Monday, June 15, 2015

పాముమంత్రం- కథానిక





'రెడ్డి ఆసుపత్రి' ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది. ఆలోచనలు గతంలోకి మళ్ళాయి.
ఇరవైయ్యేళ్ళ కిందటి మాట. అప్పుడు నేను ఇప్పుటి పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా చెరువుపల్లిలో బ్యాంకుమేనేజరుగా పని చేస్తుండేవాణ్ణి.
ఒక రోజు రాములమ్మ అనే ఆడమనిషి లోను కావాలంటూ పాముబుట్టతో సహా బ్యాంకుకొచ్చింది.'దొరగారు ఒక ఐదువేలిప్పిస్తే ఇంకో రెండు పాములు కొనుక్కుని ఆడించుకుంటానయ్యా!' అని ప్రాదేయపడింది.
రూల్సు ప్రకారం పాములు కొనుక్కోవడానికి లోను ఇవ్వడం కుదరదు. పోనీ.. ఇంకేదన్నా వేరే దారిలో సాయం చేద్దామన్నా.. రాములమ్మ పేరున ఇదివరకే తీసుకున్న లోను మొండిబకాయిల్లో ఉంది. 'ముందు పాతబాకీ చెల్లించు! అప్పుడు చూద్దాం' అన్నాను. ఇప్పుడిచ్చే అప్పులోనుంచే ఆ బాకీ చెల్లబెట్టుకోండయ్యా!' అంది గడుసుగా. బైటికి కనిపిస్తున్నంత అమాయకురాలు కాదనిపించింది. రెడ్డిచేత పాముబుట్ట లోపల పెట్టించి 'పాత కిస్తీలు వడ్డీతో సహా చెల్లించి బుట్ట పట్టుకు పో' అని బెదిరించి పంపించేసాను. 'రేపు బాషాను పంపిస్తా! లోనెట్లా ఇవ్వరో చూస్తా!' అని శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది రాములమ్మ.
'ఈ బాషా ఎవరు?!'
రెడ్డి చెప్పాడు ' హెడ్ కానిస్టేబులయ్యా! చాలా ఏళ్ళబట్టి ఈడనే ఉండాడు.' రెడ్డి గొంతులో తిరస్కారం.
చెరువుపల్లి చాలా చిన్నవూరు. నీళ్ళూ నిప్పులు సరిగ్గా ఉండవు. ఇక్కడ సర్వీసంటే పనిష్మెంటుకిందే లెక్క. ఏం బావుకుందామని బాషా ఈ ఊరినే అంటిపెట్టుకుని బల్లిలా వేల్లాడ్డం?!' ఆ మాటే అడిగితే రెడ్డినుంచి సరిగ్గా సమాధానం రాలేదు. మాట దాటేయడాన్నిబట్టి 'చెప్పటం ఇష్టం లేదేమోలే' అని వూరుకుండిపోయాను.
తరువాత క్యాషియర్ గుప్తా చెప్పాడు 'బాషా రాములమ్మని వదిలి ఉండలేడులే సార్! ఈ రాములమ్మ ఎవరో కాదు. మన రెడ్డి పెళ్ళామే.. ఇప్పుడాట్టే ఇద్దరికీ పొసగడం లేదు కానీ'.
నోరు వెళ్ళబెట్టడం నా వంతయింది. పాముబుట్ట లోపల పెడుతున్నప్పుడు చూడాలి.. రెడ్డి, రాములమ్మల మధ్య జరిగిన యుద్ధం. విడిపోయిన మొగుడూ పెళ్ళాలుతప్ప మరొకరు అంత ఘోరంగా కొట్లాడుకోరు.
బాషాని గురించి ఇంకొన్ని వివరాలు చెప్పాడు గుప్తా. 'బాషాకి ఇట్లాంటి యవ్వారాలు చాలానే ఉన్నాయి సార్ ఈ చుట్టు పక్కల ఊళ్ళలో! షాపుల్లో సరుకులు కొని డబ్బులు చెల్లించడు. హోటల్లో భోజనంచేసి బిల్లు కట్టడు. డబ్బడిగినవాళ్ళను ఏదో కేసులో ఇరికించి స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తాడు. ఎస్సైకూడా ఈయనెంతంటే అంతే. ‘ఎందుకొచ్చిన గొడవలే’ అని ఎవరూ ఈయన జోలికి వెళ్లరందుకే. మన రెడ్డి బాధా అదే!' అన్నాడు.
'పైవాళ్ళ కెవరికన్నా కంప్లైంట్ చేసి ఉండాల్సింది' అన్నాను.
''అదీ అయింది సార్! ఊళ్ళో రెండు గ్రూపులు. ప్రెసిడెంటుది. మాజీ ప్రెసిడెంటుది. ఒకళ్ళు ఎడ్డెమంటే.. రెండో వాళ్ళు తెడ్డెమంటారు'
'ఇదేం తిరకాసు? ఒక వంక మంచివాడు కాదంటుంటిరి. మరో వంక ట్రాస్ఫరాపుతుంటిరి!'
నా ఆశ్చర్యాన్ని అర్థంచేసుకున్నట్లుంది.. మరో కొత్త విషయం చెప్పుకొచ్చాడు గుప్తా 'బాషాకు పాముమత్రం వచ్చు సార్! ఎట్లాంటి పాము కొట్టినా వీడు మంత్రమేస్తే విషం విరుగుడై పోతుంది. ఊళ్లో చాలామంది వీడి చలవ్వల్లే లేఛి తిరుగుతున్నారు. ఎస్సై కొడుకుని బళ్ళో కట్లపాము కొడితే.. క్షణాల్లో ఆ విషాన్ని దించేసాడు బాషా. అందుకే ఈ ఎస్సై ఉన్నంత కాలం  ఎవరూ బాషా వెంట్రుక్కూడా కదప లేరు. అది మాత్రం గ్యారంటీ!' అని తేల్చేసాడు గుప్తా.
చెరువుపల్లి రేగడి ప్రాంతం. పొగాకు ప్రధాన పంట. అట్లాంటి చోట పాములు, తేళ్ళు తిరగడం సహజమే. అయితే అన్ని పురుగుల్లోనూ విషముండదు. ఇండియాలో ఉండే రెండువేల రకాల్లో విషంగలవి కేవలం తొమ్మిది జాతులే. విషంలేని పురుగు కుట్టినా మందో మాకో వేసి, చెవులో ఏదో మంత్రం ఊదేసి తగ్గించినట్లు నాటకాలాడే మాయగాళ్లూ మనదగ్గర తక్కువేం లేరు. చదువుకున్నవాళ్లూ అమాయకత్వం వల్లనో.. అజ్ఞానం వల్లనో ఇలాంటి దొంగమంత్రగాళ్లనే నమ్ముకుంటున్నారు! పాముకాటు మరణాల్లో అధికశాతం  కాటువల్ల సంభవిస్తున్నవి కాదు. పాము కాటేసిందన్న షాకువల్ల జరుగుతున్నవి. పాములకు పగ పట్టడం తెలీదనీ, పాలు ఆహారం కాదనీ, వినడానికి చెవుల్లాంటి ఏర్పాట్లేవీ ఉండవనీ చెబితే చదువుకున్నవాళ్ళైనా నమ్మని పరిస్థితి దాపురించివుందీ దేశంలో.

