Sunday, December 12, 2021

బామ్మ ఫిష్ -కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 బామ్మ ఫిష్ -కథానిక

-కర్లపాలెం హనుమంతరావు

 

 

'చేస్తావుగా?' అని అడిగాడతను. 

తలాడించా. గుండెలు గుబగుబా కొట్టుకుంటున్నాయి. 

లోపలకెళ్లొచ్చి నా చేతిలో డబ్బుల కట్టోటి పెట్టి అన్నాడు 'మూడు రోజుల్లో అయిపోవాలి పని. లెక్క చూసుకో! పాతిక వేలు. బ్యాలెన్స్..  పని సాఫీగా  అయింతర్వాత.' 

ఫోన్ కాలొచ్చిందింతలో అతగాడికి. 

 ఆటో స్టార్ట్ చేసుకుని నేనొచ్చేశా. మధ్యాహ్మం రెండు గంటలు కావస్తోందప్పటికే.. మోడల్ స్కూల్ పిల్లల పికప్ టైమ్. 

బండి నడుస్తోందే  కానీ, ఆలోచనలు అదుపులో లేవు. 

 

'యాభై వేలు. తక్కువ మొత్తమేం కాదు.. తనబోటోడికి. బ్యాంకప్పుతో నడుపుకునే ఆటో ఇది. కిస్తీలు  కట్టలేక తప్పించుకు తిరగడం  ఎక్కువైంది మరీ ఈ   మధ్యన. ఎన్ని రోజులట్లా? మొన్నటికి మొన్న  సెల్వరాజుకు రైలుస్టేషన్ సందులో దొరికిపోయాడు. 

 

సెల్వరాజు బ్యాంక్ రికవరీ ఏజెంట్. బండిని సీజ్ చేయించడం క్షణం సేపతనికి . ఎప్పట్లా మొరటుగా మాట్లాడలేదా  సారి. బండిలోకొచ్చి  కూర్చుని  కబుర్లకి దిగాడు. లోను బకాయిలు తీర్చకపోడానికి తన దగ్గరున్న రీజన్సేవో తాను చెప్పుకొస్తుంటే..

'ఈ సినిమా కష్టాలు అందరికీ ఉండేలేవే బయ్! బ్యాంకోళ్లు వింటార్రా! టయానికి వాయిదా కాతాలో పడాల. అదొక్కటే లెక్కాళ్లకి. ఆర్నెల బట్టీ నీ బాకీ మొండికి  తిరగబడె. నా ప్రాణం కొరకతావున్నార్రా నాయనా నిన్నట్టుకురమ్మని. నాదీ నీకులాగే పొట్ట తిప్పల చాకిరేనే కదా తమ్ముడూ! ఇప్పటికైనా దొరికావ్! పద! సార్ తోనే  కలిపిస్తా! అదేదో ఆడ్నే మొత్తుకో! పెద్ద సార్లు అవునంటే నాదేముంటది బ్రదర్! నాక్కూడా ఈ  తిప్పట  తప్పుద్ది గదా!'  అంటూ బ్యాంక్ సార్ సుబ్రహ్మణ్యంగారి దగ్గరకు నన్ను పట్టుకెళ్లాడు. 


ఆయన దగ్గరా అవే మొరలు. పూర్తిగా విననైనా విన్లేదా మహానుభావుడు. 'బకాయిలు కడతావా? బండిని పట్టేసుకోమంటావా? ఏదో ఓటి  తేల్చు!'  అని బిగుసుక్కూర్చున్నాడా  మొండి ముండా కొడుకు! మజ్జెలో ఈ సెల్వరాజన్నే కలగజేసుకుని నన్ను బైటికి లాక్కొచ్చాడు. 

 

అప్పుడు పెట్టిందే ఈ  ప్రొపోజల్. ‘సార్  నీ బాకీ  మాఫు చేయిస్తానంటున్నాడ్రా. నువ్వాయనకు ఓ చిన్న సాయం చేసిపెట్టాలంతే' అంటూ అసలు విషయం చల్లంగా బైటపెట్టాడు. 


