Sunday, December 12, 2021

పెద్దలకూ పరీక్షే! -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సంపాదకీయం - 17:03:2013

 

పెద్దలకూ పరీక్షే!

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయం - 17:03:2013

విద్య ధనం. అక్షయం.  ఓ దీపం. మనిషికి అదే ప్రకాశం, వికాసం అందించే ఉత్తమ సాధనం.  విద్యార్థిని వినయం, యోగ్యం, ధర్మం, సుఖం వరిస్తాయి కాబట్టే అందుకు కారణభూతమైన విద్య అతి ప్రధానం, విశ్వవర్ధనంగా కూడా గురుస్థానం పొందింది. 'శ్రుతుల తత్వార్థ సంహితలెల్ల బఠియించి/ స్మృతుల నానార్థ సంగతులు చదివి' ప్రజ్ఞతో సర్వజ్ఞత సంతరించుకున్నాడు బాలగౌతముడు. నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని, అఖిలాస్త్ర శస్త్ర రహస్యాల్ని సొంతం చేసుకున్న ఆ రాజనందనుడు 'సిద్ధార్థ' 'తంత్రవాదనముల యంతస్సారమూహించి/ మంత్రవాదమ్ముల మర్మమరసి' సమస్త విద్యాఫలాల మధురిమనీ ఆస్వాదించినవాడుగా తయారయాడు. సూచక, వాచక, బోధక మార్గాలతో పాటు అలలూ గాలులూ శిలలూ వూయలలూ, లేళ్లూ సెలయేళ్లూ ఎన్నో గురువులై పాఠాలు నేర్పాయా బాలకుడికి! అంతకుముందు ప్రహ్లాద కుమారుడూ 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ' అంటూ కుశాగ్రబుద్ధిని చాటుకున్న ఘటన గుర్తుకొస్తుంది విద్య ఘనతను గురించి తలిచినప్పుడల్లా. అకార ఉకార మకారాలతో రూపుదిద్దుకున్న బీజాక్షరం 'ఓం'తో మొదలైన అక్షరాభ్యాసం కూసువిద్యగా మారడమే కాలక్రమ పరిణామం. శ్రవణం, మననం, జ్ఞానం, ధ్యానం తదితరాలన్నీ అందులోని భాగాలే. 'చదివిన సదసద్వివేక చతురత గలుగున్' అని ప్రస్ఫుటపరచిన పోతనకవి చదువుల తల్లిని స్తుతించిన వైనం కూడా హృదయానందం కలిగిస్తుంది భావించుకున్న ప్రతీ సందర్భంలోనూ. 'శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార' అంటూ రసవాహినిలా కొనసాగిన ఆ అక్షరధారామృతంతో సరస్వతమ్మకు అభిషేకం  చేసి పునీతుడయాడు పోతన. పుస్తక ధారిణిగా విజ్ఞాన ధనాన్ని, వీణాపాణిగా లలితకళా వికాసాన్ని మానుష జాతికి ప్రసాదించిందా చైతన్య స్వరూపిణి. ధారాప్రవాహానికి, కాంతి కిరణ ప్రసరణానికి ఆది దేవతగా నిలిచిన ఆమే విద్యాధరీ వాగీశ్వరీ సకల సంపత్తులకీ అధినేత్రి కూడాను!

 

'తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్' అనడంతోనే, మన మనోమందిరమంతటా ఆ విద్యామయి నిండురూపమే నిండుతుంది. అక్షరలక్షల భావ సంపదను ప్రసాదించే అంతటి శక్తిసంపన్న సుస్థిర స్థానం కవిగాయక వైతాళిక హృదయపీఠిక మీదనే. సారస్వతపుర సామ్రాజ్యమైనా, సంగీతామృత సాగరమైనా ఆ దేవేరి కనుసన్నలలోనే తొణికిసలాడేది. అగణిత పదయుతగ,  అద్భుత పదనుతగ వెలుగొందే ఆమే వాణీ గీర్వాణీ వివేక మూలకారిణీ. 'చతురాశ్రమములు నీ జీవనసూత్రం/చతుర్వేదములు నీ పావనగాత్రం/చతుర్థామముల హృది వీధిని వినిపించినది నీ సమతానాదం' అని కవిగళం చతురమతి ప్రస్తుతి చేసింది కూడా అందుకే. సత్యమే సాహిత్యం, సౌభ్రాత్రమే మిత్రం, సౌశీల్యమే జీవం, స్వాతంత్య్రమే దైవం అయినప్పుడు జీవితమంతా జయమూ శుభమే సహజంగా. ఎప్పుడైనా ఎక్కడైనా సారవంతమైన మనోభూముల్లోనే కదా చదువు సేద్యం సుభిక్షమయేది! శ్రమరక్షణ, క్రమశిక్షణ, సమవీక్షణలే గురుదక్షిణలైన వేళలో దాశరథిలా 'తల్లీ భారతి వందనం/ నీ ఇల్లే మా నందనం/ మేమంతా నీ పిల్లలం/ నీ చల్లని ఒడిలో మల్లెలం' అని ప్రతి ఒక్కరి మదీ పరవశించి పాడదా మరి! భవంతి ఎంత మహోన్నతంగా ఉన్నా, దాని ఉనికికి పునాదే ఆధారం. ఆ రీతిలోనే, జీవితంలో సమున్నత స్థాయికి చేరేందుకు ప్రధానం- చదువూ, అది అందించే ఉపాధీ. చదువుసంధ్యలు మనిషికి మూడో నేత్రం, జీవనానికి గౌరవపాత్రం. మనిషి పుట్టేది మంచిని పెంచేందుకే అయితే చదువు నేర్చేది ఉత్తమత్వాన్ని పెంపొందించుకునేందుకే. ఆ ఉన్నత ఉత్తమత్వమే ఉదాత్తతకు రహదారవుతుంది. కానీ 'రసజ్ఞతా స్థితిన్ పొందగలేని విద్య పరిపూర్ణత నిచ్చునె, శాంతి నించునే' అన్న గరికిపాటి ప్రశ్నకు సమాధానమేదీ? 'అందరికీ అందడం లేదు సరే, అందినవారలకైనగాని ఏ/మందినదందులోని పరమార్థ విశేషము?' అని ఆ కవే సంధించిన మరో ప్రశ్నాస్త్రానికీ బదులు రావాలి ముందు. చదువుల సుమపరిమళాలు అన్నిటా అంతటా గుబాళిస్తేనే, ఆ ఆస్వాదనలో మానవాళి పులకిస్తేనే కృతార్థత, సార్థకత. చదివినంతసేపూ ఆసక్తి ఉన్నప్పుడు, చదివింది పరీక్షల్లో రాసేంత శక్తి నిండినప్పుడు భావిపౌరులైన ఏనాటి బాలలైనా రేపటి చీకటి రాసే నవకాంతుల శుభోదయాలే అవుతారు మరి! విద్య అన్నది ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే పడి ఉండిపోయే జడపదార్థమేమీ కాదు. అదో సత్తా, సత్తువ, శోధన, సాధన. వాటిని ఫలప్రదం చేసేందుకే శిక్షణలూ.. పరీక్షలూ.

ప్రకృతి ఒడే అందరికీ బడి కావాలి.  లిఖితమైనా, మౌఖికమైనా, మరోటైనా అక్కడి ప్రతీ పరీక్షా మరో పరీక్షకు పునాదే అవాలి. ఆశాభావమంటూ ఉండాలే కానీ, ప్రతి అవకాశం ఒక్కొక్క సదవకాశమయి తీరక మానదు. ఓ ఆధునిక కవిగళం పలికినట్టు 'గడిచిన గతాల గోతులు తవ్వి/ నీతులు వెతికి కోతలు అతికి/ చరిత్రకు పూతలు గతికి/ అచ్చేసిన కాగితాలు బతుకుల్ని ఉద్ధరించవు!'. పిల్లల మనసులన్నీ అప్పుడే సాగుకు సిద్ధంచేసిన ఏరువాక భూముల్లాంటివి. ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి మొక్కలే అక్కడ మొలకెత్తేది. అందుకే అక్కడంతా విజ్ఞాన బీజాలతో వికాస ఉద్దీపన దుక్కిదున్నుడులా చేపట్టాలి. . ఎవరికి వారుగా నిలవాల్సిందే, ఎప్పటికప్పుడు గెలవాల్సిందే ఈ జ్ఞానరణ క్షేత్రం. 'పూటపూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పిచే మేను తల్లడిల్ల/ బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారు మైదీవ క్రుంగిపోవ/ తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధ నరయలేరె' అన్న నరసింహ కవి ఆక్రోశాన్నీ తలచుకున్న మరుక్షణాన పెద్దల మదిలో ముందుగా మెదిలేదేమిటి? ఒత్తిడిని చిత్తుచేసే, 'తులాభారాల'ను దూరంచేసే చదువనే చదువు. అతి సవాలు కాని, అసలు సమస్యే ఉండని, కత్తిమీద సాము కానే కాని పరీక్షే నిజమైన పరీక్ష. నేటి పరీక్షలూ వాటిలో ఉత్తీర్ణతలూ పిల్లలకా, పెద్దలకా అన్న పోటీ ప్రశ్న ఉదయించని శుభక్షణం కోసమే ఆలోచనాపరులందరి నిరీక్షణ!

(ఈనాడు , సంపాదకీయం ,17:03:2013)

_____________________________________


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...