Wednesday, June 10, 2015

పులుపు చావని చింత- కవితాగల్పిక








ఉదయం
మృత్యువుః
కవీ! నీ అంత్యకాలం సమీపించింది. పద. పోదాం!
కవిః
మృత్యువా?
అప్పుడే వచ్చావా!
ఇప్పుడే కదయ్యా 
ఉదయసుందరి సౌందర్య సందర్శన సౌభాగ్యం నాకు దక్కింది!
కొద్దిగానైనా వ్యవధానం ఇవ్వవా నువ్వు! మధ్యాహ్నం వస్తావా నువ్వు?








మధ్యాహ్నం
మృత్యువుః
నీ అభీష్టం మేరకే  వచ్చానయ్యా!
మరి పోదాం.. లే.. కవీ! సాకులు చెప్పకు!
కవిః
అప్పుడే వచ్చావా మిత్రమా!
ఇప్పుడేగదయ్యా  హిమావృత ఉదయరాగాలు చెదిరిపోయి
సృష్టి వైచిత్ర్యాలు ఒక్కొక్కటిగా తేటపడుతున్నవి.
ఈ విశాల వసుంధరా వలయంలోని వైపరీత్యాలన్నీ తృప్తిగా చూడనీ!
నీ ఆత్రం కూలా! చీకటి పడ్డాక కనబడవయ్యా మగడా!







సాయంకాలం
మృత్యువుః
సంధ్యాసమయం మీరిపోతుంది కవీ!
ఇకనైనా కాలు కదుపుతావా స్వామీ!
కవిః
అటు చూడు.. ఆ దిక్కున  ఎంత వెలుగున్నదో !
లోకమింకా మాటు మణగనేలేదు. తొందరేమి సామీ!
ప్రకృతి అంతా ఎంత వినూత్న శోభతో ప్రకాశిస్తున్నదీ!
ఇంత ప్రశాంతసమయాన్ని  వదిలి రమ్మనడం ధర్మమా!
పశ్చిమాద్రిపైన అరుణ దీధితులెలా లీలావిహారాలు సలుపుతున్నాయో!
ఆ ముచ్చటా తనివితీరా చూడనీయవయ్యా  చివరి సారి!
రాత్రికి రారాదా! తప్పక వస్తాను.








రాత్రి
మృత్యువుః
చీకటి పడింది.
కవితలు కట్టిపెట్టి  ఇకనన్నా కదిలి వస్తావా కవీ?
కవిః
ఇదిగో.. బైలుదేరుతున్నా!.
అవును. రాత్రి వచ్చి అంతా అంతమైపోయింది.
పాటలు పాడే పరభృతాలే మూగనోము పట్టాక,
వాస్తవ జగత్తు, ఆనందలోకం మొత్తం అంధకారబంధురమైపోయాక
నేను మాత్రం ఇక్కడ ఉండి చేసేదేముంది?
ఒక్క మనవి!
దూరాన్నుంచీ ఏవో  విలాసగీతాలు వినిపిస్తున్నాయి
ఆ దారిన  పొదామా నీ లోకానికి!
అయిన ఆలస్యం ఎటూ అయింది.. నీ పుణ్యముంటుంది!

***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...