ఎక్కడ దాకానో ఎందుకు? ఇక్కడ ఈ గుప్తా లేడూ! 'ప్రెసిడెంటుని పంచాయితీ ఆఫీసులో పాము కాటేసినప్పుడు బాషా వచ్చి పాంమంత్రంతో లేపి కూర్చోబెట్టాడు సార్!  నా కళ్ళారా చూసాను. దానికేమంటారు?' అంటూ మొండివాదనకు దిగాడు ఈయన. ఏం చేస్తాం?
మర్నాడు బాషా నిజంగానే బ్యాంకు కొచ్చాడు. గుబురు మీసాలు.. బానబొర్ర.. మొహమంతా స్ఫోటకం గుంటలు. మాటా కరుకే. అంతకుముందున్న దురభిప్రాయం మరింత బలపడేటట్లుంది వాలకం. 'రాములమ్మ యాడికీ పోదు. నాదీ గ్యారంటీ. కావాలంటే  సంతకం తీసుకో! లోనుమాత్రం ఇచ్చితీరాలప్పా!'- అదీ అతగాడు అప్పు అడిగే తీరు!
మీ సంతకం కావాలంటే మీ పై వాళ్ళ పర్మిషనుండాలి గదా! ముందది తీసుకురండి. తరువాత చూద్దాం!' అన్నాను.
'అట్లాగా!' అంటూ గుడ్లురుముకుంటూ లేచి నిలబడ్డాడు బాషా. 'ఆడకూతురు పాంబుట్ట ఏ అథార్టీతో లోపల పెట్టుకున్నారప్పా! ముందది బైటకు తియ్యి!' అంటో పోలీసుజులుం ప్రదర్శించబోయాడు. 'బ్యాంకు డబ్బుల్తో కొన్న సరకది. అప్పు తీరిందాకా బ్యాంకుకు అధికారం ఉంటుంది. వాయిదాలు సక్రమంగా లేకపోతే సరుకు బిగపట్టుకునే అధికారం అప్పు తీసుకున్నప్పుడే రాములమ్మ బ్యాంకుకి రాసిచ్చింది. మీ కంత జాలిగా ఉంటే  బకాయిలు చెల్లించి బుట్ట పట్టుకుపోవచ్చు. మీరూ సంతకం చేసారుగదా అప్పుడు! మీకూ బాధ్యత ఉంటంది' అన్నాను. కాస్త వెటకారంకూడా ద్వనించిందేమో నా మాటల్లో.
బాషా కోపంగా బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకాలే రాములమ్మ శాపనార్థాలు పెట్టుకుంటూ..
'లోనివ్వడానికి డబ్బుల్లేవనో.. రూల్సు ఒప్పుకోవనో చెప్పచ్చు కదా సార్! వాడసలే మంచోడు కాదు' అని భయపడ్డాడు రెడ్డి.
రెడ్డి భయానికి కారణం లేకపోలేదని తరువాత తెలిసింది. ఇంతకు ముందు మేనేజరుగా చేసిన శర్మ ఇలాగే లోను ఇవ్వనని మొండికేశాట్ట. తరువాత  రెండు రోజులపాటు వరసగా బ్యాంకు ఆవరణలో పాములే పాములు! 'లోనిచ్చి బాషాను చల్లబరిస్తేగానీ 'సర్ప దర్శనం' ఆగింది కాద'ని రెడ్డి చెప్పుకొచ్చాడు.
ఇయర్-ఎండింగ్ పనుల వత్తిడిలో పడి ఆ సంఘటనను అక్కడితో మర్చిపోయాను.
మార్చినెల చివరి వారం. బ్యాంకులో ఉన్నది నేనూ.. రెడ్డీనే! ఆదివారం కనక స్టాఫు ఎవరూ బ్యాంకువైపుకి రాలేదు.  రెగ్యులర్ అటెండర్లు డ్యూటీ ప్రకారమే పని చేస్తారు. రెడ్డిది ప్రొబేషనరీ జాబు. కాబట్టే నాకు తోడుగా బ్యాంకులో ఉంచడానికి వీలయింది.
పని ధ్యాసలో పడి ఎప్పుడు చీకటి పడిందో గమనించనే లేదు. వేసవికాలం. కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో ఎవరమూ చెప్పలేం. నూనె దీపాలు సిద్ధం చేసి పెట్టమని రెడ్డికి పురమాయించి నా పనిలో మునిగిపోయాను.