వింటుంటేనే చెమటలు పట్టేసినయ్ రా  భగవంతుడా! ఇట్లాంటివి సినిమాల్లో, టీ.వీల్లో తప్ప  నేరుగా చూసిందిలే ఎప్పుడూ. ఇందులో నాదే ముఖ్య పాత్ర! 'బండి పోతే పాయ! ఇట్లాంటివి నా వల్ల కాదన్నా!' అంటూ అక్కడికక్కడే తోసిపారేశా అప్పటికైతే. 

 

బ్యాంక్ సారుకు 'ఒక చిన్న ఇల్లు' ఉందంట మారేడుపల్లిలో. ఆ అమ్మను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలని కుతి. మొదటామె  వూరుకుంటదా? అందుకని..  ఆమె అడ్డు తొలగించుకోవాలని సార్ ప్లాన్. 

 

సర్కారు ఉద్యోగం కనక సొయంగా  ఏం చేసినా కొలువుకు ఎసరంట. అందుకనీ ఈ తంటాలు!  తొలగించుకోడానికి హెల్ప్ చేస్తే యాభైవేలు ఇస్తానని సెల్వరాజు చేత కబురందించాడీ పెద్దమనిషి. 

 

పాపిష్టి డబ్బు కోసం ప్రాణాలు తీయడవా?! నా వల్ల కాని పని. ఇట్లాంటి అలోచన వినేందుకు ఛాన్సిచ్చినందుకే  నా మీద  నాకు కోవం  వచ్చింది. బక్కోడి కోపం ఎవడికి లెక్క! బండి పట్టుకుపోయాడా  సెల్వరాజు.  

 

ఇంట్లో కమల ఒహటే మొత్తుకోలు. విషయం దానికి తెలీదు. దాని దాకా రానీయకూడదనే అనుకున్నా. 

 

అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా జీవితంలో! ఎట్లా తెలిసిందో తెలిసింది! సెల్వరాజుగాడే కొంపకొచ్చి దాని చెవులూ  కొరికినట్లున్నాడు. ఇదేం చెప్పిందో ఏమో.. ఒక్క రోజులోనే బండి తాళం చెవులు ఇంట్లో అప్పగించిపోయాడు! వేరే దగ్గర తీసుకుని బాడుక్కి నడిపించుకున్న బండిని  ఓనరుకు అప్పగించి ఇంటికి రాంగానే.. ఇంటి ముందు మళ్లా బ్యాంకోళ్ళ బండి ప్రత్యక్షం!

 

ఆ రాత్రి కమల పీకిన క్లాసు ఇంకా చెవుల్లో గింగురుమంటానే  వుంది. 'పెద్దాళ్లు.. ఎట్లా చెబితే అట్లా వినుకోవాలి గదయ్యా! యాభై వేలు మొత్తం ఒకే సారి ఈ జనమలో  మనం కళ్లజూస్తామా! బండినీ తనే ఇడిపిస్తానంటున్నాడాయా  సారు!  ఈ మొత్తం బ్యాంకులో వేసుకుంటే రేపు పిల్లదాని చదువుకో, పెళ్లికో అక్కరకొచ్చును గదా!  పాడు పనులు.. మంచి పనులు అని లెక్కేందీ కలికాలంలో! ఏదీ  చేయంది ఎవడయ్యా సుద్ధంగా బతకతా ఉండాదీ..!’

  

'పాడ్డబ్బు కోసం పండంటి మనిషి ప్రాణాలు తియ్యమంటావేంటే!  ఏందే! నీక్కూడా ధన పిశాచం ఎక్కించి పోయినట్లున్నాడే ఆ సెల్వరాజుగాడు. చూస్తా చూస్తా  ప్రాణాలు తియ్యడం నా వల్లయే పని కాదులే. ఆ తల్లెవరో గాని.. ఆమె ఉసురుపొసుకోడం నేను కల్లో కూడా చెయ్యలేని నీచప్పని.. ' అంటూ  ఎగురుతుండే సరికి గమ్మునుండి పోయింది కమల. 


ప్రయత్నం చాలించుకుందనే అనుకున్నా. తను చాలా మొండిది. బాత్ రూమ్ కడిగే ఏసిడ్ తాగింది తెల్లారి. ఆసుపత్రిలో.. పోలీసోళ్లతో  పెద్ద రభసయింది. 

