ధతులూ తెలిసి ఉండటం తప్పనిసరి- అంటారు మల్లంపల్లివారు. మన ప్రాచీన కవులు ఈ బాధ్యత గుర్తెరిగారు కనుకనే సందర్భం ఉన్నా లేకపోయినా సందుచూసుకుని మరీ విందు భోజనాలందించారు!

శిష్యసమేతంగా వ్యాస మహామునికి కాశీవిశాలాక్షి చేసిన విందులో వడ్డించిన చాలా పదార్థాలకు శబ్దరత్నాకరంలోనే అర్థాలు దొరకవు- అంటారు కాశీఖండానికి మణికర్ణికా వ్యాఖ్యానాన్ని కూర్చిన శరభేశ్వర శర్మ. పాండురంగ మాహాత్మ్యంలో కపట బ్రహ్మచారై వచ్చిన పరంధామునికి సుశీల అనే పతివ్రతా శిరోమణి ఆతిథ్య మిస్తుంది. ఆ సందర్భంలో తెనాలి రామకృష్ణకవి వర్ణించిన ఖాద్య విశేషాలతో ఒక పరిశోధనా గ్రంథాన్నే వెలువరించదగినంత సమాచారం ఉంది. ఎన్నో వ్యంజనాలు పిండివంటలతో భరద్వాజుడు భరతుడికి, పరివారానికి ఇచ్చిన విందు జగత్ప్రసిద్ధం. భారతీయుల అరవైనాలుగు కళల్లో పాకశాస్త్రమూ ఒకటి. నలభీములు ఆ శాస్త్రంలో అసమాన ప్రతిభాశాలురు. ఆహార పదార్థాలు, వాటి తీరుతెన్నులు, ప్రత్యేక లక్షణాలు, ఇమిడి ఉన్న ఆరోగ్య సిద్ధాంతాలు, వంటశాలలు, వడ్డన విధానాలు... రుగ్వేద కాలంనుంచీ భరతఖండంలో అధ్యయన విశేషాలే! వెల్లుల్లి, తిలపిష్ఠం అనడమే తప్పుగా భావించే శుద్ధ శాకాహారి శ్రీనాథుడు. సిరియాలును తరిగి తిరువెంగనాంచి నానావిధ పాకాలు చేయించిన వైనాన్ని అంత తీరుగా ఆ కవి వర్ణించడానికి కారణం- వాటి ఆహారపు తీరుతెన్నులను అక్షరబద్ధం చేయాలన్నతపనే. కాశీఖండం- కుమారాగస్త్య సంవాదంలో సదాచార విధి చర్చ సందర్భంగా భోజనాలవేళ విధిగా పాటించాల్సిన నియమాల వివరణ ఉంది. తరతరాల తెలుగువారి ఆహార రుచులమీద పరిశోధనలు సాగించి డాక్టర్ జి.వి.పూర్ణచంద్ గ్రంథమే రూపొందించారు. చిత్రవిచిత్రమైన చిత్రాన్నాల నుంచి, రెండు భోజనాల నడుమ నమిలే అటుకులు అరిసెలవంటి వాటిదాకా- వట్టి వివరాలే కాదు... వాటి వైద్య విలువల్నీ ఆ గ్రంథం విపులీకరించింది.

ఆహారం కేవలం జిహ్వ సంతృప్తి కోసమే కాదు, ఒంటికి పట్టి ఆరోగ్య వృద్ధికి దోహదపడాలి. శుచి, రుచితోపాటు తుష్టి, పుష్టి కారకాలు పుష్కలంగా కలిగిన పోషకాహారమే సంపూర్ణాహారం. అది లభించడమే మహాభాగ్యం. షడ్రుచులు, అష్టాదశ రసాలు, చతుర్విధాలుగా త్రికాలాల్లోనూ సేవించి హరాయించుకోగల జీర్ణశక్తి కలిగి ఉండటమే ఆరోగ్యం- అని వస్తుగుణ ప్రకాశిక వాదం. ఆహారాన్నిబట్టి స్వభావం అంటుంది తైత్తరీయం. అందుబాటులో ఉన్న భోగమేదైనా ధర్మబద్ధంగా ఆరోగ్యభంగం కానంతవరకూ అనుభవించడం దోషంకాదు. నాగరికత మోజులో స్థానిక వాతావరణానికి అననుకూలమైన విదేశీ ఆహారపు అలవాట్లకు బానిసలమైతే నష్టపోయేది మన ఆయుష్షే. వింధ్య పర్వత గర్వభంగానికని బయలుదేరాల్సిన అగస్త్యుడు కాశీని వదిలిపోవడానికి బాధపడింది నిత్యం తాను పరమ ప్రీతిగా సేవించే 'శ్రీ విశాలాక్షి కెంజేతి భిక్ష'కు దూరమవ్వాల్సి వస్తుందనే! కాశీఖండంలో గుణనిధి, శివరాత్రి మాహాత్మ్యంలో సుకుమారుడు- తిండికి మొహం వాచిపోయి ఉన్న దీనదశలో కన్నతల్లి తమకు ఆరగింపులకు పెట్టిన 'గిన్నెలోని పెరుగును, వంటకంబు వడపిందియలను' పదేపదే తలచుకొని కుమిలిపోతారు. కరవులు ముంచుకొచ్చీ, వరదలతో పంటలు ముంపుకొచ్చీ, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు కొంతకాలంగా అనుకూలించని సాగు- రైతన్న మెడమీద పుండుచేసే కాడిగా మారిపోయింది. ఫలితంగా, 2010-11 ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఏడుకోట్ల ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోయారు. కూటిలోకి కూరాకు కూడా దొరకని దారుణ ఆహార సంక్షోభం మున్ముందు ముంచుకు రానుందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మనిషి జీవితానికి, తిండి ప్రధాన అవసరం. అది మనిషి ప్రాథమిక హక్కు కూడా! నిరుపేదలకు నిజమైన భోజనోత్సవం ఇంకెంత దూరంలో ఉందో కదా!

(ఈనాడు సంపాదకీయం, ౧౬:౧౦:౨౦౧౧

అమరకోశం - అర్థ వివరణ - కర్లపాలెం హనుమంతరావు

 అమరకోశం - అర్థ వివరణ 

- కర్లపాలెం హనుమంతరావు 



కోశం' అంటే పుస్తకం. పదానికి అర్థం చెప్పే పద్ధతి వివరించే పుస్తకం అమరకోశం. వ్యాకరణం, ఉపమానం, వ్యవహారాలు వంటి వాటిద్వారా సిద్ధించిన విషయాల అర్థ నిర్ణయాలు వగైరాఈ తరహా  కోశాలలో కనిపిస్తాయి! 

ఇప్పుడు వాడుకలో ఉన్న ‘నిఘంటువు’ అనే  పదం నిజానికి    ‘కోశం’ అనే అర్వాచీన పదానికి  ప్రాచీన రూపం. వేదాలలోని పదాలన్నిటినీ సంకలించి నిర్మించిన 'నిఘంటువులు' మన దేశంలో ఒకానొకప్పుడు  విస్తృతంగా ప్రచారంలో ఉండేవి. 

వీటికి వ్యాఖ్యాన రూపాలు 'నిరుక్తాలు'. ప్రస్తుతం  అందుబాటులో ఉన్నది యాస్కుడు రాసిన నిరుక్తం. 7వ శతాబ్దానికి చెందిన పాణిని తన వ్యాకరణంలో ఈ  నిరుక్తాలను వాడుకొన్నాడు. 