ఉన్నట్లండి కెవ్వున కేక! రెడ్డిదే ఆ వణికే గొంతు! స్టోరు రూమునుంచి! ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తాను. నురుగులు కక్కుతూ పడివున్నాడు రెడ్డి స్టోర్రూములో! బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. 'ఏమైంది రెడ్డీ?' అనడిగితే వేలితో పాముబుట్టవైపు చూపించాడు. బుట్టమూత సగం తెరిచివుంది! బుట్టలో ఉండాల్సిన రెండు పాములూ లేవు!
గభాలున వంగి రెడ్డి పాదాలవంక చూసాను.  రక్తపు బొట్టు! రెడ్డిని పాము కాటేసిందని అర్థమవడానికి ఆట్టే సమయం పట్టలేదు.
ఏం చేయాలో పాలుపోలేదు. నిజం చెప్పద్దూ! ఆ క్షణంలో నాకు ముందు గుర్తుకొచ్చింది బాషానే! ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. నిజమేగానీ.. ఇరవై కిలోమీటర్ల పైగానే ఉందది ఎక్కడో  ఆత్మకూరులో. బ్యాంకు బైకు రిపేరులో ఉంది. ట్రాక్టర్లాంటిదేమన్నా దొరకాలన్నా సమయం పడుతుంది.
రెడ్డి కండిషన్ చూస్తే నిమిష నిమిషానికీ దిగనాసిల్లిపోతోంది. ఏవైతే అదవుతుందని పోలీస్టేషనుకు ఫోను చేసా. రింగయీ.. రింగయీ.. చివరికో ఆడగొంతు వినిపించింది. నిద్రమత్తులో ఉన్నట్లుంది. ఎక్కడో విన్నట్లే ఉంది ఆ యాస.
ఠక్కుమని గుర్తుకొచ్చింది. రాములమ్మ గొంతు! అంత చీకటివేళ ఆ ఆడమనిషికి స్టేషన్లో  పనేమిటో?! అదీ స్టేషనుకొచ్చే ఇన్-కమింగ్ కాల్సు రిసీవ్ చేసుకునేటంత చొరవా! వెనకనుంచి ఎవరిదో మగగొంతు.. ప్రామ్టింగిస్తున్నట్లు!
విషయం చెప్పి ‘బాషా కావాల’ని అడిగాను గబగబా. 'లేడు. డూటీలో ఉన్నాడు' అని కట్ చేసింది అవతలి మనిషి. మళ్ళీ ఎన్నిసార్లు ప్రయత్నించినా రింగవడమేగానీ.. ఫోన్ ఎత్తలేదు! మనిషెవరన్నా దొరికితే స్టేషనుకు పంపిద్దామని బాంకు బైటికొచ్చాను. క్షణాల్లో బ్యాంకుముందు జనం పోగయ్యారు. తలా ఓ మాట. 'దాహం..దాహం' అని అంగలారుస్తున్నాడు రెడ్డి. ఎవరో నీళ్ళు ఇవ్వబోతే పెద్దశంకరయ్య అడ్డంగొట్టాడు 'పాంకాటు పడ్డోడికి నీళ్ళిస్తే ప్రమాదం. కడుపులోకేదీ పోకూడదు. కంటిరెప్ప కిందికి వాలకూడదు' అంటూ రెడ్డి పక్కనచేరి చెంపలమీద తడుతూ కూర్చొన్నాడా పెద్దాయన.
ఇంతలో బాషా రానే వచ్చాడు. వంటిమీద వట్టి లుంగీ. పైన బనీను. డ్యూటీలో ఉండే మనిషి యూనీఫాం ఇదేనా?! ఏదో ఒకటి. ముందు వచ్చాడు. అదే పది వేలు.
వచ్చీ రాగానే వైద్యం మొదలు పెట్టేసాడు బాషా. సంచీలోనుంచి ఏదో వేరులాంటిది తీసి బలవంతంగా రెడ్డి బుగ్గలో దోపాడు. కాటుపడ్డ చోటికి కాస్తపైన తాడుతో బలంగా కట్టేసి కాల్చిన కత్తితో గాయాన్ని బాగా పెద్దది చేసాడు. రక్తం బొటబొటా కారిపోతుంటే బాధతో రెడ్డి విలవిల్లాడిపోతున్నాడు.
మంత్రించిన పొడిని రెడ్డి పడున్న రూములో వలయంగా చల్లించి 'పురుగులు రెండూ ఈడనే ఏడనో నక్కుంటాయి. వెదకండి కానీ కర్రల్తో కొట్టద్దు. పాములు చస్తే రెడ్డి బతకడు' అంటూ హుకుం జారీ చేసాడు.
ఒక సుశిక్షణ పొందిన వైద్యుడిలాగా బాషా తన పని తాను చేసుకుంటూ పోతుంటే నమ్మబుద్ధి కాలేదు నాకు. 'వట్టి బూటకం అని కొట్టిపారేసే ఈ నాటువైద్యం వెనకకూడా ఇంత పెద్ద తతంగం ఉందా!'అని నా ఆశ్చర్యం. చుట్టూ చేరిన జనాన్ని దూరంగా
జరగమని రెడ్డి చెవులో పాముమంత్రం ఊదడం మొదలుపెట్టాడు బాషా. దగ్గరే ఉన్నాను కనుక నాకు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి '..మహావీర గరుడ.. సమస్త సర్ప.. నివారణా.. దుష్ట..  సర్పబంధన… కురు.. కురు.. ' అని ఇలాగే ఏవో గొణుకుళ్ళు!  ఇంకా ఏవేవో శబ్దాలు రణగొణగా వినిపిస్తున్నాయిగానీ వాటిని గురించి ఆలోచించే స్థితిలో లేను నేను.
ఎక్కడో చదివినట్లు గుర్తు.. పాముమత్రంలో బీజాక్షరాలు ఉండవంట! బాషా ఎంత మంత్ర తంత్రాలతో గింజుకుంటున్నా రెడ్డిమీద వాటి ప్రభావం సున్నా. క్షణక్షణానికీ దిగనాసిల్లుతున్న రెడ్డిపరిస్థితిని చూస్తూ దిగులుగా కూర్చోవడం మినహా నేను చేయగలిగింది ఏమీ లేదే అని నా దుగ్ధ. ఇప్పట్లోలాగా అప్పట్లో ‘ఒన్ నాట్ యైట్లు’ .. ‘ఒన్ నాట్ ఫోర్లు’ లేవు!
తెల్లవారుతుండంగా ఎవరో రావినూతలవారి ట్రాక్టర్ని పట్టుకొచ్చారు. దాంట్లో రెడ్డిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించేసరికే ఆలస్యమైపోయింది.
డాక్టర్లు ఎంత పోరాడినా రెడ్డి ప్రాణాన్ని కాపాడలేకపోయారు.
విషంకాటుతో నల్లబడ్డ రెడ్డిశవాన్ని చూడటానికి ఊరు ఊరంతా తరలి వచ్చారు. రెడ్డి పదేళ్ల కొడుకుచేత కర్మకాండ జరిపించింది రాములమ్మ.
*                     *                   *           
కులాచారం ప్రకారం జరగాల్సిన తంతులన్నీ అయిన తరువాత  పదిరోజులకు రెడ్డికుటుంబానికి బ్యాంకునుంచీ రావాల్సిన పరిహారం  ఇప్పించడంకోసం రాములమ్మను పిలిపించాను.
రాములమ్మ అవతారం చూసి ఆశ్చర్యపోయాను. ‘రెండువారాల కిందట లోనుకోసం వచ్చి యాగీచేసిన మనిషేనా ఈమే! ఈ కాలంలోకూడా ఇలా భర్త పోయినతరువాత శిరోముండనం చేయించుకునే భార్యలున్నారా!’ ఉసూరుమన్నది ప్రాణం.
పత్రాలమీద వేలుముద్రలేస్తూ భోరుమని ఏడ్చేసింది రాములమ్మ. ఇంత చిన్నవయసులో ఆమె కొచ్చిన కష్టం సామాన్యమైనదా!
మొగుడూ పెళ్లాలనుకున్న తరువాత అప్పుడప్పుడు ఏవో కీచులాటలు తప్పవు. కలసి ఏడడుగులు నడిచి జీవితంలో కొంతదూరం గడచివచ్చిన జంటలు ఏవేవో కారణాలవల్ల విడిపోతే విడిపోవచ్చు. కానీ మనస్సుల్లోని ఆ పాత మధురస్మృతి పరిమళాలను వదిలించుకోవడం అంత తేలికా!
రాములమ్మ సంగతి ఎలా ఉన్నా రెడ్డి మనస్తత్వం నాకు బాగా తెలుసు. చాలాకాలంగా దగ్గర్నుంచి పరిశీలించినవాణ్ణి.
ఆ రోజు రాములమ్మ పాముబుట్టను లోపల పెట్టమని పురమాయించినప్పుడు రెడ్డిముఖం  చూడాలి.  పెళ్ళాంమీద ఎంత ప్రేమ లేకపోతే అంతలా బాధపడతాడు!
'పాముల్ని ఆడించుకుంటూ పొట్టపోసుకునే ఆడదయ్యా అది! జీవనాధారాన్నట్లా లాగేసుకుంటే పిలగాడిని సాక్కునేదెట్లా సామీ? సారుకి మీరే ఎవరైనా చెప్పండి! పాముల్ని  తిరిగి ఇప్పించండ'ని బ్యాంకు స్టాఫు దగ్గర తెగ మొత్తుకున్నసంగతి అప్పట్లోనే చూచాయగా తెలిసింది నాకు.
రెండు మూడు కిస్తీలన్నా బాషాచేత కక్కించి పాముల్ని తిరిగిచ్చేద్దామని నా ఆలోచన. రాములమ్మ పేరుతో తీసుకున్న లోను డబ్బులు వాడుకుంది బాషానే అని రెడ్డి రెండు మూడుసార్లు నా దగ్గర వాపోయినట్లూ గుర్తు. ఇంతలోనె ఇలాగయింది! అసలు ఆడించుకునే పాములకి విషపు కోరలు తీసేస్తారని విన్నాను. మరి రెడ్డి పాముకాటువల్ల ఎలా చనిపోయినట్లు?
రాములమ్మే అడిగిందో? పెళ్లాంబిడ్డల బాధ చూడలేక తనే అనుకున్నాడో? పాముల్ని విడిపించాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు చాలాసార్లు స్టోరురూములో తచ్చాడాడు రెడ్డి. బుట్టలోని పాముల్ని చీకట్లో తప్పించి భార్యకి ఇచ్చేయాలనుకున్నట్లున్నాడు పిచ్చిరెడ్డి! కోరలింకా తీయని పాములు అవని తెలీక మొత్తానికి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడా ప్రేమికుడు.. పాపం!
రెడ్డి దుర్మరణానికి నేనూ ఒకరకంగా కారణమేనా? పాముమంత్రంతో ఎంతోమందిని గట్టెక్కిచ్చానని గొప్పలు చెప్పుకునే బాషా రెడ్డిని ఆ గండంనుంచి ఎందుకు బైటపడేయలేక పోయినట్లు? మంత్రగాడిగా బాషా సిన్సియారిటీని అనుమానించాల్సిన పని లేదు. ఒక్కఫోన్ కాల్ కే పక్కలోని రాములమ్మనికూడా పట్టించుకోకుండా పరుగెత్తుకొచ్చాడంత రాత్రి పూట! ఆ మంత్ర తంత్రాలు.. నాటు వైద్యం యాగదీక్షతో చేసాడు.
లోపం ప్రయత్నంలో ఎంతమాత్రం లేదు. ఏమన్నా ఉంటే గింటే.. ముందునుంచీ అనుమానిస్తున్నట్లు ఆ మంత్ర తంత్రాల్లోనే ఉండి ఉండాలి!
ఇన్ని తెలిసీ.. మరెందుకు రెడ్డిని పాము కాటేసిందని తెలియగానే నాకూ ముందు బాషా   మంత్ర తంత్రాలే గుర్తుకొచ్చాయి?! వెంటనే సరైన చికిత్స అందించే సౌకర్యం అందుబాటులో ఉండుంటే నేనీ బాషాను కనీసం బ్యాంకులోకి కూడా అడుగు పెట్టనిచ్చుండే వాణ్ణి కాదు. అందులో మాత్రం అనుమానం లేదు.
నాలాగా ఇంకెందరో? నమ్మకం లేకపోయినా ఇలాంటి మంత్రగాళ్ల చేతిలో విలువైన ప్రాణాలు పెట్టేవాళ్ల సంఖ్య తగ్గాలంటే  వెంటనే నేను చేయాల్సిన పనేమిటి? బాషాలాంటి మాయగాళ్లను తరిమి కొట్టాలి.
తరువాత?!
పదిరోజుల తరువాత బ్యాంకు కొచ్చిన బాషానే ఆ ప్రశ్నకు సమాధానం అందించాడు. రాములమ్మ పాతబాకీ పూర్తిగా చెల్లించి పోవడానికి వచ్చి  'పెనుగొండ బదిలీ అయింది సార్! ఫ్యామిలీ అక్కడే ఉంది. వెళ్ళిపోతున్నాను' అన్నాడు.
ఈసారి ఎవరూ ఆపే ప్రయత్నం చెయ్యలేదు కాబోలు!
'లేదు. నేనే రిక్వస్టు పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. నేను పోయినా నాలాంటి మాయగాడు ఇంకెవడో పుట్టుకొస్తాడు. జనం మళ్లా వాళ్లనే నమ్మి మోసపోతుంటారు. ఇట్లాంటివేవీ లేకుండా ఉండాలంటే ఇక్కడే ఒక మంచి ఆసుపత్రి రావాలి సార్! అదీ నా రిక్వెస్టు' అన్నాడు పోతూ  పోతూ.

ఇప్పుడు చెరువుపల్లిలో ప్రారంభమవుతున్న రెడ్డి ఆసుపత్రికి అలా అప్పట్లోనే ఆలోచనాబీజం పడింది.
‘ఆలోచన సరే! మారుమూల పల్లెల్లో లాభాపేక్ష లేకుండా వైద్యమందించే క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా ఈ వ్యాపారయుగంలో?
‘ఉన్నార’ని నిరూపించినవాడు రెడ్డి కొడుకు. స్కాలర్షిప్పులమీదైనా సరే  వైద్యం చదువుకుంటే తండ్రి పేరుమీదనే ఓ మంచి ‘ఆసుపత్రి’ పెట్టుకోవచ్చని అప్పట్నుంచీ అతగాడిని ప్రోత్సహించి సహకారమందించింది నేనే.
ఇప్పటికైనా ‘రెడ్డి ఆసుపత్రి’ కల సాకారమవుతున్నందుకు సంతోషంగా ఉంది.
   