 

కేసు కూడా అయివుండేదే! సెల్వరాజన్న పూనుకున్న మీదట ఆ గండం తప్పింది. 'విరోచనాల మందు అనుకుని అధాట్న ఏసిడ్ తాగినట్లున్నా’ అని కమల చేత  చెప్పించుకుని..  రికార్డు చేసుకొని గప్ చిప్ అయిపోయారు పోలీసోళ్లు. 

 

'.. ఆళ్ల చేతుల్లో ఐదేలు పోస్తే కాని పనవలేదురా బచ్చాగా  .. తెలుస్తుందా నీకు లోకం తీరు? చట్టాన్ని రక్షించోల్సినోళ్లే  ఇట్లా అమ్ముడవుతావుంటే .. నీకే ఇంకా నీలుగుళ్ళు!' అంటూ దెప్పిపొడిచాడీ సెల్వరాజు ఆ మధ్యాహ్నప్పూటొచ్చి కూర్చుని. ఆడి టైమ్ మరి!

 

కష్టాన్నుంచి గట్టెక్కించినందుకు అతగాణ్ణేమీ గట్టిగా  అన్లేని పరిస్థితి. ఇట్లాంటి పిచ్చిపని చేసినందుకు కమల మీదే పీకల్దాకా మండుకొచ్చింది. చేసిం దానికి అదేమీ బాధపడ్డంలే. 'ఈసారి నిజంగానే ఛస్తా! పిల్లదాన్ని ఎట్లా సాక్కుంటావో సాక్కో  నువ్వొక్కడివే సచ్చినాడా!' అని బెదిరించింది పైపెచ్చు!

 

పిల్ల మాట వచ్చే సరికి నేనూ కాస్త చచ్చుపడ్డా. పెళ్లయిన పదేళ్లకు రెండు కాన్పులు పోయింతరువాత పుట్టిందీ పార్వతి. అమ్మ బతికుండగానే తన పేరు పెట్టించుకుంది  దానికి. అందుకే అదంటే నాకు ప్రాణం. పోయిన అమ్మను దాన్లోనే చూసుకుంటున్నా. దాని కళ్లు తడయినా నేను తట్టుకోలేను. దానికీ బామ్మంటే అట్లాగే  ప్రాణం. ఇద్దరూ స్నేహితురాళ్లకు మల్లె ఇంట్లో కలివిందం చేస్తుండేవాళ్ళు పద్దాకా. 

 

అమ్మ పోయినప్పుడు పార్వతిని సంబాళించడం చాలా కష్టమయింది. అన్నం నీళ్లూ మానేసి అదే పనిగా బామ్మా .. బామ్మా .. అని  ఏడుస్తుంటే ఏమవుతుందోనని చాలా బెంగపడ్డాం నేనూ, కమలా. 

 

పిల్లదాని ధ్యాస మళ్లించడానికని  అది ఎప్పట్నుంచో  కలవరిస్తున్న 'ఫిష్ ట్యాంక్'  ఓటి కొనిచ్చాను.  దాన్లోని మూడు  చేపలకూ మూడు పేర్లు పెట్టుకుని తెగ మురిసిపోయిందీ పార్వతి. బోండాంలా నల్లగా ఉండే చేప నేను. సన్నగా బులుగ్గా ఉండి చురుగ్గా కదిలే చేప దాని అమ్మంట. మధ్యస్తంగా గోధుమ రంగులో మందంగా కదిలే చేపకు తనకు ఇష్టమైన బామ్మకు గుర్తుగా  'బామ్మ ఫిష్' అని పేరు పెట్టుకుంది పిచ్చిది.  ఆ 'బామ్మ ఫిష్' పార్వతికి లైఫ్ లో  స్పెషల్!

 

పిల్లదాన్ని అడ్డమేసుకుని నన్ను లొంగదీసుకుంది కమల ఎట్లాగైతేనేం. బండి బకాయిలు కట్టుకోలేని అశక్తతా.. ఇప్పటి దాకా కట్టిన పెద్ద మొత్తం కూడా కారణమై ఉండొచ్చు! బండి సొంతమవుతుందని, కొంత సొమ్ము పిల్లదాని మంచి జీవితానికి   తోడవుతుందన్న ప్రలోభం కూడా నన్ను ఈ పాపం చేయడానికి పురికొల్పిందేమో.. తెలీదు! ఏమైతేనేం, సుబ్రహ్మణ్యంసారు మొదటి భార్యను మాయంచేసే ప్రణాళికలో నా వంతు పాత్రకు సిద్ధమయ్యా చివరికి. 

