మెట్రోపాలిటిన్ నగరాలలో 24 గంటలూ వాహనాల రొద. అందరి ఆందోళన గాలిలో తగ్గే నాణ్యత గురించే. పక్షి కూజితాలను గురించీ విచారించవలసిన అగత్యం ఉంది.
పక్షి కూతలో ఓ లోతైన సందేశం ఉంటుంది. ఉభయ సంధ్యలలో పశ్చిమాద్రి చాటుకు అరుణ చక్రం తరలి వచ్చి వెళ్లే వేళ కోయిలమ్మ వంటి పక్షులు వినిపించే పంచమ స్వరాలు వింటుంటే నిర్వచించలేని ఒక మధురానుభూతి కలగడం సహజం. కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలంగా ఆ అనుభవంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
కోవిడ్-19 రుగ్మత వాతావరణాన్ని ఆసాంతం కలుషితం చేసి పక్షికూతల పైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమోనని వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రారంభంలో భయపడ్డ మాట నిజమే! విశిష్ట పక్షి శాస్త్రవేత్త సలీం అలీ తాను మునపటిలా వివిధ పక్షుల స్వరాలు వింటూ దివ్యానుభూతికి లోనయ్యే అవకాశం భవిష్యత్తులో ఉంటుందో ఉండదో అని ఆందోళన పడ్డారు కూడా! కానీ పక్షి కూతల విషయంలో ఈ ప్రభావం అందరం భయపడ్డటట్లు ప్రతికూలంగా కాక, అనుకూలంగా ఉండటం.. విచిత్రం.
సాధారణంగా వాతావరణ కాలుష్యం చాలా అధిక శాతంలో ఉండే ఢిల్లీ, ముంబై, చెన్నయ్, బెంగుళూరు వంటి నగరాలలో పక్షుల కూతలు గతంలో కంటే ఇప్పుడు చాలా స్పష్టంగా, శ్రావ్యంగా వినిపిస్తున్నాయంటున్నారు. కోవిడ్- 19 నివారణలో భాగంగా లాక్-డౌన్ చర్యలు చేపట్టడంతో వాహనాల సంచారం బాగా తగ్గడం; మానవ సంబంధమైన ఇతరేతర కార్యకలాపాలకు చెందిన శబ్దాలూ క్రమంగా అణగారిపోవడం కారణాలు కావచ్చు. అందుకు తోడు వాయు కాలుష్యంలో ప్రధాన పాత్ర పోషించే విమానాల రాకపోకలు మీదా నిషేధాజ్ఞలు కఠినంగా అమలు కావడం ధ్వని కాలుష్యంలో గణనీయమైన మెరుగుదలను సూచిస్తున్నది. కాకపోతే హఠాత్తుగా జరిగే పర్యావరణ మార్పులు అనుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా జీవజాతులకు మేలు చేయవన్నది జీవశాస్త్రవేత్తల భావన.
మానవ కార్యకలాపాలు మళ్లీ పుంజుకునే క్రమంలో.. మార్పులకు లోనయ్యే శబ్దకాలుష్యం కారణంగా జంతువులకు, పక్షులకు మళ్లీ కొత్త సమస్యలు తలెత్తకుండా శ్రద్ధ పెట్టదం ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాల్! ప్రకృతికి సహజంగానే సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు 'తనకు తానుగా నిలదొక్కుకునే శక్తి' ఉంటుంది. ఆ విశిష్ట శక్తి మీద దెబ్బపడకుండా దిద్దుబాటు చర్యలు ఉండాలి’ అన్నది జీవశాస్త్రవేత్తల అభిమతం. అహ్వానించదగినది.. ఆచరించదగ్గది ఈ ఆలోచన.
జీవితాలలో సంభవించే ఆటుపోట్లను నివారించడంలో మనం ఎట్లాగూ తరచూ విఫలమవుతున్నాం. కనీసం అవి సృష్టించే మానసిక ఒత్తిడుల నుంచి సాంత్వన పొందేందుకైనా ప్రకృతి ప్రసాదించే వరాలనూ కాలదన్నుకోవడం ఏమంత తెలివైన పని! పక్షుల కువకువలు వింటుంటే మనసులోని మాలిన్యం తాత్కాలికంగా మరుగునపడుతుంది. కాస్తంత ఉపశమనం కలగుతుంది. ఏడ్చే బిడ్డ చేతికి తల్లి అందించే తాయిలం వంటిది పక్షి కూజితం.