నిఘంటువులోని ఒక్కో పదం తీసుకొని దానికి సంబంధించి- ఏ ధాతువు నుంచి ఏ పదం ఉత్పన్నం ఆయిందో వివరించే ప్రయత్నం చేసాడు యాస్కుడు. వీలున్న చాలా సందర్భాలలో వేదాల నుంచే ప్రమాణాలు చూపించాడు. అ ప్రమాణాలలో కూడా అంతగా ప్రసిద్ధం కాని వాటికి  తానే అర్థ వివరణలు ఇచ్చే ప్రయత్నమూ చేశాడు. ఇంత శ్రమపడ్డాడు కాబట్టే యాస్కుడి నిరుక్తి ‘వేద-నిరుక్తి’గా వేదార్థసారం తెలుసుకొనే జిజ్ఞాసువులకు ప్రామాణిక గ్రంథంగా స్థిరపడింది.

వేద సంబంధమైన పదాలతో పాటు లౌకిక పదాలను కూడా ఇముడ్చుకొన్న వాటిని ‘కోశాలు’ అంటారు. గతంలో కవులకు సహాయపడే పద్ధతిలో ఈ కోశాలు నిర్మాణం  జరిగింది. బాణుడు (బాణోచ్ఛిష్టం జగత్ సర్వమ్ లోని బాణుడు) నుంచి బిల్హణుడు వరకు  చాలా మంది పండితులు ఈ పదకోశ నిర్మాణాల మీద దృష్టి పెట్టినవాళ్లే. ఒకానొక కాలంలో  శ్లేషకావ్యాలురాయడం ఒక ఫ్యాషన్  ( ఒక పదానికి రెండు అర్థాలు ఉంటే అది ‘శ్లేష’  అవుతుంది. ఇది అలంకారాలలో అర్థవివరణ జాతికి చెందినది). అట్లాంటి శ్లేష ప్రియుల కోసం శ్రీహర్షుడు 'శ్లేషార్థపదసంగ్రహః' అనే కోశం నిర్మంచాడు. అమరసింహుడు అనే  పండితుడు ఉన్నాడు. ఆయన    కవి కూడా. కాబట్టి వివిధ శాస్త్రాలకు సంబంధించిన సమాచారం తన అమరకోశంలో నిక్షిప్తం చేసాడు.  కావ్యాలు రాయాలనుకొనే  కవులకు..  ప్రత్యేకంగా ఆయా శాస్త్రాలు తీసి  పరిశీలించే శ్రమ కొంత తగ్గిందంటే ఆ  పుణ్యం ఈ అమరకోశానిదే .

కోశాలలో రెండు రకాలుంటాయి. ఒకే అర్థం ఉన్న అనేక పదాలను ఒకచోట పేర్చే పద్ధతి. దీనిని వ్యాకరణంలో  పర్యాయపదం అంటారు. ఇట్లాంటి పర్యాయపద కోశం  ఒకటైతే, ఒక పదానికి ఉండే నానార్థాలను వివరించే  నానార్థపద పద్ధతి రెండోది. 


పర్యాయపదకోశంలో ‘వర్గం’ అని ఒక తరగతి ఉంది. ఒకే  అంశానికి చెందిన  అనేక పదాలను ఒక గుంపుగా వర్గీకరించే పద్ధతి ఈ  ‘వర్గం’. వర్గం అమరసింహుడి సృష్టి. 

ఉదాహరణకి:  మనుషులకు సంబంధించిన పదాలన్నీ ఒక చోట చేరిస్తే అది  ‘మనుష్యవర్గం’. అమరకోశం ద్వితీయ కాండలో    ఆరో వర్గంగా  ఈ ‘మనుష్య వర్గం’  కనిపిస్తుంది.   'గృహనిరుద్ధపక్షిమృగప్రసంగాత్' తద్వర్తిమనుష్యాణాం నామాని వివక్షుం ఇదానీం సాంగోపాంగం మనుష్యవర్గమాహ' అని  నిర్ణయం. అంటే ఏంటి? ఇళ్లల్లో రకరకాల   పెంపుడు జంతువులు ఉంటాయి గదా! వాటి  పేర్లు చెప్పే సందర్భంలో ఆయా జంతువులను సాకే మనుషులను రకరకాల పేర్లతో పిలవడం ఒక భాషా సంప్రదాయం.  ఏ మనిషిని ఏ పేరుతో గుర్తిస్తారో వివరంగా చెప్పే   ప్రామాణిక విధానమే  ‘మనుష్యవర్గం’. ఇది అమరసింహుడు ఆరంభించిన కొత్త విధానం. 

'మనుష్యా మానుషా మర్త్యా మనుజా మానవా నరాః'। మనోరపత్యాని మనుష్యాః మానుషాశ్చ॥' అని నిర్ణయం, 

1,2 .మనువు కొడుకులు కనుక మనుష్యులు, మానుషులు. ( మనుష్యా మానుషా  ) 

3 . చనిపోయేవాళ్లు కాబట్టి మర్త్యులు (మర్త్యాః) 

 4 . మనువు వలన పుట్టినవాళ్లు: కాబట్టి (‘మను’జా)  

5. మనువు సంబంధీకులు కనుక ( మానవా: ) 

6. సర్వం తమ అధీనంలోకి  తెచ్చుకొనేవాళ్ళు కనుక (నరులు)

ఇట్లా ఈ ఆరూ మనుష్యమాత్రులకు వచ్చిన పేర్లు. అమరసింహుడి వర్గవిభాజనా పదవివరణ ఇంత విస్తారంగా శాస్త్రీయంగా ఉంటుంది. కాబట్టే అమరకోశం ఈనాటికీ నిఘంటువుకు ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకొని ఉంది.  మరంత వివరణాత్మకంగా సాగే ఈ కింది పద్ధతి చూడండి! 

మనుష్యుల్లోని పురుషులకు మరో 11 పేర్లు, స్త్రీలకు మరో 11 పేర్లు! అక్కడితో ఆగలేదు అమరసింహుడు. ఆ స్త్రీలలోని గుణాలను  బట్టి ఇంకో  12 పేర్లు, మళ్లా ఆ గుణాలలో కూడా కోపం వచ్చే పద్ధతిని బట్టి మరో  2 పేర్లు, ఉత్తమ గుణాలను బట్టి మరో 4 పేర్లు.. ఇట్లా చెప్పుకుంటూ పోతే  చిలవలు పలవులుగా సాగే  పదాల ఉత్పన్నత విహారానికి దరీ దారీ దొరకదు. అంత లోతయిన పరిశీలనా జ్ఞానభాండారం కాబట్టే  అమరకోశం పామర పండిత లోకాలు రెండింటికీ శిరోధార్య వ్యాకరణమయింది. 

విధాయకానికి అందరూ భార్యలే అయినప్పటికీ.  వాళ్ల వాళ్ల  అర్హతలను బట్టి  పేర్లు ఎట్లా ఏర్పడ్డాయో వివరించాడు ఆ మహాపండితుడు అమరకోశంలో.  

'పత్నీ పాణిగృహితీ చ ద్వితీయా సహధర్మచారిణీ। భార్యా జాయాథా పుంభూమ్ని దారాః'॥ అంటూ  ఎనిమిది విధాలైన భార్యల వివరాలిచ్చాడు. భర్తతో కలసి యాగంచేసే యోగం కలది, భర్త చేత హస్తం గ్రహించబడింది, యాగఫలం పొందే సందర్భంలో భర్తతో కలసి తాను రెండో స్థానంలో ఉండదగినది, భర్త లాగానే దాన, యజ్ఞాదుల్లో  అధికారం కలది, పతిని పుత్ర రూపంలో తనయందు జనింపచేసే అధికారం కలది, ఆఖరిది(ఆశ్చర్యం కలిగిస్తుందేమో కూడా) కట్టుకున్నవాణ్ని హడలగొట్టేది(దారయంతి ఉద్వేజయంతి పతీనితి దారా:-దౄ భయే.. అని వివరణ).. ఇట్లా ఎనిమిది రకాల భార్యల పేర్లను వాళ్ల వాళ్ల  అర్హతలు, గుణాల ఆధారంగా అర్థ నిర్ణయం చేసిన గొప్ప పదకోశం అమరకోశం. 

ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే కనిపించే మరో విశేషం.. శ్లోకంలో మొదటి వరస నాలుగు పేర్లు ధార్మిక సంబంధమైనవిగా ఉంటే .. రెండో వరస నాలుగు పేర్లు లౌకిక జీవితానికి సంబంధించినవిగా ఉంటాయి!

వివరించుకుంటూ పోవాలే కానీ అమరకోశంలోని విశేషాలకు ఎప్పటికీ సశేషాలే. అమరకోశానికి అంత ప్రాచుర్యం ఉల్ఫాగా వచ్చి పడింది కాదు. శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఆకులూ, పూతా, కాయలూ, పూలూ, పళ్లూ, అవి రాల్చే గింజలూ.. సర్వం ఒక మహావృక్ష సమగ్ర స్వరూపాన్ని ఎట్లా  కళ్లకు కడతాయో.. అదే విధంగా  అర్థ విస్తరణ కొనసాగించే పద్ధతిలో అమరకోశమూ ఒక సమగ్ర శబ్దమహావృక్షాన్ని తలపిస్తుంది అంటే అతిశయోక్తి కాబోదు. 

అమరకోశం తనకు ముందు వచ్చిన నిఘంటువులు, తరువాత వచ్చిన నిఘంటువులకు మించిన కోశరత్నం. సంస్కృత భాషా ప్రచారంలో అమరకోశానిది ప్రధాన భూమిక. అమరం మారుమోగినంత వరకు తతిమ్మా నిఘంటువులు మూగబోయాయి. అమరం వదిలేసిన పదాలను ఏరుకుని వాటికి వ్యాఖ్యానాలు రాయడం ద్వారా ఆ నిఘంటువులన్నీ తమ తమ అస్తిత్వాన్ని నిలుపుకోవలసిన పరిస్థితి.  దేశ విదేశాల్లో దీనికి వచ్చిన అనువాదాలకు లెక్కేలేదు. ఈనాటికీ ‘ యస్య జ్ఞానా దయాసింధో: ‘ శ్లోకంతో సంస్కృత విద్యార్థి పాఠం మొదలుపెడతాడు. ఆ విధంగా అమరకోశం, అమరసింహుడు చిరంజీవులు. 

(ఆధారం:  అమరకోశం పీఠిక – చ.వేం. శేషాచార్యులు


వ్యాసం కోవిద్19; కోయిలమ్మ పాట -కర్లపాలెం హనుమంతరావు



మెట్రోపాలిటిన్ నగరాలలో  24 గంటలూ వాహనాల రొద. అందరి ఆందోళన గాలిలో తగ్గే నాణ్యత గురించే.  పక్షి కూజితాలను గురించీ విచారించవలసిన అగత్యం ఉంది. 


పక్షి కూతలో ఓ లోతైన సందేశం ఉంటుంది. ఉభయ  సంధ్యలలో  పశ్చిమాద్రి చాటుకు అరుణ చక్రం తరలి వచ్చి  వెళ్లే వేళ కోయిలమ్మ వంటి పక్షులు వినిపించే పంచమ స్వరాలు వింటుంటే నిర్వచించలేని ఒక మధురానుభూతి కలగడం సహజం.  కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలంగా ఆ అనుభవంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 


కోవిడ్-19 రుగ్మత వాతావరణాన్ని ఆసాంతం కలుషితం చేసి పక్షికూతల పైనా  ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమోనని వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రారంభంలో భయపడ్డ మాట నిజమే!  విశిష్ట పక్షి శాస్త్రవేత్త సలీం అలీ తాను  మునపటిలా  వివిధ  పక్షుల స్వరాలు వింటూ దివ్యానుభూతికి లోనయ్యే  అవకాశం భవిష్యత్తులో ఉంటుందో ఉండదో అని ఆందోళన పడ్డారు కూడా! కానీ పక్షి కూతల విషయంలో ఈ ప్రభావం అందరం భయపడ్డటట్లు ప్రతికూలంగా కాక, అనుకూలంగా ఉండటం.. విచిత్రం. 


సాధారణంగా వాతావరణ కాలుష్యం చాలా అధిక శాతంలో ఉండే ఢిల్లీ, ముంబై, చెన్నయ్, బెంగుళూరు వంటి నగరాలలో పక్షుల కూతలు గతంలో కంటే ఇప్పుడు చాలా స్పష్టంగా, శ్రావ్యంగా వినిపిస్తున్నాయంటున్నారు.   కోవిడ్- 19 నివారణలో భాగంగా లాక్-డౌన్ చర్యలు చేపట్టడంతో వాహనాల సంచారం బాగా తగ్గడం; మానవ సంబంధమైన ఇతరేతర కార్యకలాపాలకు చెందిన  శబ్దాలూ క్రమంగా అణగారిపోవడం కారణాలు  కావచ్చు. అందుకు తోడు వాయు కాలుష్యంలో ప్రధాన పాత్ర పోషించే విమానాల రాకపోకలు మీదా నిషేధాజ్ఞలు కఠినంగా అమలు కావడం   ధ్వని కాలుష్యంలో గణనీయమైన మెరుగుదలను సూచిస్తున్నది.  కాకపోతే  హఠాత్తుగా జరిగే పర్యావరణ మార్పులు    అనుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా జీవజాతులకు మేలు చేయవన్నది జీవశాస్త్రవేత్తల భావన.   


మానవ కార్యకలాపాలు మళ్లీ పుంజుకునే క్రమంలో..   మార్పులకు లోనయ్యే  శబ్దకాలుష్యం కారణంగా జంతువులకు, పక్షులకు మళ్లీ  కొత్త సమస్యలు తలెత్తకుండా శ్రద్ధ పెట్టదం ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాల్! ప్రకృతికి సహజంగానే  సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు  'తనకు తానుగా నిలదొక్కుకునే శక్తి' ఉంటుంది.  ఆ విశిష్ట శక్తి మీద దెబ్బపడకుండా దిద్దుబాటు చర్యలు ఉండాలి’ అన్నది జీవశాస్త్రవేత్తల అభిమతం. అహ్వానించదగినది.. ఆచరించదగ్గది ఈ ఆలోచన. 


జీవితాలలో సంభవించే ఆటుపోట్లను నివారించడంలో మనం ఎట్లాగూ తరచూ విఫలమవుతున్నాం.  కనీసం అవి సృష్టించే మానసిక ఒత్తిడుల నుంచి  సాంత్వన పొందేందుకైనా  ప్రకృతి ప్రసాదించే వరాలనూ  కాలదన్నుకోవడం ఏమంత తెలివైన పని!  పక్షుల కువకువలు వింటుంటే మనసులోని మాలిన్యం తాత్కాలికంగా  మరుగునపడుతుంది. కాస్తంత ఉపశమనం కలగుతుంది. ఏడ్చే బిడ్డ చేతికి తల్లి అందించే తాయిలం వంటిది పక్షి కూజితం.

 

 కోవిద్ -19  విస్తరణ నివారణ దిశగా ప్రభుత్వాలు తీసుకునే ముందస్తు చర్యల వల్ల వాతావరణలో ప్రస్తుతానికి హర్షించదగిన తేటదనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  మనిషి ఆలోచన, ప్రవర్తన, ప్రాథాన్యతల క్రమంలో కూడ మునపటంత వత్తిడి తగ్గి   కొంత కుదురు కనిపిస్తోంది.  మంచిదే! కానీ ఈ మార్పు తాత్కాలికమన్న సంగతి మరుగునపడకూడదు. పక్షుల స్వరాలలో కూడా ప్రస్తుతం కనిపిస్తున్న స్పష్టత, శ్రావ్యత  తాత్కాలికం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నదే ప్రకృతి ప్రేమికుని అభిలాష.   