 

మూడు రోజులు  గడువుపెట్టాడు బ్యాంక్ సారు. ప్లానూ తనదే. చల్లంగా ఆచరించడం ఒక్కటే నా వంతు. 


సారు  భార్య ఫొటో చూపించాడు సెల్వరాజు. ఆమెకు ప్రతీ శుక్రవారం మారేడుపల్లిలోని సంతోషీమాత గుడికెళ్లి  అమ్మవారి దర్శనం చేసుకోవడం అలవాటంట. దర్శనం అయిందాకా మంచినీళ్లు మినహా  మరేదీ ముట్టుకోరంట.. తల్లి. ఆ యమ్మను  గుడికి తీసుకెళ్లే  ఆటోవాలాలా తనను ఏర్పాటు చేస్తాడంట  సారు! వెళ్లి తిరిగొచ్చే లోపు .. అమ్మ  కూడా తెచ్చుకునే మంచినీళ్ల సీసాలో సార్ సప్లై చేసే 'మందు' నేగ్గా కలపడం..! అదొక్కటే  తన వంతు  భాగం. 

 

‘మందు’ అంటే  అది మామూలు మందు కాదు. కంటికి తాగే నీళ్లలానే కనిపించినా బొట్టు గొంతులో దిగితే చాలంట.. అయిదారు నిమిషాల్లోనే ప్రాణం తీసే రకం! ఎక్కణ్ణుంచి అట్టుకొస్తారో ఇట్లాంటి దరిద్రాన్నంతా! ఆ తల్లి నీళ్ళు తాగి పై మీద స్పృహ తప్పితే.. ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలో  కూడా ముందే ఏర్పాట్లవీ అన్నీ పక్కాగా చేసి పెట్టాడు బ్యాంకాయన! చూసే డాక్టర్లు, నర్సులు.. కేసు రాసుకుపోయే పోలీసులు.. అందరూ .. అన్నీ ముందే పకడ్బందీగా  ఏర్పాటయినట్లు చెప్పి  ఇంటికొచ్చి మరీ భరోసా ఇచ్చిపోయాడు సెల్వరాజు. కమలకు నమ్మకం కలిగించడం పెద్ద కష్టం కాలే. నా నమ్మకాలతో ఎవరికీ పనే లే. పనులన్నీ చకచకా జరిగిపోయాయి. 

 

ఆ ఏర్పాట్లలో భాగమే ఇప్పుడిట్లా  సుబ్రహ్మణ్యం సార్ ఇంటికొచ్చి సగం పైకం అడ్వాన్సుగా పుచ్చుకోడం. ఇవాళ బుధవారం. గురువారం దాటుకుని.. శుక్రవారం నాటికి పని పూర్తయితే  పూర్తి సొమ్ము చేతికందుతుంది. 

... 

సెల్ అదే పనిగా మోగుతుంటే ఈ లోకంలోకొచ్చిపడ్డా. కమల గొంతు. కంగారుగా అరుస్తావుంది. 'ఫిష్ ట్యాంకులోని బ్రౌన్ చేప చచ్చిపోయిందయ్యా! పిల్లది ఇంటి కొస్తే మళ్లా పెద్ద సీనవుద్ది. ఉన్నపళంగా ఇంటికి రా! వచ్చే దారిలో అచ్చంగా అట్లాంటిదే కాలీషా షాపులో ఉంటది.. తీసుకురా! పిల్ల రావడానికి ఇంక గంటే టైముంది!' అని గోల. 

బ్రౌన్ ఫిష్ అంటే పార్వతి దృష్టిలో 'బామ్మ ఫిష్'. దానికేదైనా అయితే నిజంగా పసిది తల్లడిల్లడం ఖాయం. పిల్ల బడి నుంచి ఇంటి కొచ్చేలోపే తను చేపతో ఇంటికెళ్లాలి. వెళ్లి తీరాలి. 

 

స్టేషన్ దగ్గరున్న కాలీషా ఆక్వేరియం దుకాణానికి వెళ్లా. అదృష్టం బావుండి.. బ్రౌన్ కలర్ చేప పిల్ల దొరికింది. ఇంటికొచ్చి దాన్ని ఫిష్ ట్యాంకులోకి వదిలిందాకా  ప్రాణం పింజం పింజం అంటానే  ఉండింది. 