కోవిద్ -19 విస్తరణ నివారణ దిశగా ప్రభుత్వాలు తీసుకునే ముందస్తు చర్యల వల్ల వాతావరణలో ప్రస్తుతానికి హర్షించదగిన తేటదనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మనిషి ఆలోచన, ప్రవర్తన, ప్రాథాన్యతల క్రమంలో కూడ మునపటంత వత్తిడి తగ్గి కొంత కుదురు కనిపిస్తోంది. మంచిదే! కానీ ఈ మార్పు తాత్కాలికమన్న సంగతి మరుగునపడకూడదు. పక్షుల స్వరాలలో కూడా ప్రస్తుతం కనిపిస్తున్న స్పష్టత, శ్రావ్యత తాత్కాలికం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నదే ప్రకృతి ప్రేమికుని అభిలాష.
లాక్-డౌన్ ఎత్తివేసే కొద్దీ నగర వాతావరణంలో తిరిగి వాహనాల రాకపోకలు పెరగడం ప్రారంభం అవుతుంది. ఆ కారణంగా పెరిగే వాతావరణ కాలుష్యం మళ్లీ పశుపక్ష్యాదుల మీద పూర్వపు దుష్ప్రభావం చూపించకుండా ఏం చేస్తే సబబుగా ఉంటుంబో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
గాలిలో తగ్గే నాణ్యత, పక్షుల కూతలలో పెరిగే స్పష్టత, శ్రావ్యతలు రెండూ పరస్పరాధారితాలని ఈ సరికే మనం గుర్తించాం. రెండూ కరోనా వైరస్ మహమ్మారి తెచ్చిపెట్టిన మార్పులలో అంతర్భాగమే. వాయు కాలుష్య కారకంగా ఉనికిలోకి వచ్చిన కరోనా మహమ్మారి అంతమయ్యే నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల పై చిలుకు ప్రాణాలు గాలిలో కలవనున్నాయన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రస్తుత అంచనా. కోటికి కేవలం ముఫ్ఫై లక్షలకు మాత్రమే తక్కువ! ఇంత భారీ ఎత్తున ఏ ఉత్పాతమూ ప్రపంచవ్యాప్తంగా మనిషికి మృత్యుపాశంగా మారిన దాఖలాలు గతంలో లేవు.
కోవిద్-19 సంబంధిత మరణాలన్నిటికీ శ్వాస సంబంధమైన సమస్యలే ప్రధాన కారణం. కనుక ఆ మృతుల ఉనికిలేమి కారణంగా వాతావరణంలో కలిగే అనుకూల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకొనక తప్పదు. కొంత అమానుషత్వం ధ్వనించినా.. శాస్త్రీయ వాస్తవాలకు భావోద్వేగాలతో నిమిత్తం ఉండదన్నది ప్రాథమికి వైజ్ఞానిక సూత్రం. ఆ సూత్రం సారాంశం ఆధారంగా దిద్దుబాటు చర్యల ప్రణాళికలు వేసుకుంటే ప్రకృతి తన సహజ స్వభావంతో కోలుకునే సమయం తగ్గించవచ్చన్నది జీవశాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది.
లాక్-డౌన్ సమయంలో మన కలతజీవితాల మధ్య చెవులలో అమృతం పోసి సాంత్వన కలిగించిన కోయిలమ్మ కుహూఁ కుహూఁ రావాల మధుర స్మృతులు మరుగున పడకూడదన్నదే దానాదీనా చివరగా చెప్పుకొచ్చే ముఖ్యమైన అంశం. ఉభయ సంధ్యలలో మధుర గాయని కోయిలమ్మ ప్రసాదించే సుస్వరాల సువర్ణావకాశాన్ని మనం ఎన్నటికి వదులుకోరాదన్నది సారాంశం.
ప్రభుత్వ వర్గాలు తరచూ గాలిలోకి వదిలే కోవిద్- 19 తాజా ముందస్తు జాగ్రత్తల వివరాల కన్నా కోయిలమ్మ పాటలోనే మన మనసుల్ని మేలుకొలిపే లక్షణం స్పష్టంగా వినిపిస్తుంది.
ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. కోయిలమ్మ వెళ్లిపోతే దాని కూజితం మళ్లీ వినరాదు మరి.
- కర్లపాలెం హనుమంతరావు
06 - 09- 2021
బోధెల్ ; యూ.ఎస్.ఎ
***
No comments:
Post a Comment