లాక్-డౌన్ ఎత్తివేసే కొద్దీ నగర వాతావరణంలో తిరిగి వాహనాల రాకపోకలు పెరగడం ప్రారంభం అవుతుంది. ఆ కారణంగా  పెరిగే  వాతావరణ కాలుష్యం మళ్లీ  పశుపక్ష్యాదుల మీద పూర్వపు దుష్ప్రభావం చూపించకుండా ఏం చేస్తే సబబుగా ఉంటుంబో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. 

 

గాలిలో తగ్గే నాణ్యత, పక్షుల కూతలలో పెరిగే స్పష్టత, శ్రావ్యతలు రెండూ పరస్పరాధారితాలని  ఈ సరికే మనం గుర్తించాం. రెండూ కరోనా వైరస్ మహమ్మారి తెచ్చిపెట్టిన మార్పులలో అంతర్భాగమే.   వాయు కాలుష్య కారకంగా ఉనికిలోకి వచ్చిన  కరోనా మహమ్మారి అంతమయ్యే నాటికి  ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల  పై చిలుకు ప్రాణాలు   గాలిలో కలవనున్నాయన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  ప్రస్తుత అంచనా.  కోటికి కేవలం  ముఫ్ఫై లక్షలకు మాత్రమే తక్కువ! ఇంత భారీ ఎత్తున ఏ ఉత్పాతమూ ప్రపంచవ్యాప్తంగా మనిషికి మృత్యుపాశంగా మారిన దాఖలాలు గతంలో లేవు.


కోవిద్-19 సంబంధిత మరణాలన్నిటికీ శ్వాస సంబంధమైన సమస్యలే ప్రధాన కారణం. కనుక ఆ మృతుల ఉనికిలేమి కారణంగా వాతావరణంలో కలిగే అనుకూల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకొనక తప్పదు. కొంత అమానుషత్వం ధ్వనించినా..   శాస్త్రీయ వాస్తవాలకు భావోద్వేగాలతో నిమిత్తం ఉండదన్నది ప్రాథమికి  వైజ్ఞానిక సూత్రం. ఆ సూత్రం సారాంశం ఆధారంగా  దిద్దుబాటు చర్యల ప్రణాళికలు వేసుకుంటే ప్రకృతి  తన సహజ స్వభావంతో కోలుకునే సమయం తగ్గించవచ్చన్నది జీవశాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది. 


లాక్‌-డౌన్ సమయంలో మన కలతజీవితాల మధ్య చెవులలో అమృతం పోసి సాంత్వన కలిగించిన  కోయిలమ్మ కుహూఁ కుహూఁ  రావాల మధుర స్మృతులు మరుగున పడకూడదన్నదే  దానాదీనా చివరగా చెప్పుకొచ్చే ముఖ్యమైన అంశం.  ఉభయ సంధ్యలలో మధుర గాయని కోయిలమ్మ ప్రసాదించే సుస్వరాల సువర్ణావకాశాన్ని మనం ఎన్నటికి వదులుకోరాదన్నది సారాంశం.


ప్రభుత్వ వర్గాలు తరచూ గాలిలోకి వదిలే కోవిద్‍- 19  తాజా ముందస్తు జాగ్రత్తల వివరాల కన్నా కోయిలమ్మ పాటలోనే మన మనసుల్ని  మేలుకొలిపే లక్షణం స్పష్టంగా వినిపిస్తుంది. 


ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. కోయిలమ్మ వెళ్లిపోతే దాని కూజితం మళ్లీ వినరాదు మరి.


- కర్లపాలెం హనుమంతరావు 

06 - 09- 2021

బోధెల్ ; యూ.ఎస్.ఎ 

***

 

 

 

 


తెలుపు’ కోసం కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో ‘సందిగ్ధ’ మూడవది.

 మంచి పుస్తకం’ ఒక సంపద.



1980, 90లలో ఇంగ్లీషులో వెలువడిన ‘మానుషి’ పత్రికకి మంచి పేరు ఉండేది. మధు కిష్వర్ దీనికి వ్యవస్థాపక సంపాదకురాలు. అది ‘ఫెమినిస్టు’ పత్రిక అని ఇతరులు పేర్కొన్నప్పటికీ దాని ఉప శీర్షిక ‘A Journal about Woman and Society’ అని ఉంటుంది.

1992-96లో నేను వ్యవసాయ శాఖలో ఘంటశాల విత్తనాభివృద్ధి క్షేత్రంలో పని చేస్తుండగా మానుషి పత్రికలో ప్రచురితమయిన విజయ్‌దాన్ దేథా కథలు చదివాను. మానుషి ట్రస్ట్ ఆ కథలను ‘ద డైలెమా’ అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించింది. ఘంటశాలలో ఉండగా ఒక కథ, రాజేంద్రనగర్ లోని అపార్డ్‌కి డెప్యుటేషన్‌లో (1996-2001) ఉండగా మరో అయిదు కథలు అనువాదం చేశాను.

నేను చేసిన చాలా అనువాదాలకు మూల భాషకీ, తెలుగుకీ మధ్య ఇంగ్లీషు అనుసంధాన భాషగా ఉంది. అయితే ‘సందిగ్ధ’ పుస్తకానికి మూల భాష రాజస్థానీ. విజయ్‌దాన్ దేథా (బిజ్జి అని అంటారు) తన మాతృ భాషలోనే రచనలు చేశారు. ‘సందిగ్ధ’ లోని కథలు ముందుగా హిందీలోకి, హిందీ నుంచి ఇంగ్లీషులోకి (రూత్ వనిత అనువాదం), ఇంగ్లీషు నుంచి తెలుగులోకి వచ్చాయి.

రాజస్థాన్ జానపద కథలను అక్షరబద్ధం చెయ్యటానికి రూపాయన్ అనే సంస్థని విజయ్‌దాన్ నెలకొల్పారు. రాజస్థానీ మౌఖిక భాషలోని జానపద కథల ఆధారంగా 14 సంపుటాల బాతాన్ రి ఫుల్వారి (కథల తోట) ప్రచురించారు. విజయ్‌దాన్ 800కి పైగా కథలు రాశారు. వీటిల్లో కొన్నింటిని సినిమాలుగాను, కొన్నింటిని నాటకాలుగాను మలచారు. ‘చరణ్‌దాస్ చోర్’ మూల కధ విజయ్‌దాన్ రాసినదే. దీనిని హబీబ్ తన్వీర్ నాటికగా మలచారు, శ్యాం బెనగల్ సినిమాగా తీశారు.