                                                                                                                                       
-కర్లపాలెం హనుమంతరావు
















Sunday, June 14, 2015

తెలుగోడి తెలుగ్గోడు!- సరదా చర్చ



 తెలుగు కోతులు  
టెలుగు వినను
టెలుగు కనను
టెలుగు అనను


రుగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ ఒకడు. పురాణమో, పుక్కిటపురాణమో.. ఒక లెక్కప్రకారం ఆంధ్రులంతా విశ్వామిత్ర మహర్షి సంతానమే. విశ్వామిత్రుడు విశిష్టిమైన వ్యక్తి. గురువునుమించి ఎదగాలన్న తపన  ఆయనది. ఎన్నో ఉద్యమాలకు ఆయన  స్ఫూర్తిప్రదాత.  సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరవిధాత. త్రిశంకుస్వర్గనిర్మాత. గాయత్రీమంత్ర ఆవిష్కర్త. వంకాయ, టెంకాయ, గోంగూరవంటి విడ్డూరాలన్నీ ఆయన ప్రసాదాలే.  తెలుగువాడికి అందుకే అవంటే అంత ప్రీతి. దీక్ష.. కక్ష తెలుగువాళ్లందరికీ విశ్వామిత్ర మహర్షినుంచే వారసత్వపు లక్షణాలుగా సంక్రమించాయేమోనని అనుమానం.  
రామాయణంలోని కిష్కింధ  ఆంధ్రదేశంలోని ఓ అంతర్భాగమేనని  వాదన ఉంది. ఆ లెక్కన మనమందరం కిష్కింధవాసులమే! అన్నదమ్ముల మత్సరం వాలిసుగ్రీవులనుంచి అబ్బిన జబ్బేమో! వాయుపుత్రుడి లక్షణాలూ తెలుగువాడికి ఎక్కువే మరి!
స్వామిభక్తి తెలుగువాడికి మరీ విపరీతం. స్వామికార్యం తరువాతే వాడికి ఏ స్వకార్యమైనా. ఆరంభశూరత్వం, అత్యుత్సాహం ఆంధ్రుల గుత్తసొత్తు. చూసి రమ్మంటే కాల్చి వస్తేనే వాడికి తృప్తి! కొమ్మ తెమ్మంటే కొండను  పెకలించుకొచ్చాడంటే వాడు కచ్చితంగా తెలుగువాడే. ఆ రావడంలోకూడా ఆలస్యమవడం వాడి ప్రత్యేక లక్షణం. కోటిలింగాలు తెమ్మని రాములువారు  ఆజ్ఞాపిస్తే ఆంజనేయులుగారు ఏమి చేసారు? ఒకటి తక్కువగా తెచ్చుకొచ్చారు! ఆర్భాటంగా మొదలుపెట్టి అసంపూర్తిగా చుట్టబెట్టడం తెలుగన్నకు  మొదట్నుంచీ అలవాటే!  స్వశక్తియుక్తులు మరొకడు పనిగట్టుకొని పొగిడితేగాని గుర్తెరగలేని బోళాతనం తెలుగువాడిది. సముద్రాలు లంఘించే శక్తిగలిగివుండీ ఏ స్వామివారి పాదాల చెంతో విశ్రాంతి కోరుకోవడం తెలుగువాడికి అనాదిగా వస్తున్న బలహీనత.
'తెలుగువాడివి అన్నీ అవలక్షణాలేనా?' అని ఉసూరుమనుకోవాల్సిన అవసరం లేదు.  వనవాసంలో రామసోదరులను ఆదరించిన శబరితల్లి తెలుగుతల్లే! చేసిన ఘనకార్యం  చెప్పుకొనే  సంప్రదాయం  అప్పట్లో లేదు. ఇంకెంతమంది కడుపునింపిందో  ఆ అన్నపూర్ణమ్మ తల్లి అందుకే మనకి తెలీదు. తెలుగుమహిళకు భోజనం వడ్డించడమంటే మహాసరదా కదా! పేరుకే అన్నపూర్ణమ్మ  కాశీనివాసి. అసలు మసలేదంతా మన తెలుగునేల నలుచెరగులే కదా! డొక్కా సీతమ్మలు, మంగళగిరి బాలాంబలు అడుగడుక్కీ తారసిల్లే పూర్ణగర్భలండీ తెలుగురాష్ట్రాలు రెండూ!
ఉద్యమమైనా సరే.. ఉప్పు సత్యాగ్రహమైనా సరే సొంతముద్రంటూ లేకుండా తెలుగువాడు ఒక్కడుగు ముందుకు కదలడు. బౌద్ధాన్ని సంస్కరించి మరీ ప్రచారం చేసిన నాగార్జునుడు మన  తెలుగువాడే! తెలుగువాడికి కొత్తొక వింత. పాతొక రోత. అందాకా నెత్తికెత్తుకొన్న జైనం శైవంరాకతో హీనం అయిపోయింది! ఆనక వాడు  వైదికం మోజులోపడ్డాక శైవం రాష్ట్రాల  శీవార్లలోకి పాతిపోయింది!
అటు ఆర్యులు.. ఇటు ద్రవిడులు! ఇద్దరూ ముద్దే మనకు! రెండు సంస్కృతుల పండుగలు  మనం సంబరంగా చేసుకొంటాం! పోతరాజు కృష్ణుణ్ణి తెలుగుదేవుడు చేసేసాడు. రామదాసు ఇక్ష్వాకులవాసిని సతీసోదరసమేతంగా భద్రగిరికి కట్టేసాడు.  కృష్ణరాయలు పాండిత్యప్రకర్షతో రంగధాముణ్ణి తెలుగుపెళ్ళికొడుకుగా తయారుచేసాడు. పాపయ్యశాస్త్రి భక్తిప్రవత్తులకు బద్ధుడైనట్లు బుద్ధభగవానుడు తెలుగు చిరునామా స్వీకరించాడు. అందరూ కావాలనుకొనే తత్వం తెలుగువాడిది. అయినా అతగాడే ఎవరికీ అక్కర్లేదు! భారతంలో తెలుగువాడి ఊసు ఆట్టే లేకపోయినా 'వింటే భారతమే వినాలి' అంటూ టాంటాం కొట్టుకొనే రకం తెలుగువాడు!
సాహసంలో మాత్రం? మనం వెనుకంజా? తైలంగ సామ్రాజ్యాన్ని స్థాపించాం. సుమిత్రా, జావా ద్వీపాల్లో వలస రాజ్యదీపాలను వెలిగించాం. సయాడోనిసిచయాల్లాంటి సుదూర ప్రాంతాల్లో నిబద్ధతతో బౌద్ధదర్మాన్ని ప్రచారం చేసి వచ్చాం. ఈజిప్టురాణికి చీనాంబరాలు కట్టబెట్టిన ఘనత మన  తెలుగువాడిదే! అజంతా, అమరావతి, సాంచి క్షేత్రాలలో అసమాన శిల్పకళావైభవాన్ని సృజించిన కళాతపస్వి మన తెలుగుయశస్వి. ధాన్యకటక విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన గురువులు మన తెలుగువారు. మానవనాగరికత మణికిరీటంలో నిరంతరం వెలుగులు చిమ్మే కోహినూరు వజ్రాలు కదుటండీ మన తెలుగువారు!
మేధస్సులోమాత్రం మనమేమన్నా అధమస్థులమా? హైదవం క్షీణదశలో  దక్షిణాది గోదావరీతటంనుంచే మహాతత్త్వవేత్త శంకరాచార్యులు ప్రభవించించింది. స్వధర్మ పునరుత్థనార్థం జన్మించిన పుణ్యమూర్తి విద్యారణ్యుడూ తెలుగు పురుషుడే! ఆయన తోడాబుట్టిన సాయనుడు వేదాలకు  భాష్యం చెప్పిన ఉద్దండుడు.  ఉత్తరాది కావ్యాలకు  వ్యాఖ్యానాలు చేసిన మల్లినాథుడుది తెలుగునాడు. జగన్నాథ పండితరాయలు హస్తిన ఎర్రకోట  యవనసుందరి అంకపీఠంపైన తెలుగుప్రతిభను సుప్రతిష్ఠంచిన ఘనుడు.   దేశదేశాల తాత్వికకేతనం విజయవంతంగా ఎగురువేసిన తెలుగు జ్ఞాననికేతనం రాధాకృష్ణపండితుడు. అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలార్జించిన కోడి రామ్మూర్తి, సి.కె. నాయుడు, ఎల్లాప్రగడ సుబ్బారావు మన తెలుగువెలుగులేనంటే  తెల్లబోతాం మనం.
గొప్పవాళ్లెప్పుడూ తెలుగువాళ్లు కారనీ.. తెలుగువాళ్లయుంటే గొప్పవాళ్లే అవలేరనీ మన తెలుగువాళ్లకో గొప్ప నమ్మకం. బొంబాయి చేరితేగాని కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు నాలుగు కాసులు కళ్లచూడలేదు. తమిళదేశం చెప్పిందాకా  బాలమురళి గానగాంధర్వుడని  మనం ఒప్పుకోలేదు! తెలుగువాడు పైకిరావాలంటే పైకన్నా పోవాలి. దేశందాటి పైకన్నా పోయిరావాలి! ఎందుకిలా?
తెలుగువాడి వెటకారంవాడి మరీ అంత అత్యధికమా?! మహామాత  కాళీదేవత ప్రత్యక్షమయితే మరోడయితేసాగిలపడి మొక్కేవాడు. ఆమె అంగసౌష్టవంచూసి ఫక్కున నవ్వాడంటే తెనాలి రామలింగడు తెలుగువాడు కాబట్టేగా! వేలెడంత లేకపోయినా జానెడంతవాణ్ణి చూసి ‘మూరెడంతైనా లేడ’ని మూతి మూడువంకర్లు తిప్పాడంటే నిక్షేపంగా వాడు తెలుగువాడే అయివుండాలి.
.
పాకశాస్త్రంలో తెలుగింటి  ప్రావీణ్యమే వేరు. తెలుగు తాళింపు దినుసులు మరే ఇతర ప్రాంతాలలో కనిపించవు. తెలుగు వర్ణమాలా ఓ వంటింటి పోపుపెట్టె వంటిదే సుమా! సాతాళించగల చేవ ఉండాలేగాని.. తెలుగువంటకంలా తెలుగురచనా ఒక నవరసాల విందు.
గంగాజలం తెచ్చి కృష్ణ, గోదావరి, తుంగభద్రల్లో కలగలపడమే తెలుగుదనం కలివిడిదనం. తాగునీటినిసైతం ‘మంచి’నీరుగా పిలిచే మంచి నైజం తెలుగువాడి సొంతం! తెలుగుభాషకూ మంచినీరులా మేధోదాహార్తిని తీర్చే సత్తా ఉంది. శబ్దానికి  పూర్తిన్యాయంచేసే శక్తి ఇటాలియన్  తరువాత  ఒక్క తెలుగక్షరంలోనే ఉందిట! ఇది ఆధునిక భాషాశాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న మాట. కంప్యూటర్ వేగాన్ని అందిపుచ్చుకోగల 'బైట్ స్(Bytes)' సామర్థ్యం తెలుగులిపికి అలంకారప్రాయం- అని  సాఫ్టువేరు నిపుణులు వెలిబుస్తున్న అభిప్రాయం.  ఏ పలుకునైనా తనలో మంచినీళ్ల ప్రాయంగా కలుపుకోగల కలివిడితనం తెలుగువర్ణమాలకు ప్రత్యేకం.
ద్రవిడ సంస్కారి చిన్నయసూరిచేత చక్కని వచన రచన చేయించిందీ తెలుగు పలుకుబడే! తెలుగుమాట తేటతనానికి దాసోహమయే బ్రౌన్ దొర నిఘంటువు నిర్మాణానికి పూనుకొన్నది!  జిజ్ఞాసకు తగ్గ ఉపజ్ఞ తెలుగుభాషామతల్లి  ప్రజ్ఞ.
'ఆంధ్రదేశపు మట్టి.. అది మాకు కనకంబు' అని ఆ మహామహులు తలవంచినే చోటుకే  ఇప్పుడు మనం తలవంపులు తెస్తున్నాం. అదీ విచారం!
పరాయితనం భుజానమోసే ఔదార్యంలోనే తెలుగువాడెందుకో ముందునుంచీ తరించిపోతున్నాడు?! సగటు తెలుగు నాలికకు తెలుగు పదాల మాధుర్యం వెగటు?! ఆదిలో  సంస్కృతం, మధ్యలో హిందూస్తానీ, ఇప్పుడు ఆంగ్లం! వట్టి తెలుగుమాత్రమే తెలిసుంటే అది  వాజమ్మతనానికి నిదర్శనం! ‘గొప్పోళ్ళు చాలామందికి తెలుగురాదు. కాబట్టి తెలుగురాకపోవడమే గొప్పదన’మనుకొనే తెలివితక్కువతనం రోజురోజుకీ ఎక్కువవ్తుతున్నదీ తెలుగునాట! ‘విజ్ఞానమంటే కేవలం ఇంగ్లీషుమాట. పాండిత్యమంటే కేవలం సంస్కృత పదాల ఊట’. ఇదీ  ప్రతి సగటు తెలుగునోటా నేడు వినిపిస్తున్న పాట! పరాయిభాషల రుచి నోటికి పట్టాలన్నా పసిదశలో బిడ్డకు ల్లిభాష పాలు పట్టాలా వద్దా! చావగొట్టినా సొంతభాషరాని చవటకి చావచితక్కొట్టినా పరాయి భాష వంటపట్టదని భాషాశాస్త్రవేత్తలే మొత్తుకొంటున్నారు!

