Sunday, December 12, 2021

దేవుళ్ల మీదా నిందలేనా? -కర్లపాలెం హనుమంతరావు- సరదా వ్యాసం


ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/

తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/

అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!/.. 

అక్కటా! అందరందరు అందరే.. అడుగనేల కామదాసులు కారే నీ కరుణ వలన-

ఇది శ్రీరామ కథ సినిమాలో దేవుళ్ల బుద్ధిచాపల్యం మీద పెట్టిన చాకిరేవు.

 ‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/

విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ / కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?- అని కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది.. ఏదో సరదా కన్నాడు లెమ్మని  అర్జునుడేమన్నా కిమ్మనకుండా ఉండిపోయాడా?

'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/

ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ ఎదురుపెట్టాడు.  కృష్ణార్జున యుద్ధంలోని ఈ మాదిరి దెప్పుళ్లు గతంలో ప్రతీ చలనచిత్రంలో  వినిపించేవి. తగవులు వచ్చినప్పుడు భగవంతుళ్లు, భగవదంశ ఉన్నవాళ్ళు కూడా కోపతాపాలకు వశమైపోవడం విచిత్రమే.  భక్తులకు ఆదర్శమన్న స్పృహ లేకుండా దేవుళ్లు తమలో తాము తిట్టుకుంటుంటే, వారి వారి భక్త కోటి తన్మయత్మలో మునిగితేలడం ఏ తరహా సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందో   ఆయా సాంప్రదాయవాదులే సెలవియ్యాలి మరి.

రెండు ముక్కలు గట్టిగా తిట్టుకుంటే చాలు, ఆ పైన పదాలు తట్టక  మీద మన్ను పోసుకుంటున్నారు ఇప్పటి తరాలు.  ఆక్స్ ఫర్డ్ వర్డ్స్ విద్యాధికులూ ఈ  షష్టాకాలకేం తక్కువ కాదు. కానీ వాటి మూలార్థాలు   వంకాయలు, బీరుకాయలు అమ్ముకునే బస్తీజీవి బుద్ధికెక్కవు.  వ్రతం చెడీ ఫలం దక్కకపోతే ఎట్లా అని కాబోలు లేటెస్టుగా ఫారిన్ రిటర్న్సే కాదు.. ఫారిన్ కంట్రీసులో సెటిలయిన  మనవాళ్లు కూడా మన బస్తీ లాంగ్వేజీలోనే సామాజిక మాధ్యమాల ద్వారా కుస్తీ పట్లకు దిగిపోతున్నారు! అంతర్జాలం అభివృద్ధి ఫలాలలో అవాచ్యాలు విశ్వవ్యాప్తంగా విస్తరించడం ఒక కోణం.

 గతంలో మన తెలుగు ప్రాంతాలలో తిట్ల కవులుగా చాలా మంది చరిత్రలో ప్రసిద్ధమయారు. బడబానలం భట్టారకుడు అనే మహానుభావుడు ఉన్నాడు. చెరువులో నిలబడి సూర్యనమస్కారాలు చేస్తుంటే చేతివేలి ఉంగరం కాస్తా నీళ్లల్లో జారిపడింది. కొత్తది కొనుక్కోవచ్చు. కుదరకుంటే ఆశ వదులుకోవచ్చు. ఊరంతా తాగే నీళ్లను ఎండబెట్టి ఉంగరం దొరకబుచ్చుకొన్నాడాయన. చెరువుని అట్లా ఎండమని బెదరగొట్టడానికి ఆ పండితుడు వాడింది ఇప్పటి ప్రమాణాల ప్రకారం పచ్చి అన్ పార్లమెంటరీ లాంగ్వేజీ! ఆ  తిట్ల కవులకు కాపీ క్యాట్లే  ఈ కాలం నాటి మన  నాయకమ్మన్యులు!