ఈ కథల్లో గొప్ప వెలుగు ఉంది. అది పురుషుడి కళ్ల చుట్టూ అల్లుకున్న అధికార వ్యామోహపు, ఆధిపత్య లాలసత్వపు చీకటిని తుత్తునియలు చేయగల శక్తివంతమైంది. ఈ కథల్లోని పురుష పాత్రలు పురుష లోకం మీద ద్వేషంతో సృష్టించినవిగా అనిపించవు. అలాగే ఇందులోని స్త్రీ పాత్రలు పురుషులపై గుడ్డి ద్వేషాన్ని ప్రకటించవు. అదే వీటిలోని ప్రత్యేకత


-సజయ, ఒమ్మి రమేష్ బాబు (లిఖిత ప్రెస్)

2000లో లిఖిత ప్రెస్ పేరుతో ప్రచురణలను ప్రారంభించిన సజయ, ఒమ్మి రమేష్ బాబులు విజయ్‌దాన్ దేథా ఆరు కథలను తమ మొదటి పుస్తకంగా ఎంచుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘ప్రాంతీయ స్థాయిలో విలసిల్లే జానపద సాహిత్యాన్నీ, కళలనీ కూడా విశ్వీకరణలో ఐక్యం చేసి వాటి అస్థిత్వాన్ని దెబ్బతీయాలన్న యత్నమూ జరుగుతోంది… ఈ సందర్భంలోనే మనం మన మౌలిక సాహిత్యపు విలువలన్నింటినీ ప్రాణప్రదంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాహిత్యపు మూలాలన్నింటినీ శోధించి సాధించుకోవాల్సి ఉంది. ఈ లక్ష్యంతో విభిన్నమైన సామాజిక నేపథ్యాల జీవిత చిత్రణలను ప్రచురించాలన్న ఉద్దేశంతో ‘లిఖిత ప్రెస్’ ప్రారంభమౌతోంది… తన తొలి ప్రచురణగా వెలువరిస్తున్న ఈ రాజస్థానీ జానపద కథల సంకలనమే ఇందుకు సాక్ష్యం…’ అని ప్రచురణకర్తలు తమ ముందుమాటలో పేర్కొన్నారు. ఇంకా, ‘మన సమాజంలో మన గడ్డ మీద స్త్రీలు ఎటువంటి వివక్షకి గురవుతున్నారో, ఎలా శోకతప్తులవుతున్నారో కళ్లకు కట్టినట్టు వివరిస్తాయీ రాజస్థానీ జానపద కథలు, కల్పననీ, వాస్తవాన్నీకలబోసిన ఈ కథల్లో గొప్ప వెలుగు ఉంది. అది పురుషుడి కళ్ల చుట్టూ అల్లుకున్న అధికార వ్యామోహపు, ఆధిపత్య లాలసత్వపు చీకటిని తుత్తునియలు చేయగల శక్తివంతమైంది. ఈ కథల్లోని పురుష పాత్రలు పురుష లోకం మీద ద్వేషంతో సృష్టించినవిగా అనిపించవు. అలాగే ఇందులోని స్త్రీ పాత్రలు పురుషులపై గుడ్డి ద్వేషాన్ని ప్రకటించవు. అదే వీటిలోని ప్రత్యేకత,’ అని పేర్కొన్నారు. (ఈ పుస్తకం ప్రస్తుతం ముద్రణలో లేదు.)

ఆంగ్ల ప్రచురణకు పరిచయంలో, ‘తనలోని అధికార కాంక్షకు పగ్గాలు వదిలినప్పుడు పురుషులు ఎంతటి మూర్ఖులుగా, హాస్యాస్పదులుగా మారతారో జానపద సాహిత్యం స్పష్టంగా బయల్పరచడం చెప్పుకోదగిన విషయం. తమపై జరుగుతున్న అణిచివేతను బాహాటంగానూ, బయటకి కనపడకుండానూ స్త్రీలు అనేక విధాలుగా ఎలా వ్యతిరేకిస్తున్నారో ఈ కథలు తెలియచేస్తాయి. ఈ మహిళలలో ఏ ఒక్కరూ ప్రతిఘటించకుండా పడి ఉండలేదు. తమదైన హుందాతనాన్ని కాపాడుకుంటూనే పురుషులు నిర్ణయించిన వ్యవస్థలను, పద్ధతులను ప్రశ్నించి ఎదుర్కొన్నారు. జీవించటంలోని ఒక విధమైన ఆనందాన్ని, స్త్రీ – పురుషుల మధ్య మరింత సంతృప్తికరమైన, మరింత సమాన సంబంధాలను కాంక్షించటాన్నీ ఈ కథలు చాటుతున్నాయి,’ అని మధు కిష్వర్ పేర్కొన్నారు.

రాజ్‌కమల్ ప్రకాశన్ హిందీలో ప్రచురించిన ‘దువిధ’, ‘ఉల్‌ఝన్’ అన్న రెండు సంపుటాల నుంచి ఆధికారం, మానవ ప్రవర్తనపై దాని వికృత ప్రభావం అన్న అంశం చుట్టూ అల్లిన ఆరు కథలను ఎంపిక చేసి ఇంగ్లీషు అనువాదంతో ‘ద డైలెమా’ గా మానుషి ట్రస్ట్ ప్రచురించింది.

ఈ పుస్తకానికి శ్రీవిద్య నటరాజన్ జానపద శైలిని తలపించే రీతిలో ఎంతో చక్కని బొమ్మలు వేశారు. కవర్ డిజైన్ ఏలే లక్ష్మణ్ చేశారు.

విజయ్‌దాన్ దేథాది ఒక ప్రత్యేకమైన శైలి. ఇది కథ మొదలులోనే కనపడుతుంది. ఉదాహరణకు ‘కాకి విధానం’ కథ ఎలా మొదలవుతుందో చూడండి: ‘స్వప్రయోజనమే పూజ, స్వప్రయోజనమే దైవం. మిగిలినదంతా మోసం, దగా. దేశం, శీలం, అభిమానం అంటే ఎవరికి పట్టింది… మతం, కర్తవ్యం అన్నవి ఉత్తి మాటలు! పైన పటారం లోన లొటారం… ప్రేమ డొల్ల, హృదయం రాయి!… మునులు తెల్లగా కనపడతారు కానీ వాళ్ల హృదయాలు నలుపు. సృష్టికర్త, సర్వం తెలిసినవాడూ ప్రతి వ్యక్తి స్వప్రయోజనాలను తీర్చుగాక!’ అతని రచనలలో సుదీర్ఘమైన వర్ణనలు, ఉపమానాలు, సామెతలు ఉంటాయి.

అప్పటివరకు సంతోషంగా ఉన్న బీజా, తీజాలకు బీజా పురుషుడుగా మారిన మరుక్షణం అతని ప్రవర్తనలో మార్పు వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుషుడు బలవంతుడని, అతని ముందు బలహీనురాలయిన మహిళ ఎందుకూ కొరగాదు అని అనుకోవటం మొదలుపెడతాడు బీజా.

పురుషుడు కావటంతోనూ, అధికారం రావటంతోనూ వ్యక్తులు ఏలా మారిపోతారో ఈ కథలు చూబిస్తాయి. ఉదాహరణకు ‘కొత్త దారి’ అన్న కథలో ఒక వ్యాపారి తన కూతురిని కొడుకు వేషంలో పెంచి తన స్నేహితుడైన మరొక వ్యాపారి కూతురితో పెళ్లి జరిపిస్తాడు. చివరికి అబ్బాయిగా పెరిగిన అమ్మాయి (బీజా) తానూ అమ్మాయినేనని గుర్తించి బాధపడుతుంది. ‘స్త్రీ పురుషుల మధ్య వివాహంలో అద్భుతమేముంది!’ అనుకుని వాళ్లిద్దరూ అమ్మాయి బట్టల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక దెయ్యం సహాయంతో అందమైన మహలులో ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటారు. దెయ్యానికి పుంసత్వం ఇచ్చే శక్తులు ఉన్నాయని తెలుసుకుని తాను పురుషుడుగా మారతానని బీజా అంటాడు. అప్పటివరకు సంతోషంగా ఉన్న బీజా, తీజాలకు బీజా పురుషుడుగా మారిన మరుక్షణం అతని ప్రవర్తనలో మార్పు వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుషుడు బలవంతుడని, అతని ముందు బలహీనురాలయిన మహిళ ఎందుకూ కొరగాదు అని అనుకోవటం మొదలుపెడతాడు బీజా. ఇద్దరూ అమ్మాయిలుగా ఉన్నప్పుడు రాని ప్రశ్న (‘ఈ ఆస్తికి అసలైన యజమాని ఎవరు?’) బీజా పురుషుడుగా మారిన తరవాత అతనిలో తలెత్తుతుంది. అంతే కాకుండా, ‘నా సొంత సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాను. అంతులేని సంపదను కూడగట్టి పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాను… నీ వంటి వాళ్లు వందల మంది నాకు రాణులై నా కోసం ఎదురు చూస్తుంటారు,’ అంటాడు. ఒక్క రాత్రి లోనే తమ మధ్య ఈ ‘నేను’ అన్నది ఎలా వచ్చిందని తీజా ఆశ్చర్యపోతుంది. బీజా తన తప్పుని తెలుసుకుని మళ్లీ అమ్మాయిగా మారిన తరవాతే వాళ్లిద్దరి మధ్య తిరిగి ప్రేమ నెలకొంటుంది.