 

పార్వతి అవడానికి అయిదేళ్ల పిల్లే అయినా, దాని గ్రహణశక్తి అమోఘం. భామ్మ  ఫిష్ కనపడలేదంటే అది చేసే యుద్ధం అంతా ఇంతా కాదు. 

పిల్లలకూ, పశుపక్ష్యాదులకూ ఎందుకో అంత లంకె!

 

బడి నుంచి రాగానే పార్వతి ముందు  ఫిష్ ట్యాంక్ దగ్గరకు పరుగెత్తుకెళుతుంది. మూడు చేపలతో కాస్సేపు ముచ్చట్లు పెట్టుకుంటే గాని.. వాళ్లమ్మను నోట్లో ముద్ద పెట్టనివ్వదు. ఎప్పట్లానే ఆ రోజూ అది ఆక్వేరియం దగ్గర చేరి కబుర్లు మొదలెట్టింది. బ్రౌన్ చేపలోని తేడాని తను గుర్తుపట్టకపోవడంతో నేనూ, కమలా ఊపిరి పీల్చుకున్నాం. 

 

సెల్వరాజు ఇంటికొచ్చి ప్లాన్ గురించి ఇంకో సారి  హెచ్చరించిపోయాడు. సుబ్రహ్మణ్యంగారి భార్య తాగాల్సిన మందు ఇచ్చెళ్లడానికని వచ్చాడు చచ్చినాడు .. అదీ అసలు విషయం. 

ఎందుకైనా మంచిదని పిల్లదానికి అందుబాటులో లేకుండా బాత్ రూమ్ లో ఎత్తున దాచిపెట్టింది కమల. 

 

మనసు బా లేక కాస్త పుచ్చుకుని మంచం మీద పొర్లుతున్నా నేను. పిల్లదాని ఏడుపులకు హఠాత్తుగా మెలుకొవొచ్చేసింది. దొడ్లో నుంచి ఆ ఏడుపులు! కమల సముదాయించేందుకు నానా హైరానాపడుతోంది. 

 

బడికి వెళ్ళడానికి మారాం చేస్తుందో ఏమో! బడంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అట్లా చేయదే!  దొడ్లోకి పరుగెత్తా కంగారుగా. 

 

పెరట్లో  బావి గట్టు మీద చిందులేస్తూ  కనిపించింది పిల్ల. వంటి మీద ఒక్క నిక్కరే ఉంది. కమల చెప్పిన మాట విని షాకయ్యాను. 

బావి గట్టు మీద 'బామ్మ ఫిష్'  పడుంది. చీమలు దట్టంగా పట్టున్న ఆ బ్రౌన్ ఫిష్ ను చూసే పార్వతి ఏడుపు!  విషయం గ్రహించినట్లుంది. ఆ ఏడుపుకు, గోలకు అంతంటూ లేదు. 'బామ్మ ఫిష్ ఇక్కడెందుకుందీ? చీమలు కుడుతున్నాయి.. నొప్పిగా ఉంటుంది.. ముందు తొట్లో పడేయండి!' అంటూ ఒహటే గోల! 

నిన్న కమల బైటపారేసిన బ్రౌన్ ఫిష్ ను కాకులు ఎత్తుకొచ్చి మళ్లా బావి గట్టు మీద పడేసినట్లున్నాయ్! ఇది మేం ఊహించని పరిణామం. ఇప్పుడేం చెయ్యడం? పార్వతి తెలివిగల పిల్ల. దానికి నచ్చచెప్పటం అంత సులువైన పని  కాదు. 

 

ఏడ్చే పార్వతిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చా. ఫిష్ ట్యాంకులోని బ్రౌన్ ఫిష్ ను చూపించి 'బామ్మ ఫిష్' ఇక్కడుందమ్మా! అదేదో పిచ్చి చేప’ అని సర్దిచెప్పాలని నా తంటాలు.