భోజనాలయంలోకి వెళ్ళినప్పుడు 'వాటర్' 'చట్నీ' అంటేనేకానీ వడ్డించేవాడి తలకెక్కదా?! కొట్లాట్టానికి అక్కరకొచ్చే సొంతభాష న్యాయస్థానాల్లో ఫిర్యాదులిచ్చేందుకు ఎందుకు చేదో?! రోగాలకే కాదు.. వాటి నిదానానికి  వాడే మందులకూ  నోరుతిరగని లాటిన్ పేర్లు?! రైలు, రోడ్డు, పోస్టు, సైకిలు, ఫోను, సెల్ఫోను.. నిత్యవ్యవహారంలో నలిగే కొన్ని పదాలకు ప్రత్యామ్నాయం  లేక వాడుకలో ఉన్నాయంటే..ఏదో అర్థం చేసుకోవచ్చు. పుస్తకం, కలం, ప్రేక్షకుడు, సంతోషంవంటి పదాలకూ బుక్కు, పెన్ను, ఆడియను(నిజానికి ఆడియను అన్న మాటే తప్పు), హ్యాపీసు వంటి సంకర పదాలను వాడే తిక్కసంకరయ్యలు ఎక్కువయిపోతున్నారు! భేషజంకోసం, అతిశయంకోసం పరాయిభాషాపదాలను వేలంవెర్రిగా వాడే గురజాడ గిరీశాలు తలుగునాట రోజురోజుకూ ముదిరిపోతున్నారు!  ఆత్మగౌరవం ప్రాణప్రదంగా భావించే తెలుగువాడికెవడికైనా   ఇది చివుక్కుమనిపించే  అంశం.
తెలుగుగడ్డమీద తెలుగుబిడ్డ మెడలో తెలుగు పలకను' అంటూ పలకలా?! తెలుగులో ఏడ్చిన నేరానికి పసిదాని అరచేతికి వాతలా?!
పేరుకేనా మనది ప్రజాస్వామ్యం? పాలితుడి పలుకుమీద పాలకులకెందుకో ఇంత కోపం?!  జన్మతః జిహ్వమీద కొలువైన శబ్దదేవత కదా తల్లిభాష!  జంతుతతులకన్నా విలక్షణంగా బతుకును తీర్చిదిద్దే ఆ భాషామతల్లి  అంటే తెలుగువాడికి తగునా అంత చులకన?! తల్లిమీద, తల్లిభాషమీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి?!
***
కర్లపాలెం హనుమంతరావు
(డిసెంబరు 2012 'తెలుగు వెలుగు'లో ప్రచురితం)

(ఈ వ్యాసంలో ఉపయోగించుకొన్నవి సరసి, ఒన్ ఇండియావారి కార్టూనులు. వారికి ధన్యవాదాలు)



Saturday, June 13, 2015

అగరుధూపం -కథ






ఫీసునుంచి రాగానే కాఫీతో పాటు ఉత్తరం అందించింది శ్రీమతి. కార్డు రేటు పదిహేను పైసలున్నప్పటి కాలం నాటి ఉత్తరం అది. రమణమ్మత్తయ్యది. ఒకసారి అర్జంటుగా వచ్చి పొమ్మని ఎవరిచేతో రాయించింది. బేరింగు పడిందని మా ఆవిడ ఏడుపు. "వివరంగా ఓ ఇన్లాండు ఉత్తరం రాయించుకోవచ్చుగా! పిసినారితనం కాకపోతే!... పోయేటప్పుడు అంతా మూట కట్టుకుని పోతుందికామోసు..." అంటూ అక్కసు.
ఆ మధ్య తిరుపతి పోతూ రమణమ్మత్తయ్య ఇక్కడ దిగింది. వెళ్లే ముందు నా చేతిలో ఒక డిపాజిట్ రసీదు పెట్టి దాచమంది. యాభైవేల బాండది. గడువుకింకా మూడు నెలలుంది.