‘ద్వంద్వ ప్రమాణాలు’ అన్న కథలో తన ప్రేమికుడైన రౌతుని దేశానికి రాజుగా రాణి ప్రకటించిన మరుక్షణం (మరుక్షణమే), ‘ఇటువంటి లంజను ఎలా నమ్మటం? పెళ్లి చేసుకున్న భర్తనే మోసగించటానికి వెనుకాడలేదు. తన పట్ల ఎంత కాలం విశ్వాసంగా ఉంటుంది?… వారిని నాశనం చేయకపోతే సింహాసనానికి అర్థమూ, విలువా లేకుండా పోతాయి,’ అనుకుంటాడు. పదవీచ్యుతుడైన రాజు, “తప్పు పూర్తిగా నాది కాదు. ఈ సింహాసనం, ఈ కిరీటానికి కూడా ఈ తప్పులో భాగముంది… తప్పులో అధిక భాగం ఈ రాజ్యాధికారానిదే,” అంటాడు.

‘సందిగ్ధ’ అనే కథలో వానర మనిషిని గొర్రెల కాపరిగా వ్యాపారి భార్య మారుస్తుంది. వాస్తవానికి అతను రాకుమారుడు. ఆ రహస్యం తెలిసి అతను తిరిగి రాజు అవుతాడని తెలిసినప్పుడు, “ఈ అడవిలోని ఆనందాలకు ఏ రాజ్యం సరితూగగలదు?” అని అడుగుతుంది. అలా అయితే తనని వానర మనిషిగానే ఉండనివ్వాల్సిందని అతను అంటాడు.

‘సందిగ్ధ’ అనే కథలో వానర మనిషిని గొర్రెల కాపరిగా వ్యాపారి భార్య మారుస్తుంది. వాస్తవానికి అతను రాకుమారుడు. ఆ రహస్యం తెలిసి అతను తిరిగి రాజు అవుతాడని తెలిసినప్పుడు, “ఈ అడవిలోని ఆనందాలకు ఏ రాజ్యం సరితూగగలదు?” అని అడుగుతుంది. అలా అయితే తనని వానర మనిషిగానే ఉండనివ్వాల్సిందని అతను అంటాడు. సింహాసన అధికారాన్ని చవి చూడక ముందే మొత్తం ప్రపంచాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని రావాలని, గాలి, సముద్రం, పగటి కాంతుల మీద ఆధిపత్యం చెలాయించాలని ఉవ్విళ్లూరుతుంటాడు. రాజ్య విస్తరణ, భోగాలాలసతలో కూరుకునిపోయి ఆమెను దూషిస్తాడు.

విక్రమార్కుని సింహాసనం మీద కూర్చుంటే చాలు నోటి నుంచి సత్యం, న్యాయం ఎలా పలుకుతాయో, అలా పురుషుడిగా పుట్టినందుకు గర్వం, అహంకారం, స్వార్థం వంటివి పుట్టుకొస్తాయి. పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చెయ్యవచ్చు కానీ పితృస్వామ్యాన్ని అంత తేలికగా అంతం చెయ్యలేమన్న దాని గురించి అందరం లోతుగా ఆలోచించాలి.

‘సంశయం’ అన్న కథ చూస్తే విజయ్‌దాన్ దేథా కథా నైపుణ్యం, ఆలోచనా విధానం అర్థమవుతాయి. వాస్తవానికి ఇది ఒక చిన్న కథ. రొమిల్లా థాపర్ ‘భారత కథలు’ అన్న పుస్తకంలో (ఇది విజ్ఞాన ప్రచురణల ద్వారా తెలుగులో అందుబాటులో ఉంది) ‘భూతం’ అన్న పేరుతో ఈ కథ ఉంది. దీని నిడివి ఒకటిన్నర పేజీలు. ధనిక వ్యాపారి కొడుకు పెళ్లి చేసుకుని భార్యతో ఊరికి తిరిగి వస్తుంటే దారిలో ఆమెను చూసి ఒక దెయ్యం మోహిస్తాడు. కొత్త భార్యని ఒంటరిని చేసి వ్యాపారి కొడుకు వ్యాపారానికి వెళితే అతని లాగా వచ్చిన దెయ్యం ఆమెతో కాపురం చేస్తుంటాడు. ఆమె భర్త తిరిగి వచ్చినప్పుడు అసలు భర్త ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. తీర్పు కోసం రాజు దగ్గరకు వెళుతుంటే దారిలో ఒక గొర్రెల కాపరి ఒక సీసాలోకి దెయ్యం వెళ్లేలా చేసి అసలైన భర్తని గుర్తిస్తాడు. స్త్రీ ఒక వస్తువు కాబట్టి ఆమెను అసలైన యజమాని దగ్గరకు చేర్చటం ద్వారా న్యాయం జరిగినట్టు ఆ కథ ఉంటుంది.

పితృస్వామ్య కాలపు విలువలతో ఉన్న జానపద కథను ఆధునిక కాల భావాలతో స్త్రీ దృష్టి కోణం నుంచి మలచటం విజయ్‌దాన్ దేథా ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న అన్ని కథలూ ఇలాంటివే. అవి మనలను ఆలోచింపచేస్తాయి, వదలక వెంటాడుతుంటాయి.

ఇందులో ఆ స్త్రీ ఆలోచనలకు ఎటువంటి తావు లేదు. ఇదే కథని ‘పహేలీ’ అన్న పేరుతో సినిమాగా తీశారు. అసలైన భర్తని గుర్తించినప్పటికీ జనాదరణ కోసం దెయ్యం తిరిగి అతని రూపంలో వచ్చాడన్న ముగింపుని సినిమాలో ఇచ్చారు. విజయ్‌దాన్ దేథా ఈ రెండింటికీ భిన్నంగా దీనిని 25 పేజీల అద్భుతమైన ప్రేమ కథగా మలిచాడు. ఆమె అందానికి వివశుడైన దెయ్యం ఆమెను ఆవహించి బాధించలేడు, ఆమె భర్తను ఆవహించినా ఆమె బాధపడుతుంది కాబట్టి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడతాడు. వ్యాపారి కొడుకు పరదేశాలకు వెళ్లటం చూసి అతడి వేషంలో వస్తాడు. కొడుకే తిరిగి వచ్చాడని తల్లిదండ్రులు అనుకుంటారు. అటువంటిది కొత్త భార్యకి తేడా ఏం తెలుస్తుంది? కానీ, ఆమె నుంచి నిజం దాచటం అంటే ఆమెను మోసం చెయ్యటం అవుతుందని దెయ్యం నిజం చెపుతాడు.