'ఏం కాదు. ఇదే పిచ్చి ఫిష్! బావి దగ్గరున్నదే బామ్మ ఫిష్.  నాకు  తెలుసు బామ్మ..  ఫిష్ మీద మూడు బ్లాక్ గీతలుంటాయ్! దీనికి ఒక్కటి కూడా లేదు. నాకు నా బామ్మఫిష్షే కావాలి' అంటు కాళ్లూ చేతులు కొట్టుకుని  ఏడుస్తుంటే .. దాని సూక్ష్మ పరిశీలనాశక్తికి అబ్బురపడాలో.. రెండంటించాలో అర్థం కాని స్థితి ఆ క్షణంలో!

 

ఎంత సముదాయించినా మొండితనం మానకపోయేసరికి కమలే చివరికి రెండు తగిలించింది. 

 

పార్వతిని ఇంట్లో ఇంత వరకు మేమెవరం కొట్టి ఎరగం. మొదటి సారి పడిన దెబ్బలకు బిత్తరపోయింది పసిది. సముదాయించడానికి దగ్గర కెళితే వాళ్లమ్మని దగ్గరకే రానీయలేదు. ఆ పూటకు ఇక బడి లేనట్లే!

 

బాడుగలు పోతాయని నేను బండి తీసుకుని రోడ్డెక్కాను. పనిలో ఉన్నానే కాని మనసు మనసులో లేదు. ఆటోలో ఎక్కిన  స్కూల్ పిల్లల్ని..  వాళ్ల కేరింతల్ని చూస్తుంటే ఇంట్లో ఉన్న పార్వతే కంట్లో మెదిలింది. 


మధ్యాహ్నం ఇంటికి వచ్చేశాను మనసు ఉండబట్టలేక. ఇంటికి తాళం వేసుంది. పక్కింటి ముసిలాయన తాపీగా చెప్పాడు 'నీ పెళ్లాం పిల్లదాన్ని  తీసుకొని ఆసుపత్రికెళ్ళిందిరా! ఒకటే వాంతులు. నీ సెల్ ఏమయింది? ఎత్తడం లేదంట?'

 

సెల్వరాజుగాడు పదే పదే కాల్స్ చేస్తుంటే.. విసుగొచ్చి సెల్ ఆఫ్ చేసుకునున్నా. పెద్దాయనతో సహా ఆసుపత్రికి పరుగెత్తాను. 

 

'పాప దేనికో బాగా కలతపడింది. కంగారు పడకండి. మందులిచ్చాం. సర్దుకుంటుంది. ఈ పూటకి ఆసుపత్రిలోనే ఉండనివ్వండి. బాగుంటే రేపు డిశ్చార్చ్ సంగతి చూసుకోవచ్చు!' అన్నది డాక్టర్. 

 

ఆ రాత్రి నాకూ, కమలకు కాళరాత్రే! ఉండుండి పార్వతి మగత నిద్రలోనే 'బామ్మ  ఫిష్.. బామ్మ ఫిష్ కావాలి' అంటూ ఒకటే కలవరింతలు. 

'చిన్న చేప మీద పిల్ల ఎంతలా అనుబంధం పెంచుకుందీ!' అంది కమల దిగులు మొహంతో. 

'చిన్నదా.. పెద్దదా అని కాదు. ప్రాణం ప్రాణమే! ఆ తేడాలు పెద్దాళ్లం మనకు తెలీవు కానీ,  పిల్లలు అన్నిటినీ, అందరినీ సమానంగా ప్రేమిస్తారు. అందుకే వాళ్లలో దేవుడు ఉంటాడనేది' అంది అక్కడే ఉన్న  నైట్ డ్యూటీ నర్స్. 

 

ఏ ఉద్దేశంతో అందో కాని, నా మనసు మూలిగింది. 'సిస్టర్ అన్న మాటలో నిజం ఉంది. ఒక ప్రాణాన్ని తియ్యడం తేలికే! దాన్ని తయారు చెయ్యడం మనిషి వల్ల అవుతుందా? ఏంటేంటో సాధించామని చంకలు గుద్దుకుంటాం. చెట్టు నుంచి తెంపిన  పువ్వును తిరిగి  చెట్టుకు అతికించగలమా మనం!  ఒక్క పువ్వుతో సరిపెట్టుకోదు పూల మొక్క. రకరకాల పూలు పూస్తుంది. ఏ పువ్వూ మరో పువ్వును పోలి ఉండదు. విచిత్రం! ఒక పూవుకు  బదులు మరోటి ఆ పూల మొక్క కూడా మళ్ళీ తయారుచెయ్యలేదు. నిర్మించడం రానప్పుడు నిర్మూలించే హక్కు వడలాక్కోడం  ఎంత వరకు న్యాయం?' 