కొడుకుల చేతిలో పెట్టకుండా ఇక్కడెందుకు దాచమందో అర్థంకాలేదు. అడిగితే బాగుండదని వూరుకున్నా.
"బ్యాంకులో వడ్డీ మరీ తక్కువగా వుందిరా అబ్బాయి! ఎక్కువ వడ్డీ వచ్చేదేమైనా వుంటే చూడు.. అక్కడే వేద్దాం!" అంది.
మా ఆవిడ ఊరుకోకూడదూ..! "ఆ ఎక్కువ వడ్డీ మేమే ఇస్తాం. మాకివ్వండి పిన్నిగారూ!" అనేసింది. అంతే.. రమణమ్మత్తయ్య కోపం చూడాలింక!
"అందరికీ నాడబ్బు మీదే కన్ను. నేనేమన్నా అంత ఎతిమతం దాన్లా కనిపిస్తున్నానా" అన్నట్లు మాట్లాడింది.
ఆవిడ ధోరణి నాకు తెలుసుగనక నేనేమీ మాట్లాడలేదుగానీ మా ఆవిడ మాత్రం చాలా బాధపడింది. అందుకే నేను వూరికి బైలుదేరేటప్పుడు ముభావంగా ఉంది. అయినా తప్పదు. రమణమ్మత్తయ్యకూ నాకూ ఉన్న సంబంధం అటువంటిది.
రమణమ్మత్తయ్య నాకు సొంత మేనత్త కాదు మా నాన్న సవతి తల్లి కూతురు అయినా ఇద్దరూ సొంత అన్నచెల్లెళ్ళ కన్నా అభిమానంగా ఉండేవాళ్లు. నల్లగా పొట్టిగా గుమ్మటం లాగా ఉంటుంది. రమణమ్మత్తయ్య మొగుడు పుష్కరాలకని పోయి కృష్ణలో కొట్టుకుపోయేనాటికి నట్టింట్లో నలుగురు పసికూనలు. వాళ్ళను ఆవిడ సాకిన తీరు వర్ణనాతీతం. తినటానికి ఉండటానికి కరువు లేదు. తల్లివైపునుంచి ఆస్తి వచ్చిందావిడకి. మగదిక్కులేని సంసారం. చేతిలో దమ్మిడీ లేకపోతే సంసారం బజార్నపడదా? అని ఆడభయం.
ఊళ్లో వాళ్ళకి వడ్డీకి అప్పులిచ్చేది. వసూళ్ల విషయంలో పరమ నిక్కచ్చి. 'రమణమ్మ! అమ్మో.. కాబూలీవాలా నయం' అన్న పేరు తెచ్చుకుంది. ఆమె గయ్యాళితనమూ, పిసినారితనమే ఒకరకంగా ఆ సంసారాన్ని ఆదుకుందారోజుల్లో!
ఒంటి మీదెప్పుడూ ఒకటే నీరుకావిరంగు చీరుండేది. ఖర్చని తలకు నూనెకూడా సరిగ్గా రాసుకునేది కాదు. ముప్పయ్యేళ్ళకే యాభైయేళ్ల ముసలమ్మలాగుండేది. పిల్లల్ని మాత్రం పువ్వుల్లాగా తీర్చిదిద్దేది. ఇంటినీ అంతే!
పిల్లలకు రకరకాల డ్రెస్సులు వేసేది. రంగురంగుల ముగ్గులు ముంగిట్లో తీర్చిదిద్దేది. ఆవిడకొచ్చినన్ని పిండివంటలు మా అమ్మక్కూడా రావని మా నాన్న దెప్పుతుండేవాడు. అయితే ఆ చేసినవేమీ బైటవాళ్ళకు పెట్టేది కాదు. తన పిల్లలకు జిలేబీ చేతిలోపెట్టి ఎదురుగావున్న మాకు దొడ్లోని జామకాయలు ముక్కలుగా కోసిపెట్టేది. మాకనేంటిలే.. తనూ తినేదికాదు. జామచెట్టునెక్కడ చూసినా రమణమ్మత్తయ్య గుర్తుకొస్తుంది.
"అందరికిలాగా కోరికలు తీర్చేందుకు పిల్లలకు తండ్రి లేడుగదా.. ఇక నా సంగతంటావా! ఈ పిల్లలు సక్రమంగా పెరిగితే నాకదే కోటివేలు" అంటుండేది మానాన్న లాంటి వాళ్లెవరైనా ఎప్పుడైనా ఆ పిసినారితనానికి మందలించటానికి పూనుకుంటే!
అన్నట్లు రమణమ్మత్తయ్య కథలు బాగా చెపుతుంది. భానుమతిలాగా కమ్మగా పాడుతుంది. మా ఇంటి రేడియోలో నుంచి వచ్చే పాటలకు ఆవిడ గొంతు కలిపి పాడుతుంటే వినటానికి చాలా హాయిగా వుండేది. సంగీతమన్నా, హిందీ అన్నా ప్రాణం. అస్తమానం పిల్లల్ని హిందీ చదవమని సతాయించేది. రెండో కూతురుని హిందీలో విశారద దాకా చేయించింది. ఆ అమ్మాయి ఒక హైస్కూల్లో హిందీ టీచరుగాచేరి ఒక క్రిస్టియనతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అది వేరే కథ.

"కృష్ణాష్టమికి ఎన్ని రోజులుందండీ?" అనడుగుతున్నారు బస్సులో ఎవరో. ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చిపడ్డాను. బస్సు ఒంగోలు పొలిమేరల్లోకొస్తుంది.
కృష్ణాష్టమి పేరు వినంగానే మళ్లీ మా రమణమ్మత్తయ్యే గుర్తుకొచ్చింది. ఆ పండుగ రోజు అత్తయ్య శిబిచక్రవర్తి చెల్లెలు అవతారమెత్తేది. కన్నయ్య పుట్టిన రోజు సందడంతా అత్తయ్య ఇంట్లోనే !ఇంటి నిండా ముగ్గులు వేసేది. కృష్ణపాదాలు పూజగదిలోనుంచీ వీధిమెట్లదాకా గుర్తులుపెట్టేది. చీకటి పడేలోగా చిన్ని కృష్ణయ్య ఆ గుర్తులు మీద తన పాదాలు మోపుతూ ఇంట్లో కొస్తాడని ఆమె నమ్మకం. కృష్ణుడికిష్టమని వెన్నతో చేసిన ఉండలు తయారుగా ఉంచేది. ఆ రోజు ఆవిడ చేసే ప్రసాదం, పాయసం, నేతి గారెలు తిని చూడాల్సిందే! రాత్రిపూజ పూర్తయిన తరువాత "అదిగదిగో కృష్ణయ్య వచ్చివెళ్లాడు. అడుగుల గుర్తులు కనిపించటం లేదూ?!" అని అడిగేది మమ్మల్ని. 'కనిపించటం లేద'న్నాడని ఒకసారి మా సుబ్బరాజుని అప్పటిదాకా తిన్న అప్పచ్చులన్నీ కక్కేదాకా చీవాట్లు పెట్టింది. ఆవిడ నోటికి జడిసి "అవునవును.. కృష్ణుడు వచ్చాడు. అదిగో పాదాలగుర్తులు" అనేవాళ్ళం మేం.
మరి ఆవిడ భక్తి అలాంటిది. పెద్దవాడికి కృష్ణమూర్తనీ రెండోవాడికి వాసుదేవమూర్తనీ, ఆడపిల్లలకు శ్యామల, రుక్మిణి అని పేర్లు పెట్టుకుంది. రుక్మిణి ఆ పేరుని సార్థకం చేసుకోటానికన్నట్లు ప్రేమించినవాడిని పెళ్లి చేసుకునేటందుకు ఇల్లు విడిచి వెళ్లిపోయింది.
బస్సు చీరాల చేరేసరికి దాదాపు తెల్లారిపోయింది. ఏదో ఊళ్లో ఆగి, మళ్లీ బయలుదేరే సమయానికి బస్సెక్కుతూ కనిపించాడు సుబ్బరాజు. ''అనుకుంటూనే ఉన్నా.. నువ్వివాళో రేపో దిగుతావని" అన్నాడు నా వంక అదోలా చూసి నవ్వుతూ. నా పక్క ఖాళీ ఉంటే వచ్చి కూర్చున్నాడు.
సుబ్బరాజు నా క్లాస్‌మెట్. వాళ్ళనాయన రమణమ్మత్తయ్య పొలం కౌలుకు చేసేవాడు. ఆ తరువాత్తరువాత ఊరికి ప్రెసిడెంటయ్యాడు. వీడు వాళ్లనాన్న అడుగుజాడలలోనే నడుస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్లో ఓ గీతా మందిరం కట్టించేపనిలో బిజీగా వున్నాట్ట!
"మీ రమణమ్మత్తయ్యను ఒప్పించి భూరివిరాళం ఇప్పించాలిరా! నీ మాటంటే ఆవిడకు మంచిగురంటగా... పెద్దావిడ పేరు ఫలకం మీద చెక్కిద్దాంలే!" అన్నాడు.
"నువ్వే అడక్కపోయావా? కృష్ణుడి పేరు చెబితే ఆవిడ కాదనదే.." అన్నాను నేను.
"ఆవిడకు అనుమానాలు జాస్తిరా బాబూ! అందరూ ఆవిడ ఆస్తిని కాజేయటానికే కూర్చున్నారనుకుంటుంది. అందుకే బాగా అయింది శాస్తి" అన్నాడు.
"ఏమయిందీ?"
"నీకు తెలీదా? అందుకే వస్తున్నావనుకున్నా ఇంకా. ఆవిడకు క్యాన్సరంటగా.. లంగ్ క్యాన్సర్. బాగా ముదిరిన తరువాత బైటపడ్డట్లుంది. పోయేలోపల తనచేత భారీవిరాళం ఇప్పించే పూచీ నీదే."
"రమణమ్మత్తయ్యకు క్యాన్సరని నాకు తెలీదు. మా ఊరొచ్చినప్పుడు బాగానే ఉందే!"
"మీ ఊరొచ్చిందా?" అని ఆశ్చర్యపోయాడు సుబ్బరాజు. నా దగ్గర బాండు దాచినట్లు కూడా తెలీదు వీళ్లకు. బహుశా దాని కోసమే నాకు కబురు పంపిచినట్లుంది. బాండ్ వెంట తీసుకురావటం మంచిదయింది.
"క్యాన్సరొస్తే పల్లెటూళ్లో ఏం చేస్తుంది? ట్రీట్‌మెంట్ తీసుకోదా?" అనడిగా. డబ్బు ఖర్చని వద్దందిట. "ఊళ్లో ఆచార్లే ఏదో మందిస్తున్నాడు. పెద్దాడు అలిగివేరే కాపురం పెట్టాడు. వాసు స్టేట్సులో ఉంటున్నాడాయ! పెద్దల్లుడు మంచాడు కాదంటారు. రెండో పిల్లని దగ్గరకు రానివ్వదు." అన్నాడు సుబ్బరాజు.
పిల్లల్ని పూలచెట్ల మాదిరి సాకింది. గారాబంతో పెద్దాడు చెడ్డాడు. రెండోవాడు అందకుండా పోయాడు. ఆడపిల్లలెప్పుడూ ఆడపిల్లలేగా!
ఇంటికెళ్లి చూశాక రమణమ్మత్తయ్య పరిస్థితికి జాలేసింది. లంకంత ఇంట్లో పని పిల్లను పెట్టుకుని వంటరిగా నెట్టుకొస్తుంది.
కేన్సరు తెచ్చిన మార్పు కనిపిస్తూనే ఉంది. వేదాంతం బాగా వంటబట్టింది. "ముందునుంచీ నాకు ఈ పిల్లలు తోడు లేరుగా! నా కన్నయ్యే నా వెన్నంటి ఉండి నడిపించాడు. ఆ చల్లనయ్య చల్లంగా చూస్తే చాలు..." అంది మంచంలోనుంచే.
అంత పెద్ద సంసారాన్ని అతిపిన్నవయసులోనే సునాయాసంగా ఈదిన అత్తయ్యకు ఇలా చివరిరోజుల్లో అయిన వాళ్ల అండ లేకపోవటం చూసి నాకు చాలా కష్టం వేసింది.
"మద్రాసు రారాదూ! మంచి డాక్టరుకు చూపించుకుందువుగానీ..." అన్నాను. నవ్వి వూరుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు బైటికి తీశాను. పడుతూలేస్తూ వచ్చి బ్యాంకులో బాండ్ మార్చుకుంది. 'ఇంక నేను వెళతానం'టే "ఈ ఒక్క రాత్రికీ ఉండి పోరా రాముడూ!" అంది.