దెయ్యం ప్రేమ లోని నిజాయితీని గుర్తించి, వెళ్లే వాడిని ఆపలేకపోయాను, వచ్చినవానిని ఎలా ఆపగలనని అతనిని భర్తగా అంగీకరిస్తుంది. దెయ్యం ప్రేమ కాంతితో సూర్యుడు మసకబారాడంట! వాళ్లిద్దరూ ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా రోజులు గడుపుతుంటారు. తల్లిదండ్రుల దగ్గర, గ్రామ ప్రజల దగ్గర మంచి పేరు గడిస్తారు. ఒక సందర్భంలో ఆమె ప్రేమ అతని హృదయంలోని విషాన్ని అమృతంగా మార్చిందని దెయ్యం అంటాడు. భార్య గర్భవతి అయ్యి, ప్రసవ వేదనలో ఉన్న సమయంలో విషయం తెలిసి, ఒక సంవత్సరం ముందుగానే అసలైన భర్త తిరిగి వస్తాడు. భార్య ప్రాణ గండం నుంచి బయటపడి ఆడపిల్లను ప్రసవించేంతవరకు బయట జరుగుతున్న గొడవ దెయ్యానికి పట్టదు. నాలుగేళ్ల ప్రేమమయ జీవితంతో అతడి తత్వమే మారిపోయింది. అతడు అబద్దమూ చెప్పలేడు, అలాగని నిజమూ చెప్పలేడు. ఆమె మర్యాదని కాపాడాలన్నదే అతని ఆలోచన. దెయ్యాలు చేసే మాయలు అతడికి అన్నీ తెలుసు కానీ మనుషుల మోసాల గురించి ఏమీ తెలియదట. ఆమె కష్టాలపాలు కాకూడదని గొర్రెల కాపరి పెట్టిన మొదటి రెండు పరీక్షల్లో నెగ్గి అనాలోచితంగా మూడవ పరీక్షలో నీటి బుర్రలోకి దూరి బందీ అవుతాడు. అసలు భర్త ఉన్న పడక గదిలోకి వెళ్లబోతూ భార్య, ‘జంతువులనైనా వాటి ఇష్టానికి వ్యతిరేకంగా నడిపించలేమే, అవి కనీసం నిరసనతో తలనైనా ఊపుతాయి. కానీ ఆడవాళ్లకు తమ సొంత మనసు ఉండే వీలుందా?’ అన్న ఆలోచనలతో కథ ముగుస్తుంది.

పితృస్వామ్య కాలపు విలువలతో ఉన్న జానపద కథను ఆధునిక కాల భావాలతో స్త్రీ దృష్టి కోణం నుంచి మలచటం విజయ్‌దాన్ దేథా ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న అన్ని కథలూ ఇలాంటివే. అవి మనలను ఆలోచింపచేస్తాయి, వదలక వెంటాడుతుంటాయి.

++

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. మీకు పరిచయం చేసిన పై పుస్తకం మూడవది. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. 

e





దిగ్విజయ్ రాజా - దిగువ తరగతి పేదా - సరదా వ్యాసం - కల్లపాలెం హనుమంతరావు





 

మనదగ్గరే ఉన్నాయి ఆధార వనరులు కర్లపాలెం హనుమంతరావు

 వ్యంగ్యం


సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’.. ఈ నీతి ఆయోగమేంటో గోలగా ఉంది  బాబూ! భాషను గురించి కాదు నా బాధంతా! వృద్ధి, ఉద్యోగాల కల్పన, బీదరికం నిర్మూలన,  పథకాల అమలు.. అంశాలన్నీ వినసొంపే గానీ కానులు రాలేందుకు  వేరే దగ్గర దారులు ఇంకేమీ లేనే లేవా అని నా శంక. నిధులు, విజ్ఞానం లాంటి వాటినన్నింటినీ కేంద్రం ఉదారంగా పంచి  రాష్టాలకు సాధికారకత కల్పించడం .. ఏందో..  చందమామ కథలాగా ఉంది వినడానికి.

స్వచ్చ భారత్ మనకేమన్నా అచ్చివచ్చే పథకమా ఏమన్నానా? కనబడ్డ చెత్తనల్లా అలా కాలవల్లోకి వూడ్చిపారేయమని సతాయిస్తున్నారు కానీ మరీ ఈ మధ్య.. నిజానికి చెత్తనుంచి ఎన్ని కొత్త కొత్త ఆదాయ వనరులు సాధించుకోవచ్చూ!

కొత్త రాష్త్రం .. కొండలా మీ ఆండ ఉండాలని ఒకడు. పాత రాష్ట్రం.. ప్రత్యేక హోదాల్లాంటి హామీలన్నీ అమలు కావాలని మరొకడు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు  మొన్న నీతి ఆయోగులో మోదీగారి బుగ్గలు పుచ్చుకుని మరీ బతిమాలుతుంటే చూడ్డానికే చాలా సిగ్గనిపించింది.  ఎక్కడ  చూసినా తుక్కూ దూగురా కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చే మన పుణ్యభూమిలో వేరే ఆదాయ వనరులకు వెదుకులాట అవసరమా? 

తెలుగు రాష్ట్రాలు రెండూ నిండు పూర్ణగర్భలు కదా! తంగభద్రలో, తెలుగ్గంగలో రింగు వేసినా చాలు ఇసుకను బంగారంగా మార్చుకోవచ్చు. మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని ఎర్రచందనం దుంగలే ఇప్పుడు ఓ ప్రభుత్వానికి ముఖ్యమైన ఆధాయవనరులు. మధ్యమంటే ఇహ చెప్పేదేముంది! సాంపద్రాయికంగా ప్రజా సంక్షేమ పథకాలన్నింటికీ అదే ప్రధాన చోదకశక్తి. పనికిరాని బొట్టుబిళ్లలతో సైతం మదర్ థెరిసా బొమ్మలు చేసి అమ్మేసే అమ్మళ్లు ఇక్కడే  పుష్కలంగా ఉండగా  ఢిల్లీ దాకా పోయి కేంద్రానికి దండాలు దస్కాలు పెట్టడం అవసరమా? బొగ్గు గనులు కావాలని ఒక ముఖ్యమంత్రి.. బయ్యారం ఇనప తుక్కు ఇవ్వమని మరో ముఖ్యమంత్రి దేబిరించడమే వింతగానే ఉంది మరి! 

చీపుగా చూసే చీపురు పుల్లల్ని కూడా మఫ్లరు మనిషి  ఎలా వ్యాపార సరుగ్గా మార్చిసాడో మొన్నఢిల్లీ ఎన్నికల్లో చూసాం గదా! కూచిపూడి, కొండపల్లి,  బ్రాండులతోనే కాదు పూచికపుల్లలతో సైతం గోచీపాతరాయుళ్ళు కోటీశ్వరులను చేసేయవచ్చు. మురికి నీటినైనా సరే సీసాలకు పట్టి మూతి బిగించి మంచి కంపెనీ లేబులొకటి  అందంగా అతికిస్తే సరి.  లీటరు ఇరవై రూపాయలకైనా వాటంగా చెల్లిపోతుంది. మన వంట్లోని ఒక మూత్రపిండం మనది కాదనుకుంటే చాలు.. ప్రతి ఓటరు వంటిమీదనే లక్షలు పలికే వనరులున్నట్లు! దేవుడు వృథాగా దేన్నీ ప్రదానం చేయడు కదా!   సెనెక్సుల అదుపులేదు. సెబీల గుబులు లేదు. సెక్సు సీన్లని సెన్సారు వాళ్ళస్తమానం వేసే ఏ కత్తెర్ల గోలలేవీ లేకుండా నాలుగురాళ్ళు సంపాదించుకునే అవకాశాలెన్నో  ఆకాశమంత విస్తారంగా ఉండంగా.. మన సియమ్ముల మాత్రం మోదీగారి ముందలా మోకాళ్ళు వంచి మరీ  ఆ  బీదరుపులు అరవడమేమిటి.. చీదరగా!