 

సెల్వరాజు చూపించిన సుబ్రహ్మణ్యంగారి పెద్ద భార్య ఫొటో గుర్తుకొచ్చింది నాకు.. మొహాన కాసంత బొట్టుతో! నాన్న పోకముందున్న అమ్మ అచ్చంగా అట్లాగే ఉండేది.  ఆకారం  ప్రత్యక్షంగా చూడలేదు కానీ, కనిపిస్తే రెండు చేతులూ ఎత్తి నమస్కరించ బుద్ధయేంత కళ ఆ తల్లి మొహంలో! కానీ.. నేను.. చేయబోతున్న  పనేంటి..? లీటరు నీళ్లల్లో ఒకట్రొండ  బొట్లు విషం కలిపి చంపెయ్యబోతున్నాడు!   ఒక పూల చెట్టును  సమూలంగా కూల్చబోతున్నాడు! 

 

నిజానికి నా కంత అవసరం కూడా లేదు. బండి ‘సీజ్’ చేస్తే బాడుగకు వేరే బండి నడుపుకునే శక్తి ఉంది  ఇంకా బాడీలో! ఒక తల్లి ప్రాణం పీల్చేసి  పోగేసుకున్న  సొమ్ముతో బిడ్డను పెంచి ప్రయోజకురాలును  చెయ్యాలన్న ఊహే భయానకంగా ఉంది! కమల కంటె ఇంగితం లేదు. మరి అమ్మ జీవితమంతా తీర్చిదిద్దిన  తన  సంస్కారం ఏ గంగలో కల్సినట్లు!' .. రకరకాల ఆలోచనలతో ఎట్లాగో  తెల్లారింది. 

 

పిల్ల కాస్త సర్దుకోడం ఊరట కలిగించే విషయం.  మందులవీ రాసిచ్చి భద్రంగా చూసుకోమని హితవు చెప్పి పిల్లని డిశ్చార్జ్ చేసింది డాక్టరమ్మ. 

 

పార్వతి దొడ్లోకి పోయినప్పుడు కలత పడకుండా బావి గట్టును శుభ్రంచేసింది కమల. మొహం కడుక్కునే వేళ పిల్ల మౌనంగానే ఉంది. ముభావంగా అయితేనేం.. పుస్తకాలు భుజాన వేసుకుని బడికి తయారయింది. పిల్ల తొందరగానే సర్దుకుందని తేలికపడ్డాం నేనూ కమలా!

 

బండి  బైటికి తీస్తుంటే సెల్వరాజు నుంచి కాల్.. ‘శుక్రవారం' అని గుర్తు చేయడానికనంట! 

కమల ఇచ్చిన సెల్వరాజ్ గాడి  మందు బాటిల్ అందుకొని  నిశ్శబ్దంగా ఆటో స్టార్ట్ చేశా.  


ముందు అనుకున్న విధంగానే సార్ ఇంటి ముందు వెయిటింగ్! సార్ పిలిచాడు నన్ను చూసి రోడ్డు మీద కొచ్చి. అమ్మ తాగే నీళ్ల సీసా ఆయన్దగ్గరే ఉండిందిప్పుడు! ప్లాన్ మార్చినట్లున్నాడు. తన కళ్లెదుటే 'మందు'  నీళ్లలో కలిపించాడు. చేతిరుమాలుతో సీసాను  తుడిచి  సీట్లో పెడుతుండంగా ఆ తల్లి ఇంట్లో నుంచి బైటకొస్తూ  కనిపించింది. 


కంచి పట్టుచీరె, పసుపు చందనాలు అలదిన ముఖం, కాసంత ఎరుపు రంగు బొట్టు.. హారతి పళ్లెంలో పూజా సామాగ్రితో  గుమ్మం మెట్లు దిగి  వచ్చే ఆ  ఇల్లాలు ముఖ వర్ఛస్సు .. అచ్చంగా  మంగళ గౌరీ వ్రతం చేసుకునే రోజుల్లోని మా అమ్మనే  గుర్తుకు తెచ్చింది.   చిరునవ్వులు చిందిస్తూ వచ్చి ఆటోలు సర్దుక్కూర్చునే ఆ  తల్లి వెనకనే  స్కూలు యూనీఫారంలో ఓ  ఐదేళ్ల పాప.. పార్వతి వయసుదే! 