క్రౌంచ పక్షుల మిథున భంగానికి అలిగి వాల్మీకి అల్లిన మహాకావ్యం రామాయణం. అలగడమే తెలీనంత ధర్మరాజు వారసులేమీ కాదు దైవభక్తులు కూడా. 'దొరతనములన్నియును దొరసినందాకా''అన్నాడు కదా అన్నమయ్య.  'కోపము పుట్టిన నెంతటి/ భూపాలుండైన చెడు' అంటాడు సానందోపాఖ్యానంలో శివరామకవి. లా మేకర్సూ వాళ్లే.. లా ఫస్ట్ బ్రేకర్సు వాళ్లే అన్న సిద్ధాంతం కలియుగం ముందు నుంచే మొదలయిందనడానికి వందలాది ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ స్థలాభావం.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాజశేఖర్ 'అంకురం' అప్పట్లో సూపర్ హిట్!అందులోని ఓ మంత్రిగారి కాన్వాయ్ సీనులో కారు మీద జాతీయజెండా తలకిందులుగా వేలాడ్డం చూసి ఓ సుకుమార దేశభక్తుడు కోర్టులో ప్రజావ్యాజ్య వేసి మరీ తన ఆగ్రహం ప్రకటించాడు. ఆ అవమానకర సన్నివేశం తొలగింపుకు ఓ ప్రేక్షకుడి ధర్మాగ్రహం కారణం. ఇప్పుడా తరహా ధర్మాగ్రహాల కన్నా నచ్చని తీర్పులు చెప్పే ధర్మస్థానాల మీదనే ఏకంగా ఆగ్రహంతో బురద జల్లే కొత్త సంప్రదాయం మొదలయిపోయింది.  

 ఇప్పటి చిత్ర కథానాయకులే వెండి తెర మీదా, బైటా నేరుగా 'బొంగు, బొక్క, తొక్క' అంటూ నోళ్ళు యధేచ్ఛగా పారేసుకుంటున్నారు. ‘అరిచే కుక్కలు కరవ్వు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది. కరవడం సంగతి ఎట్లా ఉన్నా ముందు అరవడం  రాజకీయనేతలకు, రాజకీయాలలో నిలబడుండాలనుకొనే ఆశావాహులకు ముందుండాల్సిన అర్హతగా మారిపోయింది. 

కోపతాపాల ప్రకటనకు నిన్న మొన్నటి వరకు కొద్దో గొప్పో ముసుగులూ గట్రా ఉండడం కద్దు! కొంపలో కొప్పట్టుకు చితక్కొట్టే కిరాతకుడూ  ఫేస్ బుక్  పోస్టుల దగ్గర కొచ్చేసరికి పురుషోత్తముడి అవతారానికి తగ్గకుండా సూక్తులు వల్లించేవాడు.  అందరూ అందరి మీదా అన్ని వేళలా అన్నిరకాల ఆగ్రహావేశాలు ప్రకటించడం వల్లవని వ్యవస్థలో  మనమున్నది.. అనుకునే వాళ్లం నిన్నటి వరకు.  ఏ కులం పేరుతోనో, మతం పెరుతోనో, లైగింగ దృష్టితోనో దూషించినట్లు ఫిర్యాదు వచ్చిన ఉత్తరక్షణంలో కనీసం ప్రాథమిక సమాచార నివేదిక సెక్షన్ల కిందయినా కొన్ని కేసులు పోలీస్టేషన్లలో బుక్కవుతుండేవి.  ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులే పూనిక వహించి ప్రత్యక్షంగా ఈ సరిహద్దులు చెరిపేసే బ్రహ్మప్రయత్నాలు చేస్తున్నారు. సభను తీరుగా నడిపించే బాధ్యత రాజ్యాంగబద్ధంగా స్వీకరించిన బుద్ధిమంతులే స్వయంగా  సాక్షాత్తూ చట్టసభల్లో జిహ్వపదును ప్రదర్శన స్పర్థల్లో ముందుంటున్నారు. కోపతాపాల బాహాట ప్రకటన కోసంగానూ స్థిరబడ్డ  వ్యవస్థ  దిష్టిబొమ్మల దగ్ధం, పాత పాదరక్షల, కలం సిరాల ప్రయోగ విధానాలు గట్రా!  వాటి మార్కెటు పుంజుకునే  కన్నా ముందే నానారకాల నోటి దూలలను రేటింగ్ రూపంలో లేటెస్టుగా టి.వి ఛానెల్స్ సొమ్ముచేసుకోవడం ఒక విపరిమాణం.  

'ఎక్కడయ్యా నీ అహింస/ఏడ నీ కరుణా రిరంస/చూడు దేశం ద్వేష భుగ్నం/క్షురత్ జిహ్వానల విభుగ్నం' అని మహాకవి మొత్తుకుని ఇప్పటికి సుమారు వందేళ్లు.  పందెంకోళ్లాటను మించి నడుస్తోంది దేశం బరిలో నేతల కారుకూతల పర్వం!