 నాలుగు రాళ్ళు సంపాదించుకోమని మన పెద్దలు అస్తమానం పోరుతుంటారు.  నిజం రాళ్లకు, రప్పలకు ఉన్న గిరాకీ  వాస్తవ డబ్బుకు ఎక్కడుంటుంది చెప్పండి. ఎంత పోసినా అమ్ముడవని మొండిఘటాలైనా .. ఇళ్లమీదకు నాలుగు రాళ్ళు వేయిస్తే సరి చప్పున దారిలోకొచ్చే రోజులాయ ఇవి మరి! పొరుగున ఉన్న తమిళ రచయిత పెరుమాళ్ కథ చాలదా మనకి రాళ్ల పవరేమిటో తెలుసుకోవడానికి? రాళ్ళు, రప్పలు కుప్పలుగా  అమ్మించే పథకాలేమన్నా పెట్టించండీ!

గాలిని తరంగాలుగా మార్చి ఎన్ని వేల లక్షలు వ్యాపారాలు వర్థిల్లుతున్నాయి ఇక్కడ! బొగ్గును తవ్వి పోసుకుని కోట్లకు పడగలెత్తిన విజేతల కథలకైతే దిక్కే లేదు.  పాత పాలకుల పాలన పుణ్యమా అని దేశంలో ఏదీ వ్యాపారానికి అనర్హమైనది కానే కాదని ఎన్నడో తేలిపోయింది. పశుదాణానుంచైనా బంగారు కాణులు రాబట్టుకోవచ్చని లాలూ ప్రసాదుల్లాంటి బాబులు ఎన్ని మార్లు నిరూపించారూ!  స్కాముల గురించి కాదు స్వాములూ! ప్రపంచంలో ఎక్కడ  లేవుగానీ ఆ అవినీతి భాగోతాలు.. జాతికి అవి నేర్పే పాఠాలు ఏవిటన్నది మనకు ముఖ్యం. 

తట్టెడు సిమెంటైనా తయారుకాకుండానే రెట్టింపు రేట్లకు షేర్లు అమ్మి పెట్టే తోలుపెట్టె కంపెనీలు బోలెడన్ని వర్ధిల్లిన భూమి ఇది.  ఏ కృష్ణకాలువ గట్టునో ముక్కుమూసుకుని కూర్చునే సౌకర్యాలు కల్పించినా చాలు కదా!  గదుల అద్దెకే  వేలు దండుకోవచ్చు. ఇంట్రస్టు అంటూ ఉండాలేకానీ.. ఏ ట్రస్టు పెట్టుకున్నా మూడు తరాలపాటు కాలు కదపకుండా తిని కూర్చునే సంపద సాధించుకోవచ్చు. మన జనాలకిలాంటి కిలాడి పథకాల్లోనూ తర్ఫీదిస్తే తప్పేముంది? 

అత్యధిక బిలియనీర్లున్న ప్రపంచం దేశాల్లో మనదింకా మూడో స్థానమేనా? సిగ్గుచేటు. బిల్ గేటు బాబును మించి సంపాదిస్తున్నారే.. కొద్దిమంది కరకట్ట పనులు చూసే  జాబులున్న బాబులు. ఐటి చట్టం తాలూకు తీవ్ర నేరాలకైనా సరే సర్వోన్నత న్యాయస్థానం అసలే అర్థమూ లేదు పొమ్మంటున్నదీ మధ్య. ఇక దేనికి మన జనాలను బెదురుతూ కూర్చోమనాలి?  చట్టం చూసీ చూడనట్లు పోతే చాలు.. చట్టిలో బంగారం ముద్దలు దాచుకునే స్థాయికి ఎదుగుతారు ఇక్కడి జనాలు.

’మేక్ ఇన్ ఇండియా’ అనేది మన ప్రధాని నినాదం కూడానాయ. గోడక్కొట్టుకునే మేక్కూడా ఇక్కడే తయారవ్వాలన్న ఆయన ఆకాంక్షనుంచైనా మన జనాన్ని  స్గూర్తి పొందనీయక పోతే ఎలా? దేశభక్తితో పాటు స్వయంభుక్తికీ సులభ మారర్గాలెన్నో కళ్లముందే ఇన్ని మెరిపిస్తున్నా నిద్రమత్తులోనే ఉంచి  మనం జనాలను జోకొడుతున్నామన్నది నా బాధ.

విత్తనాల వ్యాపారం కన్నా కల్తీ విత్తనాల వ్యాపారం మూడు పూవులూ ఆరుకాయలుగా సాగుతున్న కాలం ఇది. నమ్మించి దండుకున్నవాడికే ఆనక నమ్మి మెళ్ళో దండేసి హారుతులిచ్చే జమానా ప్రస్తుతం నడుస్తున్నది.   ఇన్ని వనరులుండీ ఇప్పటికీ జనం కోట్లకొద్దీ పేదరికంలోనే మగ్గుతున్నారంటే.. ప్రభుత్వాలకు సుపరిపాలన సామర్థ్యం లేదనేగా అర్థం?

బోలెడన్ని వనరులు.. నరులు మన సహజ సంపదలు. సద్వినియోగం చేసుకునే యోగమే అవసరం.  కోళ్లక్కూడా పనికిరాని ఫారాల్లో  పాఠశాలలు పెట్టి పిల్లకాయల భవిష్యత్తునలా బుగ్గిపాలు చేసే కన్నా చక్కంగా చిన్నతనంనుంచే చిన్నతనం లేకుండా ఏ చెత్తతోనైనా సరే కొత్త కొత్త పద్దతుల్లో ఆర్జించడం నేర్పించాలి. ఆ సెట్టులనీ ఈ సెట్టులనీ పసిబిడ్డల్ని పెసరట్ల మాదిరిగా పరీక్షల పెనంమీదలా వూరికే కాల్చుకు తినకుండా వేడి వేడి పకోడిల్లాంటి మంచి రుచికరమైన పథకాలు మరన్ని  సెట్ చేసి పెట్టుంచాలి. ఏ దేవుడిసేవ వంక పెట్టుకున్నా చాలుగదా.. గదులు అద్దెకిస్తే పదులు, వేలల్లో ఆర్జించుకోవచ్చీ ఆధ్యాత్మిక దేశంలో. ప్రభుత్వ సారాయి దుకాణమైతే ఏ కొద్దిమంది తాగుబోతులకే పరిమితం. పరమాత్ముడి ప్రసాదాలకైతే సర్వే సర్వత్రా  గిరాకీ .  ఆశ్రమాలను మించిన శ్రమరహిత ఆధాయా పథకాలు ఇంకెక్కడున్నాయి స్వామీ? 

నాలుగు రాళ్ళు జమకూడినాక బోర్దు తిప్పేసే కళ  బీసి కాలం నాటిదే కావచ్చు కానీ.. ఇవాళ్టికీ అలా  బోర్డు తిరగేసిన వాడే   రాటుతేలి మొనగాడై జాతి మొత్తానికి మార్గదర్శకుడుగా మన్నలందుకుంటున్నాడు. బుర్ర పెట్టి ఓ గాడిలో పెడితే   జనాలు గుర్రాలెక్కించి  ఊరేగిస్తారు.  పెడదారిలో పెడితే గాడిదమీద ఊరేగింపు ఎలాగూ తప్పదు చివరికి. 

అంతు లేకుండా ఇన్నేసి ఆదాయవనరులు సహజ సిద్దంగా మన దగ్గరిన్ని దండిగా   ఉండీ ఒక ముఖ్య మంత్రి ప్లాస్టిక్ ఉత్పత్తులకోసం, మరో ముఖ్యమంత్రి పాత హామీల అమలుకోసం మొన్న ఆ నీతి ఆయోగ్ లో పట్టు పట్టడమే వింతగా ఉంది. విచారంగానూ ఉంది*

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...