ఆ రాత్రి ఎగశ్వాస... దిగశ్వాస. ఆచారొచ్చి చూసి "రాత్రి గడవటం కష్టం" అన్నాడు. అందరికీ కబుర్లు వెళ్లాయి. అమెరికాలో ఉన్న వాసు "రావటం లేటవుతుంది. అవసరమైతే అన్నయ్యనే అన్నీ కానిచ్చెయ్యమను బావా!" అన్నాడు ఫోనులో.
పెద్దాడు వచ్చాడు కానీ కదలకుండా ఒకమూల కూర్చున్నాడు. పలకరించబోతే తల తిప్పేసుకున్నాడు. నేనేదో వాళ్లమ్మని కాకాపట్టి ఆస్తి కొట్టేయాలని వచ్చినట్లు ఒకళ్లిద్దరితో అనటం నా చెవిన బడింది. నేనేం మాట్లాడలా. ఆ గొడవలకిది సందర్భమా?!
పెద్ద కూతురు వచ్చీ రాగానే ఇంట్లో సామానుల గురించి ఆరాలు మొదలు పెట్టింది. రెండో అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయిని చేసుకున్న క్రిస్టియన్ కుర్రాడు మాత్రం ఒకసారి వచ్చి వెళ్లాడు. పనిపిల్లను కుదిర్చింది అతనేనట! అతనేదో ఎన్జీవో విద్యాసంస్థలో వార్డెన్‌గా ఉన్నాడన్నారు.
మొత్తానికి రమణమ్మత్తయ్య చివరి శ్వాస తీసుకొనే వేళకి వాసు తప్ప అందరూ పక్కనే ఉన్నారు. రెండో కూతురు చివరి చూపుకొచ్చింది. కొంత నయం. కానీ ఆ తరువాత జరిగిన సంఘటనలే చికాకు పుట్టించేవిగా ఉన్నాయి.
"అమ్మ నాకొక్క దమ్మిడీ ఇవ్వలేదు. కర్మకాండలు జరిపించటమెట్లా?" అన్నాడు పెద్ద కొడుకు. "పెద్దకొడుకుగా అన్నీ చేయడం నీధర్మం" అని పెద్దకూతురూ, పెద్దల్లుడూ!
సుబ్బరాజొచ్చిందాకా చర్చలలా సాగుతూనే వున్నాయి. "బ్యాంక్‌లో నిన్ననే బాండు మార్చుకుందిటగా మరాడబ్బులేమైనాయీ?" అని వాడి ఆరాటం.
ఆఖరికి తను దాచుకున్న సొమ్ముతోనే అత్తయ్యను కాటికి పంపే ఏర్పాట్లు చెయ్యటానికి తీర్మానమయింది. ఆ డబ్బే లేకపోతే రమణమ్మత్తయ్య పని ఏమయివుండేదో?!
జీవితాంతం పిసినిగొట్టుగా బతికింది. కాట్లో కట్టెల ఖర్చు కోసమే అన్నట్లయిందామె పరిస్థితి. కర్మకాండలు ముగిసిన వెంటనే నేనూ బైలు దేరాను.
"ఇంతకాలం ఉన్నావ్. ఇంకొక్క పూట ఓపిక పట్టు. మీ రమణమ్మత్తయ్యేదో వీలునామా రాయించిందంట! బ్యాంకులో ఉంది. పట్టుకొస్తున్నారు. గీతామందిరానికే మాత్రం రాసిందో విందువుగానీ!" అన్నాడు సుబ్బరాజు కులాసాగా. నాకేదో అనుమానం మొదలయింది.

నడవాలో రమణమ్మత్తయ్య పటం ముందు కూర్చున్నారందరూ. పని పిల్ల గుప్పెడు అగరుబత్తులు తెచ్చి వెలిగించి పోయింది.
అగరుధూపం మెల్లిగా హాలంతా వ్యాపిస్తుంటే అదొకరకమైన అనుభూతి. ఈ ఇంట్లో ఈ ప్రశాంతత ఎల్లకాలమూ ఇలాగే కొనసాగితే బాగుణ్ణు! ఈ ఆస్తి పంపకాల తరువాతైనా అత్తయ్య ఆత్మకు శాంతి లభిస్తుందా? మెల్లిగా అక్కడనుంచీ తప్పుకుని దొడ్లో జామచెట్టు కింద కుర్చీ వేసుక్కూర్చున్నాను. చెట్టు నిండా చిలక్కొట్టిన పళ్లు చాలా ఉన్నాయి. వగరు కాయలకోసం పిల్లలు కొట్టుకుంటున్నారు. జామచెట్టును చూస్తే రమణమ్మత్తయ్యే గుర్తుకొస్తుంది. లోపల్నుంచీ ఏవో గోలగా మాటలు వినిపిస్తున్నాయి.
"అమ్మ మీకీ ఉత్తరమియ్యమందయ్యా!" అంటూ ఒక కవరు ఇచ్చిపోయింది పనిపిల్ల.
కవరు తెరిచి కాగితం మడతలు విప్పాను. అత్తయ్య ఎవరిచేతో రాయించిన ఉత్తరం అది... "ఇది నా స్వార్జితమైన ఆస్తి. కొంత మా అమ్మవైపు నుంచి వచ్చినా నా ఇష్టం వచ్చినట్లు పంచుకునే అధికారం ఉందని లాయరుగారు అన్నారు. నా పిల్లలకు చాలా ప్రేమనురాగాలు పంచి ఇచ్చాను. వడ్డీతో సహా అసలు కూడా వసూలయితేగానీ... మళ్లీ అప్పిచ్చే అలవాటు లేనిదాన్ని నేను. నా కన్నవాళ్లింకా నా రుణం తీర్చుకోలేదు. కనక మళ్లీ వాళ్లకేమీ ఇవ్వలేను. ప్రతి కృష్ణాష్టమి రోజూ కన్నయ్య నాకోసం నా ఇంటి కొస్తుంటాడు. ఈ సారి వచ్చినప్పుడు నేను లేకపోతే దిగులు పడతాడేమో! అది నేను భరించలేను రాముడూ! అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నానురా! ఈసారి కృష్ణాష్టమికి కన్నయ్య నా ఇంటికొచ్చే వేళకి నట్టింట్లో నేను లేకపోయినా... నాలాంటి వాళ్లింకెవరైనా ఉండాలి. కన్నబిడ్డల ప్రేమానురాగాలకు దూరమై పరితపించే నాలాంటి తల్లులు... తండ్రులూ దేశంలో కోకొల్లలు. అందులోని కొంత మందికైనా నా ఇల్లు ఆశ్రయమైతే చాలు. నాలాంటి వృద్ధులను సాకాలంటే మాటలా? ఎంతో ఓపిక... సహనం కావాలి. సేవాభావం ఉండాలి. ఈ రెండూ నా చిన్నల్లుడి దగ్గర దండిగా ఉన్నాయి. అతణ్ణి ఒప్పించి ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహించేలా చూసే బాధ్యత నీదేరా రాముడూ! ఆశ్రమనిర్వహణగ్గానూ నా దగ్గరున్న ఆస్తి బొటాబొటిగా సరిపోతుంది. సుబ్బరాజు గీతామందిరానికి ఇచ్చేందుక్కూడా ఇంకా ఏమీ మిగల్లేదు...''
లోపలినుంచి అరుపులు పెద్దవయ్యాయి. సుబ్బరాజు భుజాన కండువా వేసుకుని విసురుగా బైటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకనే మిగిలిన వాళ్లు ధుమధుమలాడుతూ! గంటలో ఇల్లంతా ఖాళీ అయింది. లోపలికి తొంగి చూస్తే..
రమణమ్మత్తయ్య ఫోటో ముందున్న అగరొత్తుల ధూపం పరిమళం గదంతా మెల్లగా అల్లుకుంటోంది. అది గది కాదిప్పుడు. వృద్ధాశ్రమం. అదే గీతా మందిరం.
-కర్లపాలెం హనుమంతరావు
*** 
ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురితం

Friday, June 12, 2015

ఇది ఇండియా.. అది ఇంగ్లాండు!- సీరియస్లీ సిల్లీ స్టోరీ

 

       
 ఇదీ ఇండియా .. ! 