 

'ధారణిరాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రం/భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు/ర్వార మదీయబాహుపరివర్తితచండగదాభిఘాత భ/గ్నోరుతరోరు జేసెద సుయోధను నుగ్రరణాంతరంబునన్' అంటూ  'కురు గురు వృద్ధ బాంధవులు అనేకుల చూస్తుంండగానే నిండు సభ సాక్షిగా మదోద్ధురుడైన సుయోధనుడి సోదరుడు దుశ్శాసనుడు  పాంచాలిని పరాభవించి భీమసేనుణ్ని రెచ్చగొట్టిన మహాభారతం ఘటన మనందరికీ తెలిసిందే! అంత పట్టరాని ఆగ్రహంలో కూడా  ఆ పాండవ ద్వితీయుడు 'లోకభీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝరమును’ ఆస్వాదిస్తాననే భీకర ప్రతిజ్ఞ వరకే పరిమితమయాడు తప్పించి 'ఖలుడు'   అన్న ఒక్క ముక్కకు మించి ఆ దుష్ట దుశ్శాసనుణ్ణి దుర్భాషలాడనేలేదు.  అంతటి ఆగ్రహంలోనూ ఆ మాదిరి నిగ్రహం కాకతాళీయమా అంటే?  కాదనేందుకు మరో ఉదాహరణ చెప్పాలి.   విరాటుడు కొలువు కూటమిలో ఉన్నప్పుడు అక్కడికి భీత హరిణి 'కోపవేగమున కన్నుల నిప్పులు రాల నంగము/ల్గనలగ సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితాంతదంతపీ/డన రట దాస్యరంగ వికటభ్రుకుటీచటుల ప్రవృత్త న/ర్తన ఘటనా ప్రకార భయదస్ఫురణా పరిణద్ధమూర్తి' గా మారాడే తప్పించి నోటితో ఒక్క ‘ఛీ’త్కార శబ్దం కూడా చేసిందిలేదు. 'నేలయు నింగియు దాళముల్ గా జేసి యేపున రేగి వాయించి యాడ,/గులపర్వతంబులు గూల్చి యొండొంటితో దాకంగ వీకమై దన్ని యాడ,/నేడు సాగరములు నిక్కడక్కడ బెట్టి పలుచని రొంపి మై నలదికొనగ,/దిక్కులు నాలుగు నొక్కచోటికి దెచ్చి పిసికి పిండలి సేసి పిడుచగొనగ,

 మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల వ్రేయ/నప్పళించుచు/ బ్రళయకాలానలమున/ గండరించిన రూపంబు కరణి భీముడు భయంకరాకారత నతిశయిల్లాడినట్లు తిక్కన మాత్రమే చెప్పుకొచ్చాడు. భారతదేశ రాజకీయ సంస్కృతి, ముఖ్యంగా తెలుగురాష్ట్రాలలో మనం నేడు చూస్తున్న రాజకీయ వాతావరణం తిక్కన భారతం  మార్క్ ‘బండబూతుల’ స్థాయికి అప్డేట్ అవడం ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులందరినీ విపరితంగా కలచివేస్తున్న తాజా దురవస్థ. 

సాక్షాత్తూ మంచి చెడులు అన్ని కోణాల నుంచి తరచి చూసి , సాక్ష్యాల ఆధారంగా, రాజ్యాంగ పరిథిలో నిరపేక్షతో కూడిన తీర్పులిచ్చే న్యాయవ్యవస్థ ‘న్యాయదేవత’కు ప్రతినిధిగా మనం భావిస్తూ వస్తున్నాం. న్యాయదేవత కూడా ఇప్పుడు  ఈ  వాచాలత నిందల దాడులను ఎదుర్కొంటోంది. దేవుళ్ల మీదా నిందలేనా? అంటూ నివ్వెరపోయే దుస్థితుల నుంచైనా సామాన్య పౌరుడిని బైటపడవేసే అత్యయిక పరిస్థితి వచ్చిపడింది

తగు సమయంలో ఈ తరహా దుష్టాతి దుష్ట సంస్కృతులకు అడ్డుకట్ట పడని పక్షంలో పేరుకు మాత్రమే మనది మెజారిటీ ఓటర్లు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడిపే స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన పాలన అని చెప్పుకోవాలి


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...