బండిలో కుదురుకున్న తరువాత కూతురితో ఆ  తల్లి  వాత్సల్యం ఉట్టిపడే స్వరంతో అనునయంగా అంటున్నది 'సాయంకాలం  స్కూల్ నుంచి వచ్చేసరికల్లా  నీకిష్టమైన జిలేబీలు  చేసుంచుతారా కన్నా! అన్నీ నీకూ.. ఒక్కటి  నాకు!  డాడీకి  ఆ  ఒక్కటి కూడా   ఇవ్వొద్దు. ఓకేనా!  ఇక మా ఇంచక్కని పాప అమ్మకు  టాటా చెప్పేస్తుందటా!'  అంటూండగా  ముద్దులు మూట గట్టే ఆ పాప గలగలా  నవ్వుతో తల్లికి టాటా చెప్పేసింది. 


అక్కడే నిలబడ్డ  సార్ నా వంక చూసి  సైగ చేసాడు ఇహ  'కదల' మన్నట్లు.  ఆటో ముందుకు ఉరికించక తప్పింది కాదు నాకు. 


ఆటో సగం దూరం పోయి బస్టాండ్ మలుపు తిరుగుతుండగా ఆ తల్లి  తాగడానికి సీట్లో పడున్న  నీళ్ల బాటిల్ మూత తీసింది. 


అప్పటి దాకా  జారి పోయే గుండెను చిక్క పట్టుకోడానికి చాలా  ట్రయ్ చేశా. నా వల్ల కావడంలా! పార్వతి ప్లేసులో ఆ పాప .. ఆ పాప ఫేసులో పార్వతి! 

'తల్లీ ! ఒన్‌ మినిట్' అంటూ     నేను నెమ్మదిగా తల వెనక్కు తిప్పి  చెప్పడం మొదలు పెట్టా..  మొదట్నుంచీ సుబ్రహ్మణ్యం సారు సెల్వరాజు ద్వారా వేసుకొచ్చిన  ప్రణాళికను గురించి  పూసగుచ్చినట్లు!

ఆలకిస్తున్నది ఆ తల్లి! మొహంలో ఏ భావమూ   లేదు! ఏమి జరిగినా ఫలితం అనుభవించేందుకు   సిద్ధపడే పెద్దవాళ్ల  కుటుంబ  వ్యవహారంలో  తలదూర్చింది. పార్వతికి బామ్మఫిష్ ఎట్లాగో సారుగారి పాపకు ఈ తల్లి అట్లాగా! ముందు ముందు ఏం జరగనున్నదో.. నాకు   తెలీదు.. ఆ క్షణంలో! 

--- 

కమల అందించిన మందు  సీసాలో అసలు 'మందే'  లేదని ఊహించనే  లేదు! బైల్దేరేముందు ఆ దరిద్రాన్ని  మురిగ్గుంటలో పారపోసి సీసా  కుళాయి నీళ్లతో నింపిచ్చిందని ఇంటికొచ్చిం తరువాత ఆ పిచ్చిది చెబితేనే తెలిసింది. 'నీ వాలకం నాకు తెల్దా! ' ముందు నుంచీ నీ మీద నాకు  డౌటేనయ్యా! మీయమ్మ నిన్ను బాగా చెడగొడ్డేసినాది. నీకు చెడ్డ పనులు చెయ్యటం చస్తే చేత రాదు. ఎటొచ్చీ  నేనే దెయ్యాన్ని' అంది కమం నీళ్లు నిండిన కళ్లతో. 

తరువాతో రోజు బస్టాండు దగ్గర సెల్వరాజు కల్సినప్పుడు 'మంచి  దావతియాల్రా  బయ్ నువ్వు!  కిస్తీలు సారే  కట్టుకుంటానన్నాడు ఏం మాయ చేసినవో ఏందో కానీ! బేఫికర్ నువ్ బండి నడుపుకో ఇంక! లోన్‌ క్లియర్ కాంగానే పేపర్లు నేనే తెచ్చిస్తా!' అన్నాడు నవ్వుతూ. 

కర్లపాలెం హనుమంతరావు

07 - 04-2021

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...