దుబాయ్ కొడుకు ఉద్యోగం ఊడినందుకు దిగాలుపడ్డ అమరయ్య మంచంపట్టి ఇవాళ్టికి మూడు వారాలు.
మందిచ్చే ఆచారిగారు పెదవి విరిచి 'అయినవాళ్ళను పిలిపించుకోవచ్చు' అని హెచ్చరించిపోయారు. 

షేకుల రుణాల 'షేక్' లో షేపులు  పోయిన అమరయ్యకొడుకు కామేశ్వర్రావు తండ్రి చివరిచూపులకని దిగబడ్డాడు.. కొడుకును చూసిన ఉల్లాసంలో తండ్రి తెప్పరిల్లాడు కానీ.. కొడుకే లోడు ఖాళీఅయిన లేలాండుకు మల్లే  కళ తప్పివున్నాడు.

'ఇక్కడే ఏదన్నా పని ఉంటే చూడు బాబాయ్! ఎటొచ్చి ఎటు పోతుందో.. నాయన కర్మకాండలకైనా  చిల్లి నయాపైసా లేదు నా దగ్గర ' అని బైటపడిపోయాడు దుబాయ్ రిటర్న్డ్ కామేశ్వర్రావు.

‘నయాపైసల’దగ్గరే ఆగిపోయిన అన్నకొడుకు అమాయకత్వాన్ని చూసి జాలిపడ్డాడు బాబాయ్. ‘ఇక్కడి పరిస్థితులు అంతకన్నాఅధ్వానంగా  ఉన్నాయిరా బంగారూ! పెద్ద పెద్ద సాఫ్టువేర్లే వేర్లు తెగిన మొక్కల్లా వాలిపోయున్నారు నిన్నటిదాకా. ఇప్పుడేదో పుంజుకుంటుందంటున్నారుగాని.. నాకైతే బొత్తిగా నమ్మకం లే! ఇక గవర్నమెంటు ఉద్యోగాలంటావా? ఇదిగిదిగో.. అదేదో సెక్షన్లు కోర్టుల్లో నలుగుతున్నాయి.. ఆ లిటిగేషన్లన్నీ అటు క్లియరైపోడమే లేటు .. ఇటు  భారీ నియామకాలకు లాకులెత్తేస్తాం!' అని రెండు తెలుగు స్టేట్లూ  ఒహటే రోటి పాటలు! మనమాట వినే మంత్రెవరైనా దొరకుతారు గాని.. మంత్రిమాట వినే అధికార్లు దొరకడమే  కష్టంగా ఉందిరా సీను! సియమ్ములాదేశించినా 'నిమ్మళంగా చేద్దాంలేద్దూ' అని నిమ్మకు నీరెత్తినట్లు చిత్రాలు  పోయే అధికార్లే అధికంగా ఉన్నారిప్పుడు ! నువ్విం కాస్త పెందలాడే  వచ్చుంటే.. ఏ బై ఎలక్షన్ ప్రచారకమిటీలో  జిల్లాబాధ్యుడి కింద మండల బాధ్యుడిగా వేయుంచుండేవాణ్ణి గదరాజడవా!’ అనేసాడు బాబాయ్!
'పోనీ. కంట్రాక్టు పనులేమన్నా ఖాళీగా ఉన్నాయేమో.. అవన్నా చూడు బాబాయ్!' అనడిగాడు కామేశ్వరం.

'చేసిన పల్ల  బిల్లులకే చిల్లులబ్బీ  ఇప్పుడు! ఎర్రచందనం దుంగలు తరలించడం లాంటి దొంగ బిజినెస్లు దర్జాగానే  సాగాయిగాని మొన్నమొన్నటిదాకా. గవర్నమెంటు నిఘా మరీ గట్టి పడ్డాక .. ప్రాణాలమీద ఆశ వదులుకొంటే తప్ప  ఇట్లాంటి  కంట్రాక్టు పన్లకి దిగేందుకు లేదు.  మన కంత రిస్కు అవసరమా? అందునా  మీ నాన్నకి నువ్వొక్కడివే సుపుత్రుడివాయ!'

‘ఏదడిగినా మన సర్కోరోడికి  మల్లే ఏదేదో కథలు చెబుతున్నావేంది బాబాయ్? ఇహ నేను మాత్రం ఇక్కడ ఉండి ఊడబొడిచేదేముంది! నాన్నెట్లాగూ పిడిరాయిలా  దిట్టంగానే అరుగుతున్నాడాయ!' అంటూ వచ్చిన దారినే ఫ్లైటెక్కి   చక్కా చెక్కేసాడు కామేశ్వర్రావు.
(ఆశ -సచిత్రమాస పత్రిక ఆగష్టు 2011 సంచికలో ప్రచురితం

***

Thursday, June 11, 2015

Mahalia Jackson--How I got over LIVE


Mahalia Jackson live in Chicago a favorite of Dr. Martin Luther King Jr. Mahalia sang this at the march on washington just before King gave the I have a dream speech

Wednesday, June 10, 2015

పులుపు చావని చింత- కవితాగల్పిక








ఉదయం
మృత్యువుః
కవీ! నీ అంత్యకాలం సమీపించింది. పద. పోదాం!
కవిః
మృత్యువా?
అప్పుడే వచ్చావా!
ఇప్పుడే కదయ్యా 
ఉదయసుందరి సౌందర్య సందర్శన సౌభాగ్యం నాకు దక్కింది!
కొద్దిగానైనా వ్యవధానం ఇవ్వవా నువ్వు! మధ్యాహ్నం వస్తావా నువ్వు?








మధ్యాహ్నం
మృత్యువుః
నీ అభీష్టం మేరకే  వచ్చానయ్యా!
మరి పోదాం.. లే.. కవీ! సాకులు చెప్పకు!
కవిః
అప్పుడే వచ్చావా మిత్రమా!
ఇప్పుడేగదయ్యా  హిమావృత ఉదయరాగాలు చెదిరిపోయి
సృష్టి వైచిత్ర్యాలు ఒక్కొక్కటిగా తేటపడుతున్నవి.
ఈ విశాల వసుంధరా వలయంలోని వైపరీత్యాలన్నీ తృప్తిగా చూడనీ!
నీ ఆత్రం కూలా! చీకటి పడ్డాక కనబడవయ్యా మగడా!







సాయంకాలం
మృత్యువుః
సంధ్యాసమయం మీరిపోతుంది కవీ!
ఇకనైనా కాలు కదుపుతావా స్వామీ!
కవిః
అటు చూడు.. ఆ దిక్కున  ఎంత వెలుగున్నదో !
లోకమింకా మాటు మణగనేలేదు. తొందరేమి సామీ!
ప్రకృతి అంతా ఎంత వినూత్న శోభతో ప్రకాశిస్తున్నదీ!
ఇంత ప్రశాంతసమయాన్ని  వదిలి రమ్మనడం ధర్మమా!
పశ్చిమాద్రిపైన అరుణ దీధితులెలా లీలావిహారాలు సలుపుతున్నాయో!
ఆ ముచ్చటా తనివితీరా చూడనీయవయ్యా  చివరి సారి!
రాత్రికి రారాదా! తప్పక వస్తాను.








రాత్రి
మృత్యువుః
చీకటి పడింది.
కవితలు కట్టిపెట్టి  ఇకనన్నా కదిలి వస్తావా కవీ?
కవిః
ఇదిగో.. బైలుదేరుతున్నా!.
అవును. రాత్రి వచ్చి అంతా అంతమైపోయింది.
పాటలు పాడే పరభృతాలే మూగనోము పట్టాక,
వాస్తవ జగత్తు, ఆనందలోకం మొత్తం అంధకారబంధురమైపోయాక
నేను మాత్రం ఇక్కడ ఉండి చేసేదేముంది?
ఒక్క మనవి!
దూరాన్నుంచీ ఏవో  విలాసగీతాలు వినిపిస్తున్నాయి
ఆ దారిన  పొదామా నీ లోకానికి!
అయిన ఆలస్యం ఎటూ అయింది.. నీ పుణ్యముంటుంది!

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...